ఆ-ముఖం-!?
Posted By భూమిక on April 4, 2010
భీంపల్లి శ్రీకాంత్
ఆ విషాదముఖం
ఎన్ని అనుభవాలను పులుముకుందో
ఎన్ని అనుభూతులను నింపుకుందో-
ఆ ముడుతల ముఖం
ఎన్ని అనుభవ రేఖలను లిఖించుకుందో
ఎన్ని అనుభూతి రంగులను చిత్రించుకుందో
ఆ వెర్రిముఖం
ఎన్ని విషాద జీవితాల్ని జీర్ణించుకుందో
ఎన్ని విషాదాశ్రువులను జారవిడిచిందో
ఆ ముసలి ముఖం
ఎన్ని చేదు మాత్రలను దిగమింగిందో
ఎన్ని వెక్కిరింతల ఈసడింపులను సహించిందో
ఆ ముఖంపై
ఎన్ని జాలి చూపులు కురిసాయో!
ఎన్ని సానుభూతి పవనాలు వీచాయో!
ఆ ముఖం
ఎన్ని జీవితాలను రుచి చూసిందో
ఎన్ని అనుభవాలను వాసన చూసిందో
ఆ ముఖమంత వాస్తవం
జీవితంలో ఏదీ ఉండదేమో?
ఆ ముఖమే ఇపుడు జీవితాన్ని శాసిస్తుంది.
ఆ ముఖమే
ఇపుడు జీవితానుభవాన్ని వెక్కిస్తోంది.
అపుడు-ఇపుడు-నన్నే వెక్కిరిస్తోంది-వెర్రిగా!?
నా జీవితరూపం-నీకు రాకపోదనీ ?
నా అనుభవచిత్రం – నీవు లిఖించకతప్పదనీ – ?
Comments
Leave a Reply