హేమలత – ఓ జ్ఞాపకం -దాసరి శిరీష

కొంతమంది పరిచయాలు అపురూపంగా అనిపిస్తాయి. వాళ్ళు… చాలా విషయాలలో రకరకాలుగా ముద్ర వేస్తూ ఎంతోమంది మీద తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అదొక్కటే కాదు, ఎంతోమంది కార్యకర్తలనీ, సృజనకారులనీ తయారు చేస్తారు. నిజానికి ఒక కొత్త వ్యవస్థని, చరిత్రని సృష్టించడం జరుగుతుంది. వాళ్ళు ఎంత తొందరగా కొన్ని రంగాలలో ప్రవేశించి దూసుకుపోతారో… అంతే వేగంగా ఎందుకు అందర్ధానమవుతారో జవాబు దొరకని ప్రశ్నలే.

నిజానికి నేను హేమలతను కల్సిన సందర్భాలు తక్కువే అయినా, ”శిరీషగారూ బాగున్నారా!” అంటూ దగ్గరకు వచ్చి భేషజాలు లేకుండా తీయగా నవ్వుతూ పలకరించడం నాకు ఇప్పుడు బరువైన జ్ఞాపకంగా మిగిలింది. మేమిద్దరం సాధారణంగా రాజమండ్రి పరిసరాలలలో మాకు తెలిసిన ఇద్దరు, ముగ్గురి గురించి మాట్లాడుకునేవాళ్ళం. వాళ్ళు వాళ్ళ యూనివర్శిటీలో రీసెర్చ్‌ వర్క్‌ చేసినవాళ్ళు.

”అమ్మగారి గురించి బాగా తెలుసండి. మీరు కూడా కథలు ఇవ్వండి” అని ప్రోత్సహించడం ఆమె అరమరికలు లేని స్వభావానికి నిదర్శనం. నేను నా మామూలు నవ్వు నవ్వేసి ఊరుకునేదాన్ని.

అదంతా ఒక ఎత్తు కానీ డిసెంబరు నెల మధ్యలో ఫోన్‌ చేసి ”నేనండీ పుట్ల హేమలతని” అంటూ సుదీర్ఘమైన సంభాషణ జరపడం ఒక ఎత్తు. నేను సంభ్రమంగా ”అరె మీరా! చెప్పండి, చెప్పండి” అన్నాను ఉత్సాహంగా.

”చాలా సిగ్గుగా ఉందండి. శేషుబాబుగారు పోయాక స్వయంగా వచ్చి మీతో చాలా సమయం గడపాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను” అన్నారు ఆప్యాయంగా.

”దానిదేముందండి… వీలుపడాలి కదా!” అని నేననగానే ”మీ అపర్ణ, మా మానస తరచూ కలుస్తూనే ఉంటారు, మంచి ఫ్రెండ్స్‌” అన్నారు. ”అవునవును. అపర్ణ నాన్న పోయినప్పుడు మానస చాలా మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది” అన్నాను.

అలా ఆ కుటుంబంతో ఒక స్నేహపూరితమైన అనుబంధం ఏర్పడింది.

మరిప్పుడు మానస పరిస్థితి ఏమిటి? ఏం చెప్పాలి?

సరే, ఆవిడ నాతో ఫోన్‌లో ఏమన్నారో చెబుతాను. ”మీ కథలలో పేదరికం నేపథ్యంగా దళిత స్పృహని సూచించే కథలని కొన్ని పంపించండి. తాడేపల్లిగూడెంలోని ఉమెన్స్‌ కాలేజీకి చెందిన ఎం.ఎన్‌.వి.సూర్యకుమారి మీ కథలపై వర్క్‌ చేస్తారట. వెంటనే పంపండి” అన్నారు.

పంపాను. అంతే సత్వరంగా, ఆ స్కాలర్‌ నా కథల గురించి ఇచ్చిన విశ్లేషతని హేమలత నాకు ఫార్వార్డ్‌ చేశారు.

అప్పుడు నా అనారోగ్య కారణాలవల్ల ఆ మెయిల్‌ చదివి వెంటనే స్పందించి హేమలతతో మాట్లాడలేకపోయాను.

ఆనాటి మాటలలోనే ”అందరూ ఇక్కడే ఉన్నారు కదా! మరి మీరు హైదరాబాద్‌ ఎప్పుడు వస్తారు?” అని అంటే, ”ఇదిగోనండీ, ఈ మార్చి, ఏప్రిల్‌ వరకు చాలా పనులు ఉన్నాయి. అవన్నీ పూర్తయితే నేను ఫ్రీ అయిపోతాను. వచ్చేస్తాను” అన్నారు.

ఇంకెప్పుడొస్తారు హేమలతా? అక్కడ మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముగించి ఇక్కడకు రాకుండా తిన్నగా హాస్పిటల్‌కి దారితీసి… ఎంతమందిని దుఃఖంలో ముంచారు? ఏమిటిది? మీరు హాస్పిటల్‌లో ఉన్నారు అనగానే ప్ర.ర.వే. మిత్రులతో పాటు మరెంతమందో ఆత్మీయులు తల్లడిల్లిపోయారు. ఏమి వింటానో అని భయపడుతుండగానే ఆ ఘోరమైన వార్త వినవలసి వచ్చింది.

ఒక దళిత మేధావి, ప్రేమాస్పదురాలూ, అలుపెరగని కార్యకర్త అంతర్ధానమవడం అనేది సాహితీ ప్రపంచానికి, దళిత ప్రపంచానికి తీర్చలేని లోటు. ఏ వేదికకైనా దిక్సూచిలు కావాలి. ఆమే ఒక నూతన వ్యవస్థ. తన మార్గంలో చురుకుగా ప్రయాణించి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి తన పని అయిపోయిందంటూ నిష్క్రమించడం… ఏమిటిది?

కంప్యూటర్‌ని ఒడిసి పట్టుకుని స్వయంకృషితో అన్నీ తానై ”విహంగ” అనే వెబ్‌ మ్యాగజైన్‌ని నడపడం అందరికీ సాధ్యం కాదు. రచయిత్రులను వెన్నుతట్టి ప్రోత్సహించి ప్రతిభావంతమైన రచనలని తెప్పించారు. మీరు నెట్‌ని ఎంత అద్భుతంగా వాడుకుని, ఈ పత్రిక ద్వారా ఎంతమందిని చక్కగా పరిచయం చేశారో వర్ణించడానికి మాటలు చాలవు. మీరు రాసిన ”అంతర్జాలంలో తెలుగు సాహిత్యం” అనే పుస్తకంలో ఇంటర్నెట్‌లో ఉన్న బ్లాగులలోని, సోషల్‌ మీడియాలోని సాహిత్యంతో పాటు పత్రికలు, వెబ్‌ పత్రికల్లో ఉన్న భాషా, సాహిత్యాలెన్నింటినో వివరించడం ముదావహం.

ప్రతి కార్యక్రమంలోనూ విజయఢంకా మ్రోగించగల హేమలతలు ఈ సమాజానికి కావాలి. అదే మీరు ప్రజలకిచ్చే ఉన్నతమైన మార్గదర్శకత్వం.

ఇంక సెలవా?

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.