డైరీ

(భూమిక కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ)

టైము ఉదయం ఏడు గంటలు అవుతున్నా, నిద్రపట్టక మంచంమీదే దొర్లుతున్నాను. పనిమనిషి వచ్చేదాక ఇదే కాలక్షేపం. భాస్కర్ ఊర్లో లేడు, పనిమీద బెంగుళూరు వెళ్ళాడు. భాస్కర్ ఉంటే ఇలా బద్ధకంగా పడుకోనిచ్చేవాడు కాదు, యోగ చెయ్యని, లేక నడవమనీ, నావంటిని నేను సరిగ్గా పట్టించుకోవటం లేదనీ సాగిపోతూనే ఉంటుంది.

భాస్కర్ రెండురోజుల దాకా రాడు. చాలా రోజుల తరువాత దొరికిన స్వేచ్ఛ ఇది. ఇంతలో కాలింగ్బెల్ మ్రోగింది. లక్ష్మీ వచ్చినట్లుంది అనుకుంటూ గబగబ చీర సవరించుకుని వెళ్ళి తలుపు తీసాను. ఎదురుగా ఆమె కూతురు శోభ నిలబడి వుంది. ఆ పిల్లని చూస్తూ ఏమే మీ అమ్మ రాలేదు నువ్వు వచ్చావు? అన్నాను. తను లోపలికి వస్తుందని తలుపు పూర్తిగా తెరిచాను. గుమ్మంలోనే వుండిపోయింది. అప్పుడు గమనించాను, ఆ పిల్ల ఏడుస్తోందని…

“ఏమయ్యింది? మళ్ళీ మీ నాన్న మీ అమ్మని కొట్టాడా?” అని అడిగాను.

“కాదమ్మగారు నిన్న రాత్రి మా అమ్మకి నాన్నకి చాలా పెద్ద గొడవ జరిగిపోయింది. అమ్మ ఆవేశంలో నాన్నని రోకలిబండతో కొట్టీసిందండి, నాన్న సచ్చిపోయాడు, రాత్రే పోలీసులొచ్చి అమ్మని పట్టుకెళ్ళారండీ” అంటూ ఏడుస్తూ చెప్పింది.

ఇంతలో ఓ ముసలావిడ దాని దగ్గరికొచ్చి “శోభా ఇక్కడున్నావా! పద నీకోసం వెదుకుతున్నాను” అంటూ తీసుకెళ్ళిపోయింది. వెళుతూ ఏడుస్తూ “కొంప ముంచింది గదే మీ అమ్మ! ఇంక మీకెవ్వరు దిక్కు” అంటూ పెద్దగా ఏడుస్తూ అపార్ట్మెంట్ కాంపౌండ్ దాటి వెళ్ళి పోయింది.

ఆమె వెళ్ళిన పదినిమిషాల దాకా తేరుకోలేకపోయాను. ఎంతపని చేసింది లక్ష్మి. ఆమె పిల్లలు ఏమైపోతారు. అందులో ఇద్దరూ ఆడపిల్లలే…

ఆ పిల్ల కళ్ళలో బాధకన్నా నిస్సహాయత కనిపించింది. నిండా పదమూడేళ్ళు లేని వయస్సులో ఎన్ని అనుభవాలు!! ఎంత మామూలుగా వుందామనుకొన్నా వుండలేకపోయాను. ఆ పిల్ల మొఖమే పదే పదే గుర్తుకి వస్తోంది.

వంట ఇంట్లో పని మొదలు పెడదామనుకొన్నాను. గిన్నెలు తోముతున్నా, ఇల్లు శుభ్రం చేస్తున్నా పదే పదే వాళ్ళే గుర్తుకి వస్తున్నారు. మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చిన కొత్తల్లోనే పనిమనిషి కావాలా అమ్మగారూ అంటూ ఇద్దరు చిన్నపిల్లలతో వచ్చి అడిగింది లక్ష్మి.

“ ఇంటర్ వరకూ చదువుకున్నానండి, పరిస్థితులు బాగాలేక ఇలా పనిచేసుకొని బ్రతకవలసి వస్తోంది” అంటూ పనిలో చేరుతున్న రోజే చెప్పింది.

పని బాగా చేస్తూ కొద్ది రోజుల్లోనే ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. తన ఇద్దరాడపిల్లలు నా కళ్ళముందే పెరిగారు. వసంతకి పెళ్ళై అమెరికా వెళ్ళగానే వీళ్ళు వచ్చారేమో, ఆలోటు ఆ పిల్లల్లో చూసుకొన్నాను.
“అమ్మగారు అమ్మగారు” అంటూ నా చుట్టూ తిరిగేవారు.

అప్పుడప్పుడు నా దగ్గర తన ఇంటి సంగతులు చెప్పుకొని ఏడ్చేది. తన మొగుడు ఆటో డ్రైవర్, దానికి తోడు తాగుడు అలవాటు వుండేది.

“విడాకులు ఇవ్వు అని ఎన్నిసార్లు అడిగేనండీ, అటు విడాకులూ ఇవ్వడు, ఇటు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడు, తాగితే పరవాలేదండి నన్ను ఇంట్లో ఉన్నదాన్ని బయటికి లాగి రోడ్డుమీద కొడతాడండీ” అంటూ వలవలా ఏడ్చింది.

“నా ఇంటర్ సర్టిఫికెట్లు అన్నీ కాల్చి పారేసాడండీ, అవి వుండి వుంటే ఏదో చోట ఉద్యోగం దొరికేది, ఖర్మ అండీ అంతా నా ఖర్మ” అంటూ బాధపడేది.

“అమ్మగారు అయ్యగార్ని చూస్తే ముచ్చటేస్తుందండీ, ఈ వయస్సులో కూడా మీరంటే ఎంత ప్రేమ, మనిషికి కావలసింది తిండి బట్టే కాదండీ కాస్తంత ప్రేమ కూడా వుండాల” చదువుకున్నది కదా కాస్త పాలిష్గా మాట్లాడేది.

పనిమనిషే కాదు ప్రతి ఒక్కరూ భాస్కరాన్ని తెగ పొగిడేస్తారు. అందరూ పొగుడుతూ వుంటే నా మనస్సు మాత్రం ఆనందించేది కాదు, గర్వపడేది కాదు. మీ అందరికేం తెలుసు భాస్కరం సంగతి, గాయపడ్డ నా మనస్సుకి తెలుసు, అతని మాటలు అవీ నన్ను ఎంత గాయపరచాయో నాకు తప్పించి ఎవరికీ తెలియదు.

నేను ఎలుగెత్తి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అంత విచిత్రమైన సమస్య నాది. ఎప్పుడూ నన్నే అంటిపెట్టుకుని, ఇందిరా ఇందూ అంటూ నా చుట్టూ తిరిగే భాస్కరం మెత్తగా మాట్లాడుతూనే నా మనస్సుని గాయపరచేవాడు, పైకి కనిపించే గాయాలు మాసిపోతాయి. అవి అందరికీ తెలిస్తే మనిషికి కాస్తంత సానుభూతి అయినా దొరుకుతుంది. కానీ మానసికంగా చంపేవారికి ఏ సాక్ష్యం దొరకదు.

పని ముగించుకొని టైము చూసు కొన్నాను. పదకొండే అయ్యింది. పొద్దున్నే అమ్మ దగ్గర నుంచి ఫోను “ ఇందూ రాకూడదా! భాస్కరం ఊళ్ళో వుంటే ఎలాగూ రావు…” ఆ గొంతులో అల్లుడంటే ప్రేమ, కూతుర్ని విడవకుండా చూసుకుంటున్నాడనే అభిమానం…

“వస్తానమ్మా ఇంట్లో కొద్దిగా పని వుంది. అది చూసుకొని బయలుదేరి వస్తాను” అంటూ ఫోన్ పెట్టేసాను.

రాత్రి బాగా పొద్దు పోయేదాక టి.వి.లో సినిమా చూసాను, అందుకే లేటుగా లేచాను, అస్సలు పూర్తిగా హాయిగా నాకు నేనుగా అనుభవిద్దామనుకున్నాను, ఇది ఎన్నో రోజులు తరువాత దొరికిన స్వేచ్చ.

పొద్దున్నే లక్ష్మీ చేసిన పనికి తన పిల్ల వచ్చి చెప్పగానే మూడ్ అంతా పాడైపోయింది. వాడ్ని చంపి ఏం సాదిద్దామనుకుంది, అయినా ఆమె మాత్రం ఏం చేస్తుంది, ఎంతకని సహిస్తుంది. సహనానికి ఒక హద్దు వుంటుంది. ఏదైనా హద్దుమీరితే దాని పరిణామాలు తీవ్రంగా వుంటాయి. ఓరోజు నేనూ ఇలాగే చేస్తానా! ఉలిక్కిపడ్డాను. ఏమిటీ ఆలోచనలు! నాలో అంత కసి పేరుకుపోయిందా? నేను అలాంటి పని చేస్తే బహుశ జడ్జిగారు అప్పటికప్పుడు ఉరిశిక్ష విధిస్తారేమో? ఎందుకంటే అంత మంచి భర్తని చంపిన మొదటి స్త్రీని నేనే అవుతాను.

కిటికీ దగ్గరకి వచ్చి నిలబడ్డాను. ఉదయం 11 గంటలు కావడంతో అపార్ట్మెంట్ అంతా నిశ్శబ్దంగా వుంది. పిల్లలు, మగవాళ్ళు వెళ్ళిపోవడంతో సందడి బాగా తగ్గిపోయింది. చక్కటి సొంత అపార్ట్మెంట్, కారు, హోదా, ముత్యంలాంటి ఒకే ఒక కూతురు, ఇంతకుమించి ఒక స్త్రీకి ఏం కావాలి? అయితే ప్రతి మనిషికి ఒక మనస్సు అనేది వుంటుంది, ఓర్పు కూడా వుంటుంది, ఈ రెంటిని ముక్కలు చేస్తూ హద్దులు మీరే హక్కు ఎవ్వరికీ లేదు.

డిగ్రీ అవుతూనే, మంచి సంబంధం చూసి అమ్మ, నాన్న పెళ్ళి చెయ్యాలను కొన్నారు. పెళ్ళి చూపులనాడే నన్ను నచ్చుకొని ఒప్పేసుకున్నాడు భాస్కరం. ఒకే ఒక సంబంధం అలా చటుక్కున కుదిరిపోవడం ఇంట్లో అందరికీ ఎంతో సంతోషాన్నిచ్చింది, నేనైతే గాల్లో తేలిపోయాను. నా అదృష్టాన్ని నమ్మలేక పోయాను.

భాస్కరం చాలా ఛాయగల మనిషి. తెల్లగా బొద్దుగా, ఒత్తైన క్రాపుతో, బాగా రంగు తక్కువ ఉన్నా నన్ను చూడగానే పెళ్ళికి ఒప్పుకోవడం అందరికీ ఆనందం, మరోప్రక్క ఈర్ష్యకూడా కలిగింది. మంచి ఉద్యోగం, చదువు, మంచి సంస్కారం ఇవన్నీ కలపోసిన భాస్కరం నా భర్త అని మురిసిపోయాను.

ఇద్దరం పెళ్ళిపీటలమీద కూర్చున్నాము. తాళి కట్టడానికి ఇంకా సమయం వుంది. సిగ్గుల మొగ్గనవుతూ ఆనందంగా తేలిపోతూ కూర్చున్నాను. మెల్లగా ఇందిరా అంటూ పిలిచాడు భాస్కర్…. తలెత్తి చూసాను. “ నీకు ఈ చీర రంగు ఏమీ బాగా లేదు, దీనిలో మరింత నల్లగా కనిపిస్తున్నావు….”అని ఎవ్వరికీ వినిపించనంత మెల్లగా చెప్పాడు. హతశురాలినైపోయాను. ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. మళ్ళీ కళ్ళెత్తి అతని వైపు చూసే ధైర్యం లేకపోయింది. కన్నె మనస్సు దిగులుతో వణికిపోయింది. నిజంగా పచ్చరంగు అస్సలు బాగోలేదా! మరీ నల్లగా కనిపిస్తున్నానా!! ఇలా పెళ్ళి జరుగుతున్నంతసేపు ఆలోచిస్తూనే వున్నాను.

బంధువులు, అక్కాబావ, అమ్మానాన్న ఇంతమంది మధ్య కూడా ఏదో తెలియని దిగులుతో మేకలమందలోనించి తప్పిపోయిన మేకపిల్లలా భయంతో వణికిపోయాను. నాది చాలా సున్నితమైన మనస్సు, ఏదీ తట్టుకోలేని తనం.

హైదరాబాద్లో ఒక మంచి అపార్ట్మెంట్లో, మాకొత్త కాపురం మొదలయ్యింది. అత్తగారు మామగారు మాతో కొన్నాళ్ళు ఉందామని, మాతోపాటు ఉన్నారు. భాస్కరం, అతని కన్నా పెద్ద సురేష్ ఇద్దరే మగపిల్లలు, ఆడపిల్లలు లేరు. కొద్ది రోజులు వాళ్ళ దగ్గర, కొద్దిరోజులు మా దగ్గర వుంటూ ఉన్న ఊర్లో వ్యవసాయం పనులు చూసుకుంటూ వుంటారు.

ఆరోజు ఆదివారం, ఇంట్లో అందరం తీరిగ్గా ఉన్నాము. భాస్కరానికి ఆఫీసు లేకపోవడంతో లేటుగా లేచాడు. అందరం టిఫిన్ తింటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాము.
“భాస్కరం మన ఊర్లో ఉన్న సుబ్బారావుగారి అమ్మాయి ప్రసవించింది. ఆడపిల్ల. వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారట, నేను, నాన్నగారు సాయంకాలం వెళ్ళి చూసొద్దామనుకుంటున్నాము, నువ్వు ఖాళీగా వుంటే కార్లో దింపు” అన్నారావిడ.

“అలాగే, సాయంకాలం నాకేమీ పెద్ద పని లేదు, అయినా ఏం చూస్తారమ్మా, సుబ్బారావు అల్లుడిని చూసావా ఎంత నల్లగా వుంటాడో. ఇంక వాళ్ళ అమ్మాయి కూడా అలాగే వుంటుంది. పెద్దదైతే పెళ్ళికావడం చాలా కష్టం. నాలాంటి వాళ్ళు దొరకాలి ఏం ఇందూ అంతే కదా?” చాలా సౌమ్యంగా చాలా కూల్గా నాకు ఎక్కడా దెబ్బ తగలాలో తెలిసి దెబ్బవెయ్యడం అంటే ఇదే. ఎవ్వరూ పెట్టావో కనిపించలేదు” అని అడిగాడు. ఘాటుగా సమాధానం చెబుదామనుకున్నాను గాని ఆప్యాయంగా నా భుజం మీద చేతులు వేస్తూ ప్లీజ్ ఎక్కడ పెట్టావో చెప్పు అంటుంటే ఇంకేం మాట్లాడాలో తెలియక, నన్ను నేను సంభాళించుకొని తువ్వాలు అందించాను.

ఇప్పుడే కాదు సమయం దొరికితే చాలు, నేను నల్లగా ఉన్నానన్న విషయాన్ని పదే పదే గుర్తుకు తెచ్చేవాడు. అడుగు అడుగునా విమర్శించేవాడు. పైకి కనిపించనంత మెల్లగా…. ఎప్పుడైనా విసిగి అమ్మముందు ఈ విషయం చెబితే, “ పోనిద్దూ కొందరి తత్వమే అంత, అన్నీ మంచిగుణాలున్నా ఎక్కడో ఏదో లోపం, కొందరికి వెక్కిరింత వేళాకోళాలు అలవాటు”.

ఎవరూ ఎందుకు అర్థం చేసుకోరూ! చిన్న పొగడ్త మనిషిని ఎంత అందలాలు ఎక్కిస్తుందో, వెక్కిరింత అంత దిగజారుస్తుంది. నాలో గాయం మెల్లగా మెల్లగా రగులుకోవడం మొదలుపెట్టింది… చాలాసార్లు అనిపించేది, హాయిగా నాలాంటి నల్లటి అబ్బాయినే ఎందుకు పెళ్ళి చేసుకోలేదని!

ఏ పండగ వచ్చినా, పెళ్ళికి వెళ్ళాలన్నా తనదే సెలెక్షన్. అదంటే హడలిపోయేదాన్ని, బట్టలషాపులో మా ఆవిడ రంగుకి సరిపోయిన మంచి చీరలు చూపించండీ అంటూ మొదలయ్యేది డ్రామా, అడుగడుగునా , చీర చీరకీ నావంటి రంగుని మరింత నల్లగా చేసిపారేసేవాడు.

ఏ చీర కొనుక్కున్నానో, ఎలాంటిది కొన్నానో కూడా తెలియనంత దిగులు వచ్చేసేది. తరువాత ఆ కొన్న చీర కట్టుకోవాలంటే భయం వేసేది. మానసికంగా కృంగిపోయేదాన్ని. అది ఎవ్వరికీ కనిపించేది కాదు. అర్థం అయ్యేది కాదు.

అమ్మాయి పుట్టిందని తెలియగానే కళ్ళు తెరచి చూసుకోవడానికి కూడా భయపడ్డాను. “ఇందు అమ్మాయిని చూడవే అచ్చం తండ్రి పోలిక” అంటూ అమ్మ ఆప్యాయంగా నన్ను పలకరిస్తుంటే కనిపించని దేవుళ్ళందరికీ మొక్కుకున్నాను.

తెల్లగా బొద్దుగా భాస్కరం ప్రతి రూపంలా ఉన్న అమ్మాయి “వసంత” అంటే నాకు అపురూపం. నాలాగే అది కూడా విమర్శలు ఎదుర్కోవలసిన అవసరం లేదని సంతోషించాను. తల్లీ కూతుర్ని వేరువేరుగా విమర్శిస్తూ చిత్రహింసలు పెట్టేవాడు. ఇంకానయం నీరంగు రాలేదు అంటూ అడుగడుగునా గుర్తు చేసేవాడు. పాప మనస్సులో కూడా తెలియకుండా అమ్మ నలుపు, నాన్న తెలుపు, తెల్లగా వుంటేనే అందం అన్న విషయం ముద్రించుకు పోయింది. దానికి తెలియ కుండానే అది కూడా అలాంటి భావాల్నే వ్యక్తపరిచేది.

వసంత బాగా చదువుకుంది. ఇంజనీరింగు చేసింది. మంచి సంబంధం వెదికి అది కూడా ఏరి ఏరి తెల్లటి అబ్బాయినే అల్లుడిగా తెచ్చుకొని, తన తెలివితేటలకి మురిసిపోయాడు. మళ్ళీ అందరూ భాస్కరం ఛాయిస్ని మరీ మరీ మెచ్చుకున్నారు.

ఒక్కర్తే సంతానం చాలు అనుకొన్నాము. నేను కూడా కనే ఉత్సాహం చూపించలేదు. బహుశా అంతరంగంలో భయమేమో! నామీద నేను నమ్మకం పోగొట్టుకున్నాను. వసంత పెళ్ళి అయి వెళ్ళిపోయిన దగ్గరనుంచీ మరీ ఒంటరితనం బాధించేది.

నిజానికి నాది చాలా చక్కని తలకట్టు, ఒత్తైన జుత్తు. “ ఇందుది చాలా కళగల ముఖం, ఛామన ఛాయతో కూడా ఎంత బాగుంటుంది” అనేవారంతా. కాలేజిలో అంతా బ్లాక్బ్యూటీ అని పిలిచేవారు. అంత ఉత్సాహంగా ఉన్న నేను ఈ 30 ఏళ్ళ జీవితంలో చాలా విసిగిపోయాను, అలసిపోయాను.
ఎప్పటికప్పుడు ఎంత సర్దుకుందామను కున్నా, అతని మాటలు నన్ను గాయపరిచేవి. నాలో ఆవేదన పెరిగిపోయింది. అది ఎక్కడ ఎలా వెల్లడి చెయ్యాలో ఎవరితో చెప్పుకోవాలో తెలిసేది కాదు, అది నాతోనే వుండి పెరిగి పెద్దదై మహావృక్షంలా తయారై నన్ను పూర్తిగా కృంగదీసింది. మంచి చీరలు కట్టుకోవడం మానేసాను. అస్సలు చక్కగా తయారుకావడం అనేది ఏనాడో మరచిపోయాను. ఇష్టమైతే, మరీ మరీ భాస్కరం చెప్పగా చెప్పగా చీర మార్చుకునేదాన్ని. ఒకరోజు అక్క దగ్గర నుంచి ఫోను వచ్చింది. “ఇందు ఏమిటి రోజు రోజుకి అలా తయారవుతున్నావు? నీకేం తక్కువ”. “ఏం చేసానక్కా” అన్నాను.

“ఇది మీ పర్సనల్ విషయం అనుకో, అయినా అడుగుతున్నాను. ఎందుకంత నిర్లక్ష్యంగా వుంటున్నావు. మన ఊర్లో అందరూ అడుగుతున్నారు. ఇందిర అట్లా తయారయ్యిందని, పోనీ అందరి సంగతీ వదిలెయ్యి, మొన్న భాస్కరం మా యింటికి వచ్చినప్పుడు నీ గురించి చెప్పి ఎంత బాధపడ్డాడో తెలుసా? ఏదీ పట్టించుకోదండీ, మంచిగా తయారవ్వదు, అంటూ కళ్ళనీళ్ళు కూడా పెట్టుకున్నాడు. ఏమిటి ఇందూ మంచి భర్త అందరికీ లభించరు, కాస్తంత అతని మాటవిని బాగా తయారు అయితే ఏమైంది?” ఇంకా ఏదో చెబుతోంది…. అన్నింటినీ విని నాకు తోచిన సమాధానం చెప్పి ఫోను పెట్టేసాను. అన్నిటికన్నా బాధించింది ఒకే ఒక్క విషయం, కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడనీ. నన్ను మాటలతో చిత్రవధచేసి, నన్నీ పరిస్థితికి తీసుకువచ్చి ఏమీ తెలియని వాడిలా…. అక్క దగ్గర కన్నీళ్ళు పెట్టుకొన్నాడా!ఇలాంటి మనుషులను ఏమనాలి?

ఆనాటి నుంచి అతని నుంచి మానసికంగా చాలా దూరం జరిగిపోయాను. నాకు నచ్చే విధంగా నేను వుండడం మొదలుపెట్టాను. బహుశా ఇదే తిరుగుబాటు ధోరణి కావచ్చు. అతను కూడా నాకు చెప్పి చెప్పి విసుగెత్తినట్లు ఇదివరకు మెల్లగా అనే మాటలు ఇప్పుడు పబ్లిక్గా అందరిముందూ వ్యక్తపరుస్తున్నాడు. ఇలా ఇద్దరం ఒక దగ్గరే వుంటూ కొన్ని వేల మైళ్ళదూరం జరిగిపోయాము.
ఇదే, ఇలాంటి స్థితిగతులే మనుషులని ఉన్మాదులుగా మారుస్తాయి. దానికి తగ్గట్టుగా పరిస్థితులు తోడయితే హత్యలు, కొట్లాటలు, ఏబాధ ఒక్కరోజులో బయటపడదు. ఏళ్ళ తరబడి అది లోలోపల పొరల్లో బలమవుతూ వుంటుంది.

ఏదో ఒకరోజు ఉప్పెనగా మారి భయంకరమైన పరిస్థితులకి దారితీస్తుంది. క్షణికావేశం ఎంతటికైనా తెగించేలా చేస్తుంది. పనిమనిషి లక్ష్మి విషయంలో అదే జరిగింది. నలుగురిలో అవమానించడం, వ్యసనం, సంసారం నడవకపోవడం, చదువుకొని నలుగురిళ్ళలో పాచిపని చేసుకోవడం ఇవన్నీ ఆమెను బాధించాయి. అయితే అందరూ ఇలా చేస్తారని కాదు. కొందరే ప్రతిదానికీ స్పందిస్తారు…

ఇలాగే మదనపడుతూ ఎప్పటికీ భాస్కరానికి ఎదురు చెప్పలేక, అతనంటే ఇష్టపడలేక జీవితం గడిచిపోతుందా? ఈ నాలుగు గోడల మధ్య గడిపేస్తూ నలిగిపోతానా? పనిమనిషి ‘లక్ష్మీ’ లా చెయ్యగలనా, అదీ కుదరదు. అంత ధైర్యముంటే ఏనాడో ఇల్లువిడిచి వెళ్ళిపోయేదాన్ని… ఆత్మహత్య చేసుకుంటే? ఇంకా ఆత్మహత్య ఎందుకు ? ఇప్పుడు మాత్రం బ్రతికి వున్నానా?! పేపరులో చూసాను ‘హెల్ప్ లైన్’ అంటూ… ఫోనులో మాట్లాడండి, సమస్యలు తీరుస్తామంటూ ప్రకటనలు… ఫోనులో మాట్లాడినంత మాత్రాన సమస్యలు తీరుతాయా! వీళ్ళు ఎవరిని మార్చగలరు? నా రంగునా? లేక భాస్కరాన్నా?!…

డైరీ చదివి మూసేస్తూ ఆలోచనలో పడ్డాను. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తూంటే నాకు రైల్లో దొరికింది డైరీ, నా సామానులతో పాటు పక్కకి జారిపడి వుంది, ఎవరిదో అనుకుంటూ చూసాను, అప్పటికే అందరూ దిగిపోయారు.

డైరీ చాలా విలువైనది నాదృష్టిలో. నాకు డైరీ రాసే అలవాటు వుంది… అది ఒక ఆత్మబంధువు లాంటిది… నేను డైరీని చాలా అభిమానంగా ఎంతో విలువైన వస్తువు అనుకుంటాను.
అందుకే ఇందులో అడ్రస్ ఏమైనా దొరుకుతుందేమో అని వెదుకుతూ ‘ కథలా రాసుకున్న’ “ఇందు” భావాలని లేదా మానసిక ఆందోళనని చదివాను.

ఎంత విచిత్రమంటే ఈ ‘హెల్ప్ లైన్’ అంటూ మొదలుపెట్టింది మేము. మాకే ఈరోజు ఈ ప్రశ్న వేసినట్లు అయింది. నిజంగా హెల్ప్లైన్ ద్వారా సమస్యలు పరిష్కరించలేమా!! ముఖ్యంగా ఇలాంటి సున్నితమైన వాటిని వెదికి పట్టుకోగలమా?

మొగుడు కొడుతున్నాడు, తిడుతున్నాడు, లేదా అత్తమామల బాధలు, మగవాడి చేతిలో మోసపోవడాలు ఇవన్నీ ఇందు అన్నట్లు పైకి కనిపించేవా?

మరి వారి ఇలాంటి సమస్యలకి సమాధానాలు?

ఒక సంప్రదాయ కుటుంబంలో ఉన్న స్త్రీల బాధలు బైటికి రావా?!

స్త్రీలకోసం స్త్రీలు పాటుపడుతూ, ఎన్నివేల సమస్యలను తీర్చగలం?

అసలు స్త్రీ మనసే ఒక సమస్య అయినపుడు…
ఇది కథగా ప్రచురిస్తే కనీసం ఎక్కడైనా ఆమె చదివితే… ఇది నా కథ అంటూ ఆవిడ వస్తే?!

“హెల్ప్ లైన్” ద్వారా ఆవిడకి సహాయం అందించాలి.

ఇదంతా జరిగే పనా?! ప్రయత్నించాలి అనుకుంది స్త్రీల పత్రిక నడుపుతున్న ఆమని!!!

మర్నాడు పత్రిక ఆఫీసుకి వస్తూనే అందరితో ఈ డైరీ గురించి చెప్పి, “ యధాతధంగా డైరీ దొరికినట్లు దాన్ని తాను చదివినట్లు మొత్తం కధ వెయ్యమని” పురమాయించింది…

ఏదో ఒకరోజు తప్పకుండా “ఇందు” తన కథ చదువుకుని “ హెల్ప్లైన్” కి ఫోను చేస్తుంది అనుకుంది ఆమని.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.