రుగ్మతలు మహాత్యాలవుతున్నపుడు

కొండేపూడి నిర్మల
నిన్నగాక మొన్న కర్నాటకలోని కోలారు జిల్లా, కిలాగణి చంద్రశేఖర్‌ అనే ఇంటర్‌ విద్యార్ధి పాతిక సార్లు మగధీర సినిమా చూసి, అందులోని హీరోలాగే పునర్జన్మకి ఎగరాలనుకున్నాడు. కాలయముడిని పూజించి(?) తన రక్తంతో – జై మగధీర అని గోడ మీద రాసి, విషం తాగి మరణించాడు. ఇంత కిరాతక స్ఫూర్తి కలిగేలా సినిమా తీసిన వాళ్ళెవరూ చంద్రశేఖర్‌ మళ్ళీ పుట్టాడో లేడో చూసి వచ్చి గుండె పగిలిన ఆ తల్లి దండ్రులకి చెప్పలేదు.
 కర్నూలు, బండి ఆత్మకూరు నుంచి ఏడేళ్ళ పిల్ల శాంభవి తను పూర్వజన్మలో టిబెట్టు వాసి, బౌద్ధ గురువు దలైలామాకు సహచరినని, వారణాసిలో కలిసి సహజీవనం చేశామని చెబుతోంది. కర్పూర వసంతరాయలు, పోతులూరి వీరబ్రహ్మం మళ్ళీ పుడుతున్నారని చెప్పడమే కాకుండా చిత్తర చూపుల మధ్య  అచ్చం పలుకులు నేర్చిన చిలకలాగా భారత్‌,చైనాల మధ్య కొన్ని  అంతర్జాతీయ మార్పులు వచ్చేస్తాయని కూడా సూచనలు చేస్తోంది. దేవాదాయశాఖల్లో జరుగుతున్న అవినీతికి అంత లావు దేవుడూ బలహీనుడెలా అవుతున్నాడో, సదరు ఈ వ్యక్తులకీ, దైవానికీ మధ్య కూడా పూర్వ జన్మ వాసనలు వున్నాయేమో తెలీదు.
అదిలాబాద్‌జిల్లాలో శివభక్తురాలయిన పదేళ్ళ బాలిక మంజునాధ సినిమా చూసి బొందితో సహా కైలాసానికి వెళ్ళడం కోసం వొళ్లు తగల బెట్టుకుని చనిపోయింది.
అనసూయ అనే సినిమాలో, చనిపోయి వైద్య కళాశాలలో భద్రపరచబడి వున్న ప్రేయసి శరీరంలోంచి ఎవరెవరికి ఏ అవయవాన్ని అమర్చారో వారందర్నీ చంపుతూ, ఆ భాగాల్ని సేకరించి జాడీల్లో దాచిపెట్టి, శవానికి అతుకుపెట్టి పునర్జన్మ దక్కించాలనే అంశంతో ఒక సైకో ప్రేమికుడు కనబడతాడు. ఇందులో వున్న హింస జుగుప్స, సంబంధింత న్యాయ, చట్ట, గోప్య హక్కుల ఉల్లంఘనలు పక్కన పెడితే, నూటికి నూరుపాళ్ళు ఇది అవయవ దానానికి వ్యతిరేకత కలిగించే అంశమని ఒక డయాలిసిస్‌ బాధితురాలు ఇవ్వాళ టివి చాట్‌ షోలో విలపిస్తూ చెప్పింది.
ఇస్రో ఛైర్మన్‌ ఆకాశంలోకి రాకెట్‌ ఎగరెయ్యడానికి ముందు జుట్టుబాబా పాద తీర్ధం అందుకుంటాడని మనకి తెలుసు.. వాస్తు భయంతో మంత్రులు అసెంబ్లీ నిర్మాణాలు మార్చడం కళ్ళారా చూసి వున్నాం. ఇంత చేసినా చివరికి పాపం, వ్యక్తిగత భద్రతాదళం చేతిలోనే హరీ అంటున్నారనుకోండి. అది వేరే విషయం. ఇది భావ స్వేఛ్ఛ పెక్కుటంగా వీచే ప్రజాస్వామ్యం. ఇక్కడ ఏం జరిగినా జరుగు తుంది. ప్రభుత్వం గురించి తప్ప ఏది మాట్లాడినా పండుతుంది. ఈ పంటకి కడుపు కోతలేదు. పుస్తెలమ్మి పురుగుల మందు కొనక్కర్లేదు ఎంచక్కా పండించినవాడూ, దళారీగాడూ అందరూ లబ్దిదారులు అవుతారు.
ఇవాళ నేను నిద్ర మంచం మీంచి దుప్పటి ముసుగు తీసేలోపే కొన్ని ప్రశ్నలు వినిపించాయి…బ్రష్‌ చేసుకుంటూనే అటు తొంగి చూశాను…మా అమ్మ ఒక ఛానలు అత్యంత ఆసక్తిగా చూస్తోంది. ”కార్తీక దీపారాధన ఆవు నేతితోనే ఎందుకు చెయ్యాలి?.. పడమటి దిక్కున నిద్రస్తే శిరోభారం ఎలా వస్తుంది? పున్నామ నరకం కొడుకు ఎలా దాటించాలి..? ఇంటి మీద కాకి అరిస్తే బంధువులు ఎందుకు వస్తారు? అంటూ వివేక వంతులైన వీక్షకుల్ని ఉద్దేశించి అక్కడున్న పండితురాలు అద్భుతమైన స్వర గంభీర గమకాలతో కొన్ని ప్రశ్నల్ని సంధిస్తోంది. అటువంటి జీవన్మరణ సమస్యా పూరణాలు వదిలి మా అమ్మ ఇహ ఇవ్వాళ కాఫీ కలపదని నాకు అర్ధమైపోయింది… అవును. మరి, సమస్యలంటే.. అవే కదా..?
 టూత్‌ పేస్ట్‌ ధరలు తగ్గవు? నెలతిరక్కుండానే సిలిండరు ఎలా అయపోతోంది? అందులో సగం ఇంధనమే నింపడానికి కారణమేమిటి…? ఈ తిరగని మిక్సీకి మొన్న బజారులో ప్రకటించిన జీవిత కాలపు గ్యారంటీకి అర్ధమేమిటి..? అది అమ్మిన వాడి జీవితమా, కొన్నవాడి జీవితమా, తయారీ దారుడి జీవితమా, పక్కింటి వాడి జీవితమా…? సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో మూడు వేలు తగలేసినాగాని, తగ్గకుండా తిరగబెట్టిన మా మామగారి దగ్గు, పచారీ దుకాణం వాడిచ్చిన చిటికెడు కరక్కాయ పొడితో ఎలా తగ్గింది? ఇలాంటి ”నేల బారు” ప్రశ్నలకి జవాబు వెతకడంలో పస ఏముంది చెప్పండి…? కాబట్టి పునర్జన్మ కోసం చేసుకునే ఏర్పాట్లు, కిందటి జన్మలో చేసిన ఘనకార్యాలు ఆకర్షణీయంగా వినిపిస్తాయి. దానాదీనా తేలిపోయినదేమిటంటే ఈ జన్మ వదిలి కిందటి జన్మ అకౌంటులోనో, పై జన్మ అడ్వాన్సు మీదో బతకడం లాభదాయకమని ఖరారై పోయింది. జానపద అద్భుత కధలకి నేను వ్యతిరేకం కాదు. మూగ మనసులు చూసి ముక్కు చీదిన బాల్యం మర్చిపోలేదు. అయితే అవాస్తవికతలూ అశాస్త్రీయతలూ నమ్మలేం కదా? బతుక్కి అన్వయించుకోలేం కదా…! మైకేల్‌ జాక్సన్‌ ఆత్మ ప్యారడైజ్‌లో తిరుగుతోందని దృశ్యీకరిస్తే కళ్ళు పెద్దవి చేసి చూడ్డానికి బావుంటుంది. కానీ ఆ ఆత్మ విశాలంగా గాల్లో ఈదడానికి మన ఇంటినీ, బడినీ పడగొట్టి పిట్టగోడ కడతామంటే ఒప్పుకోలేం కదా? ఆ పనికి చట్టమూ న్యాయం వంత పాడితే అనుమానించాలి కదా! ఇవ్వాళ మన కళ్లముందు గారడీ చేస్తున్న ప్రాణాంతక, ఆధ్యాత్మిక, జన్మాంతర రకెట్స్‌ అలాంటివే. ఈ జన్మలోనే ఇంకాసేపటికి ఏం జరుగుతుందో తెలీదు కానీ, వచ్చే జన్మకోసం, కిందటి జన్మ కోసం కన్నుకొట్టి, ఈల వేసుకుంటూ వన్స్‌మోర్‌ అడిగితే అప్పుడింక చింత బరికె పుచ్చుకుంటే తప్ప లాభం లేదు. రుగ్మతలు మహత్యాలవుతున్నప్పుడు ప్రకృతి వైద్యం తప్పనిసరి అవుతుంది.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో