ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 16

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి
”అయ్యా! ఈ రోజుల్లో మగ పిల్లలూ, ఆడపిల్లలూ బుద్ధిగానే ఉంటున్నారు. అయినా, కొందరు తలతిక్కవాళ్లు కూడా లేకపోలేదనుకోండి!” అన్నాడు డాక్టర్‌.
”అలాంటి వాడెవడైనా మా అమ్మాయి మెడకి చుట్టుకోడుగదా!” అన్నారు మా ఆయన.
”ఒకవేళ దాని రాత అలా ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు?” అన్నాను.
”మనిషన్నవాడు విధిరాతతో పాటు తన ప్రయత్నాన్ని కూడా నమ్మాలి,” అన్నారాయన.
”కానీ ఏ కుర్రవాణ్ణి గురించి అడిగినా అందరూ మంచి వాడనే అంటారు గాని, చెడ్డవాడని ఎవరైనా చెపుతారా?” అన్నాను.
”అలా అని మనం కళ్లు మూసుకుని ఎవడికో ఒకడికి కట్టబెట్టలేంగా?” అన్నారా యన.
”సరే, ముందు వాళ్లకి ఉత్తరమన్నా రాయండి,” అన్నాను.
ఆ తరవాత అబ్బాయి బావగారికి సంబంధం గురించి ఉత్తరం రాశారు. ఉత్తరం పోస్టు చేశాక మా ఆయన అబ్బాయి కుటుంబం గురించి అక్కడా ఇక్కడా వాకబు చెయ్యడం మొదలుపెట్టారు. అలహాబాద్‌లో ఉండే మా అన్నయ్యకి ఉత్తరం రాశారు. అన్నయ్య దగ్గర్నించి రెండు మూడు రోజులకి జవాబు వచ్చింది. పిల్లవాడు మంచివాడేనని విన్నాననీ, అందరూ బుద్ధిమంతుడని మెచ్చుకున్నారనీ ఆ ఉత్తరం సారాంశం. ఒక పదిరోజుల తరవాత పిల్లవాడి బావగారి దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. అతను పిల్లవాడి ఆస్తిపాస్తుల వివరాలన్నీ అందులో రాసి పంపాడు. తాము ఈ ప్రాంతానికి చెందినవాళ్లమేననీ, తమ స్నేహితుడి భార్యకి జబ్బు చేస్తే ఆమెని కలవడానికి మా ఊరే వస్తున్నామనీ, మీ ఇంట్లోనే ఉంటామనీ కూడా అతనా ఉత్తరంలో రాశాడు. ముఖముఖి కలుసుకున్నప్పుడు ఇంకేమైనా అడగాలంటే అడిగి తెలుసుకోవచ్చని, మా ఆయన రాసిన దానికి జవాబుగా అతను, ”సూర్యుడికి దివిటీ చూపించడం ఎందుకండీ? నాకు మీ గురించి చాలా కాలంగా తెలుసు. నేను కాదు, పిల్లవాడి తండ్రికికూడా మీ నవలలంటే చాలా ఇష్టం,” అని రాశాడు.
ఆ తరవాత వారం పదిరోజులకి అతను రానే వచ్చాడు. ఇంకో ముగ్గుర్ని వెంటబెట్టుకుని మరీ వచ్చాడు. అందరూ మా ఇంట్లోనే దిగారు. ఆ తరవాత మా ఆయన వాళ్లతో మాట్లాడాలనుకున్నవన్నీ మాట్లాడేశారు. వాళ్లు వచ్చిన రోజే, ”మీరు అమ్మాయిని చూడాలను కుంటే ఇవాళే చూడండి. ఆ తరవాత వీలు పడదు,” అన్నారు.
”మిమ్మల్ని చూశాను. అమ్మాయి మీలా కాక ఇంకోలా ఉండదు కదా? కానీ, అబ్బాయి తల్లికి చూపించేందుకు, ఒక ఫోటో ఉంటే ఇవ్వండి,” అన్నాడతను.
”ఆవిడ స్వయంగా వచ్చి అమ్మాయిని చూసుకోవచ్చు కదా?” అన్నాను. ఆ ముగ్గురూ వారం పదిరోజులు మా ఇంట్లోనే ఉన్నారు. ఆ తరవాత మూడు రోజుల్లో అమ్మాయికి ఫోటోలు తీయించి వాళ్లకిచ్చాం. ఒక ఫోటోలో అమ్మాయి, నేను, బన్నూ ఉన్నాం. మరో ఫోటోలో అమ్మాయి డాక్టర్‌గారి కూతుర్ని ఎత్తుకుని ఉంది. మూడో ఫోటో అమ్మాయికి మాత్రం విడిగా తీయించాం. అవి తీసుకుని ముగ్గురూ వెళ్లిపోయారు.
వాళ్లు వెళ్లిన పదిరోజులకి మళ్లీ వాళ్ల దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో వాళ్లు రాసిన విశేషాలు, ”పిల్లవాడు తన గురించిన నిర్ణయాలు తనే తీసుకుంటాడు, అందుచేత అతను తన సోదరిని వెంటపెట్టుకుని అమ్మాయిని చూసేందుకు వస్తాడు.’ ఆ ఉత్తరం చూసి ఈయన మండిపడ్డారు. ”ఈ కుర్రాడికి కూడా తలతిక్క ఉందనిపిస్తోంది నాకు. తండ్రి లేనంత మాత్రాన ఇంట్లో పెద్ద వాళ్లెవరూ లేకుండా పోతారా? అతని బావగారు చూసి వెళ్లారుగా, ఇంకేమిటిట? ఆయన మాట మీద అతనికి గురి ఉండద్దా? బావగారేమీ బైతుకాడే, తెలివైన వాడేనే. ఇలాంటి పిచ్చివేషాలు వేస్తే ఈ సంబంధం వద్దని చెప్పేస్తానంతే,” అన్నారు నాతో. ఇప్పుడే ఉత్తరం రాస్తాను. ‘మీ ఇంట్లో అతనిదే రాజ్యం కావచ్చు, కానీ నాకు కావల్సినది నా కూతురికి ఒక భర్త. నా దగ్గరకొస్తే ఒక అబ్బాయిగా రావాలి. నేను మీకు ఇచ్చిన ఫోటోలని వాపసు పంపించెయ్యండి. ఇక ఈ సంబంధం గురించి నాకు మీరేమీ రాయక్కర్లేదు,’ అని రాసేశారు.
దానికి మళ్లీ వాళ్లు జవాబు రాశారు. ‘పిల్లవాడిదే రాజ్యం అని నేను మీకు రాయడం నా పొరపాటే. పిల్లవాడికి తండ్రి లేనందున అన్ని విషయాలూ నిర్ణయించాల్సిన బాధ్యత నాదయింది. నాకు కూడా మీలాగే అందరూ ఏమంటారు అనే భయం ఉంది. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే మన్నించగలరు.’ ఆ ఉత్తరంతో పాటు అబ్బాయికి ఈ పెళ్ళి ఇష్టమే అని చెపుతూ రాసిన ఉత్తరం కూడా జతచేశారు. ఆ అబ్బాయి (వాసుదేవ్‌ ప్రసాద్‌) ‘ఈ పెళ్లికి నేను సుముఖంగానే ఉన్నాను. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ పెళ్లి చేసి అమ్మాయి తరపువాళ్లు దివాలా తియ్యకూడదు. ఎందుకంటే పెళ్లి అనేది ఒక్కరోజుతో తీరిపోయే సంబంధం కాదు. మా ఇద్దరి బంధం మూడు తరాలు నిలుస్తుంది. అందుచేత మీరు వాళ్లని బికారుల్ని చెయ్యకండి.’ అని తన బావగారికి రాసిన ఉత్తరం అది.
ఆ ఉత్తరం చదివి ఈయన చాలా సంతోషించారు. ”పిల్లవాడు చాలా బుద్ధిమంతుడు,” అని ఆ ఉత్తరాన్ని నా చేతికిచ్చారు. ”అబ్బాయి తల్లిగాని, అక్కగాని వచ్చి పిల్లని చూసుకుని వెళితే బావుంటుందని వాళ్లకి రాయండి,” అన్నాను. ఆయన అలాగే రాసి పోస్ట్‌ చేశారు. పిల్లవాడి తల్లి రావడమే బాగుంటుందని రాశారు.
ఉత్తరం రాసిన పదిహేను రోజులకి అబ్బాయి బావగారు తన భార్యతో వచ్చాడు. రెండు మూడు రోజులున్నాక ఆవిడ వెళిపోతానంది. మా ఆయన నాతో, ”అప్పుడే వెళ్లనివ్వకు, ఒక పది పదిహేను రోజులుండమను. పిల్ల రూపురేఖలు చూసినంత మాత్రాన ఏం తెలుస్తుంది? నాలుగు రోజులుంటే దాని నడవడిిక, స్వభావం తెలుస్తాయి. చూసేందుకు అందంగా ఉండి, మనిషి మంచిది కాకపోతేనో? మన పిల్ల గురించి వాళ్లకి తెలీని విషయాలు నువ్వు చెప్పు,” అన్నారు.
”ఏం వాళ్లు చూసి తెలుసుకోలేరా? మధ్యలో నేను చెప్పడం దేనికి?”
”వాసుదేవ్‌ రాసిన ఉత్తరం చూశాక అతనంటే ఒకరకమైన ఆప్యాయత కలుగు తోంది. ఈపెళ్లి జరిగినా జరగకపోయినా నాకతను ఆప్తుడే!” అన్నారు.
అబ్బాయి అక్క మా అమ్మాయితో బాగా కలిసిపోయింది. అమ్మాయికి పెళ్లి సంబంధమని తెలీకపోవడంతో, నిస్సంకో చంగా ఆమెతో కబుర్లూ అవీ చెప్పింది. ఒకరోజు నేను వాసుదేవ్‌ అక్కని, ”నీకు ఏమడగాలనిపించినా నన్ను అడుగు,” అన్నాను. ”అమ్మా, నేనేమీ అడగక్కర్లేదు. నన్ను నమ్మండి. మా తమ్ముడి గురించి రాసిన ఉత్తరం మీకు అసలు పంపాల్సిన అవసరం లేదు. కానీ ఇంత పెద్ద బాధ్యతని మా ఆయన ఒక్కరే ఎలా భరిస్తారు?” అందా అమ్మాయి.
ఆ అమ్మాయి అన్న మాటలు మా ఆయనకి చెప్పాను. ”నువ్వా అమ్మాయిని ఇంకో మాట కూడా అడుగు, అప్పగింతలప్పుడు ఎటువంటి గొడవా ఉండకూడదు!” అన్నారు. నేను వెళ్లి ఆ అమ్మాయికి మావారన్న మాట చెప్పాను.
”అమ్మా! అటువంటి గొడవలేమీ ఉండవు,” అని ఆ తరవాత ఆయన దగ్గరకెళ్లి, ”ఇక మా  తమ్ముణ్ణి మీ కొడుకనే అనుకోండి. ఇది నేనంటున్న మాటకాదు, మా అమ్మ మీతో ఈ మాట చెప్పమంది,” అంది.
”ఇది వేరే చెప్పాలా, అమ్మా? మీరందరూ ఇకనించీ మావాళ్లే!” అన్నారు.
”మీ అబ్బాయిలింకా చిన్నవాళ్లు. మీ అమ్మాయిని ఎప్పుడు చూడాలనిపించినా ఒక్క ఉత్తరం ముక్క రాసి పడేస్తే మా తమ్ముడే వచ్చి దిగబెడతాడు. మా నాన్నే గనక ఉండి ఉంటే మీకు ఏ సమస్యలూ ఉండేవి కావు,” అంది.
ఆ తరవాత వాళ్లు వెళ్లిపోయారు.
ఇక అబ్బాయి వాళ్లుండే ఊరు, బరిచ్ఛా, వెళ్లాలని నిశ్చయించారు. ”చాలా దూరం బాబూ, నేను తట్టుకోగలనా?” అన్నాను.
”ఏమంత దూరమని? డబ్బుంటే ఒక దూరందేముందిలే! నేనున్నంతవరకూ మనకి డబ్బుకి లోటుండదు. అంతేకాదు, నీకింక కూతుళ్లు కూడా లేరు కదా? సరే, నువ్వు దగ్గర్లోనే ఉండే ఎవరికో ఇచ్చి పెళ్లి చేశావనుకుందాం, ఆ తరవాత అతను ఉద్యోగరీత్యా దూరం వెళితేనో? అప్పుడేం చేస్తావు? అయినా వాసుదేవ్‌ లాంటి కుర్రాడు దొరకడం అంత సులువు కాదు. నా కొడుకులు కూడా అతనిలా తయారవుతారో లేదో చెప్పలేను. నాకైతే వాసుదేవ్‌ నా పెద్దకొడుకు లాగే అనిపిస్తున్నాడు. ఉత్తరం చూశావా, ఎంత ఔదార్యం? ఈ రోజుల్లో కుర్రాళ్లని చూడడం లేదూ నువ్వు? ఎలాగైనా డబ్బురాబట్టుకోవాలనే చూస్తారు. దొంగతనం, దోపిడీలు చేసైనా సరే. ఇక దేవుడి మీద భారం వేసి, నన్ను వెళ్లనీ,” అన్నారు.
నేనుకూడా సరేనన్నాను. ఆయన అక్కణ్ణించి వెనక్కి వచ్చాక, ”అబ్బాయి చాలా మంచివాడు. వాళ్ల నాన్న కూడా నాలాగే ఆలోచించేవాడట. ఎప్పుడూ స్వదేశీ దుస్తులే వేసుకునేవాడట. బెంగాలు రెండు మ్కులైనప్పుడు ఆయన కూడా జైలుకెళ్లాడట. ఈ సంబంధం రావడం మంచిదైంది,” అన్నారు.
ఆ తరవాత లక్నోకి వెళ్లి అన్ని ఏర్పాట్లూ చేసి, బెనారస్‌కి వచ్చారు.
పెళ్లివారికి ఎదుర్కోలు సన్నాహం అప్పుడు ఈయన తన అన్నగారిని పంపి, తను ఒక పక్కగా నిలబడి వేడుక చూడడం మొదలు పెట్టారు. మగపెళ్లివాళ్లు కొందరు పంచదార చిలకల్ని అటూ ఇటూ పడెయ్యసాగారు. అది ఆయనకి నచ్చలేదు.
”గుమ్మం దగ్గర నువ్వు డబ్బులు వెదజల్లు!” అన్నారు.
”కానీ ఇప్పుడు అది వాళ్లవంతు కదా?” అన్నాను.
”వాసుదేవ్‌ మీద తప్ప అందరిమీదా డబ్బులు విసిరెయ్యి,” అన్నారు. నేను వదినతో, ఒక పళ్లెంలో అక్షింతలూ, పైసలూ తీసుకు రండి వదినా!” అన్నాను.
అవి వచ్చాక, ”మీరే డబ్బులు విస రండి!” అన్నాను ఆయనతో.
”లేదు, ఆపని నువ్వే చెయ్యి!” అన్నారు.
పెళ్లివారు విడిదికి చేరుకున్నారు. ఆ తరవాత ఆయనతో, ”ఎదుర్కోలు మీరే చెయ్యాల్సింది,” అన్నాను.
”అవన్నీ చెయ్యడం నా వల్ల కాదు!” అన్నారు.
”మరైతే తరవాత కన్యాదానం చెయ్యాల్సింది మీరే కదా?” అన్నాను.
”కన్యాదానం ఏమిటి? ప్రాణంలేని వస్తువులని దానం ఇస్తాం. ప్రాణం ఉన్న వాటిలో గోదానం ఒక్కటే విన్నాను. కానీ ఆడపిల్లని దానం ఇవ్వడమా? నాకిష్టం లేదు!” అన్నారు.
”కానీ చెయ్యక తప్పదు,” అన్నాను.
”నా వల్ల కాదన్నానా? నా కూతుర్ని నేను అలా దానం చెయ్యను.” అన్నారు.
”చిన్న పిల్లాడిలా ఏమిటా మాటలు? కన్యాదానం అనే సంప్రదాయం ఉందా లేదా?”
”ఉంటే ఉండనీ, నేను చెయ్యను. నీక్కావాలంటే నువ్వు చేసుకో!”
ఎలాగో ఒకలాగ పెళ్లి మండపంలోకైతే వచ్చారు, కానీ కన్యాదానం నేనే చేశాను. ఆయన ఊరికే కూర్చున్నారు.
పెళ్లి తంతు ముగిశాక వాసుదేవ్‌ తరపుమంగలాయన, ”అయ్యా! నాకు మీరు ఈనాం ఇవ్వాలి!” అన్నాడు. ”ఎంత కావాలో చెప్పు!” అన్నారీయన. ”కనీసం పదిరూపా యలిప్పించండి!” అన్నాడతను. ఈయన జేబులోంచి డబ్బు తీసి అమ్మాయికి దాంతో దిష్టితీసి, మంగలాయన ఇచ్చారు. అతను సంతోషించాడు.
జూలైలో వాసుదేవ్‌ దగ్గర్నించి ఉత్తరం వచ్చింది, ”ఇప్పుడు నన్నేం చదవమంటారు?” అని రాశాడు. ”నాకైతే అతను అలహాబాద్‌కి వచ్చి లా చదివితే బావుండుననిపిస్తోంది,” అన్నారు నాతో.
”అవును అదే మంచిది,” అన్నాను.
”అవును, అతనిది జమీందార్ల కుటుంబం. సాగర్‌లో వకీలు చదువు చదువుకుంటూ, మరోపక్క జమీందారీ పనులు కూడా చూసుకోవచ్చు. ఇంకెక్కడికైనా వెళ్లి చదువుకుంటే జమీందరీ పనులు చూసుకోలేడు కదా! అన్నారు.
అదే మాట అతనికీ రాశారు. బాగా కష్టపడి చదువుకోమని కూడా రాశారు.
అప్పట్నించీ ఆయనకి వాసుదేవ్‌ కొడుక్కన్నా ఎక్కువై పోయాడు. అతని అవసరాలన్నీ జాగ్రత్తగా గమనించేవారు. ఒకసారి అతను లక్నోకి వచ్చాడు.లూకర్‌గంజ్‌ నించి మ్యోర్‌ కాలేజీ దాకా రావలసి వస్తొందని ఈయనకి తెలిసింది. అతనికి సైకిల్‌ కొని పెట్టాలనుకుని, డబ్బుకోసం నన్నడిగారు. ఆ డబ్బుతో సైకిల్‌ చూపిస్తాను. నచ్చిందో లేదో కనుక్కుందాం,” అన్నారు. సెలవలకి అమ్మాయి, అల్లుడూ అప్పుడు మా ఇంట్లో ఉన్నారు.
నేను కిందినించే, ”వాసుదేవ్‌, వచ్చి నీ సైకిల్‌ చూసుకో. ఏదైనా సరిగ్గా లేకపోతే చెప్పు!” అని పిలిచారు.
అతను కిందికొచ్చి, చూసి, ”బాగానే ఉంది!” అన్నాడు.
అతనికి ఏమైనా తక్కువైందని అనిపిస్తే ఆయన వెంటనే కొని పంపించేవారు. కానీ వాసుదేవ్‌ ఆయన్ని చూసి చాలా భయపడేవాడు. ఆయన అడిగినవాటికి జవాబు మాత్రం చెప్పేవాడు. ఆయన అది గమనించి, ”ఈ అబ్బాయికి నేనంటే చాలా భయం,” అనేవారు.
”ధన్నూకీ ఇతనికీ తేడా ఉంది. అతనికి మీరంటే గౌరవం,” అన్నాను ఒకసారి.
”నాకైతే ఇద్దరూ సమానమే,” అన్నారాయన.
ఎన్నోసార్లు వాసుదేవ్‌ ఆయనకి ఉత్తరాలు రాసేవాడు. వాటిలో రెండు మూడు తప్పులుండేవి. ఆ తప్పుల్ని సరిదిద్ది ఆ ఉత్తరాలని వెనక్కి పంపటమే కాక, నీ ఇంగ్లీషుని మెరుగుపరుచుకోమని సలహా కూడా ఇచ్చేవారు. తప్పులు ఉన్నాయని కనిపిస్తే చాలు, ఆ ఉత్తరాలని దిద్ది వెనక్కి పంపేవారు. అతి గమనించి నేనొకసారి, ”అతను ఏమైనా అనుకుంటాడేమో?” అన్నాను.
”ఏమనుకుంటాడు? నేను ధున్నూకి కూడా ఇలాగే రాస్తా కదా? నా సొంత మనిషి అనుకునే కదా తప్పులుంటే దిద్దుతున్నాను?” అన్నారు.
వాసుదేవ్‌కి ఉర్దూ రాదు. అతనికి ఉర్దూ నేర్పే ప్రయత్నం చేసేవారు.
పెళ్లప్పుడు కూతురికి భారీగా ఉండే పెద్దపెద్ద గిన్నెలిచ్చారు ఈయన. తనొక్కతే వాటిని ఎత్తలేకపోయేది. ఒకరోజు నేనాయనతో, ”మీరా గిన్నెలు ఎందుకిచ్చారు? వాటిని అది ఎలా ఉపయోగించుకుంటుంది? వాటిని పొయ్యి మీదికి ఎక్కించడం, దింపడం దానివల్లేం అవుతుంది?” అన్నాను.
వాటిలో అది వంట చేస్తుందని ఇవ్వలేదు. ఈ గిన్నెలున్నంతవరకూ జ్ఞాపకాలు కూడా ఉంటాయి. కొన్ని తరాలవరకూ గుర్తుచేసుకుంటూ ఉంటారు,” అన్నారు.
”అయితే అందరికీ చూపించాలని ఇచ్చారా?”
”మరేమిటి? వాటి ఉపయోగం ఏముంటుంది? డబ్బు ఖర్చయిపోతుంది. వస్తువులైతే పడుంటాయి.”
వాసుదేవ్‌ వచ్చినప్పుడల్లా అతని కుటుంబ సభ్యుల గురించి అడిగేవారు.
ఒకసారి వాసుదేవ్‌ మా అమ్మాయిని తీసుకెళ్లేందుకు వచ్చాడు. ”అప్పుడే అమ్మాయిని కాపరానికి పంపను,” అన్నాను. అతను నాకేమీ జవాబు చెప్పలేదు, కానీ మా ఇంట్లో ఉండే ఒక పంతులుగారితో,” వాళ్లకి చెప్పి ఒప్పించండి. నాకు వండిపెట్టే వాళ్లెవరూ లేరు,” అన్నాడు.
నాకా విషయం తెలిసి మా ఆయనతో, ”అల్లుడు ఇలా అన్నాడట,” అని చెప్పాను.
”అతనితో చెప్పు, అమ్మాయి ఇప్పట్లో కాపరానికి వెళ్లదు. ఏం అతని అక్కగారు ఏమైందిట?” అన్నారు.
”ఆవిడ భోపాల్‌కి వెళ్లిందిట. ఆమెకి అక్కడ ఏవో వడ్డీలు అవీ దొరుకుతాయిట. అయినా ఆవిడ పెద్దమ్మ కూతురుట కదా? సొంత అక్క కాదు. అలా సంవత్సరాల తరబడి వెళ్లకుండా ఉంటే డబ్బు రావడం ఆగి పోతుందిట,” అన్నాను.
(ఇంకా వుంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో