అమృతోపమాన అక్షర ఉరవడి కొ.కు ఒరవడి

డా|| కె.బి. లక్ష్మి

సంస్కృతి, సంప్రదాయాల చట్రంలో అనేక శషభిషలతో బతుకుతున్న సమాజాన్ని చూసి చూపుడు వేలు చూపిస్తూనే, మనిషి మనిషిగా బతకడానికి ఒక ‘అపూర్వ’ రచనా ప్రపంచాన్ని సృష్టించి దిశానిర్దేశం చేసిన మార్గదర్శి కొడవటిగంటి కుటుంబరావు.
 జీవనగమనంలో రాద్ధాంతాలు, సిద్ధాంతాలు, ఆటుపోట్లు ఎన్ని వున్నా ప్రజలపక్షం వహించిన మేధావి మిత్రుడుగా కొ.కుని పరిచయం చేస్తుంది అతని సాహిత్యం. ‘ఈయనేమైనా సకలకళావల్లభుడా? సర్వజ్ఞానా?’ అని అసహనశీలురు ప్రశ్నిస్తే! ‘అవునేమో! ఆలోచించండి, లేకపోతే ఇన్ని ప్రక్రియల్లో (కవిత్వం మినహా ఇన్ని విషయాల గురించి, ఇంత నిశితంగా, విశ్లేషణాత్మకంగా, సూటిగా, సరళసుందరంగా, సుబోధకంగా, నిర్భీతిగా, నిష్పక్షపాతంగా ఎలా రాయగలరు?’ అని రిపార్టీ ఇస్తారు కొ.కు. వ్యక్తిత్వ సాహిత్యాలను అర్థం చేసుకున్నవారు.
 ”మా నాన్న రచనల ప్రత్యేకత సూటిదనం, స్పష్టత, క్లుప్తత, తను చెప్పే విషయం ఆలోచింపజెయ్యాలనేది ఆయన అభిమతం. రచనల్లోని ఈ పద్ధతినే ఆయన ఇంట్లో కూడా పాటించేవారు – రాయటం మా నాన్నకి ‘పని’ కాబట్టి హాబీలు వేరే వుండేవి. మా నాన్నకి తోటపని, ఫొటోగ్రఫీ, సంగీతం హాబీలు… కొత్త విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆయన ప్రత్యేకత. తెలుసుకున్న దాన్ని అర్థం చేసుకుని విశ్లేషించుకునేవారు. నలుగురితో పంచుకోవాలనుకునేవారు…” (కొ.కు. కుమార్తె శ్రీమతి శాంతసుందరి – అక్టోబర్‌ 2009, ‘చతుర’ మాసపత్రిక)
 ”ఆయన జీవితకాలంలో గొప్ప వాఙ్మయాన్ని సృష్టించాడు. అదొక మహాసాగరం. అందులో వందలాది కథలు, గల్పికలు, విమర్శలూ వున్నాయి.” ఒకసారి గుడిపాటి వెంకటాచలం గారు అడిగారుట ”ఏమిటి నువ్వు అన్ని విషయాల మీద రాస్తావు?” అని. ”నాన్నకు జీవితం మీద ఆర్తి. జీవితంలో అన్ని విషయాలూ ఆయనకు కథావస్తువులే!… ఆయన నిలువెత్తు నిజం. ఆయన ఒక ఎన్‌సైక్లోపీడియా లాంటివాడు. ఆయన పుస్తకాల్లో అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. నాన్న అన్ని విధాలా మార్గదర్శే. ఆయన మనందరకూ గురువు.” (కొ.కు. పెద్ద కుమారుడు కొడవటిగంటి రామచంద్రరావు – అక్టోబర్‌ 2009, ‘రచన’ మాసపత్రిక)
 ”ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే! ఆయన ఎలా అంత రాశారా? అని. కొ.కు.కున్న నిర్దిష్టమైన అభిప్రాయాల గురించి మొదట్లో నాకు తెలీదు. కొ.కు.కు కచ్చితమైన అభిప్రాయాలున్నా యితర్ల మీద రుద్దేవారు కాదు. భార్యనైనా నామీదా రుద్దేవారు కాదు. ఉద్దేశ్యాలు చెప్పేవారంతే. చాలా అర్థవంతంగా, సరదాగా, కొంచెం ఒడుదుడుకులతో, కొన్ని కష్టసుఖాలతో మా జీవితం గడిచిపోయింది. నేను కుటుంబరావు పాఠకురాలిని, అభిమానిని, ఆ తర్వాతే భార్యనయ్యాను. దానివల్ల నా చిన్నప్పటి అభిమాన రచయిత ఎలా రాస్త్తారో, ఎందుకు రాస్తారో దగ్గరగా తెలుసుకోగలిగాను. కొ.కు. రచనలు తృప్తిని, ఆనందాన్ని, మనోబలాన్ని ఇస్తున్నాయి.” (కొ.కు. భార్య శ్రీమతి వరూధిని – జనవరి, ఫిబ్రవరి 2009, ‘అరుణతార’ సాహిత్య సాంస్కృతిక మాసపత్రిక)
 కొ.కు. 23వ ఏట పుట్టిన రామచంద్రరావు, 38వ ఏట పుట్టిన శాంతసుందరి, ఆయన అర్ధాంగి శ్రీమతి వరూధిని ఆయనకు అత్యంత ఆత్మీయ కుటుంబ సభ్యులు. ఎవరికివారు స్వతంత్ర వ్యక్తిత్వం గల ప్రజ్ఞావంతులు. ఈ ముగ్గురి అంతరంగ భావనల అక్షరరూపం కొ.కు. వ్యక్తిత్వ సాహిత్య స్వరూపరేఖాచిత్రాన్ని కళ్లముందు నిలబెట్టింది.
 ఇది కొ.కు. శతజయంతి (28-10-1909) సంవత్సరం. ఆయన కీర్తిశేషుడై 29 సంవత్సరాలయింది. ఈనాటికీ విస్తృత, విశాల దృక్పథంతో వున్న కొ.కు. రచనలు ఎంతో తాజాగా అనిపిస్తాయి.  హితోపదేశకునిలా బోధ చేయకుండానే నిష్పక్ష వ్యాఖ్య వ్యంగ్య సహిత సరళత, సూటిదనం, స్పష్టత, చమత్కారయుక్తమైన భాష, శైలి కొ.కు. రచనలకు అమృతత్వం ప్రసాదించాయి. కొ.కు. శతజయంతి సందర్భంగా ఆయన సంస్కృతి వ్యాసాలను మరోసారి మననం చేసుకోవడం, పరిచయం చేయడం ఇప్పుడీ వ్యాసరచనకు ప్రేరణ.
కొ.కు. సంస్కృతి వ్యాసాల గురించి మీతో ముచ్చటించడానికి నేను ఎన్నుకున్న పుస్తకం కొడవటిగంటి కుటుంబరావు వ్యాసప్రపంచం-3, సంస్కృతివ్యాసాలు 1999 అక్టోబర్‌లో విరసం ప్రచురణ. ఈ సంకలనానికి కూర్పు కృష్ణాబాయి, ప్రసాదు. ఇంచుమించు 1935 నుండి 1980 వరకు అవిశ్రాంతంగా కొ.కు. రాసిన వ్యాసాల్లోంచి 133 వ్యాసాలను తీసుకుని ”భూమిక, కళలు, సంగీతం, నాటకం, విద్యావ్యవస్థ, హేతువాదం, పత్రికారంగం, సామాజిక విలువలు” అన్న 8 శీర్షికల్లో పొందుపర్చారు.
 ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నప్పటికే ‘పాతిక రాగాల’ గురించిన సంగీత జ్ఞానం కొ.కుది. 1924లో ‘బాలగంధర్వ’ పేరు విని 1925లో అనుకోకుండా పెత్తల్లి గారింట్లోని గ్రామఫోన్‌ రికార్డులో అతని గానం విని ”అది మోగిన మూడు నిమిషాలలో నాకు కలిగిన భావావేశం వర్ణనాతీతం. ఇది సంగీతమయితే మిగిలినది సంగీతమే కాదు…” అంటూ బాలగంధర్వ సంగీతప్రభావం ఎవరిమీద, ఏఏ రంగాల్లో ఎలా వుందో ప్రస్తావిస్తూ బాలగంధర్వ మీద 1967లో భారతిలో రాశాడు కొ.కు. తెలుగులో అలాంటి వ్యాసం మళ్లీ రాలేదు.
 ఒక అంశం తీసుకుంటే దాని పూర్వాపరాలను కూలంకషంగా చర్చించనిదే, విశ్లేషించి వ్యంగ్యాస్త్రాలు సంధించనిదే వదలడు కొ.కు. పత్రికారంగం మీద అతని 18 వ్యాసాలూ అసమాన తులనాత్మక, సునిశిత పరిశీలనకు ప్రతీకలు. వాటిలో కొ.కు. స్వీయానుభవాల్లా గోచరించే కొన్నింటితో ఇప్పటి మీడియా పర్సన్స్‌కూ ఐడెంటిటీ అవక తప్పదు. మరీ ముఖ్యంగా ‘ఎడిటరనేవాడు’, ‘పత్రికలు నడపడం’, ‘పత్రికలూ, ప్రజలూ’ చదివి తీరాల్సిందే.
 1909 పుట్టిన కొ.కు. 15 ఏళ్ల వయసులో స్కూల్‌ ఫైనల్‌ అవగానే 11 ఏళ్ల పద్మావతితో వివాహం చేశారు పెద్దలు. ఆనాటి నుంచీ జీవితాన్ని, సమాజాన్ని, కుటుంబ సంస్కృతిని చాలా సన్నిహితంగా చూసిన కొ.కు. స్వతస్సిద్ధమైన వివేచనతో మానవ జీవన సరళిని ఎనలైజ్‌ చేయడం ప్రారంభించాడనిపిస్తుంది. తొలినాళ్లలోని అతని రచనలు అధ్యయనం చేసినపుడు కొ.కు. తీసుకున్న ప్రక్రియ ఏదైనా ఎంచుకున్న వస్తువు మాత్రం వందశాతం వాస్తవాధీనం. అందుకే కథ, నవల, వ్యాసం ఏదైనా కొ.కు. మాటల పదును, సూటిదనం, నిలదీసే నేర్పు, ప్రశ్నించే పాటవం, విషయాన్ని విశదపరుస్తూ పఠనాసక్తిని పెంచుతాయి.
 ఆడపిల్లల జీవితాల్లోని అలవికాని వ్యధని కొ.కు. అంత ఆర్తితో అర్థం చేసుకున్న రచయిత అరుదు. కొ.కు. వ్యాసాలు కథలుగా అనిపిస్తాయి, ముఖ్యంగా సంస్కృతీ వ్యాసాలు. స్నేహితుల్లా పలకరిస్తాయి. బొమ్మల పెళ్లిళ్లలా చిన్నతనంలో పెళ్లిళ్లు చేయడం, వితంతువై ఆడపిల్ల ఇంటికొస్తే సొంత తల్లిదండ్రుల నిర్దాక్షిణ్య ధోరణిని, నిష్పూచిత్వాన్ని ”పదేళ్ల పిల్ల వితంతువైతే పదేళ్ల పిల్లకు అనవసరంగా పెళ్లి చేసినతను ఆ పిల్ల భావి కష్టసుఖాలకు పూచీ పడకపోయినప్పటికీ ఆ అభాగిని తిరిగి పెళ్లాడితే ఆ వివాహాన్ని ఖండిస్తాడు. ఇందులో సంఘం చూపుతున్న ఇంటలెక్చువాలిటీ ఏమైనా ఉందా అంటే అదేమీ లేదు.” అని సమాజ బాధ్యతా రాహిత్యాన్ని ఎండగట్టాడు 1935 నాటి వ్యాసంలో.
 కొ.కు. రేడియో తరచూ వినేవాడనడానికి ‘రేడియో వింటున్న కొ.కు.’ ఫోటో పత్రికల్లో రావడమే నిదర్శనం. ఆ కార్యక్రమాలు వినేటపుడు కూడా అతని ఆలోచనలు ఎంత భిన్నంగా వుంటాయో చదువుతుంటే ఆశ్చర్యమనిపిస్తుంది. ”పాశ్చాత్యుల ఏలుబడిలో పరిస్థితులు తారుమారయాక సంస్కృతి అన్నది ఛిన్నాభిన్నమై ఒకరి భాష ఒకరిది కాకుండా, ఒకరి సంస్కృతి ఇంకొకరికి అందకుండా పోవడం జరిగింది… ఈ పరిస్థితిని సరిచెయ్యకలిగిన ఆధునిక పరికరాలు నిస్సందేహంగా సినిమాలు, రేడియోలు” అని చెబుతూ ”స్త్రీల కార్యక్రమాలు స్త్రీలకు నిజంగా వుపకరించేవిగా వుండడం లేదు. స్త్రీల మానసిక దృక్పథాన్ని పెంచలేని కార్యక్రమాలు నిరుపయోగం. ఈ కార్యక్రమాలు శ్రద్ధగా వినే స్త్రీలకూ, వినని స్త్రీలకూ ప్రవర్తనలో, ప్రపంచజ్ఞానంలో తేడా కనిపించినపుడే సఫలమైనట్లు” అని 1962లోనే ఆ కార్యక్రమాల తీరుతెన్నుల్ని విమర్శించాడు కొ.కు. చాలా పత్రికల రెగ్యులర్‌ కాలమ్స్‌లో ‘జోస్యం’ చెప్పే ‘వారఫలాలు’ ఒకటి. వీటి గురించి కొ.కు. ఎంత తమాషాగా చెప్తాడంటే దైవజ్ఞుడు 2, 3 వేల ఏళ్ల క్రితం అయితే నక్షత్ర ఫలితాలు ఎలా రాస్తాడు? అని చెబుతూ అదే జమీందారీయుగంలో అయితే ”స్త్రీల మూలక కలహంలో శిరస్సుకు అపాయం తప్పిపోవచ్చు. మీ స్త్రీలలో సఖ్యత ఈ వారం బహుతక్కువగా వుంటుంది. పాడ్యమి, విదియ, తదియా ఏకాంతశయనప్రాప్తి” అని 1946లో రాశాడు. కొ.కు. దేశంలో సామ్యవాదం వస్తే వారఫలాలు అందరికీ సమానంగా వుంటాయని ఎలా రాస్తారో చెప్పాడు.
‘సాంఘిక సమస్యలు, వాటి పరిష్కారాలు’ వ్యాసంలో ప్రతి చిన్న విషయం సమస్య ఎలా అవుతుందో చెబుతూ స్త్రీల పరంగా చెప్పినవి కొన్ని ఉదహరిస్తాను. ”ఇల్లాళ్లు గృహకృత్యాలు నిర్వహించాలి. ఇంటిల్లిపాదికీ కాచి పొయ్యాలి. బ్రిటిష్‌ హయాంలో నూరింట పదిమంది అక్షరాస్యులుంటే, పదిమందిలో ఒకటి మాత్రమే స్త్రీ అయి వుండేది. చదువుతో బాటు విద్యాలయాలు, ఉద్యోగాల సమస్యలుత్పన్నం కావచ్చు. చచ్చిన భర్తలతో బతికున్న భార్యను తగలెయ్యడం, మారుతున్న సమాజంలో కూడా కూతుళ్లను అల్లుళ్లతో కాలిపోనిచ్చిన తల్లిదండ్రులు రాక్షసులు కారు. సతీ సహగమనం నిషేధిస్తే ధర్మచ్యుతి జరుగుతుందని భయం.” అని చెప్తూ వితంతువుల్ని చాకిరీయంత్రాలుగా మార్చిన తీరుని ఎండగట్టాడు కొ.కు.
 ప్రభుత్వం, ప్రభుత్వేతరులు ప్రముఖులకు ఇచ్చే ‘బిరుదనామాల’ ప్రస్తావనతో నిజానికి బిరుదులకు ముందే, బిరుదనామాల కంటే అసలు పేరుతోనే వారు గొప్పవారై వుంటారు. అయినా బిరుదుల్ని తగిలించుకోవడంలోని అనవసర సరదాని ఆక్షేపిస్తూ కొ.కు. ”చిత్తూరు నాగయ్య, భానుమతీ రామకృష్ణ లాటి పేర్లముందు పద్మశ్రీ తేలిపోతుంది… రాజ్‌కుమార్‌, మీనాకుమారి, సావిత్రి, బాపు, శరత్‌, సత్యజిత్‌రాయ్‌, ఆరుద్ర, టాగూర్‌, ఘంటసాల ఇటువంటివారి పేర్లముందు ఏమీ చేర్చడానికి వీల్లేదు. వీటిని అవమానించాలంటే తప్ప” అని అనేకం చెప్పుకొచ్చారు.
 కన్నతల్లి కొడుకుని శిక్షించి అలా కొట్టినందుకు ”అంతరాత్మలో ఎంత బాధపడుతుందో, గుండెలో ఎంతలా వెక్కివెక్కి ఏడుస్తుందో తెలుసా? నువ్వు చదువులేని ఆడదానివై వుండి, సంఘంలో అమలులో వున్న ఆచారాలు హేయమైనవనే జ్ఞానం నీలో వుండి, వాటిని ప్రతిఘటించే సంస్కారం లేకపోతే ఏంచేస్తావు? నీ కొడుకుని కొట్టకపోతే పిల్లల్ని పెంచే పద్ధతి చాతకాదనీ, పిల్లాణ్ణి పాడుచేస్తున్నావని నలుగురూ అంటారనే అభిమానం ఉంటే ఏం చేస్తావు? నీ జీవితం మీద నీకు కాస్తయినా అధికారం లేదనుకో, నీలో కలలు కనే శక్తి కూడా ఇంకిపోయిందనుకో… ఏం చేస్తావో చెప్పగలవా?… నీకు తెలీదు, నేను చెబుతా పట్టు…” స్త్రీ సమస్య మీద వచ్చిన పదునైన వ్యాసం.
ఆడవాళ్ల మీద జోకులు వేసేవారిని, కార్టూనిస్టులను కూడా ఆయన వదల్లేదు.
అన్ని వ్యాసాలు ఒక ఎత్తు. ‘ప్రజా చిత్రకారిణి కథౌ కోల్విట్జ్‌’ గురించి రాసిన వ్యాసం ఒక ఎత్తు. మాతృత్వం, యుద్ధ బీభత్సం అద్భుతంగా చిత్రించిన జర్మన్‌ కళాతపస్విని తాతగారు, తండ్రి, భర్త కూడా ఎంతటి స్ఫూర్తిప్రదాతలో, స్వయంగా ఆమె మనసా వాచా కర్మణా ఎంతటి ఉన్నతురాలో చెబుతూ ఆమె జీవనరేఖలకు అక్షరాలతో ప్రాణం పోశారు కొ.కు.
 కులం, మతం, వర్ణం, ఆడమగ, దేశం, విదేశం, ప్రాంతీయం అన్నింటినీ కలుపుకుపోతూ 418 పేజీల్లో కొ.కు. సృష్టించిన వ్యాస ప్రపంచంలో అతడందించిన సంస్కృతి సమాచారం అక్షరలక్షలు చేస్తుంది. ఎంత చదివినా తనివి తీరదు. పదేపదే చదవాలనిపించే అమోఘమైన పఠనీయత, క్లిష్ట విషయాల్ని సరళీకృతం చేసి అతనందించిన శైలి, కథనం, భాష అతనికే స్వంతం.
 కొ.కుని చదవక ముందేమో గాని చదివిన తర్వాత అందరికీ అర్థమయ్యే విషయం కొ.కుని కాపీ కొట్టిన బోల్డన్ని కాపీక్యాట్లు ఎక్‌నాలెడ్జ్‌ కూడా చేయకుండా ఒరిజినాలిటీ ముసుగువేసుకుని చెలామణీ అయిపోతున్నారని.
 71 సంవత్సరాలు జీవించి, ఊహ తెలిసినప్పట్నించీ రచనలు చేస్తున్న కొ.కు. మానవ మనుగడలోని అసంఖ్యాక పార్శ్వాలను లోతుగా స్పృశించాడు. ఒక డైరీ రిపోర్ట్‌లా ప్రతిరోజూ రాశాడు. అందుకే ఇన్ని వేల పేజీల సాహిత్యాన్ని సృష్టించగలిగాడు.
 సంస్కృతి గురించి 1972 అక్టోబర్‌లో ”సహజంగా మనం ఇప్పుడు చూస్తున్నది కుక్కలదొడ్డి సంస్కృతి, పంచకూళ్ల కషాయం. మన వేషభాషలూ కొనుగోలు వస్తువులు, సినిమాలు, సాహిత్యం, ఆలోచనావిధానాలూ అన్నీ నయా వలస సంస్కృతీ ప్రభావితాలు. ఇక్కడ వాడిన ‘మన’ అన్న మాట నూటికి తొంభైమంది భారతీయులకు వర్తించదు…” అన్న కొ.కుకి శతకోటి దండాలు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.