తొలి తరం తెలంగాణ మహిళా కథకులు

డా|| వి. త్రివేణ
ఉపోద్ఘాతం :
మౌఖిక శాఖకు చెందిన జానపదకథ కాలక్రమేణ ఆధునిక సాహిత్య ప్రయోజనాన్ని ఆశించి ఒకానొక వచన రచన ప్రక్రియగా రూపొందింది. నేడు ఈ కథా ప్రక్రియ సాహిత్య ప్రయోజనంతో పాటు సామాజిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. సామాజిక నేపథ్యంలో గల ఆర్థిక, రాజకీయ విశ్లేషణలతో కూడి తాత్త్విక ప్రయోజనానికి ప్రయత్నిస్తుంది. సామాజిక దృష్టి పథంలోని కథా సాహిత్యం ఆధారంగా సమాజాన్ని అధ్యయనం చేయడానికి అవకాశం కలుగుతుంది. అందుకే కథా సాహిత్యంలో సమాజ జీవితానికి విడదీయరాని బంధం ఏర్పడింది. ఈనాటి సామాజిక తత్త్వవేత్తలు అతి ప్రాచీన కాలం నుంచీ వివిధ సాహిత్య గ్రంథాల్లో గల కథల ద్వారా తమ పరిశోధన మూలాలను వెతుక్కొంటున్నారు.
తొలి తెలంగాణ (తెలుగు) కథ – ఆవిర్భావం :-
వందేళ్ల ఆధునిక తెలుగు కథా చరిత్రలో తెలంగాణ నుంచే తొలి కథానిక వచ్చిందని ఇటీవలి శోధనలు ఆవిష్కరిస్తున్నాయి. తెలంగాణకు సుదీర్ఘ కాలం నుంచే కథా సంస్కృతి ఉంది. ”బృహత్కథ” కాలం నుంచే తెలంగాణ ప్రాంతం ”కథా నిలయం” గా విలసిల్లింది. శాతవాహనుల ఆస్థానానికి చెందిన గుణాఢ్యుడు రచించినది ”బృహత్కథ”. ఇది భారతీయ కథా సాహిత్యానికే కాదు, యావత్ప్రపంచ కథా సాహిత్యానికే తలమానికమైంది. గోవర్దనుడు, బాణుడు, కాళిదాసు వంటి సంస్కృత పండితులు తమ తమ కావ్యాలలో బృహత్కథను, గుణాఢ్యుడిని ప్రస్తుతించగా, కథా వర్గానికి బృహత్కధే ఉదాహరణ” అని దండి వ్యాఖ్యానించారు. సమగ్రాంథ్ర సాహిత్యంలో ఆరుద్ర గుణాఢ్యుడిని గూర్చి ప్రస్తావిస్తూ – ”ప్రపంచ కథానికలకి ఆద్యబ్రహ్మ అనదగ్గ గుణాఢ్యుడిని గూర్చి ప్రస్తావిస్తూ – ”ప్రపంచ కథానికలకి ఆద్యబ్రహ్మ అనదగ్గ గుణాఢ్యుడు ఆంధ్రుడు కావడం, తెలుగు వారందరికీ గర్వకారణం” అని అభివర్ణించారు. గుణాఢ్యుడు ఆంధ్రుడే అయినా శాతవాహనుల పరిపాలనంతా నేటి కరీంనగర్‌ పరిసర ప్రాంతంలోనే జరిగినట్లు చరిత్రాధారాలున్నాయి. కావున మొదటగా గుణాడ్యుడు తెలంగాణీయుడన్న విషయాన్ని గుర్తించాలి. ప్రసిద్ధ చరిత్రకారులు స్వర్గీయ బి.ఎన్‌. శాస్త్రి గారు చాలా కాలం క్రితమే ఈ విషయాన్ని నిర్ధారించారు.
బృహథ్కత పునాదిగా అనేక కథలు సాహిత్యంలో చోటుచేసుకున్నాయి. కథా సరిత్సాగరం, భేతాళ పంచవింశతి, సింహాసన ద్వాత్రింశిక, శుక సప్తతి, పంచతంత్రం, హితోపదేశం వంటి కథాగ్రంథాలు రచించబడ్డాయి. అనాదిగా వస్తున్న వేద సాహిత్యంలో, ఉపనిషద్గ్రంథాలలో, అష్టాదశ పురాణాలలో, ఇతిహాస కావ్యాలలో కథ అనేది ఏదో ఒక రూపంలో ఉంటూ వచ్చింది. రమారమి ఇదే సమయంలో భారతీయ సాహిత్యంలో జైన కథలు, బౌద్ధ జాతక కథలు ఆవిర్భవించాయి.
ఇదంతా కథకు పూర్వ చరిత్ర కాగా, ఆధునిక సాహిత్యంలో కథ వచన ప్రక్రియగా ఒక ప్రత్యేకమైన రూపాన్ని ధరించి, సుస్థిరమైన స్థానాన్ని  సంపాదించుకొంది. ఇరవయ్యో శతాబ్దాదిలో ఆరంభమైన కథా ప్రక్రియ నేడు వందేళ్ల పండుగను జరుపుకొంటుంది. కాని తెలంగాణ కథకు వందేళ్ల కంటే పూర్వపు చరిత్రే ఉందని ప్రముఖ తెలంగాణ రచయిత్రి డా|| ముదిగంటి సుజాతారెడ్డి స్పష్టం చేశారు. ఆమె ఆంధ్రజ్యోతి  ”వివిధ” సాహిత్య వేదిక ప్రచురించిన ”తెలంగాణ నుంచే తొలి కథానిక” అన్న వ్యాసంలో 1901 నుంచి 1904 వరకు అచ్చులో దొరికిన భండారు అచ్చమాంబ కథలను ”భండారు అచ్చమాంబ తొలి తెలుగు కథలు” అన్న పేరుతో సంగిశెట్టి శ్రీనివాస్‌ గ్రంథరూపంలోకి తెస్తున్నారన్న సంగతి తెలుస్తోంది. భండారు అచ్చమాంబ జననం తెలంగాణా ప్రాంతం కావటం, తొలి తెలుగు కథలు రాయటం, అందులోను ఆమె మహిళ కావటం గమనార్హం, కావున తెలంగాణ తొలితరం కథా రచయిత్రుల చరిత్ర భండారు అచ్చమాంబతోనే ఆరంభమౌతుంది.
తొలి తెలంగాణ (తెలుగు) కథ – భిన్నాభిప్రాయాలు :
1. గురజాడ అప్పారావు గారి ”దిద్దుబాటు” కథానిక 1910 పిబ్రవరి ”ఆంధ్రభారతి” పత్రికలో అచ్చయింది. ఇదే ఆధునిక తెలుగు సాహిత్యంలో తొలి కథానికగా ఇప్పటి వరకూ చెలామణి అవుతూ వచ్చింది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు, శెట్టి ఈశ్వరరావు గారు వంటి సాహితీవేత్తలు గురజాడ గారి ”దిద్దుబాటు” ను మొదటి కథానికగా భాసింపజేశారు. వీరు- గురజాడ గారు కథా రచనకు మార్గదర్శి అని, ఆయన కథానిక వ్యావహారిక భాషా విశిష్టత గలదని, కథా శిల్పంతో కూడినదని భ్రమింపజేశారు. ఈ భ్రమలన్నింటినీ తొలగిస్తూ భార్గవీరావు గారు ”నూరేళ్లపంట” కథా సంకలనానికి ముందుమాట రాస్తూ – గురజాడ వారు ”కమలిని” అన్నపేరుతో స్వహస్తంతో వ్రాసి దిద్దిన లిఖిత ప్రతి లభించిందని, అవసరాల సూర్యారావు గారు ”ఆణిముత్యాలు” అన్న కథా సంకలనంలో గ్రాంథిక పాఠంలో దీనిని ముద్రించారని పేర్కొన్నారు. అంటే గురజాడ గారు తాను మొదటగా రాసిన గ్రాంథిక బద్ధమైన ”కమలిని” కథను శిష్ట వ్వవహార భాషలో ”దిద్దుబాటు” గా మలిచాడన్న సంగతి తెలుస్తుంది. ఇందులో సాహిత్యకారుల పాత్ర కూడా చాలావరకు ఉంది. వీరు అప్పటినుంచి ఇప్పటివరకు వందేళ్ల ”దిద్దుబాటు” కథానికను అనేక దిద్దుబాటును గురిచేస్తూనే ఉన్నారు. తెలుగు కథానిక చరిత్రలో తొలి కథానికగా దిద్దుబాటుకు మెరుగులు దిద్దుతూనే ఉన్నారు.
2. మాడపాటి హనుమంతరావు రచించిన కథ ”హృదయకల్పము”. ఇది ”ఆంధ్రభారతి” పత్రికలో 1912 జనవరిలో అచ్చయింది. ఈ కథ దాదాపు ”దిద్దుబాటు” కథానిక కంటే రెండు సం||ల తర్వాత అచ్చయింది. కాని ప్రసిద్ధ చరిత్రకారుడు ఆదిరాజు వీరభద్రరావు మాడపాటి హనుమంతరావు జీవిత చరిత్రను రాస్తూ – ”ఆంధ్రములో కథానికలు నూతన పద్ధతుల మీద మొట్టమొదట వ్రాసిన కీర్తి శ్రీ హనుమంతరావు గారికే చెందవలసి యున్నది” అని చెప్పారు. 2002లో తెలంగాణ తొలితరం కథలను సంకలనంగా వేసిన డా|| ముదిగంటి సుజాతారెడ్డి ప్రస్తావిస్తూ – ”ఆంధ్రభారతి కథను మొదటి పంపింది మాడపాటియేనేమో! అది అచ్చుగాక మూలనపడి వుండి మొదటి కథ అన్న కీర్తిని దక్కించుకోలేక పోయిందా! ఒక వేళ ”ఆంధ్రభారతి” లో అచ్చయిన తీరుతెన్నులను తవ్వి వెలికి తీస్తే దీనిలోని సత్యం బయట పడుతుందేమో?” అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆదిరాజు వీరభద్రరావు, డా|| ముదిగంటి సుజాతారెడ్డి అభిప్రాయాల ప్రకారం నూతన కథానికా పద్ధతులను అనుసరించడంలో ”దిద్దుబాటు” కంటే ”హృదయశల్యమే” ప్రథమస్థానాన్ని వహిస్తుందని భావించవచ్చు.
4. భండారు అచ్చమాంబ పై ఇంతకు ముందే కొన్ని అభిప్రాయాలు వెలుబడ్డాయి. ”హిందూ సుందరి” పత్రికలో 1902 లో అచ్చయిన ”స్త్రీ విద్య” కథను ప్రస్తావిస్తూ ”నూరేళ్లపంట” కథా సంకలనంలో భార్గవీరావు గారు ముందుమాట రాస్తూ – ”1902 లోనే బందరులో తొలి మహిళా సమాజాన్ని బృందావన స్త్రీ సమాజాన్ని స్థాపించిన అచ్చమాంబగారు మొదటి రచయిత్రి అని గర్వంగా చెప్తూ వారి రచన ”స్త్రీ విద్య” ను మొదటి కథగా వేసుకున్నాము. గురజాడ వారి ”దిద్దుబాటు” మొదటి కథ అనుకోవడం పొరబాటని సవినయంగా మనవి చేస్తున్నాము” అని నిర్దారించారు. ఇతివృత్త నేపథ్యాన్ని బట్టి చూసినా ఈ రెండు కథల్లో స్త్రీ విద్య ప్రధానంగా ఉండటం విశేషం.
5. ”హిందూ సుందరి” పత్రికలో 1902 నవంబరులో అచ్చయిన అచ్చమాంబ కథ ”ధన త్రయోదశి” ని వివరిస్తూ ప్రముఖ స్త్రీవాద పత్రిక భూమిక సంపాదకీయంలో  కొండవీటి సత్యవతి ”తెలుగు సాహిత్య చరిత్రలో ఆనాటి రచయిత్రులకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. తెలుగులో తొలి ఆధునిక కథ రాసిన భండారు అచ్చమాంబకు జరిగిన అన్యాయం గురించి కె. లలిత బయటపెట్టే వరకు ఎవరికీ తెలియదు. 1902 లోనే ”ధన త్రయోదశి” కథ రాసిన భండారు అచ్చమాంబను వెనక్కి నెట్టేసి 1911? (1910) లో గురజాడ రాసిన దిద్దుబాటు తొలి ఆధునిక కథగా సాహిత్యకారులు  స్థిరీకరించారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
6. కథానిలయం ట్రస్ట్‌ వారు 2008 లో ”తొలి తెలుగు కథలు – ఏడు అభిప్రాయాలు” అనే పుస్తకంలో అచ్చమాంబ కథలను ప్రచురించింది. ఇందులో మొదటి రెండు కథలు 1902 లోనే అచ్చమాంబ రాసినవి ”ధన త్రయోదశి, స్త్రీ విద్య”. వీరి నివేదికను బట్టి తొలి తెలుగు కథా రచన చేసినవారు అచ్చమాంబయే అని పేర్కొనవచ్చు.
7. 2009, జూలై 13న ఆంధ్రజ్యోతి పత్రిక ”వివిధ” సాహిత్య వేదికకు రాసిన వ్యాసంలో డా|| ముదిగంటి సుజాతారెడ్డి ”తెలంగాణ నుంచే తొలి కథానిక” అని చెబుతూ భండారు అచ్చమాంబ 1898 నుంచే కథా రచనారంభం చేశారని, ఆమె రాసిన ”ప్రేమ పరీక్షణము” ”ఎరువు సొమ్ము పఱువు చేటు” కథలు రాయసం వేంకట శివుడు నిర్వహించిన ”తెలుగు జనానా” పత్రికలో అచ్చయ్యాయని, కాని ఇంకా ఆ పత్రికా సంచికలు దొరకవలసి ఉందని తెలియజేశారు. 1901 నుంచి 1904 వరకు సేకరించిన అచ్చమాంబ పది కథలను సంగిశెట్టి శ్రీనివాస్‌ గ్రంథరూపంలో వెలువరిస్తున్నారని స్పష్టం చేసారు.
ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో వందేళ్ల పండుగ జరుపుకొంటున్న శుభసందర్భంలో గురజాడ కథను, సాంఖ్యాయన కథలను పూర్వపక్షం చేస్తూ తెలంగాణ పరిశోధకుల అచ్చమాంబ కథలకు వందేళ్ల గ్రహణం వీడిందని భావించవచ్చు.
తొలి తరం తెలంగాణ మహిళా కథకులు :-
తొలి నాళ్ల నుంచీ తెలంగాణా కథలకు చారిత్రకంగా, సామాజికంగా గొప్ప ప్రాధాన్యం ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన నాటి దిన, వార, మాస పత్రికలు కథా రచయితలను ప్రోత్సహించి కథా సాహిత్యాన్ని పెంచి పోషించాయి. తెలంగాణా ప్రాంతం (హైదరాబాదు) నుంచి 1876లో వెలువడిన మొట్ట మొదటి తెలుగు పత్రిక ”శేద్య చంద్రిక” ఎక్కువకాలం కొనసాగకున్నా కథనం మాత్రం జరిగే ఉంటుందని విమర్శకుల అభిప్రాయం. 1913-14లో మహబూబ్‌నగర్‌ నుంచి వెలువడిన ”హితబోధిని” పత్రికలో కనీసం ఒక కథయైౖన ప్రచురించబడి ఉండవచ్చునని పెద్దల సూచన. ఇవే గాక ఆ రోజుల్లో తెలంగాణా నుంచి చాలా పత్రికలు వచ్చాయి. గోలకొండ, శోభ, ఆంధ్రకేసరి, సుజాత, కాకతీయ, తెలంగాణా, తెలుగుతల్లి, నీలగిరి, ఉదయిని, తెనుగు, ప్రత్యూష, స్రవంతి, ప్రగతి, సారధి, తెనుగుదేహం, నవోదయ, స్వతంత్ర, ప్రజాతంత్ర, ఉషస్సు, మీజాన్‌, రెడ్డిరాణి వంటి పత్రికల్లో తెలంగాణా రచయితల కథలు చాలా వరకు అచ్చయినాయి. వీటిల్లో కథా రచయిత్రుల పాత్ర కూడా విశిష్టంగానే ఉంది.
కానీ కథా సాహిత్య చరిత్రను అక్షర బద్ధం చేయటంలో నిన్న మొన్నటి వరకు తెలంగాణాకు అన్యాయమే జరిగింది. అందులోనూ తెలంగాణా తొలితరం కథా రచయిత్రులు కథా సంకలనాలలో పూర్తి విస్మృతికి గురి అయ్యారనే భావించవచ్చు. ఒకరిద్దరు తప్ప ఎక్కడా వీరి స్థానం కన్పించదు.
మొట్టమొదటి సారిగా 2002 లో డా|| ముదిగంటి సుజాతారెడ్డి ”తెలంగాణా తొలితరం కథలు” అన్న సంకలన గ్రంథాల ద్వారా తెలంగాణా తొలితరం కథా రచయిత్రులు పరిచయం అయ్యారు. కథా రచన కాలాన్ని బట్టి 1901 నుంచి 1956 కు పూర్వం వెలువరించిన కథలు తొలితరం కథలుగా అభివర్ణిస్తున్నాం. ఇవి కథేతివృత్తంతో, శిల్ప నిర్మాణంతో, శైలీ వైవిథ్యంతో తెలంగాణా ప్రత్యేకతను సంతరించుకొన్నాయి.
తెలంగాణా కథా సాహిత్యంలోనే కాదు సమస్త తెలుగు కథా చరిత్రలోనూ మొట్టమొదటి రచయిత్రిగా పేర్కొదగినవారు భండారు అచ్చమాంబ.
భండారు అచ్చమాంబ జననం నైజాం సరిహద్దులో గల మునగాల సంస్థానం. తల్లిదండ్రులు గంగమ్మ, కొమర్రాజు వెంకటప్పయ్య సోదరుడు కొమర్రాజు లక్ష్మణరావు. అచ్చమాంబ ఆరేండ్ల వయస్సులో తండ్రి మరణానంతరం తల్లితో, సోదరుడితో తన సవితి సోదరుడైన కొమర్రాజు శంకరరావు ఉంటున్న నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతానికి వచ్చారు. ఎనిమిదేళ్ల వయస్సులో 1882లో తన మేనమామ భండారు మాధవరావుతో అచ్చమాంబకు వివాహం జరిగింది. తన భర్త మహారాష్ట్రలోని నేటి నాగపూర్‌లో ఉద్యోగం చేస్తుండడం వల్ల అచ్చమాంబ తన కుటుంబంతో అక్కడికి వెళ్లవలసి వచ్చింది. ఒక ఉపాధ్యాయుడు తమ ఇంటికి వచ్చి సోదరుడికి పాఠాలు బోధించేటప్పుడు పక్కనే కూర్చొని శ్రద్ధగా విని అభ్యాసం చేశారు. అలవోకగా తెలుగు, సంస్కృతం, మరాఠీ, హిందీ, గుజరాతీ భాషలను నేర్చుకొన్నారు. సంప్రదాయాభిప్రాయాలు గల తన భర్త అచ్చమాంబ చదువుకోవడానికి అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన ఇంట్లో లేని సమయంలో అనేక గ్రంథాలు చదివేవారు.
నాటికాలంలో విద్యావంతులైన స్త్రీలు సమాజపు కట్టుబాట్లను, పతివ్రతా ధర్మాలను చాటి చెప్పే వృత్తాంతాలను తీసుకొని రచనలు చేశారు. కాని అచ్చమాంబ అభ్యుదయ మార్గంలో ఆలోచించి, ప్రాచీనమైన ప్రతీ ధర్మాలతో పాటు నవీన పాశ్చాత్య విద్యా సంస్కారాలను కలబోసి ఒక నూతనమైన పద్ధతిలో రచనా వ్యాసంగాన్ని ఆరంభించారు. అచ్చమాంబ జీవిత చరిత్ర రచించిన పులుగుర్త లక్ష్మీనరసమాంబ అచ్చమాంబ నొక ఆదర్శ మహిళగా అభివర్ణించడంలో ఈ విషయం తెలుస్తుంది. అచ్చమాంబ 1901 లో రచించిన ”అబలా సచ్చరిత్ర రత్నమాల” అన్న గ్రంథంలో ప్రసిద్ధ భారతీయ స్త్రీల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారు. ప్రప్రథమంగా ఆంధ్రభాషలో స్త్రీల చరిత్రను రచించినవారుగా గణతికెక్కారు. ఆమెలో గల నిర్మొహమాటం, సూటిదనం, జాతీయతాగుణం ఈ గ్రంథం ద్వారా ప్రదర్శితమౌతుంది.
స్త్రీ చైతన్యం కోసం అచ్చమాంబ ఎంతగానో పాటుపడ్డారు. ఆంధ్రదేశమంతటా పర్యటించి మహిళాభ్యుదయంపైన ఎన్నో ఉపన్యాసాలు చేశారు. బందరులో, కాకినాడలో ”బృందావనీ స్త్రీ సమాజము” పేరుతో స్త్రీల సమాజాన్ని స్థాపించారు. ముట్నూరు కృష్ణారావు, కొండా వెంకటప్పయ్య వంటి వారు ఆమె కృషిని ప్రశంసించారు. గొప్ప సంఘసేవకురాలుగా పేర్గాంచారు. సమాజ సేవ చేసే క్రమంలో ప్లేగు వ్యాధి గ్రస్తులను సంరక్షిస్తూ, అదే వ్యాధికి గురై అచ్చమాంబ 1905లో మరణించారు. తన ముప్పై యేటలోనే అచ్చమాంబ మరణించటం విచారకరం.
అచ్చమాంబ కథలు – ప్రధానాంశాలు
1. గుణవతి యగు స్త్రీ – తెలుగు జనానా – 1901, మే – సంచిక : ఈ కథలో దశకుమార చరిత్రలో ఉన్న కథను తీసుకొని నేటి జీవన విధానానికి సంబంధించిన కథగా మలిచారు. సంసారాన్ని ఎట్లా పొదుపుగా చేయవచ్చునో ఈ కథలో తెలుస్తుంది. ప్రాచీన కథాంశం అయినా నిత్యజీవానికి పనికి వచ్చే సారాంశం ఇది. ”గుణవతి యగు స్త్రీ” యన్న శీర్షికా నామమే ఇందులో పరమార్థాన్ని బోధిస్తుంది.
2. లలితా శారదులు – తెలుగు జనానా – 1901 : ”లలితా శారదులు” అనే ఇద్దరు స్నేహితుల మధ్య సాగిన వ్యవహారమిది. లలితలో ఈర్ష్య, గర్వం, దురభిమానం వంటివి కన్పిస్తే, శారదలో మంచితనం కన్పిస్తుంది. అయితే శారద తన సద్గుణాలతో లలితలో మార్పుతేవటానికి ప్రయత్నించటం అనేది ఇందులోని ప్రధానాంశం.
3. జానకమ్మ – తెలుగు జనానా -1902 : ఈ కథ స్త్రీకి విద్య ఎంత అవసరమో చాటి చెబుతుంది. చదువుకొన్న స్త్రీకి వివాహ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని, కట్న కానుకలు లేకుండానే వరుడు లభిస్తాడని రచయిత్రి ఈ కథ ద్వారా అందించే సందేశం. అందుకే తలిదండ్రులు కూతురును బరువుగా భావించకుండా విద్యాబుద్ధులు నేర్పించాలని కోరారు. ఇది పూర్తిగా సంభాషణా ధోరణిలో సాగిన కథ.
4. దంపతుల ప్రథమ కలహం – హిందూసుందరి – 1902 : భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్యంగా జీవించాలని, కుటుంబం మొత్తం సామరస్య పూర్వక వాతావరణాన్ని కల్పించుకోవాలని తెలియజెప్పే కథ. ఇది కూడా సంభాషణలో సాగింది.
5. సత్పాత్రదానము – హిందూసుందరి – 1902 : ఈ కథలోని గుడ్డివాని భాష తెలంగాణ యాసలో కన్పిస్తుంది. రచయిత్రి ఈ కథ జరిగిన చోటును హైదరాబాదుగా పేర్కొన్నారు. ఇందులో నిజాం పాలనలోని భూస్వామ్య విధానం, భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే నేపధ్యం ఉంది.
6. స్త్రీ విద్య – హిందూసుందరి – 1902 : ఈ కథ స్త్రీ విద్యావశ్యకతను తెలుపుతుంది. ఇది భార్యాభర్తల సంవాద రూపంలో కొనసాగుతుంది. స్త్రీలు చదువుకోకుండా అజ్ఞానాధకారంలో ఉన్నట్లైతే మూఢత్వంలో ఉంటారనే విషయాన్ని ఈ కథలో ఒక పురుష పాత్ర ద్వారా రచయిత్రి చెప్పిస్తారు. శాస్త్రాలలో స్త్రీలు చదువుకోకూడదు అనే మాటను ఖండిస్తూ స్త్రీ విద్యాభివృద్ధికోసం పురుషుల ప్రోత్సాహం ఎంతైనా అవసరమని తెలియజేశారు.
7. ధన త్రయోదశి – హిందూసుందరి – 1902 : ఈ కథలో గల భార్యభర్తలిద్దరిని స్వయంకృషి మీద విశ్వాసంగల పాత్రగా చిత్రించారు. వీరు దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్న ఉదాత్తగుణాలు మాత్రం వీరినుంచి వీడిపోలేకపోవటం అనేది ఈ కథలో కన్పించే విశేషం.
8. భార్యాభర్తల సంవాదము – హిందూసుందరి-1903 : ”స్త్రీవిద్య” కథలో లాగానే ఈ కథలో కూడా భార్యాభర్తల సంవాద రూపంలో కథనం సాగింది. స్త్రీలు బంగారు ఆభరణాల కంటే సద్గుణాలనే భూషణాలను ధరించాలని ఈ కథ తెలియజెబుతుంది.
9. అద్దమును సత్యవతియు – హిందూసుందరి -1903 : ఈ కథ ద్వారా ఒక చిన్న సంఘటన నుంచి ఒక గొప్ప సందేశాన్ని రచయిత్రి ఉపదేశించారు. ఈ జగత్తంతా ఒక అద్దమని, దాన్ని కోపంగా చూస్తే కోపంగా, సంతోషంగా చూస్తే సంతోషంగా ప్రతిబింబిస్తుందని వర్ణించారు. అతిచిన్న వయస్సు గల మూడు ఏండ్ల సత్యవతి పాత్రను చలాకీగా, సరస సంభాషణంగా రచించారు.
10. బీదకుటుంబము – సావిత్రి – 1904 : ఈ కథలో స్వయంకృషితో, సద్గుణాలతో దారిద్య్రాన్ని ఎట్లా జయించవచ్చునో తెలుస్తుంది. ఇది ఉత్తమ పురుషలో సాగిన కథనం.
కథా కథన శైలి : అచ్చమాంబ కథల్లో గ్రాంథిక భాష కన్పిస్తున్నా, దీర్ఘసమాసాలు గాని, జటిల పదాలు గాని ప్రయోగింపబడలేదు. కథనం ఆద్యంతం ఆసక్తిగా కొనసాగింది. ఈ కథలు పూర్తిగా సామాజిక నేపథ్యం గలవి. కొన్ని కథల్లో జీవిత సత్యాలుంటే, మరికొన్ని కథల్లో నీతిబోధలున్నవి. ఇవి వ్యక్తిత్వ నిర్మాణానికి, జీవితార్థానికి పనికివచ్చే విషయాలు. ఆమె భావాల్లో ఎక్కడా కాలదోషం కన్పించదు. కథాంశం ఆధునిక సామాజిక ప్రయోజనానికి చెందింది. సంభాషణలు అత్యంత సరళ సుందరంగా ఉన్నాయి. కథలన్నింటిలో ప్రథమ పురుషలో కథనం సాగినా పదో కథలో మాత్రం ఉత్తమ పురుషలో సాగింది. ఈ లక్షణం ఆధునిక కథానిక స్వరూప స్వభావానుగుణంగా ఉంది. ఏకాంక ప్రధానంతో పాటు, శిల్పం దృష్ట్యా ఎక్కడా విభిన్నత గోచరించదు. భాషలో మాత్రం గ్రాంథికం కన్పించినా, కథా లక్షణాలకు ఎలాంటి ఆటరకాలు కలుగవనే భావించాలి. తర్వాతి కాలంలో గ్రాంథిక భాషలో రచించిన కథారచయితల (అడవి బాపిరాజు) కథలను కథానికలుగా, రచయితలను కథారచయితలుగా అభివర్ణించడం జరిగింది. కావున అచ్చమాంబ కథలను కూడా సమగ్ర కథాలక్షణాలతో కూడిన కథానికలుగా స్వీకరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలంగాణాలో పుట్టి, మహారాష్ట్రలో జీవితం కొనసాగించటం ద్వారా ఆమెలో మిశ్రమ భావజాలం ఏర్పడింది. ఇటు వీరేశలింగం సంఘ సంస్కరణోద్యమం, అటు మహారాష్ట్రలోని జనజాగరణ దేశీయాభిమానం పట్ల ఆమె ప్రభావితురాలైనారు. వీటన్నింటికి భిన్నంగా ఆమె కథల్లో తెలంగాణా పదజాలం, తెలంగాణా జీవనవిధానం వంటి అంశాలు ప్రతిఫలిస్తాయి.
తెలంగాణ మాండలికం : ”కౌలు” అనే పదం కేవలం నిజాం రాష్ట్రాంధ్రప్రాంతం (తెలంగాణ)లోనే వాడుకలో ఉంది. భూస్వామ్య విధానం పూర్తిగా తెలంగాణా ప్రాంతంలోనే నిండి ఉంది. దశలవారీగా వ్యవసాయభూమిని రైతు కూలీలు దుక్కిదున్నడమనే పద్ధతి, ”కౌలు” అన్న పదప్రయోగం ”సత్పాత్రదానము” కథలో కన్పిస్తుంది.
”అక్కడ” అనే దానికి బదులుగా ”ఆడ” అని, ”కడపు నింపుకొనెదరు” అనే బదులు ”పొట్ట నింపుకొనెదరు” అనే మాటలు కేవలం తెలంగాణ మాండలికంలోనే కన్పిస్తాయి. ”కచ్చె” అంటే ”మొండి.” ”పూర్వము నీవంటి యొక కచ్చెపిల్ల యుండెను” అని ”దంపతుల ప్రథమ కలహము” కథలోని వాక్యప్రయోగం. కక్షకు వికృత్తి కచ్చె. కక్ష సంస్కృతనామం. ”కచ్చె” అనేది తెలంగాణ పదం – ”నీయబ్బసొమ్మా” అన్నది కూడా తెలంగాణ పదప్రయోగం. ”ఈ తేప” అంటే ”ఏడాది (సంవత్సరకాలం)”, ఉత్త అంటే ”ఏమీ లేక కేవలం” అనే అర్థంలో మనం ఉపయోగిస్తాం. ఇవి అచ్చమైన తెలంగాణా పదాలు.
మాటకు ముందు ”మంచిది” అని వాడటం తెలంగాణా వారికి అలవాటు. ఈ ఊతపద ప్రయోగం అచ్చమాంబ కథల్లో కన్పిస్తుంది. ”మంచిది కాని నేను పంపిన పుస్తకములు నీకు ముట్టినయి గదా!”, ”మంచిది మొట్టమొదట నీవు వెక్కిరించి…” ఇందులో ”ముట్టినయి” అనేది తెలంగాణ పదం. ”ఒకసారి”కి బదులు ”ఒకపారి” అని ఉపయోగించారు. ”ఒకపారి” అనే పదం తెలంగాణ వ్యాప్తిలో ఉంది.
ఇక ”వెళ్ళుట” అనే దానికి బదులు ”పోవుట” అని వాడటం దాదాపు అన్ని కథల్లో కన్పిస్తుంది. పోయెను, పోవుచుండెను, దగ్గరికి పోయి, అచ్చటికి పోయిన పిమ్మట, పనికి పోవుచుండెను, పోవుచుండగా – అనే రూపాలు ప్రతి కథల్లో ఉన్నాయి. ఈ ఆధారాలన్నింటి ప్రకారంగా తెలంగాణ నుంచే తొలి కథానిక వెలవడిందని, తొలి తెలుగు కథా రచయిత్రి ”భండారు అచ్చమాంబ” అని ధృవీకరించి, కథాచరిత్రను తిరగరాయవచ్చు.
2. తెలంగాణలో రెండవ ఆధునిక కథా రచయిత్రి జమ్మలమడుగు వనాంబ.
జమ్మలమడుగు వనాంబ ”దక్కన్‌ కేసరి” వ్యవస్థాపకులు శ్రీ అడుసుమిల్లి వెంకట దత్తాత్రేయ శర్మగారి కుమార్తె. దత్తాత్రేయ స్వయంగా నటుడు కూడా. ”అయేషా, అశ్వద్ధామ, ధర్మాత్మ, శ్రీకృష్ణదేవరాయలు” వంటి నాటకాలను రచించారు. సికింద్రాబాదులోని మహబూబ్‌ కళాశాలలో 30 సం||లు పనిచేసిన గొప్ప ఆంధ్రభాషా పండితులు. వీరికి 1910వ దశకం ద్వితీయార్థంలో వనాంబ జన్మించారు. తర్వాత జమ్మలమడుగు వారి ఇంటి కోడలైనారు. ”సూర్యచంద్రులు” అనే జంటకవులలో ఒకరైన ఈమె భర్త కథలు, ఖండకావ్యాలు, నాటకాలు రచించారు. ”సూర్యచంద్రులు” రాసిన సౌంధ్యగీతి బుద్ధుడికి సంబంధించిన నాటకం. ఇది నాటి విమర్శకుల ప్రశంసలందుకొంది. ఈ విధంగా పుట్టినింటా, మెట్టినింటా జరిగిన సాహిత్య వ్యాపకాలే వనాంబ కథారచన చేయడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. అచ్చమాంబ తర్వాత తెలంగాణ నుంచి కథానిక ప్రక్రియను చేపట్టిన మహిళగా వనాంబను పేర్కొనవచ్చు. ఈమె రాసిన ఒకే ఒక కథ ”సుగుణ ఈ పొరపాటు నాదే” అందుబాటులో ఉంది. ఇది 1934లో తన తండ్రి స్వీయ సంపాదకత్వంలో నడచిన ”దక్కన్‌ కేసరి” పత్రికలో ప్రచురించబడింది.
ఈ కథలో నాయికానాయకులు సుగుణ, వినయ కుమార్‌లు. వీరిద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని వారి తల్లిదండ్రులు ఆహ్వానించారు. తల్లిదండ్రులు సంస్కరణ భావాలు కలవారై, తమ పిల్లల ప్రేమ విషయంలో ఎలాంటి అడ్డంకులను విధించరు. నాటి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల ఆదర్శ మనోభావాలను రచయిత్రి వెల్లడించారు. కాని సుగుణ, వినయ్‌కుమార్‌ల మధ్య కొనసాగుతున్న ప్రేమను అసూయతో, ఈర్ష్యతో స్నేహితులు చెదరగొడుతారు. తర్వాత చాలారోజులకు అనుకోని సంఘటన ద్వారా వినయ్‌కుమార్‌ తన స్నేహితులు తలపెట్టిన మోసాన్ని గ్రహించి తన పొరపాటును తెలుసుకొంటాడు. అప్పటికే మంచం పట్టి ఉన్న సుగుణతో ”ఈ పొరపాటు నాదే!” అని ఒప్పేసుకొంటాడు. ఇందులో సుగుణ యొక్క అతి సున్నితమైన మనస్తత్వాన్ని రచయిత్రి చాలా చక్కగా చిత్రించారు.
ఈ కథలో రచనాశైలి సరళ గ్రాంథికమైంది. తెలంగాణా ప్రాంతంలో రచించబడిన మొట్టమొదటి కథ ఇది. ఇందులో – ”గడబిడ, గాధయితుంది, చలాయించేవారికి, తడాకా, శాండుగొట్టేవారికి” వంటి తెలంగాణా పదాలు కన్పిస్తాయి. ఈ కథ పూర్తిగా ఉత్తమపురుష కథనంతో సాగింది. ఏకాంశ ప్రాధాన్యం దృష్ట్యా, శిల్పం దృష్ట్యా చక్కటి కథానిక లక్షణాలతో సమన్వయాన్ని కుదిర్చి, కథారచనం చేశారు.
3. తెలంగాణ కథారచయిత్రుల క్రమంలో మూడవవారు ఎల్లాప్రగడ సీతాకుమారి.
ఎల్లాప్రగడ సీతాకుమారి తన భర్త నారాయణరావుతో కలిసి 1926లో హైదరాబాదుకు తరలి వచ్చారు. నారాయణరావు హైదరాబాదులో ”ఆంధ్రా బుక్‌ హౌజ్‌” పేరుతో తెలుగు పుస్తకాల దుకాణాన్ని నడిపేవారు. నాడు హైదరాబాదులో తెలుగు పుస్తకాలు దొరికే దుకాణం అది ఒక్కటే. అప్పటినుంచి ఆమె జీవితం ఇక్కడి తెలంగాణా సాంస్కృతిక ఉద్యమాలతో మమేకమైంది.
సీతాకుమారి నిజామాంధ్ర మహాసభలలో చురుకుగా పాల్గొన్నారు. ఆంధ్రమహిళా సభలను నిర్వహించారు. మూడవ, పదకొండవ ఆంధ్రమహిళా సభలకు అధ్యక్షతా స్థానాన్ని అలంకరించారు. ఆమె ఇందులో ఉపన్యసించిన అంశాలు సభాసదులందరినీ ఉత్సాహపరిచాయి. స్త్రీవిద్యావ్యాప్తి, బాల్యవివాహాల నిర్మూలన, స్త్రీలకు ఆర్థిక స్వావలంబన, మతతత్త్వం యందు అవగాహన, సోమరితనాన్ని త్యజించటం, సమాజ సేవా కార్యక్రమాలు, స్త్రీల ఆరోగ్య పరిరక్షణ, గోషా పద్ధతికి స్వస్తి పలకటం, మూఢనమ్మకాలను వదిలివేయటం వంటి అంశాలు ఆమె ఉపన్యాసంలో చోటుచేసుకున్నాయి. ఆమె సూచించిన విషయాలు నాటి సమాజశ్రేయస్సును కాంక్షించేవి. స్త్రీలు పుస్తకాలు, వార్తాపత్రికలు చదివి స్త్రీల సంఘాలతో పాలుపంచుకోవాలని కోరారు. స్త్రీలు విద్యావంతులైతే, ధైర్యవంతులైతే, దేశస్వాతంత్య్రాన్ని కాంక్షించేవారైతే వారి సంతతి కూడా ఇలాంటి లక్షణాలతో విలసిల్లుతారని పేర్కొన్నారు. సాంఘిక, రాజకీయ, సారస్వత రంగాలలో విశేషంగా కృషి చేశారు. తెలంగాణా ఆంధ్రోధ్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. స్త్రీల కోసం ”ఆంధ్ర సోదరీ సమాజము” స్థాపించారు. ఇదే తర్వాతికాలంలో ”ఆంధ్ర యువతీ మండలి”గా రూపుదిద్దుకొంది. ఇదేగాక ప్రత్యేకంగా తెలంగాణా మహిళా సమితిని కూడా నడిపారు. నిజాం రాష్ట్ర విమోచనానంతరం, విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత 1957లో ఆమె ”బాన్సువాడా” నుంచి పోటీ లేకుండా రాష్ట్ర శాసనసభా సభ్యులుగా ఎన్నికైనారు.
సీతాకుమారి సంఘసంస్కరణకు రచనా వ్యాసంగాన్ని సాధనంగా ప్రయోగించారు. ఆమె రచనలు గృహలక్ష్మి, భారతి, ఆంధ్రపత్రిక వంటి పత్రికలలో ప్రచురితమైనాయి. ”ఉజ్జ్వలనారి” ఖండికల సంపుటి  నీతిని, లోక వ్యవహారాన్నీ తెలిపే రీతిలో పిల్లలకోసం ”కోడికుంపటి, కొత్తబడి” వంటి నాటికలు  ”మంచు కొండల్లో మహిళాసభ” ”నేనూ-మా బాపూ” వంటి ఊహాచిత్రాలు ఆమె రచనావైశిష్ట్యాన్ని తెలుపుతాయి. 1968లో సంకలనం చేసిన ”మందారమాల” అనే వ్యాసమాల విశ్వవిద్యాలయ విద్యార్థులకు పఠనీయగ్రంథంగా ఉంది. సామాజిక స్పృహతో రచించిన ఆమె కథలు ప్రగతి భావాలను వెల్లడిస్తాయి. ఆమె రచనాశైలి సరళంగా, చక్కని సంభాషణలతో, అక్కడక్కడా తెలంగాణా నుడికారాలతో కన్పిస్తుంది.
సీతాకుమారి కథలు – కథాంశాలు :
1. పునిస్త్రీ పునర్వివాహం – ఆంధ్రప్రతిక – ఈశ్వర సంవత్సరాది 1937 : ఈ కథలో నాయిక మధు వరకట్న సమస్యను అధిగమించి స్వేచ్ఛాజీవితాన్ని గడిపిన దృశ్యం కన్పిస్తుంది. కట్నం ఇవ్వలేదన్న నెపంతో అత్తింటివాళ్ళు మధును పుట్టింట్లోనే వదిలివేస్తే, అధైర్యపడకుండా ఎన్నో ఆటుపోటులను ఎదిరించి తన లక్ష్యం వైపు పయనించింది. మరొక ఆదర్శ వివాహం చేసుకొంది. ఈ కథలో కన్పించే మధులాంటి ధైర్యవంతులు ఆనాటి సమాజానికి ఎంతో అవసరమని రచయిత్రి తెలియజేశారు.
2. ”ఈ రాధేనా?” – భారతి – జూలై 1938 : ఈ కథ స్త్రీ సహజమైన భావోద్వేగాలను వెల్లడిస్తుంది. స్త్రీ ఆలోచనా శక్తిని, సంఘర్షణా విస్తృతిని నిరూపిస్తుంది. పాత్ర మనోగత భావాలు పరిపరి విధాలుగా సంచరించినా, ఒక క్రమబద్ధమైన జీవితాగమనం వైపు నడిపిస్తుంది. స్త్రీలు సాధ్యాసాధ్యాలను ఆలోచించి సరియైన నిర్ణయాన్ని వ్యక్తపరిచే సామర్ధ్యాన్ని కలిగి ఉండాలని బోధించింది. ఈ విధంగా రచయత్రి ఖచ్చితమైన నిర్ణయ బాటలో నడిపించటానికి ఈ కథలో రాధ పాత్రను ప్రవేశపెట్టారు. రాధను తల్లిదండ్రులు ఒక ముసలి వానికిచ్చి పెండ్లి చేయబోతుంటే ఇంటి నుంచి పారిపోతుంది. అప్పుడు ఒక రైలు బండిలో రాజా పరిచయం కావటం, క్రమక్రమంగా వారిద్దరి అభిప్రాయాలు, అభిరుచులు, భావాలు కలవటం జరుగుతుంది. వారిద్దరు పెండ్లి చేసుకొనే సందర్భంలో రాజాకు రాధ తన మేనమామ కూతురని తెలుస్తుంది. ఈ కథకిది కొసమెరుపు. అత్యంత నాటకీయ పక్కీలో సాగిన ఈ కథలో రాధ తీసుకున్న దృఢమైన నిర్ణయం ఆమె జీవితాన్ని సరియైన క్రమంలో పెట్టగలిగింది. రచయిత్రి రాధ గుణాలను వివరిస్తూ – ”ఆమె మాటల్లోనూ, నడతల్లోనూ, ఎక్కువ అనురాగమూ, పరిపూర్ణమైన జాగ్రత్తా, సూక్ష్మమైన విధేయతా తొలుకాడుతూ కన్పించేవి” అని అంటారు.
3. ఆ వీణ – ఆంధ్రకేసరి – 1940 : ఈ కథ కూడా స్త్రీ అభ్యుదయాన్ని కాంక్షించేదిగా తెలుస్తుంది.
సీతాకుమారి కథలన్నీ పూర్తిగా ప్రామాణిక భాషలో సాగాయి. కథాకథనంలో సంభాషణా వైచిత్రి ప్రాధాన్యం వహిస్తుంది. ఆమె కథలు తెలంగాణ మాండలిక స్పర్శ గలవి. ”నల్లా” వంటి  తెలంగాణా పదజాలంతో ఇది కన్పిస్తుంది. ఆమె రాసిన ఇంకొన్ని కథలు గృహలక్ష్మి, భారతి, గోలకొండ పత్రికల్లో అచ్చయ్యాయి. కాని ఆమె కథలు సంపుటిగా వెలువరింపబడలేదు.
4. తెలంగాణా తొలి తరం మహిళా కథకుల్లో నాల్గవ రచయిత్రి నందగిరి ఇందిరాదేవి.
నందగిరి ఇందిరాదేవి 1909 సెప్టెంబర్‌లో వరంగల్‌లో జన్మించారు. సంఘసేవకుడు వడ్లకొండ నరసింహారావు గారి పుత్రిక. నారాయణగూడలోని బాలికల పాఠశాల (నేటి మాడపాటి హనుమంతరావు ఉన్నత పాఠశాల) వ్యవస్థాపకుల్లో వీరు ఒకరు. తెలంగాణాలో స్త్రీ విద్యాభివృద్ధికి పాటుపడిన వాళ్ళలో వీరు ప్రథములు. తన కుమార్తె ఇందిరాదేవిని ఆ కాలంలోనే 1937లో బి.ఎ. వరకు చదివించారు. తర్వాత నందగిరి వెంకటరావుతో ఇందిరాదేవికి వివాహం జరిగింది. ఆకాశవాణిలో మొట్టమొదట ప్రసంగించిన రచయిత్రి ఇందిరాదేవి. నిజాం కాలంలోనే హైద్రాబాదు రేడియో స్టేషన్‌ నుంచి ప్రసారమయ్యే ”నషర్‌” వంటి కార్యక్రమాలలో పాల్గొన్నారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

4 Responses to తొలి తరం తెలంగాణ మహిళా కథకులు

  1. Rakesh says:

    ధన్యవాదాలు.
    త్వరలోనే తెలంగాణ భాష, సాహిత్యం web-sites రాబోతున్నాయి. అందులో ఇలాంటివన్నీ పొందుపరుస్తాం.

  2. Pingback: Making postcolonial criticism work for Telangana | Telangana matters

  3. Pingback: Making postcolonialism work for Telangana | janata jagrafiyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో