సర్కులేట్‌ కానివ్వని ప్రాంతీయ జండర్‌ ప్రజాస్వామికాలు

జూపాక సుభద్ర
అసెంబ్లీ సమావేశాలపుడు అందులో బడ్జెట్‌ సమావేశాలపుడు యింకా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు చాలా హడావుడిగా వుంటాయి. ఈ సమావేశాలపుడు ఉద్యోగుల్ని అసెంబ్లీ డ్యూటీకి పంపిస్తారు. ఉద్యోగులు అసెంబ్లీకి వెళ్లి కింద సెషన్స్‌ నడుస్తుంటే పైన గ్యాలరీల్లో కూచొని ఏ డిపార్ట్‌మెంటు నుంచి ఏయే సమస్యల్ని లేవనెత్తడం జరుగుతుంది, ఏవి చర్చకొచ్చినవి అనే సమాచారాన్ని నోట్‌ చేసుకోవాలి. తర్వాత ఆ సమాచారాన్ని సెక్రెటేరియట్‌ డిపార్ట్‌మెంట్స్‌కి సర్క్యులేట్‌ చేయాలి.
నాకు 18-2-10న అసెంబ్లీ డ్యూటీ పడితే వెళ్లడం జరిగింది. అసెంబ్లీ చుట్టు ముళ్లకంచెలు, బారికేడ్లు వాటికి కాపలాగా, వాటిని చుట్టుముడుతూ పోలీసులు దండిగా అసెంబ్లీ నిండా వున్నారు. ఏదో యుద్ధం కోసం అలర్ట్‌ అయినట్లున్నారు. ప్రజానాయకులకు యింత రక్షణ ఎవరినుండి అనిపించింది. ప్రజాకంటకులకు భయాలుంటాయేమో అందుకే యింత పోలీసు పహారా అనిపించింది. అదికాక రేపే (20-2-10) చలో అసెంబ్లీ అని తెలంగాణ విద్యార్థి జాక్‌ పిలుపు యివ్వడం ఆంధ్ర ప్రభుత్వానికి సవాలయింది. దాన్ని నిలువరించాలనే కసరత్తు జేస్తుంది పోలీసు బలగంతో. అయినా బుగులే వుంది. రేపేమైతదో, ఎట్లా వుంటదో, ఏమెదుర్కోవాల్సొస్తదో అని ఆంధ్ర తెలంగాణ రాజకీయ పార్టీలకు అగులుబుగులుగనే వుంది.  పోలీసులు చాలరని బార్డర్‌ఫోర్స్‌ని దించింది. రేపే ముఖ్యమంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి వుంది. అసెంబ్లీల తెలంగాణ రాజకీయ పార్టీల నాయకుల మోకాలల్ల ఎవ్వరికి నెత్తురుచుక్క లేదు. తేటగ లేరు. చీకటి గుయ్యారాలుగున్నరు. తెలంగాణ కోసం పొడుస్తం, చించుతమన్నోల్లు అసెంబ్లీల కుక్కపిల్లలోలె కూసుండ్రు. కాలుగాలిన పిల్లోలె తిరుగుతుండ్రు. ఓ దిక్కు కామ్‌గుంటే కైలాసం రాసిస్తం అనే లాలూచి. యింకో దిక్కు చదూకునే పోరగాండ్లు పోతే ప్రాణం వుంటే ప్రాణం అని కెరియర్స్‌ని, ప్రాణాల్ని జానేదో అని తెలంగాణ కోసం కొట్లాడ్తుండ్రు. ”రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించి తెలంగాణంత ఒక్క గొంతుగా నినదించి పార్లమెంటులో బిల్లు పెట్టించాలి. లేకపోతే మీ నియోజకవర్గాల్లో మీకు రాజకీయ గతులుండవని హెచ్చరిస్తుండ్రు. రేపటి రాజకీయ జీవితం కోసం దిగులుపడకుండ్రి కండ్లల్లవెట్టుకొని గద్దెలమీద కూసోబెడ్తం” అని కడుపుల తల్కాయలు బెట్టి బతిమిలాడిండ్రు. గాంధీగిరి జేసిండ్రు. పూలిచ్చిండ్రు. కాల్లు మొక్కిండ్రు. ఆత్మహత్యలు జేస్కుంటుండ్రు. అయినా బండబారిన రాజకీయ గుండెలు కరుగుతలేవు. ఎవడి అధికారపట్టు తప్పుతదోననే వ్యక్తిగత రాజకీయ స్వార్థం వాడికే. తెలంగాణ వస్తే ఎంత రాకుంటెంత – నేను నా పదవి ముఖ్యమనుకుంటున్నవాల్లకు చెవులమీన పేనుబారయి. త్రిజోడీలు దస్‌జోడీలు గావడమే వాల్ల ఆశ ఆశయం.
ఒక ప్రాంతం ప్రజల్ని మోసం జేసి మరో ప్రాంతం గుత్తకు తీసుకొని కుట్రలు చేస్తూ అణచివేస్తున్న ఆంధ్ర ప్రాంత పాలక పార్టీలతో తెలంగాణ రాజకీయపార్టీల నాయకులు కల్సి కూర్చోవడాన్ని చూడ్డానికి కష్టంగనిపించింది. బైట యింత ఉద్యమం జరుగుతుంటే పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుంటే వీళ్లు నిస్సిగ్గుగా అంత కలివిడిగా వాల్లతో ఎలా భాగస్వామ్యం కాగలుగుతున్నరు బైటకి రాకుండా. వీల్ల గుండెకవాటాలు కొట్కలాడ్తలేవా!
బైట యిట్లా వుసికె వుడికినట్లు వుడుకుతుంటే అసెంబ్లీల గవర్నర్‌ ప్రసంగం మీద చర్చాతీర్మానాలు జరుగుతున్నయి. ఏవో కొన్ని సీట్లు తప్ప అసెంబ్లీ నిండుగనే వుంది. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమస్యల మీద అసంతృప్తిగా మాట్లాడ్తుంటే పాలకపార్టీల నాయకులు ఓ… అని లేస్తుండ్రు, చేతులు సాచి కొట్లాడ్తుండ్రు. మీదిమీది వురికొస్తున్నట్లు ప్రతిపక్షాల మీద మాట్లాడ్తుండ్రు. ప్రధాన ప్రతిపక్షనేత చాలా జాగ్రత్తగా తెలంగాణ అనే పదాన్ని తన ప్రసంగంలో రాకుండా జాగ్రత్తగా కుట్ర పన్నిండు. అది ఆంధ్ర పాలకపక్షనీతేమో అనిపించింది.
తర్వాత పిఆర్పీ నేత లేచిండు. ”మన ముఖ్యమంత్రిగారికి చాలా ఓపిక, చాలా సమర్ధుడు, మంచి శ్రోత” ఆహా ఓహో అని అరగంట పొగిడిండు. తర్వాత శాంతిభద్రతలు హోమ్మినిస్టర్‌ మీద దాడి మొదలైంది. ”హోమ్మినిస్టర్‌గా ఒక మహిళను నియమించినపుడు మేము చాలా సంతోషించాం. మా అభినందనల్ని తెలిపాము. స్వాగతించాం. మేము ఆవిడినుంచి చాలా ఆశించాం. ఒక మహిళ హోమ్మినిస్టరయితే శాంతిభద్రతల సమస్యలుండవనుకున్నాం. అందరికి న్యాయం జరుగుతుందనుకున్నాం. ఆడపిల్లలు స్వేచ్ఛ సమానత్వాలతో తిరుగుతారని అనుకున్నాం. కాని ఆవిడి మేము ఆశించిన పని చేస్తున్నట్లనిపించట్లేదు. ఆడపిల్లల మీద దాడులు ఈ మధ్య పెచ్చుపెరిగాయి. యితర రాష్ట్రాలకన్నా ముందుండడానికి పోటీపడ్తుంది మన రాష్ట్రం. బాధితుల దగ్గరికి వెళ్ళడం బాగానే వుంది కానీ కఠినంగా వుండలేకపోతున్నారు, కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతుందావిడి. కారణాలేంటో అర్థం కావట్లేదు అధ్యక్షా” యిట్లా మాట్లాడుతుంటే ఏ కాళ్లులేవలే, ఏ చేతులు ఎదిరించలే ఏ అడ్డంకులు లేవు. ఏ అరుపులు వినబడలే. కామ్‌గా వుంది ఏ అల్లరి లేకుంట అసెంబ్లి. నిజానికి పాలకపక్షాల సభ్యుల్నించి ఎలాంటి అడ్డంకు మాట రాకపోవడం ఆశ్చర్యమేసింది. ఏంటీ విపరీత వివక్షని హోమ్‌మినిస్టర్‌ ఆధిపత్యకులం మహిళ అయినా ఆమె ప్రాంతం తెలంగాణ. జెండర్‌ లోకువే, ప్రాంతం లోకువే. యిక్కడ స్వంతపార్టీ, ప్రాంతం, జెండర్‌, కులం ఏవీ ఆమెకు దన్నుగా నిలబడలేదు. తెలంగాణ, మహిళ అయినందుకు వ్యవస్థ వైఫల్యాన్ని వ్యక్తిగతంగా దూషించారు. నిజానికి హోమ్‌మినిస్ట్రీ ప్రభుత్వంలో భాగం స్వంత నిర్ణయాలకు అవకాశముండదు. ప్రభుత్వ నిర్ణయాలే పంజేయిస్తుంటయి. ఆమె స్వంత నిర్ణయాలు అమలుచేసే పరిస్థితి వుంటదా అనేది ప్రశ్నే. ఇక్కడ ఎక్కడైనా రాజ్యం ఆధిపత్య స్వభావాలే వుంటయి. మన రాజ్యానికి ప్రాంతీయాధిపత్యముంది. అది ఆంధ్రాధిపత్యం. రాజ్యానికి కులం వుంది. అది ఆధిపత్య కులం. రాజ్యానికి మతం వుంది అది హిందూమతం. రాజ్యానికి జెండర్‌ వుంది. అది పితృస్వామ్యం. అందుకే యిక్కడ హోమ్‌మినిస్టర్‌ మహిళ కావడం అందులో తెలంగాణ మహిళ అయినందువల్ల ఆధిపత్యం ప్రాంత, పితృస్వామ్యాధిపత్యంతోనే అట్లా మాట్లాడగలిగారు.
స్వంత పార్టీ మినిస్టర్‌ అనే రాజకీయ స్పృహ కూడా కోల్పోయి పాలకపక్షాలు, ప్రతిపక్షాలు ఆంధ్ర తెలంగాణ, ఆడమగ తేడా లేకుండా ఎంజాయ్‌ చేయడం విషాదం. నా యీ రిపోర్టు సెక్రెటేరియట్‌కి సర్కులేట్‌ చేసే ప్రజాస్వామ్యముంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో