నిశ్శబ్దగాయాలం
Posted By భూమిక on April 4, 2010
జూటూరు కృష్ణవేణి
పుట్టుక నుండి చావుదాకా, లక్ష్యాలకు దూరం చేసే…
లక్ష్మణరేఖల మధ్య, ఆందోళనల కేతనాలెగరేసే…
ఆధునిక సవాళ్ళ నడుమ, నిశ్శబ్ద గాయాలుగా…
స్రవించబడుతున్నవాళ్ళం…!!
కన్న తండ్రులు నాగుపాములై కాటేస్తున్నా
అత్తవారింటి గ్యాస్ పేలుళ్ళలో, ఆహుతి అవుతున్నా…
కట్టుకున్నవాడి అనుమానపు కత్తి శిరోముండనం చేసినా…
అవమానం, మెడలో చెప్పుల దండై వేలాడినా…
తలవంచుకుని భరిస్తున్న మాతలం…
లోలోపల అగ్నిగుండాల్ని దాచుకున్న భూమాతలం…
పగలంతా నవ్వుల్ని తొడుక్కున్న పనియంత్రాలం…!
పడుకునేవేళకు మాత్రం రంగుల్లో కన్పించే రంభలం…!!
సకల రుచులు నీ జిహ్వ మీద వార్చే అన్నపూర్ణగా…
నీ కలలపంటను పండించే కన్నతల్లిగా…
మమ్మల్ని మేం కోల్పోయాక, నీ చిరునామాగా మిగిలాక…
బతుకు వేదికపై బహుముఖులమైన సహస్రావధానులం…
విసుర్లు, వీపుమోతల మధ్య…
వెక్కిరింపులు, విముఖతల మీద…
అంతరిక్ష యానాలు చేస్తున్నా…
వివక్షను అన్నివేళలా మోస్తున్నవాళ్ళం…
సంసారాల సాగరంలో, దిక్సూచీ కోల్పోయిన ఒంటరి నావలం
మిలీనియంలు దాటినా, మింగేసే క్రూరమృగాల మధ్య…
ఆదమరిస్తే ఆబగా దోచుకునే రాక్షసుల మధ్య…
యాసిడ్‌స్ప్రేలు దిగమింగుతూ…
శ్రీలక్ష్మిలుగా… ఆయేషాలుగా… స్వప్నికలుగా…
చరిత్రలో దురదృష్టపు ఆనవాళ్ళుగా…
కన్నీటిచారికలుగా, శిథిలస్వప్నాలుగా…
మిగులుతున్నవాళ్ళం…!!
అప్పటికీ… ఇప్పటికీ… ఎప్పటికీ
అవును…!!
మేము నిశ్శబ్దగాయాలం…!!
(మార్చి 8 – మహిళా దినోత్సవం సందర్భంగా)
అద్భుతమైన వర్ణన ………
ఆడవాళ్లపయిన జరిగే అత్యాచారాలను యెంతో హృద్యంగా వర్ణించారు.
నా వరకు ఈ బ్లాగు లొ స్త్రీలను గురించి, వారి కష్టాలను గురించిన అత్యుత్తమ కవిత మీదే.
కాబట్టీ………… నా హృదయ పూర్వక అభినందనలు.
ఇట్లు
సుప్రభాతం. అక్షరదీప్తి
విశాఖపట్టణం