ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 12

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి

ఇది కూడా 1924లోనే జరిగింది. బన్నూ వయసు అప్పుడు మూడేళ్లు. ఒకరోజు మా ఆయన మంచం కొనేందుకు మార్కెట్‌కి బైలుదేరారు. ధున్నూనీ, బన్నూనీ తనవెంట తీసుకెళ్లారు. పై అంతస్తులో దుకాణం, పిల్లలిద్దరినీ కిందే వదిలి ఆయన పైకెళ్లారు. ధున్నూ మెట్లెక్కి ఆయన వెనకాలే పైకెళ్లాడు. బన్నూ కిందే ఉండిపోయాడు. ఆయన కిందికి వచ్చేసరికి బన్నూ లేడు. మా ఆయనకి దడ పుట్టింది. అక్కడ ఉన్న మనుషులని అడగడం మొదలుపెట్టారు, ”మూడేళ్ల పిల్లవాడు మీకెక్కడైనా కనిపించాడా” అంటూ చాలామందిని అడిగారు. అందరూ మేం చూడలేదంటే మేం చూడలేదన్నారు. ఇంకా కంగారు పడిపోతూ ఆయన ధున్నూతో, ”బాబూ, ఇంటికెళ్లు కానీ మీ అమ్మతో ధూన్నూ తప్పిపోయాడని చెప్పకు!” అన్నారు. బన్నూ ఏడవసాగాడు. గొంతు పూడుకుపోయింది. ”మీ నాన్న బన్నూతో కలిసి ఎక్కడికెళ్లాడురా?” అని అడిగాను వాడొక్కడూ ఇంటికి రావడం చూసి.
వెంటనే వాడు బావురుమంటూ, ”బన్నూ తప్పిపోయాడు. నాన్న వాడిని వెతుకుతున్నారు,” అన్నాడు. ”ఎలా తప్పిపోయాడురా అసలు?” అన్నాను. ధున్నూ జరిగిందంతా చెప్పాడు. కొద్దిసేపటికల్లా ఆయన బన్నూని వెంటపెట్టు కుని వచ్చారు.
”వీడు ఎటు పోయాడు?” అన్నాను.
”వీడు ఇవాళ దొరికి ఉండకపోతే, నేను ప్రాణాలతో నీకు మళ్లీ కనిపించేవాణ్ణి కాను. మేమిద్దరం పైకి దుకాణానికి వెళ్లినప్పుడు వీడు అక్కడున్న దుకాణాలని చూస్తూ వెనక సందులోకి వెళ్లిపోయాడు. అక్కడ మేమిద్దరం కనిపించకపోయేసరికి భోరుమని ఏడుస్తూ నిలబడి ఉన్నాడు. పిల్లవాణ్ణి ఎక్కడ వెదకాలా అని పాలుపోక ఒకపక్క నాకూ ఏడుపు వస్తోంది. నీకేం జవాబు చెప్పాలి, అని ఒకపక్క మథన పడుతూనే ఉన్నాను. ఇవాళ వీడు నాకు కనిపించకపోతే నేను కూడా ఇంటికి వచ్చి ఉండేవాణ్ణి కాదు!”
”సరే, మీరెలా కనుక్కున్నారు వీణ్ణి?”
”ఆ ప్రాంతమంతా వెతికాను. ఎక్కడన్నా ఏడుపు వినిపిస్తుందా అని ఒక చెవి అటు వేసి ఉంచాను. అప్పుడే వీడి ఏడుపు వినిపించింది. వీడు కనిపించగానే నాకిక ఏడుపు ఆగలేదు! వీణ్ణి పరిగెత్తుకెళ్లి ఎత్తుకున్నాను. చాలాసేపటివరకూ బెక్కుతూనే ఉన్నాడు, చిన్న వెధవ!”
 ఆ తరవాత ఆయన మళ్లీ ఎన్నడూ పిల్లల్ని తనవెంట బజారుకి తీసుకెళ్లలేదు.
పనిమనిషి కొడుకు
మా అబ్బాయిలిద్దరూ అలహాబాద్‌లో చదువుకుంటున్నారు. ఈయన వాళ్లిద్దర్నీ విడివిడిగా ఉత్తరాలు రాయమని ముందే చెప్పి పంపించారు. నాతో మాటిమాటికీ, ధున్నూ బన్నూ మీద పెత్తనంగాని చేస్తూ ఉండడు కదా? అంటూ ఉండేవారు. అయితే ఏమిటిట? వాడు బన్నూకన్నా పెద్దవాడేగా? అనేదాన్ని నేను. ఒకసారి ఈ విషయం నాతో వివరంగా మాట్లాడుతూ, ”నీకు సరిగ్గా అర్థం కావటం లేదు. వాళ్లలో ఒక రకమైన పిరికితనం, ఇతరుల మీద ఆధారపడడం లాంటివి వస్తాయి. తండ్రిని అసహ్యించుకునే స్థితికి వస్తారు. అసలు మగపిల్లలు బాధ్యతగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ఇతరులు వాళ్ల మీద పెత్తనం చేస్తే ఒక్కోసారి అది న్యాయంగా ఉండదు. ప్రేమతో అవతలి వ్యక్తిమీద ఎవరైనా పెత్తనం చలాయిస్తే మంచిదే. కాని అలా చేసేవాళ్లు ఎంతమంది? ఈ రోజుల్లో కాలేజీలో చేరగానే కుర్రకుంకలకి కూడా బోలెడంత అహంకారం పెరిగిపోతుంది. అందుకే వాళ్లిద్దరూ, ఎవరికి వాళ్లు విడిగా, స్వేచ్ఛగా బతకాలని నా కోరిక,” అన్నారు.
”అలా చేస్తే ధున్నూ, బన్నూ మీద పెత్తనం చెయ్యడం మానేస్తాడా?”
”ఎందుకు మానడు? అన్యాయంగా అన్న ఏమైన అంటే ధున్నూ నాకు ఉత్తరంలో ఆ సంగతి రాస్తాడు కదా? అప్పుడు నేను ధున్నూని ఇదేమిటని అడగనూ?”
”చాలామంది తండ్రులు అడగరు!”
”వాళ్లు పనికిమాలినవాళ్లు. బాధ్యతగల తండ్రి పట్టించుకుంటాడు. బాధ్యత తీసుకుంటాడు. అలా బాధ్యత తీసుకోలేనప్పుడు అసలు పిల్లల్ని ఈ లోకంలోకి తీసుకురావడం ఎందుకు?”
”పిల్లలు పుట్టకుండా ఉంటారా?”
”అయితే ఈ ప్రపంచంనిండా పనికిమాలిన వాళ్లే ఉంటారు. అసలు మనిషి చేసే పనులన్నీ గౌరవం కోసమే కదా! సొంత ఇంట్లోనే మనిషికి గౌరవం లేకుండా పోయాక ఇంకెందుకు బతకడం? ఇతరులమీద తమ బాధ్యతని వేసే తండ్రుల్ని చూస్తే నాకు గౌరవం లేదు.”
”లోకంలో అలాగే జరుగుతుంది!”
ఆయన పిల్లలకి తనే స్వయంగా చదువు చెప్పేవారు. ట్యూటర్‌ని పెట్టడం ఆయనకి ఇష్టముండేది కాదు. ప్రతిరోజూ రెండు మూడు గంటలసేపు వాళ్లని దగ్గర కూర్చోపెట్టుకుని చదువు చెప్పేవారు. వాళ్లని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనుకునేవారు.
ఒకసారి నేను బెనారస్‌లో ఉండగా, మా పనిమనిషి కొడుకు, చిన్నపిల్లవాడు, ఒళ్లు కాల్చుకున్నాడు. ఒళ్లంతా మందు రాయడంతో వాడు తొడుక్కున్న బట్టలు కూడా పాడయాయి. మా చిన్నబ్బాయి బన్నూ వీధిలో ఎక్కడో వాణ్ణి చూసి, జాలిపడి, రెండు చేతుల్తో జాగ్రత్తగా పట్టుకుని, మెట్లెక్కించి పైకి తీసుకొచ్చాడు. అప్పుడు మా ఆయన కూడా నా పక్కనే ఉన్నారు. ”అమ్మా! వీడికి తినడానికేమైనా పెట్టు!” అన్నాడు మావాడు. ఆ చిన్నపిల్లవాడి కాలిన ఒళ్లు చూసి నా ఒళ్లు జలదరించింది. వాడికి చిన్న దెబ్బ తగిలినా రక్తం ధారలు కడతాయేమోనని భయం వేసింది. బన్నూ వాడిపట్ల చూపిస్తున్న ప్రేమకి మా ఆయన కళ్లు చెమర్చాయి. ”త్వరగా వాడికి తినడానికేమైనా ఇయ్యి!” అన్నారు. నేను వాడికి మిఠాయీ, పళ్లూ ఇచ్చి, బన్నూతో, ”వీణ్ణి ఇంటికెలా చేరుస్తావు? ఏమాత్రం దెబ్బ తగిలినా ప్రమాదమే. కిందినించే వాణ్ణి వాళ్లింట్లో దింపి రావలసింది కదరా?” అన్నాను.
”నేను వీణ్ణి జాగ్రత్తగా దింపి వస్తానమ్మా!” అంటూ వాడు మళ్లీ వాణ్ణి జాగ్రత్తగా పట్టుకుని కింద దింపి వచ్చాడు. ”నాక్కూడా అలా కాలిపోయిన చిన్నపిల్లవాణ్ణి పై అంతస్తుకి తీసుకొచ్చే ధైర్యం ఉండేది కాదు! మనవాడిది గొప్ప జాలిగుండె. చూడు, ఎంత జాగ్రత్తగా వాణ్ణి పైకి తీసుకొచ్చి మళ్లీ కిందికి తీసుకెళ్లాడో! నాకసలు దెబ్బ తగిల్తేనే భయం. బన్నూ పదికాలాలపాటు చల్లగా బతకాలి. చూస్తూండు వాడు నీకు మంచి పేరు తీసుకొస్తాడు. అసలు ఆ పనిమనిషి కొడుకు ఎంత మురిగ్గా ఉన్నాడో చూశావా? తల్లి తప్ప ఎవరూ వాణ్ణి ముట్టుకోలేక పోయుండేవాళ్లు,” అన్నారు మా ఆయన.
”బుద్ధిలేని గాడిద!” అన్నాను.
”లేదు లేదు, వాడి ఆత్మ గొప్పది!”
మా ఆయనకి పిల్లలందరూ ఇష్టమే, కానీ చిన్నవాడిమీద ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. పిల్లల్లో ఎవరికి జబ్బు చేసినా తల్లడిల్లిపోయేవారు.
ఒకసారి బన్నూకి జబ్బు చేసింది, అమ్మవారు పోసింది. వాణ్ణి పైగదిలోకి మార్చవలసి వచ్చింది. పదమూడేళ్ల కుర్రాడిని ఎత్తుకుని మెట్లెక్కసాగారాయన. కానీ ఎక్కలేక తూలడం మొదలుపెట్టారు. నేను ఆయన వెనకే ఉండి గబుక్కున పట్టుకుని, ”పిల్లాణ్ణి దింపండి,” అని, బన్నూతో, ”బాబూ, నడు,” అన్నాను.
”ఇద్దరం పడిపోయుండేవాళ్లం. నువ్వు ఆపబట్టి సరిపోయింది. అయినా సరిగ్గా సమయానికి ఎలా వచ్చావక్కడికి?” అన్నారు.
”నాకు ముందే మీరు ఎక్కలేరని అనిపించింది,” అన్నాను.
అమ్మవారు పోసినప్పుడు బన్నూ అర్ధరాత్రి లేచి నాపక్కనొచ్చి పడుకునేవాడు. ఆయన వాడికి నచ్చచెబుతూ, ”బన్నూ, అలా అమ్మ పక్కన వచ్చి పడుకోకు, నాయనా! అమ్మకి కూడా అంటుకుంటే చాలా అవస్థ పడాలి. మనకి మంచినీళ్లందిచ్చే దిక్కు కూడా ఉండదు!” అన్నారు.
వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూండగా నేనక్కడికి వెళ్లాను. ఆయన మాటలు విని, ”బలేవారండీ, మీరు! ఈ జబ్బు నాకేం రాదు!” అన్నాను.
”ఇది అంటురోగం, నీకెందుకు అంటుకోదు?” అన్నారు.
”అయితే మీరు కూడా దూరంగా వెళ్లండి. మీకు కూడా అంటుకోవచ్చు కదా?”
”నీకు అంటుకుంటుందేమోననే నా భయం. ఒక్కరోజు నువ్వు పడుకున్నా సరే, నాకిక దిక్కుతోచదు!” అన్నారు.
”నా అవసరం మీకంత ఉందని అనుకోను.”
”నీకేం? అవస్థ పడేది నేనూ!”
”హూఁ! భయపడకండి, నాకీ జబ్బు అంటుకోదు.”
”నాకదే భయం. పిల్లలిద్దరూ వరసపెట్టి పడకేశారు. ఇక నీ వంతు!”
”పెద్దవాళ్లకిది చాలా అరుదుగా వస్తుంది.”
ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే నేనాయనకి చెప్పేదాన్ని కాదు, ఎందుకంటే ఇక ఆయన ఆ జబ్బు తగ్గేదాకా తెగ గాభరా పడిపోయేవారు. చిన్న చిన్న సుస్తీలకి నేనే వైద్యం చేసేదాన్ని. ఆయన తరచు నాతో ఒక మాట అంటూండేవారు, ‘ఏదైనా ఒకరోజు నేనేమీ రాయకపోతే ఆ రోజు నిరర్ధకమై పోయినట్టనిపిస్తుంది నాకు’. వీలైనంత వరకూ ఇంటి వ్యవహారాలేవీ ఆయనకి తెలియనిచ్చేదాన్ని కాదు. తనకి కాస్త సుస్తీ చేసినా రాయడం మానేవారు కాదు. కానీ, నేను పడకేస్తే మాత్రం ఆయన కలం ఆగిపోయేది. ఒకసారి నేను ఆరునెలలపాటు పడకేశాను.. ఆరునెలలూ ఆయన ఒక్క అక్షరం కూడా రాయలేదు.
మా ఊళ్లో ఉన్నప్పుడు, ఊళ్లో ఆడవాళ్లందరూ ఎప్పుడూ నాచుట్టూ చేరేవాళ్లు. ఆయన విసుక్కునేవారు. ఎందుకంటే ఆయన బైటే కూర్చోవలసి వచ్చేది. పరాయి ఆడవాళ్లు లోపల ఉంటే ఆయన ఆ దరిదాపులకి వచ్చేవారు కాదు.
”వీళ్లందరూ ఎందుకు ఎప్పుడు నీ చుట్టూ చేరతారు?” అని అడిగేవారు.
”దాన్లో తప్పేముంది? తమ పనులన్నీ మానుకుని వస్తున్నారు, ఇందులో నేను నష్టపోయేదేముంది?”
”నాకు అలా బైట కూర్చుంటే తోచదు.”
”మీరేదైనా పని చేసుకోవచ్చుగా? పూర్తి చెయ్యవలసిన కథలెన్నో ఉన్నాయి కదా, వాటిని రాసి ముగించచ్చుగా?”
”అవన్నీ రాసి పంపించేశాను. నువ్వు కోలుకున్న తరవాతే కలం ముట్టుకునేది.”
”నాకిప్పుడేమైందని? ప్రాణం పోయే పరిస్థితేం లేదుగా?”
నాకు అతిసారం పట్టుకుంది. ఆయన గాభరాపడతారని చెప్పలేదు, కానీ ఈ రోగం తగ్గి బతికి బట్టకడతానని నాకైతే నమ్మకం లేదు. ఆయన నన్ను పట్నం తీసుకెళ్లి వైద్యం చేయిస్తానన్నారు. కానీ నేనే ఒప్పుకోలేదు. ”ఇక్కడ మందు తీసుకుంటున్నాను, నయమవుతోంది కదా, ఇంక పట్నం ఎందుకు వెళ్లడం?” అన్నాను.
”ఎక్కడ నయమవుతోంది? ఆ లక్షణాలు నాకేం కనిపించడం లేదే?” అన్నారు.
”కంగారేం లేదు. ఒకవేళ నేను పోయినా పెద్ద మునిగిపోయిందేమీ లేదు. అమ్మాయీ, ధున్నూ పెద్దవాళ్లయారు. బన్నూని మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకుంటే చాలు.”
”ఏం మునిగిపోతుందో నాకు తెలీదు కాని, నేను మాత్రం మునిగిపోతాను,” అన్నారు కళ్లనిండా నీళ్లతో.
ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నా మనసు కూడా భారంగా అయిపోయింది. సర్దుకుని, ”అరె, నేను తమాషాకన్నాను! మీరు నిజమని నమ్మేశారా?” అన్నాను.
”నువ్వు ఎంత దాచినా, నాకు అనుమానంగానే ఉంది!”
”నేనేమీ దాచటం లేదు. తొందరగా కోలుకుంటాను, చూస్తూ ఉండండి.”
నాకు జబ్బుగా ఉన్నప్పుడు వంట పనంతా ఆయనే చేసేవారు. నాకు కాస్త తగ్గగానే మా అన్నయ్యవచ్చి తీసుకెళ్లాడు. మా ఆయన కూడా నా వెంటవచ్చి రెండు నెలలు నాతోనే ఉన్నారు. నాకు పూర్తిగా తగ్గేదాకా ఉండి వెళ్లిపోయారు. వెళ్లేప్పుడు మా అన్నయ్య నన్ను పల్లెటూరికి తీసు కెళ్తాననీ, అక్కడి వాతావరణం నాకు బాగా పడుతుందనీ ఆయనతో అన్నాడు. మా ఆయన ”అలాగే తీసుకెళ్లండి. జాగ్రత్తగా చూసుకోండి, ఏమీ లోటు రాకూడదు. చాలా నీరసంగా ఉంది ఆమె,” అన్నారు.
”మీరు దీన్ని గురించి కంగారు పడకండి. మీ దగ్గరున్నన్నాళ్లూ నన్ను చూసుకోవడం మీ డ్యూటీ. ఇప్పుడది అన్నయ్య డ్యూటీ!” అన్నాను.
”నా డ్యూటీ నిరంతరం ఉండేది. మీ అన్నయ్య మంచివాడు కాబట్టి ఆయనకి డ్యూటీ వేస్తున్నావు!” అన్నారు. అక్కడే ఉన్న మా తమ్ముడు, ”ఇందులో డ్యూటీ ఏముంది బావగారూ? ఆవిడతో రక్తం పంచుకుని పుట్టినవాళ్లం. మీరు మాకు ముందే ఈ విషయం చెప్పి ఉండవలసింది,” అన్నాడు.
”మీకు తెలిసే ఉంటుందను కున్నాను,” అన్నారు.
”లేదు, అసలు మాకేం తెలీలేదు. తెలియగానే పరిగెత్తుకొచ్చాం.”
ఆ తరవాత ఆయన బెనారస్‌ వెళ్లిపోయారు.
‘అన్నీ మా బావే చూసుకున్నాడు’
మా ఆయన మేనకోడలి పెళ్లి నిశ్చయమైంది. బన్నూకి రక్త విరోచనాలు అవుతున్నాయి. పెళ్లికి వెళ్లేందుకు ఆయన అన్ని ఏర్పాట్లూ ముందే పూర్తిచేసుకున్నారు. మేం అప్పుడు లక్నోలో ఉన్నాం. పెళ్లికి వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారాయన. బన్నూ పరిస్థితి చూస్తే ఇలా ఉంది, మేనకోడలి పెళ్లికి వెళ్లడం కూడా ముఖ్యమే! ”మీరు వెళ్లకుండా ఉంటేనే మంచిది,” అన్నాను.
”అక్కయ్య పోయింది. తల్లిలేని పిల్లలు, పాపం! నేను కూడా వెళ్లకపోతే చాలా బాధపడతారు,” అంటూంటే ఆయన గొంతుక్కి ఏదో అడ్డం పడ్డట్టయింది. ”సరే, మీరెళ్లండి. వీడి సంగతి నేను చూసు కుంటాను,” అన్నాను.
ఆయన వెళ్లారు కానీ మనసంతా బన్నూ మీదే. నాలుగోరోజున తిరిగి వచ్చారు. అప్పటికి బన్నూకి విరోచనాలు తగ్గాయి. ఆయన, ”దేవుడు దయవల్ల వీడికి తగ్గింది!” అన్నారు.
”మీకు దేవుడిమీద నమ్మకం ఎప్పణ్ణించి?” అన్నాను.
”పాపం, ఎంత నీరసించిపోయాడో చూడు! కానీ కోలుకున్నాడు, అదే పదివేలు!”
”ఊఁ! పెళ్లి బాగా జరిగిందా?”
”ఆఁ, బాగానే జరిగింది. కానీ అమ్మాయిలు అత్తారింటికి వెళ్తూంటే చూడడం చాలా కష్టంగా ఉంటుంది. మనం వాళ్లవెంట వెళ్లలేం, పైగా వాళ్లు ఏడుస్తూంటే మనసుకెలాగో అనిపిస్తుంది!”
”పెళ్లి చేసుకుని మిర్జాపూర్‌కే కదా వెళ్లింది, ఏమంత దూరమని?”
”అయినా, తట్టుకోలేం కదా?”
”నేను మేనమామగా మిమ్మల్ని కొన్ని లాంఛనాలు నిర్వహించమని చెప్పాను, చేశారా?”
”అబ్బ, నాకవన్నీ చేతకావు, అన్నీ బావగారికి చెప్పి చేసెయ్యమన్నాను!”
ఆగస్టు 23, 1927 నాటి సంఘటన. లమహీలో ఉండేవాళ్లం. ఆయన ఏదో పనిమీద లక్నో వెళ్లారు. నేను ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఆయన తమ్ముడికి కొడుకు పుట్టాడు. కానీ అంతక్రితం కొన్ని నెలలుగా అన్నదమ్ముల మధ్య మాటల్లేవు. ఏదో అభిప్రాయభేదం వచ్చింది. పిల్లవాడు పుట్టింది ఉదయం ఐదు గంటలకి. అంతక్రితం రాత్రే నాకు కబురందింది.
మా ఇంట్లో పనిచేసే నౌకరు రాత్రిపూట ఇంటికెళ్లిపోయేవాడు. కానీ ఆ రోజు నా తోటికోడలు కనబోతోందని కబురు రావడంతో నౌకర్ని వెళ్లద్దని చెప్పాను. రాత్రి మంత్రసాని అవసరం పడితే పరిగెత్తి పిలుచుకురావడానికి వాడు ఉండాలనే ఉద్దేశంతో. పొద్దున్న వరకూ కాన్పు రాకపోవడంతో, మా బావగారే నౌకర్ని మంత్రసానిని పిలుచుకు రమ్మని పంపారు. ఆరుగంటలకల్లా మంత్రసాని వచ్చింది. కానీ నౌకరు ఎనిమిదింటివరకూ రాలేదు!
”ఇంతసేపు ఎక్కడున్నావు?” అని అడిగాను.
”అయ్యగారు మంత్రసానిని పిలుచుకురమ్మని పంపారమ్మా!” అన్నాడు.
”అవును, కానీ మంత్రసాని ఆరుగంటలకే వచ్చేసిందిగా?” అన్నాను.
నాకు కోపం వచ్చి, ”ఇంత ఆలస్యం చేశావు, ఇంట్లో ఒక్క చుక్క నీళ్లు లేవు!” అన్నాను గొంతు పెంచి.
నౌకరు బిందె తీసుకుని కిందికెళ్లాడు. నా కేకలు కింద గుమ్మం దగ్గర నిల్చున్న బావగారికి వినిపించాయి. ఆయన అక్కణ్ణించే నామీద అరవడం మొదలు పెట్టాడు. చాలా ఘోరంగా తిట్టాడు. జవాబు చెపితే ఏం కొంప మునుగుతుందో అనే భయంతో నేను చెవులు గట్టిగా మూసుకుని కూర్చున్నాను. నాకు ఒకేసారి కోపం, ఏడుపు ముంచుకొచ్చాయి. అసలు నేను తప్పేమీ చెయ్యలేదు, అదీగాక ఇంకొకరిచేత మాటలు పడడం నాకు అలవాటు లేదు. చాలాసేపు అలా నన్ను తిట్టి, ఆయన ఊరుకున్నాడు. కానీ ఆ రోజంతా నా మనసు పూర్తిగా పాడైపోయింది.
సాయంత్రం ఆయన లక్నోనించి తిరిగొచ్చేసరికి ఏ నాలుగో అయింది. రోజంతా ఏడుస్తూ ఉండడంవల్ల నాకు తలనొప్పి వచ్చింది. ఆయన రాగానే నా ఒంట్లో ఎలా ఉందని అడిగారు. తలనొప్పిగా ఉందని చెప్పాను. ”ఏం, ఎండలో బాగా తిరిగావా?” అని అడిగారు. ఆయన అలా అడగ్గానే నాకు ఏడుపు ఆగలేదు. కన్నీళ్లు ఆయన కళ్ల పడకుండా ఉండడంకోసం గదిలోకెళ్లిపోయాను. కానీ ఆయన నా పరిస్థితి ఏమిటో పసిగట్టేశారు. నా వెనకాలే లోపలికొచ్చి, నా చెయ్యి పట్టుకుని, ”నిజం చెప్పు, ఏం జరిగింది?” అన్నారు. అంతేకాదు చెప్పేదాకా వదల్లేదు, ”చెప్పకపోతే నామీద ఒట్టే!” అని కూడా అన్నారు.
అప్పుడిక జరిగినదంతా చెప్పేశాను. ”ఇప్పుడే వెళ్లి ఈ సంగతి తేల్చుకుని వస్తాను. పరాయి ఆడదానివి, నీమీద నోరు పారేసుకునే హక్కెవరిచ్చారు ఆయనకి?” అన్నారు.
”ఆయనకది అలవాటేగా? మీ వదినని కూడా అలాగే నానామాటలూ అంటూ ఉంటారు!” అన్నాను.
”వదిన సంగతి వేరు, ఆమె ఆయన భార్య, ఇంకొకరి భార్యని తిట్టడానికి ఆయనకేం అధికారం ఉంది?”
”పోనిద్దురూ! అలవాటుని మాన్పించటం చాలా కష్టం.”
”లేదు, ఆయనతో ఈ సంగతి మాట్లాడి, అలా ఇంకెప్పుడూ చెయ్యద్దని చెపుతాను.”
”మీకు నమస్కారం పెడతాను. ఆయనతో ఏమీ అనకండి. లేకపోతే మీరు ఇంట్లో అడుగుపెట్టగానే చాడీలు చెప్పాననుకుంటారు. ఆయన సంగతి తెలుసుకదా? మీమీద కూడా కోపగించుకుంటారు.”
”నేనింట్లో లేని సమయం చూసి నిన్ను కోప్పడతాడా? నన్ను కావలిస్తే ఏమైనా అననీ, నిన్ను అనే హక్కు ఆయనకి లేదు. నేనలాగే చేస్తున్నానా? అయినా నువ్వు వెంటనే, నౌకర్ని నా ఇంట్లో పనికోసం పెటు ్టకున్నాను, అందరికోసం కాదు, అని అన వలసింది!”
”ఆయన పెద్దవాడు కదా, అలా ఎలా అంటాను?”
”పెద్దవాడు పెద్దరికాన్ని నిలుపు కోకపోతే, మనమేం చేస్తాం?”
”నామీదొట్టు! ఆయనతో గొడవ పెట్టుకోకండి!”
”అలా అయితే అసలు నాకీ సంగతి ఎందుకు చెప్పావు?”
”నేను చెప్పాలనుకోలేదు. మీరు ‘ఒట్టు’ అనేసరికి చెప్పాల్సి వచ్చింది.”
”అయితే, నువ్వు నా దగ్గర మాత్రమే పులిలా ఉంటావన్నమాట, మిగతావాళ్ల దగ్గర పిల్లివే!”
”పులీలేదు ఏం లేదు. ఆయన నన్ను తిట్టడం ఇరుగుపొరుగు వాళ్లు వినే ఉంటారు. మనం ఎదురు జవాబు చెబితే అన్నదమ్ములకి పడటం లేదని అందరూ నాలుగు రకాలుగా చెప్పుకుంటారు. అది మంచిది కాదు కదా!
”అయితే నేను తిడితే నువ్వు ఊరుకోవే? ఇంక నేను కూడా నిన్ను తిడతాను!” అన్నారు.
”మీరు తిడితే నాకు బావుండదు.”
”ఏం? నేను కూడా వయసులో నీకన్నా పెద్దవాడినేగా?”
”పెద్దచిన్నా అనేది కాదు ముఖ్యం. మీరు తిడితే నేను భరించలేను. అయినా అసలు నావల్ల ఏ తప్పూ జరగనప్పుడు ఎవరైనా నన్నెందుకు తిట్టాలి?”
”అయితే ఇవాళ పొద్దున్న నువ్వేం తప్పు చేశావని తిట్లు తిన్నావుట?” అన్నారు.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.