జ్వలిత సంపాదకత్వంలో స్త్రీవాద కవిత్వం ‘పరివ్యాప్త’

సిహెచ్‌. మధు
ఒక పుస్తకం ప్రచురించటమంటే మామూలుమాట కాదు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినా పుస్తకం ప్రచురించటం కష్టమే! తన పుస్తకం తాను ప్రచురించుకోవటం కష్టమైతున్న ఈ రోజులలో జ్వలిత ఒక లక్ష్యం నిర్ధేశించుకొని 176 పేజీల కవితాసంకలనాన్ని ప్రచురించారు. పేరు ‘పరివ్యాప్త’. జ్వలిత కవయిత్రి. మంచి రచయిత్రి. తాను వ్రాసిన కవితలు పుస్తకరూపంలో తెచ్చుకోకుండా అందరివీ సేకరించి పరివ్యాప్త పేరుతో కవితా సంకలనం తేవటం గొప్ప విషయం. ఇక్కడ మరో రెండు విషయాలున్నాయి. ప్రసిద్ధుల, వర్తమాన కవుల కవిత్వాన్ని సేకరించారు. స్త్రీ సమస్యలు గీటురాయిగా ‘పరివ్యాప్త’ కవితా సంకలనం ప్రచురించారు. తాను స్త్రీవాదిని కాదని ముందుమాటలో చెప్పుకున్నారు. స్త్రీవాది కాకుండానే స్త్రీవాద కవిత్వ సంకలనం తెచ్చారు. అట్లా అని ‘పరివ్యాప్త’ విషయంలో జ్వలిత చెప్పుకోలేదు. అయితే అది పూర్తిగా స్త్రీవాద కవిత్వమే!
స్త్రీలు వ్రాసేది మాత్రమే స్త్రీవాద సాహిత్యమనే ధోరణి కొందరిలో వుంది. పురుషులు స్త్రీవాదాన్ని సరిగ్గా ప్రతిబింబించ లేరని కొందరంటుంటారు. ఇది పూర్తిగా తప్పు. స్పందించటానికి లింగబేధంతో సంబంధం లేదు. స్పందన మనసుకు సంబంధించింది. మంచికి సంబంధించినది. పూర్తిగా మానవత్వానికి సంబంధించిన విషయమిది. మానవత్వం, మానవత్వం లేకపోవటం పూర్తిగా వ్యక్తిగతమా? – వ్యవస్థకు సంబంధించిన విషయమా ఇక్కడ చర్చించటం సాధ్యంకాదు. ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషి యంత్రంగా మారిపోయాడు. ఇతరుల కన్నీరును తుడ్వటం సంగతి అలా వుండనీ కన్నీరును గమనించే స్థితిలో లేడు. అలా వ్యవస్థను కావాలని తయారుచేసారు. దోపిడిశక్తులు మనిషిని యంత్రం చేయటానికి ఇది అవసరమయ్యింది. ఇదొక పెద్ద కుట్ర. ఆ ‘కుట్ర’కు అందరమూ బలి అవుతున్నాం. ‘కుట్ర’లో భాగంగా స్పందించకపోవటం వుంఉటంది. కనుక స్పందన లేదనటం తప్పు అవుతుంది.
‘స్త్రీకి స్త్రీయే శత్రువు’ అనేది కూడా తప్పే స్త్రీకి స్త్రీ శత్రువు కాదు పురుషుడు శత్రువు కాదు. పురుషాధిక్య వ్యవస్థలో ప్రతి ఆలోచన, ప్రతి ఆచరణ పురుషులకు అనుకూలంగా వుంటుంది. స్త్రీల ఆలోచనలు స్త్రీల అడుగులు పురుషులకు అనుకూలంగా వుంటాయి. తోటి స్త్రీకి వ్యతిరేకంగా వుంటాయి. ఇది వ్యవస్థ నేరం స్త్రీ నేరం కాదు. అంతమాత్రాన స్త్రీకి స్త్రీయే శత్రువు అనలేము. వరకట్నం వద్దన్న మగవాళ్లున్నారు. వరకట్నం తీసుకోవాలన్న ఆడవాళ్లున్నారు. ఇదంతా వ్యక్తిగతం. వ్యవస్థ స్వరూపానికి వచ్చినపుడు ఈ వ్యవస్థ పూర్తిగా పురుషాధిక్య వ్యవస్థ ప్రతి ఆలోచన, ప్రతి ఆచరణ పురుషులకు అనుకూలంగా పురుషాధిక్యతకు ప్రతీకగా వుంటుంది. ఇదంతా పోవాలంటే – వ్యవస్థ పోవాల్సిందే!
అందుకే వరవరరావు తన కవితలో అంటారు.
”పురుషస్వామ్యపు జైలు గురించి’ అంటాడు ఈ వ్యవస్థే పురుషస్వామ్యం జైలు.
రామచంద్రమౌళిగారు పరివ్యాప్తకు వ్రాసిన ముందుమాటలో ఒక మాటన్నారు ”బహుముఖదిశల్లో స్త్రీ చైతన్యవంతురాలయి శాసించబడే స్థితి నుండి ఈ రోజు శాసించే స్థాయికి ఎదిగింది” – నిజమే అన్నిరంగాలలో స్త్రీ బాగా ఎదిగిన మాట నిజమే. శాసించే స్థితికి వచ్చిన మాట కూడా నిజమే.
‘పరివ్యాప్త’లో కోడూరు విజయకుమార్‌ వ్రాసిన కవితలో ఓ వాక్యం వుంది. ”నాన్నలెందుకు రాత్రుళ్లు తాగివొస్తారు?” ఇది చాలు పురుషాధిక్య సమాజమని చెప్పటానికి.
‘జ్వలిత’ మంచి ఉద్దేశంతో ఒక సాహసం చేశారు. స్త్రీల సమస్యలమీద కవిత్వాన్ని సేకరించి కష్టపడి ‘పరివ్యాప్త’ పుస్తకంగా వేసారు. లక్ష్యం గొప్పది. సామాజిక చింతన గొప్పది. స్త్రీవాద దృక్పథంలో నుండి వచ్చిన లక్ష్యం ఇది. ‘జ్వలిత’ కృషి విషయంలో వారు విజయ వంతమయ్యారు. పూర్తిగా కాదు. రెట్టింపు విజయవంతమయ్యారు. స్త్రీ సమస్యల మీద మంచి కవిత్వం రాకపోతే తప్పు జ్వలితది కాదు. ఆమె కృషిది కాదు. వర్తమాన తెలుగు సాహిత్యం తప్పు అవుతుంది. ప్రసిద్ధుల రచనలే సేకరించటం చాలా సులభం కానీ వర్తమానకవుల కవిత్వాన్ని సేకరించారు. ఇప్పటితరం మీద వారికున్న మమకారానికి కృతజ్ఞతలు. ప్రసిద్ధులంటే పది ఇరువది యాబది వుంటారు (110) కవుల కవిత్వాన్ని ‘పరివ్యాప్త’ చేసారు జ్వలిత.
‘పరివ్యాప్త’లో మంచి కవితలున్నాయి. అయితే ఆశించినంత ‘మంచికవితలు’ లేవు. స్త్రీవాదాన్ని పటిష్టంగా కవిత్వంలో చెప్పిన కవితలు తక్కువగానే వున్నాయి. అయినా ‘పరివ్యాప్త’ గొప్ప పుస్తకం. జ్వలిత కృషి అభినందనీయం.
ప్రసిద్ధులతోనే వేస్తే స్త్రీలే వ్రాస్తే మంచి కవితలు వచ్చేవని కొందరు వాదించవచ్చు. అది తప్పు. ప్రసిద్ధులలో పొల్లు కవిత్వం వ్రాస్తున్నవారున్నారు. వర్తమాన కవులలో మంచి కవితలు వ్రాస్తున్నవారు, మగకవులు స్త్రీవాదాన్ని సమర్ధవంతంగా ప్రతిబింబిస్తున్న వారున్నారు. సరికొండ నరసింహారాజు ఓ కవితలో ఇలా అంటారు.
”నీవు ఊడదీసిన నాగలైనపుడు
నిన్ను ఊరిబయట వృద్ధాశ్రమంలో
విసిరేసినందుకు నన్ను క్షమించు
తల్లీబిడ్డల మధ్య సైతం
అన్నీ ఆర్థిక సంబంధాలే అన్నీ మార్క్స్‌ జోస్యాన్ని
అమెరికాలో నిరూపించినందుకు నన్ను క్షమించు”
అమ్మ గూర్చి చెప్పిన కవిత ఇది.
వర్తమానాన్ని, సైద్ధాంతిక దృక్పథంతో మేళవించిన కవిత ఇది.
”పిల్లల్ని పుట్టించటానికి
పెద్దగా ‘మగతనం’ అఖ్ఖర్లేదనేది వాళ్లకి అర్థం కాదు.”
ఇది మగ వ్యవస్థ మీద సూటిగా విసిరిన బాణం.
ఇది
”నాగరికత మేకవన్నె పులితల
కవుల ఎక్స్‌రేల్లో పట్టుబడ్డ
క్లాసంతా మాస్‌లో ఒక హైటెక్‌ వల” అంటాడు మునిమడుగుల రాజారావు.
”గాయాలు చేస్తున్నవాళ్ల మీదికి
ఆయుధాల్ని ఎక్కుపెడుతున్నాను.”
డాక్టర్‌ లింగారెడ్డి ‘అమ్మకోసం’ వ్రాసిన కవితలోనిది. ఇది స్త్రీవాద కవిత కాదు. వ్యవస్థ మీద ఎక్కుపెట్టిన కవిత ఇది. అయినా ‘జ్వలిత’ పరివ్యాప్తలో ప్రచురించాలంటే విశాలదృష్టికి సంకేతంగా వుంటుంది.
వీరంతా ప్రసిద్ధులు కాదని నా ఉద్దేశ్యం కాదు. సూటిగా మంచి కవిత్వం వ్రాస్తున్న వర్తమాన కవులున్నారు.
‘జ్వలిత’ పరివ్యాప్త గూర్చి వ్రాస్తున్నపుడు ఇందులో కవితలు నాకు పూర్తి సంతృప్తి ఇవ్వలేనిమాట నిజమే. ‘జ్వలిత’ కృషి పూర్తిగా విజయవంతం కాలేదు అని ముందుమాటలో కూడా అన్నారు నిజమే – అయితే!
మంచి కవిత్వం రాకపోవటానికి ‘కవులను’ కూడా తప్పుపట్టలేం. ఉద్యమాలు, పోరాటాలు మాత్రమే మంచి సాహిత్యాన్ని సృష్టించగలవు. స్త్రీవాద సాహిత్యం వుందే తప్ప మహిళా ఉద్యమాలు లేవు. మహిళా ఉద్యమాలంటే మాటలు చెప్పటం కాదు. మాటలు ఉద్యమం కాదు. ‘కట్నాలొద్దు’ ‘వరకట్నం చావులను ఖండిస్తున్నాం’ ఈ మాటలు ఉద్యమం కాదు. ఇటువంటి షోకు మాటల మూలంగానే ఇటువంటి కవిత్వం వస్తుంది. అయినా నా కోరిక, అభిప్రాయం బలంగా వుంది. ఉద్యమాలు పోరాటాలు బయట వున్నా లేకున్నా ప్రజాసమస్యల మీద స్పందిస్తున్నపుడు ధిక్కరణ కవిత్వాన్ని వ్రాయాలి. చీకటి వుందని చీకటిని వర్ణించటం కాకుండా వెలుగు వస్తుందని చెప్పగలగాలి. అప్పుడు మంచి కవిత్వం వస్తుంది. ‘రాజీ’ పడటం ద్వారా మంచి కవిత్వం రాదు. అయినా ఇది తెలుగు సాహిత్యంలో ‘రాజీయుగం’.
‘పరివ్యాప్త’లో స్త్రీవాద సాహిత్యం బలంగా వుంది.
నాళేశ్వరం శంకరంగారు ఈ వ్యవస్థ లోని పుట్టిల్లు మెట్టిల్లూ గూర్చి చాలా చక్కగా చెపుతారు.
”పుట్టిల్లు
ముక్కుకు చెవులకు సౌందర్యపు తూట్లు పొడిపించినట్లే
మెట్టిల్లు
ఆనవాళ్లే లేని గాయాలతో వొదిలేసింది.”
ఓల్గా కవిత ఓ ధిక్కరణ కవిత. ఈ కవితలో వాడి వేడి వుంది.
”ఇవాళ ప్రతిఘటనా ఒక సరుకే
హోల్‌సేల్‌గానో రిటైల్‌గానో
తిరుగుబాటును కొనటం అమ్మటం
మార్కెట్‌ మెల్లిగా నేర్చుకుంటుంది”
మార్కెట్‌ మెల్లగా నేర్చుకోవటం కాదు. ఓల్గా గారూ ఎప్పుడో అందులో విజయం సాధించింది. ఇపుడు తిరుగుబాటు అమ్ముడవుతున్న సరుకే!
కవితకు పోరాటం నేర్పకపోతే ఓల్గాయే కాదు.
”మార్కెట్‌ మాయాజాలాన్ని ఛేదించే
సాహసుల కలయిక కోసం
వర్తమానం కళవళపడుతుంది
భవిష్యత్తు కలగంటోంది”
‘చిన్నమ్మకు’ శీర్షికన అమ్మంగి వేణుగోపాల్‌ వ్రాసిన కవితలో ఈ వ్యవస్థలో స్త్రీకి అత్తవారిల్లు ఎలా వుంటుందో చెప్పగలిగారు. ‘చినమ్మా!’ అని సంబోధిస్తూ వ్రాసిన కవిత ఇది.
‘ఓ కలంటిసాకు చెంపమీద చెళ్లుమన్నప్పుడు’ అంటారు. ఇది ఈ వ్యవస్థలో మామూలు స్త్రీ ఎంత ఎదిగినా ఎన్ని రంగాలలో ఎదిగినా ఒంటరి గదిలో చెంప చెళ్లుమంటూనే వుంది. ఈ వ్యవస్థలో ఒక భావజాలం వుంది. ”స్త్రీ కంటే పురుషుడు గొప్ప” – అది పోవాలి.
ఎన్‌. జయ కవిత ”నాకు గోడలు న్నాయి” స్త్రీవాద ఉద్యమకవిత
”నేను బామ్మను కాదు
నువ్వు రంగులు పులిమితే నవ్వడానికి
నేను బోమ్మను కాదు
నువ్వు విసిరేస్తే పగిలిపోవడానికి”
‘పరివ్యాప్త’లో స్త్రీకి సంబంధించిన అన్ని రకాల అంశాలను స్పృశించిన కవితలు న్నాయి. ”అమ్మ కడుపులోనే అంతర్ధానాలా?” ఆటవిక సంస్కృతిని నిరసించారు ఎస్‌. అరుణ.
‘పరివ్యాప్త’లో వున్న మంచి కవిత అచ్చమైన స్త్రీవాద కవిత ”పద పొరపాట్లు చేద్దాం!” శీర్షికలోనే ధిక్కార స్వరముంది. పురుషులపైనే కాదు ధిక్కార స్వరం. ఈ వ్యవస్థ మీద ధిక్కార స్వరముంది. జయప్రద వ్రాసిన కవిత ఇది. పత్రికలో వచ్చినపుడే సంచలనం కల్గించిన కవిత
”ప్రియా!
అన్ని క్రమాలనీ కాదనేటంత
సూటిగా వుంది
నా మనసు
పరమ అక్రమంగా వుంది
పద అన్న తప్పులే చేద్దాం” అంటుంది జయప్రద. ఈ వ్యవస్థను ధిక్కరించాలన్నా – పురుషాధిక్య సమాజాన్ని ప్రశ్నించాలన్నా అన్నీ తప్పులే చేయాలి తప్పదు.
”గాయపడనిదే ఎవరికైనా గమ్యం ఎలా తెలుస్తుంది” అంటుంది జయప్రద.
”అనేక నమ్రతలనీ,.. నక్కవినయా లనీ… నటనలనీ కుప్పపోసి నిప్పంటిద్దాం” పద అంటుంది.
”పదప్రియా
గాయపడాలనే ఉత్సాహం వుంది
కట్టుతప్పాలని వుంది
కఠినంగా ఉండాలని వుంది”
మనం గాయపడకుండా వ్యవస్థను మార్చలేము. మనం గాయపడకుండా, కట్టు తప్పకుండా పురుషాధిక్య సమాజాన్ని ప్రశ్నించలేము. ఇందుకు సెంటిమెంట్స్‌, మమత, మమకారాలు, బంధాలు, అనుబంధాలు వద్దు కఠినంగా వుండాల్సిందే!
సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కవిత్వంలో కూడా ధిక్కారస్వరముంది.
”నన్ను తండూరి పొయ్యిలో వేస్తే
నేరాల శతాబ్ధాల్ని నీ చుట్టూ కటకటాలుగా పాడుతా”
ఎంత గొప్పగా చెప్పారు నారాయణరెడ్డి గారు
”ద్వేషించి పునర్నిర్మాణమవుతాను”
అద్దెపల్లి రామమోహన్‌రావు ”రెండు వ్యవస్థలు” కవిత ద్వారా ఇప్పటి వ్యవస్థను చెప్పారు.
”ఆమె మానమే అతనికి బంగారు రూక
ఆమె అంగీకారమే అతనికి రత్నదీపిక
.. అతని హింసాత్మక పురుషత్వానికి కానుక”
”అయ్యోపాపం” అనిపించే కవిత్వం స్త్రీవాదానికి ఎంతవరకు ప్రయోజనమనేది ‘ఆలోచన’ అవసరం.
స్త్రీవాదులు కూడా స్త్రీవాద కవిత్వాన్ని పోరాటంగా మలుచటం లేదు.
”అక్షరాలు తెల్సిన అమ్మ
నిర్ధాక్షిణ్యంగా గాయపడినపుడు
అమ్మ కళ్లు భాషకందని భావాలు” – మెహెజబీన్‌
ఈ మాటలైనా చాలు
”ఆమెను
బురఖాపిట్ట
పంజరంలో చిలుక
వంటింటి కుందేలనీ
యాసశ్వాసలేని ప్రయాసపదాలను ఉపయోగించకు” అంటాడు అన్వర్‌.
”న్యాయదేవత కళ్లు విప్పి
గృహహింస చట్టాన్ని
కాగితం పులి కాకుండా కాపాడాలి” పాతూరి అన్నపూర్ణ గారి కవిత. చట్టం పట్ల మమకారం తప్పని అనలేం. చట్టం వివక్షతను తొలగిస్తుందా? భౌతిక హింసే హింస కాదు. మాటలలో చేతలలో వివక్షత ఓ మానసిక హింస.
రామాచంద్రమౌళి కవిత స్త్రీ పట్ల గౌరవభావంతో వుంది. స్త్రీవాద కవిత కాకున్నా – ఒక మగవాడు స్త్రీ పట్ల ఎలా వుండాలో చెపుతున్న కవిత.
ఒక్క కౌగిలి
ఒక్క ఓదార్పు
ఒక్క క్షమతో
నువ్వు పరివ్యాప్తమై పరివ్యాప్తమై నా ఆద్యంతాలౌతున్నపుడు
ఒక స్త్రీవి కదా నువ్వు
నీముందు తలవంచుకొని వినమ్రంగా నిలబడి
అసలు నేననే నేను లేనే లేనని తెలుసు కుంటున్నాను
చింతా అప్పలనాయుడు వ్రాసిన ‘మా ఊరి మాలపిల్ల’ కవిత ఏ దృష్టితో ఆయన వ్రాసారో తెలియదు. విశ్వసుందరిలా ఎన్నికవుతున్న వారికంటే మావూరి మాలపిల్ల’ అందంగా వుంటుందని ఆయన అభిప్రాయంగా కనిపిస్తుంది. అది అవసరమా? – కవిత ‘మాలపిల్ల’పై గౌరవభావం కల్గించేలా వుండాలి. శ్రమైక జీవులలో మాలపిల్ల ఒకరు. శ్రామికజనశారీర అందానికి ‘ప్రత్యేకత’ గొప్పకాదు.
‘ఉద్యమం’లో ఎన్ని లోపాలున్నా ఉద్యమ మమకారాన్ని చంపే కవితలు తిరోగమన కవితలే. ‘నిర్మలా పుతుల్‌’ కవిత ‘మరోసారి’ అలాంటిదే!
అనిశెట్టి రజిత కవిత అస్తిత్వం…? సమానత్వం…? మంచి కవిత.
”పోరాటాల చరిత్రను
స్మరణంతో విశ్లేషించుకుంటూ
అస్త్రాల్ని ఆయుధాల్ని తడుము కొంటున్నాం
”గాయాలెప్పటికీ ఎందుకు మానటం లేదో
మానప్రాణాలపై
రాబందుల దాడులెందుకో
అధికారంని సిగ్గుగా ఒకే పక్షం సొత్తెందుకో
వెగటైన నెగిటివ్‌ ప్రశ్నల శూలాలు
చర్యలు విచికిత్సల సారాంశాలు కావాలి”
గాయాలు ఎందుకవుతున్నాయో చరిత్ర త్రవ్వకుండా ఎందుకు మానటంలేదనే ప్రశ్నకు జవాబు దొరుకదు.
”అనగనగా ఓ ఇల్లు…” శిలాలోలిత కవిత. ఈ కవిత గూర్చి ముందుమాటలో కొండెపూడి నిర్మల గారు ప్రస్తావించారు. ప్రశంసించారు. బాగుంది. ఈ కవిత ఈ వ్యవస్థకు ఇప్పటి సమాజానికి ప్రతీకా? – నేటి స్త్రీకి ప్రతీకా?
జ్వలిత రెండు కవితలున్నాయి. ఇందులో ఒకటి కార్పోరేట్‌ దాంపత్యం – మంచి కవిత.
వర్తమాన సమాజాన్ని కార్పోరేట్‌ దాంపత్యంగా కవితలో చిత్రీకరించారు.
”తెల్ల తోడేళ్లు దేశసంపదను కొల్లగొట్టే క్రమం
ప్రపంచీకరణ మాటున తెలివితేటలను దోచుకుంటూ
సంస్కృతి సంప్రదాయాలపై గుమ్మరించిన నల్లతారు
అందాల పోటీల్లో మన ముఖాన చల్లిన తెల్లపౌడరు”
ఇలా చెప్పిన జ్వలిత
స్వంతవారిలో పరాయితనం
అవసరాల అవకాశాలలో ప్రేమతనం
నేను – ఒక నేనుగా
నీవు – ఒక నీవుగా మిగిలి
మనం కాలేని దాంపత్యం”
ప్రపంచీకరణకు వ్యతిరేకంగా వ్రాసిన కవిత్వం. దాంపత్యం ప్రపంచీకరణ ప్రభావాన్ని చక్కగా వర్ణించిన కవిత.
శ్రీనివాస్‌ దెంచనాల ”వెలుగ మొహమోహమేహం” శీర్షిక కవులే చదువాలి! స్త్రీ పట్ల గౌరవం పెంచే కవితలు వ్రాసే మగకవులను మాత్రమే స్త్రీవాదులు గుర్తించాలి. ఇక్కడ ప్రతిభావదుం కవిత్వం వద్దు. ఆందోళనా సాహిత్యానికి భాష కాదు వస్తువు ముఖ్యం.
”ఏ పువ్వును ఎలా వాడుకోవాలో
పూలన్నీ ఒకుమ్మడిగా
ప్రతిఘటనా గీతానికి
ఊపిరి లూడితేనే
తమ జాతికి భద్రత
అస్తిత్వానికి రక్షణ” అంటాడు తోకల రాజేశం.
తోకల రాజేశం వర్ధమాన కవి. బాగా రాస్తాడు. విశాలదృష్టి మనమంతా ఒకటేననే ధోరణి రావటం లేదు ‘తమ జాతి’ కాదు, ‘జాతి అంటే.
దోర్నాదుల సుబ్బమ్మది ‘జిస్మ్‌కీ దావత్‌’ దగాపడిన స్త్రీకి నేనున్నాననే ధైర్యమిచ్చే కవిత స్త్రీవాద ప్రతిఘటన కవిత.
కొండేెపూడి నిర్మల వాన-బురద మంచి కవిత. మన మనుసుల మీద సామాజిక నీలినీడలుండాయి. తరతరాల భావజాలం వుంటుంది. ఎంత అభ్యుదయంతో ఆలో చించినా, ఎంత ఆదర్శంగా వున్నా తరతరాల సామాజిక బలహీనత నుండి మనం తొందరగా బయటపడలేం. వ్యవస్థ మారి నపుడు సాధ్యమే! వ్యవస్థ మారనంతసేపు వ్యక్తులు ఎంత మారినా వ్యవస్థ నీడ వ్యక్తిపై పడుతుంది. నిర్మల అందుకే అంది.
”ఛేదించాల్సిన దుర్మార్గం నాలో వుందో
చౌరస్తాలో వుందో అర్థంగాక తల్లడిల్లి పోయాను”
షహనాజ్‌ ఫాతిమా ‘ఔరత్‌’ కవితలో స్త్రీ తిరుగుబాటును ఆహ్వానించింది.
”ఆమె ముఖం
శాశ్విత గ్రహణం పట్టిన చంద్రబింబం”
అంటూనే
ఆమె సహనవతి బద్దలైతే…. అనే స్తుంది.
ఈ పుస్తకంలో ‘స్కైబాబా’ కవిత ఆలోచించాల్సిన కవిత. స్త్రీవాదాన్ని సమర్ధంగా చిత్రీకరించిన కవిత.
”నువ్వో జైలరూ – నేనో ఆయానే తప్ప
ముద్దు మురపాలెక్కడివి”
”నేను నేనుగా కాదు
ఓ మతానికి చిహ్నమై
ఆరిపోతున్నానే…”
”దేహం నాదైనపుడు
అధికారం నీదెలా అవుతుంది?? – ఇది స్కైబాబా ప్రశ్న. స్త్రీవాదం ప్రశ్న.
షాజహానా ‘ఖౌ సెభి జా’ కవితలో రెండు దృక్పథాలున్నాయి. ఒకటి స్త్రీవాదం రెండు ముస్లిం మైనారిటీవాదం.
”ముప్పైసార్లు తలాఖ్‌లు చెప్పి
నువ్వైతే ముప్ఫైమూడుసార్లు నిఖా పేరు మీద
నిఖార్సయిన వ్యభిచారం బహిరంగంగా చేయవచ్చు
దయామయుడైన అల్లా ఏ ఆంక్షలు విధించడు.
”చీకటి బురఖా తొడుక్కున్న”
రాత్రి కూడా వేకువ కోసం చూస్తుంది” అంటూ వేకువను ఆహ్వానించింది షాజహానా.
‘నీళ్లంటే కన్నీళ్లేనని’ అన్నవరం దేవేం దర్‌ ఈ వ్యవస్థలో నీళ్లబాధను స్త్రీల బాధను మేళవించి చెప్పారు. నల్లా నీళ్ల గూర్చి
”పోరడు పోసినంత రావుగని
శాంతాడు పొడుగులైను”
ఇదీ వ్యవస్థ నీళ్ల కొరకు దుఃఖం నీళ్ల కొరకు క్యూ నీళ్లకొరకు కొట్లాట… ఎంత భయంకర వ్యవస్థ ఇది.
”మరొక్క ముద్దు బాకీ ఉంది” విమల కవిత. విమల పేరున్న కవి. స్త్రీవాదకవి.
”ఇప్పుడు తగులబడుతున్న పూలవనాల మధ్య
శిలాఫలకాలు లేని అసంపూర్ణ అనామక
స్థూపాలపై సూర్యోదయ దృశ్యాలను
చెక్కుతుంది ఆమె” అంటుంది విమల.
‘పరివ్యాప్త’లో వరవరరావు కవిత విలువైన కవిత స్త్రీవాదం. తెలంగాణవాదం మమేకమయిన విప్లవకవిత. మానవత్వం నిండుగా గుబాళించిన కవిత.
”తలాపున గోదారుండి నెర్రెలువాసిన బీడుదేహం” ఇది శరీరానికి వర్తిస్తుంది. తెలంగాణకు వర్తిస్తుంది.
”నదులుపారే ఎడారి కదా మనది
మట్టికందని నీళ్ల మాగాణం కదా మనది
ఇక్కడ కృష్ణమ్మ పారినంత దూరం కరువే
నది వలసపోయినట్టే మనుషులు ఇక్కడ వలసపోతారు” అంటారు వరవరరావు. దుబాయ్‌ మస్కట్‌ వలసపోతున్న వారి మీద తెలుగులో కవిత్వం – సాహిత్యం తక్కువగానే వచ్చింది. దుగ్ధ మాత్రం వుంది. భూముండి వలసపోవటం… భూమెందుకు పనికొస్తుంది? – ప్రపంచీకరణను సమర్ధిస్తున్న కథకులు కథలే వ్రాస్తున్నారు.
”అంతటా మనుషులుంటారు పోరాటా లుంటాయి” రాజీపడదల్చుకోలేదు వరవర రావు.
పాటిబండ్ల రజని ”గాజులు నవ్వాయి” శిల్పం ప్రధానం గల కవిత వ్రాయటంలో కొత్తదనముంది.
జ్వలిత తస్లీమా నస్రీన్‌పై జరిగిన దాడికి విరుద్ధంగా వ్రాసిన ప్రతి-ఘటన
”నేను పట్టింది కలం ఆయుధం కాదు”
కలం ఆయుధం కంటే గొప్పది. జ్వలిత కాదు. కలం ఆయుధాలకు గురిపెట్టటం నేర్పుతుంది. శత్రువును ఆయుధం ముందు నిలబెడుతుంది.
ఇందులో వున్న (110) కవితల గూర్చి వ్రాయాలంటే పెద్ద గ్రంథం వ్రాయాలి. అది సాధ్యం కాదు. వర్తమాన రచయితలు వ్రాసిన మంచి కవితలున్నాయి. ప్రసిద్ధులు వ్రాసిన పేలవమైన కవితలున్నాయి. కవిత్వం విషయంలో నాకొక అభిప్రాయముంది. కవిత్వం కోసం కవిత్వం కాదు కవుల కొరకు కవిత్వం కాదు ఇది హెచ్చార్కె శివారెడ్డి, నగ్నముని లాంటివారి కవితలు చదివినపుడు (ఈ పుస్తకంలో) నాకనిపించింది. అనుభూతి అంటే వస్తువు లేని స్పందన కాదు.
‘పరివ్యాప్త’కు కొండేపూడి నిర్మల ముందుమాట స్త్రీవాదాన్ని పరిపుష్టం చేస్తున్న విశ్లేషణ ”ప్రజా ఉద్యమాన్ని చీలుస్తున్నది) రాజకీయ ఆధిపత్య ధోరణి అని స్పష్టమవు తున్నా అందుకు స్త్రీవాదమో దళితవాదమో మైనారిటీవాదమో కారణమని చెప్పడం కనిపిస్తుంది” – ఇది ఆలోచించాల్సిన విషయం. దీనిపై వేరే వ్యాసం అవసరం.
”రాజకీయాల్లో లేని అరాచకీయం అణచివేత స్వరాల్లోంచి ఎలా వస్తుంది” అని హేతుబద్ధంగా ఆలోచించడం కూడా మర్చిపోయాం అంటూనే రచయితల ప్రశ్నకాని ప్రశ్నగా ఓమాట చెపుతుంది. ”చావుకేకల్ని, కన్నీటి మంటల్ని శబ్దాడంబరంతో చంపడం అలవాటు చేసిన సాహిత్య భూమిక మీద సూటిగా ప్రశ్నించటం నేరమయ్యింది” ఈ విషయాన్ని రచయితలు ముఖ్యంగా కవులు అర్థం చేసుకోవటం లేదు. ప్రజల కొరకు కవిత్వమంటూ కవులకు కూడా అర్థం కానీ శబ్దాడంబరంతో వ్రాస్తే ఎలా? –
”సంకెళ్లను బద్దలు కొట్టాలని కోరు తుంది స్త్రీవాదం. సంకెళ్లనుండి బైటికొస్తే భద్రత లేదు అంటుంది పురుషవాదం. పురుషవాదమంటే పితృస్వామ్య భావజాలానికి సంబంధించిన వాదం”.
నిర్మలగారు వ్రాసిన దాంట్లో నిజముంది స్త్రీకి భద్రత ఎలా వస్తుంది? – ఈ వ్యవస్థలో స్త్రీకి భద్రత లేదు. స్త్రీకి భద్రత లేకపోవటానికి ఈ వ్యవస్థ కారణం. పురుషుడితో భద్రత లేదు. పురుషుడు తోడులేకుండా భద్రత లేదు. వైరుధ్యాలున్న వ్యవస్థ ఇది ప్రపంచీకరణ స్త్రీ స్వేచ్ఛను పెంచవచ్చు కానీ – మగవాడి దృష్టిలో స్త్రీని విలాసవస్తువుగా మార్చింది.
నిర్మల ముందుమాటపైనే ఎన్నోపేజీల వ్యాసం వ్రాయవచ్చు.
జ్వలితగారిది గొప్ప కృషి. నేను స్త్రీవాదిని కాదు. పురుషద్వేషిని కాదని ముందుమాటలో అన్నారు. స్త్రీవాది అంటే పురుషద్వేషి కానవసరం లేదు. స్త్రీవాదం ఆకాశమంత విశాలదృక్పథం సంకుచితం చేయవద్దు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో