ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 13

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి
అది 1925 ఫిబ్రవరినెల అను కుంటాను. మేమప్పుడు లక్నోలో ఉన్నాం. రాయ్‌బరేలీలోని స్కూల్లో కథా సదస్సు నిర్వహించారు. విద్యార్థులు మా ఆయన్ని అధ్యక్షుడిగా రమ్మని కోరారు. ఒక్కరోజు మాత్రమే పాల్గొంటానని మాటిచ్చి ఆయన అక్కడికి వెళ్లారు. కానీ నాలుగు రోజులు ఉండిపోవలసి వచ్చింది. నాలుగోరాజు ఆయన తిరిగివస్తే నేను కోపగించుకున్నాను, ‘ఎక్కడికెళ్తే అక్కడే ఉండిపోతారు, అలా ఉండిపోతే ఇంట్లోవాళ్లు ఏమనుకుంటారనే ఆలోచన కూడా ఉండదు మీకు, మీరక్కడ సరదాగా గడుపుతూంటే నేను ఏమైందా, ఏమైపోయారా, అని కంగారుపడుతూ ఉంటాను!’ అన్నాను.
‘చాలా అన్యాయంగా మాట్లాడు తున్నావు, నేను మీ గురించి ఆలోచించ నంటావేమిటి? నువ్వెంత కంగారు పడుతూ ఉంటావోనని నేనెంత కంగారు పడ్డానో నీకు తెలీదు. కానీ నేనేం చేసేది? నేను వెళ్లేది ఒకే ఒక పనికోసమైనా అక్కడివాళ్లు నాకోసం మరో నాలుగు పనులు సిద్ధం చేసి పెడతారు. తీరా అక్కడిదాకా వెళ్లాక వాళ్లతో, నేనింక ఒక్కరోజు కూడా ఉండడం కుదరదు, వెంటనే వెళ్లిపోవాలి, అని ఎలా చెపుతాను? నా స్థానంలో నువ్వున్నా అంతే చేసేదానివి. నాకసలు ఇల్లు వదిలి వెళ్లాలనే ఉండదు, కానీ పనులుంటే వెళ్లక తప్పదుకదా! ఒక్కోసారి ఇల్లు కదలకుండా ఉంటే ఎంత బాగుణ్ణు, అని నాకే అనిపిస్తూ ఉంటుంది. నాకదే ఇష్టం, కానీ ఏం చెయ్యను, అలా వీలుపడదు కదా! అసలే నాకు ఇబ్బందిగా ఉంటే, నేను బైటికెళ్లి మజా చేసుకుంటున్నా నంటావు నువ్వు. ఒక పెన్నూ, సిరా, కాయితాలూ దగ్గరుంచుకుని, నీతోనే ఇంట్లో ఉండిపోవాలని నాకు ఉంటుంది. అసలు నాకేమనిపిస్తుందో తెలుసా? ఓ పది పదిహేనేళ్లపాటు నన్నీ గదిలోపెట్టి తాళం వేసేస్తే, ఇక బైటికెళ్లే ప్రసక్తి ఉండదు కదా, అనిపిస్తుంది’, అన్నారాయన.
‘ఆడవాళ్లలాగ ఇంటిపట్టునే ఉండి పోతే తెలిసొస్తుంది మీకు, ఇప్పుడు హాయిగా ఎక్కడిక్కావాలంటే అక్కడికి వెళ్లొస్తున్నారు!’ అన్నాను.
‘సరే, ఒక విషయం చెప్పు, బైటి ఊళ్లకి వెళ్లాల్సి రానంతకాలం ఉన్న ఊళ్లో నేనెప్పు డైనా బైటికెళ్లానా? ఇక నేను మజా చేసు కుంటున్నానంటున్నావే, ఎక్కడికెళ్లినా ఎంత త్వరగా ఇంటికి పరిగెత్తుకొద్దామా అనే ప్రయత్నిస్తూ ఉంటాను, తెలుసా? జైల్లో ఖైదీ పారిపోవాలని చూస్తాడే, అలా! అసలు నా స్నేహితులందరూ నన్ను ‘ఇంటి పక్షి’ అని పిలుస్తారు.’
‘ఆఁ, ఊరికే కబుర్లు చెబుతారు లెండి. కాన్పూరులో ఉండగా పదిగంటలలోపు ఎప్పుడైనా ఇల్లు చేరారా?’ అన్నాను.
‘సర్లే, నేను పదిగంటల్లోపల ఇంటికి రాని రోజుల్లో నువ్వేమైనా నాకోసం ఎదురుచూస్తూ కూర్చునేదానివా? నువ్వు ఎక్కువగా పుట్టింట్లోనే ఉండేదానివి. కాన్పూరులో ఉన్నా కూడా నా గురించి పెద్దగా పట్టించుకునేదానివి కాదు. నీకే నా గురించి ఆలోచనుంటే నేను అంతంతసేపు బైట గడిపేవాడినే కాదు కదా! అయినప్పటికీ నెలకి ఇరవై నాలుగు రోజులు ఇన్‌స్పెక్షన్‌ చెయ్యాల్సివచ్చినా, నీకోసం పదిహేనురోజులే వెళ్లేవాణ్ణి. మిగిలిన రోజులు కాన్పూరు చుట్టుపక్కలే తిరిగేవాణ్ణి. దూరప్రాంతాలకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. అయినా నువ్వు నన్ను తప్పు పడుతున్నావు!’
‘నేనసలు మిమ్మల్ని పట్టించుకునే లేదని అనిపించినప్పుడు ఇన్‌స్పెక్షన్‌కి ఇరవై నాలుగు రోజులూ బైటికెళ్లకపోయారా?’ అన్నాను.
దానికాయన నవ్వుతూ, ‘నువ్వుట్టి పిచ్చిమొద్దువి. నా విషయం పట్టించుకునే దానివి కాదు. నేను తెలివైనవాణ్ణి కదా, అందుకే నీమీద ప్రేమ, నీ గురించి ఆలోచన. నువ్వెప్పటికీ పిచ్చిమొద్దువే!’ అన్నారు.
‘నేను పిచ్చిమొద్దునో కాదో, ఆ విషయం అలా ఉండనివ్వండి. అసలు విషయం చెప్పండి, ప్రస్తుతం రెండురోజుల పాటు ఇంటికి రాకుండా నన్నెందుకు పీడించారు?’
‘అరె, పిచ్చీ! అక్కడికెళ్లాక నన్ను చాలామంది పట్టుకున్నారు. నన్ను చూడగానే వాళ్లకి తమ అవసరాలన్నీ గుర్తొస్తాయి. నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు నేనెంతో బాధపడ్డాను. అసలు, ఇకనించీ నువ్వు కూడా నావెంట వస్తే బావుంటుంది. నీకూ కంగారు ఉండదు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది,’ అన్నారు.
ఈ రోజు ఆ విషయాలన్నీ గుర్తుచేసు కుంటూ కూర్చుని బాధపడుతూ ఉంటాను. అన్ని విషయాలూ మరిచి పోయాను, అవి గడిచిపోయిన రోజులు. కానీ ఒక విషయం గుర్తుండిపోయింది, నేను పిచ్చిమొద్దుననే విషయం. ఇది నేను చనిపోయేదాకా బహుశా గుర్తుంటుంది, ఎందుకంటే ఆయనకి జైల్లో ఉన్నా కలం, సిరా, కాయితాలూ, నేనూ తన వెంట ఉండాలని పించేది. కానీ నేను మాత్రం పిచ్చిదానిలా, ఏదో మత్తులో, సమస్తం పోగొట్టుకుని కూడా ఇంకా అలాగే బతికేస్తున్నాను.
‘మోటేరామ్‌ శాస్త్రి’
1926లో మా ఆయన ‘మాధురి’ సంపాదకుడిగా పనిచేసేవారు. ఈయనా, పండిత్‌ కృష్ణవిహారీ మిశ్రా కలిసి పత్రిక నడిపేవారు. మా ఆయన ‘మోటేరామ్‌ శాస్త్రి’ (బొండాం శాస్తుర్లు) అనే కథ ఒకటి రాశారు. ఆ కథ చదివిన ఒక శాస్త్రిగారు వీళ్లిద్దరిమీదా కేసుపెట్టాడు. ఇద్దరూ ఐదేసి వందలు జామీను కింద కట్టారు. వీళ్లతోబాటు ‘మాధురి’ వ్యవస్థాపకుడు, విష్ణునారాయణ్‌ కూడా ఉన్నాడు. ఆయనకి ఆ కథ ఎంతో నచ్చింది. కేసు విచారణకి వచ్చినప్పుడల్లా ఇద్దరు బారిస్టర్లు డెహ్రాడూన్‌నించి వచ్చేవాళ్లు. వాళ్లిద్దరూ రోజుకి చెరో తొమ్మిదివందలు ఫీజు తీసుకునేవాళ్లు. మా అన్నయ్యా, మరిదీ కూడా వెళ్లేవాళ్లు. కాన్పూరులో ఉన్న వకీళ్లూ, బారిస్టర్లూ అందరూ వచ్చారు. కోర్టు కిక్కిరిసిపోయింది. వాదనలన్నీ విన్నాక మేజిస్ట్రేటు తీర్పు ఇచ్చాడు, వీళ్లిద్దరిమీదా కేసు కొట్టేశాడు.
మేజిస్ట్రేటు ‘మోటేరామ్‌ శాస్త్రి’తో, ‘మీరింకా చెప్పుకోవలసినదేమైనా ఉందా? నన్నడిగితే మీరు కిమ్మనకుండా కిటికీలోంచి బైటికి వెళ్లడమే మంచిది!’ అన్నాడు. మేజిస్ట్రేటు అలా అనగానే వీళ్లిద్దరూ చిరునవ్వు నవ్వారు. ఆ తరవాత ఆ కథ పడిన ‘మాధురి’ సంచికలన్నీ అమ్ముడుపోయాయి. ‘మాధురి’ ఆఫీసులో నెలల తరబడి ఆ కథ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
బావి తవ్వించారు
ఇది పదిహేనేళ్ల కిందటి సంగతి. ఒకరోజు పొద్దున్నే పనిమనిషి వచ్చి నీళ్లు పట్టి తేవడానికి బిందెలు తీసుకుని బావి దగ్గరకెళ్లింది. బావి చుట్టూ ఉన్న అంచు గట్టిగా లేదు. నీళ్లు తోడబోతే అది విరిగి బావిలో పడిపోయింది. పనిమనిషి కళ్లనీళ్ల పర్యంతం అవుతూ వచ్చి, ‘బాబుగారూ, కాస్తలో చావు తప్పించుకున్నానండీ! పదండి, చూపిస్తాను, బావిగోడ విరిగి పడిపోయింది. కాస్త ఉంటే నేను కూడా పడిపోవలసింది!’ అంది.
ఆయన పనిమనిషి మాటలు విని అట్నించి అటే ఇటికలభట్టీకి వెళ్లి నాలుగువేల ఇటికలు కావాలని ఆర్డరిచ్చి వచ్చారు.
నేను టిఫిన్‌ చేసి ఆయన కోసం ఎదురుచూస్తున్నాను. ఆయన ఇంటికొచ్చే సరికి తొమ్మిదన్నరయింది. ‘టిఫిన్‌టైమ్‌కి ఎక్కడికెళ్లిపోయారు?’ అన్నాను.
‘బావి ఏ స్థితిలో ఉందో నువ్వు చూడ లేదా? కొంచెం ఉంటే పనిమనిషి బావిలో పడిపోయి ఉండేది!’ అన్నారాయన.
‘ముందిది చెప్పండి. మీరెక్కడికెళ్లారు?’
‘ఇటికలకి ఆర్డరిచ్చి రావడానికి వెళ్లాను.’
‘ఆ బావి పంచాయితీది కదా?’
‘ఎవరూ చూడకపోతే నన్ను కూడా గుడ్డివాడిలా కళ్లు మూసుకుని ఉండ మంటావా? అసలు ఈ రోజు మన పనిమనిషి బావిలో పడితే అందరికన్నా ముందు నువ్వే ఏడ్చి ఉండేదానివి! మిగతా ఆడవాళ్లందరూ హాయిగా ఉంటే నువ్వుమాత్రం ఏడుస్తావేం, అని నేనడిగితే? ఊళ్లో ఏ ఆడదీ ఏడవదు, ఏ మగాడికి బావి అధోగతి కనిపించదు. అందుకే నువ్వు నన్ను నిలదీయకు!’
‘ఇటికలు తెప్పించినంత మాత్రాన బావి బాగుపడుతుందా? దానికి మూడు, నాలుగు వందలు ఖర్చవుతాయి. రాళ్లకే వందరూపాయలు కావాల్సి వస్తాయి.’
‘లేదు లేదు!’
‘నేను లెక్కవేసి చెపితే తెలుస్తుంది. ఇటికలు మనింటికి పంపించగానే, దానికి డబ్బు చెల్లించాల్సింది నేను.’
‘ఎలాగైనా ఈ పనిచేసి ముగించా లన్నదే నా ఉద్దేశం.’
రెండ్రోజుల తరవాత ఆయనకి ‘మాధురి’ ఆఫీసునుంచి పిలుపు వచ్చింది. వెంటనే పత్రిక సంపాదకత్వం పని చూసేందుకు వెళ్లిపోయారు. బావి నేను బాగుచేయించాను. దానికి మూడువందల డెబ్భైఐదు రూపాయలు ఖర్చయింది. ఆయన రాగానే డబ్బు లెక్కలున్న కాయితం ఆయన ముందు పెట్టాను, ‘ఊఁ, ఎలాగైతేనేం పని జరిగింది. నేను ఇటికలు తెప్పించి ఉండకపోతే ఇది అయేది కాదు,’ అన్నారు.
‘మీకిది అలవాటేగా? ఏదో ఒక తద్దినాన్ని నా నెత్తిమీదికి తెస్తూనే ఉంటారు,’ అన్నాను.
నా మాటలకి పగలబడి నవ్వుతూ, ‘నేను చెయ్యిపెట్టిన ప్రతి పనినీ నువ్వు పూర్తి చేసేస్తావని నాకు నమ్మకం ఉందిలే,’ అన్నారు.
‘అవును, నాకు వేరే పనేముంది?’ అన్నాను.
‘అవును, నువ్వు వీరవనితవి!’
‘మీమీద భారాన్ని మోపలేనంత తెలివితక్కువదాన్నేం కాను, కానీ నాకు మీమీద జాలి, అంతే!’
ఆయన పనిమనుషుల చేత ఎప్పుడూ పనిచేయించుకునేవారు కాదు. బరువు పనులు తనే చేసుకునేవారు. ఇంట్లో మగ నౌకర్లెవరూ లేక, ఆడమనుషులు మాత్రమే ఉంటే, తన బట్టలు తనే ఉతుక్కునేవారు. ఇంటి యజమానిలా ప్రవర్తించడం ఆయనకి నచ్చేది కాదు. ఇంకోరు అలా ప్రవర్తించడం చూసినా ఆయనకి కోపం వచ్చేది. పిల్లలు బద్ధకస్తులైపోతారేమో అనే భయంతో ఆయన ఎక్కువమంది నౌకర్లని నియమించేవారు కాదు. పెద్దా చిన్నా అనే భావన కూడా ఆయన మనసులో ఎప్పుడూ ఉండేదికాదు.
జ      జ      జ
మా అక్క మొగుడు రెండోపెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకి పుట్టిన పిల్లలున్నప్పటికీ, తన ఆస్తంతా రెండోపెళ్లాం పేర రాశాడు. ఒక మూడులక్షల ఆస్తి ఉంది. ఆ విషయమై మా ఇద్దరికీ వాగ్వివాదం జరిగింది.
‘ఆయన చేసిన పని బాగాలేదు,’ అన్నాను.
‘ఏం చేస్తాడు?’ అన్నారు మా ఆయన.
‘పిల్లలకి కూడా ఎంతో కొంత ఇవ్వ వలసింది.’
‘పిల్లలకి రెక్కలొచ్చాయి, సంపాదన పరులైనారుగా?’
‘ఆయనకి ఆస్తి లేకపోతే ఏం చేసేవాడు, ఆవిడ బాధ్యత పిల్లలమీదే పడేది కదా?’
‘ఆస్తి ఉన్నప్పుడు అలా ఎవరూ అనుకోరు. లేనప్పుడు ఏం జరిగితే అదే జరగనీ అనుకుంటారు. అయినా ఆవిణ్ణి పిల్లలు చూసుకుంటారన్న నమ్మకం ఏమిటి?
‘అందుకేనా ‘పిల్లలుగల వితంతువు’ అనే కథ రాశారు?’
‘ఈ మధ్యన ఇలాంటి కేసులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.’
‘అందరి మనసుల్లోని మాటలూ మీరెలా అర్థం చేసుకోగలుగుతారు?’
‘నువ్వు కూడా రచయిత్రివేగా, ఆలోచించు! తండ్రిలాగ అక్కచెల్లెళ్లనీ, తల్లినీ ప్రేమించే మగపిల్లలు చాలా తక్కువగా ఉంటారు.’
‘మీరు సవతితల్లి దగ్గరే పెరిగారు. ఆవిడ సొంతతల్లిలా మీకు ప్రేమ అందివ్వలేదు. అయినా ఆవిణ్ణి తల్లిలాగే చూశారే!’
‘కానీ మన అబ్బాయిలు అలా ఉన్నారా? వాళ్లు ఏ మాత్రం సంకోచించ కుండా నీ మాటని ధిక్కరించడం నువ్వు చూడడం లేదా? నా దృష్టిలో అంతకన్నా బాధాకరమైనది వేరే ఏదీలేదు. అందుకే పిల్లలకి ఏమైనా చెయ్యమని చెప్పడం నాకిష్టముండదు. మీ బావకూడా ముందాలోచనతోనే ఆ పని చేసి ఉంటా డన్నది అర్థం చేసుకో. ఆయన లాయరు, తెలివైనవాడు, ఆస్తిపరుడు. ఇక బతికుండగా అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషిని ఎవరి దయాధర్మాలకి వదిలివెళ్తాడు? పెద్దమనిషన్నవాడు ఆయన చేసిన పనే చేస్తాడు. చావు మన చేతుల్లో లేదు. లేకపోతే జీవిత భాగస్వామిని వదిలి వెళ్లిపోవాలని ఎవరికుంటుంది?’
‘మర్యాద ఇవ్వటం అటుంచి, చాలామంది కర్ర పుచ్చుకుని స్వాగతం పలుకుతారు కదా!’
‘వాళ్లు పశువులు, సంసారంలో ఎటువంటి ఆనందాన్నీ పొందలేనివాళ్లు. లేకపోతే అలా చెయ్యాలని ఎవరను కుంటారు? రచయిత తను చూసేది రాస్తాడు, లేదా రాసింది భవిష్యత్తులో చూస్తాడు! ఆయన చేసింది చాలామంచిపని, నాకు చాలా నచ్చాడాయన. ప్రతి మగాడూ అలాగే ప్రవర్తించాలి.’
ఆడవాళ్లు మాత్రం అంత తెలివైన వాళ్లా? ఆమెకి ఆస్తి ఉన్నా పిల్లలమీద ఆధార పడి బతకవలసిందేగా? పైగా ఆవిడపట్ల వాళ్ల వైఖరి సరిగ్గా కూడా ఉండదు.’
‘చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావు. ఆయన ఆస్తి ఆవిడపేర రాసినప్పుడు జడ్జిని కూడా ఏర్పాటు చేసే ఉంటాడు.’
(ఇంకా వుంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.