హెచ్‌ఐవి/ఎయిడ్స్‌కి ఎవరూ అతీతులు కారని చెప్పే పద్మక్క ఉదంతం

మంజరి
పద్మక్క చనిపోయింది. ఆదివారం కదా నా స్నేహితురాలు ఉష ఇంటికెళ్ళుదామని ఫోన్‌ చేస్తే తెలిసిన విషయమది. పద్మక్క ఉష భర్తకు మేనత్త. ఈ వార్త వినగానే చలాకీగా, హుషారుగా ఉంటూ తెగ కబుర్లు చెప్పే పద్మక్కే కళ్ళముందు కదలాడింది. నాలుగైదేళ్ళుగా తన ఆరోగ్యం బాగాలేదని నాకు తెలుసు. నిజానికి ఆమె హెచ్‌ఐవి పాజిటివ్‌ అని కూడా తెలుసు. అయితే మంచి ఉద్యోగం చేస్తూ, ఆర్ధికంగా ఏ లోటూ లేని తను ఇంత త్వరగా చనిపోవడం ఏమిటి? నా బుర్రకు తొలిచేస్తున్న ప్రశ్న.
నా స్నేహితురాలు ఉష పెళ్ళపుడే పద్మక్కను మొదటిసారి చూశాను. పెళ్ళికూతురితో పాటు వాళ్ళ అత్తారింటికి వెళ్ళిన నాకు అదే పనిగా మాట్లాడుతూ హడావుడిగా తిరుగుతున్న పద్మక్కను చూస్తే ముచ్చటేసింది. అయితే ఆమె మాట్లాడే మాటల్లో  చాలావరకు వాళ్ళ ఆయన  గురించే. దాంతో అందరూ పక్కకు తిరిగి నవ్వుకోవడం గమనించా. నిజంగానే భర్తపై ఆమె ప్రేమ కొంచెం అతిగానే అనిపించింది. ఏ యద్దనపూడి హీరో గురించో పెళ్ళికాని అమ్మాయి మాట్లాడుతున్నట్లుగా ఉన్నాయి ఆమె కబుర్లు. తానేమో కొత్తగా పెళ్ళయిన మనిషి కాదు, వయస్సులోనూ చిన్నదికాదు. నలభైకి దగ్గర్లో ఉన్న మనిషి.ఈ మనిషికి ఎందుకింత అతి ప్రేమ అని విచారిస్తే తెలిసింది ఓ హృదయవిదారకమైన విషయం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్న పద్మక్కకు ఇద్దరు పిల్లలు ఉండేవారు. ఆరు, ఏడు ఏళ్ళ వయసు వారు. వారు స్కూలుకు, తను ఆఫీసుకు బస్సులో వెళుతుండగా యాక్సిడెంటై పిల్లలిద్దరూ చనిపోయారు. పద్మక్క ఆరునెలలు ఆసుపత్రిలో ఉన్నాక కోలుకుంది. ఇది జరిగి ఉష పెళ్ళినాటికి ఏడాది దాటింది. కడుపున పుట్టిన బిడ్డలు చనిపోవడం, ఇక పుట్టే అవకాశం లేకపోవడం ఓ రకంగా పద్మక్కకు భర్తపై పిచ్చి ప్రేమను పెంచుకోవడానికి దారితీసింది. మరో వైపు ఏదో అభద్రతా భావం కూడా ఆమెలో ఏర్పడిందేమోనని నాకు అనిపించింది.
 ఆ తర్వాత అప్పుడప్పుడూ పద్మక్క అతి ప్రేమ గురించి ఉష నోట వింటూనే ఉన్నా. ఐదేళ్ళ క్రితం అనుకుంటా ఓ రోజు ఉష ఫోన్‌ చేసి పద్మక్క హెచ్‌ఐవి పాజిటివ్‌ అని  తెలిసిందని చెప్పింది. పెద్దాపరేషన్‌ చేయించుకున్న ఐదారు నెలలైనా మనిషి నీరసంగా, రంగు మారిపోయి శారీరంగా, బలహీనంగా ఉంటే తానే బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్షలు చేయించానని అదేదో తన తప్పు అన్నట్టుగా చెప్పింది ఉష. ఆపరేషన్‌ జరిగాకే తనకిలా ఉంటోందని పద్మక్క చెప్పినా వాళ్ళాయన నుండే ఆమెకు సంక్రమించి ఉంటుందని ఉష అంది. పాలిటెక్కిక్‌ చదివి ఉద్యోగంలో చేరిన పద్మక్కకు బాగా జీతం వచ్చేది. ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉండటం వల్ల ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ. భర్తకు ఫౌల్ట్రీ ఫాం ఉండేది. అదీ బాగానే నడిచేది. పిల్లలున్నంతవరకు ఒక పద్ధతిలో సాగిన పద్మక్క సంసారం ఆ తర్వాత ఓ పెద్ద కుదుపుకు గురైనట్టయింది. ఈమెలోని అభద్రతాభావాన్ని పసిగట్టిన భర్త ఇక ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం మొదలెట్టారు. అన్ని రకాల అలవాట్లు, విచ్చలవిడితనం మొదలయ్యాయి. అలా హెచ్‌.ఐ.వి తనకు  సోకినా చెప్పకుండా దాచిపెట్టి తన  విలాసాలు కొనసాగించాడు. పద్మక్క మాత్రం ఆపరేషన్‌ సమయంలో కలుషిత పరికరాలవల్ల తనకు వచ్చిందని అనుకునేది లేదా అలా నటించేది.
హెచ్‌ఐవి పాజిటివ్‌ అని తేలాక పదేళ్ళు, పదిహేళ్ళు గడిచినా  ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కొందరు నాకు తెలుసు. చదువుకున్న ఆర్ధికంగా లోటులేని పద్మక్క ఎందుకంత త్వరగా చనిపోయింది? ఆపరేషన్‌ జరిగాక బాగా బలహీనపడిన పద్మక్కకు హెచ్‌ఐవి కారంణంగా చాలా ఇన్‌ఫెక్షన్‌ సోకాయి. చివరకు టిబికూడా. భర్త  ఆమెదో తప్పుచేసిట్లు నీ డాక్టర్లకు బోల్డంత ఖర్చవుతుందని విసుక్కోవడం ప్రారంభించాడట (తాను చక్కగా మందు తీసుకుంటూ ఏం లోటు లేకుండా తిరుగుతూ). అతనివైపు బంధువుల ఇంట్లో చేరారు. నీరసించిన పద్మక్క వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుంది. మరోవైపు భర్త తీరుతో నిస్పృహకు లోనై వైద్యం సరిగా తీసుకోవడం లేదు. తిండికి ఇంట్లో చేరిన బంధువులపై ఆధారపడడం. ఇవన్నీ ఆరోగ్యం పూర్తిగా దిగజారి ఆమె చావుకి దారితీసాయని ఉష చెప్పింది.
పద్మక్క చనిపోయి నాలుగేళ్ళయింది. మరి ఇప్పుడెందుకు ఆమె సంగతి గుర్తొచ్చిందంటారా? ఏవో కొన్ని వర్గాల వాళ్ళకే, కొన్ని రకాల వృత్తులలో వారికే హెచ్‌ఐవి సోకుతుందని భావించేవాళ్ళు. ఇప్పటికీ మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఎవరూ దీనికి అతీతులు కాదని పద్మక్క ఉదంతం మనకు చెబుతోంది. అలాగే ఎంతో మర్యాదస్తులుగా కనిపించే పురుషుల్లో కొందరు అవకాశమొస్తే ఎంతటికైనా దిగజారుతారని, మేలి ముసుగులు తొలగిపోయి వారి అసలు రంగు బయటపడుతుందని ఆమె భర్తలాంటి వాళ్ళను చూస్తే తెలుస్తుంది. ఇవ్వాళ హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ గురించి బోల్డంత ప్రచారం సాగుతోన్న నేపధ్యంలో వ్యాధి వ్యాప్తి  ఉధృతి తగ్గిందే తప్ప కొత్తగా వ్యాధి సోకినవారే లేరని చెప్పలేం. పదేళ్ళ క్రితం కొన్ని వర్గాలకే పరిమితమనుకున్నది ఇప్పుడు అప్రమత్తతలేని ఎవరికైనా సోకుతోంది. మర్యాదస్థులం, మనకే చెడూ అంటుకుంటూందనుకొనే, అలా నటించే,  మనచుట్టూ ఉన్న వారిలోని పలువురిలోకి ఈ వ్యాధి సోకడం, దానిని గురించి పట్టించుకోక నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు ఎక్కువగానే అనిపిస్తున్నాయి. పద్మక్క ఉసురుతీసిన ఆమె భర్త మరో రెండేళ్ళకు తాను పోయాడు. అంతర్జాతీయ ఎయిడ్స్‌ దినం డిసెంబరు ఒకటిన మరోసారి దీనిగురించి ఓపెన్‌గా చర్చించాలని, వ్యాధి నిరోధానికి అన్ని రకాల ప్రయత్నాలు చేద్దామని మరోసారి ప్రతిన చేసుకుందాం.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో