ఎజెండాలో చేరని పిల్లల హక్కులు

ఎమ్‌.ఎ. వనజ
(వనజ స్మరణలో…)
ఉదయాన్నే లేచి పనులపై ‘బిజీ’గా రోడ్డుగా వెళ్లే మనకు వెంకటేషు, స్వరూప, జహంగీర్‌, కోటేషులాంటి పిల్లలు ఎంతోమంది కనబడుతూ ఉంటారు. వీళ్ళందరూ నాకు, మీకు, మనందరికీ పరిచయమే. రోడ్డుపై సిగ్నల్‌ పడగానే పన్నేండేళ్ళ వెంటేషు గబగబా వచ్చేసి క్షణాల్లో మన బండిని తుడిచేసి చేయి చాపుతాడు. ‘కొన్ని పైసలకోసం’ గాంధీ వేషం  వేసుకుని, ఒంటికి సునేరంతా రాసేసుకుని ఎండలో, వానలో నిలబడుతూంటే ఆ పిల్లవాడికి రంగుల వల్ల వచ్చే జబ్బు గురించి పట్టించుకోకుండా మన ‘దేశభక్తినే’ సవాలు చేసినట్లయి రూపాయికి తక్కువ కాకుండా కోటేషు చేతిలో పెడతాం. ఈ పిల్లవాడి వయసు పదేళ్ళకు మించదు. పదమూడేళ్ళ స్వరూప పొద్దునంతా రైల్వేస్టేషన్‌లో తిరుగుతూ, రాత్రి వేళలో తన చిన్నారి శరీరాన్ని మరొకడికి అప్పగించేస్తుంది. కొన్ని పైసలకోసం. ”ఇలాంటి అమ్మాయిలను బయటకు తేవడం మరీ కష్టమండీ, ఈజీ మనీకి అలవాటు పడి పోయారు”, పక్క నుండి ఇలాంటి కామెంట్స్‌.
వెంకటేషు, స్వరూప, జహంగీర్‌, కోటేషు వీళ్ళంతా ప్రతిరోజూ ‘ప్రమాదకరమైన పరిస్థితుల్లో’ బ్రతుకుతున్న పిల్లలు. ఇంకా వివరాల్లోకి పోతే ‘బీదపిల్లలు’, తక్కువ కులాలకు’ (?) చెందిన పిల్లలు ( ఈ విషయం రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమకారులకు ఇంకా బాగా తెలుసు. అందుకే ”మేం రోడ్లపై అడుక్కుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో చూడండి.” అని కార్లలో వచ్చి మరీ అందంగా, ఆడంబరంగా అడుక్కుని చూపించారు. ఇలాంటి పిల్లలే కాకుండా ఈ మధ్య ఇళ్ళల్లో వెట్టి చాకిరీ చేస్తున్న పిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా మన సిటీలో సార్లకు, దొరసాన్లకు పిల్లల్ని కన్న తర్వాత తాము ‘బిజీ’ అని పిల్లల్ని పెంచే ఓపిక, తీరిక తమకు ఉండట్లేదని గుర్తుకు వచ్చి, పక్క ఊర్లనుండి, ఉదాహరణకు హైదరాబాద్‌లాంటి పట్టణాల్లో అయితే మెదక్‌, మహబుబ్‌నగర్‌లాంటి జిల్లాలనుండి ‘బాలకార్మికులను’ తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పిల్లలు 13సం. లోపు ఆడపిల్లలు కనుక జడపిన్సీసులు, రంగు రంగుల బొట్లు ఇచ్చి కలర్‌ టివీ ఆశ చూపిస్తే చాలు వీరికి కనీస వేతనాలు ఇవ్వనవసరం లేదు. డిమాండ్లు, కోరికల ప్రసక్తే ఉండదు. ఈ విధంగా పిల్లల ‘నిస్సహాయత’ని మన అవసరాలకు’ ఆనందాలకు’  వాడుకుంటున్నాం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమమేమిటంటే ఎంతో మంది మేధావులు అనబడే వారి ఇళ్ళల్లో హక్కులకోసం పోరాడే వాళ్ళ ఇళ్ళలో కూడా ఆడపిల్లలు ‘వెట్టి చాకిరీ’ చేస్తూ కనిపిస్తున్నారు.
మేధావులు, సంఘాల్లో పనిచేసేవాళ్ళు తమను తాము సమర్ధించుకోవడానికి యేమంటున్నారంటే, ”మేము ఈ పిల్లలను రోడ్లపై అడుక్కునే పరిస్థితి నుండి రక్షించినాం. రెండు పూటలా తిండి పెడుతున్నాం.బట్టలిస్తున్నాం. ”ఇంకా మా పిల్లలతో సమానంగా టివి కూడా చూపిస్తున్నాం. (కొంతమంది పలకా, బలపం కొనిచ్చి చదువుకూడా చెప్పిస్తున్నాం) అంటున్నారు. ”మేధావులారా! నాగరీకులారా! అమాయకులైన ఈ  పిల్లల నుదటన ఈ విధమైన రాత రాయడానికి వాళ్ళ జీవితాన్ని మీ గుప్పిట్లో పెట్టుకోవడానికి మీరెవరు? వాళ్ళేమయినా మీ  పెంపుడు కుక్క పిల్లలా? వాళ్ళ కింత తిండి పడేసి, బట్టలిచ్చి, కలర్‌ టివీల్లో సినిమాలు చూపిస్తే మీ (దొర) బిడ్డల సేవలు చేయడానికి?  పిల్లలకు భారత రాజ్యాంగం కొన్ని హక్కులను కల్పించింది.  బాల్యాన్ని అనుభవించడం, ఆటా, పాటా వాళ్ళ హక్కు. ఈ హక్కు నుండి మీరు వాళ్ళను దూరం చేసి మీరు నేరస్థులవుతున్నారు. పిల్లలను మీ ఇళ్ళల్లో పెట్టుకుని వారికి తిండి పెట్టే బాధ్యతను దయచేసి మీరు తీసుకోకండి. దాని వల్ల మీకు ఒక పనిపిల్ల దొరుకుతుంది. నిరాశ్రయులైన పిల్లలను, అనాధలను, తల్లిదండ్రుల నిర్లక్ష్యనికి గురైన పిల్లలను ‘సంరక్షించే ‘ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానిదే. ఇలాంటి పిల్లలను  జువెనైల్‌ హోంలలో, ప్రభుత్వ హాస్టళ్ళల్లో పెట్టడంద్వారా, వాళ్ళకు ఆశ్రయం దొరుకుతుంది.  అంతే కాకుండా ప్రభుత్వ సంస్థలలోని పరిస్థితులను  ప్రశ్నించడంద్వారా, ప్రభుత్వానికి, ఆ ఉద్యోగస్థులకు జవాబుదారీతనం పెరిగి వాటిలో పరిస్థితులు కొంత మెరుగవుతాయి. ఎందుకంటే  ప్రభుత్వ సంక్షేమ పధకాలు, రాజ్యాంగం ప్రభుత్వంపై ఉంచిన  బాధ్యతలు ఇవన్నీ కాగితాలకే పరిమతం అనేది ఒక వాస్తవం. అందుకే అంతే ఖచ్చితంగా ఈ పరిస్థితులను ప్రశ్నించాల్సింది మనమే.
అయితే మనం పెద్దవాళ్ళం. అందులో ఎక్కువ మంది ఉన్నత వర్గాలకూ(?) ఉన్నత కులాలకూ చెందిన వాళ్ళం. చీకు చింతా లేని మన బతుకుల కోసం పాకులాడే మధ్యతరగతి మనుష్యులం. మరికొంత మందిమి హక్కులకోసం మాట్లాడే వాళ్ళం. పెద్ద పెద్ద వాక్‌ ”స్వాతంత్య్రపు హక్కు, పెద్దవాళ్ళ స్వేచ్ఛ హక్కు, పెద్ద వాళ్ళ ఉద్యోగం చేసుకునే హక్కు, స్త్రీల హక్కు, దళితుల హక్కు, రాజకీయ ఖైదీల హక్కులు..ఇన్ని హక్కుల్లో పిల్లల హక్కుల ప్రస్తావన ఏది? మన పెద్దవాళ్ళకు పిల్లల హక్కుల కోసం పోరాడే తీరికేది. పిల్లలు, బీదపిల్లలు, మైనారిటీ వర్గాల పిల్లలు, వాళ్ళకంటూ హక్కులుంటాయి అనే స్పృహలేని, ఓటు హక్కులేని వాళ్ళు, పోలీస్‌శాఖకు ‘ఆవారా కేసులుగా’, స్త్రీ శిశు సంక్షేమశాఖకు, సాంఘిక సంక్షేమశాఖకు, ”మేమూ పిల్లల కోసం హాస్టల్స్‌ని పెట్టామని చెప్పుకోవడానికి, వాటిని దారుణమైన పరిస్థితుల్లో నామమాత్రంగా పెట్టి ప్రభుత్వోద్యోగుల ‘జీవనోపాధికి’ నెల తిరగ్గానే జీతాలు తీసుకోవడానికి పనికి వస్తున్న పిల్లలు, రాజకీయ నాయకులకు ఉపన్యాసాల్లో వాడుకోవడానికి ‘వస్తువులుగా’ ఉపయోగపడే పిల్లలు.
ఇక పిల్లల రక్షణ కోసం రూపొందించిన చట్టాల విషయానికొస్తే,
భారత రాజ్యాంగంలో పిల్లలు తన వయసుకూ, బలానికి సరిపోని పనులు చేయకూడదు- ఆర్టికల్‌ 39
పిల్లలకు పద్నాలుగు సంవత్సరాల వయస్సు వచ్చేవరకు ఉచిత మరియు నిర్భంద విద్యను చెప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే- (ఆర్టికల్‌ 45) కానీ ఇవి కేవలం ఆదేశిక సూత్రాలు మాత్రమే. వీటిని తప్పని సరిగా ఆచరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదు.
పిల్లలు ‘ప్రమాదకరమైన పనులు’ చేయకూడదని జస్టిస్‌ కుల్దీప్‌సింగు ఒక తీర్పులో అన్నాడు. ఇంకా ముందుకు పోయి అసలు పిల్లల చదువుకు దూరం కాబట్టి ‘పనులు’ చేయడమే ప్రమాదకరం అనే విశ్లేషణ రావాలి. ముఖ్యంగా పధ్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలందరూ ఖచ్చితంగా ‘విద్య’ను పొందే హక్కు కల్పించాలి. అది పిల్లలందరి ‘ప్రాధమిక హక్కు’ గా రాజ్యాంగ సవరణ చేయాలి.
అలాగే దొంగతనాలు లాంటి నేరాల్లో ఉన్నారనే ఆరోపణతో ఉండే పిల్లలను ఇంతకు ముందు పెద్ద వాళ్ళతో పాటు జైళ్ళలో ఉంచేవారు. ఇట్లాంటి పిల్లలపట్ల ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన వైఖరి ఉండేది. 1986లో జువైనైల్‌ జస్టిస్‌ ఆక్ట్‌ అమలులోనికి వచ్చింది. జువెనైల్‌ జస్టిస్‌ ఆక్ట్‌ ముఖ్యంగా దేశమంతటా పిల్లలకు సంబంధించి ఒకే చట్టం ఉండాలనే ఉద్దేశ్యంతో పిల్లలను నేరస్థులుగా పరిగణించకుండా, వారిలో మానసిక పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే రూపొందించబడింది. ఈ చట్టం, నిరక్ష్యానికి గురికాబడిన పిల్లలు, ఆన్‌ కంట్రోలబుల్‌ చిల్డ్రన్స్‌, ‘తప్పు చేసిన పిల్లలు’ మొదలయిన వారి గురించి మాట్లాడుతుంది. ఈ పిల్లలందరినీ ఒక ‘హోమ్‌’లో పెట్టాలని, ఆ హోమ్‌ వాతావరణం పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి తోడ్పాడాలని చెబుతుంది. ఏ పిల్లలయినా ముందుగా హోంకు తీసుకుని వచ్చినపుడు పరిశీలక గృహం( అబ్జర్వేషన్‌ హోం)లో ఉంచుతారు. ఈ పరిశీలక గృహంలో పిల్లలెవ్వరినీ నెలల తరబడి పెట్టుకోకుండా ఇవి పిల్లలకు తాత్కాలిక విడిది గృహాలుగా మాత్రమే ఉండాలని, ఒక వేళ అవసరమైతే తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురైన పిల్లలను, ఇంటి నుండి తప్పిపోయి వచ్చి తల్లిదండ్రుల చిరునామా చెప్పలేని పిల్లలు మొదలగు వారిని జువెనైల్‌ హోంలలో ఉంచాలని, ‘తప్పు’ చేసిన పిల్లల తప్పులు పిల్లల కోర్టుల్లో నిరూపించబడితే వారిని ‘స్పెషల్‌ హోం’లలో పెట్టాలని ఈ చట్టం చెబుతుంది. ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలవరకు, మగపిల్లలు పదహారు సంవత్సరాలవరకు ‘జువెనైల్‌’గా పరిగణించబడతారు.
అయితే సాధారణంగా అన్ని చట్టాల మాదిరిగానే ఈ చట్టం అచరణలో విఫలమైంది. అంతేకాకుండా ఈ చట్టం అన్ని అంశాల పై వివరంగా మాట్లాడలేదు. ఈ చట్టంలో ఉన్న లొసుగులకోసం మరొక చర్చనే పెట్టాల్సివస్తుంది. ఈ చట్టం అమలు, దాని వైఫల్యం కు కారణం ప్రభుత్వం, దాని సంబంధిత యంత్రాంగాలయిన స్త్రీ, శిశు సంక్షేమశాఖ, జువెనైల్‌ వెల్ఫేర్‌ కరెక్షనల్‌ సర్వీస్‌లు.
జువెనైల్‌ హోంలో పిల్లలకు  సరియైన తిండి ఉండదు. మంచి బట్టలుండవు. చదువు లేదు. వృతి విద్యలు లేవు. ఆడుకోనివ్వరు. ఇవన్నీ సాధారణంగా ప్రతి ప్రభుత్వ సంస్థలలో ఉండే పరిస్థితే. అయితే ఈ పరిస్థితులకు అదనంగా మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ జువెనైల్‌ హోంలో పిల్లలు నాలుగోడలు మధ్య బందీలుగా ఉన్నారు. మన హైద్రాబాద్‌ విషయమే తీసుకుంటే బాలికలకు సంబంధించిన పరిశీలక గృహం, జువెనైల్‌ హోం, స్పెషల్‌ హోం మూడు ఒకే ప్రదేశంలో ఉన్నాయి. ఇది కాచిగూడా దగ్గరి నింబోలిఅడ్డాలోె ఉంది. బాలుర పరిశీలక గృహం చెంచల్‌గూడా జైలులోనే ఒక వేరే బిల్డింగులో వుంది.  మిగతా రెండు గృహాలు అంటే జువెనైల్‌ హోంలు, స్పెషల్‌ హోంలు సైదాబాద్‌లో వున్నాయి. ఈ అన్ని హోమ్‌ నిర్మాణాలు, భవనపు కట్టడాలు, గేట్లు, తలుపులు ఉండే ప్రదేశాలు అన్నీ జువెనైల్‌ జస్టిస్‌ ఆక్ట్‌ చెప్పిన విషయానికి విరుద్ధంగానే ఉన్నాయి. ఎత్తయిన గోడలు, ఇనుపతీగెలు, పెద్ద గేట్లు, బారక్‌లు (జైలు భాష) నాలుగ్గోడల మధ్య భయంకరమైన పరిస్థితులవల్ల పిల్లలకు ప్రమాదకరమైన ఆలోచనలు వస్తాయి. ఈ హోంలలో చిన్న తప్పు క్రింద పట్టుబడిన పిల్లలు విడుదలయి బయలకు వెళ్ళిన తర్వాత మరిన్ని ‘తప్పులు’ చేసి తిరిగి హోంకే వస్తున్నారు. మరికొన్ని సందర్భాలలో ఒక కేసులో అన్యాయంగా ఇరుక్కుపోయి బయటకు విడుదలయిన పిల్లను పోలీసులు కూడా వదలటం లేదు. పెద్దలు చేసిన దొంగతనాలలో, తమ చేతులు ‘దులుపుకోవడానికో’, ‘తడుపుకోడానికో’ ఈ పిల్లలను ఎరలుగా వాడుకొని వారికి సంబంధమే లేని కేసులలో ‘నేరస్థులుగా’చూపుతున్నారు. మా జువెనైల్‌ రైటర్స్‌ ఫోరమ్‌ రాష్ట్రంలోని అన్ని జువెనైల్‌ హోంలలో ఒక సర్వే జరిపింది. అన్ని హోంలలో పరిస్థితి దారుణంగా వుంది. దాదాపు తొంభైతొమ్మిది శాతం పిల్లలు దళితులు, మైనారిటీ వర్గాల పేదవారే. ఏ హోంలో కూడా జువెనైల్‌ జస్టిస్‌ ఆక్ట్‌ ఆచరణలో పెట్టడం లేదు. పిల్లలను కొట్టటడం, శిక్షలు వేయడం మామూలే. హోమ్స్‌లోని పిల్లల భాషలో చెప్పాలంటే ‘కోటింగులు’ రోజూ ఇస్తారు.
బాల్యవివాహాల నిరోధక చట్టం (1928), బాలకార్మిక నిరోధక చట్టం (1986) వెట్టి చాకరీ నిర్మూలన చట్టం(1976) మొదలైన చట్టాలు పిల్లల కోసం రూపొందించబడ్డాయి. అంతే కాకుండా మన రాష్ట్రానికి సంబంధించిన కార్మిక చట్టాలలో ఎ.పి. షాప్స్‌ మరియు ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ ఆక్ట్‌ 1988 లాంటివి కూడా రూపొందించబడ్డాయి. ఈ చట్టం రెస్టొరెంట్లు, వ్యాపార సంస్థలు మొదలయిన వాటిలో పనిచేసే పిల్లలు, వారి పనిగంటలు, వేతనాల గురించి మాట్లాడుతుంది. ఇలాంటి చట్టాలు ఇంకా చాలానే ఉన్నాయి. కాని చట్టాలను రూపోందించడానికి, వాటిని అమలుపరచడానికి మధ్య ‘భూమ్యాకాశా లంత’ దూరం ఉంది. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల ఒత్తిడికి లొంగి తప్పనిసరై ప్రభుత్వం పిల్లలకోసం, బాలకార్మికుల నిర్మూలనకోసం జువెనైల్‌ జస్టిస్‌ ఆక్ట్‌లాంటి చట్టాలను తీసుకుని వచ్చింది. కానీ ఆచరణలో మాత్రం ‘చిత్తశుద్ధి’ ఉండదు. చట్టాలను రూపొందించేది,ఆ చట్టాలను అతిక్రమించేది కూడా ఈ ప్రభుత్వాలే. కొన్ని సందర్భాలలో అయితే చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్న విషయాలలో కూడా ప్రభుత్వం నిర్లిప్తధోరణిని ప్రదర్శిస్తుంది. పిల్లల సమస్య కాబట్టి ఎవరూ పట్టించుకోక, ‘సమస్యలుగానే’ ఉండిపోతాయి. అందుకు ఉదాహరణ ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతూ ఉన్న ‘ఇళ్ళల్లో పని పిల్లలను పెట్టుకోవడం’ అనే సమస్య. ఈ ఇళ్ళలో పనిపిల్లలకు కనీస పనిగంటలు ఉండవు. కనీస వేతనాలు ఉండవు. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాకిరీ చేయాల్సిందే. ఈ పిల్లలపై యజమానుల క్రూరత్వం ‘పరాకాష్ట’కు చేరుకుంటున్నాయి.  అలాంటి సంఘటనలు వెలుగులోనికి వస్తున్నాయి. ఇళ్ళలో పనిపిల్లలపై యజమానులు జరిపే శారీరక, మానసిక వేధింపులు, లైంగిక అత్యాచారాలు అన్నీ ‘నాలుగోడల’మధ్యనే ఉండిపోతున్నాయి. ఈ మధ్యనే జాతీయ మానవ హక్కుల కమీషన్‌’ ఇళ్ళల్లో పనిపిల్లల వెట్టిచాకిరి’ పై స్పందించి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ‘మార్గదర్శక సూత్రాలు’ పంపించింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వోద్యుగులు తమ ఇళ్ళల్లో పనిపిల్లలను ఉంచుకోకూడని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేయాలి. అవి అమలు జరిగేలా చూడాలి. ఇప్పటివరకు ఈ విషయంలో మన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దగ్గర నుండి మాత్రం ఎలాంటి ‘ప్రతిస్పందన’ లేదు.
గత డిసెంబర్‌ 2000 లో  హైద్రాబాద్‌లో ఫరీన్‌ అనే ఆరు సంవత్సరాల పనిపిల్ల హత్యకు గురయింది. పాలు పొంగిపోతూ ఉంటే పట్టించుకోలేదనే చిన్న కారణం మీద యింటి యజమాని ఆ పనిపిల్లని విపరీతంగా కొట్టడంవల్లనే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని చంపేసి పాతి పెట్టేసి చేతులు కడిగేసుకుందామను కున్నారు ఆ యజమానులు.
అలాంటి సందార్భాలలో పిల్లల హక్కులకోసం పనిచేసే సంస్థలు ఈ యజమానులపై వెట్టి చాకిరి నిర్మూలన చట్టంను అమలు పరచమని, భారతీయ శిక్షాస్మృతిలోని కొన్ని సెక్షన్‌లను చెబుతూ, వాటి ఆధారంగా యజమానులను శిక్షంచాలనే ‘పరిమితమైన’ డిమాండ్‌ చేయాల్సి వస్తుంది. కానీ ఇలాంటి చట్టాల్లో కూడా ‘ఇళ్ళల్లో పనిపిల్లల గురించి’ ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. ఇలాంటి పిల్లలకోసం ఇప్పటివరకు మన ప్రభుత్వం, న్యాయవ్యవస్థ ఎక్కడా స్పందించలేదు.
కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌ (తెలంగాణా ప్రదేశం) పిల్లల రక్షణ చట్టం’ అనే నిజాం కాలానికి చెందిన ఒక చట్టం కొంత సవరణతో ఉంది. ఈ చట్టం పనిపిల్లల వెట్టి చాకిరీ గురించి మాట్లాడింది.  ఈ చట్టం ప్రకారం ఏడు సంవత్సరాలలోపు పిల్లలను పనికోసం ఇళ్ళల్లో ఉంచుకోవడం పూర్తిగా నిషేధం. 12 సం. లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడానికి ఈ చట్టం ప్రకారం పనికోసం పిల్లలను పెట్టుకుంటే ఒక వారం లోపల జిల్లా అధికారికి ఈ విషయం రిపోర్టు చేసి, రిజిస్టర్‌ లో ఆ విషయం నమోదు చేయించాలి. ఒక వేళ ఏదైనా కారణం చేత ఆ పిల్లలను పనిలో నుండి తొలిగిస్తే ఆ విషయాన్ని కూడా ఆ రిజిస్టర్‌లో నమోదు చేయించాల్సి ఉంటుంది. ఈ విధంగా పనిపిల్లలను బానిసలుగా పెట్టుకుంటున్న యజమానులపై నిఘా ఉంటుంది. అపుడు ఈ చట్టం ఎంతవరకు ఆచరణకు నోచుకుందో తెలీదుకాని, ఇపుడు మాత్రం ఆ చట్టమే  ‘బూజుపట్టిన దశ’లో ఉంది.
ప్రస్తుతం ఇళ్ళల్లో పనిపిల్లలను పెట్టుకోవడం అనేది ఒక సాంఘిక దురాచారంగా మారుతూ వస్తూ, ‘కన్యాశుల్కం’ లాంటి వాటికి బలయిపోయిన ఆడపిల్లలను గుర్తుకు తెస్తూ వుంది. ఈ మధ్యకాలంలో పట్టణాలలో ఉంటున్న స్త్రీలు ప్రసవించిన తరువాత చుట్టు పక్కల ఊళ్ళల్లో ఉండే తల్లి దండ్రులు కట్నకానుకలతో పాటు ఒక పనిపిల్లను ఆమె వెంట పంపడం కూడా ఒక ఆచారం. ఆ ఆడపిల్ల పేరు మీద నెలకు వందనో, రెండు వందలో బ్యాంకులో వేసి పెద్దది కాగానే పెళ్ళి చేస్తామనే హామీ ఇస్తే చాలు. 24 గంటలు ఇంటిని కనిపెట్టుకుని, పిల్లలను కనిపెట్టుకుని, అన్నీ పనులు చేసిపెట్టే ‘బానిస’ దొరికినట్టే.
తల్లిదండ్రులు, సమాజ నిర్లక్ష్యానికి గురయిన పిల్లలు వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న పిల్లలు, బాల్య వివాహమనే దురాచారానికి బలవుతున్న పిల్లలు, ఇళ్ళల్లో వెట్టి చాకిరీ చేస్తున్న పిల్లలు. పత్తి చేలల్లో పనిచేస్తూ క్రిమిసంహారక మందులు ఒంటికి పడక చచ్చిపోతున్న పిల్లలు, జోగినులు, మాతమ్మలు, వేశ్యావృత్తిలో ఉన్న పిల్లలు, మందుల ప్యాక్టరీలలో, టపాకాయల తయారీలో, అగ్గిపెట్టెలు, కార్పెట్లు, గాజుల తయారీలాంటి పనుల్లో ఉన్న పిల్లలు, మెకానిక్‌ షాపుల్లో, ఇరానీకేఫ్‌లు, హోటళ్ళు, ఎక్కడ పడితే అక్కడ ఉండే బాలకార్మికులు, బిచ్చమెత్తుకుని బ్రతికే పిల్లలు, వీధిబాలలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది  బాలలు కనీసహక్కులకు దూరమై తమ తరఫున ప్రశ్నించేవారు లేక, దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఈ పిల్లల పట్ల వారి సమస్యల పట్ల స్పందించేవారు, రాజకీయ సంస్థలు ఒక సంఘటనకో, ఒక ప్రభుత్వ సంస్థ పని తీరుపైనో (ఉదాహరణకు ఫలానా సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో తిండి బాగా లేదని) మాట్లాడటానికే పరిమితమై పోకుండా పిల్లల కుండే సమస్యలను మొత్తంగానే ఉద్యమరూపం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు బడికి వెళ్ళకపోవడానికి తల్లిదండ్రుల పేదరికమే కారణమని, ఆ పేదరికం పోతే కాని దేశంలోని పిల్లలందరూ స్కూళ్ళకెళ్ళడం మొదలు పెట్టరు అనే అవగాహనను కూడా మార్చుకుంటేనే మంచిది. ఆ అవగాహనవల్ల పేదవాళ్ళకు ఎంతసేపు తమ పిల్లలను పనిలో పెట్టాలనే ఆలోచనలతో ఉంటారని డబ్బున్నవారు మాత్రమే తమ పిల్లలను స్కూళ్ళకు పంపిస్తారనే వాదనకు బలం చేకూరుస్తుంది. మన పెద్దవాళ్ళకున్న ఈ తప్పుడు అవగాహనల ప్రభావం పిల్లలకు సంబంధించిన చట్టాలపై పడుతుంది.
ఈ విధంగా పిల్లలు చదువుకోకుండా, బాల్యాన్ని అనుభవించనీయకుండా చేస్తున్న ప్రభుత్వాలను, వాటి సంక్షేమ పథకాలను, పిల్లల రక్షణ (?) కొరకు నామమాత్రంగానే ఉన్న చట్టాలను మనం ప్రశ్నించాల్సిందే.  (పిల్లల ప్రత్యేక సంచిక  నవంబర్‌ 99-ఫిబ్రవరి 2000నుండి పునర్ముద్రితం)

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో