మనమింకా వాదాల దగ్గరే వున్నాం

వి. గీతానాగరాణి
ప్రకృతి రమణీయతకు మారుపేరైన అరకులోయలో పుట్టాను. భట్టిప్రోలు, ఏలూరు కాశిపాడు, తాడేపల్లిగూడెం, హైదరాబాద్‌లలో విద్యాభ్యాసం సాగింది.వ్యక్తి యొక్క వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి బాల్యంలోనే పునాదులేర్పడతాయి. నా వ్యక్తిత్వానికి ప్రధాన వ్యక్తులు అమ్మమ్మ, మేనత్త, అమ్మా నాన్నగార్లు. నీకున్నంతలో అవసరమైనవారికి సహాయం చేయడమన్నది అమ్మమ్మ దగ్గర, నీవు ఏం చేస్తున్నావో అది ఎవరికి తెలియదనే ఆత్మవంచన చేసుకోకూడదు, మనం చేసే ప్రతిపనికి ప్రకృతిసాక్షి దానికి నీవు లోబడి ఉండాలి అని మేనత్త చెప్పిన మాటలు నాకు పారదర్శకతను నేర్పాయి. అబద్ధాలు ఆడకూడదని అమ్మనుండి ఆధ్యాత్మికతను నాన్న నుండి నేర్చుకున్నాను. నా చదువు ఎప్పుడూ బలవంతంగా జరగలేదు. అమ్మానాన్నగారు చాలా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడమే కాకుండా పిల్లల్ని ప్రేమించేవారు, పిల్లల ఆలోచనల్ని అర్థం చేసుకొనేవారు. పాటలు, కవిత్వం, నవలలు రకరకాల సాహిత్యాన్ని చదవడం ఇవన్నీ వారినుండే నేర్చుకున్నాను.
చిన్నప్పుడే సమాజంలోని అసమానతలు నన్ను చాలా కలవరపెట్టడమే కాకుండా చాల ప్రశ్నలు ప్రశ్నించుకునేలా చేసాయి. ఈ ప్రశ్నలకి సమాధానాల కోసం అన్వేషణ అలా జరుగుతూనే ఉంది. కొన్నింటికి సమాధానం చిక్కినట్లు అనిపించినా ఆ సమాధానంలోంచే మళ్ళీ ప్రశ్నలు పుట్టడం నన్ను చాలా నిరాశకి, దాన్నుంచి ఒంటరిననే భావంలోకి నెట్టేస్తాయి. నా చదువంటే ఇదే నా చదువు ఇప్పటికి బహుశః ఎప్పటికి విద్యార్థిగానే ఉంచేస్తుందేమో ఎందుకంటే సమాజమనే బడిలో ఉన్నా కాబట్టి.
వృత్తి వ్యక్తిగతమైన అంశం. ఎవరి అభిరుచితో వారివారి వృత్తుల్ని ఎంచుకుంటారు. నావరకు స్వేచ్ఛాయుతమైన వాతావరణం నాచుట్టూ ఉండాలనిపిస్తుంది. స్త్రీలకు ఆర్థికస్వేచ్ఛతోపాటు భావప్రకటనాస్వేచ్ఛ కూడా చాలా అవసరం. నా భావ ప్రకటనలకు భంగం వాటిల్లుతుందనే భీతి కావొచ్చు లేదా ఉద్యోగపరమైన వత్తిళ్ళు తట్టుకొనే మానసికబలం తక్కువ కావొచ్చు. నేను మాత్రం ఉద్యోగం చేయలేదు. ఏది ఏమైనా సాంఘిక అసమానతల్ని సాంస్కృతిక దోపిడీల్ని అవమానాల్ని ఎదుర్కొని స్త్రీశక్తి అన్ని రంగాల్లోకి చొచ్చుకొనిరావడం, తమ కాళ్ళమీద తాము నిలబడి ఆర్థిక స్వేచ్ఛ పొందడం స్త్రీలు సాధించిన ఎంతో పెద్ద విజయం. ఎన్నో వివక్షల్ని ఎదిరించి ప్రశ్నించే చైతన్యవంతులైన స్త్రీలందరికి అభినందనలు.
కులాంతర మతాంతర వివాహం చేసుకొనే జంటలు కుటుంబం నుండి సమాజం నుండి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటారు. వాటిని అధిగమించి సంసారం సజావుగా సాగడానికి వారి మధ్య బలమైన ప్రేమ అనురాగం అవసరం. మా వివాహానికి వస్తే కుటుంబపరమైన సమస్యలు ఎదురురాలేదు. దానికి కారణం మా తల్లితండ్రుల ఆధ్యాత్మికత, సలీం తల్లితండ్రులు సలీంకిచ్చిన స్వేచ్ఛ. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. మా అత్తగారు అన్వర్‌ బలమైన వ్యక్తిత్వం కల మనిషి. ఈ బలమైన వ్యక్తిత్వమే సలీంది. మా మధ్య మతపరమైన ఆంక్షలు దొర్లకపోవడానికి ఇదే కారణం. ఇంట్లో కన్నా బయటే చిన్నచిన్న విమర్శలు నా చెవిన పడ్డాయి. వాటిని నేనెప్పుడూ ఖాతరు చెయ్యలేదు.
రెండు విభిన్నమైన వ్యక్తిత్వాలు, కుటుంబనేపథ్యాల నుండి వచ్చే ఏ జంటయినా ఏవో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటారు. ఎటొచ్చీ సమస్యను పెద్దది చేసుకోవడమా చిన్నది చేసుకోవడమా అనేది వారివారి మనస్తత్వాల బట్టి ఉంటుంది. ఎదుటివారి లోటుపాట్లని క్షమించుకోవడం, బేధాభిప్రాయాలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గడంతోపాటు ఇద్దరి మధ్య బలమైన స్నేహబంధం ఉండడం వలన మాది అనుకూల దాంపత్యమని చెప్పవచ్చు. మా ప్రేమ చిహ్నాలు నీహారికా, మధూలిక. పెద్దల్ని ఎదిరించి కులాన్ని మతాన్ని ఆచారవ్యవహారాల్ని కాలదన్ని ముందుకు వెళ్ళడం కులమతాలకతీతమైన మానవబంధం ఒకటుందనే నమ్మకమే ఇలాంటి వివాహాలకి దారితీస్తుంది. మనుషుల్ని మనుషులుగా పరిగణించడానికి కులమత అడ్డుగోడల్ని చేధించి ఒకే మనుషులు ఒకే మనసులు అని చెప్పడానికి ప్రేమవివాహాలు అవసరం. సమస్యలు ఏ వివాహంలోనయినా ఉంటాయి. పరస్పర సహకారం ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నెరవేర్చుకుంటూ ఒకరినొకరు గౌరవించుకోవడమే వివాహధర్మమని నా అభిప్రాయం.
వంట చేయడమంటే సలీంకు ఇష్టమే కానీ చెయ్యనివ్వను. భార్యాభర్తలు ఇంటిపనిని విభజించుకోవాలని చెపుతారు కానీ మగవాళ్ళు చేసే ఇంటిపని చాలామంది ఆడవాళ్ళకి నచ్చనట్లే నాకూ నచ్చక నేను పని విభజన చెయ్యలేదు. అదీకాక తన సాహిత్య వ్యాసంగానికి కొంత సమయం నేనివ్వాలనుకొంటాను. ఇల్లు, పిల్లలు ఆర్థిక ప్రణాళికలు నేను చూసుకుంటాను. ఇష్టమైన రచనావ్యాసాంగం, చదువుకోవడం ఆయన అభిరుచులు, వాటికి నేనెప్పుడు అడ్డురాలేదు. నేనే మొదటిపాఠకురాల్ని, నచ్చని వాటి గురించి ఇంట్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. అక్కడికీ ఉద్యోగ, పదవీ బాధ్యతల వలన చిత్రలేఖనాన్ని వదిలేశారు. లేకపోతే రచయితతో పాటు చిత్రకారుడు కూడా అయ్యేవారే.
పతి వ్యక్తికి తనదైన ఏకాంతం అవసరం దీని వలన చేసిన పనులలోని లోటుపాట్లని పరిశీలించుకుని చేసే పనుల్ని ఇంకాస్త మెరుగ్గా చేయడానికి అవకాశం దొరుకుతుంది. నావరకు ప్రతి వ్యక్తికి కొంత స్పేస్‌ అవసరమంటాను. ఏళ్ళు గడిచిపోయినా కొన్ని కుటుంబాల్లో కుటుంబసభ్యులపట్ల ప్రేమకాని అర్థం చేసుకోవడం కాని కనపడవు. అదంతా మానసిక దురాక్రమణ వల్లేనని నా అభిప్రాయం. ఎదుటివ్యక్తిని మనం ప్రేమిస్తున్నదానికన్నా ఇంకా ఎక్కువ ప్రేమించడానికి అర్థం చేసుకోవడానికి ఎవరి ప్రపంచాన్ని వారికి కాస్త వదలాలి. మనిషికి మనిషికి మధ్య ఎన్నో భిన్నాభిప్రాయాలు విరుద్ధమైన అంశాలుంటాయి. ఇది పిల్లలు పెద్దల మధ్య కావొచ్చు కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య, అంతెందుకు ప్రాణస్నేహితుల మధ్య కూడా వైరుధ్యాలుండవచ్చు. ఈ వైరుధ్యాల్ని అర్థం చేసుకొని వ్యక్తిత్వాల్ని విశ్లేషించడానికి స్పేస్‌ అవసరం. ఎదుటివాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినడానికి నీకు కొంత కాలమవసరం. విన్నదానికి నీవొక అభిప్రాయం చెప్పితే ఎదుటివాడు అర్థం చేసుకోవడానికి ఇంకొంత కాలమవసరం. ఈ రెండు కాలాల మధ్య జరిగే పరిణామాలే వాదవివాదాలు. ఈ వాదవివాదాలు కాలం తెచ్చే మార్పులుగానే పరిగణిస్తాను. ఏకాంతం వలన అంతరంగిక స్వేచ్ఛ, దాని వలన నిశ్శబ్దం ఏర్పడతాయి. నిశ్శబ్దంలో ఘర్షణకి తావులేదు. మనమింకా వాదాల దగ్గరే ఉన్నాం.
ఈ మాట తల్చుకోగానే కొంచెం ఆశ, మరింత నిరాశ, అభివృద్ధి, వెనకబాటుతనం అన్ని కళ్ళముందు కొంచెంకొంచెంగా కన్పిస్తాయి. మేరీ ఒలంపిడి గౌజెస్‌ 1791లో స్త్రీల హక్కుల ప్రకటనతో స్త్రీ విమోచనోద్యమం కోసం ప్రాణాలొదిలిన తొలిమహిళ నుండి ఎందరో కళ్ళ ముందున్నారు. మేరివోల్‌, లూయీ, బెట్టి, మిలెట్‌, మిచెల్‌ ఇలా ఎందరో స్త్రీ విమోచన ఉద్యమకారులు చేసిన కృషి ఫలితంగా ఐక్యరాజ్యసమితి 1975న అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. స్వేచ్ఛ, సమానత్వం, శాంతి, అభివృద్ధి ప్రాతిపదిక సూత్రాలు. ఈ లక్ష్యాలను మనం ఎంత సాధించాం, ఎంత సాధించాలి అనేవి మన ముందున్న అంశాలు.
తృతీయశ్రేణి దేశాల్లో భారత్‌ది ప్రత్యేకస్థానం. మనమెంతో అభివృద్ధి చెందే దిశలోనే ఉన్నాం. భారతీయ మేధస్సు, శ్రమ శక్తి ఎంతో ఉన్నతమైనవి. ఎటొచ్చీ ఇవి కొంతమంది దగ్గరే ఆగిపోతున్నాయి. భారతీయ జనాభా ఉన్నత, మధ్య, బీద, అట్టడుగువారుగా విభజిస్తే వీరిలో ఒక్కొక్క వర్గం సమస్యలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. జనాభాలో సగం మంది స్త్రీలయినప్పుడు ఏ వర్గపు స్త్రీలు ఆ వర్గపు సమస్యల్ని ఎదుర్కొంటారు. ప్రస్తుతానికొస్తే స్త్రీలు కొంత ఆర్థిక వెసులుబాటును పొంది ప్రతి అంశంపై పురుషునిపై ఆధారపడ్డం తగ్గిందనే చెప్పాలి. పిల్లల్ని కనే విషయంలో కూడా ఒక ప్రణాళిక, కొంత లైంగిక స్వేచ్ఛను కూడా స్త్రీలు కల్గి ఉన్నారని చెప్పవచ్చు.
ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్క మార్పు, ఆ మార్పులు సామాజిక జీవితంలో పెనుమార్పుల్ని తీసుకొస్తాయి. అనాగరిక సమాజం నుండి కంప్యూటర్‌ యుగంలోకి వచ్చాం. ఈ శాస్త్ర పరిజ్ఞానం తెచ్చే మార్పులన్నీ స్త్రీల జీవితాలపై కూడా ప్రభావం చూపుతాయి. బాల్యవివాహాల నుండి సహజీవనం వరకు వచ్చాము. 1980ల నుండి వచ్చిన స్త్రీవాద రచనలు సిద్ధాంతాల ఉధృతి నేడు తగ్గిందనే చెప్పాలి. ఈ తగ్గిన కాలంలో స్త్రీలకు పాత సమస్యలతో పాటు కొత్త సాంస్కృతిక ధోరణులు, సమాజ పోకడలు మరోరకం సమస్యలలోకి నెడుతున్నాయి. వీటికి రచయిత్రులు సృజనాత్మక రచనలో పరిష్కార సూచనలు చేస్తే బావుంటుంది. పురుషులు కొంత మారారంటున్నారు. అది పూర్తి స్థాయి అని నేననుకోను. వాళ్ళ అవసరాలకనుగుణంగా స్త్రీలు మారారంటాను. ఇది పురుషుల మార్పెలా అవుతుంది?
ఇంకో ముఖ్య విషయం సమాజంలో వేర్వేరు స్థాయిలకీ, వేర్వేరు వర్గాలకీ చెందిన స్త్రీలుంటారు. వారి సమస్యల్ని పరిష్కరించే దిశలో కూడా మనం ప్రయాణించాలి. శ్రమదోపిడి, పితృస్వామిక దాష్టికాలు, స్త్రీలపట్ల జరిగే అవమానకరదాడులు, ఉత్పత్తి శక్తిలో స్త్రీలను వినియోగించుకొని వారి హక్కుల్ని కాలరాయడం, ఇవన్నీ మనముందున్న సమస్యలే. వీటితోపాటు ఉగ్రవాదం, సాంస్కృతిక ధోరణులతో అణిచివేత, ప్రసారమాధ్యమాల్లో స్త్రీని వినియోగవస్తువుగా పరిగణించడం, ఇవన్నీ తల్చుకొంటే మహిళాభ్యుదయం పూర్తిగా సాధించామని చెప్పలేం.
ఎన్నో అవరోధాల్ని దాటుకుని మహిళా విముక్తి కోసం మహిళల సమానత్వం కోసం స్త్రీలు తమ శరీర నిర్మాణాన్ని సున్నితమైన మనస్తత్వాన్నీ, భావావేశాల్నీ పణంగా పెట్టారు. సమాజం ఆవిర్భవించడానికి పురుషులు స్త్రీలు అవసరమైనప్పుడు ఇద్దరూ సమానమే అని అందరూ గుర్తించాలి.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.