ఆగమ్మ

– ఇంటర్వ్యూ: జె. సుభద్ర

(వరంగల్ జిల్లాలో సర్పంచిగా పనిచేస్తున్న దళితురాలు ఆగమ్మ. పేరుకి ఆమె సర్పంచిగాని అధికారమంతా ఆమె కొడుకుదే. ఆగమ్మతో సుభద జరిపిన ఇంటర్వ్యూ.)

ప్రః చెప్పమ్మా ఎప్పుడు ఎన్నికయ్యావు నువ్వు, ఎవరు నిల్చోబెట్టారు, మీ పంచాయితీ గురించి చెప్పు…?
పంచాయితీ సంగతి కొడుక్కి తెలుసు గద నాకేం దెలుత్తది నన్ను నిలబెట్టుకున్నడు నేను మండలంబోత ఒత్త ఇంక ఏడికన్న తీస్కపోతె పోత అత్త. ఫొటోలు దించుకున్నరు. ఈ పంచాయితీల సంగతి ఏమైంది మనకు దెల్వదు ఆయనకు దెల్సు. సంతకం నేనేబెడ్త. అబ్బో ఆ కాలంనాడు చదువుకున్ననా నేనే నాకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. నేను సదువలే. దామెర్ల సదుకున్నరు. చిన్న చిన్న పోరగాల్లు గని ఆకాలం నాడు. నేనొక్క బిడ్డనే. ఒక్క బిడ్డనైతే ఎవరన్న కొడ్తరు తిడ్తరు అని పోనియ్యలే నేను ఎంతేడ్సినగాని మా అమ్మ నాయిన… మా దోస్తులు ఏమో… ఏం సదివిండ్రో… సదవలేదో నాకచ్చోల్లు ఎటోల్లటు బోయిండ్లు. ఇగ నన్ను ఈ వూరికిస్తే… మా అవ్వగారు ఉల్లిగడ్డల దామెర మా అత్తగారు వెంకటాపురము మాకు ఇగో ఇదంత మాదే. రెండు ఎకురాలు పొలం నాటేసుకున్నం. ఇదంత చేస్తాండా ఇదంత చెయ్యాలంటె శాన పైసలు గావాలె.

ప్ర. ఈ కుంటగూడా మీదేనా…?
కుంటగాదు… అప్పుడూ ఇదంత మట్టి దీస్కపొయ్యి కాల్వకేసిండ్రు. నాకొక్కడే కొడుకు. ఇగ గంతే పంచాయిదులు గించాయిదులు ఆయినే చెప్తడు. నాకేది లేదు.

ప్ర. అప్పుడు నీతోపాటు ఎవరన్న పోటీ చేసారా…?
ఎవరున్నరు చేసేతందుకు గాని ఓ ఎంపిటిసి వున్నది. ఓ సర్పంచి వున్నది ఇయ్యేడు అయిపోతది ఆమెది. ఆమె సర్పంచి అయ్యి ఎంపిటిసి అయింది. ఆమె తెనుగామె సర్పంచే. ఆమె ఇయ్యేడు ఉగాది వరకు దిగిపోతదట.

ప్ర. నీదిగూడ అయిపోతది గద నీ సర్పంచి గూడ…?
నాది ఎట్లయిపోతది. నాదిప్పుడు మూడేండ్లెల్లకనే పాయె.

ప్ర. అవునా ఎప్పుడయ్యాయి ఎలక్షన్లు…?
ఇప్పుడైతే రెండేండ్లెల్లి మూడేండ్లు జరుగుతున్నయి. ఇంక రెండేండ్లు గావాలె. ఈ రెండేండ్లెల్లినంక మూడేండ్లు బడ్తయి. ఇప్పుడు నా కొడుకు లేడు హైదరాబాదులో ఉన్నడో హన్మకొండలో ఉన్నడో…

ప్ర. మరి ఎవరు చూస్తున్నరు… పంచాయితీ ఆఫీస్కి వెళ్ళాల్సిన పనేముండదా..?
అప్పటివరకు అందుతడు. పిల్లలకు సదువు…

ప్ర. ఎన్నేండ్లుంటయి నీకు…?
ఎమ్మో అరవై వుంటయో డెబ్బై వుంటయో నాకు తెల్వదు ఎన్నేండ్లుంటయో. నా పెద్దకొడుకు 30 ఏండ్ల వరకే జరిగిపోయిండు. ఇగ నా పెద్దకొడుకు సచ్చిపోయి పన్నెండేండ్లయితాంది ఇగ…. సంతానం లెక్కనావ్వ… పిల్లలు పుట్టటానికి లెక్క వుండది. వయిసుల గంటరు, ముసలితనాన కంటరు. నా కొడుకన్నడు గద అవ్వా నువు నాకంటె ఒక పన్నెండేండ్లు పెద్దగావొచ్చన్నడు. నా సచ్చిన కొడుకన్నడు (నవ్వులు)

ప్ర. చెక్కులు ఎవరు తీసుకొస్తారు నీ దగ్గరికి సంతకం పెట్టిచ్చుకోవడానికి…?
అందరొత్తరు ఆ వూరి వరకొస్తరు పనులున్నోలు ఎవ్వరైనా వత్తరు.

ప్ర. మీ సెక్రెట్రీ రాడా?
వస్తడు.

ప్ర. ఎంతమంది పిల్లలు…?
ఐదుగురు పిల్లలు. ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులైతే ఒక్క కొడుకు చనిపోయిండు. ఏం జేయాలె నాకు ఈ బ్లెడ్డొచ్చి ఒచ్చీ ఈ పండ్లు కరాబయినయి. మొన్ననే. మొన్నమొన్ననే పాడయిపోయినయి. సర్పంచి తనం నేను పట్టనే పట్టనన్న. నా కొడుకు ముత్తెమంత మొఖం చేసుకున్నడు పట్టేదాక. సర్పంచితనం నాకెందుకు సదువు లేదు సంద్యలేదు…

ప్ర. వాల్ల ఆవిడని నిలుపుకోవచ్చు కదా..? నిన్నే ఎందుకు నించోబెట్టాడు…?
ఇగ ఆయినే అన్ని చూసుకున్నడు. కాదన్న నేను. నాకెందుకు సదువా సంద్యనా అన్న. అంటే వూరు వరకు అమ్మ మంచి మనిషి, మర్యాద గల్లది చిన్నప్పడి కాడికెల్లి మాట పోడగొట్టుకోకుండ వున్నది అమ్మనే నిలబెట్టాలని పెట్టుకున్నరు. వూరోల్లంత.

ప్ర. ఎట్లా మంచి పేరొచ్చిందమ్మ నీకు..?
మర్యాదే. ఎవలమీదికి పంచాయితికి బోక, జవుడానికి బోక, కొట్లాటలకు బోక ఎవ్వల్నేమనక ఇగో ఇంత పిలగానికి గూడ విలువ ఇచ్చిన. గిట్ల గుండ్లమీద కూసోలే… బండలమీద గూసోలే, మంచాలమీద గూసోలే.. ఏదాని మీద కూసుండకుండ కిందనే కూసున్న. బావలకు భయపడ్డ. బావ కొడుకులకు భయపడ్డ. కొడుకుల కొడుకులకు భయపడ్డ. ఇప్పడికి మనుమలున్నరు. ఇంతమందికి గూడ భయపడితే ఆ భగవందుడు నాకు ఆ కుర్చి తయారు చేసిండు. పంచాయితీ ఆఫీసుల కూసోమంటరు గని నేను భయపడ్త. వయిసులోనైనా నేనే పెద్ద ఎందులోనైనా పెద్దేకని ఎందుకు అని. ఇప్పుడూ ఈయన సీను కూసునుమన్నడు ఇండ్ల అవ్వా కూర్చో నువ్వు కుర్చీమీద అన్నడు.

ప్ర. నువ్వు సర్పంచివి కదా విలువిచ్చి నపుడు తీసుకోవాలె…?
ఎట్లయ్యేది గట్నే అయితది. అంటె గంత విలువిత్తెనే మా వూరు వరకు ఆ అమ్మ వుండాలె. ఆ అమ్మ ఎదడికి మాట్లాడేది కాదు. ఆ అమ్మ మంచి మర్యాదకల్లది విలువ కల్లదీ అని వాల్లు నన్ను కూసుండబెట్టిండ్రు. కూసుండబెడ్తె మస్తు బాధనిపిచ్చి అస్సలే కూసోలే నేను. కూసోకుంటె కూసోవాలమ్మా నువు పెద్దదానివి గదా… అనంటె గిట్లనే మొఖం నేలకేసుకోని సిమాంటనాడు నేనే మొఖం నేలకేసుకున్న. ఎత్తుత లేను మీదికి తలకాయ ఎత్తకుంటే అంత మా వూరి వరకు అబ్బ ఎంత ఇజ్జద్దారీ… ఎంత మంచిదీ… ఎంత కథ… ఏం ఖార్ఖానా అని…

ప్ర. మీ తల్లిదండ్రుల గురించి చెప్పు..?
ఓ… మా నాయన మా అమ్మ ఎన్నడో చనిపోయిండ్రు. ఇద్దరన్నలు నేనొక్కదాన్ని. ఇద్దరన్నలు సచ్చిపోయిండ్రు. ఇద్దరు వదినలు సచ్చిపోయిండ్రు. మా నాయిన అమ్మ సచ్చిపోయిండ్రు. ఇగ నేనొక్కదాన్నే వున్న. అన్నల కొడుకులున్నరు.

ప్ర. నీ భర్తేంజేస్తడు…?
మాకు వ్యవసాయమే. ఏ… మాకు కూలిదెల్వదు. మేమే కూలోల్ల బెట్టుకోని పన్జేసుకునేది మాకు కూలి సంగతి తెల్వది. మేం పెసరేసుకునేది, మేం కందులేసుకునేది, వుల్వలు, నువ్వుల కాడికెల్లి మేము పండిచ్చుకునేది పల్లికాయ గూడ… నవధాన్యాలన్ని మేం పండిచ్చుకునేది. తూమెడు కందులెండ బోసేది. తూమెడు పెసల్లు ఎండబోసేది. కుంచెడు మక్కజొన్నలు పెరట్లో ఏసుకుంటమని దాసేది, కుంచెడో ఆరు మనకలో పజ్జొన్నలు దాసిపెట్టేది నేను. ఓ బస్త శెనిక్కాయ దాసిపెట్టేది. ఆన్ని ఎండబోత్తే సబ్బండ జాతి సూస్తరు నా ఇంటికచ్చి. కోట్ల సంసారం చేసిందా. ఆగమ్మంటె తక్కువది గదా అంటరు. ఆడికి సాలు నాకు. ఈ కుర్చీల మీద కూసుండాల ఈడ కూసుండాలనేది లేదు నాకు.

ప్ర. ఈ పంచాయితీ ఆఫీస్ల జీతమొస్తది గదా అది ఎవరు తీసుకుంటన్నారు?
కొడుకే. అన్ని పనులు కూడా కొడుకే. జీతం గూడ ఆయినే.

ప్ర. ఇపుడు నువు ఎవరితోనుంటున్నవు?
సాంత పండుకుంట. నాకు పదిహేనుగుంటల పొలమున్నది. మొన్న కొడుకు బస్త బియ్యమేసిండు. నాకేమింక నేనే వండుకుంట, తింట. యాన్నో కూసుంట… ఇంటికాన్నే… కోడలున్నది. కోడల్ని చూసుకుంట వుండాలె. నా పెద్దకొడుకు భార్య. పిల్లల్లేకుంటె నా బిడ్డ కొడుకుని సాదుకుంటె… వెండివె… గెంటీలుండే నల్లబూసల గొలుసుండే… పావులెత్తు ముక్కుపోగుండె, చేతులకు కడాలుండె అన్ని బొయినయి.

ప్ర. ఎటుబొయినయి…?
అన్ని దీసిన. కష్టమొత్తది గద ఓయాల్ల గాకుంటె ఓయాల్ల. నాకురాలే… నాకు ఏ కష్టం రాలే. ఇగ నా పిల్లల్లేరా అవ్వ ఆ కొడుకు ఈ కొడుకు అందరి పిల్లలకు జెరాలొత్తే… మనకోసం వచ్చిన్రు మనం జెప్పాలె. శేత్తరా వాల్లు మనకు సాయం రాస్కోని పొయ్యి మనమెక్కన్నో వాల్లెక్కన్నో.

ప్ర. అప్పుల్లేవా?
అప్పులేంది ఎట్ల బత్కుతవు పంట పండినా అప్పులకే పోతాంది.

ప్ర. మతం పుచ్చుకున్నాక పేరు మార్చుకున్నవా?
ఏ పేరు మారవలే.

ప్ర. ఎప్పటినుంచి నువు నమ్ముతున్నావు దేవున్ని?
మాకు ఒక దేవుడున్నడు. ఆ దేవున్ని నమ్ముతా కాని పెద్ద కోడలండ్లనే వున్నది. ఇగ నేనొక్కదాన్నే విడిగున్న ఏమంటె సూసి రావాలె. సార్ రమ్మన్నడు గద మంచో చెడో సూసి వద్దామని వచ్చిన గంతే. ఇగ ఆ దేవున్ని ఆ దేవున్ని నమ్ముకోనా. ఈ దేవతల నిడ్సిపెట్టలేదు. సచ్చిపొయ్యేదానికి మన కాలాన ముట్టింది ముత్యం పట్టింది బంగారం అయిన భగవంతున్ని మనం నమ్ముకున్నం. పిల్లప్పడి కాడికెల్లి నమ్ముకున్నం గద. ఇప్పుడు ఈ దేవున్ని ఇడ్సబెట్టి మల్ల ముసలితనాన ఆ దేవుడిని నమ్మాలా!

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

2 Responses to ఆగమ్మ

  1. vrdarla says:

    ఈ ఇంటర్వ్యూ బాగుంది. తెలంగాణ సజీవమైన భాషలో రాయటం సామాన్యమైన విషయం కాదు. దాన్ని మీరు బాగా రాయగలిగారు. ఇలాంటి భాషను అక్షరీకరించటం వల్ల Socio linguistics అనే భాషా శాస్త్ర విభాగం పై దృష్టి సారించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అందరి భాషా ఉపయోగంలోకి వస్తుంది.
    డా .దార్ల వెంకటేశ్వరరావు
    లెక్చ్తరర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ తెలుగు
    సెంట్రల్ యూనివర్సిటి ,
    హైదరాబాద్

  2. ” ప్ర. ఎట్లా మంచి పేరొచ్చిందమ్మ నీకు..? : … … గిట్ల గుండ్లమీద కూసోలే… బండలమీద గూసోలే, మంచాలమీద గూసోలే.. ఏదాని మీద కూసుండకుండ కిందనే కూసున్న. బావలకు భయపడ్డ. బావ కొడుకులకు భయపడ్డ. కొడుకుల కొడుకులకు భయపడ్డ. ఇప్పడికి మనుమలున్నరు. ఇంతమందికి గూడ భయపడితే ఆ భగవందుడు నాకు ఆ కుర్చి తయారు చేసిండు…. … ”

    ఈ భయం ఆమెల (ఆమెలాంటి అడోల్లల్ల) పెట్టింది ఎవరు? నేను పొయిన సంవత్సరం ఒక దోస్తు వాల్ల ఇంట్లకు దావత్ కు పోయిన, ఆడికి ఇంకో దోస్తు వాల్ల పెల్లాం పిలగాడిని, అత్తను ఎంటబెట్టు కొచ్చిండు. అందరం కూసొని ఏదో ముచ్చట జెప్పుకుంటున్నం నీల్లు తాగుదామని వంటింట్లకు పోతె వాల్ల అత్త నిలబడి ఉన్నది, ‘ అయ్యో కూసక పోతివి ఆంటీ అట్ల నిలబడ్డవు? ‘ అంటె, ‘మా అల్లుడు అక్కడ నేల మీద కూర్చొని ఉన్నాడు, నేను నిలబ్డే ఉంటాను’ అన్నది.

    ఆ భయం, ఈ పెద్దమనుసులకు ఎవ్వరు పెట్టిన్రు? పెట్టెటోడు ఎవడో పెట్టిండు వాడు వాల్ల తాతలు అందరు సచ్చింరు.
    ఇప్పుడు, బతికి ఉన్న మనకన్న సిగ్గుండాలెగద? ఇదంత జరిగింది అమెరికాల! ఇదేనా మనం పెద్ద పెద్ద సదువులు సదివి, పెద్ద ఉద్యోగాలు జేసి ఎలగబెట్టేది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.