యుద్ధ సంస్కృతికి అద్దం పట్టిన కథలు

కె.బాలగోపాల్‌
 గొప్ప రచన అంటే ఏమిటి అన్న ప్రశ్నకు ఎవరి చాపల్యాన్ని అనుసరించి వారు ఎన్ని సమాధానాలయినా ఇయ్యవచ్చునుగాని, చరిత్రలో ఆ ప్రశ్నకు ఒకే సమాధానం ఉంది.
సమకాలీన సమాజంలో వస్తున్న మార్పులను, చరిత్రాత్మకమైన పరిణామాలను, ఆ వర్తమానంలో గోచరించే భవిష్యత్తును, ఆ తరంవారికీ తరువాత తరాలవారికీ కళ్లకుకట్టినట్టు చూపించే రచన గొప్ప రచన. ఇట్లా చూపించడం అనుకున్నంత సులభం కాదు. ఎందుచేతనంటే మనచుట్టూ కనిపించే మార్పులలో ఏవి చరిత్రాత్మకమైనవో తెలుసుకోవడానికి చాలా నిశితమైన పరిశీలన కావాలి. చూడడానికి ప్రధానంగా కనిపించేవి నిజానికి చరిత్రదృష్టిలో ప్రధానం కాకపోవచ్చు. ‘మాలపల్లి’ నాటికి ఫ్యూడలిజం పతనం ముఖ్యమయిన పరిణామమన్న విషయం ఇవ్వాళ మనం సులభంగా గుర్తిస్తాం గాని, శాస్త్రీయ సామాజిక దృక్పథం లేని ఉన్నవ ఆ విషయాన్ని ఆనాడే గుర్తించి, ఆ పతనాన్ని – తన పరిమితుల పరిధిలోనే చిత్రీకరించడం ఆయన గొప్పతనం.
అటువంటి మరొక గొప్ప రచయిత కుటుంబరావు. పెట్టుబడిదారీ పారిశ్రామిక విప్లవం పందొమ్మిదవ శతాబ్దపు లండన్‌ నగరంలో సృష్టించిన అధోప్రపంచాన్నీ, ఆ ప్రపంచపు సంస్కృతినీ, డికెన్స్‌ తన నవలల్లో ఎంత శాశ్వతంగా పొందుపరిచాడో, ఈ శతాబ్దపు మూడవ, నాల్గవ దశాబ్దపు పట్టణ మధ్యతరగతి జీవితంలోని మార్పును కుటుంబరావు అంత శాశ్వతంగానూ తన కథల్లో పొందుపరిచాడు. ఆనాటి లండన్‌ గురించి తెలుసుకోవాలన్నా, ఈనాటి కోస్తా ఆంధ్ర గురించి తెలుసుకోవాలన్నా చరిత్రకారులను ఆశ్రయించవలసిన అవసర లేదనిపించ గలిగినంతటి చక్కటి రచయితలు ఇద్దరూ.
అటువంటి కుటుంబరావు రచనలను సంకలనం చేసి ప్రచురించాలన్న ఆలోచన చాలా మంచిది…
కుటుంబరావు కథలన్నిటిలోకి, 1940లలో రాసినవి ఉత్తమమైన వంటే బహుశా ఎవ్వరూ అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఆ కథలకు ప్రేరణనిచ్చింది. 1930లలో అంతర్జాతీయంగా ఏర్పడ్డ పెట్టుబడిదారీ  ఆర్థిక సంక్షోభం. ఫలితంగా మన దేశపు మధ్యతరగతి ప్రజలకు కలిగిన ఇక్కట్లన్నీ గూడ ఇప్పటికి చాలామంది గుర్తించారు. అయితే నా దృష్టిలో కుటుంబరావు కథలకు అంతకంటె సన్నిహితమయిన మరొక ప్రేరణ ఉంది. ఆర్థిక సంక్షోభం ఈ ప్రేరణకు నేపథ్యం మాత్రమే.
1940ల నాటి కుటుంబరావు కథల్లో మనకు చాలా తరచుగా తారసపడే పాత్ర ఒకటి ఉంది. ఇతను మొదట్లో మధ్యతరగతి మనిషి. చుట్టూ ఉన్న మధ్యతరగతి మనుషుల్లాగా తాను గూడ ఆర్థికసంక్షోభం ఫలితంగా ఇబ్బందులకు గురవుతాడు. అప్పులను పైరవీలను ఆశ్రయిస్తాడు. ఇంతలో రెండవ ప్రపంచయుద్ధం వస్తుంది. యుద్ధకాలంలో ఇతను ఏవో పర్మిట్లు, కోటాలు, లైసెన్సులు కాంట్రాక్టులు చేపట్టి ధనికుడవుతాడు. యుద్ధం తరువాత బహుశా మధ్యతరగతిని విడిచిపెట్టి ఒక మోస్తరు పెట్టుబడిదారుగా స్థిరపడతాడు.
ఇతనొక వ్యక్తికాదు, ఒకవర్గం. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఒకవర్గం గూడకాదు. మనదేశ పెట్టుబడిదారీ వర్గ అభివృద్ధిలో ఒక దశ. ఇతను యుద్ధకాలంలో పుట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధమప్పుడూ పుట్టాడు. రెండవ ప్రపంచయుద్ధమప్పుడూ పుట్టాడు. యుద్ధకాలంలో సరుకుల డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోతుంది. నిరుద్యోగులుగా ఉన్నవాళ్లు సైన్యంలోచేరి ఉద్యోగాలు సంపాదించుకోవడం వల్ల, సంవత్సరానికి ఆరునెలలే పని దొరికే పేదరైతులు సైనికులై పూర్తి సంవత్సరకాలం జీతం సంపాదించుకోవడం వల్ల, యుద్ధం నడపడం కోసం అవసరమయ్యే పరికరాల వల్ల, డిమాండు పెరుగుతుంది. బలమయిన ఆర్థిక పునాదిగల పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ డిమాండును వాడుకొని ఇతోధికంగా బలపడుతుంది గాని, వలసదేశాలలో మాత్రం వక్రపరిణామాలకు దారితీస్తుంది. ఉత్పత్తిని పెంచే పారిశ్రామిక పెట్టుబడిదార్ల బదులు, నల్లవ్యాపారం, పర్మిట్లలోను కాంట్రాక్టులలోను బ్రోకర్‌పని చేసే పెట్టుబడిదార్లు పుట్టుకొస్తారు. మనదేశంలో మొదటి, రెండవ ప్రపంచయుద్ధాల కాలంలో ఇలాంటి వాళ్లు కొల్లలుగా పుట్టుకొచ్చి, తరువాతి కాలంలో ఆధునిక భారత పాలకవర్గంలో ఒక భాగంగా మారారు.
ఈ నల్లబజారు పెట్టుబడిదార్లకు లంపెన్‌ బూర్జువా వర్గమని పేరెవరు పెట్టారో తెలీదుగాని అది చాల చక్కగా అతికేపేరు. ఉత్పాదక శ్రమ చేయకుండ ఉత్పాదక శ్రామికులను ఆవరించి జీవించే అధో ప్రపంచ నివాసులు లంపెన్‌ కార్మికులయితే, ఆ ఉత్పాదక శ్రామికులను దోచుకునే పారిశ్రామిక పెట్టుబడిదార్ల ప్రపంచాన్ని ఆవరించి జీవించే వీళ్లు లంపెన్‌ పెట్టుబడిదార్లు. స్మగ్లర్లు, నల్లబజారు వ్యాపారస్తులు, లైసెన్సులను, పర్మిట్లను, కాంట్రాక్టులను తిరగనమ్ముకునే బ్రోకర్లు ఈ వర్గానికి చెందుతారు. వీళ్ల సంస్కృతికీ లంపెన్‌ కార్మికుల సంస్కృతికీ తేడాలేదు. అమానుషత్వం ఈ సంస్కృతి తాలూకు ముఖ్యలక్షణం – మన దేశంలో ఈ లంపెన్‌ అంశలేని పెట్టుబడిదార్లెవ్వరూ లేరు కాబట్టి (దొంగ వ్యాపారం చేయడంలో అత్యాధునిక పరిశ్రమల యజమాన్లు కాంట్రాక్టర్లన్లు ఏ మాత్రం తీసిపోరు), మనదేశ బూర్జువా సంస్కృతిలో తొలినాటి ఉదారవాదం కంటే లంపెన్‌ లక్షణాలే ఎక్కువ. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ సిమెంటును దొంగవ్యాపారం చేసి పట్టుబడ్డ దొంగ కాంట్రాక్టరు సుబ్బరామిరెడ్డి హైదరాబాద్‌ నగర సాంస్కృతిక రంగానికి రెండేళ్లపాటు ఏకచ్ఛత్రాధిపతి కావడం యాదృచ్ఛికం కాదు. ఆ సంస్కృతి అతనిదే కాబట్టి దానికి అతనే అధ్యక్షత వహించడం సబబు.
తనచుట్టూ ఉన్న మధ్యతరగతి జనంలోంచి యుద్ధకాలంలో ఈ వర్గం పుట్టి పైకిరావడం గమనించడంలోనే కుటుంబరావుకు ప్రపంచం అర్థమయిందని నా అనుమానం. కుటుంబరావు ‘కాపిటల్‌’ చదివిన 1942 నాటికి సరిగ్గా యుద్ధం తీవ్రదశనందుకుంది. అప్పటికే కాంట్రాక్టుల మీద కోటాలమీద పర్మిట్ల మీద నల్లబజారు లోను చేసుకోవలసిన వాళ్లు చేసుకోవలసినంత లాభం చేసుకున్నారు.
తనకు తన సమాజ వాస్తవ స్వరూపాన్ని ఏ పరిణామం తెలియబరిచిందో, దాన్ని కుటుంబరావు తన కథల్లో చక్కగా పొందుపరిచాడు. 1940లలో ఆయన రాసిన చాలా కథల్లో ఈ లంపెన్‌ బూర్జువా వర్గానికి చెందిన వ్యక్తులు ప్రధానంగా కనిపిస్తారు. ఈ సంపుటిలో అటువంటి కథలు ఆరువరకు ఉన్నాయి. (ఇది విశాలాంధ్ర ప్రచురణలు మొదటి సంపుటానికి ప్రస్తావన. ఈ కథల్లో షావుకారు సుబ్బయ్య, శీల పరిశీలన మాత్రమే ప్రస్తుత సంపుటంలో ఉన్నాయి.) ‘సద్యోగం’లో సూర్యనారాయణ, ‘అట్టడుగు’లో గణపతి, ‘కలిసిరావాలి’లో రంగయ్య, ‘షావుకారు సుబ్బయ్య’లో సుబ్బయ్య, ‘పైకివచ్చినవాడు’లో సీతారామారావు, ‘శీలపరిశీలన’లో కథకుడు ఈ వర్గానికి ప్రతినిధులు. అయితే వీళ్లు ఆయా కథల్లో ముఖ్యమయిన పాత్రలేగాని కథానాయకులు కారు. కథా నాయకుడు ఎప్పుడూ గూడ మామూలు మధ్యతరగతి మనిషి – యుద్ధం పూర్వం కుటుంబరావుకు మల్లే అతనుగూడ అమాయకుడు, అంటే ప్రపంచ స్వరూపం తెలీనివాడు. యుద్ధం జరుగుతుండగా, తిండికి గతిలేని గణపతి, చిల్లర వ్యాపారస్తుడు సుబ్బయ్య కాంట్రాక్టులు చేపట్టి, పర్మిట్లు తిరగనమ్మి, రాత్రికి రాత్రే ధనికులు కావడం చూస్తాడు. చూసి ప్రపంచ స్వరూపాన్ని అర్థం చేసుకుంటాడు.
అర్థమయితే చేసుకుంటాడుగాని తిరగబడడు. సాహిత్యం ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని చూపాలని కొందరు చేసే వాదనను కుటుంబరావు ఆమోదించారో లేదో గాని, తన తొలినాటి రచనలలో ఆచరించలేదు. మధ్యతరగతి నుండి పైకివెళ్లిన లంపెన్‌ బూర్జువా వర్గాన్ని మధ్యతరగతి ‘మంచివాళ్ల’ కళ్లతోనే చూపించడం వల్ల ఇక్కడ నిజానికి తిరుగుబాటకు ఆస్కారంలేదు. ‘పైకివచ్చినవాడు’లో రాఘవులుకు, తన తమ్ముడు సీతారామారావు సప్లయి శాఖలో లంచాలు సంపాదించి కోటాలు తిరగనమ్మి ధనవంతుడయి వుండవచ్చుగానీ, ‘బ్లాకుచేసే బాడుఖావు’ కాదు, ఎంత చెడ్డా తన తమ్ముడే, అతనితో నవ్వుతూనే మాట్లాడతాడు, ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు గూడ. చివరికి మనకు దొరికే ‘పరిష్కారం’, కమ్యూనిస్టయిన రాఘవులు అల్లుడు సీతారామారావును మామగారి మీద ఎలెక్షనులో పోటీచేసి ఓడించడమే.
మరొక ఉదాహరణ ‘సద్యోగం’లో కథకుడు, ఒకప్పుడు పేదవాడిగావున్న తన మిత్రుడు సూర్యనారాయణ ఘరానా స్త్రీలకు డాఫర్‌ పనిచేసి ధనికుడయ్యాడని తెలుస్తుంది. అసహ్యించుకుంటాడు, కాని అంతలో మధ్యతరగతి ‘మంచివాడి’ మొగమాటం అడ్డువస్తుంది. దేశంలో తన మిత్రుడిలాంటివారు ఎంతమందిలేరు? వాళ్లను తాను ఏమనగలిగాడు, ఏం చేయగలిగాడు? అన్నీ అమ్మకపు సరుకులైన తరువాత మనిషి మాంసం అమ్మకపు సరుకయితే వచ్చిందా? ఇత్యాది – చివరికి, మధ్యతరగతి మనస్తత్వానికి ప్రతీక అయిన ప్రశ్నతో తన ఆలోచన ముగించుకుంటాడు : ‘నాకెందుకు మధ్య పేచీ?’
‘కలిసిరావాలి’లో రంగయ్య మరీ అన్యాయమయిన మనిషి. యుద్ధ కాలంలోనే కాదు, అంతకు పూర్వం గూడ కాటకం వచ్చినప్పుడు వడ్డీ వ్యాపారం చేసి లక్షలు కూడబెడతాడు. అయినా కథకుడిలో అతనిపట్ల ద్వేషం కనిపించదు. విషప్పురుగును జీవశాస్త్రజ్ఞుడు ప్రయోగశాలలో చూసినట్లు నిర్లిప్తంగా చూస్తూ, అతనిలో ‘తాత్విక క్షీణత’ను మాత్రం గమనిస్తాడు. అధికారమార్పిడి అనంతరం వచ్చిన మార్పులకు రంగయ్య సర్దుబాటు చేసుకోలేక తన ఆస్తిని కోల్పోతే అందులో కొంత తనకూ దక్కుతుందేమోనన్న క్షుద్రమయిన ఆశగూడ వ్యక్తపరుస్తాడు.
లంపెన్‌ బూర్జువావర్గాన్ని ఆ వర్గానికి సామాజికంగా సన్నిహితమయిన మధ్యతరగతి కళ్లతో చూపించడంవల్ల అనివార్యంగా ఏర్పడేశైలి, వ్యంగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వాళ్లకు సంతృప్తి కలిగించవచ్చుగాని, మార్క్సిస్టు దృక్పథం నుండి ఒక తీవ్రమయిన పరిమితిగానే పరిగణించాలి. ఆ పరిమితే బూర్జువా విమర్శకులకు కుటుంబరావు పట్ల ఉండే సద్భావానికి కారణం (ఉదాహరణకు, వాళ్లు కుటుంబరావు పట్ల చూపుతున్న ఆదరణ అల్లం రాజయ్యకు ఎన్నటికీ చూపరని నా అనుమానం.)
ఆనాడు భారతదేశంలో వర్గపోరాటం తీవ్రంగా లేనిమాట వాస్తవమే. అయినా ఈ లంపెన్‌ బూర్జువావర్గాన్ని దాని చీకటి వ్యాపారానికి బలి అయిన పేదవాళ్ల కళ్లతో చూపించివుంటే మరికొంత న్యాయంగా వుండేది. ఈ పరిమితిని కుటుంబరావు 1970 తరువాత కాలపు వ్యాసాలలో అధిగమించాడు…
ఈ లంపెన్‌ బూర్జువావర్గపు పుట్టుకే కాకుండా ఇతర ఇతివృత్తాలు… మన సమాజ జీవితాన్ని మరికొంత సాధారణస్థాయిలో ప్రతిబింబించేవి గూడవున్నాయి. క్షీణిస్తున్న ఫ్యూడల్‌ ఆచారాలు, అంకురిస్తున్న బూర్జువా విలువలు, వ్యాపార దృష్టి చాలా కథలకు ఇతివృత్తాలు సమకూర్చిపెట్టాయి. ‘శాస్త్రీయ సంగీతం’ అనబడే ఫ్యూడల్‌ సంగీతం మీద మోజుతో చదువు పాడుచేసుకొని ఇల్లువదిలి మద్రాసు పారిపోయి చివరికి ఇళ్లప్లాట్లు అమ్ముకునే వ్యాపారంలో స్థిరపడ్డ గోపాలం (‘దైవాధీనపు జీవితం’), అత్తగారి వూళ్లో అత్తగారి సాంప్రదాయకపు పెత్తనాన్ని నిరసించి, పట్టణం వచ్చాక మాత్రం అక్కడి కిరాయి ఇళ్ల వ్యాపార సంస్కృతి పెట్టే చీదరను నవ్వుతూ భరించే శారదాంబ (‘అద్దెకొంప’) ఈ మార్పుకు ప్రతీకలు. మరొక ఉదాహరణ ‘నడమంత్రపు సిరి’ నాటికలో శాస్త్రి. చదువు చెప్పడంపట్ల ఆసక్తితో ట్యుటోరియల్‌ కాలేజి పెడతాడు శాస్త్రి. మొదటి సంవత్సరం అందరూ పాసయినందుకు సంతోషిస్తాడు. మరొక టీచర్ని గూడపెట్టి ఎక్కువమంది విద్యార్థుల్ని తీసుకోవాలనుకుంటాడు. అయితే అతనిలాగ వృత్తిపట్ల శ్రద్ధతో కాకుండా వ్యాపారదృష్టితో పనిచేసే దాసు, అతని తరువాత టీచరుగా చేరిన సీత, సినిమా ఛాన్సు దొరకగానే అర్ధాంతరంగా ఉద్యోగం వదలిపెట్టి వెళ్లిపోతారు. దానితో చదువుపాడయి తరువాతి సంవత్సరం సగం మందికిపైగా ఫెయిలవుతారు. గత్యంతరం లేక శాస్త్రి స్కూలు మూసేసి, తాను తన స్వార్థానికి బుద్ధిపూర్వకంగా ఇంకొకర్ని బలిచేయలేదన్న సంతృప్తిని మాత్రం మిగుల్చుకుంటాడు.
అయితే అందరికంటే చక్కటి ఉదాహరణ, ‘నువ్వులు – తెలకపిండి’లో సోమయాజులు. అడవుల్నీ, చెట్లనీ, పూలనీ చూసి సహజంగా పొందే ఆనందం అతను పాటలు పాడడంలో పొందేవాడు. చిన్నప్పుడు అంత సహజంగాను అతని పాటను ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుంటుంది జయలక్ష్మి. అయితే అడవుల్ని వ్యాపారం చేసుకునే కాంట్రాక్టర్లున్నట్టే పాటను వ్యాపారం చేసుకునే నాటకాల కాంట్రాక్టర్లు, సినిమా నిర్మాతలు ఉన్నారు. సోమయాజులు వాళ్ల చేతుల్లోపడతాడు. తన పాటతో వాళ్లకు లక్షలు సంపాదించి పెడతాడు. తాను మాత్రం డబ్బుచేసుకోడు సరికదా, పాడడంలోగల ఆనందాన్నీ, తాను పాడగా విని భార్యపొందే ఆనందాన్నీ సహితం కోల్పోతాడు. వ్యాపార గానుగ నుండి వట్టి నిస్సారమయిన తెలకపిండిగా బయట పడతాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఫ్యూడలిజం నశించి దాని అవశేషాల నుండి పెట్టుబడిదారీ సమాజం పుట్టే పరిణామం గత నాలుగు శతాబ్దాలుగా సాగుతోంది. అన్ని దేశాల ఆధునిక చరిత్రలోను గొప్ప రచయితలుగా పేరుపొందిన వాళ్లలో చాలామంది ఈ పరిణామాన్ని వ్యక్తీకరించిన వాళ్లే. మిగ్వెల్‌ సెర్వాంటెస్‌ నుండి కుటుంబరావు వరకు ఈ జాబితా చాలా పెద్దది. అయితే మార్క్సిస్టయిన కుటుంబరావులో ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఈ చారిత్రక పరిణామం ఆస్తిపరులలో కలిగించిన మార్పును గూడ చక్కగా చూపించిన కొద్దిమంది రచయితలలో కుటుంబరావు ఒకరు. ఈ దృష్టి నుండి చూస్తే, ‘కొత్త జీవితం’ చాలా విలక్షణమయిన కథ.
విఠల్‌ పాండురంగు రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని మాటల్లో చెప్పాలంటే, ‘ఇంటి దగ్గర’ తనవాళ్లు ‘గౌరవ కుటుంబీకులు’, అంటే అర్థం, ఒకప్పుడు సుమారుగా భూమి ఉన్నవాళ్లు, క్రమంగా భూమి కోల్పోయారో, కుటుంబం పెరిగిందో తెలీదుగాని, అప్పుల పాలయ్యారు. అప్పు తీర్చేందుకు కొంత డబ్బు సంపాదిద్దామని విఠల్‌ పట్టణంవచ్చి ఫ్యాక్టరీలో హమాలీ పనిలో చేరతాడు. అన్ని దేశాలలోనూ ఈ రకంగా చితికిపోయిన రైతాంగం నుండే పారిశ్రామిక కార్మికవర్గం ఏర్పడింది.
పట్టణంలో మొదటిరోజు జరిగే సంఘటనలోనే కుటుంబరావు విఠల్‌ జీవితంలోని మార్పును చక్కగా చూపుతాడు. తమ అవసరాలకోసం తాము శ్రమించే మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన విఠల్‌కు వీలైనంత ఎక్కువగా పనిచేయడం అలవాటు. గంట పనిని అరగంటకు కుదించడం వీలైతే కుదించాలని చూస్తాడు. ఫ్యాక్టరీలో శ్రమించేది తనకోసం కాదని, యజమానుల లాభాలకోసమని, అర్థంకాక ఆ దృక్పథాన్నే ఇక్కడ ప్రదర్శిస్తాడు. లోహపు అచ్చులను లారీనుండి గోదాంకు చేరవేసేటప్పుడు ఒకేసారి మూడు అచ్చులను మోయవచ్చునని తోచి తన తోటి కూలీతో ఆ మాట చెప్పి ”చాల్లే, గొప్పపనివాడివి!” అని కసిరించుకుంటాడు.
త్వరలోనే ఫ్యాక్టరీలో సమ్మె జరుగుతుంది. ఒక కూలీని పని నుండి తీసివేస్తే మిగిలిన వాళ్లకు వచ్చిన నష్టమేమిటో వాళ్లెందుకు సమ్మె చేయాలో విఠల్‌కు అర్థం కాదు. ఏ కుటుంబం అవసరాలు ఆ కుటుంబం చూసుకొనే మధ్యతరగతి రైతాంగ సంస్కృతికి చెందిన విఠల్‌కు కార్మికుల జీవన పరిస్థితులే వాళ్లను సంఘటిత పరుస్తాయని, సంఘటిత శక్తే వాళ్ల ఆయుధమని అర్థం కావడానికి కొంత సమయం పడ్తుంది. అర్థంకాక సమ్మె విచ్ఛిన్నకారులతో కలిసి ఫ్యాక్టరీకి పోయి యజమాని మన్ననలు అందుకోకపోగా సమ్మె చేసిన కార్మికులతో తిట్టుతింటాడు.
 అయితే డబ్బుకు విలువ ఇచ్చే పెట్టుబడిదారీ సమాజ మనస్తత్వాన్ని త్వరలోనే విఠల్‌ అలవర్చుకుంటాడు. ఇంటి దగ్గర ఉన్నబాకీ 250 రూపాయలు తీర్చుడం కోసం నెలకు పదిరూపాలయ పైగా మిగిలించి ఇంటికి పంపుతాడు. తాను పంపిన డబ్బుతో కొంతయినా అప్పు తీరి ఉంటుందనుకుంటాడు. కొంతకాలం తార్వత తల్లికి ఒంట్లో బాగులేదని తెలిసి ఇంటికిపోతాడు. కాని ఇల్లుచేరి పరిస్థితి చూసాక బాధపడతాడు. తన తల్లి డబ్బుతో అప్పుతీర్చక పోగా చాదస్తపు ఆచారాలకు ఖర్చు పెట్టిందని కోపగించుకుంటాడు. ఇక్కడున్నది బూర్జువా విలువలకు ఫ్యూడల్‌ విలువలకు సంఘర్షణ అని గుర్తించలేక తన శ్రమను వీళ్లు గౌరవించలేదని కోపగించుకొని, ఫ్యాక్టరీలో కూలీలు సమ్మె సమయంలో చూపిన పరస్పర ఆదరాన్ని గుర్తు తెచ్చుకొని మళ్లీ ఇంటికి ఒక్క పైసాగూడ పంపకూడదని నిర్ణయించుకొని తిరిగి పట్టణానికి వస్తాడు. కుటుంబరావు మాటల్లో చెప్పాలంటే ఈసారి అతను ‘నిజమైన పారిశ్రామిక కార్మికుడు’గా పట్టణం ప్రవేశించాడు.
(కుటుంబరావు సాహిత్యం మొదటి సంపుటం – విశాలాంధ్ర ప్రచురణలు, 1982 పై సృజన, జూలై 1982 సంచికలో                   కె. బాలగోపాల్‌ రాసిన సమీక్షా వ్యాసం ప్రాధాన్యత దృష్ట్యా దానిలో నుంచి ఆ ప్రచురణకు సంబంధించిన ప్రస్తావనలు మాత్రం మినహాయించి ఇక్కడ ప్రచురిస్తున్నాం. పునర్ముద్రణకు అనుమతించిన బాలగోపాల్‌కు కృతజ్ఞతలు.)
 విరసం సౌజన్యంతో

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో