ప్రపంచీకరణ నేపథ్యంలో స్త్రీల సమస్యలు

– కె.వి.ఎన్.ఎల్. ప్రసన్న కుమారి

సకల ‘లోకాల’ను ఒక్క ఇల్లుగా చేసి వసుదైక కుటుంబంగా (లా); గ్లోబల్ విలేజి ఏర్పాటు గ్లోబలీకరణ పేరిట ఓ విశ్వ కుటీరాన్ని నిర్మించడం లక్ష్యంగా, అట్టహాసంగా బయలుదేరిన గ్లోబలైజేషన్ ఆ లక్ష్యాన్ని సాధించలేకపోగా దేశాలను, కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. సమాజాలను, జాతులను, మతాన్ని, ప్రాంతాల్ని, ఆఖరకు ఒక ఇంట్లో కలిసి జీవించే రక్త సంబంధీకులకు, భార్యా భర్తలమధ్య, స్నేహితుల మధ్య కూడా గ్లోబల్ గారడీ చిచ్చు పెడుతోంది – ఈ స్థితిని స్త్రీలే తిప్పి కొట్టాలి బలంగా.

ఉదాహరణకు: పాతికేళ్ళుగా ప్రభుత్వ సర్వీసులో పనిచేసే అన్నకు పదివేలు కూడా నెలజీతంరాని నేటి (దు)స్థితిలో – ఎం.సి.ఎ, ఐ.టి. టెక్నాలజీ చేసిన చిన్న తమ్ముడు నెలకు 40 వేలు సంపాదిస్తున్నాడు – ఇంట్లో ప్రత్యక్షంగా – పరోక్షంగా ఆధిపత్య పోరు-ఆర్థిక పోరు, ఇదే రీతిలో భార్యాభర్తల మధ్య… నేడు నెలకొంది. లక్షల్లో జీతాలు జీవితాల్నే దెబ్బతీస్తున్నాయి. మరోవైపు మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ పేరుతో (విలీనాలు – స్వాధీనాల) పేరిట కార్పోరేట్ సంస్థల కౌగిళ్ళలోకి కొన్ని సంస్థలు మార్పిళ్ళు- వేల, లక్షల సంఖ్యలో ఉద్యోగాల కోత, కార్మికులు వీధి పాలు… మన హైదరాబాద్లో ఐడిపిఎల్, హెచ్ఎంటి, ఆల్విన్, ఇలా లిస్ట్ రాస్తే 80 కి పైగా పెద్ద కంపెనీల లిస్ట్ తయారు అవుతుంది. హైటెక్ పాలకుల పాలనాఫలాలే పై సంస్థల మూతకు కారణం… అభివృద్ధి రేటును పెంచడం కోసం ఉత్పత్తి రంగాన్ని శాసిస్తున్న గ్లోబల్ మార్కెట్, మహిళలపై క్రమంగా మోయరాని భారాన్ని మోపుతోంది. ఉదాః- వస్త్ర పరిశ్రమలో వేతనంపై పనిచేసే మహిళలు వారానికి 56 గంటలు పనిచేయగా, వేతనాలు (ఒ.టి లేకుండా) వారానికి మరో 31 గంటలు పనిచేయాల్సిన స్థితి. మొత్తం పనిగంటలు 87 గంటలు. ఇక కాల్ సెంటర్స్, ప్రైవేట్ సంస్థల్లో, కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే వారి గురించి చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం, అందం, ఆలోచన ఆవిరి చేసే కాల్సెంటర్ ఉద్యోగాలొక మాయాజాలం.

గ్లోబలైజేషన్ అనర్థాలు… దేశదేశాన్ని చిన్నాభిన్నం చేస్తోంది అనడానికి థాయ్లాండ్, ఉత్తరకొరియా, ఫిలిప్ఫైన్స్, ఇండోనేషియా, అర్జంటైనా లాంటి దేశాల స్థితి చాలు ఉదహరించడానికి.

త్రాగటానికి మంచినీళ్ళులేని గ్రామాల్లో సైతం పెప్సి, కోకాకోలాలు దొరుకుతున్నాయి ఈరోజు… దేశంలో ఆరు కోట్ల టన్నుల ఆహారధాన్యం గోదాముల్లో మగ్గుతోంది… మరో పక్క ఆకలిచావులు సంభవిస్తున్నాయి. ప్రపంచబ్యాంక్ ప్రయోగశాలలో రైతుల ఆత్మహత్యలు జరగని రోజు ‘ దేశం’ పాలనలో ఉందా? సిగ్గుచేటు. మీటింగుల్లో మేధాపాట్కర్ అన్నట్లు “దేశాన్ని రక్షిద్దాం, దేశాన్ని నిర్మిద్దాం” మాటలు బాగానే వున్నాయి. కాని… మనల్ని మనం రక్షించుకునే స్థితే లేదుకదా!! వేధింపులు- లైంగిక దాడులు సెల్ఫోను పుణ్యమా అని, ఎస్ఎంఎస్, ప్రేమసందేశాల మాటున వేధింపులు- వెకిలిచేష్టలు… ముఖ్యంగా మహిళలపై – విద్యార్థులపై జరిగే సైబర్దాడిని ఏ ఐ.టి. సంస్థ నిరోధిస్తుంది? ఏ చట్టం కాపాడాలి? వ్యవసాయక పనులు లేక… రోజు కూలీలుగా, అడ్డాలపై నిలబడిన మహిళలకు… ఏ ఇందిరమ్మ పథకం ఉద్దరిస్తుందో రాజశేఖరులకే తెలియాలి… గ్రామీణ భారతం ముఖ్యంగా కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు బాగా దెబ్బతిన్నాయి ఈ 16 సంవత్సరాల్లో.

చేనేత పరిశ్రమ పురాతన వేదాల కంటే ప్రాచీనమైనది – క్రీ.పూ 4000 సంవత్సరాల క్రితమే “చేమగ్గం” పై వస్త్రాలు తయారు చేయుపద్దతి వున్నది – హరప్పా, మొహంజదారో, ఈజిప్టులోని పిరమిడ్లను త్రవ్వకాలు జరిపినపుడు ‘చే’ మగ్గంపై వస్త్రాలు తయారు చేయు పద్ధతికి సంబంధించిన ఆధారాలు వెల్లడైనాయి. వ్యవసాయ రంగం తరువాత చేనేత రంగం 2వ స్థానంలో వుంది – దేశంలో 38, 90,576, మగ్గాలు వుండగా, గ్రామీణ ప్రాంతంలో 32,80,087 మగ్గాలు… పని చేసి ఎందరికో ఉపాధి కల్పిస్తున్నాయి. దాదాపు 124 లక్షల మందికి జీవనోపాధి కల్గిస్తున్నాయి. కాని గ్లోబల్ దెబ్బకు బాగా నష్టపోయింది- వ్యవసాయరంగం- చేనేతరంగం- ఈ రంగాల ద్వారా పురుషునితో బాటు స్త్రీలూ ఇబ్బందులు పడుతున్నారు కదా!! ఆర్ధాకళ్ళలో అలమటిస్తున్నారు కదా! తల్లిదండ్రి ఎంతో కష్టపడి కాలేజ్కి పంపే ఆధునిక బాలికలు (గాళ్స్) ఈ ప్రపంచీకరణ మార్కెట్ మాయాజాలంలో… మీడియా మాయాజాలంలో వాస్తవాల్ని విస్మరిస్తున్నారు… పబ్లు, పిజ్జాలు… బార్లు, నైట్ పార్టీలు… లిప్స్టిక్లు… నెయిల్పాలిష్లు… పెర్ఫ్యూమ్లు, పార్టీవేర్లకై, వెడ్డింగ్ వేర్లకై పరుగులెత్తే పడతులంతా, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఆదివాసి మహిళల చైతన్యం ముందు తమ స్థితి, తమ భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన తరుణంలో వున్నాం. గిరిజన హక్కుల కోసం పోరాడిన ఓ అల్లూరి, ఓ బిర్సాముండా, ఓ… కొమరంభీం, ఓ సిద్దు, ఓ కాను, తమ్మన్నదొరల జీవితాన్ని అధ్యయనం చేయాలి… మేథాపాట్కర్, ఆరుంధతీరాయ్, వందనాశివ, లాంటి వారి చైతన్యాన్ని మహిళలంతా అందుకోవాలి… స్ఫూర్తినొంది పోరాటం చేయాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ఒక్క రైతాంగం మాత్రమే దెబ్బతినదు… వ్యవసాయంతో పాటు యితర వృత్తులు చేసుకుంటూ జీవనాధారం పొందే వారుకూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో సగం మంది స్త్రీలూ వుంటారు కదా!! మిడిల్ క్లాస్, సెమీ మిడిల్ క్లాస్ అదృశ్యమైనాయి. ఈ ప్రపంచీకరణవల్ల కవి గోరేటి వెంకన్న రాసిన “పల్లె కన్నీరు పెడుతోంది” అన్న పాట మొత్తం గ్రామీణ వ్యవసాయక దేశం, (భారతం) ఎలా ఛిద్రమైపోయిందో!! గ్లోబలైజేషన్ రక్కసి దారుణాల్ని చక్కగా పాటలో రాసారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, విధానాలతో చేతివృత్తులన్నీ సర్వనాశనం అవుతున్నాయి. ప్రత్యేకించి మహిళల భాగస్వామ్యంతో నడిచే చేతివృత్తులు, మన రాష్ట్రంలో రెండుకోట్ల మంది చేతివృత్త్తిదారులు ఉన్నారు. నేత, గీత, గొర్రెలు, మేకలు పెంపకందార్లు, మత్స్యకారులు, రజకులు, క్షౌరకులు, వాయిద్యకారులు (మేళం), కుమ్మరి, కమ్మరి, కంచారి, కంసాలి, వడ్రంగి, శిల్పి, ఆరెకటిక, వడ్డెర, రాయి, మట్టిపని (ఉప్పరిపని), దర్జీ, గాండ్ల, వెదురు, మేదర, తట్టల వృత్తులు, బుట్టల అల్లకం, అద్దకం లేసులు, పూసలు, నులక, కాటికాపరి, వీరుగాక, బుడిగ జంగాలు, చిందుభాగోతులు, దాసర్లు, జంగాలు, యక్షులు, ఇతర సాంస్కృతిక సంచార వృత్తులవారు వున్నారు. బహుళజాతి సంస్థలకు మోకరిల్లే ప్రభుత్వాలు పేదల్ని, కాల్చుకుతింటున్నాయి. అధిక ధరల జీవన విధానానికి తొట్టి తొలుత బలికాబడేది స్త్రీలేకదా!! ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం, భర్తను, ఇంట్లో పెద్దల్ని ఉదయం నుండి రాత్రిదాకా సంరక్షణ చేసే స్త్రీ ఆధునిక పద్మవ్యూహాన్ని చేధించే అభినవ అభిమన్యురాలు… ఇది అతిశయోక్తి కాదు – వాస్తవం.

1991 – భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలను అమలు పరచడం ద్వారా చేతి వృత్తులలో సైతం పెట్టుబడిదారులు… ప్రవేశించి వృత్తిదారులకు పనిలేకుండా చేస్తున్నారు. 2010 నాటికే నేడు మనం నిత్యం చూస్తున్నట్లుగా అడ్డామీద కూలీలు మాదిరిగా డాక్టర్లు, ఇంజనీర్లు, ఎం.సి.ఏ లు చేసిన కంప్యూటర్ ఘనాపాటీలు, లాయర్లు, సైంటిస్ట్లు నిలబడి పనికోసం ఎదురుచూచే స్థితి రానున్నది- ఓ హెచ్చరికగా మేధావులు ఈ అంశాన్ని గమనంలో తీసుకోవాలి. 1936లో ఒకసారి, 1995లో మరోసారి మధ్యనిషేధం అమలు – దాన్ని విఫలం చేసిన పాలకుల పన్నాగాలు, స్త్రీల జీవనస్థితిపై ప్రభావం అందరికి తెలిసిందే కదా!! మంచినీళ్ళకు కొదవ కాని, మగువల కన్నీటికి కొదువలేదు ఈ మద్యపానం వల్ల. ఆంధ్రరాష్ట్రం గర్వించదగ్గ మహిళా చైతన్య పోరాటం ‘సారా’ వ్యతిరేకోద్యమం పురిటి గడ్డ నెల్లూరులోని దూబగుంట గ్రామంలో రోశమ్మ ఇంటి ముందే రెండు బెల్టుషాపులు ఏర్పడినాయి… ఇది మహిళా చైతన్యాన్ని వెక్కిరించినట్లుగా వుందికదా. అలాగే బాక్సైట్ త్రవ్వకాలు జరుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల అడవులు, అడవీ సంపద నాశనం అవుతాయి. కాఫీ తోటలు, పంటపొలాలు, దెబ్బతింటాయి. ఆదివాసీ గిరిజనుల జీవనం దుర్భరం అవుతుంది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పేరు ఏదైతేనేమి దాని దుష్ఫ్రభావాలకు నిత్యం గురి కాబడేది మహిళలే కదా!! ఏంగిల్స్ చెప్పినట్లు స్త్రీలే అత్యధికంగా దోపిడీకి గురి అయ్యేది అన్నది అక్షరసత్యం.

1. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయం వల్ల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. దానివల్ల స్త్రీలకు సరైన పోషణ, ఆహార పదార్థాలు లభించవు. ప్రభుత్వాల నియంత్రణ లేని మార్కెట్ వ్యవస్థలో ప్రతి సరుకూ అధిక ధరలకే విక్రయాలు.

2. స్త్రీని భోగ వస్తువుగా, మార్కెట్ ఎకానమీ పెంచే వాణిజ్యంలో వ్యాపార వస్తువుగా చిత్రణ. దీన్ని వ్యతిరేకించాలి. ఫలితంగా వరకట్న చావులకు పోటీగా, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయి.

3. ఉచిత విద్యుత్, ఉచిత బియ్యం ఇచ్చే పాలకులు… ఉచితంగా నీళ్ళు ఎందు కివ్వరు!! నీటిపై వ్యాపారం చేయుట, 60 ఏళ్ళ స్వరాజ్యానికి సిగ్గుచేటు. పుట్టేబిడ్డపై ఈరోజు12 వేలు అప్పు వుండబోతోందని ఆర్థికవేత్తలంటున్నారు.

ఎడిబి బ్యాంక్ ఆధ్వర్యంలో ఇటీవల మాదాపూర్లో జరిగిన సదస్సులో రెండున్నర వేల మంది ప్రతినిధులు, 70 మందిదాకా ఆసియా అభివృద్ధి బ్యాంక్ డైరెక్టర్లు, 62 దేశాలనుండి అట్టహాసంగా వచ్చి సభలు పెట్టారు- పేదల్ని, పీడితుల్ని ఎలా దోచుకోవాలో మల్లగుల్లాలు పడ్డారు కాని.. సంక్షేమం గురించి ఒక్క ప్రకటనైనా బైటకొచ్చిందా? యీ స్థితినే స్త్రీలు అర్థం చేసుకొని తిరగబడాలి. నూతన ఆర్థిక సంస్కరణలపై లాంగ్ మార్చ్ చేయాలి…

4. హైటెక్ ఇంటర్నెట్ సంస్కృతిలో ముక్కుపచ్చలారని బాలురు, జీవితం అంటే తెలియని టీనేజర్స్ బాలికలు… ప్రేమ, కామం, ముసుగులో విచ్చలవిడితనానికి, వికృత చర్యలకు సిద్ధపడి వావి వరసలు వయస్సును విస్మరించి, అనేక అనర్థాలకు పాల్పడుతున్నారు. ఈ లైంగిక హింసపై స్త్రీలు తిరగబడాలి…

5. మహిళల్ని ఏమాత్రం ఆలోచించనీయని వ్యాపార, వాణిజ్య, మీడియా వర్గాలు.. మధ్యతరగతి వార్ని భ్రమల్లోకి తీసుకెళ్ళి విలాసవంతమైన జీవనం కోసం అడ్డ దారులు తొక్కిస్తోంది యీ ప్రపంచీకరణ.

6. ఫ్యాషన్ ప్రపంచం, అందాల పోటీలు, పాశ్చాత్య నాగరికతపై మధ్యతరగతి మగువల మోజుపెరిగి అనేక అనర్థాలకు గురి అవుతున్నారు. ఈ కుటుంబ వ్యవస్థ, మధ్యతరగతి వ్యవస్థ, చిన్నాభిన్నానికి ప్రపంచీకరణే కారణం.

అరవై ఏళ్ళ భారత స్వాతంత్య్ర ప్రజాస్వామ్య పాలనలో 17 సంవత్సరాలు ప్రధానిగా ఓ మహిళ రాజ్యపాలన చేసింది. (ఇందిరా గాంధీ). ఒక డజను మంది మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేసి రాష్ట్రాల్ని ఏలినారు… ఏలుతున్నారు. మహిళా సాధికారత, స్వేచ్ఛ, సమాన వేతనాలు, సమన్యాయాలు… స్త్రీలపై జరిగే హింసను అరికట్టడంలో ఘోరంగా విఫలమైనాము. 1963లోనే యు.పి. గద్దెనెక్కిన నాటి సుచేతా కృపలానీ, ఒరిస్సాను పాలించిన నందినీ శతపధి, గోవాను పాలించిన శశికళ కాకోద్కర్, ‘అస్సాం’ను పాలించిన ఎస్.ఎ. తైమూర్, తమిళనాడునేలిన నాటి జానకీ రామచంద్రన్, నిన్నటి జయలలితలు, పంజాబ్ నేలిన రాజీందర్ కౌర్ భట్టాల్, యు.పి. నేలిన కుమారి మాయావతి, రబ్రీదేవి (బీహార్), సుష్మాస్వరాజ్, షీలా దీక్షిత్లు (ఢిల్లీ), ఉమాభారతి (ఎమ్.పి), వసుంధరా రాజే (రాజస్థాన్), ఇలా చెప్పుకొంటే గొప్పే కానీ స్త్రీలకు ఒరిగిందేమిటి??

సంపూర్ణ మధ్యనిషేధం, సమాన వేతనం, (పురుషునితో) అందరికీ విద్య, ఉపాధి, వరకట్న నిషేధం, (ఖచ్చితంగా అమలు చేయాలి), లైంగిక హింసకు పాల్పడిన వారిపై శిక్ష, భూపంపిణి, అందరికీ ఇల్లు, చౌకదుకాణాల్లో నిత్యావసర వస్తువులపై ధరల కంట్రోల్, స్త్రీని విలాస వస్తువుగా, చూపే సకల మీడియాపై నిత్యపోరాటం, కాలేజీల్లో రాగింగ్కు వ్యతిరేకంగా ఉద్యమించడం, ఈవ్ టీజింగ్కు వ్యతిరేకంగా సంఘటిత మహిళా పోరాట ఉద్యమం – గ్రామీణ మహిళల ఉపాధి, విద్య, వైద్య, సదుపాయాలు, సంవత్సరకాలమంతా పని కల్పించే ఉపాధి కార్యక్రమాలకై అన్ని వర్గాల స్త్రీలు.. ఏకమై ముఖ్యంగా ప్రపంచీకరణ పద్ధతులపై , పీడనపై పెద్ద ఎత్తున ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం లాంటి మహోద్యమం నిర్మించాలి. అప్పుడే స్త్రీ జాతికి విముక్తి, సౌఖ్యం లభిస్తాయి. విశ్వసుందరులు, అందాలపోటీల కిరీట ధారుణులు, కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే హైటెక్ సొసైటీ స్త్రీలు, బహుళ జాతి సంస్థలకు వాణిజ్య మార్కెట్కు అంగాంగ ప్రదర్శనలిచ్చే అతివలు కారాదు మనకు ఆదర్శం.

ఓ విమలారణదివే, ఓ సుశీలా గోపాలన్, ఓ… సంధ్య, ఓ.. నిర్మలక్క, ఓ స్నేహలతారెడ్డి, ఓ మల్లు స్వరాజ్యం… లాంటి మహిళామణులు కావాలి మనకు ఆదర్శం. నిరంతర చైతన్యపూరితంగా మన సమస్యలపై మనమే పోరాడాలి. ప్రపంచీకరణ విధానాల్ని తిప్పి కొట్టాలి…

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో