మరుపురాని మేటి మహిళ మాణిక్యాంబ గారు

 వేములపల్లి సత్యవతి
రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి తరిమి కొట్టటానికి జాతిపిత మహాత్మాగాంధీ నాయకత్వంలో పలురకాల వుద్యమాలు జరిగినవి. ఆ వుద్యమాలలో దేశంలోని విద్యావంతులు, న్యాయవాదులు, వైద్యులు, ఉపాధ్యాయులు, యువకులు, విద్యార్థులు, కార్మిక-కర్షకులు, చదువుకోనివారు కూడా పాల్గొన్నారు. జనాభాలో సగభాగమైన మహిళల భాగస్వామ్యం లేకుండ వుద్యమాలు విజయవంతం కావని బాపూజీ గ్రహించారు. మహిళలు కూడ వుద్యమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన పిలుపుకు స్పందించిన మహిళలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి ఆనాటి సాంఘిక కట్టుబాట్లను తెగత్రెంచుకొని వుద్యమాలలోకి వురికారు. తమ వంటిమీదవున్న బంగారు ఆభరణాలను విరాళంగా బాపూజీకి అర్పించారు. వివాహబంధానికి అతి పవిత్రంగా భావించే మంగళసూత్రాలను కూడ యిచ్చిన మహిళలున్నారు. కల్లు దుకాణాల వద్ద – విదేశీ వస్త్రాలయాల కాడ పికెటింగులు చేశారు. సత్యాగ్రహాలలో పాల్గొన్నారు. పోలీసుల లాఠీలకు ఎదురు నిలిచారు. జైళ్లకెళ్లారు. అలాంటి మహిళల్లో చెప్పుకోదగిన ఒక మహిళ మాణిక్యాంబ గారు.
 1913లో తూర్పుగోదావరి జిల్లాలోని తొండవరం గ్రామంలో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పుట్టినిల్లు-మెట్టినిల్లు రెండూ కూడ ఆర్థిక యిబ్బందులు లేని కలవారి కుటుంబాలే మాణిక్యాంబగారివి. ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ నిర్మాతలలో ప్రముఖులైన కంభంపాటి సత్యనారాయణ గారితో మాణిక్యాంబగారి వివాహం జరిగింది. గాంధీజీ పిలుపుకు ప్రభావితులై జాతీయోద్యమంలో అడుగుపెట్టారు సీనియర్‌ సత్యనారాయణ గారు. తనతోపాటు తన జీవిత సహచరిణిని కూడ చైతన్యపరచి జాతీయోద్యమాలలో పాల్గొనేలాగ ప్రోత్సహించారు. జాతీయోద్యమంలో భాగమైన ఖాదీ ప్రచారంలో పాల్గొన్నారు మాణిక్యాంబగారు. రాట్నాల మీద నూలు వడకమని, ఖద్దరు ధరించాలని ప్రజలలో ప్రచారం చేసారు. ఆ సందర్భంలోనే పోలీసులు ఆమెను అరెస్టుచేసి జైలుకు పంపారు. ఈ ప్రచార సందర్భంలో పోలీసులు మాణిక్యాంబగారిని అరెస్టు చేయటానికి గాలింపు మొదలుపెట్టారు. ఆ సంగతి తెలుసుకున్న మాణిక్యాంబగారు వస్త్రధారణ మార్చుకొని వెంట పూజాసామాగ్రిని తీసుకొని యిరువురు మహిళా కార్యకర్తలతో కలసి జట్కాబండిలో ఎక్కి దూరానవున్న దేవాలయానికి వెళ్లి అందులో ప్రవేశించి తప్పించుకున్నారు పోలీసుల కళ్లుగప్పి. జాతీయోద్యమంలో పనిచేస్తూనే కమ్యూనిస్టులుగా మారారు దంపతులిరువురు.
 మీరట్‌ కుట్రకేసునుంచి తప్పించుకొని హైదర్‌ఖాన్‌ అనే యువకుడు మద్రాసు మహానగరం చేరాడు. అజ్ఞాత జీవితం గడుపుతూనే కాంగ్రెస్‌లో అతివాద భారాలుగల యువకులను సంఘటితపరచి కమ్యూనిస్టులుగా తయారుచేశాడు. పులుపుల శివయ్యగారు, తుమ్మల వెంకట్రామయ్యగారు, సీనియర్‌ సత్యనారాయణ గారు హైదర్‌ఖాన్‌ ప్రభావానికి లోనై కమ్యూనిస్టులుగా మారారు. వేళ్లమీద లెక్కింపదగిన సంఖ్యలో వున్న యువకులలో ఒకే ఒక్క యువతి హైదర్‌ఖాన్‌ ప్రభావానికి ఆకర్షితురాలై కమ్యూనిస్టు అయిన మేరనగ సీనియర్‌గారు మాణిక్యాంబగారితో కలసి మద్రాస్‌లో కాపురం పెట్టారు. వారు వుంటున్న ప్రదేశంలో మాంసాహార కుటుంబాలవారు కూడ వుండేవారు. చాపల వాసన, మసాళాల వాసన అప్పటివరకు ఎరగని మాణిక్యాంబ గారికి ఆ వాసనల వలన కడుపులో వికారంగాను, దేవినట్టుగాను వుండేది. అయినా తోటివారి అలవాట్లను ఏవగించుకోకుండ అలవాటుపడటానికి ప్రయత్నించేవారు. సీనియర్‌గారు, హైదర్‌ఖాన్‌ ఆమెకు నచ్చచెపుతుండేవారు. పుచ్చలపల్లి సుందరయ్య గారితో అక్కడ వుంటున్నపుడే మాణిక్యాంబగారికి పరిచయం కలిగింది. కమ్యూనిస్టులు నడిపిన కొత్తపట్నంలోని రాజకీయ పాఠశాలకు మాణిక్యాంబ గారు, మానికొండ సూర్యావతిగారు, చండ్ర సావిత్రిదేవి గారు హాజరయ్యారు. ఆ సందర్భంలో మరల మాణిక్యాంబగారు అరెస్టయ్యారు.
 ఆంధ్రలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. విజయవాడను కేంద్రంగా చేసుకొని పార్టీ కార్యకలాపాలు ప్రారంభించింది. సీనియర్‌గారి కుటుంబం విజయవాడలో స్థిరపడింది. 1943-48 మధ్యకాలంలో మాణిక్యాంబగారితో కలసి మహిళా సంఘంలో పనిచేసే భాగ్యం కలిగింది. ఆమెతో కలసి భర్త ఆస్తి మీద భార్యకు హక్కు వుండాలని, బహుభార్యాత్వంను నిషేధించాలని, విడాకుల చట్టం చేయాలని మొదలగు కార్యక్రమాలను మహిళల్లోను, ప్రజల్లోను ప్రచారం చేశారు. ప్రచారమే కాకుండ మహిళా సంఘం తరపున 50 వేల మందితో సంతకాలు చేయించి పార్లమెంట్‌కు పంపారు. ఆ రోజుల్లో పిల్లలకు మశూచిలాంటి వ్యాధులు రాకుండా టీకాలు వేయించటానికి మహిళలు భయపడేవారు. వారికి నచ్చజెప్పి పిల్లలకు టీకాలు వేయించే పనిలో తోడ్పడేవారు. కలరా సమయంలో ఇంజక్షన్‌ చేయించుకోవటానికి కూడ ప్రజలు భయపడేవారు. మేము వారికి నచ్చచెప్పి ఇంజక్షన్‌ తీసుకునేలాగ చేసేవాళ్లం. యుద్ధపు రోజుల్లో రేషన్‌ దుకాణాల వద్ద వచ్చినవారిని వరుసగా నిలబెట్టి వారికి కిరోసిన్‌, పంచదార, బియ్యం వగైరాలు సక్రమంగా అందేలాగ చూసేవాళ్లం. ఇవేగాక మాణిక్యాంబగారితో కలసి ప్రజాశక్తి పత్రికలు వీధులలో తిరిగి అమ్మేవాళ్లం. సంవత్సరంలో ఒక వారం పార్టీ సాహిత్య పుస్తకాలు అమ్మేవాళ్లం. ఒకసారి ఒక విద్యావంతుడిని పుస్తకాలు కొనమని అడిగాం. దానికి ఆయన ‘ఏముంటుంది? మీ పుస్తకాలలో. ధనవంతులను కొల్లగొట్టి చికాకులు చేయటమేగా’ అన్నారు. ఆయనకు మాణిక్యాంబగారు ‘మీరు పొరపడుతున్నారు. కలవారిని లేనివారిని చేయటం కాదు. లేనివారిని కూడ కలవారుగా చేయటం, పేదరికాన్ని నిర్మూలించటం పార్టీ ధ్యేయం’ సమాధానమిచ్చారు. నాకంటె ఆమె 15 సంవత్సరాలు పెద్ద. ఆమెతో కలసి పనిచేయటం మొదలుపెట్టినపుడు నా వయసు 15 సంవత్సరాలు. పరిపూర్ణ రాజకీయ చైతన్యం కలిగిన మహిళ అని ఆమె సమాధానాలు విన్న నాకు అనిపించేది. నాలో కలిగిన ఈ ఆవగింజంత చైతన్యం ఆమెతో కలసి పనిచేసినందువల్ల, ఆమె సహచర్యం వలన కలిగినదేనని సగర్వంగా చెప్పుకుంటున్నా. పది సంవత్సరాల క్రితం స్వాతంత్ర సమరయోధుల రేడియో ప్రసంగాలలో మాణిక్యాంబగారు పాల్గొన్నారు. నేటి యువతీ-యువకులను గురించి ఆమె అభిప్రాయం అడిగిన ప్రశ్నకు, నేటి యువతీ-యువకులలో అవగాహనారాహిత్యం కనిపిస్తూందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నేటి పోలీసుల ప్రవర్తనను గురించి అడిగిన ప్రశ్నకు నేటి పోలీసుల ప్రవర్తన కంటె ఆనాటి బ్రిటీష్‌వాళ్ల పాలనలో వున్న ప్రవర్తన మహిళల యెడల మర్యాదపూర్వకంగా వుండేదని సమాధానమిచ్చారు. బహుశ స్వానుభవం వల్లననుకోవచ్చు.
 మాణిక్యాంబ గారికి యిరువురు కుమారులు. పెద్దకొడుకు అమెరికాలో స్థిరపడి 50 ఏండ్ల వయసులో అమెరికాలోనే మరణించాడు. ముదిమిలో పుత్రశోకానికి గురయ్యారు. రెండవ కుమారుడు ఉద్యోగరీత్యా ముంబయిలో వుంటున్నాడు. ఆమె మాత్రం విజయవాడలోని గుణదలలో స్వగృహంలోనే వుండేవారు. ముదిమిలో ఆమెకి తోడుగా ఆమె చెల్లెలి కొడుకు-కోడలు వుండేవారు. రెండు-మూడు సంవత్సరాల క్రితం అతనికి వైజాగు ట్రాన్స్‌ఫర్‌ అయింది. అతనితోపాటు ఆమె కూడ వెళ్లవలసి వచ్చింది. విజయవాడను వదలి వెళ్లాలంటే ఏదో తెలియని దిగులుగా వుందని ఆప్తమిత్రురాలు కొండపల్లి కోటేశ్వరమ్మగారితో అన్నదట. 96 సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్న సూత్రం అక్షరాల ఆమెయందు నిజమైంది. రక్తపోటు, చక్కెరవ్యాధి మామూలయిన ఈ రోజుల్లో అవి ఆమె దరిచేరలేదు. చెవులు వినిపిస్తూ వుండగా, కళ్లు కనిపిస్తూ వుండగా, నడచి తన పనులు తాను చేసుకుంటూ వుండగా ఇక చాలని ఈ లోకాన్ని వదలివెళ్లిన మాణిక్యాంబగారు ధన్యురాలు. 11-10-09న ఆమె దివంగతురాలయిందన్న వార్త విశాలాంధ్ర దినపత్రికలో చదివి ఖిన్నురాలనయ్యాను. పునరపి-జననం, పునరపి-మరణం అన్న సూక్తికి ఎవరమూ అతీతులము కాదు కదా! ఆ ఆదర్శ నిరాడంబర నిత్యచైతన్యశీలికి, క్రియాశీల మహిళా కార్యకర్తకు అశ్రునయనాలతో నిండుమనసుతో జోహార్లర్పిస్తున్నా.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో