కంచుమోగినట్టు కాకి రెట్ట ఇక మోగదా…?

కొండేపూడి నిర్మల
చాలా ఏళ్ళ క్రితం అదేదో గ్రామంలో పిడుగు శబ్దానికి ఒక బధిరుడికి మాట వచ్చిందనే వార్త చదివాం.పెద్దగా ఏమీ ప్రాధాన్యత లేకుండా జిల్లా ఎడిషన్‌లో అంగుళం మేర వచ్చిన ఆ వార్త నన్ను సంతోషిించాలో, విచారించాలో తెలీని స్థితిలో పడేసింది.
బంగారంలో ఇరీడియమ్‌ కలుస్తోందని అది చిమ్ముతున్న రేడియంద్వారా చర్మవ్యాధులనుంచి,  బ్రెయిన్‌ ట్యూమర్‌ దాకా ఏదయినా సోకవచ్చవని నిన్న పొద్దున్న తెలిసిన సమాచారంతో మళ్ళీ అదే స్థితి గుర్తొచ్చింది.
ఒక పక్క తెరిపి, కనీసం ఇప్పటికైనా మనుషులకి పట్టిన బంగారం పిచ్చి తగ్గుతుందేమో అని… ఇంకోపక్క ఆందోళన, ఔషధాల్లో కలిసిపోయి ఎందరి రక్తంలో ఈ విషం చిందులేస్తోందో ఏమో అని…
అయితే ఈ ప్రమాదమంతా, కొత్త బంగారానికేనట, పాత బంగారానికేం ఢోకా లేదట. ఓల్డ్‌ ఈజ్‌ ఆల్వేస్‌ గోల్డ్‌ అనేది ఇలా కూడా రుజువైంది. అవధులు మించి డిమాండు వున్నప్పుడే కల్తీకి మార్గాలు వెతకడం మొదలవుతుందని మనకి తెలుసు. ఈనాటి యువతరం ధరిస్తున్న బంగారు నగలకు కోలారు గనులు చాలడం లేదేమో…నగల వర్తకుల దృష్టిి కల్తీ మీద పడింది. వచ్చే జన్మలో మంచి మొగుడు రావడం కోసం నూట పదహారు బంగారు పుష్పాలు కొనుక్కున్న మా వదిన, సువర్ణ సుందరి మనస్థితి ఎలా వుందో?.. వాటిని ప్రదర్శించడానికి ఊరంతటినీ పిలుచుకుని లక్ష వత్తుల నోము కూడా ఈ నెలాఖరు నాటికి తలపెట్టింది. వూరు దాటి పారిపోయినా గాని చెప్పపెట్టకుండా ఎప్పుడో తలుపు తట్టి వాయనం ఇచ్చేసే అలవాటు తనకుంది.
హమ్మయ్య ఇంక నేను ఆవిడ్ని దొంగ నవ్వులతో మెచ్చుకోలేక, మాడు మొహంతో గమ్మున వుండలేక రోత పడక్కర్లేదు. నీ ఇరీడియం గొలుసులు, గండ పెండేరాలూ ఎంత బావున్నాయబ్బా ఆహా…ఓ హో..” అనడం ద్వారా కక్ష తీర్చుకోవచ్చు.
మెళ్ళో గొలుసుని చూసి కూర్చోడానికి కుర్చీ వేసే హీన సంస్కృతి ఇకనయినా తగ్గుతుందేమో…అన్ని సందర్బాలకీ పుత్తడి ముద్దల్నే కొనుక్కుంటూ వొంటిని పిడకలు తట్టిన గోడలా మార్చుకున్న మా ప్రసూన ఏమయిపోతుందో…మతాంతర వివాహం చేసుకున్న ఎదురింటి మేరీని సతాయించడానికి వాళ్ళత్తకి ఒక కారణం తగ్గిపోతుందోమో..
క్షమించాలి. ఇది చాలా మంది అభిరుచులకీ, ప్రేమ ప్రకటనలకీ, ప్రపంచాలకీ సంబంధించిన అంశం కావచ్చు.
కానీ మైటాస్‌ రాజు కధలో ఏం జరిగింది…? పట్టినదంతా బంగారం కావాలని ఆ రాజు కోరుకున్నాడా లేదా…? దాహానికి నీరందుకుంటే ద్రవబంగారం, ఆకలేసి అన్నం ముద్ద చేతిలోకి తీసుకుంటే అది ఘన బంగారం, కోరికతో భార్యని ముట్టుకుంటే అది బొమ్మ బంగారం, కడుపునొప్పి చేసి మరుగుదొడ్డికి పరిగెడితే అక్కడ..? అంతా… బంగారమే…
”బం..గా..రం..మీ..కోసం..”అంటూ నగల భోషాణంలా నడ్డితిప్పుతున్న అభినవ తారను చూసినప్పుడు మనలో ఎంతమందికి కడుపులో గిర గిర తిప్పలేదు…?
అతి ఏదయినా వికారమే.. అందుకు విరుగుడే ఈ వార్త..నా సంతోషానికి కారణం ఇది కావచ్చు. ఇది ప్రకటించకుండా దాచుకోవడం నా వల్ల కాదు. కేవలం పదేళ్ళలో ఎంత మార్పు వచ్చింది. ఎంత భావ దారిద్రం పిల్లలకి పట్టుకుంది. యుద్దానికి వెడుతూ భార్యల మానానికి రాజులు బిగించిన ఇనుప కచ్చడాలే సిగ్గు బిళ్ళలుగా మారాయని మొత్తుకున్న తాపీ ధర్మారావు లేడు. బంగారాన్ని పశువుల సంకెళ్ళతో పోల్చిన నిరాడంబర సౌందర్యవతులు కనబడ్డం లేదు. నిరలంకారం మనిషి వ్యక్తిత్వంగా కాక కేవలం మతానికి పరిమితమై మిగిలిపోతుంటే, సాప్ట్‌ వేర్లూ, హార్డ్‌వేర్లు కూడా అత్తింటి ఆరళ్ళ నుంచి రక్షించుకోవడానికి బంగారాన్ని బుల్లెట్‌ ప్రూఫ్‌గా వాడుతుంటే…జీవితం ఎన్ని బానిస స్వర్గాల మధ్య తెల్లారిపోతోందో… ఆ కడుపు మంటలోంచి వచ్చిన సంతోషం కావచ్చు. స్వరాజ్య నిధి కింద పుస్తెల తాడుతో సహా అర్పించిన కమ్యూనిస్టు ఇల్లాళ్ళ కడుపున పుట్టిన పిల్లల చేతుల మీద గజ్జి కురుపుల్లా సలపరిస్తున్న ఉంగరాల్ని చూశాక ఆ వేదనలోంచి వచ్చిన సంతోషం కావచ్చు. ఏది ఏమయినా నాకొక సీక్రెట్‌ ప్లెజర్‌ (గుప్త సంతోషం అనాలా..) దొరికిపోయింది. పాపం బాలీవుడ్‌ తార కోర దంతం మీద అతకడానికి కల్తీలేని బంగారం ఎలా దొరుకుతుందో…తిరుపతి గోడల్ని పచ్చపరచడానికి ఎంత ఇరీడియం కావాలో…అన్నీ సమస్యలే కదా. గుండె పగిలే సమస్యలు. వీటిని పరిష్కరించడానికి తప్పనిసరిగా మార్గం దొరుకుతుంది. నిషా పెరుగుతుంది. ఎందుకంటే ఇది జల కాలుష్యం కాదు. వాయు కాలుష్యం కాదు. నిర్లిప్తంగా వుండటానికి. పేదల మాన ప్రాణాలు అసలే కాదు. చంద్రహారాలకూ, సూర్యహారాలకూ సంబంధించిన సమస్య. ప్రజాధనంతో మట్టి విగ్రహాలకు భారీ ఎత్తున పెళ్ళిళ్ళు చేస్తూ, ముత్యాల తలంబ్రాలు అందించే ముఖ్యమంత్రి చిరునవ్వు సమస్య.
ఒప్పుకుంటున్నాను కల్తీ ఎప్పుడయినా కుట్రే. దాన్ని ఎవరూ స్వాగతించడం లేదే. ఇవ్వాళ బంగారంలో జరిగింది. మొన్న సారాయిలో కలిసింది. ఇంకో పక్క మానవ సంబంధాల్లో జరిగింది. దేనికి ఎంత స్పందించాలి అనేది మన ప్రాధాన్యతలకి సంబంధించిన విషయం. విషాదం ఏమిటంటే ఇవాళ మన ప్రాధాన్యతల్లోనే కల్తీ జరిగింది.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.