ఆడదిక్కు

– లతాశర్మ (అనువాదం: ఆర్. శాంతసుందరి)

“అమ్మా! తొమ్మిదిన్నరవుతోందే, ఇంకా ఎంతసేపిలా ఆకలితో కూర్చునుండాలి?” రమ ఎంతో సౌమ్యంగా అడిగింది.

“ఇదిగో, ఐదే ఐదు నిమిషాలు!” అమ్మ చటుక్కున లేచి వెళ్ళి బాత్రూమ్ తలుపు మళ్ళీ తట్టింది.” ఒరే అమర్, త్వరగా రారా!… అక్క యింకా ఏమీ తినకుండా కూర్చునుంది!” అంది.

బాత్రూమ్లోంచి జవాబేమీ రాలేదు కానీ కూనిరాగం తీస్తూ అమర్ స్నానం చేస్తున్న చప్పుడు వినిపించింది. రమ మళ్ళీ గడియారం వైపు చూసింది. తొమ్మిదీ ముప్పావు! రోడ్లమీద రద్దీ పెరిగిపోయి వుంటుంది. కార్లూ, స్కూటర్లూ, బస్సులూ… బంపర్ టు బంపర్ ట్రాఫిక్! ట్రాఫిక్ లైట్లు ఎరుపు చూపిస్తే చాలు, ట్రాఫిక్ జామ్! ఇప్పుడు ఇంట్లోంచి బైట పడితే సెక్రెటేరియట్ చేరేసరికి సరిగ్గా గంట!

రమ తల విదిలించి విసుక్కుంది.

ఇవాళ ఆఫీసుకేం వెళ్ళక్కర్లేదు! ఇంకా పదిహేను రోజుల మెడికల్ లీవుంది. అలవాటు ప్రకారం గడియారం ముళ్ళని చూస్తూ అన్ని పనులూ చేస్తోంది, అంతే! చాలా ఏళ్ళుగా తొమ్మిదిన్నరకల్లా అన్నం తిని ఇంట్లోంచి బైటపడటం అలవాటయ్యేసరికి, ఆఫీసు లేకపోయినా తొమ్మిదిన్నర అయ్యేసరికల్లా విపరీతమైన ఆకలి వేస్తుంది. పైగా ఆపరేషన్ అయినప్పటినించీ, ఒంట్లో ఎప్పుడూ నీరసంగానే వుంటోంది. తల దిమ్ముగా వుంటుంది. రెండు గంటలకొకసారి ఏమైనా తాగాలనీ, తినాలనీ అనిపిస్తుంది. నీరసం వల్ల కాళ్ళూ, చేతులూ ఎప్పుడూ మంచులాగ చల్లగా వుంటాయి, కళ్ళు బైర్లు కమ్ముతూంటాయి.

“అమ్మా, ఇంకా నాకు తినటానికేమైనా ఇయ్యి, మందు వేసుకోవాలి. తినేసి, మందేసుకుని, పడుకుంటాను, కూర్చోలేక పోతున్నా. ఆ తంతేదో సాయంత్రం చేసుకోవచ్చులే!” అంది రమ.

“అదేమిటే? ఉదయాన్నే స్నానం చేసి, పరగడుపున రాఖీ కడతారందరూ. నువ్వేమిటి సాయంత్రం కడతానంటావు?” తల్లి విసుక్కుని, తలొంచుకుని తనలో తనే ఏమిటో గొణుక్కోసాగింది.

“ సరే అయితే, అమర్ తయారయ్యాక నన్ను పిలు. నే వెళ్ళి కాసేపు పడుకుంటున్నా… కళ్ళు తిరుగుతున్నాయి” అని రమ తన గదిలోకెళ్ళి పడుకుంది. పడుకునే ఆలోచించసాగింది…

ఎంత ఆశ్చర్యం! ఇరవై ఏళ్ళుగా ఈ ఇల్లు గడవటానికి సంపాదించి తెస్తున్నది తను, కానీ ఇంట్లో అమర్కి వుండే స్థానం తనకి లేదు. అమ్మ వాడికిష్టమైన పదార్థాలే వండుతుంది, వాడి వీలూ చాలూ చూసుకునే ఇంట్లో పండగలూ, పబ్బాలూ జరుపుతుంది, వాడు ఎక్కడికైనా బైటికెళ్తానంటే అమ్మ చేసే హడావిడి ఇంతా అంతా కాదు! వాడు మళ్ళీ ఇంటికొస్తే ఆవిడ మొహం వెయ్యి వాట్ల బల్బులా వెలిగిపోతుంది! తను ఆ ఇంట్లో ఉత్త ఏ.టీ.ఎమ్ మాత్రమే! డబ్బులు తీసుకోవటానికి పనికి వచ్చే ఒక యంత్రం! అది కూడా డబ్బులేమీ జమ చెయ్యకుండానే!… మొదట్లో తన జీతం మొత్తం తల్లి చేతికిచ్చేసేది. ఆ డబ్బుని ఆవిడ ఏం చేసేదో కానీ, నెలాఖరు రోజుల్లో పప్పు, ఉప్పు, కూరలు కొనటానికి కూడా డబ్బులుండేవి కాదు. పాలవాడి దగ్గరా, కిరాణా దుకాణంలోనూ అప్పు ఎలాగూ వుండనే వుండేది. అమర్ తరచు వీడియో పార్లర్లో వీడియో గేమ్స్ అడటానికి వెళ్తూ వుండటం రమ గమనించింది. అది ఫస్టు తారీకయినా, నెలాఖరయినా వాడికి లెక్క వుండదు. దాంతో తను తల్లికి జీతం డబ్బులు ఇవ్వటం మానేసింది, ఇంటి ఖర్చులు తనే చూసుకోసాగింది. ముగ్గురు చెల్లెళ్ళని చదివించి వాళ్ళకి పెళ్ళి చెయ్యాల్సి వుంది! తను డబ్బులివ్వటం మానేసరికి అమ్మ పెద్దగా శోకాలు పెట్టింది! “నా ఇంట్లోనే నా గతి పనిమనిషికన్నా హీనమైపోయింది. తండ్రిలేని పిల్లాడు, వాడి సరదాలు కూడా తీర్చలేకుండా నా ఖర్మిలా కాలింది… ఆయనే కనక వుంటేనా….” అని తనని దులిపేసింది. కానీ తను మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. ఇల్లు రెండు పక్షాలుగా చీలింది. తల్లీ, అమర్ ఒక పక్షం, తను ఇంకో పక్షం! ముగ్గురు చెళ్ళెళ్ళూ ఒక్కోసారి ఒక్కో పక్షంగా వుండేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎక్కువ లాభం కలుగుతుందనిపిస్తే అటు మొగ్గేవాళ్ళు! తను ఎంత ఒంటరిదైపోయింది! ఎంత పనికి రాకుండా పోయింది! తనని ఎవరూ పట్టించుకోరు. జబ్బు పడినప్పుడే తనకా విషయం తెలిసొచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో దిక్కులేనిదానిలా ఒక్కత్తీ పడుంది. గర్భసంచిలో పుండు లేచింది, ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆఫీసులో తనతో పనిచేసేవాళ్ళే తనని చూసుకున్నారు. ముగ్గురు చెళ్ళెళ్ళు తమ సంసార బాధ్యతలతో తలమునకలై ఉన్నారు. వాళ్ళెలా వచ్చి సాయం చేయగలరు? తల్లి ఒక్కత్తీ ఎప్పుడూ గడపదాటి ఎరగదు! ఇంక మిగిలింది అమర్ – వాడు జీవితంలో ఎప్పుడూ ఎవరి బాధ్యతా తీసుకోవటం నేర్చుకోనేలేదు!

డాక్టర్లు ఇచ్చిన డేట్కి తను ఒంటరిగా వెళ్ళి ఆస్పత్రిలో చేరింది. ఆపరేషనయి, ఇంటికి వెళ్ళే రోజున ఆఫీసు కొలీగ్ రేఖ ఇంట్లో దిగబెట్టింది. ఆ ఇరవై రోజులూ తను చచ్చిందో, బతికిందో చూడటానికి కూడా ఇంట్లో వాళ్ళెవరూ రాలేదు. బహుశా తన తప్పు కూడా వుందేమో! నలుగురు అక్క చెల్లెళ్ళకి ఒక్కడే తమ్ముడు. తనకీ వాడికీ వయసులో చాలా తేడా… తల్లీ కొడుకుల కుండేంత! తనకి పిల్లలు లేరు, పుట్టే చాన్స్ కూడా లేదు, తమ్ముణ్ణే తన కొడుకులా ప్రేమించింది. ముసలి వయసులో ఆదుకుంటాడని ఆశపడింది. కానీ తల్లి చూపించే అతి ముద్దు వాణ్ణి ఎందుకూ పనికి రాకుండా చేసేసింది. ఆవిడ వాణ్ణి కొడుకు కన్నా కూడా ‘ఇంటికి మగదిక్కు’ గానే చూసింది. ఎండ ఎక్కువగా ఉన్నా, వాన కురుస్తున్నా వాణ్ణి బైటికి వెళ్ళనిచ్చేది కాదు. స్కూలుకెళ్ళకపోతే వాణ్ణి ఎవరూ ఏమీ అనకూడదు. వాడు ఎటువంటి క్రమశిక్షణా లేకుండా పెరిగాడు. వాడి కోరికలన్నీ తీర్చాల్సిందే! ‘ఇంకా చిన్నవాడేగా, ఇప్పుడు ముద్దు చెయ్యకపోతే ఇంకెప్పుడు చేస్తాం…’ ఇదీ ధోరణి! ఆవిడ వాడు చేసే ప్రతి తప్పునీ కప్పి పుచ్చేది. నానా అవస్థా పడి పరీక్షలు తప్పుతూ, అత్తెసరు మార్కులు తెచ్చుకుంటూ, పన్నెండో తరగతి పూర్తి చెయ్యటానికి అమర్కి ఇరవై ఏళ్ళు పట్టింది! ఆ తరవాత ఏవేవో కోర్సులంటూ డబ్బులు తగలెట్టాడు. ఆ తరవాత తను ఇంక అప్పులు చెయ్యనని భీష్మించుక్కూర్చునేసరికి, మొహం గంటు పెట్టుకుని, ఊరికే పనిపాటూ లేకుండా రోడ్లు కొలుస్తున్నాడు. తన తల్లి వాడి పెళ్ళి గురించి కలలు కంటోంది!… నాన్న వుంటే ఎలా వుండేదో?… బహుశా తను కూడా పెళ్ళి చేసుకుని, పిల్లా పాపతో హాయిగా వుండి వుండేది!… ఈ వెట్టి చాకిరీ చెయ్యాల్సిన గతి పట్టేది కాదు. అవును ఇది వెట్టిచాకిరీ కాక మరేమిటి? ఏ ఇంటికైతే తను సర్వస్వం ధారపోసిందో ఆ ఇల్లు తనది కాదు, అమర్ది! అమర్గారు, ఏమీ చెయ్యకుండా బలాదూర్ తిరిగే బాపతయినా, ఈ ఇంటికి యజమాని ఆయనగారే! బహుశా వాడు ఇక ఏ పనీ చెయ్యకూడదని తీర్మానించుకునే వుంటాడు. అవసరమేముంది? తను సంపాదించే జీతంతో ముగ్గురి జీవితాలూ సుఖంగా గడిచిపోతున్నాయిగా! బహుశా నలుగురున్నా ఇబ్బందేమీ వుండదని కాబోలు, అమ్మ వాడికోసం పెళ్ళి కూతుర్ని వెతుకుతోంది. మొదట తను వద్దని స్పష్టంగా చెప్పింది.

“వాణ్ణి ముందేదైనా ఉద్యోగం చూసుకోమను, సంపాదన పరుడవనీ, ఆ తరువాత పెళ్ళి సంగతి ఆలోచించు” అంది.

కానీ అమ్మ తన మాట విందా?

“ఇది మరీ బావుందే! ఉద్యోగం ఏదో ఒకటి చెయ్యకపోడులే, రేపో మాపో దొరక్కపోదు, కానీ పెళ్ళి అనేది వయసు ముదిరిపోతే ఏం చేస్తాం? ఎన్ని సంబంధాలొస్తున్నాయనుకున్నావు? వేలకి వేలు కట్నాలు కూడా ఇస్తామంటున్నారు తెలుసా? మరి పెళ్ళి చెయ్యటానికి ఆలస్యం దేనికి? ఇక ఉద్యోగం సంగతంటావా?… కాబోయే మామగారు పైన ఇల్లు కట్టించి ఇస్తా నంటున్నాడు. అది అద్దెకివ్వచ్చు. మనకెలాగూ సరిపోతూనే వుంది కదా! ఆ అద్దె వాడికీ వాడి పెళ్ళానికీ ఇచ్చేస్తాం. అయినా ఆ పిల్ల తండ్రి మనకోసం ఏమీ కట్టించటం లేదులే, ఇదంతా ఆయన కూతురి కోసమూ, అల్లుడి కోసమేగా?” అంది తల్లి.

రమ నోటంట మాట రాలేదు.

“ అంతా అమర్దీ వాడి పెళ్ళానిదీ అయితే, మరి తనో? ముసలి తనంలో తనెక్కడికి పోతుంది? అయినా చూద్దాం, ఈవిడ ఇంకేం ప్లాన్లు వేస్తోందో!” అనుకుని, “సరే ! పైన మామగారు కట్టిస్తారనే అనుకుందాం, మరి పెళ్ళి ఖర్చుల మాటో?” అంది.

తల్లి ఆశ్చర్యపోయింది, ‘అయితే రమ డబ్బు సాయం చేయదా?’ అనుకుని కొడుకుముందు నీరు కారిపోయినట్టే కూతురి ముందు కూడా చేతులు నులుపుకుంటూ,’ ఇది ఈ ఇంట్లో ఆఖరి పెళ్ళి రమా! ఆ తరవాత నీమీద ఇంక ఎటువంటి భారమూ వెయ్యం. నీ ఇష్టం వచ్చినట్టుండచ్చు. నీ ఇష్టం వచ్చిన చోటికెళ్ళచ్చు!” అంది.

“నాకిప్పుడు యాభై రెండేళ్ళు, ఈ వయసులో ఏం చెయ్యమంటావు? ఇష్టం వచ్చిన చోటికెళ్ళొచ్చు అంటున్నావు, అంటే అమర్ పెళ్ళయ్యాక నన్నింకో ఇల్లు చూసుకోమని అర్థమా?”

“అరే, నేనలా అనలేదు… ఇంకో ఇల్లు చూసుకోమని ఎందుకంటానే?… విషయమేమిటంటే, అమర్ కాబోయే మామగారు, ముందుగదికి షటర్ పెట్టించి, దాన్ని దుకాణంగా మారుద్దామని అన్నాడు. ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించుకోవచ్చని ఆయన ఉద్దేశం. అమర్, వాడిపెళ్ళాం కలిసి చూసుకుంటారు”

“ఆహాఁ, అంటే నా గదిని కొట్టుగా మారుస్తారన్నమాట! కాని ఈ సంగతి ముందుగా నాతో చెప్పాలని మీకెవరికీ అనిపించలేదు కదూ?”

“అమర్ ఏమన్నాడంటే….”

“ఏమన్నాడు అమర్?” రమ గట్టిగా అరిచింది. “ ఇరవై ఏళ్ళుగా ఈ సంసార బాధ్యతంతా మోస్తున్నాను. ముగ్గురు చెల్లెళ్ళని చదివించి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాను. సరైన వయసులో నాకే గనక పెళ్ళయి వుంటే, అమర్ వయసు కొడుకుండేవాడు నాకు! కానీ ఇప్పుడో, ఆ గుంట వెధవ సలహా ప్రకారమే ఈ ఇంట్లో అన్నీ జరుగుతున్నాయి, అవునా?”

“ వాడేమీ చిన్న పాలుతాగే పాపాయి కాదుగా?” అమ్మ కూడా కోపంగా అంది. “వాడికిప్పుడు పాతికేళ్ళు!”

“ అవును పాతికే! పాతికేళ్ళొస్తే మరి ఆ వయసువాళ్ళు చేసే పనులు చెయ్యడేం? ఉద్యోగం చేసి నాలుగు రాళ్ళు సంపాదించొచ్చుగా? కనీసం నీ మందులకీ, వెచ్చాలకీ ఆ డబ్బు పనికి వస్తుందిగా?”

ఇంక తల్లి బ్రహ్మాస్త్రం ప్రయోగించింది! వెక్కి వెక్కి ఏడవసాగింది.

“ మీ నాన్నే వుంటే నేనిన్ని మాటలు పడవలసొచ్చేదా? నామీద ఎలా అరుస్తున్నావు? ఎంత చేసినా కూతురు కూతురే, కొడుకు కొడుకే. కొడుక్కి దిక్కూ మొక్కూ లేని తల్లిమీద వుండే ప్రేమ కూతురికెందుకుంటుంది. మీ నాన్న…”

“ ఇంకా ఆపమ్మా! నాన్నే వుంటే ఈరోజు నా సుఖం గురించి కూడా ఆలోచించి వుండేవాడు. నాకూ పెళ్ళయుండేది, ఇల్లూ వాకిలీ, పిల్లా జెల్లా వుండేవి. దిక్కులేని దానిలా ఆస్పత్రిలో ఒంటరిగా పడుండేదాన్ని కాదు! అమర్ వయసు కొడుకు నా బాగోగులు చూసుకోటానికి వుండేవాడు. నా కష్టసుఖాలు పంచుకునేందుకు నా వాళ్ళంటూ వుండేవాళ్ళు… ఎప్పుడూ వాళ్ళ అవసరాల గురించే ఆలోచించేవాళ్ళు కాదు…” తను అమ్మతో యింకా ఏదో యిలా అంటూ వుంటే, ఆలోచనలకు అంతరాయం కలిగింది…

“రమా… రా… అమర్ రెడీ అయిపోయాడు!”

అమ్మ పిలుపుతో రమ ఈ లోకంలోకొచ్చింది. నెమ్మదిగా లేచి, గోడ పట్టుకుని నడుస్తూ పూజగదిలోకొచ్చింది. కొత్త షర్టూ, పాంటూ తొడుక్కుని, ఈలవేస్తున్నాడు అమర్. పీటా, కలశం, పూజకి అన్నీ సిద్ధం చేసిన పళ్ళెం చూసి ఆగిపోయాడు.

“ఇవన్నీ ఏమిటి?”

“ఇవాళ రాఖీ పండగరా, అమర్! పద త్వరగా పీటమీద కూర్చో. అక్కయ్య రాఖీ కడుతుంది… పాపం పొద్దున్నించీ అది ఉపవాసం చేస్తూ ఆకలితో వుంది!”

“ఇవాళ రాఖీయా?” అమర్ తల్లిని చూస్తూ అడిగాడు… అంటే నా చేతిలో ఏమైనా డబ్బు పెడితే, అది అక్కకిస్తాను అని కాబోలు! మరి అమ్మ మాటేమిటి? ఆమె తలెత్తి రమకేసి చూసింది. గబుక్కున వందో రెండువందలో తీసివ్వటానికి ఆమె ఏమైనా సంపాదిస్తోందా?

“ ఆగు!” పీటమీద కూర్చోబోతున్న అమర్ని ఆపింది రమ.” ఈ నాటకాలు నేనింక భరించలేను!” అంటూ తను వెళ్ళి పీట మీద కూర్చుంది. ఆమె కోపం చూసి తల్లీ, అమర్ భయపడిపోయారు.

“కూర్చో అమర్! నాకు తిలకం దిద్దు! రాఖీ కట్టు, హారతియ్యి! స్వీటూ, హాట్ ఏదో ఒకటి తినటానికియ్యి,” అంటూ వందరూపాయల నోటు పళ్ళెంలో వేసింది. “ నేనింతవరకూ నిన్ను కాపాడుతూ వచ్చాను, ఇకముందు కూడా కాపాడతాను!” అంది.

రమ తన ఎడమచెయ్యి ముందుకు చాచింది” రాఖీ కట్టరా అమర్!” అంది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

4 Responses to ఆడదిక్కు

  1. కథ చాన మంచిగ ముగించినరు.

  2. bhavani says:

    కధ ఇతివృత్తం చాలా బాగుంది. ముగింపు నచ్చింది. ,,,..చిల్లర భవానీ దేవి

  3. bhavani says:

    భూమిక రెగులర్ గా చదువుతున్న. చాలా బాగుంది. చిల్లర భవాని దెవి

  4. Pavani B says:

    సూపర్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.