పెరుగుతున్న యాసిడ్‌దాడులపై భూమిక ఆధ్వర్యంలో

డా|| కె.మురళి
సమాజంలో మహిళలపై  హింస పెరుగుతూ వుంది.  ఇది ఎన్నో కొత్త రూపాలు తీసుకొంటూ వుంది. అందులో ఈ మధ్య పెరుగుతున్న యాసిడ్‌ దాడులు ఒకటి. ఈ విషయం ఈ మధ్య చర్చనీయాంశమైంది. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం చట్టాన్ని కఠినతరం చేస్తూ సవరణలు తీసుకువచ్చింది. హింసకు వ్యతిరేకంగా నిరసనలు వచ్చిన ప్రతి సందర్భంలో ఒక చట్టం రావడం, ఆ తర్వాత ఆందోళనలు ఆగిపోవడం పరిపాటి అయిపోయింది. ఈ నేపధ్యంలో భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌, ఆక్స్‌ఫామ్‌ ఇండియా అధ్వర్యంలో నవంబరు 28, 2009న హైదరాబాద్‌లో సదస్సు జరిగింది. ఇందులో ప్రముఖ న్యాయవాదులు, రచయిత్రులు, స్వచ్ఛంధ సంస్థలు, భూమిక హెల్ప్‌లైన్‌తో కలిసి పనిచేసే వారందరూ పాల్గొన్నారు.
సమావేశాన్ని కె.సత్య వతి ప్రారంభించి, సమస్యను వివరించారు. డిసెంబర్‌ 13న వరంగల్‌ కాలేజిలో చదువు తున్న స్వప్నిక, ప్రణీతల మీద యాసిడ్‌ దాడి జరిగింది.  యావత్‌ ఆంధ్రదేశం విస్తు పోయింది. కోపోద్రిక్తులైన జనం నిందితులపై కూడా యాసిడ్‌ పోయాలి, ఎన్‌కౌంటర్‌ సరైన శిక్ష అన్నారు. కాని ఎన్‌కౌంటర్‌ జరిగి, నిందితులు మరణించినంత మాత్రాన  దాడులు తగ్గాయా? ఆ ఎన్‌కౌంటర్‌ అయ్యాక పదమూడు సంఘటనలు జరిగాయి. అవి ప్రేమోన్మాద దాడులని అనలేము. ఎందుకంటే ఎవరిమీద కోపం వచ్చినా యాసిడ్‌ చవకగా లభించడం వల్ల కూడా ఇవి ఎక్కువవుతున్నాయి. భార్యమీద కోపంతో, ఒక చోట  ప్రయాణికుడి మీద కోపంతో  యాసిడ్‌ పోశారు. అందుకే ఈ దాడులను ప్రేమోన్మాద దాడులని మాత్రమే నిర్వచించలేం. యాసిడ్‌ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో. దాడి తరువాత వారు రూపం కోల్పోయి, ఎముకలను కూడా నాశనం చేసే రసాయనం అందులో ఉండడం వలన బాధితులు నరకం అనుభవిస్తారు. కొన్నిసార్లు చనిపోతారు. ఈ దాడి తరువాత బతికిన వారి పరిస్థితి ఏంటి? వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? యాసిడ్‌ దాడుల నివారణ కోసం ప్రభుత్వం భారతీయ శిక్షాస్మృతికి సవరణ చేస్తూ కొత్త చట్టం తేవాలని సంకల్పించింది. ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా ఈ రోజు ఎన్నో కొత్త చట్టాలు వచ్చాయి. వాటికిి వ్యతిరేకంగా భార్యాబాధిత సంఘాలు, 498ఏకి వ్యతిరేక సంఘాలు వస్తున్నాయి. ఈవ్‌ టీజింగు మీద చట్టాలు వస్తున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా మనం ఎంతవరకు ఈ చట్టాలవల్ల సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నాం. ప్రభుత్వం తన బాధ్యతగా కుటుంబ హింస వ్యతిరేక చట్టాన్ని తెచ్చింది.  దాని మీద ప్రజలకు సరైన సమాచారం అందుబాటులో వుండదు. ప్రచారం ఇవ్వరు. వనరుల కేటాయింపు అసలు  వుండదు.  గ్రామీణ మహిళలు జిల్లా కెెంద్రానికెళ్లి రిపోర్ట్‌ చేసే పరిస్థితి వుందా? అదే ఎయిడ్స్‌ గురించి ఎంతగా ప్రచారం జరిగిందో అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా  ప్రకటనలే. దీనికి వనరులు, ప్రాజెక్టులు చాలా మంజూరు చేసింది ప్రభుత్వం. అదే కుటుంబ హింస వ్యతిరేక చట్టం అనేది వచ్చింది అనే విషయం కూడా చాలామంది స్త్రీలకు తెలియదు.
ఒక టి.వి. ఛానెల్‌లో రాజమండ్రిలో ప్రేమోన్మాది అనూష మెడ కోసిన ఉదంతాన్ని చూపిస్తూ ”ఇది కోతల సీజన్‌” అని పదేపదే ఆ సంఘటన చూపించారు.  దీనికి మీడియాలో వున్న పోటీ, జండర్‌ స్పృహ లేకపోవడం కారణం.  ఈ అంశంపట్ల ప్రజల అభిప్రాయాలలో మార్పు తీసుకురావడానికి కృషిచెయ్యకుండా దానిని ఏవిధంగా ప్రెజెంట్‌ చేస్తున్నారంటే అది ప్రజలకు పూర్తి వ్యతిరేకంగా అర్థమయ్యేట్లుగా చూపిస్తున్నారు. ఈ అన్ని విషయాలను చర్చించుకుని  హోం మంత్రి ముందు మన అభిప్రాయాలు పెడదాం అని సందర్భాన్ని వివరించారు.
ఆక్స్‌ఫామ్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసరు గిరిజ మాట్లాడుతూ ప్రభుత్వం చేయతలపెట్టిన కొత్త చట్టంపై చర్చించడానికి ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత అసెంబ్లీ సమావేశానికన్నా ముందే ఈ సమావేశంపెడితే బాగుంటుందని అనుకున్నాం. ఈ చట్టంలో 5 లక్షల నష్టపరిహారం బాధితులకు ఇవ్వాలని పేర్కొన్నారు. యాసిడ్‌ దాడికి గురైన బాధితురాలికి వైద్యపరంగానే 5 నుండి 15 లక్షల ఖర్చు అవుతుంది. దీనికోసం ఒక ఫండ్‌ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. చట్టం తేవడం వరకే ప్రభుత్వ బాధ్యత అనుకుంటున్నారు.  బెంగుళూరులో ఒక డాక్టర్‌ మీద ఇంటి అద్దె విషయంలో యాసిడ్‌ దాడి జరిగింది. ఇంకొకచోట పోలీసు కానిస్టేబుల్‌ మొదటి భార్యమీద యాసిడ్‌ దాడి చేశాడు. సమస్య ఒక్కటే రూపాలు మారుతున్నాయి. ఇందులో బలవుతుంది స్త్రీలే. యాసిడ్‌ అనేది చాలా సులభంగా దొరుకుతుంది. టాయిలెట్‌ క్లీన్‌ కోసం యాసిడ్‌ వాడతారు. దీనితోనే స్త్రీలపై దాడులు. స్త్రీల జీవితాలు అంత చులకన అయినవా? ఈ యాసిడ్‌ ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటోంది. దీనిని నిషేధించాలి అని చర్చ కూడా మొదలయింది.ఈ అంశం మీద సమగ్రంగా చర్చించాలి.  ప్రజాభిప్రాయాన్ని ఏవైపైనా మలచడంలో కీలకపాత్ర వహించే మీడియా కూడా ఈ అంశాలపై అభిప్రాయాలను వెల్లడించాల్సిన అవసరం వుంది. ఎవ్వరికీ సహనం లేదు, ఓపికలు అంతకన్నా లేవు. చంపేయడాలు, నరకడాలు , ఇటువంటి విపరీతమైన ధోరణి వుంది. వీటి గురించి మాట్లాడాలి. రకరకాల సమస్యల్లో కొట్టుకునిపోతూ మాట్లాడలేక పోతున్నాం.కొత్తగా రాబోతున్న చట్టానికి సంబంధించి మానవ హక్కుల వేదిక లో పనిచేసే   మురళి మాట్లాడతారని తెలిపారు.
మురళి ముందుగా భారతీయ శిక్షాస్మృతికి, నేరస్మృతికి, సాక్ష్యం చట్టానికి ప్రభుత్వం తలపెట్టిన సవరణలను వివరించారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 326 తర్వాత 326(ఏ)ను ప్రతిపాదించారు. ఇందులో నిప్పు, లేదా మండే స్వభావంగల పదార్థం, యాసిడ్‌ లేదా పేలుడు పదార్ధాలను ఉపయోగించి తీవ్రమైన గాయానికి పాల్పడిన వారికి పది ఏళ్ళకు తగ్గకుండా కనీస శిక్షను, కనీస జరిమానాను  రెండు లక్షలనుండి 5 లక్షల వరకు ఉండేలా ప్రతిపాదించారు. దీనిద్వారా యాసిడ్‌ దాడులకు పాల్పడేవారికి కఠినమైన శిక్ష వేయాలనేది ప్రభుత్వ ఉద్ధేశ్యంగా కనిపిస్తుంది. ఈ కేసులను బెయిల్‌ సులభంగా లభించడానికి వీలులేనిదిగా, జిల్లా న్యాయస్థానం మాత్రమే విచారణ జరిపేలా ప్రతిపాదనలు చేశారు. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మనం కొన్ని ప్రశ్నలు అడగాలి. ఇప్పటికే వున్న శిక్షలు కఠినంగా లేకపోడంవల్ల యాసిడ్‌దాడులు జరుగుతున్నాయా? స్త్రీలపై హింసను  నిరోధించడానికి ఇప్పటికే ఉద్ధేశించిన చట్టాలు సక్రమంగా అమలౌతున్నాయా? వాటిని అమలు చేయడానికి కావల్సిన బలమైన, సున్నితమైన, శిక్షణగల నేరన్యాయ వ్యవస్థ మనకు వుందా? లేనప్పుడు కఠినమైన చట్టాలు ప్రతిపాదించి నంత మాత్రాన ప్రభుత్వం మహిళలపై హింసను నిరోధించడానికి కృతనిశ్చయంతో వున్నట్టు అర్ధమొస్తుందా? వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన అనురాధ 17 ఏళ్ళ న్యాయపోరాటాన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చేస్తే, నష్టపరిహారం వచ్చింది. ఇది  సామాన్య మహిళలందరికి సాధ్యమయ్యే పనేనా? న్యాయం జరగడానికి అంతకాలం, అంతదూరం వెళ్ళి పోరాటం చేయాల్సి వస్తే, ఈ ప్రతిపాదిత చట్టాల వల్ల ఫలితం ఏమిటి? వాస్తవం ఏమిటంటే, చట్టాలు కఠిన తరమయ్యే కొద్ది, నేర నిరూపణకు బలమైన, ప్రమాణికమైన సాక్ష్యాలు అవసరమౌతాయి. వాటిని తేలేకపోతే ఆ మేరకు శిక్షలు పడే అవకాశాలు తగ్గిపోతాయి. చట్టాన్ని న్యాయదృష్టితో అమలు చేయడానికి కావల్సిన  యంత్రాంగాన్ని సిద్ధం చేయకుండా, కఠినమైన చట్టాలను మాత్రం చేస్తే, అది  ప్రజలలో ప్రతీకార వాంఛకు విజ్ఞప్తి చేయడమే తప్ప, వాస్తవంలో ఫలితముండదు. అదే విధంగా నేరస్ధుడికి 5 లక్షలు జరిమానా విధించడానికి ప్రతిపాదించిన ప్రభుత్వం బాధితురాలికి మాత్రం 2 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వవచ్చని, అది కూడా నిందితుడు చెల్లించాలని భారత నేరస్మృతిలో 357 ఏ చేర్చడం ద్వారా ప్రతిపాదించింది. చవకగా, సులభంగా దొరికే యాసిడ్‌తో దాడులు చేసే వాళ్ళలో  సామాన్యులు కూడా వుంటున్నారు. వాళ్ళ నుండి ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఎలా వసూలు చేయగలదు? రెండు లక్షల వరకు అన్న తర్వాత ఆ నష్టపరిహారాన్ని ఎంత తక్కువగానైనా నిర్ణయించడానికి అవకాశమున్న పురుషాధిక్య న్యాయ వ్యవస్థ మనకుంది. అప్పుడు బాధితురాలి గతేం కావాలి? ఈ అడ్డంకులను అధిగమించి న్యాయ బద్ధంగా నష్టపరిహారం ఇస్తారనుకున్నా, అది న్యాయస్థానం ప్రాధమికంగా నేరం జరిగిందన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే జరుగుతుంది. అది చార్జ్‌షీట్‌ దాఖలు పరచి, విచారణకు వచ్చిన స్థాయిలో జరుగుతుంది. ఈ లోపు ఏళ్ళు పూళ్ళు పట్టవనే హామీ ఏముంది? అంతవరకు కాలిన గాయాలతో, వైద్యం లేక బాధితురాలు నరకం అనుభవించాల్సిందేనా?  అసలు నిందితుడు ఎవరో తేలని కేసులలో, పరిస్థితేమిటి? న్యాయ విచారణా క్రమానికి అతీతంగా, దాడి జరిగిన వెంటనే వైద్య సహాయం, నష్టపరిహారం అందించాల్సిన అవసరం వుంది. గుడ్డిలో మెల్లగా,  సిఆర్‌పిసిలో సెక్షన్‌ 321కు ప్రతిపాదించిన సవరణ ప్రకారం, ఫిర్యాదుదారు లేదా బాధితుల తరఫు వాదన వినకుండా, 7 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ శిక్షకు అవకాశం వున్న కేసులను వెనక్కు తీసుకుకోడానికి వీలులేదని అన్నారు. అదే విధంగా ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్టులో 114బి చేర్చి, నేరనిర్ధారణలో బాధితురాలి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. బాధితులకు సంబంధం లేకుండా నిందితులు, ప్రాసిక్యూషన్‌ వారు కుమ్మక్కై న్యాయాన్ని పాతరేస్తున్న కాలంలో బాధితుల ప్రమేయంతో న్యాయనిర్ధారణ జరగాలనే ప్రతిపాదన ఆహ్వానించదగ్గదే. కానీ అంతిమంగా కఠినమైన శిక్షలున్న చట్టాలవల్ల కాక, ఖచ్చితంగా శిక్షపడుతుందనే వాతావరణంలో మాత్రమే నేరాలు తగ్గే అవకాశం వుంటుంది.
యాసిడ్‌ దాడి జరగగానే అన్ని సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాయి. ఏదో ఒక చట్టం చేయగానే అన్ని ఆందోళనలు గప్‌చిప్‌గా అయిపోతాయి. చట్టాలు అమలుచేయడానికి సరైన యంత్రాంగం లేదు. చట్టాలు కాదు, దాడులు జరగకుండా ఏం చేయాలి అనేది ప్రభుత్వం గుర్తించి ఆలోచించాలి. ప్రభుత్వానికి స్త్రీల సమస్యల మీద పనిచేయాలనే సరైన ఉద్దేశ్యం వుంటే పని త్వరగా జరుగుతుందని మురళి తెలిపారు.
గిరిజ మాట్లాడుతూ ఇందులో మన పాత్ర ఏమిటి? వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రివెన్షన్‌ చేయడానికి ఎటువంటి వాతావరణం మనం రూపొందించాలి. దాడి జరిగిన తరువాత  మన పాత్ర ఏమిటి  అనే అంశాలమీద మనం ఇపుడు 6 గ్రూపులుగా ఏర్పడి చర్చించి, ప్రతిపాదనలు సూచనలు చేద్దాం. ప్రతి గ్రూప్‌లో మీడియా పర్సన్‌, ఒక లాయర్‌,  ఎన్‌.జి.ఓ. వాలంటరీ సభ్యులు వుండేటట్లు చూసుకుని గ్రూప్‌గా ఏర్పడుదాం అని అన్నారు.
అన్ని గ్రూప్‌లు సమగ్రంగా చర్చించి  చాలానే సూచనలు, ప్రతిపాదనలు చేశారు.  అందులో అందరి నుంచి వచ్చిన సూచనలు.
1.     యాసిడ్‌ దాడి జరిపిన వారిపట్ల కఠినవైఖరి శిక్షను 7 – 10 సం|| పెంచారు. జరిమానాను 5 లక్షలకు పెంచారు. కాని కఠినమైన శిక్షలకన్నా, ఖచ్చితంగా, సత్వరంగా శిక్ష పడుతుందన్న హామీతో మాత్రమే దాడులు తగ్గుతాయి.
2.     కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేకమైన /ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్ట్‌ను ఏర్పాటు చేయాలి.
3.     నష్టపరిహారం 2 లక్షల వరకు అన్నారు. ఖచ్చితంగా ఇంత అని పేర్కొనలేదు. నిందితుడి దగ్గరనుండి వసూలు చేసి కాక  ఒక ఫండ్‌ను ఏర్పాటు చేసి కలెక్టర్‌ ద్వారా చెల్లించాలి.
4.     యాసిడ్‌దాడికి గురైన వారికి ఉచిత వైద్య సౌకర్యాన్ని ఇవ్వడానికి కొన్ని ఆస్పత్రులను గుర్తించి ప్రకటించాలి. మొత్తం వైద్యసహాయం ప్రభుత్వమే భరించాలి.
5.     స్త్రీలు పోలీసులను ఆశ్రయించినా  వారు ఎటువంటి చర్య తీసుకోకపోతే తరువాత  దాడి జరిగితే పోలీసులపై చర్యలుండేలా చట్టం తేవాలి.
6.     కాలేజీలలో, పనిస్థలాలలో, లైంగిక వేధింపుల కమిటీలు ఏర్పాటు చేయాలి. అటువంటి కమిటీలు లేని కాలేజీలు, సంస్థల గుర్తింపు రద్దు చేయాలి.
7.     యాసిడ్‌ అమ్మకాల మీద, పంపిణీ మీద తగుస్థాయిలో నియంత్రణ విధించాలి.
8.     దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం  చేపట్టాలి.
9.     అబ్బాయిలలో స్త్రీల హక్కుల పట్ల గౌరవం పెంచేలా పాఠ్యాంశాలు రూపొందించాలి.
10. ఎలక్ట్రానిక్‌ మీడియాలో మహిళలపై వివక్షను, హింసను ప్రేరేపించే కథనాలు ప్రసారం చేయకూడదు.
బహిరంగసభ
భోజన విరామానంతరం జరిగిన బహిరంగ సభలో ఐ.జి.సి.ఐ.డి ఉమాపతిగారు, పూర్వ సెక్రటరీ లీగల్‌  సర్వసెస్‌ ఆధారిటీ విద్యాప్రసాద్‌గారు, పి.ఓ.డబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య ప్రసంగించారు.
విద్యాప్రసాద్‌గారు మాట్లాడుతూ, సెక్షన్‌ 326 ప్రకారం తీవ్రమైన నేరాలలో, బాధితులు కావాలనుకున్నా కేసును వెనక్కు తీసుకునే హక్కు లేదు. అలాంటిది 321లో ప్రతిపాదించడం మోసపూరితమైన ప్రతిపాదన అనిపిస్తుంది. ఈ సవరణ సరియైనది కాదు అన్నారు
రెండవది బాధితులకు నష్టపరిహారం సూచించే సెక్షను 357 కు సిఆర్‌పిసిలో వుంది. అది ఎంతైనా కావచ్చు. అది జరిగిన నష్టాన్ని బట్టి వుంటుంది. అది కోర్టు విచక్షణకు వదిలిపెట్టారు. సవరణలో ప్రాధమికంగా నేరం జరిగిందని భావిస్తే, నష్టపరిహారం ఇవ్వవచ్చని ప్రతిపాదించారు. సిఆర్‌పిిసిలో ప్రైమా ఫేసీ అనేది లేదు. ఛార్జీషీట్‌ దాఖలు చేశారంటేనే, ప్రాధమికంగా నేరం జరిగిందని కోర్టులు భావిస్తాయి. ఈ సవరణవల్ల, ఇది సివిల్‌ దావాతో సమానమైపోతుంది. ప్రాధమికంగా నేరం జరిగిందని కోర్టు భావిస్తుందని తెలిస్తే, నిందితుడు పరారయ్యే అవకాశం వుంది. నష్టపరిహారం కట్టలేని కేసులో ఏం చేయాలో చట్టం చెప్పడం లేదు. అంతేకాదు 2 లక్షలు బాధితురాలికి చాలదు. ప్రాధమికంగా నేరం జరిగిందని నిర్ధారించిన మేజిస్ట్రేట్‌ ముందు, నా కేసు విచారణ జరగడానికి వీలులేదని, నిందితుడు హైకోర్టుకు పిటిషన్‌ వేసే అవకాశం యిస్తుంది ఈ సవరణ. దీనివల్ల కేసు సవ్యంగా జరగదు. ప్రస్తుతం న్యాయవ్యవస్థ సాక్ష్యాల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తోంది. కాబట్టి బాధితురాలి సాక్ష్యం మేరకే శిక్ష వేయాలనే ప్రతిపాదన అనవసరం. సెక్షన్‌ 32 (2), కుటుంబ హింస చట్టంలో బాధితురాలి సాక్ష్యంమేరకే శిక్ష వెయ్యవచ్చని వుంది. దీనికి చట్టాలు ఇప్పటికే వున్నాయి. నిందితుడికి శిక్ష పడితే సరిపోదు. యాసిడ్‌ దాడులకు గురయ్యే వారి విషయంలో ప్రత్యేకమైన చట్టాలు వుంటే కానీ, వారి పునరావాసం సాధ్యం కాదు. వాటిని అమలు చేసే బాధ్యత న్యాయసేవా కేంద్రాల కార్యదర్శులకు ఇస్తే వారు  అమలు చేయగలరు.  బాధితురాలి వైద్య సహాయం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది. ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లైంగిక వేధింపులు, ప్రేమ పేరుతో వేధింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సంస్థల  బాధ్యులు ఆ సంఘటనలపై వెంటనే నివేదికలు ఇచ్చేటట్లు ప్రభుత్వం చూడాలి. జరిగే దాడులకు వారిని కూడా కొంతవరకు బాధ్యులను చేయాలి. యాసిడ్‌ దాడుల కేసులను అసిస్టెంట్‌ సెషన్స్‌ న్యాయమూర్తులు 3 నెలలలోపు విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.
ఉమాపతిగారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఏడాది నమోదయ్యే లక్షా అరవై వేల నేరాలలో 12.5 శాతం నేరాలు స్త్రీలపై జరుగుతున్నాయి. అంటే దరిదాపు 20 వేల నేరాలలో స్త్రీలు బాధితులు. ఆంధ్రప్రదేశ్‌ వరకట్న నేరాలలో  దేశంలోనే ప్రథమ స్థానంలో వుంది. వరకట్నం మన రాష్ట్రంలో ప్రధాన సమస్య. శిక్షలు సరిగా పడితేనే నేరాలు తగ్గుతాయనేది ఒక అవగాహన. యాసిడ్‌ దాడుల నిరోధానికి ఎక్కడో ఒక చోట ప్రయత్నం జరగాలి కాబట్టి, చట్టంలో మార్పులు తేవడానికి ప్రయత్నం చేశాం. పోలీసులు భారతీయ శిక్షా స్మృతిని తీసుకున్నంతశ్రద్ధగా ప్రత్యేక చట్టాలను తీసుకోరు. కాబట్టి ప్రధానమైన చట్టంలోనే మార్పులు తలపెట్టింది ప్రభుత్వం. నిజమే, ప్రైమా ఫే¦సియా అనే మాట చట్టంలో మొదటిసారి వాడాము, ఎందుకంటే, నేరం చేసిన వారు తప్పకుండా ఆర్థికంగా మూల్యం చెల్లించాలనే ఉద్దేశంతో. నష్టపరిహారం అనేది న్యాయస్థానాల పరిధిలోనిది. పునరావాసం అనేది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. జాతీయ మహిళా కమీషన్‌  యాసిడ్‌ నిరోధానికి చట్టం తేవడానికి ప్రయత్నం చేస్తూ వుంది గత రెండేళ్ళుగా. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం, అత్యాచార బాధితుల పునరావాసానికి చట్టం తేవడానికి ప్రయత్నిస్తూ వుంది. అందులో కేంద్రం నిధులు ఇచ్చేలా, జిల్లా కలెక్టర్లు దాన్ని పంపిణి చేసేలా ప్రతిపాదనలు చేసింది. యాక్సిడెంట్‌ కేసులలోలాగే, యాసిడ్‌ దాడికి గురైన వారికి తక్షణమే చేయాల్సిన అన్ని రకాల వైద్యాలను అందించడం ఆసుపత్రుల బాధ్యతగా చట్టాన్ని కేంద్రం చేయబోతోంది. అందులో విఫలమైతే ప్రభుత్వం వైద్యశాలపై చర్య తీసుకుంటుంది. పునరావాసానికి, రిలీఫ్‌కు ఎటువంటి ఆర్ధిక పరిమితులు వుండకూడదని ప్రతిపాదన చేయబోతున్నారు. బాధితులను అంగవైకల్యం కలవారిగా పరిగణించి, వారికి అన్ని సౌకర్యాలు ఇవ్వాల్సిన అవసరం వుంది. ఇది కూడా చట్టంలో పొందుపరచబడాలి. ముఖ్యంగా యాసిడ్‌ దాడి కేసులలో, క్రిందికోర్టు చట్ట ప్రకారం విచారణ జరుపుతున్నంత కాలం, హైకోర్టు దానిపై స్టే ఇవ్వడానికి వీలు లేదని చట్టం తేవాలి. ఇది సప్రషన్‌ ఆఫ్‌ ఇమ్మోరల్‌ ట్రాఫికింగు యాక్ట్‌ సెక్షన్‌ 18(1)లో ఇప్పటికే అమలౌతోంది. యాసిడ్‌ దాడి బాధితులకోసం ఇంటీరియమ్‌ రిలీప్‌ ఫండ్‌తో ఒక జీవో రావాల్సిన అవసరం వుంది.ఈ తరహాలో జీవో నెం. 13/2003ను మహిళా, శిశు సంక్షేమ శాఖ విడుదల చేసింది.  నిజానికి ఎన్నో రకాల జీవోల బదులు, హింసకు బలౌతున్న స్త్రీల రిలీఫ్‌ కోసం ఒకే నిధి ఏర్పాటు చేస్తే బావుంటుందని తాను జాతీయ మహిళా కమీషన్‌కు సూచించానన్నారు. యాసిడ్‌ దాడులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ మంచి చట్టం తెచ్చిందనీ, కానీ, నిందితుడికి మరణ శిక్షను అందులో ప్రతిపాదించారు. మరణ శిక్ష పడాలంటే, బాధితురాలు బతకాలి.కానీ గతంలో అత్యాచార కేసులలో మరణశిక్ష విధిస్తే బాధితురాలిని చంపేసే అవకాశం వుందని భావించి, శిక్షను పదేళ్ళుగా నిర్ణయించిన విషయం ఇక్కడ ఆయన గుర్తు చేశారు. బాధితురాలి దృష్ట్యా చట్టంలో  చేయాల్సిన మార్పులను సూచిస్తే, వాటిని ప్రభుత్వం ముందు పెట్టడానికి తాను ప్రయత్నిస్తాననే హామీనిస్తూ, యాసిడ్‌ దాడిని ఎదుర్కొనే విధానాల గురించి మనమందరం ఇతరులను  ఎడ్యుకేట్‌ చేయాలని చెబుతూ గుర్తించండి, ప్రతిఘంటించడి, రిపోర్టు చేయండి అని పిలుపునిచ్చారు.
సంధ్య మాట్లాడుతూ లింగవివక్షను రూపుమాపేందుకు ప్రభుత్వం పాఠ్యాంశాల్లో దీనిని చేర్చాలని అన్నారు. పదిహేను సం|| స్త్రీలపై జరుగుతున్న దాడులు ఆంధ్రప్రదేశ్‌దే మొదటిస్థానం. ఎన్ని చట్టాలు వచ్చినా కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి చివరికి కేసులు కొట్టివేస్తున్నారని సంధ్య బాధపడ్డారు. హింసలో మొదటిస్థానంలో అక్షరాస్యతలో చివరిస్థానం పాలకుల నిర్లక్ష్యానికి సాక్షిభూతంగా నిలుస్తుందన్నారు. చట్టాలు వున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడం శోచనీయమన్నారు. యాసిడ్‌ దాడులకు పాల్పడే వారిపట్ల  కఠినంగా వ్యవహరిస్తూ బాధితుల హక్కుల గురించి లైంగిక వేధింపులను నిరోధించడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర, ప్రభుత్వ వైఖరి, యాసిడ్‌ల ఉత్పత్తి, అమ్మకం తదితర అంశాలపట్ల విస్తృతంగా చర్చ జరగాలని సంధ్య  అభిప్రాయపడ్డారు.
హోంమంత్రిగారికి మీటింగు ఉండడంవల్ల రాలేకపోయారని సత్యవతిగారు అన్నారు. త్వరలోనే డ్రాఫ్ట్‌ తయారుచేసి వెళ్ళి హోం మినిస్టర్‌కు అందచేస్తామని అన్నారు. భానుజగారి వందన సమర్పణతో ఆనాటి కార్యక్రమం ముగిసింది.
(యాసిడ్‌ దాడుల నివారణకు అన్ని వైపుల నుండి మరింత చర్చ, ప్రయత్నం జరగాల్సిన అవసరం వుందని భూమిక భావిస్తోంది. మరింత సమగ్రమైన ప్రతిపాదనలతో సమాజం, ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ సమస్యపై విజ్ఞులైన పాఠకులు స్పందించి తమ అబిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ అంశంపై చర్చకు పాఠకులను భూమిక ఆహ్వానిస్తోంది.)

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో