యావజ్జీవ స్నేహపు నిర్వచనం కొ.కు. ”సైరంధి” కథ

 రేణుక అయోల
కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యంతో పరిచయం కానివారు తెలుగులో బహుశా ఉండరు. ఇరవయ్యో శతాబ్ది తెలుగు సాహిత్యాన్ని అభిమానించిన వాళ్ళల్లో వేళ్ళమీద లెఖ్ఖపెట్టుకోవచ్చు.
సాహిత్యాన్ని అభిమానించి గుండెలకి హత్తుకున్న కథల పుస్తకాల్లో కొ.కు. గారి రచనలు కూడా వున్నాయని నిర్వివాదంగా చెప్పుకోవచ్చు. సాహిత్యం కాలంతో పాటూ మార్పులు చెందుతూ కథావస్తువు మారిపోతుందంటారు. కాని కొ.కు. గారి కథలు ఎప్పుడు చదివినా కొత్తగానే వుంటాయి.
కొ.కు. గారి కథలు దాదాపుగా అన్నీ నాలుగు అయిదు పేజీలకన్నా మించి ఉండవు. వాటిల్లో గాఢత, స్పష్టత కథకుండాల్సిన సమగ్రత మాత్రం ఉంటుంది… ఎప్పుడూ కథలకి మూలం మధ్యతరగతి మనుషులేనా అంటే సమాధానం చెప్పగలమా? మన చుట్టూ ఉన్న మధ్యతరగతి మనుషులు. వాళ్ళ ఆలోచనలు, సంఘర్షణలు, తన కథల్లో ప్రస్తావించడం వల్ల సమాజంతో గల వాస్తవ రూపాన్ని ఏ విధంగా తెలియబరిస్తే బాగుంటుందో, వాటినే వివరించిన కొ.కు. గారి కథలన్నీ మన మనసుకి దగ్గరయ్యాయి. అలాంటి వాటిల్లో నాకు నచ్చినది నన్ను బాగా కదిలించిన కథ ”సైరంధ్రి”. ఆ ”సైరంధ్రి” కథ గురించి నాకు కలిగిన స్పందనను వివరిస్తాను.
జ    జ    జ
”సైరంధ్రి” కథలో జానకి పాత్ర ద్వారా చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు చెప్పించారనిపిస్తుంది. కథ నడిచే విధానం ఎంత గొప్పగా వుంటుందంటే, కథలో ఎక్కడా పాత్రల చేత అనవసరపు మాటలు, సెంటిమెంట్లు కనిపించకుండా నడపగల సత్తా కొ.కు. గారికి వుందనిపిస్తుంది.
జానకికి అతను కలసినప్పుడు, ఎప్పుడో పెళ్ళి కాకముందు, ఒక పెళ్ళిలో చూసి మళ్ళీ, ఆ పెళ్ళి గ్రూపు ఫొటోలో చూసి అందరిలాగే వుంది. ఏ ప్రత్యేకత ఏమీలేదు. అనుకొన్న మనిషి – మళ్ళీ ఒక సందర్భంలో జానకి ఎదురైనప్పుడు ”జానకి ఇనీషియేట్‌” వల్లనే జానకికి సన్నిహితుడవుతాడు. కాని ఇప్పుడు అంటే జానకిని కలసినప్పుడు ఇష్టపడతాడు. ఎందుకంటే ఆమెలో వున్న ఆకర్షణ. ఆకర్షణకి బలమైన కారణం నిర్మలమైన ఆత్మ అంటారు… నిర్మలంగా ఆత్మలుంటే ముఖాలు వికసించిన పువ్వుల్లా వుంటాయని, చాలామంది ముఖాలు ఎందుకో జైలునీడలు కనిపిస్తుందంటూ వర్ణించడంతో ఎంతో క్లుప్తత. (జానకిని అంతకంటే వర్ణించడం అవసరం లేదేమోననిపిస్తుంది.)
సినిమాహాలు దగ్గర పరిచయంతోనే ఏదో తెలియని ఇష్టం, ఆకర్షణతో జానకికి దగ్గరవుతాడు. జానకి ఒంటరిది, భర్తని ఒదిలేసింది – కాదు భర్త ఆమె ఒదిలేసేలా చేశాడు. ”భారత నారీతత్వం స్పెషల్‌ రబ్బరులాంటిది. ఎంత లాగినా తిరిగి యథాస్థితికి వచ్చి ఏమి జరగనట్లు మసలుతుంది దాన్ని మనవాళ్ళు ఆకాశానికెత్తారు. ఇంకా ఎత్తుతున్నారు – (ఇప్పటికీ ఇంకా ఇలాంటి స్థితిలోనే వున్నాం, ఏమాత్రం సందేహం లేకుండా) అంటున్నప్పుడు, అప్పుడు స్త్రీలపట్ల సమాజ వైఖరి మీద ఓ చురక కనిపిస్తుంది.
 కథల్లో పాత్రల మీద కంటే పాత్రల ద్వారా నడిపించే సంభాషణ నన్ను చాలా ఆకర్షిస్తుంది, ఎన్నిసార్లు కొ.కు. గారి కథలు చదివినా, జానకిని అతను కలసిన కొద్దిపాటి సమయంలోనే ‘అండీ’లు మానేసి, నువ్వులోకి వచ్చారని చెబుతూ… ”అండీకి నువ్వుకి మధ్య ‘నో మాన్స్‌లాండ్‌’ ఉంటుంది” అంటారు. చమత్కారంగా.
 ముఖ్యంగా స్త్రీ పురుష స్నేహ సంబంధాలు, అవి ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాయి ఏ వయసులో వారికైనా!
 అతను జానకిని కలసినప్పుడు ఇలా అనుకుంటాడు. ”జానకి స్త్రీ తత్వాన్ని పట్టించుకోలేదని, ఆమె పట్ల అతని ప్రవర్తన మగ మిత్రులతో సాగినట్లు సాగిందని. కొందరితో ఆడవాళ్ళతో స్నేహం అంటే సెక్స్‌ స్నేహమే… మరో స్నేహం సాధ్యం కాదని… అతను ఆమెని మగమిత్రులతో అని పోల్చుకోవడం… ఆ తరువాత స్నేహంగా మెలగడం ద్వారా… పాత్రలతో స్నేహం విలువలను పెంచి, మనల్ని ఆలోచనల్లో పడేస్తారు… ఇప్పుడు నీ సమాజంలో ఆధునిక విలువలు కలిగిన సమాజంలో స్త్రీపురుషుల స్నేహాలకి మనం ఇచ్చే విలువ ఎంత? అతను అనబడే అతని ద్వారా, అతను అనుకుంటున్న మాటలు ఇప్పుడు చదివినా. మానవ స్వభావాలని అద్దంముందు నిలబెట్టినట్లు కొత్తగా కనిపిస్తాయి. అంతేకాక జీవితాన్ని నిశితంగా మనముందు పెట్టినట్లుండే కథలోని విషయాలు గమనిస్తే కొ.కు. కథకుడిగా చూపించిన నైపుణ్యం కనిపిస్తుంది…
ఆ తరువాతి కథలో జానకికి సంబంధించిన విషయాలు –
జానకికి చిన్నప్పుడే పదిహేడో ఏట పెళ్ళి అవడం, పెళ్ళినాటికి తండ్రి పోవడం, తల్లి ఆమెకి పెళ్ళి చేయలేని దుర్భర సమస్య మంచి, చెడులాంటివి. పెళ్ళి సంబంధాల విషయంలో నిర్ణయించుకోలేకపోవడం, సంబంధాల విషయాల్లో ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డవే… ఒక్క మంచి సంబంధం రాదు.
ఆ తరువాత వచ్చిన సంబంధం తిరుమలరావుది. ఇంక తిరుమలరావు విషయానికి వస్తే… తిరుమలరావు తండ్రివి పనికిమాలిన పాత ఆచారాలు అనుకుంటూ వాటిని వ్యతిరేకిస్తూ, తండ్రినే అసహ్యించుకొనే పాత్ర – ”తిరుమలరావు తండ్రి – జానకీ, తిరుమలరావుల పెళ్ళిని పెద్దల సమక్షంలో వాళ్ళిద్దరి చేత దండలు వేయించుదాం” అన్నప్పుడు జానకి తల్లి నిర్ఘాంతపోయి, అలాంటి పెళ్ళి వద్దని నిరాకరిస్తుంది. ఇరుగుపొరుగు వారితో ”కథల్లో రాజకుమార్తెల్లాగా పూలదండలు వేసుకునే పెళ్ళేమిటమ్మా? తరువాత దాన్ని వదిలేసి, తనకు పెళ్ళి కాలేదంటే, ఆ దిక్కుమాలిన పూలదండలు సాక్ష్యం చెబుతాయా అంటుంది.
అవి ఆ కాలం మాటలు అయినప్పటికీ, ఇప్పుడు కూడా సహజీవనం సాగిద్దాం, అని ధైర్యంగా ముందడుగులు వేస్తున్న చాలా మందికి అక్కడక్కడా వినబడుతున్న నిరసన అభిప్రాయాలు అప్పటి కాలం జానకి తల్లి అన్న మాటల్ని బలపరుస్తున్నవాళ్ళు ఎంతో మంది. మారింది సమాజ స్థితిగతులా? ఇంకా మనుషులు మారలేదా! అనిపిస్తుంది
ఇంకా జానకి భర్త తిరుమలరావు చాలా విచిత్రమైన మనిషి జానకి దృష్టిలో. ఏ విషయము ఎవరితోను చెప్పడు. అన్నీ రహస్యాలే. కాని జానకి, అతను తనతో ఎలాంటి విషయం చెప్పినా సర్దుకుపోగలనా, రహస్యాలు ఇష్టం వుండదు అనుకుంటుంది… కాని జానకి భర్త ఇలాంటి చిన్నాచితకా విషయాలు పట్టించుకోడు, ఆమెతో ఏదీ చెప్పడు. అతను బియ్యే పాసు అవుతాడు. పెద్ద ఉద్యోగం కావాలనుకుంటాడు. అది దొరకదు. చిన్న చిన్న ఉద్యోగాలు చెయ్యడు… కవిత్వాలు రాస్తాడు. (అతన్ని కొ.కు. తమాషాగా బాలరచయిత అంటారు) అతనికి సినిమా మోజు వుంది. అదీ చెప్పడు. ఏదో వ్యథ. తండ్రిమీద కోపం. ”కట్నం తీసుకోకుండా” పెళ్ళి జరిపించాడని. కట్నం తీసుకోకుండా పిల్ల అందం చూసి కళ్ళు బైర్లు కమ్మి చేసుకొని వుంటాడు అందరు అనుకోరూ? ఇలా అనుకోవడం అతనికి నామోషి… ఆ విషయంలో కూడా ఇద్దరికీ భేదాభిప్రాయాలు వస్తాయి.
అభిప్రాయభేదాలు, కంటికి కనిపించేవి చిన్నవైనా, జానకికి అతను నచ్చలేదా… తిరుమలరావులాంటివాళ్ళతో ఏళ్ళతరబడి సంసారాలు చేసేవారు ఎందరో? వాళ్ళకో పంజరాన్ని సృష్టించుకొన్నవాళ్ళు ఎందరో! వాళ్ళిద్దరి మధ్య ఆత్మీయత లేదు… అని రచయిత క్లుప్తంగా చెప్పినా… ఆత్మీయత, స్నేహభావం లేని భార్యాభర్తల అనుబంధం మధ్య పెద్దపెద్ద అగాధాలుంటాయి… అది నిజమైన బంధం కాకుండా పోతుంది. ఇలాంటి అగాధాన్ని సృష్టించుకుని, ఇద్దరూ దూరదూరంగా జరిగిపోతారు.
జానకీ తిరుమలరావుల మధ్య జరిగిందిదీ. ఇద్దరికీ ఇద్దరి మీద ఇష్టాలులేవు… కేవలం ఒక ”పెళ్ళి” బంధం మాత్రమే ఉంది.
తిరుమలరావులో ఇంకో అవగుణం ఉంది. అందర్ని నిందించడం. అతను ”బాలకవి” కాబట్టి శ్రీశ్రీ కవిత్వానికి కూడా వంకలు పెట్టేవాడు. (విశ్వనాథవారి పద్యాలు అతనికి ఇంతకూడా అర్థం కావని) రూఢీగా చెప్పగలను అనుకునేది జానకి… ఆమె పాటపాడినా వాటిల్లో బూతు వెతికేవాడని, సెక్స్‌ విషయాల్లో ఉత్తపశువనీ జానకి మాటల సందర్భంలో అన్ని విషయాలు చెబుతుంది.
అయితే చాలామంది సంసారాలు ఇలాగే వుంటున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసి, అనుమానంతో వేధించే వాళ్ళు అప్పుడూ వున్నారు, ఇప్పుడూ వున్నారు.
కాని జానకిలాంటి అరుదైన వ్యక్తిత్వం వున్నవాళ్ళను ఇప్పుడు కూడా వేళ్ళమీద లెఖ్ఖించుకోవచ్చు. ఇలాంటి వ్యక్తిత్వం వున్న స్త్రీలు వాళ్ళని వాళ్ళు ఖైదీలుగా భావిస్తారు, తిరగబడతారు. స్వేచ్ఛని కోరుకుంటారు.
జానకి పాత్ర ద్వారా ఎంతో సునాయాసంగా చూపెడతారు కొ.కు. గారు… అక్కడే మనలో ఆలోచనలు మొదలవుతాయి. మనిషి మీద అయిష్టం పెరిగితే అది తెగిందాకా దారితీస్తుంది. చిన్న చిన్న మాటలే విడిపోయేటంతటి పరిస్థితులని తెస్తాయి.
జానకి తిరుమలరావుతో ఒకసారి ఇలా అంటుంది. ”నేను చిన్నతనంలో కుర్రాళ్ళతో, మొగుడు, పెళ్ళాం ఆటలు ఆడేదాన్ని!” (ఇలాంటివి చాలా జరుగుతాయి. కాని మనం చెప్పం.) ”ఎవరితో” అంటాడు తిరుమలరావు.
”ఎవరైతేనేం? పాపం చిన్నతనంలోనే మశూచికం వచ్చి పోయాడు” అంటుంది.
తిరుమలరావు కూడా ఎంతో అనుచితంగా… ”వెధవముండను పెళ్ళాడానన్నమాట” అంటాడు.
ఇలాంటి సంభాషణలు చాలు… భార్యాభర్తల మధ్య ఎలాంటి అనుబంధాలు వున్నాయో తెలుసుకోవడానికి. ఎప్పటివో చిన్నప్పటి విషయాలు పెద్దవి చేసుకొని, ఇంట్లోంచి పొమ్మనగానే, వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. భర్తని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తుంది…
పుట్టింటివాళ్ళు ఆదరించనప్పటికీ అక్కడ మునసబు కొడుకు తనమీద కన్నేసి వుంచాడని తెలిసి, సినిమాల్లో నటించడానికి పట్నం వెళుతూ జానకిని కూడా రమ్మంటాడు. అమాయకంగా మోసపోయే యువతిలా వెళ్ళదు. అన్ని తెలిసే వెళుతుంది. ఇక్కడ కొ.కు. గారు సమస్త సంబంధాలకి జవాబుగా ఒకేఒక్క మాట రాస్తారు… ”అన్ని సంకెళ్ళు తెంపేస్తే కొంత స్వేచ్ఛ లభిస్తుంది. ఆ తరువాత బాధని మించిన ప్రమాదం ఏది జరగదని.”
ఇది స్వేచ్ఛ, తిరుగుబాటు, విచ్చలవిడితనంలా ధ్వనించినా మనసు విరిగిపోతే, స్వేచ్ఛని మించిన అసహ్యం, జీవితంపట్ల నిరాశ. వీటిని వేటిని కనిపించనీయకుండా మొండిగా వేస్తున్న అడుగులు, పట్టుదల… కాని అన్నింటినీ అంగీకరిస్తూ జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తీ అందరికీ ఉండదు. ఉంటే ఎలా వుంటుందో… జానకి పాత్ర ద్వారా చెప్పిస్తారు…
జానకిని నిలబెడతారు… పాత్రని అందులో స్త్రీ పాత్రని స్వేచ్ఛగా నిలబెట్టడం అంటే కత్తిమీద సాములాంటిది. (స్త్రీ ఎప్పుడూ ఏడుస్తూ వుండాలి, స్వేచ్ఛని అనుభవించకూడదు. నలిగిపోవాలి. అప్పుడే కథ రక్తి కడుతుంది.)
కాని జానకిని కొ.కు. గారు నిలబెడతారు. ధైర్యంగా తనకి పరిచయం అయిన అతనితో స్వేచ్ఛగా, నిజాయితీగా మాట్లాడ నిస్తారు. 
జానకి అతనితో ఇలా అంటుంది. నేను మునసబు కొడుకూ భార్యాభర్తల్లా జీవించామని… అతనికి సినిమా ఛాన్సు రాలేదు. రాదని తెలుసు. తెచ్చిన డబ్బు అయిపోయింది. రేడియోలో పాటలు పాడుకుంటూ, ట్యూషన్లు చెప్పుకుంటూ బతికానని చెబుతుంది… మునసబు కొడుకు వెళ్ళిపోగానే, గర్భవతినని తెలుసుకున్నానని, దాన్ని ”అబార్షన్‌” చేయించుకున్నానని చెబుతుంది. అన్నీ అతను వింటాడు. ఇష్టపడతాడు కూడా…
జానకి పాత్రతో కథని ఎంతో హేతుబద్ధంగా, నిర్మోహ మాటంగా కథని నడిపిన కొ.కు.గారు. ముగింపు స్వేచ్ఛకి సమాజానికి వేసిన ప్రశ్నలా అనిపిస్తుంది.
స్వేచ్ఛ కావాలి అనుకుంటాం. కాని జానకిలా స్వేచ్ఛని నిజాయితీగా నిరూపించుకోగలమా? అనిపించింది. పెళ్ళిలో ఎక్కడో పరిచయం అయిన వ్యక్తితో అన్నీ చెప్పడం… కాని నిజాయితీని అందరూ అనుమానంగానే చూస్తారు. అతను కూడా అనుమానంగానే అడుగుతాడు. ఇలా ఎంతమందితో చెప్పావని?
నీకే చెప్పాను ఎవరికీ చెప్పలేదు అంటుంది!
అతను ఇంకా ఇంకా ప్రశ్నలు వేసాడు…
”నిన్ను ఎప్పుడైనా ఎక్కడైనా సెక్సు వెంటాడిందా!!” అని… వెంటాడింది. బస్సులో ఎక్కినప్పుడు ఏ మొగవాడైనా నా ఒంటిని తాకినప్పుడు అంటుంది.
ఆమె సమాధానం విన్నప్పుడు అనిపిస్తుంది… స్త్రీగాని పురుషుడుగాని తమకు నచ్చేలా బతకడం మాట్లాడడం ఎప్పుడు నేర్చుకుంటారని? జీవితాంతం ముసుగు వేసుకొని ముఖం వెనకాల ముఖం దాచుకుని బతికేస్తాం.
ఇన్ని విన్నాక కూడా అతను జానకికి పరిచయం అయినవాడు. జానకిని ఇష్టపడ్డవాడు… ఎంతో ధైర్యంగా అంతే నిజాయితిగా. అతను కూడా స్పందిస్తాడు.
పాత్రల మధ్యలో ఎక్కడా అబద్ధాలు, అసహనాలు ఉండవు. ఇంత హాయిగా ఇద్దరు. మనుషులు అందులో స్త్రీపురుషులు ఉండగలరా అనిపిస్తుంది?…
అయితే కొ.కు. గారు ఉండగలరు. మాట్లాడగలరు. అని అంతే నిజాయితీగా కథ ముగిస్తారు… ముగింపుతో కూడా. ”మనమిద్దరం దీన్ని యావజ్జీవ స్నేహం చేసుకుందాం. పెళ్ళి ఎలాగో సాధ్యం కాదు. నీ లీగల్‌ మొగుడు బతికున్నాడు. నాకు పిల్లలు పుట్టినా భయపడనవసరం లేదు. నాకు బ్యాంకువాళ్ళు ఇచ్చే జీతం డబ్బులు, ఒక కుటుంబాన్ని పోషించడానికి సరిపోతాయి. నీకు ఖైదీతో వున్నావనే భావం రానియ్యను అంటారు” అతను.
జానకి ఒప్పుకుంటుంది. ఇష్టపడుతుంది.
ఈ ముగింపు, ఆమెకు భరోసాని, అతడి వ్యక్తిత్వాన్నీ చాటుతుంది. కపటం లేని నిజాయితి, స్వేచ్ఛ, ఎప్పటికీ అందరికీ కావాలనిపించేలా వుంటుంది.
ఇప్పుడు సహజీవనం చేద్దాం, కలసి బతుకుదాం అను కుంటున్న ఎంతోమంది స్త్రీపురుషులకి ఈ కథ ఒక అర్థవంతమైన ఆలోచనను రేకెత్తించేదిగా అనిపిస్తుంది.
యావజ్జీవ స్నేహం ఇది చాలా భావయుక్తమైన పదం. ఈ పదంతోనే సమస్త జీవనసారం ఉంది. ఇది ప్రతి భార్యాభర్తలకీ… కలసి బతుకుదాం అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ కథ ఒక దిక్సూచిలా పనిచేస్తుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.