”అభివృద్ధికి ఆవలి వైపు”

కొండవీటి సత్యవతి
”సతీష్‌!”
పరధ్యానంగా నడుస్తున్న నేను ఠక్కున ఆగిపోయాను.
ఆమె వేపు పరిశీలనగా చూసాను. చెట్టు నీడలో నిలుచుని వుంది. స్పష్టంగా కనబడడం లేదు.
”ఎవరు మీరు?”
” మళ్ళీ ఒకసారి చూడు” అంటూ వెలుతురులోకి వచ్చింది.
”చంద్రకళా! నువ్వా?
”హమ్మయ్య! గుర్తు పట్ట్టావా? నువ్వ లాగే వున్నావ్‌.”
”నువ్వు చాలా మారిపోయావ్‌? ఏమైంది?”
”ఏం చెప్పమంటావ్‌?”
”శంషాబాద్‌ నుంచి ఇక్కడికెందు కొచ్చావ్‌?”
”ఇప్పుడక్కడేమీ లేదు.”
”మీ ఇల్లుందిగా.కొండలదగ్గర”
”ఇపుడు ఆ ఇల్లు లేదు”
”ఏమైంది అమ్మేసారా?”
””కూల్చేసారు”
”కూల్చేసారా? ఎవరు?”
”అక్కడ ఎయిర్‌పోర్ట్‌ వచ్చిందిగా”
”అయితే! కాంపన్‌సేషన్‌ వచ్చుంటుం దిగా. ఎయిర్‌పోర్ట్‌ మీ ఇంటిదాకా వచ్చిందా?”
”ఆ..వచ్చింది.కోట్లోచ్చాయి ఇంటికి, పొలానికి”
”మరి??”
”ఆ డబ్బు తీసుకుని మా ఆయన పారిపోయాడు.”
”పద ఇంటికెళదాం. ఇంటికెళ్ళి మాట్లా డుకుందాం”. చంద్రకళ ఏం మాట్లాడకుండా కార్లో కూర్చుంది.
బిబిబి
సరిగ్గా పదేళ్ళయింది చంద్రకళని చూసి. నేను నా చదువు పూర్తవ్వగానే యు.ఎస్‌ వెళ్ళిపోయాను. మంచి ఉద్యోగం చేస్తూ చాలా సంపాదించాను. ఇండియాకి తిరిగొచ్చి ఆరు నెలలవుతోంది. అక్కడ సంపాదించిన సొమ్ముని ఏ బిజినెస్‌లో  పెట్టాలా, ఎలా దాన్ని రెట్టింపు చెయ్యాలనే ఆలోచనల్లో మునిగి తేలుతున్నాను. అమెరికా వెళ్ళక ముందు హైటెక్‌ సిటీలో ఉద్యోగం చేసేటపుడు చంద్రకళతో పరిచయమైంది. నాకొలీగుకి  అక్క వరుసయ్యే ఆమెను మొదటిసారి వాళ్ళింట్లోనే చూసాను. ఆమె భర్త ఆ ప్రాంతంలో ఛోటా రాజకీయనాయకుడు. ఎప్పుడూ రాజకీయాల్లో మునిగి తేలుతుండే వాడు.
చంద్రకళ పేరుకు తగ్గట్టే వుండేది. చాలా అందంగా, హుందాగా వుండేది. నా కొలీగు శంకర్‌ మొదటిసారి వాళ్ళింటికి తీసుకెళ్ళినా ఆ తర్వాత నేను చాలా సార్లు ఒక్కణ్ణి వెళ్ళేవాణ్ణి. ఎందుకో తెలియని ఆత్మీయత ఏర్పడింది ఆమెతో. ఆమె భర్త అసలు ఇంటి పట్టున వుండేవాడు కాదు. నాకన్న అయిదారేళ్ళ పెద్దదే అయినా చంద్రకళ చూడ్డానికి అలా వుండేది కాదు. నాకు ముందూ వెనకా ఎవరూ లేరు. ఆమె చూపించే ప్రేమకు కరిగిపోయేవాడిని. ఆ ప్రేమకి ఏం పేరు పెట్టాలో కూడా నాకూ తెలియదు. నా ఏకాకి జీవితంలో ఆమె పరిచయం ఓ నిండుతనం చేకూర్చి నట్టయ్యేది. అలాంటి చంద్రకళ ఇపుడిలా…
బిబిబి
చంద్రకళ వెక్కి వెక్కి ఏడుస్తోంది. నా ఫ్లాట్‌ లోని హాల్లో సోఫా మీద కూర్చుని చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది. నేను ప్యాక్‌ చేయించి తెచ్చిన బిర్యానీ అలాగే పడి వుంది.ఎంత అడిగినా తినలేదు. ”ప్లీజ్‌ ! వూరుకో..చంద్రకళా!”.
వెంటనే లేచివెళ్ళి సింక్‌ దగ్గర ముఖం కడుక్కుంది. అద్దంలో ముఖం చూసుకుంటూ నిలబడింది. నేను డైనింగు టేబుల్‌ మీద ప్లేట్‌ పెట్టి, బిర్యానీ ప్యాకెట్‌ విప్పి హాట్‌ప్యాక్‌లో వేసాను. నిశ్శబ్దంగా వచ్చి కూర్చుంది.
”నువ్వు నన్ను గుర్తు పట్టడం నాకు చాలా ఆశ్చర్యంగా వుంది.”
”ఎందుకు గుర్తు పట్టను? పదేళ్ళలో ఏమంత మార్పు వస్తుంది.”
”ఏమంత మార్పు వస్తుందా? నా జీవితంలో ఎన్ని మార్పులొచ్చాయో చూస్తున్నావుగా. పది సంవత్సరాలలో నా బతుకు తలకిందులై పోయింది.
”అదే నాకూ ఆశ్చర్యంగా వుంది. శంకరేమయ్యాడు.”
”చనిపోయాడు యాక్సిడెంట్‌లో”
”నిజమా!నాకు తెలియదే’!
”బైక్‌ యాక్సిడెంట్‌లో స్పాట్‌లో పొయ్యాడు. పెళ్ళయిన రెండేళ్ళకి జరిగింది.”
”సో. సాడ్‌”
కడుపు నిండా   బిర్యానీ  తిన్నది చంద్రకళ. నేను ఆమెనే చూస్తు వున్నాను.
”నీ గురించి చెప్పు. పెళ్ళి చేసు కోలేదా?”
”చేసుకున్నాను. డైవోర్స్‌కూడా అయిపోయింది. అమెరికాలోనే”.
”అవునా? ఎందుకు? నీకు డైవోర్స్‌ ఇచ్చిన మనిషిని ఏమనాలి?
”ఏం ఎందుకలా అన్నావ్‌”
”నువ్వు చాలా బుద్ధిమంతుడివి. మంచివాడివి”
”ఈ పదేళ్ళలో మారిపోవచ్చుగా.”
”నేను నమ్మను”
”అది సరేగాని చంద్రకళా! మీ ఆయన మీద పోలీస్‌ రిపోర్ట్‌ ఇవ్వలేదా?
”ఏమని ఇవ్వను? ఇవ్వలేదు. నీకు తెలియదు. నాలాగా ఎందరో ఇల్లూ, వాకిలి పోయి రోడ్డున పడ్డారు. నడమంత్రంగా వచ్చిన డబ్బుల్తో మగాళ్ళు జల్సాలు  చేసారు. బండ్లు, కార్లు కొన్నారు. భార్యా పిల్లల్ని వదిలేసి రెండో పెళ్ళి చేసుకున్నవాళ్ళున్నారు. మా ఆయన కూడా రెండోపెళ్ళి చేసుకుని హైదరాబాద్‌లోనే ఫ్లాట్‌ కొని వుంటున్నాడని తర్వాత తెలిసింది.”
”ఇది చాలా అన్యాయం! మీ ఊరెంత బావుండేది. ఆ కొండలు, గులాబీ, కనకంబారాల తోటలు. అసలు ఆ చుట్టు పక్కలన్నీ పూలు, పండ్ల తోటలే కదా!”
”నీకు బాగానే గుర్తుంది. ఎయిర్‌పోర్ట్‌ భూతంలా ఆ తోటల్ని మింగేసింది. మా బతుకుల్ని కుక్కలు చింపిన విస్తర్లు చేసింది.” చంద్రకళ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.
ఎయిర్‌ఫోర్ట్‌ అనగానే నాకు ఠక్కున గుర్తొచ్చింది. పన్నెండింటికి ఎయిర్‌పోర్ట్‌ కెళ్ళాలి. లండన్‌ నుంచి కజిన్‌ వస్తున్నాడు. వాడిని రిసీవ్‌ చేసుకోవాలి.
”చంద్రకళా! మీ ఇల్లెక్కడ చెప్పు. నిన్ను డ్రాప్‌ చేసుకుంటూ నేను ఎయిర్‌పోర్ట్‌ కెళతాను. ఒంటిగంటకి తమ్ముడొస్తున్నాడు.”
”మా ఇల్లా? మెహదీపట్నంలో దింపెయ్‌. నేను వెళ్ళి పోతాను…”
”ఇంకా టైముందిలే. నిన్ను మీ ఇంటి దగ్గర వదిలేస్తాను.”
”నేను  నీతో ఎయిర్‌పోర్ట్‌కు రావొచ్చా. ఎపుడూ చూళ్ళేదు.”
”ఎయిర్‌పోర్ట్‌కా? ఒ.కె. రావొచ్చు. కానీ…”
”వద్దులే సతీష్‌. ఊరికే అన్నాను.”
”ఒక్క నిమిషముండు.” అని చెప్పి అనిల్‌ అనే మరో కజిన్‌కి ఫోన్‌ చేసి నాకు అర్జంటు పని వుందని, తనని ఎయిర్‌పోర్ట్‌ కెళ్ళమని చెప్పాను. ”అదేంటి? నా గురించి నువ్వు ఎందుకు మానేస్తావ్‌.?”
”నేనే వెళ్ళక్కరలేదులే వాడికోసం. టాక్సీ  తీసుకునయినా వెళ్ళి పోతాడు. యుఎస్‌ వెళ్ళాక పదేళ్ళ వరకు నేను ఇండియా రాలేదు. నువ్వెపుడూ జ్ఞాపకమొస్తూనే వుండేదానివి. ఎయిర్‌ పోర్ట్‌లో మీ భూములు పోయినా నష్టపరిహారమొచ్చి వుంటుంది హాయిగా వున్నావనుకున్నాను. నిన్నిలా చూడ్డం నాకు చాలా బాధగా వుంది.”
”అవన్నీ గుర్తు పెట్టుకోవడం నీ మంచి తనం. నీ కోసం ఏమి చేసానని అంత అభిమానం? కట్టుకున్నవాడికే ఏమీ లేకుండా పోయింది.”
”నాకోసం నువ్వేం చేసావో నాకే తెలుసు చంద్రకళా! వెళ్ళదామా”
”పద వెళదాం”.
”ఫ్లాట్‌కి తాళం వేసి లిఫ్ట్‌లో కిందికి దిగాం. వాచ్‌మెన్‌ చంద్రకళని ఎగాదిగా చూస్తున్నాడు. అదేం పట్టించుకోకుండా కారు బయటకు తీసాను. కారు పి.వి. నర్సింహారావ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్ల్తె ఓవర్‌ మీద రయ్‌మంటూ వెళు తోంది. చంద్రకళ కునికిపాట్లు పడుతోంది.
”నిద్రపోతున్నావా?”
”ఉదయం నించీ ఏమీ తినలేదు. కడుపునిండా బిర్యానీ పెట్టావుగా నిద్ర వస్తోంది.”
”ఏమి తినలేదా? ఎందుకని?”
”డబ్బుల్లేవు. ఇంట్లో ఏం లేవు.”
నాకు తెలియకుండానే నా కాలు బ్రేకు మీద పడింది. సడన్‌గా కారు ఆపేసరికి వెనక కారు కిర్రుమంటూ ఆగింది.
సారీ చెప్పి కారు ముందుకి పోనిచ్చాను. ”అదేంటి? ఇంత పెద్ద నగరంలో నీకు అన్నం పెట్టే ఫ్రెెండ్స్‌ లేరా?
”ఫ్రెండ్స్‌? నాలాంటి వాళ్ళకి ఫ్రెండ్సెవరుంటారు.”
”డోంట్‌ సే లైక్‌ దట్‌ ప్లీజ్‌!”
”నేను నిజం చెబుతున్నాను సతీష్‌! నీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం మేంటి చెప్పు! మా ఆయన వదిలేసి పోయాక సిటీలో కొచ్చి ఇండ్లల్లో బాసాన్ల పనిచేసాను. ఒకరింట్లో వంట చేసాను. వాళ్ళే ఇంట్లో గది ఇచ్చారు. ఓ అర్ధరాత్రి ఇంటాయన నా గదిలో కొచ్చి నా మీద అత్యాచారం చేసాడు. డబ్బిచ్చి లొంగదీసుకునేవాడు. నేను మొదట్లో ప్రతిఘటించినా తర్వాత లొంగిపోయాను.  ఆ తర్వాత అతని భార్యకి తెలియడంతో పెద్ద గొడవైంది. నన్ను వెళ్ళగొట్టేసారు. నేను మళ్ళీ రోడ్డున పడ్డాను.”
కారు ఫ్లై ఓవర్‌ దిగి హైవే మీది కొచ్చింది. ”నీకు ఎక్కడా ఉద్యోగం దొరక లేదా?”
”ఉద్యోగమా? నా చదువుకి ఉద్యోగమెవరిస్తారు? అయినా అదీ అయ్యింది. ఓ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌లో సేల్స్‌గరల్‌గా చేరాను. ఉదయం నుంచి సాయంత్రం దాకా చాకిరీ. ఓ చిన్న గదిలో అద్దెకుండేదాన్ని. నాతోపాటు పనిచేసే మనిషిి ఓ రాత్రి ఫుల్‌గా తాగొచ్చి నా రూమ్‌లో చొరబడ్డాడు. అతన్ని బయటకు గెంటి, మర్నాడు కంప్లయింట్‌ ఇస్తే నా ఉద్యోగం పీకేసారు.”
కారు శంషాబాద్‌ దగ్గర ఎడంవేపు తిరిగింది. దూరంగా ధగద్ధగాయమానంగా వెలిగి పోతున్న ఎయిర్‌ఫోర్ట్‌. రోడ్డుకి అటూ ఇటూ పచ్చటి తివాచీ పరిచినట్టు గడ్డి. రకరకాల పూల మొక్కలు వాటి మధ్య అమర్చిన లైట్లలో వెలిగిపోతున్న పరిసరాలు.
”మా ఊరు ఎక్కడుందో ఎలా తెలుస్తుంది?” అంది హఠాత్తుగా చంద్రకళ.
”మీ ఊరా? ఇపుడిక్కడ ఊర్లేమీ లేవనుకుంటాను.”
”మా ఊరు నీకు గుర్తుందా? సతీష్‌?”
”ఎందుకు గుర్తుండదు? మీ పొలాలు, పూలతోటలు అన్నీ గుర్తున్నాయి. నువ్వు జొన్న రొట్టె, నాటుకోడి పులుసు భలే చేసేదానివి.”
”మా పూలతోటలు పీకేసి ఇవేంటో పూలు పెట్టారు. ఎకరాలకి ఎకరాల గులాబీ తోటలు ఏమైపోయాయో!”
”ఇవన్నీ ఆర్టిఫీషియల్‌గా డెవలప్‌ చేసారు. ఆ ఖర్జూరం చెట్లు చూసావా? ఎడారుల్లో పెరుగుతాయి.”
”మా ఊరిని ఎడారే చేసారు. ఇక్కడ బోలెడన్ని తాటి చెట్లుండేవి. అవన్నీ పెకిలించేసారన్నమాట.” ”నాకు మా ఊరు, ఇల్లు గుర్తొస్తున్నాయ్‌. ఈ ఎయిర్‌పోర్ట్‌ వల్లనే కదా నా బతుకిలా అయ్యిందనిపిస్తోంది. ఇది రాకపోతే మా భూములుపొయ్యేవి కాదు. అంత ధర వచ్చేది కాదు. ఆ డబ్బుతో నా మొగుడు పరారయ్యేవాడే కాదు. దీని కింద నాలాగా ఎంతమంది నాశనమయ్యారో చంద్రకళ గొంతు దు:ఖంతో పూడుకు పోయింది.
కారు యూ టర్న్‌ తీసుకుని వెనక్కి తిరిగింది. చంద్రకళ లైట్ల వెలుతురో వెలిగిపోతున్న ఎయిర్‌పోర్ట్‌వేపు దీర్ఘంగా చూస్తూ కూర్చుంది.
నేనూ ఏమీ మాట్లాడకుండా కారు నడుపుతున్నాను. తనని ఎక్కడ దింపాలా అని ఆలోచిస్తున్నాను. నా మనసులో మాట కనిపెట్టినట్టు
”నన్ను మెహదీపట్నంలో దింపెయ్‌.”
”సరే. మళ్ళీ ఎప్పుడు కలుస్తావ్‌”.
”ఏమో!”
”మీ ఇల్లు చూపించు నేనే వస్తాను.”
”వద్దులే. నేను ఫోన్‌ చేస్తాను.
చంద్రకళని మెహదీపట్నంలో దింపేసి, తప్పకుండా ఫోన్‌ చెయ్యమని చెప్పి నా నంబర్‌ రాసిచ్చి నేను నా కజిన్‌ ఇంటికి బయలుదేరాను.
బిబిబి
అమెరికా నించి తిరిగొచ్చాక ఏదైనా బిజినెస్‌ మొదలు పెట్టాలనే ఆలోచనలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను. నా ఫ్రెండ్‌ అన్వర్‌ కూడా నా తో కలవాలని అనుకుంటున్నాడు. ఇద్దరం కలిసి ఏదైనా సాఫ్ట్‌వేర్‌ కంపెనీని  ప్రారంభిస్తే  ఎలా  వుంటుందని తర్జనభర్జనలు చేసున్నాం.
నేను అన్వర్‌తో మీటింగులో వున్న సమయంలో చంద్రకళ ఫోన్‌ చేసింది. ఆమెని ఆ రోజు మెహదీపట్నంలో దింపేసాక ఒకటి రెండుసార్లు మాట్లాడింది.
”సతీష్‌! ఒకసారి సికింద్రాబాద్‌ స్టేషన్‌ దగ్గరకొస్తావా?”
”స్టేషన్‌కా? ఎందుకు ఊరెళు తున్నావా?”
”లేదు ఊరెళ్ళడం లేదు. నీతో మాట్లాడాలి.” ”స్టేషన్‌ దగ్గర ఎక్కడుంటావ్‌”?
”మహంకాళి పోలీస్‌స్టేషన్‌ కాడికి రా”
”పోలీస్‌ స్టేషన్‌లో ఎందుకున్నావ్‌? ఏమైంది?”
”పోలీసులు పట్టుకొచ్చారు. మామూ లుగా అయితే కొంచెం సేపుంచి ఒదిలేస్తారు. ఎస్‌.ఐ ఒదలనంటున్నాడు. నాతో పాటు మరో పదిమందున్నారు.”
”సరే నేను ఎస్‌.ఐతో మాట్లాడతానులే. డబ్బు కోసం అయ్యుంటుంది. నేను వస్తానులే.”
అన్వర్‌ నా వేపు వింతగా చూడ్డం గమనించి
”అన్వర్‌! రేపు మాట్లాడుకుందాం. నేను అర్జంటుగా వెళ్ళాలి.”
బిబిబి
చంద్రకళతో సహ మరో పదిమందిని  విడిపించి బయటకొస్తుంటే
”సతీష్‌! చాలా థాంక్స్‌. మా ఆఫీసు చూస్తావా?”
”మీ ఆఫీసా? ఉద్యోగం దొరికిందా? చెప్పలేదేం.”
”మా సంఘం ఆఫీసు ఇక్కడికి దగ్గరే.”
”సంఘమా! ఏం సంఘం?” నా ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది.
”సెక్స్‌ వర్కర్ల సంఘం.”
”మీకు ఒక సంఘం కూడా వుందా? నాకంతా అమోమయంగా వుంది.”
సీతాఫల్‌మండివేపు వెళుతున్నాం. స్రవంతి మహిళామండలి అని బోర్డు పెట్టిన ఇంటిముందు ఆగాం.
చంద్రకళ ముందు నడుస్తుంటే నేను ఆమెను అనుసరించాను.
ఇంటిలోపలికెళ్ళాం. చాలామంది ఆడవాళ్ళున్నారు. ఏదో మీటింగు జరుగుతోంది. అక్కడ వున్న ఆడవాళ్ళంతా సెక్స్‌వర్కర్లంటే నాకు నమ్మకం కలగలేదు. నాకు తెలియని ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్లనిపించింది.
సంఘం ప్రెసిడెంట్‌ని పరిచయం చేసింది. ఆవిడపేరు కనకదుర్గ. తన రూమ్‌లో కూర్చుందామని తీసుకెళ్ళింది.  గోడల నిండా పోస్టర్లు అతికించివున్నాయి. సెక్స్‌వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలమీద ఎక్కువ పోస్టర్లు కనబడుతున్నాయి. ”మా వాళ్ళని విడిపించి నందుకు చాలా ధాంక్సండి. నేను వెళ్ళి అడిగితే ఒదలనన్నాడు. రేపు కోర్టులో అందరికీ ఫైన్‌ కట్టాలంటే కష్టం.” అంది.
”ఈయన పేరు సతీష్‌. నేను శంషా బాద్‌లో మా ఇంట్లో వుండేటపుడు పరిచయం. చాలా మంచివాడు” అని నన్ను పరిచయం చేసింది.
”అవునా? నిజంగానే మీరు చాలా గొప్ప వారులా వున్నారు. లేకుంటే ఈ ఆఫీసు చుట్టు పక్కలకి ఎవరూ రారు.”
”అబ్బే! అలాంటిదేమీ లేదు. చంద్రకళ కష్టంలో వుంటే వచ్చాను. ఇలాంటి సంఘం ఒకటుందని నాకు తెలియదు.”
”మా సంఘంలో ఐదువేలమంది సభ్యులున్నారు.”
”ఐదువేలమందా?” ఆశ్చర్యపోయాను.
”మీకో విషయం తెలుసా? సికింద్రా బాద్‌ చుట్టూ పదివేలమంది ప్రతిరోజూ బిజినెస్‌ చేస్తూ బతుకుతారు.”
”నిజంగానే”
”అబద్ధం ఎందుకు చెబుతాను. ఎంతో మంది వేరేదారి లేక ఈ వృత్తిలోకి వస్తుంటారు. నిత్యం పోలీసులు, గుండాల దాడుల్లో నలుగుతుంటారు. అరెస్టులు, కేసులు, మాకు సమస్యలకేం కొదువలేదు.”
”మరెందుకు ఈ వృత్తిలోకి వస్తుంటారు. వేరే పనేదైనా చేసుకోవచ్చుగా.”
”ఆ మాట అందరూ చాలా తేలిగ్గా అనేస్తారు. చంద్ర మీకేమీ చెప్పలేదా? తను అన్ని చేసే కదా చివరికి ఇక్కడి కొచ్చింది. కొందరి జీవితాలు ఎంత నికృష్టంగా వుంటాయో మీకు తెలియదు. వాళ్ళకి ఈ వృత్తే తిండి పెడుతుంది. లేకపోతే ఆకలికి మాడి చావాల్సిందే!”
”అసలు ఇన్ని వేలమంది ఎందుకొస్తున్నారు ఇందులోకి”
”మీ మగవాళ్ళ వల్లే. క్షమించు        సతీష్‌. ఇలా అంటున్నందుకు . మా ఆయన నన్ను రోడ్డు మీద ఒదిలేసిపోయాడు. ప్రేమ పేరుతో వంచించి తెచ్చి ఇక్కడ అమ్మేస్తారు. చాలా మంది పల్లెల్నుంచి పనివెతుక్కుంటూ వచ్చి పనులు దొరక్క ఇందులో తేలు తుంటారు. ఎవ్వరు ఇష్టంతోనైతే రారు. బతకడానికి, చాలాసార్లు పిల్లలికి తిండి పెట్టడానికి కూడా ఇక్కడికొస్తుంటారు. నేను బతికిన బతుకేంటి? ఇపుడు నా స్థితేంటి? సతీష్‌! ఈ బురదలోకి ఒకసారి వస్తే ఇంక అంతే!”చంద్రకళ అంది.
నా తల తిరుగతున్నట్టుగా వుంది.
”మగవాళ్ళు మాకెంత ద్రోహం చేసి తెచ్చి ఈ మురికిలో పడేసినా మేం వాళ్ళ బాగుకోసం, వాళ్ళకి హెచ్‌.ఐ.వి. రాకుండా కండోమ్‌లు పంచుతాం తెలుసా! ఇదిగో ఈ ఫోటోలు చూడండి. ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ వాళ్ళతో కలిసి హెచ్‌ఐవి అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నాం.”
ఆ ఫోటో చూసి మరింత ఆశ్చర్య పోయాను. అందులో చంద్రకళ కూడా వుంది.
”మీకు తెలియదు. మా దగ్గర కొచ్చే వాళ్ళని కండోమ్‌ వాడమని చెప్పినందుకు మేమెన్ని దెబ్బలు తింటామో! వాళ్ళకి, మాకూ సురక్షితమని చెప్పినా విన్పించుకోరు. డబ్బిస్తున్నాం కాబట్టి వాళ్ళ కిష్టమైనట్టు ఉండాలంటారు.భయంకరంగా కొడతారు.”కనకదుర్గ అంది. మళ్ళీ తనే ”ఎలాగూ ఇంతమంది ఆడవాళ్ళు ఈ వృత్తి మీద బతుకుతున్నారు. సంఘం పెట్టుకుంటే బావుంటుందని నేనే దీన్ని మొదలుపెట్టాను. ఇది పెట్టాక మా స్థితి కొంత నయం. పదండి. మీటింగులో కూర్చుందాం” అంటూ కుర్చీలోంచి లేచింది.
”సతీష్‌! వుంటావా? పనేమైనా వుందా?”
”ఫర్వాలేదులే” అంటూ వాళ్ళ వేపు నడిచాను.
మీటింగు హాల్లో సీరియస్‌గా చర్చ సాగుతోంది. రౌడీల ఆగడాల గురించి, పోలీసుల వేధింపుల గురించి, పిల్లల చదువుల గురించి ఒకామె మాట్లాడుతోంది.
”నేను ఈ వృత్తిలో వున్నట్లు మా పిల్లలకి తెలియదు. నా మొగుడు నన్ను ఇద్దరు  పిల్లల్ని వదిలేసి రెండో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయాడు. పిల్లల్ని హాస్టల్‌ పెట్టాను. నా శరీరమే పెట్టుబడిగా సంపాదించి వాళ్ళని చదివిస్తున్నాను. ఇలా ఎంత కాలం జరుగు తుంది? పిల్లలకి తెలిస్తే ఏమావుతుందోనని నాకు చాలా భయంగా వుంటుంది. నాకేమైనా అయితే… ” ఆవిడ కళ్ళల్లోంచి నీళ్ళు కారుతున్నాయి.
”నా మొగుడు మేస్త్రీ పనిచేస్తూ కిందపడి నడుములిరక్కొట్టుకుని మంచంలో పడ్డాడు. కొన్నాళ్ళు ఇళ్ళల్లో పనిచేసాను. ఒకామె పరిచయం ఇందులోకి తెచ్చింది. నేను ఉద్యోగం చేసి డబ్బు  తెస్తున్నానని మా ఇంట్లో చెప్పాను. మా అత్తకి నా మీద అనుమానమే. పోలీసులు అరెస్ట్‌ చేస్తే ఎలా అని నాకెపుడూ బెంగగా వుంటుంది.”
అక్కడ విన్పిస్తున్న ఆడవాళ్ళ కథలన్నీ అలాగే వున్నాయి. హృదయం ద్రవించి పొయేలా చెప్పుకుంటున్నారు. అక్కడున్న వాళ్ళల్లో ఎక్కువ శాతం ట్రాఫికింగుకి గురయిన వాళ్ళని నాకు అర్ధమైంది. కొంతమంది వలస వచ్చినవాళ్ళు, ప్రేమ వంచితులు కూడా వున్నారు.
ఇంక నేను వెళతానని సైగ చేసాను. చంద్రకళ లేచి వచ్చింది. కనకదుర్గకు చెప్పి ఇద్దరం బయటకు నడిచాం.
బిబిబి
నాకు తెలియని ఈ భయంకర ప్రపంచం గురించి వింటుంటే నా వొళ్ళు గగుర్పొడుస్తోంది.
హైదరాబాద్‌ చాలా మారిపోయిందని, ఈ పదేళ్ళలో ఎంతో అభివృద్ధి సాధించిందని నేను భ్రమ పడ్డాను. ఈ బిల్డింగులు ప్లె¦ౖఓవర్లు, పెద్ద పెద్ద మాల్స్‌ ఇవన్నీ అభివృద్ధి సూచికలనుకున్నాను. కళ్ళు  మిరిమిట్లు కొల్పుతున్న ఈ సోకాల్డ్‌ అభివృద్ధి తెర చీల్చి చూస్తే కనిపించే చీకటి ప్రపంచం ఓ!మైౖగాడ్‌! ఐకాంట్‌ బిలీవ్‌దిస్‌, నోబడీ బిలీవ్స్‌. సికింద్రాబాద్‌ స్టేషన్‌ చుట్టు పక్కల పదివేల మంది సెక్స్‌వర్కర్లు బతుకుతున్నా రంటే ఏ స్థాయిలో ప్రాస్టిట్యూషన్‌ జరుగుతోంది. ఎంత మందికి హెచ్‌ఐవి సోకుతోంది. సంసారాలు సాగిస్తూనే ఇంతమంది మగాళ్ళు రోజూ వీళ్ళ దగ్గర కొస్తారన్నమాట. ఎంత హిపోక్రసీ!
నా మనసులో సుడులు తిరుగుతున్న ఆలోచనలు. చంద్రకళని మెహదీపట్నంలో దింపేసి వస్తుంటే తనో మాటంది.
”సతీష్‌! నా నికృష్టమైన బతుకు చూసాక కూడా నీకు నా మీద అసహ్యం వెయ్యడంలేదా? నేనంటే అప్పటిలాగానే అంత ఇష్టంగా ఎలా వుండగలుగుతున్నావ్‌? నా మీద జాలా?”అంది.
జాలేనా? సెక్స్‌ వర్కర్ల సంఘం ఆఫీసు దాకా నన్ను లాక్కెళ్ళింది ఆమె మీద జాలేనా? ఎందుకు తను ఫోన్‌ చెయ్యగానే ఉరుకులు, పరుగుల మీద వెళ్ళి ఆమె ముందు ప్రత్యక్షమౌతున్నాను. ఆమె బతుకును, ఆమెలాంటి ఎంతోమంది బతుకుల్ని చూసాక కూడా ఆమెపట్ల విముఖత ఎందుకు కలగడం లేదు.నాలో రకరకాల ఆలోచనలు.
బిబిబి
అన్వర్‌తో నా బిజినెస్‌ డీల్‌  దాదాపు ఒక కొలిక్కి వచ్చేసింది. ఇద్దరం ఈ రోజు కలిసి ఫైనలైజ్‌ చెయ్యాలనుకున్నాం. సాప్ట్‌వేర్‌ కంపెనీకి సంబంధించిన పేపర్‌ ప్రకటన కూడా తయారైంది. మధ్యలో ఒకసారి చంద్రకళని కలిసి నపుడు తనకో మొబైల్‌ ఫోన్‌ కొనిచ్చాను. రెగ్యులర్‌గా మాట్లాడు తోంది. ఎన్నిసార్లు అడిగినా తన ఇంటికి మాత్రం తీసుకెళ్ళలేదు. నేను నా ఫ్లాట్‌లో అన్వర్‌ కోసం ఎదురుచూస్తూ టివీ ఆన్‌ చేసాను. ఛానల్స్‌ బ్రౌజ్‌ చేస్తుంటే ఓ న్యూస్‌ ఛానల్‌లో చంద్రకళ కనబడింది. అరే! అనుకుంటూ న్యూస్‌ పెట్టగానే పోలీస్‌ స్టేషన్‌ ముందు గుమిగూడిన చాలామంది స్త్రీలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కనబడ్డారు. పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నా. అందులో చంద్రకళ. మహిళా సంఘాల వాళ్ళు కూడా వున్నారు. ఒకామె మాట్లాడుతోంది. ”ఇది చాలా అన్యాయం. సెక్స్‌వర్కర్లందరికీ బలవంతంగా హెచ్‌ఐవి పరీక్ష చేస్తున్నారట. ఇష్టమైన వాళ్ళు చేయించుకుంటారు. బలవంతంగా చెయ్యడం అన్యాయం. బీహార్‌లో మెంటల్‌ హాస్పిటల్‌లోె వున్న స్త్రీలకి బలవంతంగా గర్భసంచుల్ని తొలగించడం లాంటిదే ఇది కూడా.” చాలా ఆవేశంగా ప్రసంగిస్తోంది. హాఠాత్తుగా పోలీసులు విరుచుకు పడి లాఠీలతో కొట్టసాగారు. చంద్రకళకి తలమీద దెబ్బపడి కిందపడిపోయింది. వెంటనే టివీ ఆపేసి మహాంకాళీ పోలీస్‌స్టేషన్‌కి బయలుదేరాను.
బిబిబి
పోలీస్‌స్టేషన్‌ ముందు పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. పోలీసులు కొడుతుంటే అక్కడ గుమిగూడిన ఆడవాళ్ళు కకావికలంగా అటూ ఇటూ పరుగెడుతున్నారు. టివీలవాళ్ళు లైవ్‌ కవరేజీ ఇస్తున్నారు. నేను దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ వెళ్ళలేకపోయాను. ఎంత వెదికినా చంద్రకళ కనబడలేదు. ఫోన్‌ చేసినా ఎత్తడం లేదు. పోలీసులు అందరినీ చెదరగొట్టేశారు. నేను దూరంగా చెట్టు కింద నిలబడిపోయాను. అన్వర్‌ పదే పదే ఫోన్‌ చేసినా మాట్లాడకుండా చంద్రకళ కోసం వెతకసాగాను.
ఎప్పుడూ టివీలో మాట్లాడుతూ కన్పించే మహిళాసంఘం నాయకురాలు టివీ మైక్‌లో మాట్లాడుతోంది. దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను.
”పోలీసుల లాఠీఛార్జిలో చాలామంది స్త్రీలు గాయపడ్డారు. వాళ్ళని గాంధీ హాస్పి టల్‌కి పంపించాం. వాళ్ళు ప్రజా స్వామికం గానే కదా ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేకుండా ఏ పరీక్షా బలవంతం గా చెయ్యకూడదు కదా! చాలా కాలంగా వాళ్ళు ఇళ్ళ పట్టాలివ్వమని, రేషన్‌ కార్డు లివ్వమని అడుగుతున్నారు. మాకు పునరా వాసం కల్పించండి. మేమీపని మానేస్తాం. మా పిల్లల్ని చదివించుకుంటాం అంటు న్నారు. తెలిసో, తెలియకో, వంచనకు, మోసాలకు గురై ఈ వృత్తిలోకి వచ్చాం. అంటున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా ఈ పరీక్షలు చేయించడానికి సిద్ధమవ్వడం అన్యాయం కదా!” పెద్ద గొంతుతో మాట్లాడుతోందావిడ.
ఆవిడ మాటల్ని నేను ఆశ్చర్యంగా వింటున్నాను.
చంద్రకళ ఫోన్‌ చేసింది.
”నువ్వు కనబడలేదు. ఎక్కడున్నావ్‌?”
”నేను గాంధీ హాస్పిటల్‌లో వున్నాను. నువ్వెక్కడున్నావ్‌ సతీష్‌. నేను కనబడక పోవడమేంటి?”
”మహంకాళి పోలీస్‌స్టేషన్‌ దగ్గరు న్నాను. టివీలో నిన్ను చూసి పరుగెత్తి వచ్చాను. ఇదంతా ఏంటి?”
”పోలీస్‌స్టేష్‌కి వచ్చావా. తలకి గాయ మైంది. బాగా రక్తం పోయింది. కట్టుకట్టారు. గాంధీకి వస్తావా? చాలా మందికి దెబ్బలు తగిలాయి”.
”వస్తున్నాను.”గాంధీకి బయలు దేరాను.
బిబిబి
చంద్రకళ నాతోపాటు  ఇంటికి వచ్చింది. తలమీద పెద్ద కట్టు. చీరంతా రక్తంతో తడిసిపోయింది. తనని ఇంట్లో దింపేసి, బయటకెళ్ళి ఓ నాలుగు చీరలు కొనుక్కొచ్చాను. స్నానం చేసి చీర మార్చు కుంది. ఆ తర్వాత పడుకుని నిద్రపోయింది. నేను టివీ ముందు కూర్చున్నాను. కానీ నా మనసులో రకరకాల ఆలోచనలు. నా దగ్గర చాలా డబ్బుంది. దానితో చంద్రకళకి ఏమీ చెయ్యలేనా? నేను కంపెనీ పెట్టి సంపాదించి ఎవరికివ్వాలి? ఈ డబ్బుతో ఆమెకి పాత జీవితం ఇవ్వగలిగితే? పోనీ నా కంపెనీలో భాగస్వామిని చేస్తే… ఆమె పనిచేస్తున్న సంఘానికి కొంత విరాళమిస్తే… ఎటూ తేలని ఆలోచనలు. ఒక్కటి మాత్రం నిజం. ఆమెని అలా గాలికి మాత్రం వొదిలెయ్యలేను. ఆమె సుఖంగా, సంతోషంగా వుంటేనే నాకు సుఖం.  ఆమె భర్త సంగతి కూడా చూడాలి. ఆమెకి న్యాయంగా రావాల్సినవన్నీ ఇప్పించాలి.
ఆలోచిస్తూ నేను కూడా నిద్రలోకి జారాను.
బిబిబి
మా  కంపెనీ  ప్రారంభోత్సవం. చంద్రకళ హాడావుడిగా అటుఇటు తిరుగుతోంది. అన్వర్‌ మాటి మాటికీ ఆమెని ఏదో అడుగుతున్నాడు. నవ్వుతూ సమాధానం చెబుతోంది.
”సతీష్‌! రంగారావుగారు ఇంకా రాలేదేంటి?టైమ్‌ అవుతోంది?
”బయలు దేరారట. ఇప్పుడే ఫోన్‌ చేసారు. మీ వాళ్ళు రాలేదేం?”
”ఎవరూ కనకదుర్గా? తనూ అంతే. దారిలో వుంది”.
నిరాడంబరంగా ప్రారంభోత్సవం జరిగిపోయింది. చంద్రకళని కంపెనీ డైరెక్టరుగా సతీష్‌ పరిచయం చేసాడు. చంద్రకళ కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి. సతీష్‌ కంటబడకుండా తుడుచుకుంది.
”కంగ్రాట్యులేషన్స్‌ చంద్రకళా” అభినందించింది కనకదుర్గ.
”ధాంక్స్‌ దుర్గా! నాకీ రోజు చాలా సంతోషంగా వుంది. ఈ కంపెనీకి డైరెక్టరుగా అయినందుకు కాదు. నాకంటూ సమాజంలో ఓ గౌరవం దొరికినందుకు. మనలాంటి ఆడవాళ్ళకోసం ఎప్పటికైనా నేనే ఇలాంటి పెద్ద కంపెనీ పెడతాను. న్యాయంగా నాకు రావాలసిన ఆస్తుల కోసం మా ఆయనతో కొట్లాడతాను. నన్ను రోడ్డు మీద పడేసి తాను ఎలా వెలిగిపోతున్నాడో చూసాను. వాడిని వొదలనుగాక వొదలను.”
”ఎవరిని వొదలనంటున్నావ్‌?” సతీష్‌
”నా మొగుడ్ని”
”ఏం చేస్తావేంటి”నవ్వాడు.
”కోర్టు కీడుస్తా. నా బతుకును నాశనం చేసిన వాడిని ఊరికే వదలను.”
”ఒకె. ఒకె. పద మీడియా వాళ్ళు పిలుస్తున్నారు.”
”నేనేం మాట్లాడతాను సతీష్‌”
”ఇపుడేదో చెబుతున్నావ్‌గా అదే చెప్పు.”
చుట్టూ కెమెరాలు. ఫ్లాష్‌లైట్ల ఫోకస్‌. నదరక బెదరక మాట్లాడసాగింది చంద్రకళ.
శంషాబాద్‌లో తమ గులాబీతోటల గురించి, తమ దానిమ్మతోటల గురించి మైమరచిపోతూ చెప్పింది. ఎయిర్‌పోర్ట్‌ కింద తమ ఇల్లు, భూములు ఎలా పొయ్యాయో, తన భర్త తనని ఒదిలేసి రెండో పెళ్ళి ఎలా చేసుకున్నాడో. తను దిక్కులేక రోడ్డున పడ్డం, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సెక్స్‌వర్క్‌లోకి లాగబడడం, కనకదుర్గ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనడం అన్నీ పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది.
వెంటనే ఓ ప్రశ్న దూసుకొచ్చింది.
”ఇంకా మీరు సెక్స్‌వర్క్‌లో వున్నారా? కొనసాగిస్తారా?”
”నేను నా జీవితం మొత్తం మీ ముందుంచితే నాకు జరిగిన అన్యాయం మీకు కనబడలేదు. అభివృద్ధి పేరుతో ధ్వంసమౌతున్న స్త్రీల జీవితాలు మీకు కనబడలేదు. నా భర్త దుర్మార్గం మీకు కనబడలేదు. సెక్క్‌వర్క్‌ మాత్రమే మీకు అర్ధమైంది. నేనింకా దాంట్లో వున్నానా లేదా? అనేదే ప్రముఖంగా అడగాల్సిన అంశంగా మీరు అనుకోవడం నిజంగా చాలా విషాదకరం. నేను సెక్స్‌వర్క్‌లో వున్నానో లేదో చెప్పాల్సిన అవసరం లేదు కానీ, సెక్స్‌వర్కర్ల సమస్యల కోసం పనిచేస్తానని మాత్రం చెప్పదలిచాను”.
”ఒకే సతీష్‌! నేను కనకదుర్గతో వెళుతున్నాను రేపు ఫోన్‌ చేస్తాను.” అంటూ కెమెరాల ముందు నుండి వచ్చేసింది.
”ఒక్క ప్రశ్న మేడం. ఈ సతీష్‌ మీకు ఏమవుతారో చెబుతారా!”.
నడుస్తున్నదల్లా ఆగి నా చెయ్యి పట్టుకుని ”ఇతనా? నాకేమీ కాడు. రక్తసంబంధం లేదు కానీ అంతకు మించిన ఆత్మీయబంధం వుంది.” అంటూ నా నుదిటి మీద ముద్దు పెట్టి కనకదుర్గతో కలిసి వెళ్ళిపోయింది చంద్రకళ.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>