“కథలాంటి ఒక జీవిత కథ”

– సోమంచి పద్మావతి

ఒకరోజు వాసా ప్రభావతి గారినుండి ఫోను వచ్చింది. “పద్మావతిగారూ! ఇది విన్నారా? మల్లాది సుబ్బమ్మగారు, మంచం మీద నుంచి లేవటం లేదు పడిపోయారు, నేను వెళ్ళి చూసొచ్చేను” అని.

నేనీమధ్య జమ్మూ-కాశ్మీర్, అమృతసర్, పాకిస్థాన్కి, భారత్కి గల “వాఘా” బోర్డర్, చంబాలోయలు, కురుక్షేత్రం మొదలైన ప్రదేశాలు చూసిరావడానికి వెళ్ళేను. అందుచేత, ప్రభావతిగారు, ఈ వార్త చెప్పగానే, నాకెంతో బాధనిపించింది. “పాపం ఎలా ఉన్నారో, ఎనభై మూడు సంవత్సరాల వయస్సుగలావిడ” అని. ఆవిడ జీవిత చరిత్ర కొద్దో, గొప్పో, తెలిసిన దానిని కాబట్టి, కొంతసేపు ఆలోచనలలో పడి, ఆవిడతో పనిచేసిన సంఘటనలు, సంఘసేవ, ఒకరీలుగా నా మదిలో మెదిలాయి…

ప్రతీ వ్యక్తికి, పుట్టుకకు, మరణానికి మధ్యలో ఉన్నదే జీవితం. ఆ జీవితాన్ని సార్ధకం చేసుకోవటంలోనే వుంది. మనిషి యొక్క మనుగడ. అదే అర్ధం, పరమార్ధం! ఆవిడను, నేను కూడా చూసి రావాలని, నిర్ణయించుకున్నాను.

మల్లాది సుబ్బమ్మగారు సంఘ సంస్కర్తల కోవకు చెందుతారు, ఆమె వాక్ చాతుర్యం అమోఘం. సభా సమావేశాలలో ఎవరినైనా తప్పులుంటే నిలదీసి అడిగే స్వభావం, మహిళా వికాసానికై, మహిళా సమస్యల విముక్తికై, దాదాపు పదికి పైగా సంస్థలను స్థాపించి, మహిళాభివృద్ధికై పాటుపడుతున్న, మేటి మహిళ, మల్లాది రామమూర్తిగారు కూడా, సుబ్బమ్మ గారికి అనుగుణమైన భర్తగా అరవై ఏళ్ళు, వైవాహిక జీవితంలో, అనేక అసమానమైన సంఘటనలు, చవిచూసి తనయొక్క ప్రతిభా పాటవాలను కూడా, సుబ్బమ్మగారికి దత్తత ఇచ్చి, ఆమె అభివృద్ధికి ఆలంబనగా నిలచి అనేక ఘనకార్యాలను చేయించిన ఘనుడు. ఆమె ప్రతీ రంగంలో ముందడుగు వేయడానికి కారణభూతులయ్యారు ఆమె భర్త రామ్మూర్తిగారు. అటువంటి భర్తలుంటే, ఆడవారికి అగచాట్లులాంటివి కలగనే కలగవు.

మల్లాది సుబ్బమ్మగారు అతి చాందస్త కుటుంబంలో పుట్టి, వ్యక్తి దశనుండి, వ్యక్తిత్వాన్ని నిలుపుకునే దశకు ఎదిగి, బయటకు వచ్చి, జాతి పతాకాన్ని పట్టుకుని, ధైర్యంగా మహిళా విప్లవ సాధనకోసం నడుం బిగించి, అనేక ఉద్యమాలు, సభలు, సమావేశాలు జరిపిన ధైర్యశాలి. ఆంధ్రరాష్ట్రంలో, ఆమె పేరు తెలియని వారుండరు. వారి ఉద్యమాలలో నేనూ భాగస్వామిగా పంచుకునే భాగ్యం లభించి నందుకు సంతోషిస్తున్నాను.

ఒకరకంగా మల్లాది సుబ్బమ్మగారు మహిళా పక్షపాతిగా కూడా పేరు పొందేరు. ఆవిడ మానవతావాదిగా, హేతువాదిగా, సంఘసంస్కర్తగా, ఉద్యమకారిణిగా, మహిళా సమస్యలపట్ల, అవగాహనగల మహిళగా, అణగారిపోతున్న ఆడవారి అభివృద్ధే తన ధ్యేయంగా, పీడిత మహిళాలోకానికి తనవంతుసేవ అర్పించాలనే అకుంఠిత ధ్యేయంతో ఎంతో కృషి సల్పిన మహోన్నత మహిళ మల్లాది సుబ్బమ్మ.

హేతువాది కాబట్టి దైవశక్తి కంటే మానవశక్తిని నమ్ముతారు. తనలోని శక్తినే తను నమ్ముతారు. పాప పుణ్యాల గురించి ఎలా ఉన్నా, మంచి అనేది చేస్తూ, మంచి అనేది తలుస్తూ, ఇతరులకు తోడ్పాటుగా వుండాలని, అదే మనసుకు తృప్తినిస్తుందని అంటారు సుబ్బమ్మగారు.

ముఖ్యంగా మల్లాది సుబ్బమ్మగారు స్త్రీ స్వేచ్ఛను కోరుకునే మహిళ. అందులకై సరాసరి “స్త్రీ స్వేచ్ఛ” అనే మాసపత్రికను స్థాపించి, ఎడిటర్గా వుండి, స్త్రీలకు ధైర్యస్థైర్యాలు కలిగేటట్లు, రచనా వ్యాసంగం నడిపి స్త్రీ చైతన్యాన్ని మేల్కొలిపిన మేటి మహిళ ఆమె. అనేక సెమినార్లు, సింపోయిజమ్లు నడిపి, జంట నగరాల మహిళలందరిని ఒకచోటికిచేర్చి, మహిళా వికాస విజ్ఞాన కార్యక్రమాలు నడిపి ఆమెయొక్క వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు.

సుబ్బమ్మగారు, ఉద్యమాల కర్తగా మధ్యపాన నిషేధ ఉద్యమం, స్త్రీలపై అత్యాచారాల నిరోధక ఉద్యమం, వరకట్న హింసలపై ఉద్యమం, మహిళా సాధికారిక ఉద్యమం ఇలా ఎన్నో మహిళా ప్రగతికి అడ్డుతగిలే అంశాలపై అనేక ఉద్యమాలు చేసి మహిళలకు ధైర్య సాహసాలను పెంచే దిశగా ఉద్యమాలు ఎన్నో చేసి జైలుకి వెళ్ళడాలు కూడా జరిగాయి.

ముఖ్యంగా మల్లాది సుబ్బమ్మగారికి సంఘసేవన్నా, సాహితీ సేవన్నా మక్కువ ఎక్కువ. ఆమె ఎన్నో పుస్తకాలు వ్రాశారు. ఆమె యొక్క ఆత్మకథ, “పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా” అనే గ్రంధాన్ని చదివితే ఆమె ఎటువంటి స్థితినుండి ఎదిగి ఈ స్థితికి ఎలా వచ్చేరో తెలుస్తుంది. ముందే చెప్పాను కదా! చాందస భావాల కుటుంబంలో పుట్టి, అభ్యుదయ భావాలు గల మహిళగా మారడానికి ఆమెలోని విమర్శనాత్మక, విశ్లేషణాత్మక భావాలతో ఆనాటి సంఘ కట్టుబాట్లు, మూఢవిశ్వాసాలు, ఆనాటి సాంప్రదాయ కుటుంబంలో నున్న ఆడవారి ఇక్కట్లు వారిపట్ల చూపుతున్న ఉదాసీన వైఖరి జరుగుతున్న అన్యాయాలను, అసమానతలను ఖండించి పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా, సమాన ప్రతిపత్తి కలగాలనే తపనతో తన వైఖరి దృఢం చేసుకుని, తన సంస్థల ద్వారా అణగారిపోతున్న మహిళలకు తన వంతు సేవను అర్పిస్తున్న మేటి మహిళా మణి, మహిళల సాధకబాధలు బాగా తెలిసినావిడ.

ఇంతేకాకుండా ఎదుటి వ్యక్తులలోనున్న సమర్ధతను, ప్రతిభను ప్రోత్సహించడం ఆమె స్వభావం. ఆమె జన్మదినాన్ని పురస్కరించు కుని, వర్ధమాన మహిళా సంఘసేవికలకు పురస్కారాలు జరిపి, సన్మాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తోటి మహిళలకు సేవా తత్పరత, ఉత్సాహాన్ని కలుగజేయడం, ఆమెలోని మహోన్నతమైన గుణం. ఆమె పురస్కారం నాకు కూడా లభ్యం కావడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను.

సుబ్బమ్మగారి సేవలను గుర్తించి ప్రభుత్వం, స్వచ్చంద సేవా సంస్థలు, అనేక అవార్డులను ఆమెకు అందజేశాయి. ముఖ్యంగా చెప్పుకోతగ్గవి దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డు, తెలుగు యూనివర్శిటీ వారు, సుబ్బమ్మగారు వ్రాసిన పుస్తకానికై ఇచ్చిన అవార్డు, ప్రియదర్శిని అవార్డు, త్రిపురనేని రామస్వామి అవార్డు, రాజీవ్ రత్న అవార్డు మొదలగున్నవి. ఇవేకాక మహిళా సంఘాలు, అనేక రకాలుగా పురస్కారాలు జరిపిన రోజులు నా మదిలో మెదిలాయి.

ఆమెలో ఆడవారి అసమానతల పట్ల ఆవేదన,ఆరాటం ఇంకా ఎంతోవుంది. మహిళా ప్రగతికై ఇంకా ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? అనే ప్రశ్నల పరంపరలతో, సమయం దొరికినప్పుడల్లా అన్వేషిస్తూ ఆలోచిస్తూ వుంటారామె.

సుబ్బమ్మగారు వయోజన విద్యనభ్య సించి పట్టభద్రురాలై, కుటుంబ నియంత్రణ డిప్లమా కోర్సు చేసి, తన వాక్ చాతుర్యంతో ఆంధ్రరాష్ట్రంలో పలు ప్రాంతాలకు వెళ్ళి, అధిక జనాభాను అరికట్టాలని అందరు సుఖ శాతులతో వుండాలని, ఆంధ్రావనిలో ఎక్కడా దారిద్య్ర ఛాయలు కనబడకూడదని, అకుంఠిత దీక్షతో ప్రచారం చేసిన ఘనత ఆవిడకే దక్కుతుంది.

ఇలా సంఘసేవలోనే కాకుండా సాహితీ సేవ కూడా చాలా చేశారు. ఎన్నో పుస్తకాలు వ్రాసి, అచ్చువేసి, తన భావాలు బాగా ప్రచారం చేసుకున్నవారామె. హిందూ స్త్రీల, ముస్లిం స్త్రీల, క్రైస్తవ స్త్రీల మత కట్టుబాట్ల విషయాలు, క్షుణ్ణంగా పరిశీలించి, చారిత్రాత్మకంగా నిలబడేటట్లు ఎన్నో గ్రంథాలు వ్రాశారు.

వారి పుస్తకాలు కొన్ని, ప్రభుత్వ గ్రంధాలయాలలోను తెలుగు యూనివర్శిటీల లోను, పదిలపర్చడం జరిగింది. దాదాపు చిన్నా పెద్దా యనభై పుస్తకాలు వ్రాశానని చెప్పారు.

సుబ్బమ్మగారు తను నమ్మిన సిద్ధాంతాలకు, సూక్తులకు, కట్టుబడి పనిచేసే మహిళ, ఏది చెప్తారో అదే చేస్తారు. ఏది చేస్తారో అదే చెబుతారు. అవే వ్రాశారు. సుబ్బమ్మగారి భావాలలోను రచనా వ్యాసంగంలోను, ప్రముఖంగా స్త్రీల స్థితిగతులను ప్రధానాంశాలు గా, వారి అభివృద్ధికై కావలసిన అంశాలను ప్రస్పుటంగా కనబరుస్తూ రచిస్తారు. ఆ రూపంగా సహాయ సహకారాలు కావలసిన ఆడవారికి అందుతున్నాయి.

ఇలా సుబ్బమ్మగారి గురించి సుదీర్ఘంగా ఆలోచించుకుంటూ చాలా సమయం గడచిపోయిందినాకు. ఏమైనా సరే ఈరోజు వెళ్ళి ఆమెను చూసి రావాలని బయలుదేరాను. అడ్రసు తెలుసుకుని ఆవిడ దగ్గరకి వెళ్ళేను. మంచంమీద పడుకుని వున్నారు. “నడవలేక పోతున్నానని, అతి కష్టంమీద చేతికర్ర సహాయంతోను, వాకర్తోను బాత్రూమ్కి వెళ్తున్నానని చెప్పేరు. ఎంతో ప్రేమగా పలకరించేరు. నాకు చాలా బాధనిపించింది ఆవిడను అలా చూస్తే.

సుబ్బమ్మగారికి ముగ్గురబ్బాయిలు, ఒక అమ్మాయి. సంతానంలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు ఇంజినీర్లు, వీరిలో ఒక అబ్బాయి ఆ మధ్య చాలా రోజుల క్రితం గల్ఫ్లో కారు యాక్సిడెంటులో చనిపోయాడు. అయినా ఆవిడ ఎంతో నిబ్బరంగా తన సంఘసేవ, సాహితీ సేవ ఆ రెండూ ఆవిడకి నచ్చిన రంగాలు కాబట్టి వెనకడుగు వేయకుండా ధైర్యంగా చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు.

సుబ్బమ్మగారి పిల్లలు ముత్యాల్లాంటి వారని, “తన పిల్లల గురించి, తనకు ఏ విధమైన చింతలేదని, కాని ఇలా పడిపోయి చేతకాని దానిలా అయిపోయా నేమిటి అని బాధపడ్తున్నానన్నారు. భర్త రామ్మూర్తిగారు చనిపోయినప్పుడు కూడా ఇంత విచారించలేదు నేను. ఎందుకంటే నా ఆదర్శాలు, ఆశయాలు ఆయనవి ఒక్కటే కాబట్టి. ఆయన వదిలివెళ్ళిన ఆశయాలను తను తీర్చాలని కృషి చేస్తున్నానని చెప్పేరు. ఇంకా సమాజానికి ఎంతో చేయాలని తపన నాలో వుండిపోయింది. “ఇలా మంచం మీద వుండి ఏం చేయగలను? చేతకాని దానిలా ఎందుకు బ్రతికుండాలి నేను?” అని ఒక్కసారిగా భోరున ఏడిచారు. ఇంకా తనలో ఇంత వయసొచ్చినా ఉత్సాహం తగ్గలేదని, సమాజానికి తను చేసింది తక్కువని ఇంకా చేయవలసింది చాలా వుందని, ఎన్ని కార్యక్రమాలు చేసుకునేదానిని? ఇలా మంచాన పడి వుండటం ఇదీ ఒక బ్రతుకేనా? అని శోక సముద్రంలో మునిగిపోయారావిడ. ఆవిడను ఏవిధంగా ఓదార్చాలో తెలియలేదు నాకు. అయినా ధైర్యంగా సుబ్బమ్మగారూ! మీకేం పర్వాలేదు. మీరు పులిలాంటివారు. మళ్ళీ కోలుకుంటారు. మళ్ళీ మీ సంఘసేవ మీరు చేసుకోగల్గుతారు అని ధైర్యం చెప్పాను.

ఒకరకంగా “ చేసే చెయ్యి, తిరిగే కాలు ఊరుకోదని” సామెత వుంది. హేతువాదులుగా ఉన్నవారు, వారు నమ్మిన సిద్ధాంతాల ప్రకారం, వారి దృష్టిలో ఏది హేతువో, ఆ శక్తిని నమ్మి, మంచి అన్నది చేసుకుంటూ, మంచి అన్నది మననం చేసుకుంటూ వుండాలి. అదే ఆధ్యాత్మికత గల వేదాంతులు దైవశక్తిని నమ్ముతారు కాబట్టి వారు విధి నిర్ణయానికి విధేయులై, ఎలా జరిగేది అలా జరుగుతుందని, బెంగ పెట్టుకుంటే లాభం లేదని గ్రహించాలి.

ఎవరైనప్పటికి పరిస్థితులకు తట్టుకుని, నిబ్బరంగా వుండాలి మరి. అప్పుడే సుఖశాంతులు లభిస్తాయి. లేకపోతే శేష జీవితం దుర్భరమౌతుంది. ఎవరికి వారు అనుభవంతో గ్రహించాలి. ఏం చెప్పగలం?

ఏదీ ఏమైనా సుబ్బమ్మగారికి చెప్పవలసిందేమీ లేదు. అన్నీ ఆవిడకే తెలుసు. ఆవిడకున్న ఆస్తిపాస్తులన్నీ “మల్లాది సుబ్బమ్మ ట్రస్టు”కి దారాదత్తం చేసేసేరు. ఇంతకంటే ఆవిడ జన్మకు సార్థకత ఏముంటుంది? ఈ ఎనభై మూడేళ్ళు నిరంతరంగా, నిర్భయంగా ఆవిడ చేయాలనుకున్న పనులన్నీ చేసేశారు. తన ఆశయ సాధనలకై మహిళాభ్యుదయ సంస్థ, స్త్రీ విమోచన సంస్థ, కుటుంబ సలహా కేంద్రం, అభ్యుదయ వివాహ వేదిక, శ్రామిక మహిళా సేవ, స్త్రీలహక్కులు – ఆచరణ సంస్థ, మొదలగు పది సంస్థల దాకా స్థాపించి ఎనలేని సేవ చేస్తూ చాలామంది మహిళలను ఆదుకోవటం జరిగింది. ఇంతకంటే ఆమె చేయవలసినవి ఏమున్నాయి? కాని ఆమెలోని తపన, ఆరాటం, ఆవేదన, ఆరని అగ్నిహోత్రంలా ఆమెలో ప్రస్పుటంగా కనబడుతున్నాయి.

ఏది ఏమైనప్పటికి మల్లాది సుబ్బమ్మగారు మరువకూడని మహోన్నతమైన ఆదర్శ మహిళగా ఎదిగారు. ఆవిడ జీవితం స్త్రీ జాతికి మార్గదర్శకం. ఆవిడ జీవిత కథ మహిళా లోకానికి మరో ఆదర్శ మహిళా కథలాంటిది. అందుకే కథలాంటి ఒక జీవిత కథ అన్నాను. ఆమె తొందరగా కోలుకొని మనందరి మధ్యలోకి మళ్ళీ రావాలని ఆశిస్తున్నాను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో