మానవీయ విలువల మంచుముత్యాల పతాకం

“పుస్తకంలోని ఒక మాట మీ జీవిత గమ్యాన్ని నిర్దేశించవచ్చు”- సరిగ్గా ఈ మాట ‘అంబికా అనంత్’ రాసిన ‘మంచుముత్యాలు’ (కథాసంపుటి) కు వర్తిస్తుంది. ఇందులో 14 కథలున్నాయి. ఇది పధ్నాలుగు జీవిత పార్శ్వాలు. ఏ ఒక్క కథా మరో కథలా వుండదు. విభిన్న కోణాలతో రచనా దృష్టిని చేస్తూ మానవీయ దృక్పథమే ప్రధానంగా ఈ రచయిత్రి దృష్టి కోణంలో నిలిచింది.

ఇటీవల వచ్చిన కథా సంపుటుల్లో విలక్షణమైనదిది.

అమ్మ జీవితంలో తానెంత కోల్పోయినా, పోతున్నా, పిల్లల్ని ఎంత ప్రేమతో పెంచుతుందో, ఎంత త్యాగాన్ని నూరి పోస్తుందో ‘వసంతకృష్ణ’ జీవితంలో ఎదురైంది. రచయిత్రి తన కథాశిల్పంతో పాఠకుల్ని తీసుకొని వెళ్ళగలిగిన నైపుణ్యవతి. అందుకే వసంత కృష్ణ దుఃఖంలో పాఠకులూ మమేకమౌతారు. (నభూతో… న భవిష్యతి!)

ఉద్యోగ నిర్వహణలో కన్న కొడుకు ప్రాణాల్ని ఫణంగా పెట్టాల్సి వచ్చిన డా|| హర్ష దైన్య స్థితి, అందుకు అనుకోకుండా కారకుడైన ప్రభాకర్ల మనస్థితి వర్ణన అద్వితీయం. వారిరువురి సంభాషణ మానవత్వమున్న మనుషుల గుండెల్ని ద్రవీభూతం చేస్తాయి. (త్యాగం ఒడిలో)

“జీవితం తేనెపట్టులాంటిది. తీయని తేనెతో పాటూ తేనె టీగలూ వుంటాయి. తేనెటీగల కాట్లు తను తింటున్నా తేనె పరులకు పంచగలిగి ఆనందించే వ్యక్తి ధన్యుడు” – ఇలా జీవన సత్యాల్ని సంభాషణ రూపంలో ఒలికించి, ‘ఆమని’ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మలిచింది (తేనెపట్టు).

డబ్బుకాశపడి, పోటీపడి, స్వార్థ చింతనతో కన్నబిడ్డల్ని దత్తతకివ్వాలని చూస్తున్న వారి తత్వాన్ని గ్రహించి, తల్లిదండ్రుల్ని హఠాత్తుగా కోల్పోయిన పిల్లల్ని ‘శ్రీధర్’ అక్కున చేర్చుకోవడం మెచ్చుకోదగింది. (సెలక్షన్)

నమ్మకాల్ని కోల్పోతే, ప్రేమలు పోగొట్టుకోవాల్సి వస్తుందన్న చేదు నిజాన్ని ‘శైలజ’ జీవితానుభవం చెప్పింది. శారీరక అవసరం కంటే ప్రేమ మహోన్నతమైందన్న నిజాన్ని గ్రహించగల్గుతుంది. ఈ కథలో ఇతివృత్తం బాగున్నప్పటికీ కథలో కొంత గందరగోళం నడిచింది. ఎక్కడో లింక్ తెగినట్లనిపించింది(శిశిర జీవితాలు)

చాలా సీరియస్గా, మేధోపరంగా, విశ్లేషణాత్మకంగా కథలన్నీ నడిచాయి. ‘ప్రేమోపనిషత్తు’, ‘ప్రేమ’పాఠం ఈ రెండూ ఈ సంపుటిలో లేకుంటే బాగుండేదనిపించింది.

కథల రచనాకాలాలు ఇచ్చుంటే బాగుండేది. రచయిత్రి తొలిరోజుల్లో రాసిన కథగా (సబల) అనిపించింది.

డా|| శశాంక్ మానసిక సంఘర్షణని, అతడు తిరిగి తన పూర్వ ఔన్నత్యాన్ని సాధించిన తీరులో రచయిత్రి ప్రతిభ కనబడింది. కథ పూర్తయ్యేసరికి పాఠకులకు కూడా శశాంక్ చనిపోతాడు కదా అనే దిగులు మేఘం కమ్ముకునేట్లు రాశారు (జీవన విరించి)

సినిమాలు, చెత్త సాహిత్యం వల్ల ప్రేమంటే, మాటల్లోనే ఒలకబోసుకునేది అనుకునే అమాయకత్వపు, మూర్ఖపు దశనుంచి ‘చందన’ నిజమైన ప్రేమరూపాన్ని తన జీవితం ఎలా దర్శించిందో రచయిత్రి వివరించింది. (రొమాన్స్)

‘కళకు మరణం లేదు. కళారూపాలు వేరు. కళాకారుడి హృదయమంతా సంగీత రసప్రవాహమే’ అనే జీవన దార్శనికతను అద్భుతంగా వర్ణించిన రీతి అపూర్వం. కథా నిర్మాణశైలి అపురూపం (రాగవిరాగాలు)

శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉన్న దశలో, మాటలు, మూఢ విశ్వాసాలూ, సెంటిమెంట్లు ఎలా పనిచేస్తాయో, ‘మాధవి’ మానసిక క్షోభలో రచయిత్రి వివరించింది. సెంటిమెంట్లు ఎక్కువ కాకూడదని నిరూపించింది. మరణశయ్యను చేరిన మాధవికి బతుకుపట్ల మమకారాన్ని, కొత్త ఆశను ‘శ్రీధర్’ కలిగించిన రీతి బాగుంది (సెంటిమెంట్… నీ విలువెంత?)

తల్లిదండ్రులు వారి వారి వ్యాపకాల్లో కూరుకొనిపోయి, పిల్లల్ని కంప్యూటర్లకు అప్పగిస్తే, వస్తున్న దుష్పలితాల్ని ‘విజయ్’ జీవితంలో రచయిత్రి చూపించారు. ఒక క్రూరమైన స్వభావాన్ని, దుర్మార్గాన్ని, విశృంఖలతని ఆపాదించుకుంటూ స్వంత తాతయ్యనే, క్రూరంగా హత్యచేసిన విజయ్ స్థితికి ఎవరెవరు ఎంతెంత వరకు కారకులు అంటూ చాలా ఆవేదనతో రచయిత్రి రచించింది. (కొడిగట్టరాని చిరుదీపం).

ఆకలి, అవినీతి నిరంతరం రాజ్య మేలుతున్న పేదరిక దేశం మనది. పోలీసు వ్యవస్థ క్రూరత్వానికి ‘శివుడు’ బలైపోయిన రీతిని కరుణ రసాత్మకంగా వర్ణించింది. ‘ఓ నేరస్తుడు పుట్టాడు సమాజంలో… మంచి ముత్యంలాంటి పసివాడివిరా’- అన్న మాష్టారు ఆవేదన స్వరంలోని నిజం మనల్ని ఘనీభూతుల్ని చేస్తుంది. (మంచు ముత్యాలు)

తంగిరాల వెంకట సుబ్బారావు గార్కి ఈ పుస్తకం ‘అంకితం’ ఇవ్వడంలో అంబిక గురుభక్తి, భార్గవీరావుగారితో ముందుమాట వ్రాయించడంలో అంబిక స్నేహానురక్తి వ్యక్తమవుతున్నాయి. ఈ ‘మంచుముత్యాలు’ కథా సంపుటి అందరూ చదవదగ్గ పుస్తకం. మనుషుల్లో మృగ్యమైపోతున్న మానవీయ విలువల్ని ఎత్తి చూపుతూ, మానవత్వమే అందరి జీవితాల్లో వెలుగు పువ్వుల్ని పూయిస్తుందనే వాస్తవాన్ని బతుకు మంచులో చూపించిన మంచి ముత్యాలు ఈ కథలు. అంబిక ద్విభాషా కవయిత్రి, అనువాదకురాలు, ప్రతిష్టాత్మకమైన పలు అవార్డులను గెలుచుకున్న ప్రతిభావంతురాలు. అంబిక సాహిత్య కృషి ఇలానే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.