నడిచి వచ్చిన దారి

ఇంటర్వ్యూ : వి. ప్రతిమ
నాకు ఊహ తెలిసినప్పుడు మా ఇంట్లోనూ మా ఊళ్ళోను కూడా విద్యుచ్ఛక్తి లేదు. ఊరి చివర ఒక మంచినీళ్ళ బావి వుంద కానీ మా ఇంట్లో లేదు. ఊళ్ళో హైస్కూల్‌ కూడా లేదు. ఒక ఎలిమెంటరీ స్కూలుంది కానీ దానికి మమ్మల్ని పంపలేదు. ఒక మేస్టారింటికి ”ప్రైవేటుకి” పంపేవాళ్ళు. అమ్మాయిలు కూడ మావూరి పక్కనున్న దుగ్గిరాల స్కూల్‌కి నడిచివెళ్ళి హైస్కూల్లో చదవాల్సొచ్చేది. మంచినీళ్ళ బావీ, హైస్కూలూ, విద్యుద్దీపాలూ లేవు గానీ, వాకిట్లో వడ్ల పాతరుండేది. గుమ్మానికి కట్టిన వడ్ల కంకుల మీద బోలెడు పిచ్చికలు వాలేవి. అవి మా ఇంట్లో వున్న ఒకే ఒక్క పాత అద్దాన్ని ముక్కులతో పొడుస్తూ వుండేవి. అద్దం నిండా రెట్టలు వేసి గోల చేసేవి. మాకు గేదెలు, ఒక ఆవు, రెండెడ్ల బండి కూడా వుండేది. ఇంటినిండా ఎప్పుడూ బంధుజనం వుండేవాళ్లు. ఒక జీతకాడు వుండేవాడు. ప్రతి ఏరువాకకీ జీతకాళ్ళు మారేవాళ్ళు. ఇష్టమైతే ఇక్కడే వుండిపోయేవాళ్లు. వాళ్లు మా అమ్మనీ అత్తయ్యగారనీ, మా నాన్నని మామయ్యగారనీ, మమ్మల్ని పెద్దక్కాయి, చిన్నక్కాయి అనీ పిలిచేవాళ్లు. మా ఇంట్లో పెత్తనం అంతా మా నాన్నదే. అంతకు ముందు వాళ్ళ నాన్నది. వంటలు చేసుకోడం, పిల్లల్ని చూసుకోడం, పూజలు చేసుకోడం, ఎప్పుడన్నా డబ్బుల్తో అవసరం పడితే ఆయన్నడిగి తీసుకోడం వరకే ఆడవాళ్ల పరిమితులుండేవి. మా ఇంట్లో ఎవరెడీ బాటరీ సెట్‌తో నడిచే ఒక హాలెండ్‌లో తయారుచేసిన రేడియో వుండేది. దాంట్లో నాలుగునెలలకొకసారి బాటరీ సెట్‌ మార్చాలి. అందులో వచ్చే కర్నాటక సంగీతం చాలా ఇష్టంగా వినేవాడు మానాన్న. ఆయనటు వెళ్ళగానే రేడియో సిలోన్‌ పెట్టేవాళ్ళం మేం. ఆయన మాతోగానీ మా అమ్మతోగానీ ఎక్కువ మాట్లాడకుండా ఒక మెట్టు పైనే వుండేవాడు. కానీ అప్పుడప్పుడూ పొద్దున్నే ఎనిమిదింటికి ఇంగ్లీష్‌ వార్తలు వినమని చెప్పేవాడు. మెల్విల్‌ డి మెల్లో అనే ఆయన చాలా బాగా చెబుతాడనీ విని అర్థం చేసుకోమని చెప్పేవాడు.
అయితే అప్పుడప్పుడే అమ్మాయిల్ని చదివించాలని కొత్తతరం నాన్నలు అనుకుంటున్నారు. అందుకని వాళ్ళంతా మానాన్నతో సహా చాలా ప్రయత్నించి ఒక హైస్కూల్‌ తెచ్చారు. మేమంతా చేరిపోయాం. ఆడపిల్లలు పనులు చెయ్యాలని వంటలు నేర్చుకోవాలనీ అట్లా మా ఇంట్లో వుండేది కాదు. మమ్మల్ని ఆడపిల్లవని కించపరుస్తూ మాట్లాడడ్డం తక్కువ చెయ్యడం వుండేది కాదు. ఓణీలు వేసుకున్నాక బయట తిరగనివ్వరు. కొన్ని ఇళ్ళల్లో అప్పుడు. కానీ మా వూళ్ళో అట్లా వుండేది కాదు. మేం రోజూ లైబ్రరీకి పోయేవాళ్లం. మా వూళ్లో చాలా మంచి లైబ్రరీ వుంది. అప్పటికింకా కరెంటు లేదు. లాంతరు వెలుగులో నేను ఎస్సెల్సీ చదివేటప్పుడు చలం మైదానం చదివానం.
మా నాన్న చూశాడు కానీ ఏమీ అన్లేదు. మాకు రోజూ ఇంగ్లీష్‌ పేపర్‌ వచ్చేది. ఆంధ్రపత్రిక వీక్లీ, భారతి వచ్చేవి. ఇంకా సోవియట్‌ లాండ్‌ అమెరికన్‌ రిపోర్టర్‌ అని వచ్చేవి. మార్కుల కోసం ఎప్పుడూ చదవలేదు. ఇన్ని మార్కులేనా అని ఎవరూ అనలేదు. ఇది సోది అనుకుంటే గనుక ఈ సోది చెప్పడానికి కూడా కారణం వుంది. స్వాతంత్య్రానికి పూర్వం వచ్చిన అభ్యుదయ ఉద్యమాలు మా నాన్నలాంటి వాళ్ళమీద కొంచెమో గొప్పో ప్రభావం చూపించాయి. పత్రికలూ, పుస్తకాలూ చదువుకోనివ్వడం ”ఆడపిల్లలా వుండు” అనకుండా వుండడం, స్నేహితులొచ్చినప్పుడు వాళ్ళ కులం అడక్కుండా వుండడం, ఇన్ని మార్కులేనా అని తిట్టకుండా వుండడం, ఇవి మా ఇంట్లో అనుకూలాంశాలు కాగా డబ్బూ ఇతర వ్యవహారాలూ ఏవీ ఆడవాళ్ళతో చెప్పకపోవడం వాళ్ళను పాలితుల్లాగా చూడ్డం మానాన్న అంటేనే ఒక హడలుగా వుండడం ప్రతికూలాంశాలు. మా స్నేహితులు కొంతమంది తల్లుల దగ్గర డబ్బులుండేవి. వాళ్ళు పాలు తీసి అమ్మేవాళ్ళు. వాళ్లు స్వతంత్రంగా తెనాలి వెళ్ళి బట్టలూ, ఇంట్లోకి గిన్నెలూ, బంగారం కొనేవాళ్ళు. వాళ్లని చూసినప్పుడు డబ్బులు స్వంతంగా దగ్గర పెట్టుకుని వాడడం ఎంత బావుంటుందో అనిపించేది. ఆడవాళ్ళకి స్వంతడబ్బులుండాలని అప్పుడర్థమైంది. అది పాయింట్‌ నంబర్‌ వన్‌…అప్పుడు మా కుటుంబాల్లో ఆడపిల్లల చదువుకు ఎస్సెస్సెల్సీ (పదకొండో క్లాసు) ఆఖరిమెట్టు. తరువాతనించీ పెళ్లి ప్రయత్నాలు. ఎస్సెస్సెల్సీ పరీక్ష రాసి వచ్చి బోరుబోరుమని ఏడవడం నాకింకా గుర్తే. చదువుకోవాలి, కాలేజీలో చేరాలి ఎట్లా? చదివిస్తారో లేదో!! నేనేమో పధ్నాలుగు నిండకుండానే మానాన్న స్కూల్లో వేయించిన ఎక్కువ వయసుతో హైస్కూల్‌ అవగొట్టేశాను. ఓణీ వేసుకోడం కూడా సరిగ్గా రాదని మా మేనత్త తిడుతూండేది. రిజల్ట్సు వచ్చిన రోజు మా అమ్మ మైసూర్‌పాక్‌ చేసింది. నేనేమో ఏడుపు. భయం. చిన్నప్పుడు అన్నిటికీ భయమే. చీకటంటే భయం. ఇప్పుడా భయాలు తలుచుకుంటే రావిశాస్త్రి గారి సుబ్బయ్య గుర్తొస్తాడు. మా నాన్న నేను సాపవుతానని అనుకోలేదట. ఆయన చాలా ఆశ్చర్యపడిపోయి నన్ను హైదరాబాద్‌లో వుండే మా మామయ్య దగ్గరుండి కోఠీ వుమెన్స్‌ కాలేజీలో చదువుకోమని వరమిచ్చాడు. ఒక కుగ్రామంనించీ సరాసరి నగరానికి వచ్చి పడి కొత్త వెలుగు చూడ్డం ప్రారంభించాను. నేను మా ఇళ్లల్లో పెళ్లిచూపులు తతంగాలు చూస్తూ పెరిగాను. నాకు అవి పరమనీచంగా అతిరోతగా కనపడేవి. చచ్చినా పెళ్ళిచూపులకి కూచోకూడదు. ఎవడో ఒకడ్ని చేసుకోకూ డదు అని నిశ్చయించుకున్నాను. అయితే మనం కావాలని ఏరీకోరి పెళ్లి చేసుకున్నా సమస్యలు సమస్యలే. అక్కడా మనని మనం
నిలుపుకోడానికి పోరాడాలి. ఇదీ ఇంకా పెద్ద పోరాటం. నిరంతర పోరాటం. పాయింట్‌ నెంబర్‌ టూ… ఇలా పాయింట్ల వారీగా నిర్ణయాలు తీసేసుకుని వాటిని అమల్లో పెట్టడానికి అక్కడ నున్నగా జారిపోయే తారురోడ్లేమీ పరిచిలేవు. అప్పుడు కాలేజీ చదువయ్యాక కూడలిలో నిలబడితే రెండుదార్లు. ఒకటి అందరూ నడిచీనడిచీ నలిగిన దారి. రెండవది ఫ్రాస్ట్‌ చెప్పిన ”లెస్‌ ట్రాడెన్‌ దారి” ది అదర్‌ వే. అంటే మహావిప్లవమార్గం ఏమీ కాదు. నావంటి అల్పప్రాణికి మాత్రం విప్లవం. అక్కడనించీ పోరాటం. బహుశా జీవితం అంతా… ఇష్టంలేని పనులు చెయ్యకుండా వుండడానికి, ఇష్టమైన పన్లు చేస్తూ వుండడానికి. వీలైతే తక్కువ రాజీ పడడానికి. మన పట్టుదల మన ఒక్కరికే ప్రయోజనం, మిగతా అందరికీ నష్టం అని నిజంగా అనుకున్నప్పుడు రాజీపడడానికి, ఇట్లా దారి వేసుకుంటూ…నేను నేర్చుకున్న పాఠాలన్నీ ఎట్లా వుండకూడదో అనేవే ఎక్కువ. ఎట్లా వుంటే బావుండదో అర్థమైతే ఎట్లా వుంటే బావుంటుందో అదే అర్థమౌతుందనుకుంటా…నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. ఎందుకంటే తరాలు మారినకొద్దీ ఎవర్ని వారు నిలుపుకోడం తేలికౌతుందనీ, పెరిగిన అవగాహనతో, ఆర్థికవనరులతో స్త్రీలు ఊపిరి పీల్చుకునే వీలు కల్పించుకుంటారని. బ్రీథింగు స్పేస్‌ కల్పించుకుంటారనీ. వాళ్ళు సుఖంగా వుండి ఎదుటివాళ్ళని సుఖంగా వుండనిస్తారనీ. రెండోదైతే చేస్తున్నారు కానీ మొదటిది అవడం లేదు…వర్జీనియా అమ్మమ్మ ఆశించిన స్నేస్‌ ఇప్పటికింకా రాలేదు. కొంత వస్తూ వస్తూ వుండగా మార్కెట్‌ మాయాజాలం దాన్ని మింగేస్తూంది. వలలు విసిరి ఆత్మల్ని పట్టుకుంటూంది. వల విసరడం మార్కెట్‌ ఉద్యోగం పడకుండా వుండడానికి పోరాడాల్సిన అవసరం మనది. చాలామంది అధిక విద్యావంతులైన స్త్రీలు తాము మల్టీటాస్కింగు చేస్తున్నామని ఎక్కువ భారం మోస్తున్నామనీ బాధపడుతూంటారు. మోస్తున్నారు కూడా…’అంతా నాతోనే వుంది’ అనే భావం కుటుంబసభ్యుల్లో కలగజేసే తప్ప తనకి భద్రత లేదనే ఆలోచన ఇప్పటికైనా విడిచిపెట్టి, బాధ్యతల్ని పంచిపెట్టడం నేర్చుకుంటే బావుంటుందని అనిపిస్తుంది. స్వతంత్రం వచ్చాక మూడుతరాలు మారాయి. అయినా ఇంకా మీడియాలో మనం మూస అమ్మమ్మల్ని మూస అమ్మల్ని, మూస నాన్నల్ని, మూస భర్తల్ని చూస్తున్నాం. కొంత మార్పు వచ్చింది. మనని మనం గౌరవించు కోడం నేర్చుకుంటున్నాం అనిపిస్తుంది. ఇదంతా మధ్యతరగతి విజయం. అడుక్కి వెడితే వాళ్ళకి సంపాదించకుండా అప్పుడూ ఇప్పుడు కూడా జరగదు. ఇప్పుడు వారుణవాహిని ఏరులై పారుతున్నాక మరీ సంసార భారమంతా స్త్రీలమీదే పడింది. పీడితులనించే తిరుగుబాటు రావాలి. వస్తోంది కూడా. ఏది ఏమైనా ఆత్మగౌరవం ఒక నిత్యపోరాటం. మనం ఊపిరి పీల్చుకోడానికి మనమే పోరాడాలి, ఎవర్నో నిందించడం కాదు. సాధికారత గురించి ఇప్పుడెక్కువ మాట్లాడుతున్నాం. సాధికారత అంటే మనని మనంస్వాధీనం చేసుకోడం అని నేను అర్థం చెప్పుకుంటాను. జీవితంలో స్నేహాలూ, ప్రేమలూ, ఆపేక్షలు సహజంగా పుట్టుకొచ్చి పుష్పించి, పరిమళించనప్పుడు, మనని మనం స్థిరపరచుకోడం ఒక పోరాటమే అవుతుంది. ఎక్కువ తక్కువలు, అహాలు, అభిజాత్యాలు అడ్డుపడు తూంటాయి. అలసిపోయామనుకుంటె  ఆగిపోతాం.  మనం ప్రేమిస్తాం, స్నేహిస్తాం, మననించీ సహజంగా ప్రవహించే ఈ మానవ విలువలు ఎదుటివారినించీ కూడా మనకి సహజంగా అందాలి. మనకొక జీవనతాత్వికత అలవడాలి. ఇదంతా కావాలంటే మనం ప్రపంచంతో టచ్‌లో వుండాలి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. జ్ఞానం పెంచుకోవాలి. ఇన్నాళ్లుగా ఏం సాధించాం అంటే ఏమీ లేదనడం తప్పు. సాధనకు మార్గాలున్నాయి. సులువైన మార్గాలు లేవు. పోరాట మార్గాలున్నాయి. మనకిప్పుడు జాలి వద్దు. భిక్షం వద్దు. మనకి కావల్సింది మనం తీసుకోవడం నేర్చుకోవాలి. నేను కథలు వ్రాస్తానంటే ”దాని మొహం” అనేవాడు మా న్నా. తరువాత ఆయనే నన్ను చాలాచాలా మెచ్చేసుకుని పక్కన కూచుని కబుర్లు చెప్పేవాడు. ఆయనలో కూడా వయసు పెరిగిన కొద్దీ మార్పు వచ్చింది. ఆ మార్పు ఫలితాన్ని అనుభవించేటంత ఆయువే మా అమ్మకు లేకపోయింది. నాకు పెళ్ళైనప్పటినించీ ”నీకేం తెలీదు. నువ్వూర్కో” అని చాలాకాలం అనేవాడు నా సహచరుడు అనీ అనీ విసుగేసి మానేశాడో నాకు తెలిసిందీ ఆవిడకు తెలియందీ ఏమీలేదేమో అనిపించి మానేశాడో తెలీదు…ఇప్పుడట్లా మా అమ్మాయితో గాని మా కోడలితోగానీ అనే ధైర్యం ఎవరికీ లేదు. (ఇప్పుడు నాతో కూడా అనుకోండి.) అందుకని శివారెడ్డి గారు చెప్పినట్టుగా ”తెరిపిలేనిదేదీ లేదు. అంతం కానిదేదీ లేదు. నిన్ను నువ్వు పునఃప్రతిష్టించుకోడమే చెయ్యవలసిన పని” పాయింట్‌  నంబర్‌ త్రీ.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.