కొత్త పేరు కావాలి

ఇంద్రగంటి జానకీబాల
నా ఫోన్‌ ఫ్రండు ఒకరోజు హడావిడిగా వచ్చారు. నేను అతని హడావిడి గ్రహించానుగానీ ఏమిటీ సంగతి? అని అడగలేదు. ముందు క్షేమ సమాచారాలు అయ్యాక ‘ఇంత అర్జంట్‌గా ఎందుకొచ్చారూ అని అడగరేం’ అంటూ అతనే ప్రశ్నించాడు. నేను నవ్వి – ‘ఏముందీ – ఈ పాట ఏ సినిమాలోదీ – ఫలానా పాటరాగం ఏమిటీ? – మరో విధంగా ట్యూన్‌ చేస్తే అది మరీ బాగుండేదేమోలాంటి ప్రశ్నలు అడుగుదామని వచ్చి వుంటారు” అన్నాను.
”ఇంతకుముందు అలాగే వచ్చాను గానీ – ఇప్పుడు వేరే ఒక కొత్త అంశంతో వచ్చాను.”
”అయితే మరీ మంచిది. చెప్పండి” అన్నాను. నా మిత్రుడొకాయనకి మనవరాలు పుట్టింది. ఆ పిల్లకి మంచి పేరు కావాలని అతను మహా హడావిడి పడిపోతున్నాడు. అందులో సంగీతంలో వున్న రాగాల్లోంచి ఒక రాగం పేరు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాడు.” అంటూ తేల్చాడు.
”నిజమే. ఎన్నో అందమైన పేర్లున్న రాగాలున్నాయి. ఏదో ఒకటి చూసి పెట్టవచ్చు.”
”ఆ పని మీరే చెయ్యాలి.”
”చూద్దాం. నేను కొన్ని పేర్లు చెప్తాను. మీకు నచ్చింది అందులోంచి తీసుకోండి. అయితే ఒక చిక్కుంది. రాగాల పేర్లతో సినిమాలు ఒకప్పుడొచ్చాయి. ఇప్పుడు బోలెడన్ని సీరియల్స్‌ వస్తున్నాయి” అన్నాను.
”అలాగాండీ – కొన్ని చెప్పండి.”
కల్యాణి – ఆనందభైరవి – చక్రవాకం – శివరంజని ఇలా వచ్చాయి. అయితే వాటిలో ప్రతీదీ సంగీతంతో ముడిపడి వుండదు. హీరోయిన్‌ పేరు, లేకపోతే కథాపరంగా, సింబాలిక్‌గా వుంటూ వుంటుంది, అంతే.
మా ఫ్రండు ఆలోచనలో పడి చివరికి ”ఏదో ఒకటి కాకపోతే కొత్తగా బాగుండాలి” అన్నాడు.
సంగీత సాంప్రదాయం పాతది. ఈ రాగాలన్నీ పాతవే – మనకి తెలియనిది కొత్తదే కదా! అందమైన పేరు అనండి బాగుంటుంది” అన్నాను.
ఓ పని చేద్దాం మంచి అందమైన సినిమా పాటలున్న రాగం పేరు చెప్పండి. కల్యాణి రాగం నిత్యనూతనమైంది. ఎప్పుడు విన్నా, ఎన్నో కొత్త అందాలు స్మరిస్తాయి.
మన తెలుగు సినిమాల్లో చాలా విస్తీర్ణంగా వాడబడిన రాగం కల్యాణి. అందం, ఆనందం రెండూ కలిసిన గొప్ప అనుభూతి కలుగుతుంది ఆ రాగం వింటుంటే. చక్కని సౌందర్యం గల అమ్మాయి వయ్యారంగా నాట్యంచేస్తూ నడిచి వస్తున్నట్లుంటుంది.
కొన్ని పాటలు ప్రస్తావించుకుందాం. కొన్ని పాతపాటలూ కొన్ని కొత్త (మరీ కొత్తవి కావు) పాటలూ వుంటాయి.
జె.వి. రమణమూర్తి హీరోగా నటించిన ‘మంచిమనసుకు మంచిరోజులు’ అనే సినిమాలో ‘రావే నా చెలియా’ అనే పాట ఘంటసాల స్వయంగా బాణీ కూర్చి పాడారు. రచన సముద్రాల. ఇది అందంగా, హాయిగా వుంటుంది. ఇది కల్యాణే. ఈ కల్యాణి సంపూర్ణరాగం. చాలా పెద్ద రాగం ‘స-రి-గ-మ పదనిసా’ చాలా విస్తీర్ణం గల రాగం. ఎన్ని పాటలు కంపోజ్‌ చేసినా, కొత్తకోణాలు కనిపిస్తూనే వుంటాయి. ఆలోచించగల శక్తి వుండాలే గాని, అమూల్యరత్నాలు పోగుచేసుకోవచ్చు.
భానుమతి తన ప్రతి సినిమాలోనూ ఒక త్యాగరాజకృతి పాడుతారని మనకి తెలుసుకదా! ఆమె ‘వరుడు కావాలి’లో కల్యాణిలో ‘ఏతావున రా – నిలకడ నీకు’ పాడారు.
జగమే మారినది మధురముగా – దేశద్రోహులు ఘంటసాల, సుశీల (విడివిడిగా)  ఇలా వ్రాసుకుంటే పోతే కొన్ని వందల పాటల్ని ఉదహరించవచ్చు. తెలుగు సినిమా పాట స్వర్ణయుగంలో ప్రతీసినిమాలోనూ ఒక పాటైనా కల్యాణిలో వుండేది.
కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో కూడా సినిమాలాగా జనసామాన్యంలో పాపులరైన కృతులున్నాయి. ‘నిధి చాల సుఖమా’ (త్యాగరాజకృతి) ‘వాసుదేవయని’, ‘అమ్మా రావమ్మ’, ‘సుందరీ నీ దివ్యరూపము’, ‘బిరాన వరాలిచ్చి’, ‘హిమాద్రిసుతే’, ‘నినువినాగతిగానజగాన’.
ఈ కల్యాణి రాగం చాల శుభప్రదమైనదని అందరూ ఎంతో భక్తితో భావిస్తారు. ఏ సమయంలోనైనా పాడదగిన రాగమని విద్వాంసులు చెప్తారు.
”అయ్యబాబోయ్‌ – ఒక పేరడిగితే ఇవన్నీ చెప్పేరే” అన్నాడాయన. ”మరేం ప్రమాదం లేదులెండి, మీ ఫ్రండ్‌కి కల్యాణి అని వాళ్ళ మనవరాలికి పేరు పెట్టమనండి” అన్నాను.
‘పాతగా వుందండి పేరు’ నీళ్ళు నమిలాడు.
‘ఆనందభైరవి.’
‘మరీ సురభివాళ్ళు గుర్తుకొస్తారండి.’
‘అమృతవర్షిణి.’
‘సీరియల్‌ వస్తోందండీ.’
‘పోనీ చక్రవాకం.’
‘అదీ సీరియల్లే.’
చూడండీ – రాగాలపేర్లతో ఫీచర్సు వ్రాయడం, ఆర్టికల్స్‌ వ్రాయడం, సినిమాలు తీయడం వుంటూనే వుంటుంది. రాగాలే కాదు స్వరాల పేర్లతో కూడా ఫీచర్స్‌ వుంటాయి.
”అయితే ఎవ్వరూ ఎక్కడా పెట్టని ఒక అందమైన రాగం పేరు వెతికి పెట్టండి. నేను మళ్ళీ వస్తాను” అంటూ నా ఫోన్‌ ఫ్రెండ్‌ లేచాడు.
శాస్త్రీయరాగాలు హాయిగా వున్నాయి. మీ ఫ్రెండువాళ్ళ మనవరాలికి పేరుపెట్టకపోతే కొంపలేం మునిగిపోవు అని మనసులో అనుకుని పైకి మాత్రం ‘మంచిదండి-నమస్కారం’ అన్నాను.

Share
This entry was posted in పాటల మాటలు. Bookmark the permalink.

2 Responses to కొత్త పేరు కావాలి

  1. swamy says:

    నాక్
    తెలుగు పేర్లు కవలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో