అలుపెరగని పోరాట కెరటం అలసిన వేళ….

”మేధావులారా! నాగరీకులారా! అమాయకులైన ఈ పిల్లల నుదటన ఈ విధమైన రాత రాయడానికి , వాళ్ళ జీవితాన్ని మీ గుప్పిట్లో పెట్టుకోవడానికి మీరెవరు? వాళ్ళేమైనా మీ పెంపుడు కుక్క పిల్లలా? వాళ్ళ కింత తిండి పడేసి, బట్టలిచ్చి, కలర్‌ టీవీల్లో సినిమాలు చూపిస్తే మీ (దొర) బిడ్డల సేవలు చేయడానికి? ” (భూమిక  పిల్లల ప్రత్యేక నుంచి) ఫిరంగి గుళ్ళలాంటి ఇలాంటి మాటలు రాయగల్గిన, చెప్పగల్గిన గుండె నిబ్బరం వున్న  ఏం. ఏ. వనజ శారీరకంగా మన నుంచి దూరమై పోయిందంటే నమ్మ బుద్దయిత లేదు. చాలా రోజులుగా తన గొంతు వినబడక పోవడం వెనుక తన అనారోగ్యముందని తెలిసినా, ఆ గొంతును శాశ్వతంగా పోగొట్టుకున్నామంటే చెప్పలేనంత దు:ఖంగా వుంది.” సత్యవతిగారూ! ఆ… బాగున్నరా” అంటూ నోరారా పల్కరించడం- ఫోన్‌లోనైనా , ఎదుట పడినా అదే తీరు. ”దిశ” మొదటి సంచిక ప్లాన్‌ చేసినపుడు, తర్జనిగా మార్చినపుడు ఆర్‌ఎన్‌ఐకి సంబంధించిన వ్యవహారాల్లో సలహాల కోసమొచ్చినపుడు – ఆ పత్రిక పట్ల తన ప్రేమ, దానిని ఏ విధంగా  తీర్చిదిద్దాలనే  దానిమీద  తన నిబద్ధమైన ప్లానింగు. నాకు మొదటి నుంచీ తెలుసు. ఆ పత్రికని నలుగురిలోకి తీసుకెళ్ళాలనే తపనతో ఎవరెన్ని కాపీలు పోస్ట్‌ చెయ్యగలరని ఆరాటపడడం- తను చేసే పనులకి అనారోగ్యం అడ్డమని ఏ రోజూ కంప్లయింట్‌ చెయ్యలేదు. తను చెయ్యదలుచుకున్న పనుల్ని మొండిగా, పట్టుదలగా చెయ్యాలి. అంతే. వనజలో వున్న ఆ నిబద్ధత, పట్టుదల, శ్రమ పడే గుణం ఒక్క పదిమందిలో వున్నా చాలు అద్భుతాలు చేసి చూపించొచ్చు. బాధితుల కన్నీళ్ళు తుడవడంలో, కష్టాల్ని పంచుకోవడంలో – వాళ్ళు గృహహింస బాధితులా, చట్టబాధితులా, బాల్య వివాహ బాధితులా, వికలాంగులా, మరుగుజ్జు మనుష్యులా ఎవరైనా కానీ వాళ్ళ కోసం వున్న చట్టాలని బయటకు తీసి అవి అమలయ్యేలా అవిశ్రాంత పోరాటం చేసింది వనజ.
వనజకి చాలా సీరియస్‌గా వుందని, అడ్వకేట్‌ మంజుల ఫోన్‌ చేసి చెప్పగానే మెడ్విన్‌ హాస్పిటల్‌కి పరుగెత్తాను. దిగులు ముఖాలతో వనజ అమ్మగారు, అన్న వాసు కన్పించారు గానీ తనని చూడడానికి వీలవ్వలేదు. మహిళల హక్కుల కోసం కోర్టుల్లోనో, మానవ హక్కుల కమీషన్‌లోనో పోరాడే వనజ మృత్యువుతో పోరాడుతోందని, ముఖ్య అవయవాలు సరిగా పనిచెయ్యడం లేదని వాసు చెప్పినపుడు చాలా దిగులేసింది. ఆ మర్నాడే వనజ ఇంక లేదని తెలిసి ఎంతోమందిమి తల్లడిల్లుతూ ఆమె ఇంటికెళ్ళాం. అక్కడి కెళ్ళేవరకు మాకు ఎవరికీ తెలియదు వనజ తనంత తానుగా  శాశ్వతంగా సెలవు తీసుకుందని. తను రాసిన ఆఖరి ఉత్తరం అక్కడున్న అందరి గుండెల్ని పిండేసింది. వెక్కి వెక్కి ఏడ్పించింది. తన మనశ్శరీరాలతోనే కాదు వ్యవస్థతోను అలుపెరగని పోరాటం చేసిన వనజ ముఖం ఆ క్షణంలో ఎంతో ప్రశాంతంగా వుంది. 38 ఏళ్ళ జీవిత కాలంలోనే వందేళ్ళ  పనిచేసి, ఏక్టివిస్ట్‌ అంటే ఇలా వుండాలి, అడ్వకేట్‌ అంటే ఇలా పని చెయ్యాలి, ప్రభుత్వం చేత ఇలా పని చేయించాలి అంటూ తన జీవితాన్నే ప్రమాణంగా చేసి చూపించడం తన ప్రత్యేకత. బాలల హక్కులతో మొదలుపెట్టి, బాల్య వివాహాల నాపే దిశగా అడుగేసి, హింసలో మగ్గే స్త్రీల కోసం నల్లకోటుతో ఉద్యమించిన వనజ ముట్టని అంశం లేదు. రాయని సబ్జెక్టు లేదు. తన తర్జని పత్రికని కార్యకర్తల కరదీపికగా మలిచింది. సమాచార చట్టం గురించి రాసినా, పనికి ఆహార పధకం గురించి రాసినా, గృహహింస చట్టం గురించి రాసినా, బాల్యవివాహాల గురించి రాసినా అదే పదును. ఓ కొత్త ఒరవడి. తన ఆరోగ్యం బాగా లేకపోయినా, ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే ప్రమాదంఉన్నా విశాఖ ఏజన్సీలో విషజ్వరాల ప్రబలినపుడు పాడేరు వెళ్ళి వచ్చి నాతో ఆ విషయం చెప్పినపుడు నా గుండె ఝుల్లుమంది. ఈ పిల్లకు ఎంత తెగింపు, ఎంత ధైర్యం అన్పించింది. భూమిక హెల్ప్‌లైన్‌లో స్వచ్ఛందంగా ఎంతోమంది అడ్వకేట్‌లు పనిచేస్తూ, బాధితులకు న్యాయసలహాలు అందించడం వెనుక వనజ కృషి ఎంతో వుంది. తనే చాలామందిని భూమికకి పరిచయం చేసింది.
ఏప్రిల్‌ 24న జరిగిన వనజ సంస్మరణ సభ వనజతో పెనవేసుకున్న వివిధ వ్యక్తుల జ్ఞాపకాల వెల్లువ. సభలోని వారందరి కళ్ళు చెమ్మగిల్లుతూనే వున్నాయి. వనజ అమ్మగారు తన గురించి రాసిన  ఉత్తరాన్ని చదువుతుంటే చెమ్మగిల్లని నయనం ఆ సభలో లేదు. వేదికమీద  కట్టిన ప్లెక్సీ బ్యానర్‌లోంచి సూటీగా, తీక్షణంగా ఆమె కళ్ళు అందర్ని చూస్తూనే వున్నాయి. ఆమె గురించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ – నీ ఆశయాలను సాధిస్తాం, నీ బాటను విడువం అంటూ వాగ్ధానాలు చేస్తున్న అందరికీ ఓ హెచ్చరికనా అన్నట్టుంది ఆ చూపులోని తీక్షణత.
మానవ హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం, బాలల హక్కుల కోసం ఉద్యమించి, కలవరించి, పలవరించి పుస్తకాల రాసి, డాక్యుమెంటరీలు తీసిన వనజ- ఇన్ని పనులు సంపూర్ణారోగ్యైశ్వర్యాలతో తులతూగుతూ చేయలేదు. పంటి బిగువున బాధని అదిమిపెట్టి, కన్నీటిని సైతం శాసించి నిరంతరం చిర్నవ్వుతూనే తాను చెయ్యదలిచిన వాటినన్నింటినీ పూర్తి చేసింది. మనందరి కోసం దారులేసి వుంచింది. ఆమె నడిచిన దారి ముళ్ళదారే- ఆమె పాదాల నిండా ఎన్నో ముళ్ళు కసుక్కున దిగే వుంటాయి. మహిళలపై హింసా రూపాలు నిరంతరం మారుతున్న ఈ రోజున – యాసిడ్‌ దాడులు, ప్రేమ దాడులు, పెళ్ళి దాడులు, లైంగిక దాడులు రకరకాల దాడుల్లో  మహిళలు ఉక్కిరి బిక్కిరై దిక్కుతోచక అల్లాడుతున్న వేళ, వేనవేల వనజలు కావాల్సి వున్న వేళ – వనజా! నువ్వు ఇంత చిన్న వయస్సులో వెళ్ళి పోవడం మహిళల బాలల ఉద్యమానికి తీరని లోటు. తర్జని పత్రికని నడిపించడం, బాధితుల కోసం నువ్వుందించిన సేవల్ని కొనసాగించడమే నీకు నిజమై నివాళి.. ఈ పనుల్ని మితృలంతా కొనసాగిస్తారని బలంగా నమ్ముతూ… తన చివరి ఉత్తరంలో ఎంతో హుందాతనాన్ని, సెల్ఫ్‌డిగ్నిటినీ ప్రదర్శించిన వనజ జ్ఞాపకం మరణం తర్వాత కూడా అంతే హుందాగా కొనసాగేలా తన మితృలంతా కృషి చెయ్యాలని ఆశిస్తూ… కన్నీళ్ళతో…

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

3 Responses to అలుపెరగని పోరాట కెరటం అలసిన వేళ….

  1. prashanth says:

    వనజ గారిని కళ్ళముందు నిలిపినందుకు క్రుతగ్నతలు.

  2. pasupuleti geetha says:

    సత్యవతి గారు,
    వనజ స్మ్రుతుల్ని మళ్ళొకసారి గుర్తు చేశారు. ఆ స్నేహశీలికి నివాళులర్పిస్తూ,
    ధన్యవాదాలతో,
    పసుపులేటి గీత

  3. Ramu says:

    మంచి వ్యాసాలు అందిస్తున్న మీకు థాంక్స్.
    మహిళలు, యువతులు ఎదుర్కుంటున్న ఒక దారుణమైన సమస్యపై నా బ్లాగ్ లో లేటెస్ట్ పోస్ట్ చదివండి. వీలయితే…(బాగుందని మీరు అనుకుంటే) దాన్ని మీ పత్రికలో వాడుకోండి.
    రాము
    apmediakaburlu..blogspot..com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.