’69 తెలంగాణ నా దిక్సూచి: జీవన్‌ -కె. సజయ

‘జీవన్‌ తన స్వభావరీత్యా యాక్టివిస్టు. మానవ జీవితం, మానవ సంబంధాల పట్ల అత్యంత గౌరవం కలిగిన అరుదైన వ్యక్తి’ అని జీవన్‌ ఉద్యమ సహచరుడు, హక్కుల నేత బాలగోపాల్‌ అంటారు. జీవన్‌తో సజయ సంభాషణ ఇది!

(‘యాక్టివిస్ట్‌ డైరీ’ పేరులోనే సూచించినట్లు వివిధ సామాజిక అంశాలపై పనిచేస్తున్న కార్యకర్తల అనుభవాల సమాహారం, వారి ఉద్యమ గమన ప్రస్తావన, వారి కుటుంబ పరిస్థితులు, వారి చుట్టూ ఉండే సామాజిక పరిస్థితులు, వారు పనిచేస్తున్న అంశాల రాజకీయ ప్రాధాన్యతలను నమోదు చేయటం, వారి అంతరంగాలు, అనుభవాలు, ఆచరణలు, ఆకాంక్షలు వెరసి వ్యక్తులుగా, సమూహంలో భాగంగా వారు సమాజంపై వేసిన ముద్రలు, వారికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు, సాహిత్యం ఇతర గుర్తుల కలబోత ఈ ”యాక్టివిస్ట్‌ డైరీ”కి మూలం.

యాక్టివిస్ట్‌గా నేను అనేకమంది అసాధారణమైన వ్యక్తులతో కలిసి పనిచేశాను. ఒక్కొక్కరిదీ ఒక్కో విలక్షణమైన వ్యక్తిత్వం, అరుదైన ప్రతిభా పాటవాలు. ప్రవాహానికి ఎదురీదేవారు కొందరైతే, నిశ్శబ్దంగా మార్గంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్ళను చిరునవ్వుతో అధిగమించి ముందుకు సాగుతున్నవారు కొందరు. సామాజిక వివక్షతల మీద ముఖాముఖి తలపడే వారు మరికొందరు. గోరంత దీపం కొండంత వెలుగైనట్లు తన చుట్టూ ఉండేవారికి ఆలంబనగా ఇంకొందరు. రాజ్యంతో, అసమాన సమాజంతో యుద్ధం చేసే నిరసన గళాలు, గాయాలెదురైనా భయపడని గుండె నిబ్బరం, ఇందులో కొందరినైనా అక్షర బద్ధం చేయటమే ఈ యాక్టివిస్ట్‌ డైరీ చేయబోతున్న పని. ఇందులో మొదటి అనుభవాల సమాహారం హక్కుల నేత, స్నేహశీలి జీవన్‌ కుమార్‌ గారిది.)

1978వ సంవత్సరం. మహబూబాబాద్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ప్రాంగణం, వరంగల్‌ జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. అక్కడ కోర్టు హాలులో ఒక పక్కగా కూర్చున్న ఆ ముగ్గురి మొహాల్లో ఆందోళన కొట్టొచ్చినట్లుగా ఉంది. నరాలు తెగేంత ఉత్కంఠతో ఒక మనిషి కోసం ఎదురుచూస్తున్నారు. అందులో ఇద్దరు వృద్ధులైన దంపతులు, మరొకరు విద్యాధికుడైన యువకుడు. ఒకరికొకరు సంబంధం లేదు. కానీ, ఎదురుచూసేది మాత్రం ఒక మనిషి కోసమే.

దాదాపు నెలరోజుల క్రితం పోలీసులు తీసుకెళ్ళిపోయిన తమ కొడుకు ప్రాణాలతో ఉన్నాడో లేదో అనే భయం ఆ ఇద్దరు గ్రామీణ నిరక్షరాస్యులది. భయం వారి కళ్ళల్లో శాశ్వత చిరునామాగా అనిపిస్తోంది. వారి మనసు నెమ్మదించటం లేదు. వాళ్ళతోపాటు అక్కడ నిలుచున్న ఆ యువకుడికి మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తనకు పరిచయం లేని ఆ మనిషి ప్రాణాలతో తిరిగి వస్తాడా లేక ‘ఎన్‌కౌంటర్‌’ చావుగా మిగిలిపోతాడా అనే ఎడతెగని ఆలోచన అతన్ని కూడా అక్కడ నిలబడనీయడం లేదు. కాలం భారంగా నడుస్తోంది. ఏ చిన్న అలికిడి అయినా తాము ఎదురుచూస్తున్న ఆ మనిషి వస్తున్నాడేమో అని ఉలిక్కిపడి చూస్తున్నారు ఆ ముగ్గురూ.

అలా కొన్ని గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒళ్ళంతా దెబ్బలతో నడవలేని స్థితిలో ఉన్న ఆ యువకుడిని ఇద్దరు పోలీసులు తమ భుజాలమీద మోపుకుని దాదాపు ఈడ్చుకొచ్చి మేజిస్ట్రేట్‌ ముందు నిలబెట్టి అతను సాంకేతికంగా బతికే ఉన్నాడని తెలియజేశారు. కొడుకును అలాంటి స్థితిలో చూసిన ఆ తల్లిదండ్రులిద్దరూ ఒక్కసారిగా ఏడుస్తూ కుప్పకూలిపోయారు. పోలీసుల చేతిలో మాయమైన ఆ వ్యక్తి ఆచూకీ కోసం కాలికి బలపం కట్టుకు తిరిగిన ఆ యువకుడు కూడా వాళ్ళ పరిస్థితిని చూసి తన కన్నీళ్ళు ఆపుకోలేకపోయాడు.

ఆ యువకుడే పౌరహక్కుల సంఘం కార్యకర్త, కాలేజి అధ్యాపకుడు ఎస్‌.జీవన్‌కుమార్‌.

… … …

అవి, ప్రజా ఉద్యమాల మీద, కార్యకర్తల మీద నిర్బంధం పెరిగిన రోజులు. మిస్సింగ్‌ కేసులు, ఎన్‌కౌంటర్లు వారానికి రెండు, మూడు నమోదు అవుతున్న కాలం. నల్గొండ దగ్గర ఒక పల్లెలో కూలిపని చేసుకునే చినవెంకటి అనే దళిత యువకుడిని నక్సలైట్‌ సానుభూతిపరుడనే పేరుతో పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు. అతను ఒక కేసు విచారణ సందర్భంగా మహబూబాబాద్‌ కోర్టుకి వచ్చినపుడు ఈ సంఘటన జరిగింది. అతని ఆచూకీ కోసం వృద్ధులైన అతని తల్లిదండ్రులు తిరగని ప్రాంతమంటూ లేదు. హైదరాబాద్‌లో ఎవరో లాయర్లు సహాయం చేస్తారంటే అక్కడిదాకా వెళ్ళొచ్చారు.

అక్కడ హైకోర్టులో లాయరు, పౌరహక్కుల నాయకుడు పత్తిపాటి వెంకటేశ్వర్లుని కలిశారు. ఆయన హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసినా ఫలితం లేకపోయింది. దానితో ఆయన ‘వరంగల్‌లో పౌరహక్కుల సంఘం వాళ్ళని కలవండి, మీకేమన్నా సాయం దొరకొచ్చు అక్కడికి వెళ్ళండి’ అంటే వాళ్ళు వరవరరావు, జీవన్‌ పనిచేస్తున్న సికెఎమ్‌ కాలేజికి వచ్చి వాళ్ళని కలిశారు. అప్పటికి జీవన్‌ వయసు కేవలం 28 సంవత్సరాలు. ఇంకా పెళ్ళి కూడా కాలేదు. ఆ కాలేజీలో వరవరరావు తెలుగు అధ్యాపకుడిగా, జీవన్‌ ఇంగ్లీష్‌ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం వరంగల్‌ జిల్లా యూనిట్‌ సభ్యులు ఆ ఇద్దరూ. ఆ యూనిట్‌కి అప్పుడు జీవన్‌ కన్వీనర్‌. నిజానికి ఆ యువకుడి అదృశ్యం సంఘటనలో ఎక్కడా ఏ విధమైన ఆధారాలు లేవు. పోలీసులు తీసుకెళ్ళారు అని తల్లిదండ్రులు చెబుతున్నారు, కానీ పోలీసులు ఆ విషయాన్ని నిర్థారించటం లేదు.

కొడుకు ఏమైపోయాడో అనే ఆందోళనతో ఆ తల్లిదండ్రులు తమ ఊరు కూడా వెళ్ళకుండా వరంగల్‌లోనే చాలా రోజులు ఉన్నారు. ఈనాడుతో పాటు ఇతర తెలుగు, ఇంగ్లీష్‌ దినపత్రికల్లో ‘కొడుకు కోసం వెతుకుతున్న తల్లిదండ్రుల వెత’ అనే కథనాలు వచ్చాయి. అయినా కానీ చినవెంకటి ఆచూకీ తెలియలేదు. అతన్ని పోలీసులే ఎక్కడో చంపేసి గుర్తు తెలియని శవంగా పడేసి ఉంటారు, ఇంక ప్రయత్నం అనవసరం అని మిగతా సభ్యులందరూ అనుకున్నా గానీ, జీవన్‌ ఆ విషయాన్ని వదిలిపెట్టలేదు. ఒక హక్కుల సంఘం కార్యకర్తగా జీవన్‌ అనేకమంది జర్నలిస్టులతో మాట్లాడారు. హిందూ దినపత్రిక జర్నలిస్టు ఈ విషయమై పేపర్లో రాసి, పోలీసుల మీద పౌరహక్కుల నాయకుడు జీవన్‌ క్రిమినల్‌ కేసు వేయబోతున్నట్లుగా రిపోర్టు చేశాడు.

అది వరంగల్‌ జిల్లా పోలీసు వర్గాల్లోనే కాక హక్కుల సంఘంలో కూడా చాలా పెద్ద చర్చనీయాంశమైంది. ‘పోలీసుల మీద క్రిమినల్‌ కేసంటే ఆషామాషీ అనుకుంటున్నావా, అది ఎంత పెద్ద విషయమో తెలుసా’ అని వరంగల్‌లో ప్రముఖ న్యాయవాది, జిల్లా పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు తోకల లక్ష్మారెడ్డి జీవన్‌ని కోప్పడ్డారు. నిజానికి జీవన్‌ ఆ విధంగా అననప్పటికీ హిందూ దినపత్రిక జర్నలిస్టు అత్యుత్సాహం ఆయనను సమస్యల్లోకి నెట్టింది. జీవన్‌ కదలికల మీద మరింత నిఘా పెరిగింది. అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాక, ఆ కుర్రవాడు బతికి ఉన్నాడనే ఆశను అందరూ కోల్పోయిన క్షణంలో ఆ కుర్రవాడికి సంబంధించిన కేసుని విచారిస్తున్న మేజిస్ట్రేట్‌ని కలిశారు జీవన్‌. నిజానికి, విచారణలో ఉన్న కేసు గురించి నేరుగా మేజిస్ట్రేట్‌ను కలవటం నిబంధనలకు విరుద్ధమని తెలిసినప్పటికీ చివరి ప్రయత్నంగా కలిసి మాట్లాడారు.

ఆ తల్లిదండ్రుల పరిస్థితి వివరించి, అతనికి సంబంధించిన కేసు ఆయన దగ్గర విచారణలో

ఉందని, అసలు బతికి ఉన్నాడా లేదా అనే విషయాన్నైనా తెలియజేయమని విజ్ఞప్తి చేశారు. విషయంపట్ల సానుకూలంగా స్పందించిన మేజిస్ట్రేట్‌ అసలు పరిస్థితి కనుక్కుంటానని కొంచెం సమయం కావాలని చెప్పారు. ఆ కుర్రవాడి గురించి పోలీసు ఆఫీసర్లని వాకబు చేశారు.

దాంతో, అతన్ని హాజరుపరచడానికి కొంత గడువు కావాలని పోలీసులు కోరారు. అతను స్పృహలోకి వచ్చి గాయాలు కొంత మానుపట్టాక, కోర్టుకు తీసుకువస్తామని చెప్పారు. దాదాపు రెండు వారాల సమయం తర్వాతే ఇప్పుడు మనం పైన చెప్పుకున్న సన్నివేశం వాస్తవ రూపంలోకి వచ్చింది. అంటే ఎంత స్థాయిలో చిత్రహింస జరిగిందో ఊహించుకోవచ్చు.

”దీని తర్వాత నేను వెళ్ళి మేజిస్ట్రేట్‌ గారిని కలిసి థాంక్స్‌ చెప్పి అసలు ఏమైంది సార్‌ అని అడిగితే ఆయన ఇదంతా వివరించారు. నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడగలిగానన్న సంతోషం నాకెప్పుడూ ఉంటుంది. ఇది జరిగిన ఆరు నెలల తర్వాత ఒక రోజు ఇంటినుంచి నేను కాలేజీకి బయలుదేరుతున్న సమయంలో ఒకబ్బాయి వచ్చి కాళ్ళమీద పడి దండం పెట్టాడు. అతనే చినవెంకటి. ఆ రోజు కోర్టులో తీవ్రగాయాలతో ఉన్నప్పుడు అతన్ని చూశాను. తర్వాత మళ్ళీ అదే చూడటం. వెంటనే గుర్తుపట్టలేకపోయాను” అని చెప్తూ, ”ఈ సంఘటనతో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. వ్యవస్థ ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, మనం ఎక్కడా ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదనేది నేర్చుకున్నాను. మన బాధ్యత కేవలం ఒక ప్రెస్‌మీట్‌తోనో, ఒక ధర్నాతోనో ఆగిపోకూడదని కూడా అర్థమయింది. ఏ విషయమైనా గానీ వదిలిపెట్టకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే కొంచెం ఆలస్యమైనా గానీ ఫలితం వస్తుంది. మా పనిలో అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయ”ని అన్నారు.

ఆ తర్వాత ’83లో ఖమ్మంలో జరిగిన 2వ రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చినవెంకటిని కోర్టుకు తీసుకువచ్చిన సంఘటనను తన ఉపన్యాసంలో ఉదహరించగా దాన్ని ఆంధ్రప్రభ పేపర్లో బాక్స్‌ ఐటెంగా ప్రచురించారు. దాన్ని చదివిన సినిమా డైరెక్టర్‌ ఉమామహేశ్వరరావు అప్పటికే విజయవాడ ఆంధ్రప్రభలో పనిచేస్తున్న పౌరహక్కుల సంఘం సభ్యురాలు వసంతలక్ష్మి గారి ద్వారా జీవన్‌ని కలిసి ఇంటర్వ్యూ చేశారు. ఈ సంఘటనతో పాటు ఆ తర్వాత వచ్చిన అనేక అంశాలను కూడా కలిపి ‘అంకురం’ అనే సినిమా తీశారు. కోర్టులో చినవెంకటిని తీసుకొచ్చిన విధానాన్ని యథాతథంగా (ఓంపురిని కోర్టులో హాజరు పరిచే దృశ్యం గుర్తుందా!) చిత్రీకరించారు.

… … …

పై సంఘటనకు కారణమయిన పూర్వరంగం గురించి కొంచెం తెలుసుకోవటం అవసరం.

ఫ్యూడల్‌ ఆధిపత్య దోపిడీ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున లేచిన రైతాంగ పోరాటాలు, జైత్రయాత్రలు… తెలంగాణ పల్లెల మీద, కల్లోలిత ప్రాంతాల పేరుతో రాజ్యం అత్యంత క్రూరంగా ప్రయోగించిన నిర్బంధం, లాకప్‌ మరణాలు, ఎన్‌కౌంటర్ల పేరుతో అదృశ్యమైపోయిన మనుషులు… వారికోసం నిత్యశోకంతో అల్లాడిన కుటుంబాలు… ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 70-80 దశాబ్దాల కాలంలో ప్రజా ఉద్యమాలపై జరిగిన హింసాకాండ, తీవ్ర నిర్బంధం అంతా ఇంతా కాదు. ప్రజా ఉద్యమాలలో నిబద్ధులైన ఎంతోమంది చిత్రహింసల పాలయ్యారు. అక్రమ కేసుల పాలయ్యి కటకటాల వెనక్కి వెళ్ళారు. పౌరహక్కుల నాయకుల హత్యలు జరిగాయి.

ప్రజల హక్కుల కోసం గొంతెత్తిన వారిపై రాజ్యం ప్రతీకారంతో రగిలిపోయిన సందర్భం. ఇలాంటి క్రూర హింసాత్మక ధోరణులు చెలరేగినప్పుడు కూడా నిర్భయంగా నిలబడిన వ్యక్తి, పౌరహక్కుల నేత జీవన్‌. నకిలీ ఎన్‌కౌంటర్లకూ, మిస్సింగ్‌ కేేసులకూ, ప్రజా పోరాటాలపై అణచివేత చర్యలకూ వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ప్రాణాలకు తెగించి నిలబడ్డారు. ఆ క్రమంలో అనేక కష్టనష్టాలను పంటి బిగువున భరించారు. చినవెంకటికి సంబంధించిన విషయంలో ఎంత నిబద్ధతతో పనిచేశారో ఇప్పటికీ 68 ఏళ్ళ వయసులో మానవహక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ బాధ్యులుగా, వివిధ ప్రజాసమూహాల హక్కుల కోసం నిలబడుతున్న జీవన్‌లో అదే నిబద్ధత, ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రేమ కనిపిస్తుంంది.

అది, రాజ్యహింస బాధితులు, నివాస హక్కులు, సమాజం అంచుల్లో మనుషులుగా కూడా పరిగణింపబడని దొమ్మరి కులస్తులు, సంచార జాతులు, రైతు ఆత్మహత్యలు, ట్రాన్స్‌జెండర్స్‌, నిరాశ్రయులు, పిక్‌పాకెటర్స్‌, కాందిశీకులు, పాకీ పనివారు, గృహహింసకు గురయిన మహిళలు, వీథి బాలలు, వేశ్యలు, విద్యార్థులు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీ మతస్తులు, నయీమ్‌లాంటి మాఫియాల చేతుల్లో బలయిన పేద రైతాంగం… ఇలా ఎవరైనా కావచ్చు. వారెవరయినా గానీ మనుషులుగా వారి ప్రాథమిక హక్కులను గౌరవిస్తూ, విస్తృత ప్రజాబాహుళ్యాల హక్కులను గుర్తిస్తూ, వాటన్నింటికీ మానవ హక్కుల సంఘంగా, ఉద్యమనేతగా వారి పోరాటాలకు బాసటగా నిలిచే వ్యక్తి జీవన్‌. మనిషి చాలా సాదాసీదాగా కనిపిస్తారు కానీ, ఎంత కష్టంలో ఉన్నవారికైనా అండగా, ఓదార్పుగా నిలబడతారు.

సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడం కోసం అహర్నిశలూ కష్టపడతారు. ప్రతికూల పరిస్థితుల్లో ఎదురీదే ధిక్కారి ఆయన. జీవన్‌ ఉద్యమ గమనంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు, ఎదురైన అనుభవాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హక్కుల గమనాన్ని పరిచయం చేస్తాయి. తనమీద, తన కుటుంబం మీద తీవ్ర నిర్బంధం, పహరా ఉన్నప్పటికీ హక్కుల కోసం గళం ఎత్తడం మానలేదు. పాలకులకి, వారి అడుగులకు మడుగులొత్తే పోలీసులకు కూడా జీవన్‌ గురించి, ఆయన ఎంత ప్రజాపక్షపాతో చాలా బాగా తెలుసు. ప్రజా ఉద్యమాల పట్ల ఎంత పక్షపాతంగా, సంఘీభావంగా ఉంటారో అంతే నిష్పక్షపాతంగా వాటిల్లో చోటుచేసుకునే అవాంఛనీయమైన పెడధోరణులను కూడా ఆయన వ్యతిరేకిస్తారు. వాటిని చర్చకు పెడతారు.

వాస్తవానికి జీవన్‌ ఒక సాదాసీదా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఏ రకమైన రాజకీయ నేపథ్యం, పోరాట చరిత్ర ఉన్న కుటుంబం కాదు. ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్టు వ్యతిరేకత ఉన్న నేపథ్యం. వీరి బంధువుల్లో ఇద్దరు, తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో ఆనాటి కమ్యూనిస్టు పార్టీ చేతిలో చనిపోవటం దానికి కారణం. అందుకే, డిగ్రీ కాలేజీకి వచ్చేవరకూ పోరాటాల చరిత్ర తెలియదు. పోరాటాలను పరిచయం చేసిన స్నేహితులు కాలక్రమంలో ప్రభుత్వాలతో కలిసి అడుగులు వేస్తున్నా కానీ, జీవన్‌ చూపుడువేలు ప్రభుత్వాల అప్రజాస్వామిక ధోరణులను ఎత్తిచూపుతూనే ఉంది. జీవన్‌ ఉద్యమ సహచరుడు, హక్కుల నేత బాలగోపాల్‌ తను రాసిన ఒక వ్యాసంలో ‘జీవన్‌ తన స్వభావరీత్యా యాక్టివిస్టు. మానవ జీవితం, మానవ సంబంధాల పట్ల అత్యంత గౌరవం కలిగిన అరుదైన వ్యక్తి’ అని ప్రస్తావించారు. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన జీవన్‌ తన యవ్వన కాలంనుంచీ ఇప్పటివరకూ కూడా ఒక బలమైన ప్రజా గొంతుకగా, రాజ్యహింసకు వ్యతిరేకంగా, హక్కుల సాధన కోసం పనిచేస్తూనే ఉన్నారు. పోలీసు నిర్బంధానికి, హింసలకు గురయ్యారు. నిత్య చైతన్యశీలిలా మానవ హక్కుల ఉద్యమానికి బలమైన పునాదిగా మారారు. తన జీవనక్రమంలో ప్రభావితం చేసిన వ్యక్తులు, సాహిత్యం, రాజకీయాల గురించి ఆయన మాటల్లోనే వినడం నిజంగా గొప్ప అనుభవం.

కుటుంబ నేపథ్యం:

1951లో వరంగల్‌ జిల్లా పెదపెండ్యాల గ్రామంలోని మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీరాముల రామకృష్ణ, పుష్పలీలలకు జన్మించిన జీవన్‌ పూర్వీకులది భద్రాచలం. అక్కడనుంచి వలస వచ్చిన వాళ్ళ తాత వెంకటేశం ఆ ఊరిలో ఒక చిన్న పంతులుబడి (కానిగి బడి) పెట్టుకుని జీవనం సాగించారు. తాత పంతులుగా ఉంటే, తండ్రి ప్రజా ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేసేవారు. ఐదుగురు పిల్లలు. ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడడపిల్లలు. జీవన్‌ రెండో కొడుకు. తనకు పిల్లలు లేకపోవడంతో మేనమామ జీవన్‌ని తీసుకెళ్ళి పెంచుకున్నారు.

అలా పదేళ్ళు వచ్చేవరకూ అమ్మమ్మ, మేనమామ దగ్గరే హనుమకొండ దగ్గర్లోని వడ్డేపల్లిలో పెరిగారు. అప్పటివరకూ తనకు వేరే తల్లిదండ్రులున్నారన్న విషయం కూడా ఆయనకు తెలియదు. జీవన్‌ పదేళ్ళ వయసప్పటి జ్ఞాపకాలలో వడ్డేపల్లి పింగిళి దొర గడీ, దాని చుట్టూ ఉన్న వాతావరణం ఒక సజీవ జ్ఞాపకం. ఆ గడీ యజమానులు కృష్ణారెడ్డి దొర, అతని తమ్ముడు రంగారెడ్డి. అరవై నాలుగు పైగా గదులున్న పెద్ద గడీ అది. ఆ గడీని తర్వాత కాలంలో ప్రభుత్వానికి ఇచ్చేశారు. వాస్తవానికి దొరలు ప్రభుత్వానికి చాలా మొత్తం శిస్తు బాకీపడ్డారు. దానికి చెల్లుగా ఆ గడీని ఇచ్చేశారు. అందులోనే మొట్టమొదటి కాకతీయ మెడికల్‌ కాలేజి ప్రారంభమయింది. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజి నడుస్తోంది. ఆ చుట్టుపక్కల ముప్ఫై గ్రామాలలోని వేల ఎకరాల భూములు ఆ దొరల ఆధీనంలో

ఉండేవి. ఊరందరూ వారి కోసమే పనిచేసేవారు. ఆయన బాల్యంలో గ్రామంలో చెప్పుకునే మాటలు, దొరల జీవనశైలి, ఇతర అంశాలన్ని బాల్యంలో ఆయన మస్తిష్కంపై పడిన ముద్రల వెలుగులోంచే ప్రస్తావించారు. అన్నింటికి చారిత్రక ఆధారాలు లేకపోవచ్చు కూడా.

జీవన్‌ వాళ్ళ ఒక మేనమామ కూడా అక్కడ జీపు డ్రైవరుగా పనిచేసేవారు. కృష్ణారెడ్డి భార్యను అందరూ దొరసానమ్మ అనే పిలిచేవారు. దొరసానమ్మ ప్రతి శనివారం తలంటి స్నానం చేయటానికి పన్నెండు పెద్ద పెద్ద కాగుల నిండా నీళ్ళు కాచేవాళ్ళు అనే విషయం చిన్నప్పుడు జీవన్‌కి చాలా ఆశ్చర్యంగా అనిపించేదట! ఒక్క మనిషి కోసం అన్ని నీళ్ళెందుకనే ప్రశ్న వచ్చేది కానీ, బయటకు అననిచ్చేవారు కాదు పెద్దలు. అప్పట్లో ఆ ఊర్లో దొర ఇంట్లో మాత్రమే జీపుండేది. దొరసానమ్మ ప్రతి శనివారం గుడికి జీపులో వెళ్ళి వస్తుంటే పిల్లలంతా ఆశ్చర్యంగా చూసేవారట! చాలా పెద్ద జుట్టు ఆమెది. గుడి నుంచి వచ్చిన తర్వాత ఆమె గడీ ముందు భాగంలో కూర్చునేది. ఆమె ముందు ఒక పెద్ద కుండలో మజ్జిగ, ఒక గంపలో కరివేపాకు ఉండేవి. ఊరివాళ్ళందరూ చెంబులు తీసుకుని మజ్జిగ కోసం వెళ్ళి లైనులో నిలబడితే ఆమె మజ్జిగ పోసి, కరివేపాకు ఇచ్చేది.

మిగతా ఇక జీవన్‌ మాటల్లోనే:

”మేం కూడా చిన్నప్పుడు అలా వెళ్ళి మజ్జిగ తెచ్చుకునేవాళ్ళం. నేను చాలా చిన్నవాడిని అప్పుడు. ఆ గడీలో ‘ఆడపాపల’ వ్యవస్థ ఉండేదని విన్నాను. అయితే చిన్నతనం కాబట్టి వాటి అర్థమేమిటనేది అప్పుడు తెలియదు. మా గ్రామంలోనే కుటుంబాల్లోంచి ఒకరు అక్కడ ఆ విధంగా ఉండేవారని నాకు పెద్దయిన తర్వాత తెలిసింది. నాకు గుర్తున్నంతవరకూ పింగిళి దొరలను నేనైతే క్రూరులుగా చూడలేదు ఎప్పుడూ. ఒకసారి పెద్ద కరువొస్తే, వాళ్ళు గడీలో నుంచి అందరికీ వడ్లు, బియ్యం పంచటం నాకు గుర్తుంది. ఊర్లో ఎవరికి పెండ్లి అయినా గానీ ముందుగా గడీకి పోవాలి. దొరసాని కాళ్ళు మొక్కాలి. ఆమె కాణీనో ఎంతో ఇచ్చి, ఒక రవికె బట్ట, పండ్లు చేతిలో పెట్టేది. ఇవన్నీ చూస్తూ పెరిగాను. వాళ్ళ పిల్లలు అప్పట్లోనే ఇంగ్లాండులో చదువుకునేవారు. వాళ్ళు సెలవులకొచ్చినప్పుడు చూస్తుండేవాడ్ని. ఆడపిల్లలు ఫ్రాకులు వేసుకుని ఆడుతుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. రాత్రిపూట గ్రామఫోను కూడా వాళ్ళ ఒక్కింట్లోనే ఉండేది. కరెంటు కూడా అంతే. కృష్ణారెడ్డి దొర ఒక స్త్రీతో సహజీవనం చేసేవాడని విన్నాం. ఆమె పేరు జలజాక్షి. ఆమె భూస్వామ్య రెడ్డి కుటుంబానికి చెందినది కాదని చెప్పుకునేవారు. చాలా అందంగా ఉండేది. అప్పట్లో. దొర ఆమె కోసం వేరేగా ఒక పెద్ద బంగ్లా కూడా కట్టించాడు.

అది ఇప్పటికీ వడ్డేపల్లిలో ఉంది. ఆమె బయటకు వచ్చినప్పుడు జుట్టు విరబోసుకుని నాలుగు చక్రాల బగ్గీలో వెళుతుంటే ఊరంతా ఎగబడి చూసేవారు. తమ కులగౌరవానికి తగినవాళ్ళు కాదని ఆమె బిడ్డల్ని ఇక్కడి దేశ్‌ముఖ్‌లు ఎవ్వరూ పెళ్ళిచేసుకోలేదు. దొర కుటుంబం తీరు వేరు, మా కుటుంబాల తీరు వేరు అని నాకు చిన్నప్పుడే అర్థమయింది. కానీ, ఎందుకు అలా ఉండేదో తెలిసేది కాదు. మాకందరికీ ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఈ విషయాల పట్ల స్పష్టత ఏమీ లేదు. అయితే అవి చిన్నప్పటి జ్ఞాపకాలుగా గుర్తుండిపోయాయి”.

చదువు, పుస్తకాలతో పరిచయం:

నేను సెయింట్‌ గాబ్రియేల్‌ హైస్కూలులో చేరిన కొత్తలో అక్కడ కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి నాకు టీచర్లుగా ఉండేవారు. అయితే, నాకు వాళ్ళ గురించి తెలిసింది నేను కాలేజీకి వెళ్ళిన తర్వాతే. నేను అక్కడ ఒక్క సంవత్సరమే ఉన్నాను. తర్వాత మా కుటుంబం కుమారపల్లిలో ఇల్లు కట్టుకుని అక్కడికి మారటంతో నేను కూడా సుబేదారిలో ఉన్న స్కూలుకి మారాను. సీతారామయ్య హిందీ, సత్యమూర్తి సోషల్‌ స్టడీస్‌ చెప్పేవారు. ఇది కూడా జ్ఞాపకమే నాకు. ఐదవ తరగతి నుంచే బొమ్మల రామాయణం లాంటి పుస్తకాలు చదవటం అలవాటయింది. అప్పట్లో ఆంద్రప్రభ లాంటి పత్రికలు ఇంటికి వచ్చేవి. అమ్మ మా ఖమ్మం చిన్నమ్మ పత్రికలూ, అందులో సీరియల్స్‌ బాగా చదివేది. ఇంట్లో అందరం కలిసి సీరియల్స్‌ చదివేవాళ్ళం. మా బంధువుల్లో ఒకాయన రచయిత ఉండేవారు. ఆకుల భూమయ్య ఆయన పేరు. వాళ్ళది సిరిసిల్ల.

ఆయన సెలవుల్లో మా ఊరికి వచ్చినప్పుడు, ఆయన రాస్తుంటే ఆయన పెన్నులలో ఇంకు నింపి ఇవ్వటం అనేది నాకు గర్వంగా ఉండేది. అలా ఆయన్ని చూస్తూ చదువు పట్ల ఒక ఇష్టం ఏర్పడింది. సుబేదారిలో మా స్కూల్‌కి దగ్గర్లోనే కాళోజి ఉండేవారు. అయితే ఆయన నాకు అప్పుడు పరిచయం కాలేదు. అప్పట్లో స్టాంప్స్‌ సేకరించటం చాలా ఇష్టంగా ఉండేది. అది తెలిసి మా ఫ్రెండ్స్‌ కాళోజి ఇంటి దగ్గర చాలా స్టాంప్స్‌ దొరుకుతాయని, ఆయన చాలా పెద్ద కవి అని చెప్పారు. అప్పట్లో కవి అంటే అర్థం కాకపోయేది. దూరం నుంచి ఆయన్ని చూస్తే చాలా భయమయ్యేది కూడా. అయినా గానీ అలా వాళ్ళింటికి వెళ్ళి ఇంటి బయట పారేసిన ఉత్తరాల కవర్ల నుంచి స్టాంపులు తీసుకుని వెంటనే పారిపోయి వచ్చేసేవాడిని.

హైస్కూలులో ఉండగానే యద్ధనపూడి సులోచనారాణి నవలలు చదవటం అలవాటయింది. మా అక్కయ్యలు, చిన్నమ్మలు చదువుతుండేవారు. ఎందుకు అంటే చెప్పలేను. చదవటానికి చాలా సులభంగా ఉండేవి. దిగువ మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి వెళ్తున్న కుటుంబం మాది. బహుశా ఆ ఆలోచనా ధోరణితో ఉండేవి కాబట్టి నచ్చి ఉండవచ్చు. లైబ్రరీకి కూడా తరచూ వెళ్ళేవాడిని.

అక్కడ నాకు శరత్‌ పుస్తకాలు పరిచయమయ్యాయి. బడీదీది, దేవదాసు, పరిణీత, చరిత్రహీనులు చదివాను. చరిత్రహీనులు నవలని ఒకసారి కాదు చాలాసార్లు చదివాను. అది నన్ను బాగా తాకింది. నా లోపలి ఆలోచనలకు సరిపోయినట్లనిపించింది. దాని ప్రభావం నామీద చాలా ఉంది కూడా. అయితే అప్పుడు దాన్ని విశ్లేషించేంత వయస్సు కానీ, పరిపక్వత కానీ నాలో లేవు. నచ్చింది అంతే.

అయితే, కాలేజీకి వచ్చిన తర్వాత ఎందుకు ఆ పుస్తకం నాకు నచ్చింది అని ఆలోచిస్తే, మానవ సంబంధాలను, స్వభావాలను లోతుగా విశ్లేషించటం ఆ నవలలో నన్ను బాగా ఆకట్టుకున్న విషయంగా అర్థం చేసుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా మనుషుల పట్ల చాలా సున్నితంగా ఉండేవాడిని. తొందరపడి ఎవర్నీ ఏమీ అనేవాణ్ణి కాదు. గొడవలకు పోయేవాడిని కాదు. నా చుట్టుపట్ల ఉండేవాళ్ళతో ప్రేమగా ఉండేవాడిని. అది నా స్వభావం. నేను ప్రైమరీ స్కూలులో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్‌, మా బంధువుల పేర్ల చివర దాసు అని ఉండటం గురించి కొంత ఎగతాళిగా మాట్లాడేవారు.

ముందు అర్థం కాకపోయేది. అలానే, నేను బాగా ఇబ్బందిపడిన విషయం, గ్రామంలో మనుషుల మధ్య ఉండే అసమానతలు. నా దగ్గరి స్నేహితులందరూ వెనుకబడిన, దళిత, ముస్లింలు ఉండేవారు. ఐలయ్య అని దోస్తుండే. పద్మశాలీ అతను. చాలా తెలివి కలవాడు. కానీ, అతని ఇంట్లో ఎప్పుడూ తిండి

ఉండేది కాదు. దళితవాడల్లో భాగోతాలు ఆడినప్పుడు పండుకోవడానికి ఒక బస్తా తీసుకుపోయి రాత్రంతా అక్కడే ఉండేవాడ్ని. పొద్దున్నే ఇంటికి రాగానే, స్నానం చేస్తే కానీ మా అమ్మమ్మ లోనికి రానిచ్చేది కాదు. ఇవేవీ నాకు నచ్చేవి కాదు. కానీ ఎలా చెప్పాలో తెలిసేది కాదు. తర్వాత, బాగా ఇబ్బంది పెట్టిన అంశం గ్రామంలోని స్త్రీ,పురుషుల మధ్య ఉండే వివాహేతర సంబంధాలు.

ఇవన్నీ అర్థం చేసుకునే వయసు లేదు కానీ, ఆ క్రమంలో మనుషుల మధ్య పెరిగే గొడవలు, ఎప్పుడూ ఆడవాళ్ళే బాధితులుగా మారటం చూస్తూ పెరిగాను నేను. ఇవన్నీ ఫ్యూడల్‌ వ్యవస్థ ప్రభావాలు అనే విషయం కూడా నాకు తెలియదు. ఇదంతా సహజమనుకునేవాణ్ణి. చరిత్రహీనులు నవల అంత చిన్న వయసులోనే నచ్చటానికి ఇవన్నీ కారణమయి ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి కష్టాల్లో ఉన్నవాళ్ళకు సహాయం చేయటం, వారెవరైనా కానీ వ్యతిరేకత లేకపోవటం నా స్వభావంలో రూపుదిద్దుకుంది. 1968లో నేను మల్టీపర్పస్‌ (12వ తరగతి) పూర్తి చేశాను. తొలి తెలంగాణ ఉద్యమం వల్ల కాలేజిలో అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. అందరికీ ఒక సంవత్సరం చదువు పోయింది. ’69లో ఆర్ట్స్‌ కాలేజిలో బి.ఎ. ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో చేరాను. కాలేజిలోకొచ్చిన తర్వాత నా ఆలోచనా సరళి మారింది. నాకు అక్కడే నా స్నేహితుల ద్వారా రైతాంగ పోరాటాల గురించి తెలిసింది. ఎస్‌ఎఫ్‌ఐ పరిచయమయింది.

ఇప్పుడు సిపియం లీడర్‌గా ఉన్న రాములు డిగ్రీలో నా జూనియర్‌. టంకశాల అశోక్‌ నాకు క్లాస్‌మేట్‌. సుందరయ్యగారి గురించి మొదటిసారి విన్నది అక్కడే. అయితే ఆయన పుస్తకాలు ఏమీ చదవలేదు నేను అప్పుడు. తర్వాతెప్పుడో చదివాను. నన్ను బికాం చేయమని మా బాపు చెప్పారు కానీ, అప్పటికే సాహిత్యం మీద ఇష్టం ఉండటం వల్ల బిఎ ఇంగ్లీషు తీసుకున్నాను. నేను లైబ్రరీకి బాగా వెళ్ళేవాడిని. నేను తెలుగులో చదివిన మొట్టమొదటి కవిత్వ పుస్తకం తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’. చాలా నచ్చింది అది. దాదాపు నోటికి వచ్చు. రెండో పుస్తకం వరవరరావు ‘చలినెగళ్ళు’.

అది ఆయన మొదటి కవిత్వ సంపుటి. మా రమక్కయ్యకు (పెద్దమ్మ కూతురు) వరవరరావు సీనియర్‌. నేను బి.ఎ.లో చేరిన తర్వాత మా అక్కయ్య ఈ పుస్తకం తీసుకువచ్చి చదవమని ఇచ్చింది. అప్పటికి నేను శ్రీశ్రీని కూడా చదవలేదు. హనుమకొండలో మిత్రమండలి అని ఒక ఇన్‌ఫార్మల్‌ సాహితీ సంస్థ ఉండేది. ప్రతినెలా సాహిత్య సమావేశాలు జరుగుతూ ఉండేవి.

మొదటి కన్వీనర్‌ అంపశయ్య నవీన్‌, తిరుపతయ్య సార్‌, వరవరరావు, కాళోజి, వాళ్ళ అన్నయ్య రామేశ్వరరావు… ఇలా అందరూ వచ్చేవారు. నేను కూడా కొత్తగా వెళ్ళడం మొదలుపెట్టాను. (ఇప్పటికి కూడా మిత్రమండలి నడుస్తోంది) నాకు కాళోజి బాగా పరిచయమయింది అక్కడే. నా జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసినవారిలో కాళోజి చాలా ముఖ్యమైన వ్యక్తి. తర్వాత కాలంలో కన్నాభిరాన్‌, బాలగోపాల్‌, వరవరరావు… ఇంకా అనేకమంది నా సహచరులు, విద్యార్థులు ఉన్నారు.

’69 తెలంగాణ ఉద్యమం:

నేను అప్పుడప్పుడే కమ్యూనిజం గురించి, ‘సుందరయ్యగారి గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాను. అదే సమయంలో నక్సల్‌ బరి ఉద్యమం ప్రారంభమయింది. ’69లోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా తొలి ఉద్యమం మొదలయింది, దాదాపు ఒకే సమయంలో. ఇక్కడ ఈ ఉద్యమ నేపథ్యం తెలుసుకోవాలి. వడ్డేపల్లి గడీలో కాకతీయ మెడికల్‌ కాలేజి మొదలయిందని చెప్పాను కదా. అక్కడ 40 సీట్లు మంజూరయ్యాయి. 35 మంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కమ్మ, రెడ్డి, బ్రాహ్మల పిల్లలకే సీట్లు వచ్చాయి. 5వ బ్యాచ్‌లో మా అన్నయ్యకు కూడా సీటు వచ్చింది కానీ అప్పుడు కాపిటేషన్‌ పీజు 5000 రూపాయలు ఉండేది. అవి కట్టే స్థోమత లేక ఆ సీటు వదిలేసుకోవాల్సి వచ్చింది. మా ఊరిలో పెట్టిన కాలేజీలోనూ మా అన్నయ్య చేరలేకపోయాడు!

ఈ అంశం నన్ను చాలా ఆలోచనలో పడేసింది. విజయవాడ, గుంటూరు నుంచి వచ్చినవాళ్ళు అక్కడే ఇళ్ళు తీసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళల్లో కొంతమందికి మా చిన్నమ్మమ్మ వంటచేసి పెట్టేది. ఆవిడ పేరు సత్తెమ్మ. మొదటిసారి మేము ఇడ్లీ అనే పదార్థాన్ని చూసింది అప్పుడే. మేం ఏం మాట్లాడినా ఆటపట్టిస్తున్నట్లుగా బనాయించేవారు. మంచివాళ్ళే, కానీ ఈ తేడా ముల్లు గుచ్చినట్లు బాధపెట్టేది. మా ప్రతిమాటనీ ఎగతాళి చేసేవారు. అక్కడికి దగ్గర్లో గుంటూరు పలెల్లని ఉండేవి. అవి మా ఊర్లకన్నా చాలా తేడాగా ఉండేవి. మాదొక తీరు, వారిదొక తీరు. అలా ప్రతిచోటా ఈ తేడా పెరుగుతూ పోయింది. ఇక్కడి వాళ్ళకు ఉద్యోగాలు లేవు. లెక్కలు, సైన్స్‌, సోషల్‌, ఇంగ్లీష్‌ ఇలా చాలామంది టీచర్లు ఆంధ్రా నుంచి వచ్చినవాళ్ళే ఉండేవారు. ఇక్కడి వాళ్ళు తెలుగు, క్రాఫ్ట్స్‌, డ్రాయింగ్‌ వంటివాటికి ఉండేవాళ్ళు. తెలంగాణకు అన్యాయం జరిగిందన్న నేపథ్యంలో వచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం విద్యార్థులుగా పాల్గొన్నాం.

(‘సారంగ’ సౌజన్యంతో) (మిగతా భాగం వచ్చే సంచికలో)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.