‘ఒక్కసారి ఆలోచించు….’

సదాశివుని లక్ష్మి

తన సొంత పరిమళంతో పిచ్చెత్తి అడివి నీడల్లో పరిగెత్తే కస్తూరిమృగం వలె, నేను పరుగెత్తుతున్నాను.
ఆ రాత్రి నిండు వైశాఖమాసపు రాత్రి గాలి.. అది దక్షణ మారుతం.
నేను తోవతప్పి ఒకటే తిరుగుతున్నాను. నాకు దొరకని దాని కోసం వెతుకుతున్నాను. నేను వె..త..కనిది.. నాకు లభ్యమౌతుంది.
నా వాంఛ రూపం దాల్చి నా హృదయంలోంచి బైటికి వచ్చి నర్తిస్తుంది. ఆ మెరిసే ప్రకృతి తేలి పోతుంది. దూరంగా… దాన్నే గట్టిగా కావ లించు కోవాలని చూస్తాను. కాని అది తప్పించుకొని, తప్పుదోవలకి లాగుతుంది.
నాకు దొరకని దాని కోసం వెతుకలేను. నేను కావాలని అనుకోనిది నాకు దొరుకుతుంది.
(రవీంద్రుని ‘గార్డెనర్‌’ కు చలం అనువాదం నుంచి..)
జ    జ    జ
వాతావరణం ఆహ్లాదంగా ఉంది.
అంతవరకు కుండపోతగా కురిసిన వర్షం… తెరిపి నిచ్చింది. మబ్బులు విడిన ఆకాశం… గాలి చల్లగా… హాయిగా ఉంది.
బస్టాండ్‌ రద్దీగా లేదు. ప్రశాంతంగా ఉంది.
సమయం.. రాత్రి ఎనిమిది కావస్తున్నది… నేను ఎక్కవలసిన బస్సు వచ్చింది. ఎక్కి.. కిటికి ప్రక్క సీటులో కూర్చున్నాను. సీటు తడిగా ఉంది. కర్చీఫ్‌తో తుడుచుకొని.. సూట్‌కేస్‌ను స్టాండ్‌లో ఉంచి కిటికి గ్లాస్‌ డోరు విశాలంగా తీసి రిలాక్స్‌ అయాను.
నా మనసు అలజడిగానే ఉంది. సడన్‌గా అది కూడా రాత్రి సమయంలో నా రాకను చూస్తే.. నాన్న అమ్మ రియాక్షన్‌ ఎలా ఉంటుంది? చూడాలి… మగాడ్ని అనుకోండి… కాని…. ఎప్పుడు కూడా.. అది కూడ రాత్రి సమయంలో నాన్న దగ్గరకు వెళ్లలేదు. ఇదే తొలిసారి.. మీరు నమ్మండి.. నమ్మకపొండి…!
నా మనసు అలజడిగా ఉంది.
జ    జ    జ
ఇంత జఠిలమైన సమస్యను నేను ఏనాడూ ఎదుర్కొనలేదు.. ఆర్థిక మాంద్యం.. నాపైన తీవ్రమైన ప్రభావాన్నే చూపింది. నేను పనిచేస్తున్న కంపెనీ నాతోపాటు మరో నూటయాభైమందికి ‘పింక్‌స్లిప్‌’ చేతి కిచ్చింది. అదే నా జీవితాన్ని బ్లాంక్‌ చేస్తుందని నేనేనాడు ఊహించలేదు. అసలు ఇటువంటి పరిస్థితి ఒకటి నా జీవితంలో వస్తుందని కూడ అనుకోలేదు.
అభద్రతా.. ఆర్థిక లేమి… సౌకర్యాల్లో కొరత… భయానక భవిష్యత్‌ చిత్రపటం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అంశాలు.
అసలు వీటన్నింటికంటే కూడా సంసారంలో వచ్చిన మార్పులు నన్ను ఆత్మహత్యకు పురికొల్పుతున్నాయి. నేను చదువుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగు చదువుకాని.. కమ్యూనికేషన్‌… టైమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కేల్స్‌… వంటి ఇతరత్రా కంపెనీ నేర్పిన స్కిల్స్‌ కాని నన్ను ఆత్మ విశ్వాసం వైపు నడిపించ లేకపోతున్నాయి. నా నెలసరి ఖర్చు.. దగ్గరదగ్గర ఇరవైవేలు.. నేను.. నా భార్య ఇద్దరం ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లమే.. జీతం దాదాపు అరవైవేలు దాకా వచ్చేవి.. జీవితం ప్రపంచం… ఆనందనిలయం.
కాని.. ఒక్కసారిగా ఆర్థిక మాంద్యం సునామీ.. మా జీవితనౌకను చిన్నాభిన్నం చేసింది.
ఇవన్నీ కాదు.. నా భార్యలో వచ్చిన మార్పు నన్ను మరింతగా కృంగదీసింది.
సంపాదన లేని మగాడంటే ఇంత చులకనా…!?
ఛీ… ఛీ… ఈ ఆడవాళ్లు ఎంతటి కృతఘ్నులు.. మగాడు ఓ ‘ఏటియం’ కార్డుగా ఉంటే నీ అంతటి వాడు లేడంటారు. సంపాదన లేకపోతే నీ వంటి వాడు నా కెందుకంటారు.
ఇదేనా వివాహంలో చదివే మంత్రాలకు అర్థం… సప్తపది యొక్క నిర్వచనం…
సార్‌.. టికెట్‌.. కండక్టర్‌ పిలుపుతో వాస్తవంలోకి వచ్చాను.
ఎక్కడికి వెళ్లాలో చెప్పాను. కండక్టర్‌ టికెట్‌ ఇచ్చాక.. జేబులో ఉంచుకున్నాను. దాదాపు ఆరు గంటలు ప్రయాణం చేయాలి. నేను దిగే సరికి తెల్లవారు ఝామున రెండు మూడు కావచ్చు.
నా మనసంతా అలజడితో నిండి ఉంది.
బస్సు కదిలింది.. లైట్లు ఆర్పేసాడు డ్రైవర్‌… కండక్టర్‌ సీట్‌ దగ్గర చిన్న లైట్‌ వెలుగుతున్నది. ప్రయాణీకులంతా చీకటికి అనుగుణంగా మెల్లగా మాట్లాడు కుంటున్నారు.
నా ముందున్న సీట్లో ప్రేమికులో కొత్త దంపతులో అనుకుంటాను మెల్లగా మాట్లాడుకుంటున్నారు.
నాకు నవ్వు వచ్చింది.. మరో సంవత్సరం తరువాత కూడా వీళ్లు ఇలాగే మాట్లాడుకోగలిగారా….?
ముఖ్యంగా… అతను… బికారిగా మిగిలితే…!
ప్రేమలు ప్రారంభంలో ఎంతో బాగుంటాయి. కాని క్రమంగా కాలం చేతిలో ఇసుకలా జారిపోతుంటే.. ఆర్థిక పరిస్థితులు ఎదురు తిరిగితే..
జరిగిన సంఘటనలు… నేను ఆత్మహత్య చేసుకోవడమే మంచిదనే నిర్ణయాన్ని మరింతగా బలపరిచాయి.
ముఖ్యంగా… నా భార్య ప్రవర్తన
నా మనసు అలజడిగా ఉంది.
జ    జ    జ
‘నాన్నా ఈమె పేరు సరోజ.. ఈమె.. నేను.. ఇద్దరం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగు చేసాం.. క్యాంపస్‌ సెలక్షన్‌లో ఆమె నేను వేరు వేరు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగులుగా సెలక్టయాం… జీవితం గురించిన భరోసాయే మిమ్మల్ని సంప్రదించకుండా ఇలా రిజిష్ట్రారు ఆఫీసులో దండలు మార్చుకొనేలా చేశాయని చెప్పకతప్పదు.. మీ ఆశీర్వాదాలు కావాలి.’
నేను సరోజ ప్రేమించి పెళ్లి చేసు కున్నాం చేసాం… ఆ విషయం గ్రహించారాయన… ఆయన ముఖంలో చిరునవ్వు.. జీవితానుభవం నేర్పిన పాఠాల సారాంశపు మూల్యాంకనం – ఆ నవ్వు..
మేమిద్దరం.. ఆయన కాళ్లకు నమస్కారం.. అమ్మను పిలిచారు, ఆమె వచ్చి.. చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేసింది.
నా జీవితంలో ఎంతో ఆనందాన్ని ఆరాత్రి అనుభవించాను. బహుశా.. ఎవరెస్టును ఆధిరోహించిన టెన్సింగు నార్కే కూడా అంత ఆనందం అనుభవించి ఉండకపోవచ్చును.
అమ్మ.. నాన్న.. ఎంతటి ఉదాత్తులో తొలిసారిగా తెలిసింది.
జ    జ    జ
‘ఏమండి వాడు చేసింది ఏమైనా బాగుందంటారా… కులం గోత్రం తెలియని… ఎవరో అనామకురాలిని కోడలిగా చూడవలసి వస్తుందనుకోలేదు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి సంబరాన్ని చూడలేననే బాధ నాది కాదంటారా’.. ఆమె.. అతని గుండెల్లో తలపెట్టి ఏడ్చింది.
నా తండ్రి ఆమెను.. నా తల్లిని… ఓదారుస్తున్నారు.. ‘పిచ్చిదానా కాలగమ నంలో వస్తున్న మార్పులకు ఇదొక ముగింపు కాదు.. ఆరంభం.. ఆకర్షణ.. వాంఛ.. పరిసరాలు.. జీవితం.. జీతం ఇచ్చే భరోసా.. వారికి జీవితం పట్ల అవగాహన కన్నా ఆనందాన్ని ఎక్కువగా అలవాటు చేస్తున్నాయి. అయితే ఆర్థిక పరిస్థితులే ఆలంబనగా కొనసాగే ప్రేమలు.. జీవితాన్ని ఏ రకంగా నిర్ధిష్ఠ గమ్యస్థానాన్ని చేరుస్తాయా అనేదే పెద్ద వాళ్లుగా మనం ఆలోచించ వలసిన విషయం… నువ్వు… నేను… కూడా టీచర్లుగా పనిచేసి రిటైరయిన వాళ్లమే. కనుక వాస్తవంగా ఆలోచించడం నేర్చుకో’… పడుకో… రాత్రయిందికదా.
గాలికోసం బయటకు వచ్చిన నాకు వారి మాటలు వినిపించాయి… మా నాన్న గారి భయం అర్థం లేనిదిగా నాకు కనిపించింది.
మనసులోనే నవ్వుకున్నాను.
జ    జ    జ
గాలి ముఖాన్ని చల్లగా తాకుతున్నది.. నీటి గాలి చల్లదనం నా మనసులోకి అలజడని తగ్గిస్తున్నది.
నాన్న ఆలోచన ఎంత సమంజసం.. ఆనాటి తరం వారిది ఎంతటి విజన్‌.. వారందరిని వృద్ధాశ్రమాలకు చేర్చకుండా.. శ్రద్ధగా… చాదస్తంగా భావించకుండా.. వారు చెప్పిన జీవన సత్యాలను ఈనాటి యువతరం వినగలిగితే ఇంతటి అభద్రతభావం.. ఆత్మన్యూనతా భావాలు కలగవేమో అనిపిస్తుంది.
ఈ ఆలోచనలతోనే.. చివరిసారిగా.. నాన్నను కలుద్దామనే ఈ ప్రయాణం… చివరి సారిగా తల్లిదండ్రులను కలుసుకొని.. వారితో గడపాలనుకోవడం తప్పుకాదు కదా……
ఒక నిర్ణయం జీవిత గమనాన్ని మార్చవచ్చు.. లేదా.. ఏమార్చవచ్చు.
జ    జ    జ
టక్‌..టక్‌..టక్‌
మూడు గంటల సమయంలో..తలుపు తడుతున్నదెవరా అని..ఓపికగా లేచి..తలుపు తీసిన ముసలాయనకు ఎదురుగా దర్శనమిచ్చింది..ఆయన కొడుకునైన నేనే.
నాన్న ముఖంలోకి చూసాను. ఎటువంటి భావాలు లేవు. నాకు ఆశ్చర్యం వేసింది..బహుశా..స్థితప్రజ్ఞత అంటే ఇదేనేమో…..
నాన్న గుమ్మం దగ్గరే నిలబడ్డాడు. కోడలు రాలేదా..అని అడగలేదు. ఆయన చూపుల్లోని భావం మాత్రం అదే..ఏం చెప్పాలో తెలియక లోపలికి నడిచాను. నావెనుకే..నాన్న.
ఇంతలో అమ్మ లేచింది. ”ఏంట్రా ఈ సమయంలో పద ఒక గంట కన్నుమూయి.. ఈలోగా నేను వేన్నీళ్లు పెడతాను. బయట వాతావరణం చల్లగా ఉంది కదా..వర్షానికి ఎక్కడా తడవలేదు కదా.”
నేను గదిలోకి నడిచాను. అమ్మ నాన్న మౌనంగా ఉండటం నేను గమనించాను. వారి మనసులు, ఆలోచనలు..లోతైనవి..నా వంటి అర్భకులకు అర్థం కావు.
నాకు నిద్ర రావటం లేదు.
నాన్న మెల్లగా వచ్చి..నా ప్రక్కన కూర్చున్నారు. నా కాలు మీద చేయివేసారు. ఆ స్పర్శలో ఎన్నెన్నో ప్రశ్నలు.. ఓదార్పు.. నేనున్నాను కదా అనే భరోసా…..
నాకు దుఃఖం ఆగలేదు. బరస్టయాను.
ఎంతసేపు ఏడ్చానో తెలియదు.. మనసు తేలిక పడింది
జ    జ    జ
తెల్లవారింది. పల్లెలో ఉదయం ఎంత అందంగా ఉంటుందో తొలిసారిగా తెలుసుకున్నాను. కాళ్ల క్రింద రాత్రి పడిన చినుకులు..గడ్డిమీద నించి నా పాదాలను చల్లబరుస్తూ తమ అస్తిత్వాన్ని కోల్పో తున్నాయి. త్యాగం ఇచ్చే తృప్తి గొప్పదనుకుంటాను.
ఏంటో అర్థం లేని ఆలోచనలు.. నిన్నటి.. ఈ రోజు ఆలోచనల్లో మార్పు నాకు స్పష్టంగా తెలుస్తునే ఉంది.
కళ్లం దగ్గరకు చేరుకున్నాం. నాన్న మోటారు ఆన్‌ చేసారు.. పాతాళగంగ.. భూమిని ఎప్పుడు స్పృశిస్తానా అన్నంత వేగంగా ఉబికి వచ్చింది.
 ఎటువంటి ‘కాంట్రడికన్స్‌’ లేని నాన్న జీవితం..నాకు దొరుకుతుందా..?
 తనివితీరా స్నానం చేసాం. నాన్న నాకు సబ్బురుద్దాడు..పట్టణవాసపు నవనాగరికత ఇచ్చే కృత్రిమత్వ విలువల నటనతో నిండిన నాకు అదో కృతకంగా కనిపించినా..ఆయన స్పర్శలోని హాయి నా మనసుకు తెలుస్తూనే ఉంది.
స్నానాలు ముగించుకొని..గడ్డిలో కూలబడ్డాం.
”ఇప్పుడు చెప్పు..నీకు..కోడలికి మధ్య ఏం జరిగింది”..చాలా కూల్‌గా ఆయనా ప్రశ్న అడగటం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.
నేను చెప్పడం ప్రారంభించాను.
జ    జ    జ
ప్రస్తుతం ఆర్థికమాంద్యం..నా ఉద్యోగాన్ని ఊడగొట్టింది..తన ఉద్యోగం మాత్రం ఉంది..నేనిప్పుడు సంపాదనలేని మనిషిని..పిల్లలు వద్దనుకున్నాం..చిన్ని ప్లాటు కొన్నాం..ఆధునిక నాగరికతకు చిహ్నాలైన వస్తువులన్ని మా ఇంట్లో ఉన్నాయి. నాలుగు పేపర్లు..మూడు బిజినెస్‌ మాగజైన్స్‌ వస్తాయి. అవన్నీ అవసరమే..ఇద్దరు పనిమనుషులు.. చాకలి..మంగలి..ఇన్ని చేసినా..ఇంకా ఇరవై, పాతికవేలు మిగిలేది. నా ఉద్యోగం పోవడం ఆమె జీతం సగానికి సగం తగ్గడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాం..జీవితంలో ప్రేమ పెళ్లి చేసుకొని తప్పు చేసానేమోనని వాదించు కొన్నాం..చివరకు కొట్టుకున్నాం..తెల్లారి లేచిన దగ్గర నుంచి ఆమె సణుగుడు, ధాష్టికం భరించడం నావల్ల కాలేదు. నెల రోజులుగా నన్నొక పురుగుగా ఆమె ట్రీట్‌ చేయడం నేను టోలరేట్‌ చేయలేక పోతున్నాను. ఇంత జరిగాక బ్రతకడం అవసరమంటావా నాన్న..!?.. మనిషి లేకపోతే ఆ వెలితేమిటో తెలుస్తుంది.. అందుకని..మరి చెప్పలేక పోయాను.
”చచ్చిపోదామనుకుంటున్నావు”..నాన్న ప్రశ్న.
”సరే చచ్చి ఏం సాధిస్తావు..నీ భార్య నీకోసం పదిరోజులు కాకపోతే మరో పదిరోజులు ప్రేమించుకున్నారు కనుక ఏడుస్తుంది. తరువాత మరొకడ్ని పెళ్లి చేసుకుంటుంది..పిల్లల్ని కంటుంది. జీవితం ముఖ్యం కదా.”
నాకు ఉక్రోషం తన్నుకొచ్చింది.. ఏదో అందామనుకున్నాను. అనలేక పోయాను. నిజం కూడా అంతేకదా.
”ఏం కోపమొచ్చిందా..జీవితమంటే సుఖాలు కాదు..కష్టాలు కూడా. ఒక్క విషయం గమనించు..నీవు చెప్పిన పది మాటల్లో ఎనిమిది మాటలు నీ భార్యను నిందించేవే..ఆమె వైపు నుంచి ఆలోచించ కూడదు..ఒక్క క్షణం నీకు జ్వరం వస్తే సేవలు చేయలేదా..నీవు అన్నీ మంచంపైనే చేస్తే వాటిని ఎత్తలేదా. పగలు నీతో సమానంగా ఆఫీసులో పనిచేసినా..ఒక చేత్తో వండిపెడుతూనే మరోవైపు రాత్రిపూట నీకు సుఖాన్ని ఇవ్వలేదా.. పిల్లలు వద్దనుకున్నారు. గర్భం రాకుండా మాత్రలు నీవు వాడావా..ఆమె వాడిందా? కాస్త మేల్‌ ఇగో ప్రక్కన పెట్టి ఆలోచించు నా మాటలు కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నాయి కదా. నేను తొలుత రైతును. ఆ తరువాత టీచర్‌ను. సన్నివేశానికి తగిన విధంగా పాఠాలు చెప్పలేని ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయునిగా విఫలమయినాడనే నా ఉద్దేశ్యం. ఆ విషయం ప్రక్కన పెట్టి ఆలోచించు.. అలాగని.. నీవామెకు ఏమి చేయలేదని నేననను.. కాని..నీకన్నా ఆమె ఎక్కువ చేసిందని మాత్రం చెప్పగలను.”
మా మధ్య కొద్ది క్షణాల మౌనం.
”మన వివాహ వ్యవస్థ గొప్పతనం గురించి చెప్పదలచుకోలేదుకాని, భార్యల గొప్పతనం గురించి మాత్రం ఎంతసేపైనా చెప్పగలను. కాని ఇది సమయం కాదు. ప్రేమంటే ఏమిటో తెలుసుకోలేని తరం మీది. ప్రేమ పెళ్లి చేసుకొని సంవత్సరం తిరక్కుండానే విడిపోవడం ఓ ఫేషన్‌గా మారిన వర్తమానంలో. ఇందుకు ప్రధాన నేపధ్య అంశం డబ్బు అంటాను. నీవు కాదనగలవా..నీ దగ్గర డబ్బు లేదని..అదే సంపాదన లేదని ఆమె నిన్ను తూల నాడిందని అన్నావు. సరే ఈ మడిచెక్క అమ్మేద్దాం. ఆ డబ్బుతో వ్యాపారం చేయి.. సంపాదించు, తిరిగి పూర్వ వైభవం తెచ్చుకో.. కాని చావాలనుకోవడం మాత్రం తప్పు. ఈనాడున్న పరిస్థితులు రేపుంటాయా? చక్కబడవా..నీకు మరో ఉద్యోగం దొరకదా.. చీకటి తరువాత వెలుతురు రాదా..రైతులను చూడు, వర్షాధార భూములున్న రైతును గమనించు..సంసారం. ఆర్థిక పరిస్థితులు.. బంధువులు..పెళ్లిలు.. పురుళ్లు.. ఆ సంవత్సరం పండకపోతే..మరో సంవత్సరం కోసం ఎదురు చూపు.. పెరుగుతున్న అప్పులు.. వడ్డీలు..జీవన యానం అంటే అదే..ఒక సంవత్సరం అద్భుతమైన పంట పండుతుంది. ఖుషీగా ఉంటాడు రైతు. ఆశావహదృక్పథం నేర్చుకో..ముందు ‘నీవు..నేను’ అనే భావం వదలిపెట్టు..నేను నా భార్య ఒక్కటే అనే భావనకు రా..ఆమెకు చేదోడు వాదోడుగా ఉండు, అప్పుడు గమనించు పరిస్థితిలో మార్పు వచ్చింది లేనిది..ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఇంత చెప్పాక కూడా నీ ఆలోచనలు చావు చుట్టూ భ్రమిస్తే మాత్రం నేనేమి చేయలేను. పద వెళదాం..అమ్మ గాభరా పడుతూ ఉంటుంది.”
ఇద్దరం మౌనంగానే ఇంటికి చేరుకున్నాం.
”చూడరా ఈ ఫోన్‌ ఇందాకటి నుంచి ఒకటే అరుస్తున్నది. ఎలా ఆన్‌ చేయాలో అర్థంకాదు.” అని స్నానంకు వెళుతూ సెల్‌ఫోన్‌ ఎందుకని ఇంటివద్ద వదిలేసిన ఫోన్‌ను అందించింది అమ్మ.
పది ‘మిస్‌’డు కాల్స్‌..నా భార్య దగ్గర నుంచి..ఆన్‌ చేసాను. ”ఎక్కడున్నా రండి..నిన్న రాత్రనగా చెప్పకుండా వెళ్లిపోయారు. ఎక్కడున్నారో ఫోన్‌ అయినా చెయ్యొచ్చు కదా..ఒంటరిగా..నాకేదో భయంగా ఉంది వచ్చేయండి”..ఆమె గొంతులో ఆందోళన..కాళ్లు తడబడ్డాయి.. తడిగా ఉండటం వలన నా చేయిపట్టుకుంది అమ్మ.
నిజమే నేను పడిపోకుండా నిలబెట్టింది అమ్మ, నాకో అస్థిత్వాన్నిచ్చింది.. నా భార్య.
నాన్న ముఖంలో ఎటువంటి భావాలు లేవు. ఇద్దరికి మనసులోనే నమస్కరించి బయటకు వచ్చాను. బాగు పట్టుకొని.
సూర్యుడి వెలుగు కిరణాలు ఓ క్రొత్త రోజుకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉన్నాయి.
ఆ వెలుగువైపే ఇకమీదట నా ప్రయాణం.
నాకు ‘దొరికిన దానికోసం’ నేను ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో