ధైర్యే సాహసే లక్ష్మీ

స్వేచ్ఛానువాదం : డా. కొత్తింటి సునంద

ఆడవాళ్ళు బలహీనులనీ, వాళ్ళను కాపాడే బాధ్యత తమదని భావించడం పురుషులకు సాధారణం. స్త్రీలు నిజంగా బలహీనులా? కొన్ని సందర్భాలలో అది కొంతవరకు నిజం కావచ్చు. కాని మగవాళ్ళు భయపడి, వెన్ను చూపిన సమయాలలో స్త్రీలు ధైర్యంగా ముందడుగు వేసిన సందర్భాలూ వున్నాయి. ఇక్కడ ధైర్యమంటే ఏమిటో ముందుగా మనం చెప్పుకోవాలి. కేవలం బాహుబలం ప్రదర్శించడం మటుకే ధైర్యం కాదు. కండబలం కంటే గుండెబలం గొప్పది. నైతిక బలమున్న వ్యక్తి ఎవరికీ భయపడడం గాని, తలవంచడం గాని జరగదు.
 పురుషుల కంటె స్త్రీలు నైతికంగా బలవంతులని హోల్‌సేల్‌గా చెప్పలేము. కాని స్త్రీలలో జీవిత విలువలెక్కువని చెప్పగలం. దానికి తగిన కారణాలున్నాయి. స్త్రీలకంటె పురుషులలో అధికార దాహం, పెత్తనం కోరుకోడమెక్కువ. వాటికోసం అడ్డదార్లు తొక్కడానికి సైతం వెనుకాడరు. అంచేతేనేమో – పురుషులలో నేరస్థులెక్కువ. స్త్రీలలో నైతిక విలువలు ఎక్కువ.
 మానవ చరిత్రలో ఏ ఒకరో ఇద్దరో తప్పితే స్త్రీలు తమంతట తాముగా యుద్ధం ప్రకటించడం గానీ, యుద్ధోన్మాదం గాని కనపడవు. చరిత్రలో లక్షలాది జనాలు ప్రాణాలు పోగొట్టుకొన్న యుద్ధాలు పురుషులు రచించినవే, గత శతాబ్ధంలో జరిగిన రెండు ప్రపంచయుద్ధాలు ఆ కోవకు చెందినవే. పురుషుల ప్రమేయంతో యుద్ధాలు జరిగాయి. వాటి వలన బాధలకు గురి అయ్యింది స్త్రీలు. మనిషి ప్రాణం పోసుకొనేది, నవమాసాలు పెరిగేది తల్లి గర్భంలోనే  బయటికొచ్చాక పెరిగేది తల్లిపాలతోనే, బతికి బట్టకట్టి ఒక వ్యక్తిగా నిలబడగలిగేది తల్లి ఆలన, పాలనతోనే. అంచేత ప్రాణం విలువ స్త్రీలకు తెలిసినంతగా పురుషులకు తెలియదు.
 తమ అధికారదాహం తీర్చుకోడానికి బాంబులు, ఇతర మారణాయుధాలు ఉపయోగించడానికి, లక్షలాది ప్రజల ప్రాణాలు తీయడానికి పురుషులు ఏ మాత్రమూ వెనుకాడరు. నాగసాకి, హీరోషిమాల మీద బాంబులు వేసిందెవరు? స్త్రీలు కాదు. పురుషులకు పెత్తనం ముందు ప్రాణం తృణప్రాయం.
 మతకల్లోలాలు సృష్టించి మారణహోమాలు చేసేది పురుషులే. నలభై ఏళ్ళుగా ‘మతకలహాలను’ అధ్యయనం చేస్తున్న నాకు, ఒక స్త్రీ మతకల్లోలాలు రేపడం గాని, కుట్రతో ఒక హిందువునో, ముస్లింనో చంపడమనేది ఎదురుకాలేదు. గుజరాతులోని నరోదియా పాటియా కు చెందిన ఒక్క మాయాకొద్నాని  మాత్రమే ప్రాణాలు తీసేందుకు ప్రోత్సహించిందని అంటారు. అటువంటి దృష్టాంతం మరొకటి లేదు. కాని స్త్రీలు సాటిమనుషుల ప్రాణాలు కాపాడిన దృష్టాంతాలు చాలా వున్నాయి. వారు శాంతికాముకులకు స్ఫూర్తిప్రదాతలు. అటువంటి స్త్రీల గురించి ప్రస్థావించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. వారిని వేరు వేరు సందర్భాలలో కలవడం జరిగింది.
 1969లో, అహమ్మదాబాదులో జరిగిన మతకల్లోలంలో కూరగాయలమ్ముకొని జీవించే ఒక సాధారణ స్త్రీ అసాధారణ సాహసం చేసింది. ఆమె పేరు మరచిపోయాను. ఆమె గుజరాతులోని జాలిమ్‌సింగుని చాల్‌  నివాసి. ఇరుగుపొరుగున రెండు ముస్లిం కుటుంబాలు. 1969లో కిరాతకమూకలా ప్రాంతాన్ని ముట్టడించి, ఆ ముస్లిం వ్యక్తులను, ఇళ్ళను తమకప్పగించాలని హుకుం జారీ చేసాయి. ఆ స్త్రీ ఒక్కతే తన కొడవలి తీసుకొని దారికడ్డంగా నిలబడి ”ఆ ముస్లింలను చంపడానికెవరొస్తారో రండి. ముందు వాళ్ళ పుచ్చెలెగురుతాయి. నన్ను చంపినాక, నా పీనుగమీద నడిచి వెళ్తే గాని వాళ్ళు (ముస్లింలు) మీకందరు” అని సవాలు విసిరింది. వచ్చిన 500 మందీ వెనుదిరిగి వెళ్ళిపోయారు.
 అక్కడ జరిగిన రగడలను అధ్యయనం చేయడానికి అక్కడికి వెళ్ళిన నేను ఆవిడనడిగాను, ‘నీ ప్రాణాలకు కూడా తెగించి ఆ ముస్లింలను కాపాడాలని నీవెందుకు ఆ సాహసం చేశావు’ అని. దానికావిడ ఇచ్చిన జవాబిది. ‘వాళ్ళు నా యిరుగుపొరుగు. వాళ్ళ ప్రాణాలను కాపాడడం నా ధర్మం. కాపాడలేకపోతే వారికంటే ముందు నేను మరణించడం మేలు. వాళ్ళు నా స్వంత రాష్ట్రమైన రాజస్థాన్‌లోని నా గ్రామవాసులు. వాళ్ళు చంపబడటం అంటూ జరిగితే నేను ఏ మొహం పెట్టుకొని మా వూరెళ్ళాలి?  వాళ్ళు నా సాటి మనుషులు. వాళ్ళను కాపాడడం నా విధి. పైగా ఈ గొడవలతో ఎటువంటి ప్రమేయమూ లేని అమాయకులు వాళ్ళు.’
 ‘మీ చుట్టుపక్కల మగవాళ్ళు లేరా. వాళ్ళొచ్చి వుండొచ్చు కదా వాళ్ళను కాపాడడానికి’ అన్నాన్నేను. ఆ మగవాళ్ళకు ధైర్యం లేకపోతే నేనేమి చేసేది. నేను చేయగల్గిందేదో నేను చేశానంది. అక్కడి మగవాళ్ళంతా ఇళ్ళలో దాక్కొని వుండగా తనొక్కతే సాహసం చేసి ఆ రాక్షసిమూకనెదుర్కొన్న ఆ స్త్రీ స్ఫూర్తిదాయిని కాదంటారా?
 అటువంటి ధైర్యవంతురాలే లక్నోకి చెందిన శ్రీమతి యాదవ్‌. 1994లో ఒక పెళ్ళి బృందంతో నిండిన బస్సొకటి లక్నోకు వస్తూ దారిలో ఆగింది. ఏదో పనిపడి బస్సు డ్రైవరు బస్సును ఒక ప్రక్కగా ఆపి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో శ్రీమతి యాదవ్‌, తన కొడుకుతో కలసి అటువేపుగా వెడుతోంది. దూరంగ ఒక గుంపు అటురావడం గమనించింది. వాళ్ళ చేతుల్లో కత్తులు, కాగడాలు. ఆ గుంపు బస్సుకు నిప్పుపెట్టడం ఖాయమని అనిపించి శ్రీమతి యాదవ్‌ తన కొడుకుతో బస్సు సంగతి చూసుకోమని చెప్పి తాను ఆ గుంపునెదుర్కొన్నది. చుట్టూ చూసి అక్కడ పడివున్న ఒక ఇనపకడ్డీని చేతిలోకి తీసుకొని గుంపువేపు దూసుకొని వెళ్ళింది. గుంపు చెల్లాచెదురై పారిపోయింది. బస్సును సమీపించిన ఆమె కొడుకు ఇగ్నీషన్‌కీ – తాళంచెవి దానికే వుండడం గమనించి బస్సును సురక్షిత ప్రదేశానికి తరలించడం జరిగింది. ఆ విధంగా ఆ బస్సులోనున్న 40 మంది మహిళలు, పిల్లలు వగైరాల ప్రాణాలను కాపాడడం జరిగింది.
 అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ములాయంసింగు యాదవ్‌ ఆవిడకు లక్ష రూపాయలు బహుమానంగా ఇచ్చారు. అలీగడ్‌కు పనిమీద వెళ్ళిన నేను కూడ ఆవిణ్ణి కలిశాను. ఆ గుంపును నిలవరిస్తాననే నమ్మకం తనకు లేకున్నప్పటికీ కనీసం ప్రయత్నమైనా చేద్దామనిపించిందని, బస్సులో వున్నది ముఖ్యంగా మహిళలు, పిల్లలు అనీ, అమాయకులనీ, వాళ్ళను రక్షించడం తన బాధ్యత అనిపించిందని చెప్పింది. తానదృష్టవంతురాలినని తన ప్రయత్నం ఫలించిందని  నలభై ప్రాణాలు బూడిదైపోకుండ కాపాడగలగడం తన అదృష్టమని చెప్పింది.
 ఆ సమయంలో ఆ రోడ్డు మీద చాలామంది మగవాళ్ళు వున్నారు. కాని వాళ్ళెవరికీ ఆ బస్సులోని వ్యక్తులను కాపాడాలనే ఆలోచనగాని, దానికి తగిన ధైర్యసాహసాలు కానీ లేకపోయాయి. ఆమె ఒక్కతే ఒక ఇనపకడ్డీ చేతబూని గుంపును చెదరగొట్టింది. అందుకే నేనంటాను ప్రాణం విలువ స్త్రీలకు తెలిసినంతగా మగవాళ్ళకు తెలియదని. ఆమె చేసిన ఈ సాహసంతో ఆమె పేరు అలీగఢ్‌ ప్రాంతంలో మారుమోగిపోయింది. 2008లో ఇటువంటి సంఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని ‘భైంసా’లో జరిగింది. అక్టోబరు 10వ తారీకున, సయ్యద్‌ ఉస్మాన్‌ అనే ముస్లిం వ్యక్తి ఇంటికి నిప్పెట్టారు ముష్కరులు. ఆ ఇంట్లోవాళ్ళంతా మాడిమసైపోయేవారు. కాని సమయానికి 61 ఏళ్ళ తుల్జాబాయి, ఆమె కొడుకు, ఇతర స్త్రీలు ధైర్యం చేసి ఆ ముస్లిం కుటుంబాన్ని కాపాడగలిగారు. మతపిచ్చి వున్న మగవారు కొందరు మారణహోమం సృష్టిస్తూ, చంపుతూ కొల్లగొడుతూ వుండగా, మిగిలిన మగవారు చేతకానివారిలాగ చూస్తూ వుండిపోయారు. కేవలం ఒక స్త్రీ ముందుకొచ్చి తన సాటివారి ప్రాణాలను కాపాడగలిగింది.
 2009, సెప్టెంబరు 7-9 తారీకులలో, గణేశ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా, కొల్హాపూరు జిల్లాలోని సంగ్లి, మిరాజ్‌, ఇఛల్‌ కరంజి  లలో అల్లర్లు చెలరేగాయి. ఆ గొడవలలో 60 మసీదులు, దర్గాలు నాశనమయ్యాయి. చాలామంది ముస్లిం వ్యక్తుల ప్రాణాలను కాపాడడమే కాకుండ, ఆ వూళ్ళలోని హిందూ స్త్రీలు ఆ మసీదులను, దర్గాలను పునరుద్ధరించారు. కావ్‌తెపిరాన్‌  గ్రామ పంచాయితి అంతా స్త్రీలమయం. గ్రామ పంచాయితీలో తీర్మానం చేసి మరీ ఆ పనికి పూనుకొన్నారు వారు. ”మా గ్రామానికి ఉత్తమ గ్రామమనే గుర్తింపు వచ్చేందుకు మాతో సమానంగా కృషి చేసారు మా గ్రామ ముస్లిం స్త్రీలు’  అని వివరిస్తూ ఆ గ్రామ హిందూ స్త్రీలు, ‘మా వూళ్ళో వంద ముస్లిం కుటుంబాలున్నాయి. ఈ గొడవలు మొదలయ్యాక కొందరు వూరొదిలి వెళ్ళేందుకుద్యుక్తులయ్యారు. మేము వారిని ఆపాము. స్త్రీలంతా కలసి, ప్రతి ముస్లిం ఇంటికి వెళ్ళి, వాళ్ళకు మేము అండగా వుంటామని ధైర్యం చెప్పాము.’ చెప్పినట్లుగానే ముస్లింల ప్రాణ, మాన, సంపదలకు నష్టం కలగకుండ చూసుకొన్నారు. మగవారు మతోన్మాదంతో వూగిపోతూ రాక్షసులై స్వైరవిహారం చేస్తున్న తరుణంలో, కేవలం మానవత్వంతో సాటివారిని కాపాడిన ఆ గ్రామస్త్రీలంతా నిరక్షరాస్యులు.
వారిని మేము, విమెన్‌ ఫర్‌ సెక్యులరిజం సంస్థ తరఫున ఘనంగా నవంబరు 13, 2009 నాడు సన్మానించాము. హసుబాయి బుఛారి రేఖా చనడే వందనా గయిక్వాడ్‌  నిషా బుటాడె వంటి ఈ స్త్రీలు అతిసామాన్యమైనవారు  అట్టడుగు వర్గం వారు. వారిని నేను కలసినప్పుడు వారెంతో ధైర్యంగా  నిబ్బరంగా మాట్లాడారు. వీరిలో చాలామంది నిరక్షరాస్యులు, లేదా అరకొర చదువు మాత్రమే వున్నవారు. తమ స్వార్థ రాజకీయాల కోసం మతకలహాలను రేపెట్టే  అరాజక శక్తులను పోషించే, అటువంటి సంస్థలను నడిపేవారిని దుమ్మెత్తి పోసారు. అటువంటి వారిని తమ గ్రామంలో అడుగుపెట్టనీయమని గట్టిగా చెప్పారు.
 2008లో కంధమాల్‌ జిల్లాలో చెలరేగిన మతపరచిచ్చులో దాదాపు 40 మంది క్రిష్టియన్లు ఆహుతి అయ్యారు. కొందరు హిందూ మతవాదులైన మగవారు చిచ్చురగల్చడంలో క్రిష్టియన్లనందులో పడవేసి కాల్చడంలో పైశాచికానందం పొందుతుండగా, కొందరు హిందూ స్త్రీలు వారిని రక్షించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ‘ప్రధాన్‌’ అనే ఇంటిపేరున్న ఒక ట్రైబల్‌ తెగకు చెందిన స్త్రీలు రాంచి ప్రధాన్‌, సురుచి ప్రధాన్‌, సత్యభామా నాయక్‌, నబోజిని ప్రధాన్‌లు అనూహ్యమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి, క్రిస్టియన్ల ప్రాణాలను, ఇళ్ళను కాపాడారు. వారిని ఆల్‌ ఇండియా సెక్యులర్‌ ఫోరం తరఫున సన్మానించేము.
 వీరు కూడ నిరక్షర కుక్షులే. అట్టడుగు వర్గానికి చెందినవారే. కాని వారిలో స్వమత దురహంకారం గాని, పరమత విద్వేషం గాని మచ్చుకైనా లేవు. హిందు, ముస్లిం, క్రిష్టియను మతాలకు అతీతంగ మానవత్వమున్న మంచి మనుషులు. ఇది మనమెంతో సంతోషించవలసిన అంశం. ఆశ కలిగించే అంశం. దీనివలన స్త్రీలు మగవారికన్న దయార్ద్రహృదయులనీ, బాగా చదువుకొన్నవారి కంటె చదువులేనివారిలోనే పరమత విద్వేషం తక్కువ అనీ అర్థమవుతుంది.
 అంచేత, విమెన్‌ ఫర్‌ సెక్యులరిజం వీరి మీదే తమ దృష్టిని కేంద్రీకరిస్తోంది. వారితో కలసి పనిచేస్తోంది. సంప్రదాయం పేరిట ఎక్కువగ మగవారి చేతిలో నలుగుతున్నది వీరే. అయినా మానవత్వం గుబాళిస్తున్నది కూడ వీరిలోనె. వారే మన ఆస్థి. వారే మన ఆశాదీపాలు. వారికి తమ ప్రాథమిక హక్కులు దక్కేందుకు మనం సాయపడాలి. వారు నేడున్న స్థితిలో కంటే ఇంకా ఎక్కువగా సంఘటితం కావాలి. వారి హక్కులేవో తెలుసుకోవాలి. దానికి మనం దోహదపడాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో