తెలంగాణా మట్టిలో మొలకెత్తిన మేలి విత్తనం – నాంపల్లి సుజాత

శిలాలోలిత
ఇటీవలే ‘గాయాలే గేయాలై’ పేరుతో తెలంగాణా స్త్రీల కవిత్వ సంపుటి వచ్చిన విషయం మనకందరకూ తెలిసిందే. రాజీవ, అమృతలత, జ్వలితల సమిష్టికృషితో 60 మంది కవయిత్రులతో వెలువడింది. కొత్త కొత్త కవయిత్రులెందరో తళుక్కున మెరిసారందులో. చిక్కటి కవిత్వ రచన, భావోద్వేగాలతో కవిత్వముంది. ఆ సంకలనంలోని నాంపల్లి సుజాత కూడా తెలంగాణా మట్టిని తొలుచుకొచ్చిన బిడ్డ. ‘నెమలీకల’తో గతంలో సాహిత్య రూపాన్ని చూపించింది. ఇప్పుడు 2009లో ‘మట్టి నా ఆలాపన’ అంటూ తన కవిత్వ తత్వాన్ని మనముందుంచింది.
‘నాంపల్లి సుజాత కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌ మండలంలోని పోతారం గ్రామంలో పుట్టింది. తండ్రి, అన్నదమ్ములు చిత్రకారులు, కవులు కావడంవల్ల మంచి సాహిత్య వాతావరణంలో పెరిగింది. ”సమాజానికి ఉపయోగపడే రచనలు చేయాలనే…కానీ ఇంటికీ, ఉద్యోగానికి చాలా దూరం ఉన్నందువల్ల నా లక్ష్యాన్ని అనుకున్న మేరా చేరలేకపోతున్నాను” అని భావిస్తోంది. ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, ఎక్కువ ప్రయాణాలు, దూరాభారాలు కుటుంబ బాధ్యతలవల్ల రచనకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతు న్నానంది. సుజాతేకాదు చాలామంది స్త్రీల పరిస్థితే అది. అందుకే పురుష రచయితలకున్నంత తీరుబాటు, సమయం, కుటుంబ సహకారం, స్వేచ్ఛ, బాధ్యతల్ని పంపిణీ చేసుకునే వారుండడం ఇవన్నీ స్త్రీలకు తక్కువ. కానీ, వాళ్ళల్లో నిబిడీకృతమైన సాహిత్య లాలస, ఉత్సాహం, రాయకుండా ఉండలేని అంతర్గత కవి రూపం తమకున్న సమయంలోనే, తీసివేతలు, భాగాహారాలు, గుణింతాలు చేసుకుని రాస్తున్న వైనాలు కోకొల్లలు. తమకంటూ ఒక స్పేస్‌ కోసం పోరాడి సాధించుకుంటున్నారు. అందుకే స్త్రీల తపన వెనకున్న ఆర్తే నాకు వాళ్ళ పట్ల వాత్సల్యాన్ని కలిగిస్తుంది.
ఒక స్పష్టమైన రాజకీయ అవగాహన, అసమానతల పట్ల సరైన ఆలోచన వున్నందువల్ల ఖచ్చితమైన వ్యక్తీకరణ అనేది సుజాత కవిత్వంలో గోచరిస్తుంది. ‘లెక్కకు రాదెందుకు/ ఆడదాని రెక్కల కష్టం/ ఎక్కడైనా/ పక్కనేసుడేం’-
కులవృత్తులు శిధిలమైన ఈ కాలంలో ‘కుమ్మరి’ జీవితాన్ని గురించి ఎంత క్లుప్తంగా చెప్పిందో చూడండి. ‘మంత్రహస్తమది/ఎన్నికుండలో అతని చుట్టూ ఇంట్లో మాత్రం/చిల్లికుండ. – ఇక్కడ ఆగి మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు.
‘ఆమె ముఖంలో/ ఎంతందమో!/ఎందుకో చెప్పండి/ నవ్వుల్లో హృదయం’- సంతోషంగా హాయిగా స్వేచ్ఛగా ఉన్న జీవితమే అందమైంది అనే నిజాన్ని ఎంతో నిజాయితీగా చెప్పింది.
స్త్రీ పురుషుల స్వేచ్ఛా విహారాన్ని అభిలషిస్తూ ‘పతంగులకు/శతృత్వం లేదు/ దారాలే/ కోసుకుంటున్నాయి మరి’ అనేస్తుంది. దారాల సంగతి తేల్చుకోండి ముందు. కనబడనివి, కనబడినవి, మంజాతో గాయంచేసేవి, కత్తిరించి పైకెగసిపోయేవి. ఎన్నెన్ని భాష్యాలైనా చెప్పుకోవచ్చు.
నిద్ర పట్టని దీర్ఘమైన రాత్రులుంటే వుండనీ, కనీసం కవిత్వం అప్పుడైనా రాసుకోవచ్చు అని ఒక చోట ఉబలాటపడుతుంది. రాజూ, బంటూ మంత్రి నువ్వే. ఇంట్లో సవ్యసాచివి, చివరకు ‘కరివేపాకువి’ జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తుందిచోట. జీవన వాస్తవికతను లోతైన అవగాహనతో ఇలా చెబ్తుంది. ‘అద్దమేమన్నదనీ/బద్దలుకొట్టావ్‌!/ముఖాన్ని! తడుముకుంటే పోయేదిగా/ ఆమెలో వున్న గొప్ప వేదాంతి రూపమిది.
నాంపల్లి సుజాత ఇంకొక చోట- నా అణువణువు నా మట్టి ఆలాపనే/నన్ను కవిని చేసింది/గ్రంధాలు కాదు/ మట్టే.” అంటుంది. తన చుట్టు చూపే, మట్టి మనుషులే తనను కవిత్వ దిశగా ప్రయాణింపజేశారంటుంది. ‘ఎనర్రగ’ కవిత తండ్రిపై రాసింది. ‘మానాన్నకి మా కాళ్ళు తొడిగితే బాగుండు/ అన్న ఒక్క చరణం కన్నీళ్ళతో తడిపినట్లుయింది. ప్రేమ నిండిన మనసే పలకగలదలా! తెలంగాణా స్వేచ్ఛా పోరాటంలో తనూ భాగస్వామై అద్భుతమైన కవితలు రాసింది. ‘అడుగడుగునా మోదుగలై పూస్తాం’ అని నిర్ణయ ప్రకటన చేస్తుంది. ప్రపంచీకరణ నేపధ్యాన్ని, సామాజిక స్థితిగతుల్ని, అసమానతల్ని చాలా సరళంగా లోతైన ప్రశ్నలనే బాణాలతో సంధిస్తుంది. మూడొంతుల నీళ్ళు/ ఒక వంతు భూమిని చదివినం/ పాలకన్నా/ నీళ్ళెందుకు ఖరీదైనయి?’ అంటుంది. ‘అరిగోస’ ఆలోచనాత్మకమైన కవిత’- తెలంగాణా నెరజాన కాదు/ కన్నీళ్ళ వాన/ వానలో తడిసిన ఓ నాగ్రామమా!!/ ఏమైనా సరే/ నిన్ను కాపాడుకుంటా. ‘అంగడి’ కవిత గోరటెంకన్న రాసిన ‘సంత’ పాటను గుర్తు తెచ్చింది. ‘లెంకపేట’ కూడా తెలంగాణాలోని గ్రామాలను చూపించిన కవిత. ‘పక్షపాతపు పాచికలకు / నూకలు చెల్లినట్లే తల్లీ తెలంగాణ!/ రానున్నయి నీకు రతనాల రోజులు/ అనే ఆశావహ దృక్పధాన్ని వ్యక్తీకరించింది. గతంలో దాశరధి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నాడు ఆ రోజులు తప్పకుండా వస్తాయంటుంది సుజాత.
సగటు ఉపాధ్యాయులమీద ఓ చురక/ పుస్తకాలకంటే నేను/ క్యాలండర్‌నే ఎక్కువసార్లు/ అధ్యయనం చేస్తానేమో! తెలంగాణా ప్రజల శాంత స్వభావాన్నీ, అమాయకత్వాన్ని స్వచ్ఛతనీ, మంచితనాన్ని కూడా లెక్క చేయని తనాన్ని చూస్తే ఆగ్రహంతో ‘బొంకిచ్చుడు బోర్లేసుడుకి నోరెళ్ళ బెడుతున్నం/ పువ్వులే కదాని నలిపేస్తే/ రవ్వలై ఎగజిమ్ముతం’అని హెచ్చరిస్తుంది.
మొత్తమ్మీద నాంపల్లి సుజాత కవిత్వ లోకంలోకి ప్రయా ణించడమంటే, ఇంచుమించుగా తెలంగాణా జన జీవితంలోకి వెళ్ళిపోవడమే. జీవితాన్ని ప్రేమించిన వాళ్ళు, మనుషుల్ని అభి మానించినవాళ్ళు, మానవత్వపు పూదోటలో పూలైన వాళ్ళు, కవిత్వ రాసాస్వాదనలో సేదతీరేవాళ్ళు కవులైతే, ఎంత నిజాయితీగా కవిత్వాన్ని పుక్కిలిస్తారో సుజాత కవిత్వం చూపిస్తుంది. తెలంగాణ మట్టిని తొలుచుకొని వచ్చిన మంచి విత్తనం మొలకెత్తి మొక్కై రెండు పూలని పూచిందిప్పటికి, మహావృక్షమై, శాఖోపశాఖలై ఎప్పటికీ సాహిత్య చరిత్రలో నిలిచిపోవాలని మనసారా అభిలషిస్తున్నాను.

Share
This entry was posted in మనోభావం. Bookmark the permalink.

2 Responses to తెలంగాణా మట్టిలో మొలకెత్తిన మేలి విత్తనం – నాంపల్లి సుజాత

 1. Ramnarsimha says:

  శిలాలోలిత గారు,

  >> పుస్తకాల కంటే నేను ఎక్కువగా క్యాలండర్ నే అధ్యయనం చేస్తాను..

  అనే కవితా పంక్తి (కవిత) చాలా బాగుంది..

  మీకు, నాంపల్లి సుజాత గారికి అభినందనలు..

 2. swathi says:

  మంత్రహస్తమది ఎన్ని కుందలొ……..చాలా బాగునిది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో