తెలుగు కథా సాహిత్యం – మహిళ

మూలె విజయలక్ష్మి
తెలుగు కథా సాహిత్యం-మహిళ అన్న అంశంపై తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయనశాఖ యుజిసి శాప్‌ డిఆర్‌ఎస్‌ తరపున మార్చి 29, 30 తేదీల్లో రెండు రోజుల సదస్సు నిర్వహింపబడింది. తెలుగు కథ ఆవిర్భవించి వందసంవత్సరాలు పూర్తి అయిన సంవత్సరం ఇది. ప్రపంచ మహిళా దినోత్సవం శతవార్షికోత్సవం జరుపుకుంటున్న సంవత్సరం ఇది. ఎన్నో ఆటంకాలను అధిగమించి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లు పార్లమెంటు గడపెక్కిన సంవత్సరం ఇది. ఈనేపథ్యంలో వంద సంవత్సరాల తెలుగు కథా సాహిత్యంలో మహిళల స్థితి గతులను చర్చించడానికి ఈ సదస్సు వేదికయింది. ఈ సదస్సులో దాదాపు 30 మందికి పైగా కథకులు, విమర్శకులు, సాహితీవేత్తలు తెలుగు కథా సాహిత్యంలో మహిళల సమస్యలను, మహిళా చైతన్యాన్ని ప్రతిబింబించిన తీరుతెన్నులను విశ్లేషించారు.
ప్రారంభ సమావేశానికి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ జి. సరోజమ్మ అధ్యక్షత వహించారు. సదస్సు సంచాలకులు, యుజిసి శాప్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య మూలె విజయలక్ష్మి ‘ఆధునిక సాహిత్యంలో మహిళ’పై కృషి చేయడానికి శాప్‌ ద్వారా లభించిన ఆర్థిక వనరులు 24 లక్షలతో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని అందులో సదస్సు నిర్వహణ ఒక భాగమని పేర్కొన్నారు. కథ ఆవిర్భావ దశనుంచి నేటి దాకా వెలువడిన కథా సాహిత్యంలో కుల, వర్గ, ప్రాంత, మత మొదలైన సామాజిక అంతరువుల కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రచయితల స్పందనను పరిష్కార సూచనలను విశ్లేషించుకోవడం, దళిత, గిరిజన, ముస్లిం మైనారిటీ, గిరిజన స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను అధ్యయనం చేయడం. ప్రాంతీయ వైలక్షణ్యం కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను బాలికలు, వృద్ధ మహిళ స్థితిగతులను కథా సాహిత్యం ప్రతిబింబించిన తీరుతెన్నులను సమీక్షించుకునే నేపథ్యంతో సదస్సు ఏర్పాటు చేయడమైందన్నారు.
ఆచార్య జి. సరోజమ్మ మహిళల జీవితాల్లో సమస్యలే కాకుండా, కుటుంబ సభ్యులతో గడిపిన ఆనందక్షణాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని మరచి పోకూడదని గుర్తు చేశారు. స్త్రీల సమస్యల పరిష్కార దిశగా విద్యార్థులను చైతన్యవంతం చేయడం విద్యాబోధనలో భాగంగా ఇక్కడ కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఆచార్య కేతు విశ్వనాథరెడ్డిగారు కీలకోపన్యాసం చేస్తూ మతములన్నియు మాసిపోవును అని గురజాడ ఆశించినప్పటికీ అవి మాసిపోలేదని హిందూ మతం వేలాది కులాల శాపాన్ని పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుల, వర్గ, మత ప్రాతిపదికన, ఆదివాసీల స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని రచయితలు, వాళ్ల సమస్యల పట్ల సంస్కారవంతంగా స్పందించారని, ఆయా వర్గాల సమస్యలు భిన్నంగా ఉంటాయని, సాంస్కృతిక నేపథ్యం వల్ల బసివి, మాతంగి వంటి దురాచారాలకు బలి అవుతున్నారన్నారు. స్త్రీలను చైతన్యవంతం చేసే సాహిత్యం మరింత రావాలని, ఈసదస్సుకు ఒక సైద్ధాంతిక నేపథ్యాన్నిచ్చారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య కొలకలూరి ఇనాక్‌ మాట్లాడుతూ ప్రతివ్యక్తికీ ఇష్టాయిష్టాలు, వ్యక్తిత్వ విలువలుంటాయనీ కుటుంబంలో పరస్పరం వాటికి విలువనిచ్చుకుంటూ ముందుకు సాగితే కుటుంబ జీవితం సుఖమవుతుంది అభిప్రాయపడ్డారు. అద్దెతల్లులు, అత్యాచారం వల్ల తల్లులయ్యే స్త్రీల మానసిక, శారీరక, సామాజిక సమస్యలను లేవనెత్తారు. గురజాడ దిద్దుబాటు, కొడవటిగంటి కుటుంబరావు ‘ఇదంతే’, సత్యవతి ‘ఇల్లలకగానే’, ఓల్గా ‘ముక్కుపుడక’ తదితర కథల్లో స్త్రీల సమస్యల చిత్రణను కథాకథనశైలిలో చక్కగా వివరించారు. మహిళలు తమ శక్తియుక్తులను పూర్తిగా వినియోగించుకుంటే పురుష సమాజం నిజంగా భయపడుతుందేమో ఆలోచించాలని మహిళలను కోరారు. కథను చదివి ఊరుకుంటే లాభం లేదని, దాని గురించి ఆలోచించాలని విద్యార్థినులను కోరారు. సాహిత్యంచదివి సమాజాన్ని చూస్తే చైతన్యవంతువలవుతారని చెప్పారు.
మొదటి సమావేశం- ఆచార్య కెఎస్‌. రమణ అధ్యక్షతన మొదటి సమావేశం ప్రారంభమైంది. తెలుగువారి జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయో, తెలుగు కథ అన్నిమలుపులు తిరిగిందని కెఎస్‌.రమణ వ్యాఖ్యానించారు. మిగతా భాషా సాహిత్యాలతో పోల్చుకుంటే వాస్తవ జీవితాన్ని చూపించడంలో తెలుగు కథ ముందుందని చెప్పారు. ఆధునిక స్త్రీ ఇవాళ సాహిత్యాన్ని పునర్లిఖిస్తోందన్నారు.
‘గురజాడ రచనలో స్త్రీ పాత్రలు’ అన్న అంశంపై ఆచార్య సంపత్‌కుమార్‌ ప్రసంగించారు. గురజాడ గూర్చి మాట్లాడేముందు భండారు అచ్చమాంబ గూర్చి మాట్లాడాలని చెప్పారు. గురజాడ 1910 లో ‘దిద్దుబాటు’ కథరాస్తే, 1901, 02, 03 సంవత్సరాలలో అచ్చమాంబ 12 కథలు రాశారని చెప్పారు. వాటిలో 10 కథలు మాత్రమే లభ్యమవుతున్నాయన్నారు. కనుక అచ్చమాంబే తొలితెలుగు కథకురాలన్నారు. కన్నడ, తమిళ, మళయాళ కథలకు కూడా ఇది శతజయంతి సంవత్సరమని, ఆభాషలకంటే తెలుగులోనే తొలికథ వెలువడిందని గురజాడ కథల్లో స్త్రీ పాత్రలను విశ్లేషించారు. ‘శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి కథల్లో స్త్రీ’ అన్న అంశంపై డాక్టర్‌ పి.రమాదేవి ప్రసంగించారు. తొలితరం తెలుగు రచయితల్లో స్త్రీని బాగా అర్థం చేసుకున్న వారు శ్రీపాద అనిచెప్పారు. శ్రీపాద కుటుంబ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారేకానీ, చలంలాగా ఆవ్యవస్థను పూర్తిగా తిరస్కరించలేదన్నారు. శ్రీపాదలో అచ్చమైన తెలుగు నుడికారం, అద్భుతమైన నాటకశైలి ఉందన్నారు. సంప్రదాయ వైదిక కుటుంబంలో పుట్టిన శ్రీపాద, అవిశ్వాసాలను విమర్శించే హక్కును కూడా సొంతం చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
‘చలం కథల్లో స్త్రీ చిత్రణ’ అన్న అంశంపైన కెఎస్‌.రమణ ప్రసంగించారు. స్త్రీకి శరీరం ఉంది, దానికి అనుభవాన్నివ్వండి. స్త్రీకి మెదడుంది దానికి ఆలోచనివ్వండి. స్త్రీకి హృదయం ఉంది. దానికి అనుభూతినివ్వండి’ అని చెప్పిన చలం దాన్నొక సిద్ధాంత రూపంలో 1920లో ‘మ్యాన్‌ అండ్‌ విమన్‌’ అన్న వ్యాసాన్ని రాశారని చెప్పారు. తరువాత చలం రాసిన రచనలు అనేక ఆలోచనలకు తెరతీసాయన్నారు. ఆకోణం నుంచే చలాన్ని అర్థం చేసుకోవాలన్నారు. అనేక దశాబ్దాల ముందు చలంవేసిన ప్రశ్నలే ఈనాడు ఫెమినిస్టులు వేస్తున్నారని అన్నారు. గురజాడ నుంచి స్త్రీచైతన్యం పరిణామం చెందుతోందన్నారు.
‘తెలుగుకథ-మరపురాని స్త్రీ పాత్రలు’ అన్న అంశంపై మధురాంతకం నరేంద్ర మాట్లాడారు. రచయిత తనకు బాగా తెలిసిన పాత్రల గురించి బాగా తెలిసిన విషయాన్ని చెపుతున్నపుడు ఆపాత్రలు మనల్ని ప్రేమించినట్టుంటాయని చెప్పారు. మహిళను పట్టించుకోకుండా రాసిన కథలు తెలుగులో అసలులేనే లేవన్నారు. స్త్రీ పాత్ర గురించి చెప్పాలంటే బుచ్చిబాబు కథలను తప్పకుండా గుర్తుచేసుకోవాలన్నారు. ‘ముస్లిం మైనారిటీ కథల్లో స్త్రీ’ అన్న అంశంపై శశిశ్రీ మాట్లాడారు. షేక్‌హుస్సేన్‌ 1989లో రాసిన ‘అగ్నిసరస్సు’ తొలి ముస్లిం మైనారిటీ కథ కడప గడప నుంచి వచ్చిందని వారి పాచికలు కథాసంపుటిలో వ్యవస్థలోని తలాక్‌, మతా సంప్రదాయం, బహుభార్యత్వం వంటి సమస్యలకు స్పందించారన్నారు.
రెండవ సమావేశం-డాక్టర్‌ కె.శారద అధ్యక్షతన రెండవ సమావేశం ప్రారంభమైంది. ‘స్త్రీవాద కథల్లో స్త్రీ పాత్రలు’ అన్న అంశంపై ఎం.ఆర్‌. అరుణకుమారి మాట్లాడుతూ స్త్రీని దేవతలా నెత్తిన పెట్టుకోవలసిన అవసరం లేదని, సాటి మనిషిగా గుర్తిస్తే చాలని అన్నారు. స్త్రీవాదమంటే పురుషులను ద్వేషించడమనుకునే వారిని చూస్తే తనకు ఒకప్పుడు కోపమొచ్చేదని, ఇప్పుడు వారి అజ్ఞానానికి జాలివేస్తోందని వ్యాఖ్యానించారు.
‘శ్రీరమణ కథల్లో స్త్రీ’ అన్న అంశంపైన జె.కొండలరావు ప్రసంగిస్తూ, ‘వరహాల బావి’ అన్న కథలో వరహాలమ్మ వ్యక్తిత్వాన్ని వివరించారు. ఊరందరికీ తలలో నాలుకలా, పెద్ద దిక్కుగా ఎలా ఉందో కథలో వివరిస్తూ, ఆమె ఆస్తంతా ఒకచిన్న గుడెసేనని చెప్పారు.
డా.కె.శారద కొలకలూరి ఇనాక్‌ ఊరబావి, విపర్యయం, రెండుకన్నీటి బొట్లు కథల్లో దళితమహిళ చైతన్యం, ట్రోపీ, గమ్యం, చిన్నికథల్లో దళితేతర మహిళా చైతన్యాన్ని చిత్రించారన్నారు. వంచించిన పురుషునికి కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, నేరాన్ని చాకచక్యంగా నిరూపించి, అవాంచిత గర్భమైనా బిడ్డను కనాలనుకుని, వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్న యువతి కథ ట్రోపీ అని విశ్లేషించారు.
కేతు విశ్వనాథరెడ్డి కథల గురించి ఎమ్‌ లక్ష్మీకళ ప్రసంగించారు. గడ్డి కథలో అన్యాయాన్ని ఎదిరించే స్త్రీ వ్యక్తిత్వాన్ని, రెక్కలు కథలో ఉద్యోగిని ఎదుర్కొన్న లైంగిక వేధింపులూ, సతి కథలో కుటుంబాన్ని పట్టించుకోని భర్త ఉన్నా లేకున్నా ఒకటే అని బతికుండగానే వైధవ్యాన్ని స్వీకరించిన మహిళను గూర్చి వివరించారు.
మూడవ సమావేశానికి డి.ఎం. ప్రేమావతి అధ్యక్షత వహించారు. డా.ఎస్‌. రాజేశ్వరి తెలుగు కథా సాహిత్యంలో స్త్రీవాద కథలస్థానం గూర్చి పత్రం సమర్పించారు. స్త్రీవాదం వెలుగులో వచ్చిన కథలకు అంతకు మునుపు వచ్చిన కథలకు మౌలికంగా ఉన్న తేడాలను, స్త్రీవాదం సమాజంపై చూపిన ప్రభావాన్ని చర్చిస్తూ, అమూల్యం, ప్రయోగం, నిర్ణయం, ఇన్‌స్టంట్‌లైఫ్‌ తదితర కథలను విశ్లేషించారు.
‘దళితకథలు-స్త్రీ’ అన్న అంశంపైన ఆచార్య ఎన్‌.మునిరత్నమ్మ దళితస్త్రీలు అగ్ర కులాల స్త్రీల చేతిలో, పురుషుల చేతిలో ఎలా వేధింపులకు గురవుతున్నారో చెప్పే కథలను విశ్లేషించారు. దళిత మహిళ వెట్టిచాకిరీని, వారిపై జరుగుతున్న లైంగిక వేధింపులను, అత్యాచారాలను, కులవివక్షను, అగ్రవర్ణ యువకుని చేతిలో మోసపోయి, తిరుగుబాటు చూపిన చైతన్యాన్ని అమ్మా నువ్వూనవ్వొచ్చే, తెల్లబట్ట, ఎన్‌కౌంటర్‌, మలుపు మొదలైన కథలు ఉదాహరించారు.
ఎం. కాటమ్మ దళితకథల్లో స్త్రీ-లైంగిక వేధింపులు అన్న అంశంపై మాట్లాడుతూ దళితస్త్రీలు అగ్రవర్ణ పురుషుల చేతనేగాకుండా, సవర్ణ పురుషులచేత లైంగిక వేధింపులకు గురవుతున్నారని, పశువులకొట్టం, పనిష్‌మెంట్‌, రుదిరమదనం, పాపానికి జీవితం, మాదిగమ్మాయి కథలను విశ్లేషించారు.
‘కడప జిల్లా కథల్లో స్త్రీ చైతన్యం’ అన్న అంశంపై రాజేశ్వరి మాట్లాడుతూ కడపజిల్లాలో వచ్చిన మొదటి కథ నీలవేణిలో జీవితంలోని కష్టాలను లెక్కచేయక, వివాహ విషయంలో తన అభిప్రాయం నిక్కచ్చిగా వ్యక్తం చేసిన స్త్రీ పాత్ర అనీ, బొగ్గులబట్టీలో రంగమ్మ మగవాళ్ల బుద్ధుల్ని ఎండగట్టిందనీ గడ్డి కథలో అచ్చమ్మ అన్యాయాన్ని ఎదిరించి మాట్లాడిన పాత్ర అనీ, చుక్కపొడిచిందిలో సుజాత ముఠా తగాదాలకు స్వస్తి పలికిన పాత్ర అనీ, భార్యలు కథలో దుర్మార్గుడైన భర్తకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడించిన చైతన్యవంతమైన పాత్రనీ వివరించారు.
ఆడెపు లక్ష్మీపతి రాసిన కథల గురించి డాక్టర్‌ డి.ఎం. ప్రేమావతి మాట్లాడుతూ, మాతృస్వామిక వ్యవస్థలో స్త్రీలు గౌరవాన్ని పొందారని, క్రమ పరిణామంలో వారు పితృస్వామిక వ్యవస్థలోకి బలవంతంగా నెట్టిబేయబడ్డారనీ చెప్పారు. సంస్కరణ ఉద్యమాల్లో, రాజకీయ ఉద్యమాల్లో, స్త్రీ అగ్రభాగాన ఎలా నిలబడిందో ఆడెపు కథల ద్వారా గుర్తుచేశారు.
రెండవరోజు మొదటి సమావేశం – ఈ సమావేశానికి డా. కె. ఆశాజ్యోతి అధ్యక్షత వహించారు. ‘ఓల్గా ప్రయోగం కథలు’ అన్న అంశంపై ఆశాజ్యోతి ప్రసంగిస్తూ, ఓల్గా కథలు రాసినా, నవల రాసినా, అనువాదాలు చేసినా స్త్రీ అభ్యుదయమే ఏకసూత్రంగా కనిపిస్తుందన్నారు. స్త్రీ బాహ్యసంఘర్షణలే కాకుండా అంతఃసంఘర్షణను కూడా చూపించారని చెప్పారు.
పి. ‘సత్యవతి కథల’ గురించి ఆచార్య తుమ్మల రామకృష్ణ ప్రసంగించారు. సత్యవతి సాదాసీదాగా రాయలేదని, ఒక ప్రయోజనంతో రాశారని చెప్పారు. ఇందుకు ‘ఇల్లలకగానే’ అన్న కథను ఉదహరించారు. మహిళ ఉనికిని, అస్తిత్వాన్ని తెలియచెప్పుకునే కథలు సత్యవతివన్నారు. ‘కడప జిల్లా కథలు-కక్షలు- కార్పణ్యాలు-స్త్రీలు’ అన్న అంశంపై ఆచార్య మూలె విజయలక్ష్మి ప్రసంగించారు. అన్నదమ్ముల మధ్య, దాయాదుల మధ్య, ఇరు అగ్రకులాల మధ్య చిన్నచిన్న విషయాలకు మొదలైన గొడవలు చిలికి చిలికి గాలివానై గ్రామం రెండు వర్గాలుగా చీలి తరతరాలుగా తరగని పగలు కొనసాగిస్తుంటారనీ, ఖూనీ చేయబడినా ఖూనీచేసి జైలుకెళ్లినా కుటుంబ భారం మహిళపై పడుతుందని, కక్షలు కార్పణ్యాల వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, మానవీయతను కోల్పోతున్నారని, వాటిని పరిరక్షించే మార్గంలో స్త్రీలు చైతన్యవంతులయ్యారని, అలాంటి కథలు వేళ్ళమీద లెక్కించగలిగినన్నే వచ్చాయని కొమ్ములు, వీరనారి, కరువు వచ్చె కచ్చెలు వచ్చె కథలను పేర్కొన్నారు.
‘కొండేపూడి నిర్మల కథల్లో స్త్రీ చైతన్యం’ అన్న అంశంపై డాక్టర్‌ పి. శరావతి ప్రసంగించారు. మనిషికీ మనిషికీ మధ్య మానవత్వం లోపించిన విషయాన్ని నిర్మల ‘శత్రుస్పర్శ’ కథా సంకలనంలో చూపించారన్నారు. జీవితంలో తనను తాకినవన్నీ శత్రుస్పర్శలేనని చెపుతారు. 20 కథల్లో అన్నీ స్త్రీ గురించే రాశారన్నారు.
‘కుప్పిలి పద్మ కథల్లో స్త్రీవాద భావజాలాన్ని’ డాక్టర్‌ కృష్ణవేణి విశ్లేషిస్తూ, ఈ కథలు స్త్రీవాద కథల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాయన్నారు. కుప్పిలి పద్మ కథలకు పెట్టిన శీర్షికలన్నీ కవితా ధోరణిలో కనిపిస్తాయన్నారు. ముక్త, కుబుసం, మయూర, మంచుదీపం, నిర్ణయం తదితర కథల్లో మహిళ చైతన్యానికి మార్గదర్శకంగా ఉన్నాయన్నారు. ‘పాతికేళ్ళ స్త్రీల కథాయాత్ర’ అన్న అంశంపై వి. ప్రతిమ మాట్లాడారు. ఈ పాతికేళ్లుగా సమాజంలోని అన్ని వర్గాల మధ్య నెలకొన్న అసమానతలను కథాసాహిత్యం ప్రతిబింబించిందన్నారు. స్త్రీ తొలిరోజుల్లో కవిత్వంలో అస్త్రంగా దూసుకువచ్చినప్పటికీ, తమ సమస్యలను విస్తృతంగా చర్చించడానికి కథా సాహిత్యం దోహదపడిందన్నారు.
రెండవ సమావేశం – యడ్ల బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన రెండవ సమావేశం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ‘పుష్పాంజలి కథల్లో మహిళ’ అన్న అంశంపై బాలకృష్ణారెడ్డి ప్రసంగించారు. అగ్గితోను, ఆడపిల్లతోను చెలగాటమాడవద్దని అధ్యాపకురాలైన పుష్పాంజలి తన విద్యార్థులకు హితవు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. ‘ఎం.ఆర్‌. అరుణకుమారి కథల’పై డాక్టర్‌ జి. ఉషారాణి మాట్లాడారు. అరుణకుమారి కేవలం కథల్లోనే కాదు, నిజజీవితంలో కూడా స్త్రీకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలదీస్తారని చెప్పారు. కనుక ఆమె శ్రీవాద అరుణకుమారిగా ప్రసిద్ధులయ్యారని గుర్తుచేశారు. ముక్కుసూటిగా కుండబద్ధలు కొట్టినట్లు రాస్తారని చెప్పారు.
‘వాడ్రేవు వీరలక్ష్మీదేవి కథలు-చైతన్యం’ అన్న అంశంపై సుంకోజీ దేవేంద్రాచారి ప్రసంగించారు. పల్లెపల్లెలో, మన చుట్టుపక్కల ఉండే స్త్రీల జీవితాలను వీరలక్ష్మీదేవి తన కథల్లో విశ్లేషించారన్నారు.
‘తెలుగు కథాసాహిత్యంలో వృద్ధుల సమస్య’ అన్న అంశంపై జి. ధనలక్ష్మి ప్రసంగించారు. మారుతున్న పరిస్థితుల్లో వృద్ధుల సమస్య ఒక సామాజిక సమస్యగా తయారైందన్నారు. వృద్ధుల సమస్యలపై వందల్లో కథలు వచ్చాయని, పురుషులకంటే స్త్రీలే వృద్ధాప్యంలో ఎక్కువ సమస్యలు పడుతున్నారని, ఆర్థిక, శారీరక సమస్యలతో పాటు వయసు సహకరించకపోయినా ఇంటిచాకిరీ, పసిపిల్లల ఆలనాపాలనా బాధ్యత పడుతుందన్నారు. ఆయా, అమ్మమ్మ, జీవనసంధ్యలో ఉషోదయం వంటి కథలు ఉదహరించారు.
‘వి. ప్రతిమ కథల్లో స్త్రీ చైతన్యం’ అన్న అంశంపై ఓ. సరస్వతి ప్రసంగించారు. ‘పక్షి’ కథాసంకలనంలో స్త్రీ చైతన్యం గూర్చి చిత్రించారని ‘మాక్కొంచెం నమ్మికమివ్వండి’ అన్న కథను విశ్లేషించారు.
మూడవ సమావేశం – డాక్టర్‌ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడే పురుషుడి యోగ్యత బైటపడుతుందని తన అధ్యక్షోపన్యాసంలో వ్యాఖ్యానించారు.
‘తెలుగు కథా సాహిత్యంలో ముస్లిం మహిళలు’ అన్న అంశంపై డా. ఎస్‌. గులాబ్‌జాన్‌ మాట్లాడారు. మహిళలందరూ పురుషాధిక్యం సమాజంలో ఎదుర్కొనే సమస్యలతో పాటు మతం కారణంగా ముస్లిం మహిళలు తలాక్‌, బహుభార్యత్వం, మత సాంప్రదాయం, బురఖా, పరదా, పేదరికం వల్ల అరబ్‌షేక్‌లకు అమ్ముడుపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ‘తెలుగు కథల్లో గిరిజన స్త్రీ పాత్రచిత్రణ’ అన్న అంశంపై జి. శైలమ్మ ప్రసంగించారు. మోసం చేయడం చేతకాని గిరిజన స్త్రీకి మోసపోవడం మాత్రమే తెలుసునని, ఆచారాలు గిరిజన స్త్రీని కృంగదీస్తున్నాయని పేదరికం మాతృత్వ మమకారాన్ని కాదనుకొని పిల్లలనమ్ముకొనే స్థాయికి దించుతోందని చెంచురాణి ఆచారం, కోయకన్నె, నమ్ముకున్న రాజ్యం కథలను ఉదహరించారు. ఇంకా సి. సరళాదేవి ‘ఓల్గా రాజకీయ కథల్లో స్త్రీ’, పి. విశాల ‘సి. భవానీదేవి కథల్లో స్త్రీ’, లోకేశ్వరి ‘కుప్పిలి పద్మ పూలజలతారు’పై పత్రాలు సమర్పించారు.
ముగింపు సమావేశంలో ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ జె. ప్రతాపరెడ్డి ప్రసంగిస్తూ, స్త్రీల పరిస్థితి ఒకప్పటిలా లేదని, ఇప్పుడు వారు అన్ని రంగాలలో ముందున్నారని అన్నారు. కథకు చివరిపేరానే ప్రాణమని, ఆ మలుపే కథను నిలబెడుతుందని చెప్పారు. చట్టసభల్లో స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్‌ కాదని, వారికి జనాభా రీత్యా 50 శాతం రిజర్వేషన్‌కు అర్హులని అన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య ఇ. మంజువాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆచార్య మూలె విజయలక్ష్మి, విభాగాధిపతి డాక్టర్‌ పి. శరావతి పాల్గొన్నారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to తెలుగు కథా సాహిత్యం – మహిళ

  1. maharshi says:

    చాన్నల్లకి విజయ లక్ష్మి రచన చదివా
    ఇంతకీ ఈ మె ఇక్కడే పని చెస్తొందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.