తెలుగులో దళిత కవిత -డా. పుట్ల హేమలత

భారతదేశంలో కొనసాగుతున్న చాతుర్వర్ణ వ్యవస్థని ఆధారంగా చేసుకొని కులాల విభజన జరిగింది. ఈ వ్యవస్థకి భిన్నంగా పంచమ వర్ణంగా గుర్తించబడుతున్న సమూహాన్ని అంటరానివారిగా సమాజానికి అతి దూరంగా పశువుల కంటే హీనంగా చూశారు. ఒకప్పుడు గాంధీచే ప్రచారం చేయబడ్డ ‘హరిజనులు’ అని పిలిపించుకోబడినా కూడా ఈ వర్గం తమ సొంత వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని గుర్తెరిగి ”దళితులు” అని సగర్వంగా చాటుకున్నారు. ఈ పదానికి అణచబడిన వారు, వేరు చేయబడిన వారు అని అర్థం. 1971లో బొంబాయి నుండి ప్రచురించబడిన మరాఠీ దళిత ‘పాంథర్స్‌ మానిఫెస్టో”లో ‘దళిత’ అనే పదానికి ఈ విధంగా అర్థం చెప్పబడింది. ”షెడ్యూలు కులాలు, తెగలు, బౌద్ధులు, శ్రామికులు, భూమి లేని పేద రైతులు, స్త్రీలు మతం పేరుతో రాజకీయంగా, ఆర్థికంగా దోపిడీకి గురైన వాళ్ళంతా దళితులౌతారని, అగ్రవర్ణ స్త్రీలను దళితులుగా భావించనవసరం లేదని, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు వంటి మైనారిటీ వర్గాలపై హిందూ ఆధిపత్యం, అణచివేత ఉన్నాయి కాబట్టి వారిని కూడా దళితులుగా గుర్తించాలని” ఈ పత్రికలో అభిప్రాయపడ్డారు. భారతీయ దళిత సాహిత్యం ముందుగా మరాఠీ భాషలో మొదలై ఆ తరువాత భారతీయ భాషలన్నింటికీ విస్తరించింది.

ఈ సాహిత్యంలో కుల వ్యవస్థని ధిక్కరించటం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయాలను ఆశించడం, తమ వర్గాల అనుభవాలని, బాధల్ని అక్షరీకరించటం, అణచివేతకి వ్యతిరేకంగా పోరాడటం దళితుల ఆహారాన్ని, ఆహార్యాన్ని, అలవాట్లను గౌరవించటం, ఆత్మ గౌరవాన్ని పెంచుకోవటం వంటి అంశాలు దళిత సాహిత్యంలో కనిపిస్తాయి.

దళిత సాహిత్యంలో ఉన్న ఇతర ప్రక్రియలతో పాటు దళిత కవిత్వం కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తూ

ఉంది. దళిత కవిత్వంలో మినీ కవితలు, నానీలు, హైకూలు, దీర్ఘకావ్యాలు కూడా వచ్చాయి. దళిత కవిత్వంలో వస్తువు, ప్రతీకలు, సామాజిక నేపథ్యం వంటి విషయాలు ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందాయి.

1910లో మంగిపూడి వెంకటశర్మ రాసిన ”మాల వాండ్ర పాట”ని తొలి సానుభూతి దళిత గేయంగా భావిస్తున్నారు. ఇది ఆంధ్ర భారతి మాస పత్రికలో అచ్చయింది.1930లో జాలా రంగస్వామి ”అంటరాని వారెవరు” అనే పాటను రాశారు. కుసుమ ధర్మన్న 1933లో ”మాకొద్దీ నల్ల దొరతనమ”నే గేయాన్ని రాశారు. తొలినాళ్ళలో కుసుమ వెంకట రామయ్య, జాలా రంగకవి, నక్కా చిన వెంకయ్య, కుసుమ ధర్మన్న వంటి దళితులు నాయకత్వం వహిస్తూ గేయాలు రాశారు. జాలా రంగకవి ”అంటరాని వారెవరు”, కుసుమ ధర్మన్న ”మాకొద్దీ నల్ల దొరతనము” గేయాలు ఆనాటి దళితుల స్థితిగతుల్ని వివరిస్తాయి. దళితులతో పని అవసరం ఉన్నప్పుడు మాత్రం అంటు చూపించరు. ఇళ్ళలో పనులు చేసేటప్పుడు, పాత్రలు కడిగేటప్పుడు, బట్టలు ఉతికినప్పుడు, పంట నూరి వారి గాదెలు నింపేటప్పుడు కాళ్ళూ, చేతులు తగిలినా లేని అంటు ఏమీ పనిలేనప్పుడు మాత్రం దూరంగా ఉండటాన్ని ధర్మన్న ప్రశ్నిస్తాడు.

స్వరాజ్యం కోసం ప్రభుత్వంతో పోరాడే నల్లదొరలు తమ ఇళ్ళల్లో, పొలాల్లో పనిచేసే దళితులకు మాత్రం స్వతంత్రాన్ని ఇయ్యరు. గోపురాలకూ, బావుల్లో నీళ్ళు తోడుకోవడానికి ఒప్పుకోరు. మాలంటితే మైల తగులుతుందని దూరం పెట్టే నల్లదొరలకు స్వరాజ్యాన్నడిగే హక్కు ఎక్కడుందని ఈ గేయంలో ఆవేశపడతాడు.

ఈ క్రమంలోనే గుఱ్ఱం జాషువా 1941లో గబ్బిలం కావ్యాన్ని రాశాడు. గబ్బిలం తెలుగులోని దళిత పద్య కావ్యాలలో మొదటిది. అలాగే జాషువాను తొలి దళిత కావ్య నాయకుడిగా గుర్తించవచ్చు. తెలుగు సాహిత్యంలో అస్పృశ్యత నేపథ్యంగా సమగ్రంగా, సంప్రదాయ కావ్యాలకంటే భిన్నంగా అంటే ఒక దళితుడే నాయకుడిగా ఉండటం గబ్బిలం ద్వారా జాషువా తీసుకువచ్చిన నవ్య కావ్య విప్లవంగా భావించాలి.

”ముప్పు ఘటించి వీని కులమున్‌ గలిమిన్‌ గబళించి దేహమున్‌

బిప్పి యొనర్చు నీ భరత వీరుని పాదము కందకుండ గా

జెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింపలే

దెప్పుడు నప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్‌”

గబ్బిలం కావ్యంలో దళితుల అస్పృశ్యతని, ప్రశ్నించే తత్వాన్ని ఈ కావ్యంలో గమినించవచ్చు.

బోయి భీమన్న, నూతక్కి అబ్రహాం కవి, ఎస్‌.టి.జ్ఞానానంద కవి, కొలకలూరి స్వరూపరాణి వంటి పద్య కవులు దళిత సాహిత్యాన్ని రచించారు. 1980వ దశకంలో తెలుగులో ఒక ఉప్పెనలాగా ముంచుకొచ్చిన దళిత కవిత్వం సాహిత్యంలో తమ సొంత అస్థిత్వాన్ని నిలుపుకుంది. అప్పటివరకు దళితుల పక్షాన దళితుల సమస్యల్ని తమవిగా భావించుకొని లేదా సానుభూతితోను ఎంతోమంది అభ్యుదయవాదులు సానుభూతి కవిత్వం రాస్తూ వచ్చారు.

మార్క్సిస్టు కమ్యూనిస్టు ఉద్యమాలు సమాజంలోని అట్టడుగు వర్గాలలో ఎంతో చైతన్యాన్ని తీసుకువచ్చాయి. తమ కుల సమస్యలు, వర్గ పోరాటాలు, ఆర్థిక అసమానతలు తమ గొంతెత్తి స్వేచ్ఛ కోసం పొలికేక పెట్టేలా ఒక విప్లవం మొదలయింది. తొలి దశలో అన్ని వర్గాలు, అన్ని సమస్యలు అందరివీ అని భావించి కొనసాగించిన అక్షర యుద్ధం లోతుకు చొచ్చుకుపోయిన కొద్దీ సొంత అస్థిత్వాలను, సొంత గొంతులను, సొంత బాధల్ని గుర్తించటం మొదలుపెట్టాయి. ఈ పోరాటాలలో ఎలుగెత్తి అగ్రవర్ణ, బ్రాహ్మణ భావజాలాన్ని అంటరానితనాన్ని ప్రశ్నించిన గొంతుకలు తమ లోపలి అసమానతలను, వర్గ పోరాటాన్ని కూడా అక్షరాల ద్వారా కొనసాగించటం కనిపిస్తుంది. అప్పటివరకు పరాయి పీడనకు గురైన దళితులు తమ సొంత కలాలకు పదునుపెట్టారు. ఆర్థిక అసమానతలు, శ్రమ దోపిడీ, వర్ణ వివక్ష మాత్రమే పైకి కనిపిస్తూ ఉన్నా సాహిత్యంలో కూడా దళితులు, బహుజనులు వివక్షకు గురౌతూనే ఉన్నారు.

తాము చెప్పాలనుకున్న సమస్యలను తమకంటే ముందుగా మరొక వర్గం విషయ వక్రీకరణలు చేసి రచనలు చేయడం వల్ల దళితుల సమస్యలు సమాజానికి చేరువ కాలేకపోయాయి. లేదా సరైన మార్గంలో ప్రజలకి వ్యక్తీకరించబడలేదు. కడుపు మాడి పస్తుంటే హరిజనుడు ఉపవాసాలు చేసి ముక్తి పొందుతున్నాడనే విధంగా కవితలు, కావ్యాలు రాయబడ్డాయి. అసలు నిజం తెలిసిందీ, బాధకు గురైనదీ కడుపు కాలిన వాడే.

ఈ వాస్తవాలని గుర్తెరిగి దళిత కవులు తమ సొంత స్వరాన్ని వినిపించటం మొదలు పెట్టారు. దళితుల పక్షాన అగ్రవర్ణ కవులు రాసిన తెలుగు సాహిత్యం, కవిత్వం ఇప్పటికీ ప్రజల్లోకి వ్యాపిస్తూనే ఉన్నాయి. కానీ బాధను అనుభవిస్తున్న వారే తమ బాధని బైటకు చెప్పుకోవాలనీ, అలా చెప్పుకున్న బాధలోనే నిజాయితీ ఉంటుందని, నిజం ఉంటుందని దళితులు ఆక్రోశిస్తున్నారు. ఇప్పటివరకు దళితుల్ని దృష్టిలో ఉంచుకుని ఇతరులు రాసిన దళిత కవిత్వం అంతా సానుభూతి కవిత్వమేనని దళితులు రాసిందే దళిత కవిత్వం అనే వాదం ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్న సత్యం. దళితుల జీవితాల్లోని మాండలికాలు, వారి అలవాట్లు, వృత్తులు, ఆహారపు అలవాట్లు, కుల పురాణాలు వంటివి ఈ కవిత్వంలోకి చొచ్చుకొచ్చాయి. ఈ కవిత్వంలో ప్రకృతి వర్ణనలు, అభూత కల్పనలు ప్రేమ కావ్యాలకి భిన్నంగా దళిత వాడల్లోని మానవత, అణగారిన బ్రతుకుల ఆక్రందన, తమ పరిస్థితులకు కారణమైన అధిక వర్గ సమాజం మీద రగిలిన ఆక్రోశం ప్రశ్నలుగా మారి కవిత్వం రూపంలో బైటకు తన్నుకొచ్చాయి. ఒక దశలో తమ బాధని, ఆవేశాన్ని ఈ కవితల్లో ప్రచురించినందుకు సమాజం నుంచి విపరీతమైన విమర్శల్ని ఎదుర్కోవలసి వచ్చింది. జి.లక్ష్మీనరసయ్య రాసిన వ్యాసాలలో దళిత కవిత శిల్ప వైవిధ్యాన్ని విశదీకరించారు. దేవరాజు మహారాజు, ఎండ్లూరి సుధాకర్‌ మొదలైన కవులు దళిత ఆత్మకథా ప్రక్రియను పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో దళిత వచన కవిత్వం విస్తారంగా బైటకు వచ్చింది. 1990లో వచ్చిన ”చిక్కనవుతున్న పాట” తెలుగు సాహిత్యాన్ని కదిలించింది. ఈ సంకలనంలో… ”నేనింకా నిషిద్ధ మానవుణ్ణే నాది బహిష్కృత శ్వాస నా నోటికి ఉమ్మి ముంత కట్టి నన్ను నలుగురిలో అసహ్య మానవ జంతువుని చేసిన మనువు నా నల్లటి నుదుటి మీద బలవంతంగా నిషిద్ధ ముద్ర వేసినప్పుడే నా జాతంతా క్రమక్రమంగా హత్య చేయబడింది” అంటూ ఎండ్లూరి సుధాకర్‌ దళితుల అణచివేతల్ని, అస్పృశ్యతను వివరించాడు. ఈ క్రమంలో కె.సత్యన్నారాయణ, కేశవ కుమార్‌ల సంపాదకత్వంలో ‘దళిత మానిఫెస్టో’ వచ్చింది. నాగప్ప గారి సుందర్రాజు సంపాదకత్వంలో ”గుండె డప్పు” వెలువడింది.

ఆ దశలోనే మద్దూరి నగేష్‌ బాబు ”వెలివాడ” కవితా సంపుటి ప్రచురించాడు. నగేష్‌ బాబు మరొక సంపుటి ”నరలోక ప్రార్ధన” అనే వచన కవితా సంపుటిలో ‘విక్టరీ’ అనే కవితలో దళితులు ఎదుర్కొనే సమస్యల్లో ఉన్నత వర్గాల వాళు0్ళ వస్తే కూర్చొని ఉన్న దళితులు ఎక్కడైనా సరే, అరుగు మీదో, మంచం మీదో, రాయి మీదో, గట్టు మీదో లేచి నిలబడాల్సిన అంశాన్ని గుర్తుచేస్తూ అస్పృశ్యతను నిరసిస్తాడు ఈ కవితలో… ”పల్లెల్లోకి రైతు లొచ్చి కూలికి పిలుస్తుంటే అప్పటిదాకా ఎవరి మంచాల మీదో కూకున్నట్లు! మా వాళ్ళంతా లటుక్కున లేచి నిలబడతారు ఎందుకూ…?” అని ప్రశ్నిస్తాడు. హిందుత్వం, చాతుర్వర్ణాలు వాటి ప్రభావానికి గురై ఐదవ పాదంగా మిగిలిపోయిన, దళితుల మానసిక వేదన వృత్తాంతాన్ని సతీష్‌ చందర్‌ ఈ కవితలో ఇలా చెప్పాడు… ”హైందవ పద్యానికి అతికిన ఐదవ పాదాన్ని నేను వృత్తం వెలుపలే ఉత్త వచనంలా పరిభ్రమించిన నాకు మరణం ఎప్పుడూ పునరావృతమే” ప్రజా ఉద్యమాలలో సైతం వ్రేళ్ళూనుకున్న వర్ణ, వర్గ పోరాటాల నేపథ్యాన్ని శంబుక – ‘దళిత గర్జన’ కవితలో ఇలా అంటాడు…

”నిన్నడిగేది ఒక్కటే కామ్రేడ్‌ / వర్ణధర్మం పేరుతో వాడు నన్ను ఈసడిస్తే /

వర్గ పోరాటం పేరుతో నీవు నన్ను విస్మరిస్తున్నావు / తలరాత పేరుతో వాడు

నన్ను కట్టి పడవేస్తే / ఉపరితలం పేరుతో నీవు నా నోరు నొక్కుతున్నావు /

సంస్కృత శ్లోకాలతో వాడు / మార్కిస్టు పడిగట్టు పదాలతో నీవు / నన్ను

గందర గోళంలోకి నెట్టారు” అంటాడు.

”ఈ కులంలో పుట్టక పోతే / నేను ఇంకోలా ఆలోచించేవాణ్ణేమో ఈ కులంలో పుట్టడమే మంచిదయింది / అవమానమంటే అర్థమైంది అందర్నీ ప్రేమించడం తెలిసింది”

సమాజంలో దళితుల స్థానం చూసి రచయిత దార్ల వెంకటేశ్వరరావు సాలోచనగా ఇలా వ్యక్తీకరించాడు ‘దళిత తాత్వికుడు’ అనే కవితా సంపుటిలో. కత్తి పద్మారావు ”జైలు గంటలు, నల్ల కలువ”, ఎండ్లూరి సుధాకర్‌ ”వర్తమానం, కొత్త గబ్బిలం, నల్ల ద్రాక్ష పందిరి, వర్గీకరణీయం”, పైడి తెరేష్‌బాబు ”అల్ప పీడనం”, జి.వి.రత్నాకర్‌ ”మట్టి పలక”, ”అల్లేటి అల”, దార్ల వెంకటేశ్వరరావు ”దళిత తాత్వికుడు”, ప్రసాద మూర్తి ”కలనేత”, చల్లపల్లి స్వరూపరాణి ”మంకెన పువ్వు”, జూపాక సుభద్ర ”కైతునకల దండ”, నాగప్పగారి సుందర్రాజు ”చండాల చాటింపు”, బన్న అయిలయ్య ”నిప్పు కణిక” వంటి దళిత కవితలు దళితుల పక్షాన జనంలోకి చొచ్చుకెళ్ళాయి. 1991లో ‘దళిత కవిత’ పేరుతో వి.సిమ్మన్న, కొండపల్లి సుదర్శన రాజు ఒక దళిత కవితా సంకలనాన్ని ప్రచురించారు కానీ అది సానుభూతి వాద కవిత్వంగానే పరిగణించబడింది.

దళిత సాహిత్యంలో ఎస్‌.సి. వర్గీకరణ నేపథ్యంలో ఎన్నో కవితలు, సంకలనాలు, సంపుటాలు వచ్చాయి. దాంట్లో మాదిగ చైతన్యం, వర్గీకరణీయం, ఒకే గొంతు, దండోరా మొదలైన కవితా సంపుటాలు వచ్చాయి. అంబేద్కర్‌ కుల నిర్మూలన పోరాటం దళిత వర్గాలకు రిజర్వేషన్‌లు ఇచ్చి ఉండకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతూ ”నువ్వే లేకపోతే” అనే కవితలో తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌ ఇలా రాశాడు

… ”నువ్వే లేకపోతే / చెప్పులు కుట్టుకునే వాళ్ళు / పార్లమెంటు మెట్లు కూడా ఎక్కేవారు కాదు / జంధ్యం వేసుకున్న విశ్వవిద్యాలయాలు / మాకింత చోటిస్తూ వణికి చచ్చేవి కావు / మలమూత్రాల బక్కెట్లు / మా తలల మీద నుంచి ఎప్పటికీ దిగేవి కావు / ఒక నారాయణన్‌ కు దేశ కిరీటమే దక్కేది కాదు” అంటాడు.

జూపాక సుభద్ర రాసిన ‘గూడెంబోదామ్‌ గునుగమ్మా’ కవితలో ”తెలంగాణవ్వా… నీ గోస తెల్లారిందేమో! యిగ నాగోస తెలజెప్తయయిను ఆడమ్మలందరు, రంగు రంగులతోని / పొంగిపొర్లే పూలమ్మలోలె బత్కాలని పుట్టి, సంబురాల్ని / సదురుకొచ్చిన సద్దుల బత్కమ్మను నీటి ముక్కలు, సెమట సుక్కలు, / పూల రెక్కలు కలెమెలిగి ఆదుకొని ‘బతుకు బిడ్డా’ అని / పాడుకునే బత్కమ్మను నేను ఫక్తు సెమట సుక్కమ్మల పేటెంటును పాటు రాని పట్టుసీ రెల్ల భాగ్యం లేని బంగారు బత్కమ్మనై వాడల కడుగు బడని వూరికి సంచారిని”

అంటూ తెలంగాణ రాష్ట్రీయ పండగ బతుకమ్మ సంబరాన్ని వర్ణించింది.

”కుల పీడనాన్ని మసి చేసే ఆగ్రహం నాది / ఎడారిలో మొలక మొలిపించే వరద గూడును నేను / నా కడుపు మాడ్చుకుని కడుపులు నింపాను / రెక్కలిరుసుకుని జాతీయాదాయాన్ని పెంచాను / పర్వతాల్ని తినేంత ఆకలి బాధ నాది” అంటూ గోగు శ్యామల ‘వరద గూడు’ కవితలో దళిత స్త్రీల ఆకలి పోరాటాన్ని చెబుతుంది.

ఒక ప్రక్క కులం, మరొక ప్రక్క మతం దళిత క్రైస్తవుల్ని ఎంత అభద్రతా భావానికి గురి చేస్తుందో, ఎంత మానసిక వ్యధకి గురి చేస్తుందో వినోదిని ‘ఆల్‌ ఇండియన్స్‌ ఆర్‌ మై బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌’ అనే కవితలో…

”ఖాళీ అరచేతుల్లోంచి ఒక అభద్రతేదో

కనిపించని చీకటి తెరై

నా చుట్టూ ఓ ముళ్ళ కిరీటాన్ని పరుస్తుంది

ముందు మాల నుయ్యి – వెనక క్రైస్తవ గొయ్యి

కలిసి రహస్య కరపత్రం ఎజెండాని నా చుట్టూ ఉన్న ముళ్ళకిరీటం నెత్తి

మీద ‘వెలి’ అక్షరాలుగా తాపడం చేస్తాయి” అంటూ కులం ఒరలో ఇమడని మతాన్ని గురించి చెబుతుంది.

”ఇప్పుడు కరుడు గట్టిన భూస్వామ్య క్రౌర్యం / నా గుండెల మీద నాగేటి

కర్రులతో / పచ్చ బొడిసిన పేరు చుండూరు / ఇప్పుడు నామవాచకం

కాదు సర్వనామం / ఇప్పుడు ప్రతి గుండె ఒక చుండూరు / రగిలే

రాచపుండూరు” అంటూ కలేకూరి ప్రసాద్‌ చుండూరి దళితుల ఊచకోతను ”పిడికెడు ఆత్మ గౌరవం కోసం” అనే కవితలో చిత్రీకరించాడు.

”ఎండిన నెత్తుటి చారల గొడ్డళ్ళు / పిడిచ గట్టుకున్న కులం గొంతుల్ని /

ఇనుప వ్రేళ్ళతో సవరించుకుంటుంటాయి చీకటి మూలల్లో రక్త తర్పణానికి

సిద్ధమవుతున్న రహస్య ఆయుధాలు / పొడుగాటి బరిసెల చేతులతో /

పెదాలకు నెత్తుటి లిప్‌ స్టిక్‌ అద్ది వర్ణ యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటాయి”

అంటూ చుండూరు దళిత ఊచకోత సందర్భంగా హేమలత పుట్ల స్పందించి రాసినది ఈ కవిత.

ఇటీవల ముస్లింల, దళితుల ప్రధాన ఆహారమైన గో మాంసంపై నిషేధం విధించబడ్డ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ రెండు వర్గాల నుంచి సామాజిక కార్యకర్తలు కవులు, రచయితలు తమ నిరసనని వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో గో మాంసం తింటున్నాడు అనే నెపంతో ఒక ముస్లిం వృద్ధుడిని చంపడం ఈ దేశంలోని మానవ హక్కుల్ని కాలరాయడం తమ ఆధిపత్యాన్ని బడుగు వర్గాలపై రుద్దటం ప్రధానంగా కనిపిస్తుంది. ఎంతోమంది రచయితలు తమ సంఘీభావాన్ని తెలుపుతూ ఈ వర్గాలకి మద్దతు పలికారు. తమ రచనల ద్వారా ఈ పరిస్థితుల్ని ఖండించారు. ‘గోబంధం’ అనే కవితలో ఎండ్లూరి సుధాకర్‌ ఇలా రాశారు…

”ఆవును వధిస్తే శిక్ష / పుష్కరాల్లో ఉత్తుత్తి గోదానం చేసి / నిర్దాక్షిణ్యంగా నడి

బజార్లో విడిచేస్తే ఎవరు రక్ష? / ఆవు మాంసం తిన్నాడనో / అది

అమ్ముతున్నాడనో / గోవులాంటి మనిషిని / ఘోరంగా చంపడం / ఏ శాస్త్ర

సమ్మతం? / గో మాంస భక్షకుల్ని / చంపదల్చుకున్నారా?”

”మా యావు

మీ యమ్మ ఎట్లయినదయ్యా వివరించి చెప్పయ్య మాయావి కొడకా

గడ్డి కోసావా / కుడితి పోసావా

పొదుగు కడిగావా / పాలు పితికావా

విష్ణువునకు పొట్టిది / ఇంద్రునకు మచ్చలది

యాగాల రూపాన / ఎన్ని ఎద్దులను నరికి చంపారో”

అంటూ గో రాజకీయం కవితలో తన బాధని వ్యక్తం చేశాడు తాతపూడి రవీంద్రనాథ్‌ టాగూర్‌.

పెద్ద కూర కవితలో లెల్లె సురేష్‌ ఇలా అంటాడు…

”తిండిని ద్వేషించే వాడు మనిషిని ఎలా ప్రేమిస్తాడు / మనిషిని

ద్వేషించేవాడు పశువునెలా ప్రేమిస్తాడు / కాయ గూరైనా గాయి కూరైనా/

తినటాన్ని నిషేధించేవాడు మనిషెలా అవుతాడు / తినటం మనిషి చైతన్యం”

”మాదిగ వాదాలు ముస్లిం గల్లీలు / మురిక్కాల్వల్ని నీసు కంపుల్ని / ఒక్క

లాగే మోస్తుంటాయి / అవి గుడిసెలో ఎండు తునకలై / మా సాయమాన్లో

కబాబులై/ దండేనికి వేలాడే కౌసు వాసన మా బంధుత్వాన్ని చెబుతున్నాయి”

అంటూ దళిత ముస్లింలకి, దళితులకి ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరించాడు. ఈ సందర్భంగా మానసిక వ్యధకు గురై, భయం నీడల్లో బతుకుని కొనసాగిస్తున్న వారికి ధైర్యాన్ని ఇస్తూ పాలక వర్గాన్ని ప్రశ్నిస్తూ ఎంతోమంది కవిత్వం రాశారు.

పై ఉద్యమాలలో దళిత కవిత్వం తన స్వరాన్ని ప్రజలలోకి వ్యాపింప చేస్తూ, తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నది. భవిష్యత్తులో దళితుల పట్ల జరగబోయే ఏ దాడులనైనా, ఏ అన్యాయాలనైనా ఎదుర్కోవడానికి యువతరం దళిత కవులు కూడా తమ హక్కుల్ని గుర్తెరిగి ముందుకు సాగుతూ ఉండటం దళిత చైతన్యానికి సూచనగా భావించాలి

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.