కథాసదస్సు

– నాయని కృష్ణకుమారి

చాలా రోజుల తర్వాత ఈ మధ్య (13.11.06) ఒక కథా సమ్మేళనానికి హాజరయ్యాను. ‘సఖ్యసాహితి’ నిర్వహించిన ఆ సభకు అధ్యక్షురాలు శ్రీమతి ఆనందా రామంగారు. ప్రారంభకులు శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవిగారు. ఆమె ప్రారంభ వచనాలు కథా హృదయాన్ని ఆవిష్కరించాయి. చాలామంది కథా రచయిత్రులు వినిపించిన కథల్ని సావధానంగా విని నేను చేస్తున్న విశ్లేషణ ఇది.

ఈ సందర్భంలో నా జ్ఞాపకాల పొరలనుండి ఎన్నో విషయాలు బయటికి వచ్చి చిందులు తొక్కుతున్నాయి.

సభల్లో కథా పఠనమనేది నేనీ నగరంలోనే తొలుతగా వినడం జరిగింది. 1952 లోనే నేను హైదరాబాదుకు ఉద్యోగరీత్యా వచ్చి స్థిరపడ్డాను. అప్పుడు సాహిత్య సభలు జరిగే ప్రదేశాలు సుల్తాన్ బజారు శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయమొకటీ, బొగ్గులకుంట ఆంధ్ర సారస్వత పరిషత్తు మరొకటీ… శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు సభలు నిర్వహించడంలో ప్రథమగణ్యులు. రెండవవారు శ్రీ పోతుకూచి సాంబశివరావుగారు. అప్పుడు, కథారచనలో తొలుత ఎన్నదగిన మహిళల్లో శ్రీమతులు ఇల్లిందల సరస్వతీ దేవి, యల్లాప్రగడ సీతాకుమారి, నందగిరి యిందిరాదేవిగార్లు, తదితరులు సభల్లో కథలు చదువుతుండేవారు. నిర్వాహకులు అప్పుడప్పుడూ, పేరెన్నికగన్న వారితో పాటు నన్నుకూడా కథ చదవమని ప్రోత్సహిస్తుండేవారు.

అట్లా చదివిన కథల్లో ‘ గుడ్డితన’ మనే కథనం. శ్రీ వట్టికోట ఆళ్వారు స్వామిగారు పరిసరాలు అనే కథా సంకలనంలో ప్రచురించిన విషయం నాకు గుర్తు. అయితే ఆనాడు ఆడవాళ్ళ కథల ధోరణి ఇప్పటికంటే భిన్నంగా వుండేది. స్త్రీగా తమ సంసారానికీ వంట యింటికీ పరిమితమైపోయిన జీవితపు గాడిలో నుండి కించిత్తు కూడా బెసకకుండా వుండిపోవడం ప్రచురంగా కనిపిస్తుండేది. స్త్రీ పురుషుల అధికార తారతమ్యాలు, కుటుంబంకోసం ఎప్పుడూ స్త్రీ చేసే త్యాగాలు, వంశ ప్రతిష్ఠను నిలుపుకోవాలనే తహతహలూ ఇటువంటివే అప్పటి రచయిత్రుల కథాంశాలు. మరో రెండు దశాబ్దాలు గడిచాక యువతీ యువకుల పేరు, ప్రేమ రాహిత్యమూ, అపోహలూ, ఎడబాట్లూ, కన్నీళ్ళూ ప్రధానాంశాలుగా మారాయి. కాని చాలా వరకూ ఈ కథలన్నీ శుభ పర్యవసానాలుగానే వుండేవి. ఎక్కడోగాని సలీం అనార్కలీలూ, లైలా మజ్నులూ కనిపించేవారు కారు.

1980 -90 ల మధ్యకాని స్త్రీల కథల్లో ‘సామాజిక స్పృహ’ అనే అంశం ‘ అరుగెక్క’ లేదు. సమకాలిక సమస్యలు రచయిత్రులను ఆకర్షించడం అప్పుడే అయితే రాజకీయాల వక్రగతులూ, జన బాహుళ్యంలో పెరుగుతున్న నీతి రాహిత్యమూ, వ్యవసాయరంగాన్ని అణగదొక్కే వ్యాపార రంగమూ, అన్నిటికీ ధనార్జనమే కీలకమనుకునే మూర్ఖభావననీ సంఘంలో వికృతంగా పెరుగుతున్న రుగ్మతలుగా భావించి, తమ రచనల్ని సంఘంవైపు సంధించే అస్త్రాలుగా మలచలేదు. కేవలం వారి దృష్టి వారు చిత్రిస్తున్న పాత్రలకే పరిమితమైపోయేది. అక్కడ పరిస్థితుల వివరాలే తప్ప పరిష్కార సూచనలుండేవి కావు. ఇదంతా భూతకాలపు కథా నేపథ్యమనుకుంటే, ఇక ఇప్పటి కథల సంగతి!

ఈ సభలో చదివిన కథలన్నీ స్త్రీని ముఖ్య పాత్రగా గ్రహించి చెప్పినవే. రచయిత్రుల కథలు కనుక స్త్రీ చిత్రణ మీది మక్కువ వల్లనో, స్త్రీయే స్త్రీ మనస్సును చక్కగా వివరించగలదనే నమ్మకం వల్లనో అలా జరిగి వుండవచ్చు. ఈమధ్య బాలకార్మికుల కష్టాలు, వాళ్ళు చదువుకు దూరం కావడం, ప్రభుత్వ రంగంలోనూ, ప్రసార మాధ్యమాల్లోను విరివిగా వినపడుతున్నాయి. ఆ సమస్యకు రకరకాల తరుణోపాయాలు కాగితాలమీద కనపడు తున్నాయి. ఈ విషయానికి సంబంధించి, స్త్రీ, గృహరంగమూ, రెండూ స్పష్టంగా కనపడుతున్నాయి. స్త్రీ మనస్తత్వ చిత్రణకు అనువైన ఈ విషయం రచయిత్రులను బాగా ఆకర్షించి వుంటుంది. ఈ సభలో చదివిన కథలో ఈ ఇతివృత్తం మీదే ఎక్కువ కథలున్నాయి.

శ్రీమతి అబ్బూరి ఛాయాదేవిగారి ‘వివక్ష’ లో తన యింట్లో పనిచేసే 10 సంవత్సరాల పనిపిల్లను గురించి ఇల్లాలు పడే మనస్సంఘర్షణ బాగా పండింది. ఆ పిల్ల వాడుకునే కంచమూ, గ్లాసులూ విడిగా పెట్టుకోమని ఎందుకు శాసించడం? అది వాడే దుప్పటీ, దుస్తులూ ఇంటి గుడ్డలతో పాటు కలవకూడదనే ఆంక్ష ఏమిటి? కాఫీ హోటళ్ళలో అందరూ తాగే గ్లాసులు మనమూ వాడగలుగుతున్నప్పుడు ఈ పిల్ల వాడే గ్లాసును దూరంగా పెట్టుకోమనడంలో సబబేమిటి? ఇంట్లో ఎవరి సహాయమూ లేనప్పుడు ఉచ్చనీచాల స్పృహ లేకుండా అన్ని పనులూ చేసుకుపోయే ఇల్లాలికి లేని ఆంక్షలు, అవే పనులు చేస్తూ సహాయపడుతున్న పనిపిల్ల విషయంలో ఎందుకు? అయినా పని పేరుతో, దాన్ని చదువుకోనీకుండా చేసే అధికారం తమకెందుకు? ఈ మథనం తరువాత ఇల్లాలు రాజీని బడికి పంపడానికే నిశ్చయించుకుంది.

ఈ విషయం మీద మరో కథ శీలా సుభద్రా దేవిగారిది. పేరు మాయేంద్రజాలం. ఇది ఒక పనిపిల్ల ప్రసక్తి కలిగి కనిపిస్తున్నా అంతర్గతంగా భార్యా భర్తల ఆధిక్యపరమైన సమస్యగా రూపుచెందింది. ఇద్దరూ ఉద్యోగస్థులైన చోట భర్తకు తన భార్య ఇంట్లో వుండి కుటుంబాన్ని చూచుకోవాలనే మనసులోపలి కోరిక! ఆవిడ అందాన్ని పొగుడుతూ వుంటాడు. ఇంట్లో నీడ పట్టున వుండక ఎందుకు నీకీ ఉద్యోగ శ్రమ అంటాడు. మసి పూసి మారేడుకాయ చేస్తున్న భర్త మాటల్ని నమ్మి భార్య ఉద్యోగం మానుకుంటుంది. తాను ఉద్యోగిగా ఉన్నప్పుడు తన బిడ్డను చూచుకోవడానికి పనిలో పెట్టుకున్న పుష్పను చదివించాలనుకుంటుండేది. కాని తాను ఇంటిపట్టున వుండడం ఆరంభమైనాక పరిస్థితి తిరగబడిపోయింది. పుష్పను బడికి పంపితే ఇక తనకు విశ్రాంతి వుండదన్న భయంతో దాన్ని చదువు సంధ్యలకు దూరం చేసేసింది. ‘నీకు కుట్టు మిషన్ కొనిస్తా, టైలరింగ్ నేర్పుతా’ అంటూ మాటల మాయాజాలంలో పడేసి అది రాజీ పడేట్లు చేసింది. భర్త తన అహాన్ని తృప్తి పరచుకోవడం కోసం తనను బయటి ప్రపంచానికి దూరం చేస్తే తాను స్త్రీ అయి వుండీ కూడా తన స్వార్థం కోసం తోటి ఆడదాన్ని ఇంటికి కట్టి పడేసింది. ఇల్లాలు పెద్ద పని మనిషైతే పనిపిల్ల బాలకార్మికురాలు. ఇద్దరూ అధికారానికి లొంగిపోయే ఆడవాళ్ళే!

మరోకథ సోమంచి ఉషారాణిగారి ‘పశ్చాత్తాపం’. ఒక రౌడి తన వ్యసనాలు తీర్చుకోవడం కోసం కొడుకును బడికి పంపకుండా పనికి కుదురుస్తాడు. కానీ, తానే తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో తన వ్యసనాలను మానుకుని కొడుకును బడికి పంపుతాడు. ఇందులో ప్రముఖాంశం ఒక ఆదర్శాన్ని బోధించడమే కాని కథకు అవసరమైన ఏ సాంకేతిక లక్షణాన్ని నిక్షిప్తం చేయడం లేదు.

ఈ కథల్లో కనిపించే మరో కథాంశం- తరాల అంతరాలు- మానవ సంబంధాలు.

అనేక సామాజిక కారణాల వలన కుటుంబంలో వృద్ధులైన తల్లిదండ్రులకూ రెక్కలు వచ్చిన పిల్లలకూ మధ్య ఏర్పడుతున్న సంఘర్షణ! ఇక్కడ కథల్లో ఈ అంశం స్త్రీలకు సంబంధించిందిగానే తీర్చబడ్డది. పెళ్ళయిన ఆడపిల్లలు ముసలి ముప్పులో ఉన్న అమ్మానాన్నలను కనిపెట్టుకుని వాళ్ళతో వుండడం కుదరదు. ఉద్యోగం చేసుకునే ఆడవాళ్ళూ అంతే. మగపిల్లలు కూడా తన భార్య, తన పిల్లలు అనే పోరాని బంధం ఏర్పడ్డాక వాళ్ళకు తమని కనిపెంచిన తల్లిదండ్రులు పరాయి వాళ్ళుగానే కనిపిస్తారు. వాళ్ళపట్ల బాధ్యతను చూపిస్తారే తప్ప ప్రేమాభిమానాలను కురిపించలేరు. వేదవతి గారి శేషప్రశ్నలో ఈ అంశం కనిపిస్తుంది. వృద్ధాశ్రమంలో ఉన్న వర్ధనమ్మకు బ్రతుకు వెళ్ళదీయడం భారంగానే తోచేది. తన ఒకగానొక్క పిల్లవాణ్ణి తాను పిల్లి తన పిల్లను నోట కరుచుకుని దాని సంరక్షణను చూచుకున్నట్లుగానే కంటికి రెప్పలా కాచుకుంటూ పెంచింది. కాని తన ఈ ముసలితనంలో తనని కొడుకు ఎట్లా చూస్తున్నాడు. ఇంటికి దూరం చేసేశాడు. కోతిని పిల్లకోతులే పట్టుకుని వెంట పడినట్లు తానే వాడి ఆధారం కోసం తాను దేవురిస్తూంది. అరుదుగానైనా వాడు తన దగ్గరికి వచ్చి వెళ్ళగానే తన మనసంతా దిగులు పేరుకుంటుంది. ఈ ప్రేమ రాహిత్యంలో తన బ్రతుకెన్నాళ్ళని యీడ్చాలి అన్నది వర్ధనమ్మ శేషప్రశ్న. చిల్లర భవానీదేవి కథ ‘అమ్మా నన్ను క్షమించొదు’్ద అనే కథలో కూడా ఇటువంటి అంశమే. సునీత, మోహన్లు డాక్టరు దంపతులు ఉద్యోగ నిర్వహణలో క్షణం తీరికలేని జీవితాలు వాళ్ళవి. పల్లెలో వుండే సునీత తల్లికి పక్షవాతం వస్తుంది. నిస్సహాయంగా పడిఉన్న తల్లిదగ్గరికి వెళ్ళిందిగాని, ఆమె దగ్గర కొన్నాళ్ళయినా వుండి ఊరడింపును అందివ్వలేకపోయింది. ఇంటికి తిరిగి వచ్చినా సునీతను మనోవేదన ఆక్రమించేసింది. ఆమె పక్క యింట్లో ఒక ముసలి తల్లి ఎప్పుడూ తన కూతురు పట్ల శ్రద్ధ చూపుతూ గట్టిగా మాట్లాడే మాటలు వినపడుతుండేవి. ఎదుటనే ఉన్న బిడ్డ మీద తల్లికి మరీ యింత శ్రద్ధా అని విస్తుపోతుండేది. తన తల్లిని చూచి వచ్చాక మనశ్శాంతి కోసం ఎప్పుడూ వెళ్ళని పక్కింటికి వెళ్ళింది. తల్లి మాట్లాడుతూనే వుంది. కూతురు కనపడదు. తర్వాత సునీతకు తెలిసిన విషయమేమిటంటే, విదేశాలలో ఉన్న కూతురు జ్ఞాపకాలతోనే ఆ ముసలి తల్లి తన బ్రతుకు బండిని ఈడ్చుకొస్తున్నదని!

తెన్నేటి సుధాదేవి కథలో ఒక తండ్రి , తన కొడుకు తనను విడిచి పెట్టి విదేశాలకు ఎగిరిపోతే ఆవేదన పాలవుతాడు. ఆ దుఃఖాన్ని తన బంధువుల కుర్రవాడు తన ప్రేమతో మరిపిస్తాడు. ఈ కథ ఒక్కదానిలోనే స్త్రీ స్థానంలో పురుషుడు ప్రవేశించాడు. అయినా స్త్రీ మనస్సుతో పురుషుని మనో వైకల్యాలను చిత్రించడం అంత సులువా?

మరో కథ పోలాప్రగడ రాజ్యలక్ష్మి ‘ సృష్టి స్థితి లయలు’. ఇందులో ప్రముఖాంశం మనిషికి డబ్బు సంపాదనమీది ప్రేమ. తన పేరు ప్రతిష్టలు చెదిరిపోతాయేమోనన్న అభద్రతా భావం. ఇంకా తనకు పట్టు చిక్కని ఆ అభద్రతా భావ నివారణార్థం తాను రూపొందించాలనుకున్న చర్యలలో వేగం ఇటువంటి ఆలోచనా క్రమం ఈ కథలో కనిపిస్తుంది. ఇంతా చేసి, కొత్తగా ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేస్తున్న ఒక డాక్టరు, గుండెనొప్పితో తన పేషెంటైన వ్యక్తి ఆ సమయానికి రావడం ఆమోదించలేక పోయాడు. ఏ క్షణాన ఏమవుతుందో, తన కొత్తయింటికి ఎటువంటి చెడ్డపేరు వస్తుందోనని ఆ వ్యక్తిని త్వరగా పంపించి వేయడానికి ఆరాటపడ్డాడు. అతని కారు ఎక్కడికో వెళ్ళి రాకపోతే తన కారులో పంపడానికి సిద్ధమయ్యాడు. ఇంత వేగంగా అన్ని పనులూ చేసుకుని, గృహప్రవేశాన్ని దిగ్విజయంగా నిర్వహించుకుని సోఫాలో పడుకుని ఉన్న తల్లిని తట్టి లేపబోతే ఆమె ఆ కొత్త యింటినుంచి మరో లోకం వైపుకు పయనమై వెళ్ళిపోయింది. కథలో పరాకాష్ట ఈ చర్యతో గాఢంగా చిత్రితమైంది.

శ్రీమతి తురగా జానకీరాణి ఇతివృత్తం వేశ్యావృత్తికి లోనైన పనిమనిషి. ఈమధ్య ఇటువంటి కథలు అరుదుగా కనిపిస్తున్నయ్. ఈ వృత్తికి చట్టబద్ధత కావాలనీ, వేశ్యల్ని ‘సెక్స్వర్కర్స్’ అంటూ ఆ వృత్తికి గౌరవం కల్పించాలనీ, ఆ వృత్తి నిర్వహణకు అన్ని సదుపాయాలూ, భద్రతా, కల్పించాలనీ ఆందోళనకారులు హంగామా చేస్తున్న ఈ కాలాన ఈ రకపు ఇతివృత్తం ఎంతవరకు పండుతుందోనని నా సందేహం.

బరువైన ఈ ఇతివృత్తాలకు ప్రతిగా కొంత హాస్యస్ఫోరకంగా రెండు మూడు కథలు కన్పిస్తున్నయ్. శ్రీమతి కె.బి. లక్ష్మిగారి ఇప్పటి సాహిత్య సమావేశాలు నిర్వహించబడే తీరుతెన్నులు, వేదుల శకుంతలగారి కొత్త పెళ్ళి కూతురు పుట్టింటినుండి భర్తకు ఉత్తరం వ్రాసిన వైనం, శ్రీమతి ముక్తేవి భారతిగారి, భర్త వి.ఆర్.ఎస్ తీసుకుని హాయిగా విశ్రాంతి అనుభవిస్తున్నాడని కుళ్ళుకుని, తానూ తీసుకుని వచ్చే పోయే బంధువుల తాకిడితో అవిశ్రాంత విశ్రాంతికి లోనైన రీతి – ఇవన్నీ తేలికపాటి నవ్వును చిలకరించే కథలు!

అయితే ఈ కథల్లో సమస్యలున్నయ్. కుటుంబ చిత్రణ వుంది. మనిషి ఆలోచనా శక్తితో సందించే నిజాయితీ వుంది. కాని ఎక్కడో తప్ప పరిష్కారాన్ని చూపించే సూచనలు లేవు. ఆ ఛాయలకే రచయిత్రుల ఆలోచనా విహంగాలు రెక్కలల్లార్చలేదు.

వ్యక్తినీ కుటుంబాన్నీ ఆలంబనంగా చేసుకున్నా తమ యితివృత్తం అక్కడనుండే విశాల ప్రపంచ పరిధిలోనికి అడుగుపెట్టగలిగితే ఈ కథలన్నీ ప్రపంచ కథలవుతాయికదా అని నా తపన!

Share
This entry was posted in సాహిత్య వార్తలు, వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో