ఒక రియాలిటీ షో

కొండేపూడి నిర్మల
నిన్నగాక మొన్న మామూలైన అలవరసలలో విద్యుత్‌ ప్రసారం ఆగిపోయిన వేళ, టివీ తెరనుంచో, కంప్యూటర్‌ తెరనుంచో ఠపామని జారిపడి, ఎవరి అపార్టుమెంటల్‌ తలుపు వారు తీసి, కారిడార్లో కమ్ముకుంటున్న పొగల మధ్యగా, నలుగుతున్న మసక వెన్నెల్లో మొహాలు విప్పదీసుకున్నప్పుడు, పక్కింటి  త్రీనాట్‌ఫోర్‌ ఆంటీ నా దగ్గర బాధపడింది. తన మనవరాలు సునీతకి ఫిప్త్‌ క్లాసు చదువుతున్నాగానీ, తెలుగు అసలే రావడం లేదని ముఖ్యంగా వేమన, సుమతీ, దాశరధి పద్యాలు బాగా మిస్సవుతోందని వాపోయింది. నా వంతు ప్రయత్నం నేను చెయ్యడం కోసం  తెలుగు పేపరులో కొన్ని పదాలు రాయించడం చేశాను. చందమామ తీసి బహుమతిగా ఇవ్వడం కోసం, పుస్తకాల అర వెతుకుతుంటే రోజువారీ దినపత్రికలోనే ఒక పద్యం కనిపించింది. అది సుమతీ శతక కారుడి పద్యం.రోజుకొకటి చొప్పున, నిజంగా నేర్చుకుంటే, ఏడాదికి మూడు వందల డెబ్బయ్‌ అయిదు పద్యాలు నోటికొచ్చేస్తాయి. తస్సాదియ్యా మనకింకేం తక్కువ..? అని వాళ్ళని ప్రోత్సహించి, రాగయుక్తంగా చదవడానికి గొంతు సరిచేసుకున్నాను. తీరా చదివాక బుర్ర తిరిగిపోయింది. అదేమిటి మొహం అలా పెట్టావు…? అని అడుగుతున్నట్టుగా అందరూ నావంకే చూస్తున్నారు. ”ఆలి మాటలు విని యన్నదమ్ములబాసి వేరే పోవువాడు వెర్రివాడు, కుక్కతోక బట్టి గోదావరీదునా విశ్వదాబిరామ వినురవేమ – ఈ పద్యం నేర్పడం కంటే అర్జెంటుగా ఆ పిల్లలని మళ్ళీ కంప్యూటరు గేమ్స్‌ ముందు కూచోపెట్టడమే నయమని నాకు అనిపించింది.అజ్ఞానానికి క్షమించాలి. వేమన గారంటే నాకున్న గౌరవం తక్కువది కాదు. అతని గురించి విమర్శించే దుస్సాహసం చెయ్యాలనీ లేదు. కానీ అది ఎక్కుపెట్టిన బాణం ఒక జాతిని కించపరుస్తోంది. ఇటువంటిదే ఇంకో పద్యం మరొక ప్రముఖ పత్రిక నిర్వహించే పిల్లల పేజీలో ప్రచురించారని, వివేకి అయిన భర్త, భార్యతో వాదించడం ఎంత బుద్ధిహీనత గల పనో వివరణతో వుందని, ప్రసిద్ధ రచయిత్రి పి. సత్యవతి చెప్పింది. అదే పద్యం చదివిన స్ఫూర్తికొద్ది, టూ జీరో ఒన్‌ అంకుల్‌, ఇవాళ పొద్దున్న తమాషాకోసం వాళ్ళావిడ్ని ఏదో అంటే ఆవిడ అచ్చు యంత్రం కనిపెట్టిన జాన్‌ గూటెన్‌ బర్గ్‌ నుంచి పేపరు విసిరేసి పోయిన కుర్రాడి వరకూ బండబూతులు తిట్టి, చివరికి టీ కూడా తనకి ఇవ్వకుండా ఒక్కత్తే కలుపుకుని తాగేసిందని మా దగ్గర గస పోకున్నాడు.
పోన్లేండి. టీ కప్పులో తుఫాను అనుకుందాం. అంటూ మా ఆవిడ, ఆవిడ ఆయన్ని ఓదార్చాడు.మహాకవి, తాత్త్విక యోగి అయిన వేమనగారికి ఆడవాళ్ళంటే అంత లోకువ ఎందుకో ఒక్క పిసరు  కూడా నాకు అర్ధం కాలేదు. లేకపోతే ఆయన కూడా టూ జీరోఒన్‌ అంకుల్‌ మాదిరి తమాషాగానే అన్నాడా..? అసలు ఆ కవి ఆ పద్యం రాసిన కాలం నాటి ఆడవాళ్ళ చైతన్యం ఎలాంటిది…? బాల్య వివాహాలతో, సతీ సహగమనాలతో, బాలింత మరణాలతో కన్ను మూస్తున్న అభాగ్య జీవులే కదా దాదాపు అంతా..మరి అటువంటి భార్య అనబడు ఆడది ఎవర్ని విడదీసిందో, తన కుక్క తోకతో ఎవరిని ఎక్కడికి తీసుకుపోయిందో నాకు తెలీడం లేదు. మహాకవి యోగి వేమనగారికి ఉమ్మడి కుటుంబాలంటే వున్న ఇష్టం మాత్రం అందులో కనిపిస్తోంది. కావచ్చు అందులో పదో శాతమైనా నాకూ వుంది. పొత్తులో కనబడే మానవ సంబంధాలూ తెలుసు. కనబడని హింసా, పరాధీనతా తెలుసు. అన్ని కాలాల్లోను కొత్త తరమే ఎదురు తిరిగింది. పాత తరం చాలా వరకూ సమర్ధించడానికి చూసింది. ఇప్పుడిప్పుడు పరస్పరం ఒకే ఒడంబడికలో వున్నట్టు సొంతంగా బతకడమే నయమనుకునే దశకు వచ్చేశారు కూడా..ఇది కాలానుగుణమైన మార్పు . ఒక వస్తువు పోయినప్పుడల్లా కొత్తగా ఇంటికి ఎవరొచ్చారో గుర్తు చేసుకున్నంత అన్యాయంగా, అందరి అనౌచిత్యాలకీ కోడల్ని బాధ్యురాల్ని చేస్తుంది లోకం. లోకం అంటే బైట ఎక్కడో లేదు. ఇంట్లో వున్న వాళ్ళనీ అదే పేరుతో పిలవాలి. నా కళ్ళకి చిన్నప్పటినుంచీ ఇప్పటిదాకా అన్నీ వదులుకుని అత్తింటికి అంకితమైపోయే ఆడవాళ్ళే ఎందుకని కనబడుతున్నారు..? అమ్మని గురించి చెప్పనా, పిన్ని గురించి చెప్పనా, పక్కింటి అత్తమ్మని గురించి చెప్పనా..? ఆరళ్ళని గురించి కలవరించి పోవడమే తప్ప బాల్య స్మృతులు  తలుచుకోవడానికైనా సమయం దక్కించుకోలేని పిచ్చి తల్లులు మీ కళ్ళకి కనబడ్డంలేదా..? చావు కబురు చెప్పకుండా పూడ్చి పెట్టిన అత్తింటివాళ్ళను చూడ్డంలేదా..? ఎటువంటి కేసులు లేకుండా లాలూచీ అవుతున్న వాళ్ళను చూడ్డంలేదా.. 498-ఎ కి ఎసరు పెడుతున్నవాళ్ళనీ చూడ్డంలేదా..? వాస్తవానికి భిన్నంగా ఆడవాళ్ళను గురించి అన్ని చమత్కారాలు ఎలా ఆడతారు? అది గుండా…చెరువా…? అలిగిన ప్రతి మగవాడూ  ఆలిని పుట్టింటికి దూరం చేస్తుంటే ఎవరూ మాట్లాడరు. అభద్రతతో కొట్టుకుంటున్న ప్రతి భర్తా భార్యకు శీలమే లేదనకోడాన్ని గురించి ఎవరూ పట్టించుకోరు. ఇటువంటి హింస నుంచి ఉమ్మడి కుటుంబాలూ, ఒంటరి కుటుంబాలూ కూడా రక్షించలేవు కదా. మళ్ళీ అదే ఇళ్ళలో కొడుకుల్ని ఎన్నేళ్ళొచ్చినా గానీ, తల్లి దండ్రులు,అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ అతన్ని పెంచుతూనే వుంటారు. అదనంగా  భార్య కూడా అతన్ని బాలకృష్ణుడి మాదిరి పెంచడానికే వస్తుంది. ఇందరి గారాబంలో బాగు పడితే సంబరంగా పెంచడానికి, చెడిపోతే తూర్పుకి దణ్ణం పెట్టి దైవ సహాయంతో రిపేరు చేసుకుని పెంచడానికి ముందుకొస్తుంది. ఇంకో పక్క ఆడవాళ్ళ బలాల మీద అణచివేతలూ, బలహీనతల మీద చమత్కారాలూ పుడుతూ వుంటాయి. పసి పిల్లల పేజీలయినా అందుకు మినహాయింపు లేదు. మనకసలు సమానత్వం వద్దు. మానవ హక్కులు వద్దు, వివక్ష వ్యతిరేక చైతన్యం వద్దు. సంస్కృతిలోకి తొంగి చూస్తే, బూజు పట్టిన నీతులూ, ఆధునికత కేసే పరుగిడితే రియాల్టీ షో లు – ఇవి చాలు. ఇదే మన సిలబస్‌. భేషుగ్గా వుంది కదూ. అయ్యా…అన్న వస్త్రాలు తృణప్రాయమని భావించిన తాత్త్వికవేత్త. మహాయోగి వేమన సాబ్‌, మీరు చెప్పిందే నిజం. ఆలి మాట విని యన్నదమ్ములబాసి వేరే పోవువాడు వెర్రివాడేనేమో, అయితే అమ్మ కడుపులో వుండగానే అమ్మతో సహా అందరూ పరాయి వాళ్ళనుకోవాల్సిన భావదాస్యానికి బీజం ఎవరు వేశారు సార్‌., పరమ పాతివ్రత్యం అంటే ఇదే కదా సార్‌. మీరు మాట్లాడేవి నీతులు, మేం మాట్లాడేవి కుక్క తోకలు. ఇంతేకదా సార్‌. మా అపార్ట్‌మెంట్లల్లో టూజీరో అంకుల్‌ చెప్పిందీ అదేనట సార్‌. అందుకే అన్ని చివాట్లు తిని, టీ చుక్కకి కూడా నోచుకోలేక వాపోయాడు కదా సార్‌.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

2 Responses to ఒక రియాలిటీ షో

  1. ramnarsimha says:

    వేమన పదాల మీద చర్చ జరగాలి.

  2. నిర్మల గారూ,
    మీరు చెప్పిన విషయాల్లో స్త్రీకీ, పురుషుడికీ సంబంధించి ఒక ముఖ్యమైన సాంఘీక తేడా వుంది. అది నివసించడానికి స్త్రీకి పుట్టిల్లు, మెట్టినిల్లు (అత్తిల్లు) అని రెండు వుంటే, పురుషుడికి ఒకటే ఇల్లు మొదటి నించీ చివరి వరకూ. ఈ తేడా పోనంత వరకూ రకరకాల సమస్యలు వస్తూనే వుంటాయి. అలాగే స్త్రీ,పురుషులు ఇంటా, బయటా సమానంగా పని చేయనంత వరకూ (అంటే స్త్రీ అనుత్పాదక శ్రమ అయిన ఇంటి పనికి మాత్రమే పరిమిత మయినంత వరకూ), రకరకాల సమస్యలూ, రకరకాల తెలివితక్కువ అభియోగాలూ స్త్రీలకి వుంటూనే వుంటాయి. అసలు సమస్యని అర్థం చేసుకుని, పరిష్కరించనంత వరకూ, పై పై విషయాలు మాత్రమే చూసి చింతిస్తే, లాభం ఏమీ వుండదు (self pity తప్ప).

    – సావిత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో