హేమలతను సజీవం చేసుకొందాం – కాత్యాయనీ విద్మహే

పుట్టిన ప్రతివాళ్ళూ మరణించక తప్పదని తెలిసినా మరణం ఇంతగా మనిషి సరసనే ఉంటూ ఉన్నపాటుగా కబళిస్తుందని పుట్ల హేమలత మరణం దిమ్మతిరిగేట్లు మొహం మీద కొట్టి మరీ చెప్పేదాకా తెలియలేదు. ఫిబ్రవరి రెండు మూడు తేదీలలో విశాఖపట్నంలో జరిగిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక పదేళ్ళ సమాలోచనసదస్సులో ఉత్సాహంగా పాల్గొని ప్రరవే సభ్యులకు కంప్యూటర్‌ వినియోగంలో శిక్షణ ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించుకుంటూ నాలుగవ తేదీన రాజమండ్రి వెళ్ళిన హేమలత తొమ్మిదవ తేదీన ప్రాణాలు కోల్పోయిందంటే నమ్మగలమా! విస్తృతమైన స్నేహాలు, సంభాషణలు, సామాజిక సాహిత్య సంవేదనలు, ‘ప్రరవే’, ‘విహంగ’ ఆమెకు పంచప్రాణాలు. యాభై ఏడేళ్ళ వయసుకే హేమలత అర్థాంతర మరణం ఎందరికో తీరని వేదన, ఎన్నిటికో పూడ్చలేని లోటు.

1962 మార్చి 26న ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన పుట్ల హేమలత బాల్యం, చదువు తల్లిదండ్రుల ఉద్యోగాల కారణంగా నెల్లూరులో గడిచాయి. తల్లి మనోరంజితం, తండ్రి పుట్ల మనష్షే. ఇద్దరూ పాఠశాల ఉపాధ్యాయులు. చదువు, సంస్కారం గల కుటుంబ వాతావరణంలో హేమలతకు సాహిత్యాభిరుచి చిన్నప్పుడే ఏర్పడింది. నెల్లూరులోని సెయింట్‌ జోసెఫ్స్‌ హైస్కూలులో చదువుకుంది. డి.కె.డబ్ల్యూ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేసి బెంగుళూరు వెళ్ళి ఉపాధ్యాయ శిక్షణ పొంది వచ్చింది. స్వామిదాసు హైస్కూలులో కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. పదమూడేళ్ళకే కథలు రాయడం ప్రారంభించి కొనసాగించింది. అప్పటి జీవితాదర్శం కుటుంబ వాతావరణం నుండి అలవడిన క్రైస్తవ మత నైతికత. ఆ కాలంలో ఆమె రాసిన కథలకు, నవలలకు అంతస్సూత్రం అదే. సికింద్రాబాద్‌ నుండి వచ్చే ‘ప్రార్థనా శక్తి’ అనే పత్రికకు ప్రచురణార్థం ఆమె పంపే కథలకు ఆ పత్రికలో ప్రూఫ్‌ రీడర్‌గా పనిచేస్తున్న ఎండ్లూరి సుధాకర్‌ అభిమాని అయినాడు. ఇద్దరిమధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలయ్యాయి. క్రమంగా అది వాళ్ళ పెళ్ళికి దారితీసింది. మూల మూలం నుండి క్రైస్తవానికి మారిన కోస్తా ఆంధ్ర కుటుంబం నుండి వచ్చిన పుట్ల మేమలతకు తెలంగాణ మాదిగ కుటుంబం నుండి వచ్చిన ఎండ్లూరికి పెద్దల అంగీకారంతో 1986 మే 12న జరిగిన పెళ్ళి నిజంగా ఒక విప్లవమే.

పుట్ల హేమలత ఎండ్లూరి సుధాకర్‌ గారిని పెళ్ళి చేసుకుని హైదరాబాద్‌ వెళ్ళింది. వెస్లీ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న ఎండ్లూరి సుధాకర్‌కు చేదోడు వాదోడుగా భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ స్కూల్‌లో టీచర్‌గా కొంతకాలం పని చేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయింది. అంతే కాదు, ఎండ్లూరి సుధాకర్‌ ఎమ్మే చేయటానికి, ఆ తరువాత పరిశోధన చేసి 1990లో తెలుగు యూనివర్శిటీలో అధ్యాపకుడిగా ఎంపికై రాజమండ్రి సాహిత్య పీఠంలో నియమితుడు కావడం పర్యంతం అంచలంచెలుగా అతను సాధించిన అభివృద్ధి వెనుక, విజయాల వెనుక హేమలత ఇచ్చిన ప్రోత్సాహం, తోడ్పాటు ఎంతో ఉన్నాయి. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉండటం కాదు, ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ తనను తాను కోల్పోవటం ఉంటుందని స్త్రీ వాదం చెప్తుంది. పుట్ల హేమలత అలా తనను తాను కోల్పోయిన స్త్రీ కాకపోవటం విశేషం.

1990లో ఎండ్లూరి సుధాకర్‌తో పాటు రాజమండ్రికి చేరేనాటికి పుట్ల హేమలత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ నుండి బిఎ పూర్తిచేసింది. రాజమండ్రి చేరాక ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎమ్మే చేసింది. కంప్యూటర్‌ వినియోగంతో, అంతర్జాల సాహిత్యంతో పరిచయం పెంచుకొంది. అంతవరకూ ఎవరూ పరిశోధనాంశంగా స్వీకరించని ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’ అనే అంశం మీద పరిశోధన చేసి 2011లో డాక్టరేట్‌ పట్టాను పొందింది. రాజమండ్రి సాహిత్య సాంస్కృతిక వాతావరణంలో సాంప్రదాయక కుబుసాన్ని వదిలించుకొని సమకాలీన సామాజిక వివక్షలను ప్రశ్నించగల కొత్త ప్రజాస్వామిక దృక్పథాన్ని అభివృద్ధి చేసుకొంటూ అచ్చమైన ఆధునిక కవయిత్రిగా ఎదిగింది. స్త్రీవాద దళిత మైనార్టీ అస్తిత్వ ఉద్యమాల న్యాయ సంబద్ధతను గుర్తించి వాటితో కలిసి నడిచింది. అందులో భాగంగానే ‘దండోరా ఉద్యమానికి’ మద్దతు ప్రకటించగలిగింది.

ఆ క్రమంలోనే భిన్న అస్తిత్వాల మధ్య సంభాషణ సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ లక్ష్యంగా 2009లో ఏర్పడిన ‘మనలో మనం’ తన ఆకాంక్షలకు, ఆదర్శాలకు సరైన వేదిక అని గుర్తించింది. మార్చ్‌ నుండి ఏడాది పాటు వరంగల్‌, గుంటూరు, కడప, విశాఖపట్నాలలో తెలంగాణ, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల స్త్రీల సాహిత్యంపైన, దళిత క్రైస్తవ, ముస్లిం మైనారిటీ, బిసి ఆదివాసీ అస్తిత్వ సమూహాలకు సంబంధించిన మహిళల సాహిత్యంపైన ‘మనలో మనం’ నిర్వహించిన సదస్సులలో పాల్గొన్నది. ప్రసంగ పత్రాలు సమర్పించింది. 2010లో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పడినప్పటినుండి కార్యవర్గ సభ్యురాలిగా నిర్వహణ బాధ్యతలలో భాగస్వామి అయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ప్రకటించడమే కాక ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆంధ్ర తెలంగాణ శాఖలుగా విస్తరించి పనిచేయాలని ఆశించింది. ఆ మేరకు 2014 నుండి నిర్మాణంలో వచ్చిన మార్పు పట్ల ఏర్పడిన జాతీయ కార్యవర్గానికి అధ్యక్షురాలిగా వరుసగా రెండుసార్లు మొత్తం నాలుగేళ్ళు పనిచేసింది. గొప్ప కవిగా, యూనివర్శిటీ అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా, సాహిత్య విమర్శకుడిగా, మంచి వక్తగా ప్రసిద్ధుడైన ఎండ్లూరి సుధాకర్‌ భార్యగా కాక పుట్ల హేమలతగా ప్రత్యేక వ్యక్తిత్వంతో అస్తిత్వ చేతనతో ఆకాశామే హద్దుగా విస్తరించింది. ‘విహంగ’ అనే మహిళా వెబ్‌ సాహిత్య పత్రికను ప్రారంభించి స్త్రీల చేత స్త్రీల సమస్యల మీద చిన్న ప్రక్రియలలో రచనలు చేయించి అందులో పెట్టింది. విహంగలో వచ్చిన కవిత్వం, కథలు, సాహిత్య సమీక్షలు, విడిగా పుస్తకాలుగా ప్రచురించాలని కూడా ఆమె ఆలోచన చేసింది. విహంగను ఇంగ్లీషులో కూడా నిర్వహించింది.

ఒక కవిగా, సాహిత్య విమర్శకురాలిగా, సాహిత్య సంకలనాల సంపాదకురాలిగా హేమలత చేసిన కృషి తక్కువది కాదు. ఆమె కవిత్వం ‘వేకువ రాగం’ పేరుతో ఈ-బుక్‌గా సంపుటీకరించబడింది. తల్లీ కూతుళ్ళ సంబంధాలపై ఆమె రాసిన జ్ఞాపకాల తెరలు, స్వప్నముఖి, దాగుడుమూతలు వంటి కవితలు గాఢమైన అనుభూతులతో, అందమైన అభివ్యక్తులతో కనబడతాయి. ”ఒకప్పుడు / మా అమ్మ కూడా ఇంతే పది చేతుల కోసం పంచముఖియై / కలలు కంటూ ఉండేది” అని ముగిసే స్వప్నముఖి కవితలో ప్రతి తల్లీ తన పిల్లలను వినటానికి, చూడటానికి, స్పర్శించటానికి రెండు చెవులు, కళ్ళు, చేతులు సరిపోవటం లేదని ఆరాటపడే మాతృత్వ సౌందర్యాన్ని ఆవిష్కరించింది పుట్ల. దాగుడుమూతలు కవితలో కూతురి కోసం వెతుక్కునే తల్లి ”అబ్బురంగా పైకి చూస్తానా/ చందమామను కొరుక్కు తింటూ నువ్వు / సుధలు నిండిన నోటితో / ఫక్కున నవ్వుతూ వెక్కిరిస్తావు / చటుక్కున దోసిలి నిండుతుంది” అంటూ అమృతం ఉప్పగానూ ఉంటుందా అని వేసే ముక్తాయింపు ప్రశ్న దరిదాపులలో లేని కూతురి గురించిన దుఃఖోద్విగ్న స్థితిని పరాకాష్టకు తీసుకువెళ్ళే అభివ్యక్తి.

వైవాహిక వ్యవస్థలో అనుభవించే హింస స్త్రీల జీవితాన్ని ఒక విషాద స్మృతిగీతంగా మారుస్తున్న తీరును ట్రోజన్‌ హార్స్‌, జిగీని పరదాలు వంటి కవితలుగా మలిచింది పుట్ల. స్వేచ్ఛ ఆమె కవిత్వ జీవ లక్షణం. ”స్వేచ్ఛ మొదటి ప్రాణం కానప్పుడు / పక్షికి రెక్కలతో పని లేదు / భావ పిపాస తీరని చాతకానికి / నీలిమేఘాలతోనూ పనిలేదు” అని ప్రకటించింది ”స్వేచ్ఛ మొదటి ప్రాణం” అనే కవితలో. ఆ రకంగా పుట్ల హేమలత ప్రధానంగా స్త్రీ వాద కవయిత్రి.

చుండూరు దళితుల మీద జరిగిన దుర్మార్గమైన దాడిని నిరసిస్తూ ‘వర్ణయుద్ధం’ కవిత రాసి, సచార్‌ కమిటీ రిపోర్టు వెలువడిన నేపథ్యంలో ‘దస్తఖత్‌’ కవిత రాసి పుట్ల మేమలత దళిత ముస్లిం అస్తిత్వ చైతన్యాలతో సహభావాన్నీ, సంఘీభావాన్నీ ప్రకటించింది. ”నా దేశంలో దళిత ముస్లిం / నిర్భయంగా నడిచే రోజుని స్వప్నిస్తున్నా / బూబమ్మ ఇంటికి / బుక్కెడు బువ్వని తెచ్చే / శ్వేత రాయితీ పత్రం మీద / తొలి దస్తఖత్‌ నవుతున్నా” అంటూ పేద ముస్లిం వర్గాల సమస్యను గుర్తించినందుకు సచార్‌ను అభినందిస్తూ అతని ఆదర్శంతో ఐక్యతను సంభావిస్తుంది. ఆమె కవిత్వం మొత్తంగా ప్రత్యేకం అధ్యయనం చేయవలసిందే.

అట్లాగే తెలుగు సాహిత్యంలో క్రైస్తవ కుటుంబ సంస్కృతి ప్రతిఫలించిన తీరును తెలుసుకొనటానికి పుట్ల హేమలత రాసిన తొలి కథలను, గూడు చేరిన గువ్వ, మూడు చిగురించింది, మిస్‌ పవిత్ర వంటి నవలలను చదివి తీరాలి.

దళిత క్రైస్తవ స్త్రీల సాహిత్యంపైన, దళిత సాహిత్యంపైనా, కుసుమ ధర్మన్న వంటి కవులపైనా ఆమె రాసిన వ్యాసాలు ఉన్నాయి. విశాలాక్షి పత్రికలో ‘ఆలోచించు’ అనే శీర్షికతో సమకాలీనమైన అంశాలపై నెలనెలా వ్యాసాలు రాసింది. జమీల్యా నవలపై ఆమె రాసిన వ్యాసం పదేళ్ళ ప్రరవే సందర్భంగా అచ్చయిన బొల్షివిక్‌ విప్లవం నూరేళ్ళ స్ఫూర్తి వ్యాసాల సంకలనంలో అచ్చయింది. ఆ సంకలనానికి ఆమె సహ సంపాదకురాలు కూడా. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక 2015 ఫిబ్రవరిలో నందలూరులో నిర్వహించిన కథల కార్యశాలలో చదవబడిన కథలను వెనువెంటనే ‘ఆమె కథ’ అనే పేరుతో ఈ-బుక్‌గా రూపొందించింది. దాన్ని మరింత సమగ్రం చేస్తూ కె.ఎస్‌.మల్లీశ్వరితో కలిసి 2016 ప్రరవే ప్రచురణగా తీసుకువచ్చింది.

బొమ్మూరు సాహత్య పీఠంలో తెలుగు సాహిత్య విద్యార్థులలో అధ్యయన ఆసక్తులు, రచనా నైపుణ్యాలు పెంచడానికి సెమినార్లు పెట్టి, వ్యాసాలు రాయించి, ‘లేఖన’ అన్న పేరుతో రెండు సంకలనాలు ప్రచురించింది. దళిత మహిళా రచయితలపై మరొక సంకలనం తీసుకొని రావటానికి అవసరమైన పని అంతా చేసి పెట్టింది. ఇంత సాహిత్య జిజ్ఞాస, ఉత్సాహశక్తి ఉన్న పుట్ల హేమలత మరణానికి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, సాహితీ విద్యార్థుల లోకం, సాహితీ మిత్రులు కన్నీటి నివాళులు ఇస్తే సరిపోదు. ఆమె స్ఫూర్తిని అందిపుచ్చుకొని పని చేయటం కావాలి ఇప్పుడు. తద్వారానే ఆమెను మనలో సజీవం చేసుకోగలం.

– కాత్యాయనీ విద్మహే

Share
This entry was posted in గెస్ట్ ఎడిటోరియల్. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో