కుటుంబ హింసనుంచి మహిళలకు రక్షణ చట్టం, 2005 (చాప్టర్ – 3)

రక్షణాధికారుల, సేవలందించేవారి అధికారాలు, విధులు

4. రక్షణాధికారికి సమాచారం ఎలా? సమాచారం ఇచ్చినవారిపై బాధ్యతలేమిటి?
1) ఒక కుటుంబ హింసా సంఘటన కొంతకాలంగా జరుగుతూ వుందని గాని, ప్రస్తుతం జరుగుతోందని గాని, లేదా, జరిగే అవకాశం వుందని గాని విశ్వసించడానికి తగిన కారణం కలిగిన వ్యక్తి, ఆ సమాచారాన్ని సంబంధిత రక్షణ అధికారికి ఇవ్వవచ్చు.
2) మంచి ఉద్దేశంతో సబ్- సెక్షన్ (1) కింద సమాచారం ఇచ్చే ఏ వ్యక్తిపైనా సివిల్ లేదా క్రిమినల్ పరమైన బాధ్యతలేవీ వుండవు.

5. పోలీసు అధికారులు, సేవలందించే వారు, మేజిస్ట్రేట్ల విధులుః-
కుటుంబ హింస గురించి ఫిర్యాదు అందుకున్న లేదా, సంఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న లేదా, సంఘటన గురించి తనకు సమాచారం అందినపుడు, పోలీసు అధికారి, రక్షణాధికారి, సేవలందించేవారు లేదా మేజిస్ట్రేటు, బాధితురాలికి ఈ కింది విషయాలు తెలియజేయాలిః
ఎ) రక్షణ ఉత్తర్వు, ఆర్థిక ఉపశమనం కోసం ఉత్తర్వు,పిల్లల కస్టడీ ఉత్తర్వు, ఇంటిలో వుండేందుకు ఉత్తర్వు, పరిహారం ఉత్తర్వులలో ఏవైనా లేదా ఒకటికంటే ఎక్కువ ఉత్తర్వుల ద్వారా ఉపశమనం పొందవచ్చని;
బి) సేవలందించే వారి సేవల గురించి,
సి) రక్షణాధికారి సేవల గురించి,
డి) లీగల్ సర్వీసెస్ అధారిటీ చట్టం, 1987 కింద ఆమెకు ఉచిత న్యాయసేవలు అందుతాయని,
ఇ) అవసరమైతే, భారత శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 498 ఎ కింద ఆమె ఫిర్యాదు చేసుకునే హక్కు వుందని.
ఒక కాగ్నిజబుల్ నేరం జరిగినపుడు, చట్టప్రకారం చర్య తీసుకోవలసిన బాధ్యత నుంచి పోలీసు అధికారిని విముక్తి చేసేలా ఈ చట్టంలోని దేనినీ తప్పుగా అర్థం చేసుకునే వీలులేదు.

6. షెల్టర్ హోంల విధులు ఏమిటి?
బాధితురాలికి ఆశ్రయం కావాలని కోరుతూ ఒక బాధితురాలు, లేదా, ఆమె తరఫున రక్షణాధికారి, లేదా, సేవలందించేవారు షెల్టర్ హోం ఇన్ఛార్జికి దరఖాస్తు చేస్తే, ఇన్ఛార్జి ఆమెకు విధిగా ఆ హోంలో ఆశ్రయం కల్పించాలి.

7. వైద్య సేవల కేంద్రాల విధులు ఏమిటి?
బాధితురాలు, లేదా, ఆమె తరపున రక్షణాధికారి లేదా సేవలందించేవారు ఆమెకు వైద్య సహాయం కావాలని కోరుతూ వైద్య సేవల కేంద్రానికి దరఖాస్తు చేస్తే, ఆ ఇన్ఛార్జి ఆమెకు విధిగా వైద్య సహాయం అందించాలి.

8. రక్షణాధికారులు ఎలా నియమితులవుతారు?
1) ప్రతి జిల్లాలో అవసరమైనంత మంది రక్షణాధికారులను, ప్రభుత్వం నిర్ణయించిన సంఖ్యలో, ఒక నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఈ చట్టం కింద ఏ ప్రాంతంలో/ ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తారో ప్రకటిస్తుంది.
2) రక్షణాధికారులు వీలైనంత వరకు మహిళలై వుండాలి, నిర్దేశించిన అర్హతానుభవాలు కలిగి వుండాలి.
3) రక్షణాధికారి, వారికింది సిబ్బంది సర్వీసు నిబంధనలను రూపొందించాలి.

9. రక్షణాధికారుల విధులు ఏమిటి?
ఎ) ఈ చట్టం కింద మేజిస్ట్రేట్ బాధ్యతలను నిర్వర్తించడంలో సహకరించాలి.
బి) ఒక కుటుంబ హింస జరిగినట్లు ఫిర్యాదు అందగానే, కుటుంబ సంఘటన నివేదికను తయారు చేసి, మేజిస్ట్రేట్కి నివేదించాలి, వాటి నకళ్ళను సంబంధిత ప్రాంత పోలీసు స్టేషన్కు సేవలందించేవారికి పంపాలి.
సి) బాధితురాలు కోరిన ఉపశమనాల ప్రకారం రక్షణ ఉత్తర్వుల జారీకోసం మేజిస్ట్రేట్కి తగిన విధంగా దరఖాస్తు చేయాలి.
డి) లీగల్ సర్వీసెస్ అధారిటీస్ చట్టం, 1987 ప్రకారం బాధితురాలికి న్యాయ సహాయం అందేలా చూడాలి, ఫిర్యాదులు చేయడానికి నిర్దేశించిన దరఖాస్తులు ఉచితంగా అందేలా ఏర్పాటు చేయాలి.
ఇ) మేజిస్ట్రేట్ పరిధిలోని ప్రాంతాలలో న్యాయసేవలు, కౌన్సిలింగ్, ఆశ్రయం, వైద్యసేవలు అందించేవారి జాబితాను నిర్వహించాలి.
ఎఫ్) బాధితురాలు కోరితే సురక్షితమైన షెల్టర్ హోంలో ఆమెకు ఆశ్రయం కల్పించి, అలా ఆశ్రయం కల్పించిన వివరాల నివేదికను స్థానిక పోలీస్ స్టేషన్, మేజిస్ట్రేట్కి అందజేయాలి.
జి) బాధితురాలికి శరీరంపై గాయాలైతే, ఆమెకు వైద్య పరీక్షలు జరిపించి, వైద్య పరీక్షల నివేదికను కుటుంబ హింస జరిగిన ప్రాంతంపై పరిధి ఉన్న మేజిస్ట్రేట్కి, పోలీసు స్టేషన్కి పంపాలి.
హెచ్) సెక్షన్ 20 కింద జారీ అయిన ఆర్థిక ఉత్తర్వు సిఆర్పిసి, 1973 ప్రకారం నిర్దేశించిన పద్ధతిలో అమలయ్యేలా చూడాలి.
ఐ) నిర్దేశించిన ఇతర విధులను నిర్వర్తించాలి.
2) రక్షణాధికారి మేజిస్ట్రేట్ నియంత్రణ, పర్యవేక్షణలో వుంటారు. మేజిస్ట్రేట్, ప్రభుత్వం ఇద్దరూ ఈ చట్టం కింద తనపై మోపిన బాధ్యతలను నిర్వర్తించాలి.

10. సేవలు అందించేవారు ఎవరు?
1) న్యాయ సహాయం, వైద్య, ఆర్థిక లేదా మరే ఇతరమైన చట్టబద్ధ మార్గాల ద్వారా మహిళల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించడం కోసం సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం, 1860 కింద రిజిష్టర్ అయిన స్వచ్ఛంద సంస్థలు, కంపెనీల చట్టం 1956 కింద లేదా అమలులో ఉన్న మరే ఇతర చట్టం కింద రిజిష్టర్ అయిన కంపెనీలు ఈ చట్టం కింద సేవలందించేవారుగా నమోదు చేసుకోవచ్చు.
2) సబ్-సెక్షన్ (1) కింద రిజిష్టర్ అయిన సేవలందించే వారికి ఈ కింది అధికారాలు వుంటాయిః
ఎ)బాధితురాలు కోరితే,కుటుంబ హింస సంఘటన నివేదికను నిర్ణీత రూపంలో తయారు చేసి, సంఘటన జరిగిన ప్రాంతంపై అజమాయిషి ఉన్న మేజిస్ట్రేట్కి,రక్షణాధికారికి పంపాలి.
బి)బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపించి, మెడికల్ రిపోర్టు కాపీని సంఘటన జరిగిన ప్రాంత పరిధికి చెందిన రక్షణాధికారికి, పోలీసు స్టేషన్కి పంపాలి.
సి) బాధితురాలు కోరితే, ఆమెకు ఒక షెల్టర్ హోంలో ఆశ్రయం లభించేలా చూడాలి, షెల్టర్ హోంలో ఆమెను చేర్చిన విషయమై నివేదికను కుటుంబ హింస సంఘటన జరిగిన ప్రాంత పోలీసు స్టేషన్కు తెలియజేయాలి.
3)ఈ చట్టం కింద కుటుంబ హింసను నిరోధించడానికి మంచి ఉద్దేశంతో ఏ పని చేసినా, చేయబోయినా, సేవలందించే సంస్థ లేదా ఆ సంస్థ సభ్యులపై ఏ విధమైన దావాలు, ప్రాసిక్యూషన్, మరే ఇతర చట్టపరమైన చర్యలు తీసుకునే వీలు లేదు.

11. ప్రభుత్వ విధులు ఏమిటి?
కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కింది విధంగా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలిః
ఎ) టెలివిజన్, రేడియో, పత్రికలలో తరచుగా ప్రచారం చేయడం ద్వారా ఈ చట్టం గురించి విస్తృత ప్రచారం చేయాలి.
బి) ఈ చట్టంలోని అంశాలపై పోలీసు అధికారులు, న్యాయసేవల సభ్యులతో సహా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు క్రమపద్ధతిలో శిక్షణ, అవగాహన కల్పించాలి.
సి) న్యాయశాఖ, హోం శాఖ, శాంతి భద్రతలు, ఆరోగ్యం, మానవ వనరులు, సంబంధిత మంత్రిత్వ శాఖలు కుటుంబ హింసకు సంబంధించి అందించే సేవల మధ్య ప్రభావవంతమైన సమన్వయం ఏర్పరచి, క్రమ పద్ధతిలో సమీక్షలు జరిగేలా చూడాలి.
డి) ఈ చట్టం కింద మహిళలకు సేవలందించేందుకు వివిధ మంత్రిత్వ శాఖలు, కోర్టులన్నిటిలో ప్రొటోకాల్స్ రూపొంది, అమలయ్యేలా చూడాలి.

ఉపశమన ఉత్తర్వులు పొందే విధానం

12. మేజిస్ట్రేట్కి దరఖాస్తు ఎలా చేయాలి?
1) బాధితురాలు, లేదా ఆమె తరపున రక్షణాధికారి లేదా మరే ఇతర వ్యక్తి అయినా, ఈ చట్టం కింద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉపశమనాల కోసం మేజిస్ట్రేట్కి దరఖాస్తు చేయవచ్చు. ఈ దరఖాస్తుపై ఉత్తర్వులు జారీ చేసేముందు, మేజిస్ట్రేట్, రక్షణాధికారి నుంచి లేదా సేవలందించే వారినుంచి కుటుంబ సంఘటన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి.
2) సబ్-సెక్షన్(1) కింద కోరే ఉపశమనాలలో, ప్రతివాది (బాధ్యుడు) కుటుంబ హింసకు పాల్పడటం వల్ల బాధితురాలికి కలిగిన గాయాలకు నష్టపరిహారం లేదా పరువు నష్టం (కాంపెన్సేషన్ ఆర్ డామేజస్) కోసం ఆ వ్యక్తి (బాధితురాలు) దావా వేయడానికి గల హక్కు పట్ల ముందస్తు అభిప్రాయమేమి లేకుండా, నష్టపరిహారం లేదా పరువునష్టం చెల్లింపు కోసం ఉత్తర్వు కావాలని కూడా దరఖాస్తు చేయవచ్చు. బాధితురాలికి అనుకూలంగా పరిహారం లేదా నష్టం మొత్తాన్ని చెల్లించడానికి ఏదైనా కోర్టు డిక్రీ జారీ చేసి వుంటే, ఈ చట్టం కింద మేజిస్ట్రేట్ జారీ చేసిన ఆదేశం ప్రకారం పరిహారం నష్టం మొత్తాన్ని చెల్లించినా లేక చెల్లించవలసి ఉన్నా, ఈ మొత్తాన్ని డిక్రీలోని మొత్తం నుంచి మినహాయించి, సిఆర్పిసి,1908 లేదా ప్రస్తుతం అమలులో ఉన్న మరే ఇతర చట్టం నిర్దేశాలతో ప్రమేయం లేకుండా, ఇంకా ఏమైనా మిగిలి వుంటే, ఆ సొమ్మును వసూలు చేయించేలా డిక్రీని అమలు చేయాలి.
3) సబ్-సెక్షన్ (1) కింద ప్రతి దరఖాస్తు నిర్ణీత పత్రంలో, లేదా దానికి వీలైనంత దగ్గరగా వుండాలి.
4) దరఖాస్తు కోర్టుకి అందిన నాటినుంచి సాధారణంగా మూడు రోజులు దాటకుండా విచారణ (హియరింగ్) తేదీని మేజిస్ట్రేటు నిర్ణయించాలి.
5) సబ్సెక్షన్ (1) కింద వచ్చే ప్రతి దరఖాస్తును తొలి హియరింగ్ నుంచి 60 రోజులలోగా పరిష్కరించేందుకు మేజిస్ట్రేట్ కృషి చేయాలి.

13. నోటీసులు ఎలా జారీ చేస్తారు?
(1) సెక్షన్ 12 కింద నిర్ణయించిన విచారణ తేది నోటీసును మేజిస్ట్రేటు రక్షణాధికారికి అందించాలి, రక్షణాధికారి నిర్దేశించిన మార్గంలో దానిని ప్రతివాదికి లేదా ప్రతివాది తరపువారికి, మేజిస్ట్రేట్ నిర్దేశించిన ప్రకారం అది అందిన నాటినుంచి, గరిష్టం రెండు రోజులలో అందేలా చేయాలి. లేదా మేజిస్ట్రేటు మంజూరు చేసిన వ్యవధిలోపు అందించాలి.
(2) నిర్దేశించిన ప్రకారం నోటీసును అందజేసినట్లు రక్షణాధికారి దాఖలు చేసే ధృవీకరణ (డిక్లరేషన్) ప్రకటనే బాధ్యునికి లేదా, ఆయన తరపు వ్యక్తికి జారీచేసినట్లు రుజువు.

14. కౌన్సెలింగ్ చేస్తారా?
(1) ఈ చట్టం కింద కార్యక్రమాలు జరుగుతున్న ఏ దశలోనైనా మేజిస్ట్రేటు, బాధితురాలినిగాని లేదా బాధ్యుడిని గాని లేదా ఇద్దరినీ నిర్ధేశిత అర్హతలు, అనుభవం కలిగిన సేవలందించేవారి వద్ద కౌన్సెలింగ్కి వెళ్ళాలని ఆదేశించవచ్చు.
(2) సబ్-సెక్షన్(1) కింద మేజిస్ట్రేటు ఆదేశాలు జారీ చేసి వుంటే, తదుపరి విచారణ తేదీని రెండు నెలల లోపు నిర్ణయించాలి.

15. సంక్షేమ నిపుణులు ఉన్నారా?
ఈ చట్టం కింద ఏ చర్య తీసుకోవడంలోనైనా, మేజిస్ట్రేటు తన విధులను నిర్వర్తించడంలో, కుటుంబ సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తి, వీలైనంతవరకు మహిళ బాధితురాలికి సంబంధం ఉన్నా, లేకపోయినా- సహాయం తీసుకోవచ్చు.

16. రహస్య (ఇన్ కెమెరా) విచారణ ఉందా?
ఇన్ కెమెరా విచారణ జరపడం అవసరమని పరిస్థితుల దృష్ట్యా మేజిస్ట్రేటు భావించినా, లేక ఫిర్యాది, ప్రతివాదిలలో ఏ ఒక్కరు అలా కోరినా, ఈ చట్టం కింద విచారణను ఇన్కెమెరాగా నిర్వహించవచ్చు.

17. కలసి వుండే ఇంటిలో నివశించే హక్కు ఉందా?
1) ప్రస్తుతం అమలులో ఉన్న మరే ఇతర చట్టంతోని వేటితో ప్రమేయం లేకుండా, కుటుంబ సంబంధంలో ప్రతి మహిళకు ఆ ఇంటిపై ఆమెకు హక్కు, టైటిల్, లబ్ది ప్రయోజనం ఉన్నా లేకున్నా, ఆ ఇంటిలో నివశించే హక్కు వుంది.
2) చట్టం నిర్దేశించిన ప్రకారం, బాధితురాలు ప్రతివాదిచే ఇంటినుంచి, దానిలోని ఏ భాగం నుంచి కూడా, గెంటివేయబడకూడదు, మినహాయించబడకూడదు.

18. రక్షణ ఉత్తర్వులు ఎలా వుంటాయి?
బాధితురాలు, ప్రతివాది వాదనలు వినిపించుకునే అవకాశం ఇచ్చాక, కుటుంబ హింస జరిగిందని లేదా, జరిగేందుకు అవకాశం వుందని ప్రాథమిక సాక్ష్యాలతో మేజిస్ట్రేటుకు విశ్వాసం కలిగితే, బాధితురాలికి అనుకూలంగా రక్షణ ఉత్తర్వులు జారీ చేసి ప్రతివాదిని ఈ కిందివిధంగా ఆదేశించవచ్చు.
ఎ) ఎలాంటి కుటుంబ హింసకు పాల్పడరాదు
బి) కుటుంబ హింస చర్యలకు పాల్పడటాన్ని ప్రేరేపించరాదు, నెరవేర్చరాదు.
సి) బాధితురాలి ఉద్యోగతావులో ప్రవేశించరాదు, బాధితురాలు చిన్నపిల్ల అయితే, ఆమె పాఠశాలకు లేదా ఆమె తరచు వెళ్ళే ప్రదేశానికి వెళ్ళరాదు.
డి) ఏ రూపంలోనూ- వ్యక్తిగతంగా మాటల ద్వారా, లిఖిత పూర్వకంగా, ఎలక్ట్రానిక్ రూపంలో లేక టెలిఫోన్ ద్వారా బాధితురాలితో మాట్లాడే ప్రయత్నం చేయరాదు.
ఇ) మేజిస్ట్రేటు అనుమతి లేకుండా ఆస్తులు అమ్మడం, ఇద్దరూ లేదా బాధితురాలు ఒక్కరే లేదా ప్రతివాది ఒక్కరే నిర్వహించే బ్యాంక్ ఎక్కౌంట్, బ్యాంక్ లాకర్లను ఆమె స్త్రీధనంతో సహా ఇద్దరి పేరున నిర్వహించే లేదా ఇద్దరూ వేర్వేరుగా నిర్వహించే వాటిని ఉపయోగించరాదు.
ఎఫ్) బాధితురాలికి కుటుంబ హింస నుంచి సహాయం అందించిన ఎవరికీ, ఆమెపై ఆధారపడిన వారికి, ఇతర బంధువులకు హింస కలిగించరాదు.
జి) రక్షణ ఉత్తర్వులో పేర్కొన్న మరే ఇతర చర్యకూ పాల్పడరాదు.

19. నివాస ఉత్తర్వులు పొందేది ఎలా?
1) సెక్షన్ 12 లోని సబ్-సెక్షన్ (1) కింద దరఖాస్తును పరిష్కరించేటపుడు, మేజిస్ట్రేటు, కుటుంబ హింస జరిగిందని విశ్వసిస్తే, నివాస ఉత్తర్వులను జారీ చేయవచ్చు.
ఎ) కలసి వుండే ఇంటిని బాధితురాలి నుంచి లాగేసుకోకుండా, ఆమె స్వాధీనం నుంచి మరే ఇతర విధంగాను బాధితురాలిని కలిసి ఉన్న ఇంటిలో ఇబ్బందికి గురిచేయకుండా ప్రతివాదిని -ఆయనకు ఆ ఇంటిపై చట్టపరమైన, సమానమైన హక్కు ఉన్నా లేకున్నా- నివారించాలి.
బి) కలసి ఉన్న ఇంటినుంచి ప్రతివాదే కదలివెళ్ళిపోవాలని ఆదేశించాలి.
సి) బాధితురాలు వుండే ఇంటిలోని ఏ భాగంలోను ప్రతివాది లేదా ఆయన బంధువులెవరూ ప్రవేశించకుండా నిరోధించాలి.
డి) కలసి వుండే ఇంటిని ఇచ్చివేయడం, అమ్మేయడం, లేదా దానిని ఆక్రమించుకోవడం నుంచి నివారించాలి.
ఇ) మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా , కలసి వుండే ఇంటిపై తన హక్కును ప్రతివాది ప్రకటించుకోరాదు.
ఎఫ్) పరిస్థితుల దృష్ట్యా అవసరమైతే, కలసి వున్న ఇంటిలో బాధితురాలు ఆస్వాదించిన స్థాయిలో ప్రత్యామ్నాయ వసతిని ఏర్పాటు చేయాలని లేదా కిరాయి (అద్దె) చెల్లించాలని ప్రతివాదిని ఆదేశించాలి.
ఒక మహిళపై క్లాజ్ (బి) కింద ఎలాంటి ఆదేశాలు జారీ చేయరాదు.
2) బాధితురాలికి, లేదా, ఆమెకు చెందిన పిల్లలెవరికైనా భద్రత కల్పించేందుకు, రక్షించేందుకు అవసరమని మేజిస్ట్రేటు భావించే మరే ఇతర షరతులనైనా విధించవచ్చు, ఏ ఆదేశాలనైనా జారీ చేయవచ్చు.
3) కుటుంబ హింసకు పాల్పడటాన్ని నిరోధించేందుకు పూచీకత్తులతో కూడిన, లేదా, పూచీకత్తులు లేకుండా హామీ (బాండ్) ఇవ్వాలని ప్రతివాదిని మేజిస్ట్రేట్ అడగవచ్చు.
4) సబ్-సెక్షన్ (3) కింద జారీ అయ్యే ఆదేశం సిఆర్పిసి, 1973లోని చాప్టర్ VIII కింద జారీ అయినట్లు భావించాలి, ఆ ప్రకారమే వ్యవహరించాలి.
5) సబ్-సెక్షన్ (1), సబ్ సెక్షన్ (2), సబ్- సెక్షన్(3) ల కింద ఉత్తర్వులు జారీ చేసేటపుడు, బాధితురాలు లేదా ఆమె తరపున దరఖాస్తు చేసిన వ్యక్తికి భద్రత కల్పించాలని, లేదా ఈ ఉత్తర్వుల అమలుకు వారికి సహకరించాలని ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్కు మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేయవచ్చు.
6) మేజిస్ట్రేట్ సబ్-సెక్షన్ (1) కింద ఉత్తర్వులు జారీ చేసేటపుడు, పార్టీలు ఆర్థిక అవసరాలను, వనరులను దృష్టిలో ఉంచుకుని, అద్దె, ఇతర చెల్లింపుల బాధ్యతలను ప్రతివాదిపై మోపవచ్చు.
7) ఏ పోలీసు స్టేషన్ పరిధినుంచి అయితే రక్షణ కోసం మేజిస్ట్రేట్ని ఆశ్రయించారో, ఆ పోలీసు స్టేషన్ను ఆదేశాల అమలులో సహకరించాలని మేజిస్ట్రేటు ఆదేశించవచ్చు.
8) బాధితురాలి స్త్రీధనం, ఆమెకి చెందిన మరే ఇతర ఆస్థి లేదా ఆమెకు హక్కు ఉన్న విలువైన వస్తువులను ఆమెకు వాపసు ఇవ్వాలని ప్రతివాదిని మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చు.

20. ఆర్థిక (నగదు) ఉపశమనాలు ఏమి లభిస్తాయి?
1) సెక్షన్ 12 లోని సబ్-సెక్షన్ (1) కింద ఒక దరఖాస్తును పరిష్కరించేటపుడు, కుటుంబ హింస వల్ల బాధితురాలికి, ఆమెకి చెందిన ఎవరైనా పిల్లలకు అయిన ఖర్చులు, జరిగిన నష్టాన్ని భరించేందుకు ఆర్థిక (నగదు) ఉపశమనాన్ని చెల్లించాలని ప్రతివాదిని మేజిస్ట్రేటు ఆదేశించవచ్చు, ఈ ఉపశమనం ఈ కింది విధంగా వుండవచ్చు, కానీ, ఇంతకి పరిమితం కాదు.
ఎ) సంపాదన నష్టం
బి) వైద్య ఖర్చులు
సి) బాధితురాలి నియంత్రణలోని ఏదైనా ఆస్థిని ధ్వంసం చేయడం వల్ల, ఆమె నియంత్రణ నుంచి తప్పించడం వల్ల జరిగిన నష్టం.
ఇంకా
డి) సిఆర్పిసి, 1973 లోని సెక్షన్ 125 కింద, లేదా, అప్పుడు అమలులో ఉన్న మరే ఇతర చట్టం కింద, లేదా, దీనికి అదనంగా బాధితురాలు, ఉంటే ఆమె పిల్లలకు, భరణం (మెయింటెనెన్స్) ఇవ్వాలని ఆదేశం జారీ చేయవచ్చు.
2) ఈ సెక్షన్ కింద జారీచేసే భరణం తగినంతగా న్యాయబద్ధమైనదిగా, సమర్థనీయమైనదిగా వుండి, బాధితురాలు అలవాటు పడిన జీవన ప్రమాణాలకు సరితూగేలా వుండాలి.
3) కేసు పరిస్థితులు, స్వరూపాలను బట్టి, మేజిస్ట్రేట్ భరణాన్ని ఏకమొత్తంగా లేక నెలవారీ చెల్లింపులు జరిగేలా ఆదేశించవచ్చు.
4) సబ్-సెక్షన్ (1) కింద జారీ చేసిన ఆర్థిక (నగదు) ఉపశమనం ఉత్తర్వుల కాపీలను మేజిస్ట్రేటు, దరఖాస్తు చేసినవారికి, ప్రతివాది నివశించే ప్రాంతపు పోలీసు స్టేషన్కు పంపాలి.
5) బాధితురాలికి మంజూరైన భరణాన్ని ప్రతివాది సబ్- సెక్షన్ (1) లో నిర్దేశించిన కాల వ్యవధిలో చెల్లించాలి.
6) సబ్-సెక్షన్ (1) కింద జారీ చేసిన ఉత్తర్వుననుసరించి చెల్లింపులు జరపడంలో ప్రతివాది విఫలమైతే, ప్రతివాది యజమాని లేదా ఆయనకు అప్పు ఉన్న ఒకరిని, ప్రతివాది జీవితంలో కొంత భాగాన్ని లేదా ఆయనకు వాపసు రావలసిన అప్పులో కొంత భాగాన్ని లేదా ఆయనకు బ్యాంకు ఖాతాలో జమ అయ్యే సొమ్ములో కొంత భాగాన్ని నేరుగా బాధితురాలికి చెల్లించాలని, లేదా, కోర్టులో డిపాజిట్ చేయాలని, ఈ మొత్తాన్ని బాధితురాలికి ప్రతివాది చెల్లించాల్సిన నగదు ఉపశమనం కింద సర్దుబాటు చేయాలని మేజిస్ట్రేటు ఆదేశించవచ్చు.

21. పిల్లల కస్టడీకి ఉత్తర్వులు పొందగలమా?
అప్పటికి అమలులో మరే ఇతర చట్టంలోని ఏ విషయంతోనూ ప్రమేయం లేకుండా, రక్షణ ఉత్తర్వుల కోసం లేదా ఈ చట్టం కింద మరే ఇతర ఉపశమనం కోసం చేసిన దరఖాస్తుపై విచారణ జరుగుతున్న కాలంలో, ఒకరు లేదా ఎక్కువమంది పిల్లలను తాత్కాలికంగా బాధితురాలి, లేదా ఆమె తరపున దరఖాస్తు చేసిన వారి కస్టడీకి ఇస్తూ అవసరమైతే, ప్రతివాది ఆ పిల్లలను చూడటానికి చేసిన ఏర్పాట్లు ప్రకటిస్తూ మేజిస్ట్రేటు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ప్రతివాది కలవడం పిల్ల/ పిల్లలకు హానికరమని మేజిస్ట్రేటు భావిస్తే, మేజిస్ట్రేటు అలాంటి సందర్శనను తిరస్కరించవచ్చు.

22. నష్టానికి పరిహారం లభిస్తుందా?
ఈ చట్టం కింద మంజూరు చేసే ఇతర ఉపశమనాలకు తోడుగా, బాధితురాలి దరఖాస్తుననుసరించి, కుటుంబ హింస వల్ల బాధితురాలికి అయిన గాయాలు, మానసిక క్షోభ, మనస్తాపానికి నష్టపరిహారం, పరువునష్టం చెల్లించాలని బాధితుడికి మేజిస్ట్రేటు ఆదేశించవచ్చు.

23. మధ్యంతర, ఎక్స్పార్టీ ఆదేశాలు జారీ చేస్తారా?
1) ఈ చట్టం కింద తన విచారణలో ఉన్న ఏ విషయంలోనైనా మేజిస్ట్రేటు తనకు న్యాయమూ, సరైనదీ అనిపించిన ఏ మధ్యంతర ఉత్తర్వునైనా జారీ చేయవచ్చు.
2) ప్రతివాది కుటుంబ హింసకు పాల్పడ్డారని, లేదా పాల్పడుతూ ఉన్నారని లేక పాల్పడే అవకాశం వుందని బాధితురాలి దరఖాస్తులోని ప్రాధమిక సమాచారం ద్వారా మేజిస్ట్రేట్ సంతృప్తి చెందితే, బాధితురాలు తగిన పత్రంలో దాఖలు చేసిన అఫిడవిట్ను అనుసరించి సెక్షన్ 18, సెక్షన్ 19, సెక్షన్ 20, సెక్షన్ 21 కింద, లేక పరిస్థితిననుసరించి సెక్షన్ 22 కింద ప్రతివాదికి వ్యతిరేకంగా ఎక్స్పార్టీ ప్రతివాది సమక్షం లేకుండా ఉత్తర్వులు జారీ చేయవచ్చు.

24. కోర్టు ఉత్తర్వుల కాపీల కోసం ఫీజు కట్టాలా?
ఈ చట్టం కింద మేజిస్ట్రేటు ఏ ఉత్తర్వులు జారీ చేసినా, వాటి నకళ్ళను దరఖాస్తు చేసినవారికి, మేజిస్ట్రేటు పరిధిలోని ఏ పోలీసు స్టేషన్ నుంచి ఈ దరఖాస్తు వచ్చిందో ఆ పోలీసు స్టేషన్కి, సంబంధిత ప్రాంతపు సేవలందించే వారికి, ఎవరైనా సేవలందించే వారు సంఘటనా నివేదికను దాఖలు చేస్తే వారికి ఉచితంగా అందచేయాలి.

25. ఉత్తర్వుల కాలపరిమితి ఎంత? మార్పులు చేస్తారా?
1) సెక్షన్ 18 కింద జారీ చేసిన రక్షణ ఉత్తర్వు, తిరిగి బాధితురాలు దాని రద్దుకోసం దరఖాస్తు చేసేవరకు అమలులో వుంటుంది.
2) బాధితురాలు లేదా ప్రతివాది చేసే దరఖాస్తును అనుసరించి, పరిస్థితులలో మార్పు వచ్చిందని, ఆ ప్రకారం ఈ చట్టంకింద జారీ చేసిన ఉత్తర్వును మార్చడం, సవరించడం, లేదా ఎత్తివేయడం (ఉపసంహరించడం) అవసరమని భావిస్తే, ఆయన అవసరమని భావించిన ప్రకారం సవరించి, అందుకు కారణాలను నమోదు చేయాలి.

26. ఇతర దావాలు, చట్టపర చర్యలలో ఉపశమనాల గురించిః
1) 18,19,20,21,22 సెక్షన్ల కింద లభించే ఏ ఉపశమనాన్నైనా సివిల్కోర్టు, ఫ్యామిలీకోర్టు, క్రిమినల్ కోర్టుల్లో కూడా చట్టపర చర్యల ద్వారా కోరవచ్చు- ఆ చర్యలు ఈ చట్టం అమలులోకి రావడానికి ముందు లేక తర్వాత చేపట్టబడినా, బాధితురాలికి, ప్రతివాదికి వర్తించేలా.

27. ఎవరి పరిధిః
1) ఒకటవ తరగతి జుడిషియల్ మేజిస్ట్రేట్ లేదా, అక్కడి పరిస్థితిని బట్టి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, ఎవరి స్థానిక పరిధిలోనైతేః
ఎ) బాధితురాలు శాశ్వతంగా లేదా తాత్కాలికంగా నివశిస్తారో లేక వ్యాపారం లేక ఉద్యోగం చేస్తారో లేక,
బి) ప్రతివాది నివశిస్తారో లేక వ్యాపారం లేక ఉద్యోగం చేస్తారో, లేక
సి) సంఘటన ఎక్కడ జరిగిందో అక్కడి కోర్టు ఈ చట్టం కింద రక్షణ ఉత్తర్వు, ఇతర ఉత్తర్వులు జారీ చేయడానికి, ఈ చట్టం కింద కేసులు విచారించడానికి అధికారం వుంది.
2) ఈ చట్టం కింద జారీ అయిన ఏ ఉత్తర్వు అయినా భారతదేశం అంతటా వర్తిస్తుంది.

28. పద్ధతిః
1) ఈ చట్టం కింద ఇతర విధంగా నిర్దేశిస్తే తప్ప, సెక్షన్ 12, 18, 19, 20, 21, 22, 23 కింద, సెక్షన్ 31 కింద జరిగే నేరాలను సిఆర్పిసి, 1973 పద్ధతుల ప్రకారం జరపాలి.
2) సబ్-సెక్షన్ (1) లోని ఏదీ కూడా, సెక్షన్ 12 లేదా సెక్షన్ 23 లోని సబ్ – సెక్షన్ (2) కింద కోర్టు ఒక దరఖాస్తును పరిష్కరించడానికి తన సొంత పద్ధతులను ఏర్పాటు చేసుకోవడం నుంచి అడ్డగించరాదు.

29. అప్పీలు చేసుకోవచ్చా?
బాధితురాలు లేదా ప్రతివాదిపై మేజిస్ట్రేటు ఉత్తర్వు జారీ అయిన తేదీనుంచి, ఎవరికి ఆలస్యంగా చేరితే ఆ తేది నుంచి, 30 రోజులలోగా సెషన్స్ కోర్టుకి అప్పీలు చేసుకోవాలి.

30. రక్షణాధికారులు, సేవలు అందించేవారికి జవాబుదారి వుంటుందా?
వీరు పబ్లిక్ సర్వెంట్స్ (ప్రజా సేవకులు). ఈ చట్టంలోని అంశాలు, దీనికింద జారీ అయ్యే ఉత్తర్వులు, నిబంధనలను అమలు చేసే రక్షణాధికారులు, సేవలందించేవారి సభ్యులు ఇండియన్ పీనల్కోడ్ (ఐపిసి) సెక్షన్ 21 పరిధిలో ప్రజా సేవకులు (పబ్లిక్ సర్వెంట్స్)గా పరిగణించబడతారు.

31. రక్షణ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ప్రతివాది శిక్ష వుందా? ఏ శిక్ష?
1). రక్షణ ఉత్తర్వు, లేదా, మధ్యంతర రక్షణ ఉత్తర్వును ప్రతివాది ఉల్లంఘిస్తే ఈ చట్టంకింద అది నేరం. అందుకు ఏడాది వరకు ఎంతకాలమైనా, లేదా ఇరవై వేల రూపాయల వరకు జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.
2) నిందితుడు ఉల్లంఘించారని ఆరోపించిన రక్షణ ఉత్తర్వును జారీ చేసిన మేజిస్ట్రేటే, సాధ్యమైనంత వరకు, ఈ సబ్-సెక్షన్ (1) కింద నేరాన్ని విచారించాలి.
3) సబ్ సెక్షన్ (1) కింద నేరం మోపేటపుడు, వాటిలో ఏవైనా నేరాలు ఇండియన్ పీనల్కోడ్ (ఐపిసి) లోని సెక్షన్ 498 ఎ, లేదా ఇందులోని మరే ఇతర సెక్షన్ల కింద, లేదా వరకట్న నిషేధ చట్టం, 1961 కింద కూడా మేజిస్ట్రేట్ నమోదు చేయాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో