ఆర్‌. వసుంధరాదేవి

పి.సత్యవతి
స్వానుభవ సంపదా, అన్వేషణా తృష్ణా, అధ్యయన తత్పరతల నించీ వెలువడిన తాత్విక చింతనా పరిమళాలు, ఆమె కథలు… పాఠకుల మనసులకు సాంత్వన నిచ్చే మంచిగంధపు లేపనాలు. మనసు పోకడలు, కడలి తరగలలా, ఒకానొక ఆవేశంతో ఎగసిపడి ఎగసిపడి. ఆవేశపడి. ఆయాసపడి. అంతలోనే తమ ఆత్మను నుక్కుని, శమించి ప్రశాంతపడి, శాంతపడి ”ఓ! అంతా చేసి ఇందుకేనా? అని నిర్మలంగా నవ్వుకోగలిగే స్థితిలోకి తీసుకుపోతాయి. తన అనుభవంలోనుంచీ రూపొందించుకున్న తాత్వికతను పాఠకులకు పంచడం ఎంత తార్కికంగా కళాత్మకంగా ఉంటుందో తెలియాలంటే ఆమె 1960 లలోనే వ్రాసిన ”చెరువుదగ్గర”తో మొదలు పెట్టి ”జూన్‌ పాల్‌ చేసిన బీరువా” ”పెంజీకటికావల”, ”బ్రిడ్జి కింద”, ”నీడలు” ”అమల”, ”అమ్మా ఇక సెలవు” వంటి కథలు చదివి ఆమె తాత్విక ధృక్పథాన్ని, సామాజిక విశ్లేషణనూ, మనస్తత్వశాస్త్ర పరిజ్ఞానాన్నీ, తెలుసుకుని ఆమె మనకు వాగ్దానం చేసే జీవనోత్సాహాన్ని అందుకోవాలి… ఆమె రాటకొండ వసుంధరాదేవి. ఈమె వివిధ సంకలనాలలో వ్రాసిన యాభై కథలనూ గుదిగుచ్చి 2004లో ఒకే సంకలనంగా వెలువరించిన తరువాత అన్ని కథలూ ఇప్పటి పాఠకులకు అందు బాటులో కొచ్చాయి. ఇందులోనుంచీ పై చెప్పిన కథలు ఆమె శిల్ప నైపుణ్యానికీ సామాజిక తాత్విక ధృక్పథానికీ అద్దంపడతాయి.
ముందు చెరువుదగ్గిరికి పోదాం. దాన్ని బుక్కరాయసముద్రం చెరువని అక్కడి వాళ్ళు అన్నప్పటికీ, దేశమంతా అనంతపురం చెరువనే అంటారని కురువలింగప్ప అంటాడు. అనంతాకాశం కింద ఆ చెరువు దగ్గర కట్టిన గణేశుడి గుడీ, అక్కడి హద్దులు లేని స్వేచ్ఛ సుశీలమ్మకి చాలా ఇష్టం… సుశీలమ్మ సంప్రదాయ కుటుంబం చెక్కిన బొమ్మ. ఆ ఇంటి ఆడపిల్లలెలా వుండి మంచి అనిపించుకోవాలో తెలుసుకుంటూ తనని అలా మలచుకుంటూ పెరిగి, వివాహమై, భర్తతోడిదే జీవనం అనీ భార్యా భర్తల బంధం ఆత్మపరమాత్మల బంధం అనీ నమ్మి భర్తకి జలుబు చేసినా భయపడుతూ బతుక్కొస్తున్న ముప్ఫై అయిదేళ్ళ స్త్రీ. అయితే ఆమెలో ఈ మధ్య ఒక అలజడి ప్రారంభమైంది.” తన జీవితం తనది కానట్లూ, ఎవరి బలవంతం మీదో బ్రతుకుతున్నట్లు బాధ. జీవితకాలంలో చాలా భాగం గడిచిపోయింది. ఇహ చచ్చిపోవడం తరువాయి. బతక్కుండానే చావు.. నిజం జీవితాన్ని అనుభవించాలని, నవ్వాలని ఏడ్వాలని, అందులో లీనమై పోవాలని ఆరాటపడుతూ దాన్ని అందుకోలేక విడిగా నిలిచిపోయి వ్యర్థంగా నశించిపోతున్నట్లు భావన కల్గుతుంది… తానేదో బలాత్కారానికి గురౌతున్నట్లు, ఎవరో తనని మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. గడచిన జీవితం ఎడారిలాగా ముందున్నది స్మశానం లాగా తోస్తున్నది” అంతే కాదు ”వేల సంవత్సరాల నించీ వెలుగులు చిమ్ముతూ వస్తున్న భారతీయ జీవన విధానం నేడు ఉత్త మేడి పండు అయిందా!! అందులో లోపం ఏర్పడిందా? కడుపులో పుచ్చును దాచుకున్న మల్లెమొగ్గ ఈ మనసు అనిపిస్తున్నది. ఇరుకులో చిక్కుకున్నట్టి భావన బలపడుతున్నది. ఈ ముసుగులో నించీ వ్యవహరించడానికే గాని జీవించడానికి హక్కులేదేల? ఏ పనీ సద్య స్ఫూర్తితో చెయ్యలేను” ఇదంతా కూడా జండర్‌ చట్రంలో ఇరుక్కుపోయిన సుశీలమ్మ వేదన. ఇటువంటి ఎడారి లోకి కురువలింగప్ప ఒక నౌకరుగా ప్రవేశించాడు. ఎనభై ఏళ్ళ పల్లెటూరి ”అనాగరికుడు”. వృద్ధాప్యం అతని శరీరానికే గానీ జీవితానికి కాదు. ఆ చుట్టుపట్ల అన్ని ప్రదేశాల గురించి అనర్గళంగా మాట్లాడతాడు. మనుషుల గురించి, ప్రకృతి గురించి జంతువుల గురించి, అక్కడి వేయిన్నొక్క దేవుళ్ల గురించి, జీవితం గురించి.. అట్లా పరవళ్లు తొక్కే ఉత్సాహంతో మాట్లాడతాడు. గలగల మని నవ్వుతాడు. ఆ వయస్సులో తనకు అక్కరకు రాని కొడుకు గురించి కూడా కోపం తెచ్చుకోడు. పిల్లలేదో చేస్తారని ఆశించి వాళ్ళని పెంచం కదా? పెంచడమనే ధర్మం ప్రకారం పెంచుతాం అని నిర్వికారంగా జీవన సత్యాలను చెప్తాడు ఎవరో తయారు చేసి పెట్టిన విధంగా కాక తనకి తోచిన విధంగా ప్రవర్తించే స్వేచ్ఛ కలవాడు. తనూ తన జీవితం వేరైనట్లు లింగప్పా అతని జీవితం వేరుకావని అనుకుంటుంది. సుశీలమ్మ. సుఖం దుఃఖం, జబ్బు చావు అన్నీ జీవితంలో భాగాలే లింగప్పకి… దేనికీ కలతపడడు. అతనిది అతి సామాన్య జీవితం… అధమాధపు జీవితం.. కానీ అది చావు తాకని జీవితం. నిరంతరం ప్రవహించే జీవన వాహిని.. ఒక సజీవ చైతన్య మూర్తి, ఈ కురువలింగప్ప. అతని మాటలు, చేష్టలు, అనుభవాలు, జీవితాన్ని జీవించడానికే గానీ, కృత్రిమపు నీతి చట్రాలలో బిగించుకోడానికి కాదనే అతనిధృక్పథం, సుశీలమ్మకు ఒక చల్లని కాలక్షేపం. ఏ చెరువు దగ్గర, గణేశుని ఆలయం దగ్గర ఆమె స్వేచ్ఛనూ శాంతినీ పొందగలిగేదో అక్కడే జరిగిన ఒక దుర్ఘటన ఆమె జీవితంలో భూకంపం అయి ప్రాణాలు తీసింది.. ఆ చెరువు దగ్గరే, ఆమె భర్త సమక్షంలోనే ఆమె పై అత్యాచారం జరిగింది. శరీరంపై అసహ్యం పుట్టి బావిలో దూకి చనిపోవాలనుకుంది. కానీ తీసి రక్షించారు. ఆస్పత్రిలో చేర్చారు. ఆమెను చూడవచ్చిన అత్తవారి నోటినించిగానీ పుట్టింటి వారి నోటి నుంచిగానీ ఆమెను బ్రతికించేమాటేదీ రాలేదు. ఆమెను ఏకాంతంలో ”సీతా” అని ప్రేమగా పిలుచుకునే భర్తముఖంలో ఆమెను బ్రతికించే భావమేదీ కనపడలేదు. తనే తప్పూ చెయ్యలేదని ఆమెకు తెలుసు. తనకు చచ్చిపోడానికి ఎండ్రిన్‌ తెచ్చిపెట్టమని లింగప్పనడిగింది. భగవంతుడిచ్చిన జీవితం జీవించడానికే గానీ అంతంచేసుకోడానికి కాదనీ ఇక్కడ ఉండలేకపోతే ఇంకొక చోట ఉండే ఏర్పాటు చేస్తాననీ అనునయిస్తాడు లింగప్ప. లింగప్పని తప్పించుకుని చెరువు దగ్గరకి వచ్చింది సుశీలమ్మ. అక్కడ అనంతమైన స్వేచ్ఛ!!, తను నమ్మి తనను అర్పించుకున్న నాగరిక సమాజం, తను తప్పు చెయ్యలేదనే నిజాన్ని ఒప్పుకుని తనని అక్కున చేర్చుకోలేక, ఒక అనాగరిక లింగప్ప ఎదుట మరిగుజ్జైపోయింది. తనకి మలినం అంటలేదని భగవంతుడికి తెలుసు. ఆయనకి కరుణ తప్ప ఇంకేమీ లేదు. అనుకుంటే ఒక సత్య దర్శనం అయినట్లయింది. అట్లా చెరువు గట్టున నడిచి నడిచి కాలికి రాయితగిలి దొర్లిపడి మట్టిలో కలిసిపోయింది. 1960లోనే జండర్‌ నియంత్రణని స్త్రీలు ఎంత ఆత్మహత్యా సదృశ్యంగా భావించేవారో పదునుగా చెప్పిన కథ ఇది. బాహ్య ప్రవర్తనలో నాగరిక సమాజానికి కాంట్రాస్టుగా కనిపించే లింగప్ప భగవంతునిలా ప్రాణదాతే కానీ నాగరిక సమాజంలా ప్రాణహరుడు కాదు. వసుంధరా దేవి సృష్టించిన గొప్ప పాత్ర కురువ లింగప్ప.
ఇంచుమించు ఇటువంటిదే జాన్‌ పాల్‌ పాత్ర కూడా. ఇతను టక్కరి వాడు. భార్యను హింస పెట్టగా ఆమె అతన్ని విడిచిపెట్టి కూతురుతో వుంటోంది. అతని కొడుకు ఫిలిప్‌. కొడుకంటే కడు ఆపేక్ష అతనికి. అందువల్ల అతను సరిగ్గా కుదురుకోకపోయినా ఏమీ అనడు. పైగా కొడుక్కి ఆత్మాభిమానం ఎక్కువని గర్వంగా చెబుతాడు. ఈ కథ ఉత్తమ పురుషలో నడుస్తుంది. కథకురాలు ఎంతో అభిమానంగా దాచుకున్న పాట మీద ఆమె కొడుకు కొత్త పాట రికార్తు చేస్తాడు. తనకెంతో ఇష్టమైన పాట లేకుండా పోయినందుకు బాధపడి తనకంటూ ప్రత్యేకంగా ఒక బీరువా వుంటే తనకిష్టమైనవన్నీ దాచుకోవచ్చని ఆమె జాన్‌ పాల్‌ని పిలిచి బీరువా చెయ్యమని పూరమాయిస్తుంది. అతను దొంగ బిల్లులు వేయించి కలప కొంటాడని, చెక్కలు ఎత్తుకు పోతాడనీ వేళకి పని పూర్తి చెయ్యడనీ మధ్యలో మరోపని ఒప్పుకుంటాడనీ అతన్ని గురించి చాలా మంది చెబుతారు. అయినప్పటికీ అతను నైపుణ్యం కల పనివాడు కాబట్టి అతను పెట్టే తిప్పలన్నీ పడి మొదట చెప్పిన అంచనాకు చాలా ఎక్కువ ఖర్చైనా బీరువా చేయించుకుంటుంది. ఇంక చివరి పాలిష్‌లు కొసముగింపులు వుండగా జాన్‌పాల్‌ కొడుకు ఫిలిప్‌ వాగులో పడి చనిపోతాడు. అంత ప్రేమించిన కొడుకు మరణం అతన్ని ఎంత కుంగదీస్తుందో ననుకుంటుంది ఆమె… కానీ ఇప్పుడు అతనిలో అది వరకటి టక్కరి తనానికి అతివినయానికి బదులు ఒక హుందాతనం వచ్చింది. ”..మాట పొరపాటు రాకూడదు నాయనా!! అయ్యగారు డబ్బులెక్కువని కోప్పడితే నువ్వు కూలి తీసుకోమాక” అని అతని కొడుకు చెప్పిన మాటకి కట్టుపడి తన పాత జీవన ధోరణిని మార్చుకున్నాడు. కొడుకు పోయిన నాలుగోరోజునే పనికి వచ్చాడు. బీరువా పని పూర్తి చేశాడు. మనిషిని ధరించిన మనస్సు అనంతమూ మహాశక్తివంతమూ అని కధకురాలు అర్థం చేసుకుంటుంది.. జాన్‌ పాల్‌ ధైర్యశాలి, బలశాలి. ధైర్యమూ బలమూ మనిషిలోని సత్యానికి సంబంధించిన గుణాలు… బీరువాను చూసిన పిల్లలు తామెవరు ఏ అరల్లో ఏం పెట్టుకోవాలో అని మాట్లాడుకున్నప్పుడు ఆమె అది తనకోసం చేయించుకున్నాని అనదు జాన్‌ పాల్‌ కొడుక్కిచ్చిన మాటకోసం తన పాత జీవితాన్ని ఎంత అలవోకగా విడిచిపెట్టాడో తన తన వస్తువులు తనకే వుండాలన్న కోరికని వదులుకుని.. తను దాన్ని ఉపయోగించు కున్నా లేకపోయినా ఫరవాలేదనుకుని పిల్లల కివ్వడానికి సిద్ధపడుతుంది. :” ఈ ప్రపంచం ఒక అస్పష్టమైన వర్ణచిత్రం. అందులో మనం గుర్తించగలిగేది అంతకు ముందే (మన) మనసులో ఎరుకగా వున్న దానిని మాత్రమే… అనికూడా అంటుంది రచయిత్రి…
నీతి, వినయం ఇతరుల బాగుకోసం తాము అన్నీ వదులుకోడం, తమ బ్రతుకిక ఇంతే అనుకుంటూ అణిగి మణిగి వుండటం మొదలైన గుణాలన్నీ బొద్దింక గుణాలనీ, జీవించడం అంటే ఒక ఉత్సాహంతో ధైర్యంతో జీవించడం అనీ టక్కరితనం అబద్ధాలాడటం వంటి కొన్ని సర్వైవల్‌ టెక్నిక్స్‌ అవలబించినా అది జీవనోత్సాహానికి నిదర్శనమే కానీ మరొకటికాదనీ రచయిత్రి ”మనుషులూ బొద్దంకులూ”, ”అ-బద్ధం’ బ్రతుకు తెరువు” వంటికథల్లో చెబుతారు.
”పెంజీకటి కవ్వల”. కథలో ప్రధాన పాత్ర జయలక్ష్మి, ఆమె మానసికావస్థలు, భయాలు, అనిశ్చితమైన, ఆలోచనలు, ఆమె మానసిక పరిణామం, పరిణతీ పొరలు పొరలుగా చిత్రించడం వసుంధరాదేవి ప్రత్యేకతే!! ప్రాణులందరికీ మరణం తధ్యమే. అయితే మనుషులకు ఆ ఎరుకను నిబ్బరంగా అంగీకరించడం అంత సులువు కాదు. సంపన్నుల కాలనీలో కావాలని ఇల్లుకట్టుకున్న జయలక్ష్మికి ఆ కాలనీ వెనక వుండి శవం కాలినప్పుడల్లా ఇళ్ళల్లోకి చావుకమురువాసన పంపే స్మశానం అంటే భయం, ఏవగింపు. తనకి మరణం ఎప్పుడొస్తుందోనని భయం… ప్రతి సంఘటననూ చావుతో ముడిపెట్టి చూసుకుంటూ, ”స్వామీ నన్ను బ్రతకనీ” అని దేవుడి గదిలో తలుపు వేసుకుని ప్రార్థిస్తుంది. అమెకు గుండె జబ్బు వస్తుంది… అట్లా సంక్షుభితమైన మానసిక స్థితిలో వున్న జయలక్ష్మికి ఒక అనుభవం ఎదురైంది. ఈ ఆత్మికమైన అనుభవంతో ఆమెకు సత్య దర్శనం అయినట్టు అయింది. తను లేకపోయినా ఈ ప్రపంచం వుంటుంది. ఇక్కడి సౌందర్యం సంతోషం వుంటాయి. అనే ఆనందం కలిగింది, జయలక్ష్మి మానసికావస్థలను ఈ కథలో రచయిత్రి చిత్రించిన తీరు అద్భుతం. అట్లాగే ”నీడలు” అనే కథలో నిర్మల పాత్ర, మనం చూసే చూపు బట్టే మనకు ప్రపంచం అర్థం అవుతుందని, మనసులో వుండే నీడల్ని (అభద్రతాభావాలు, అహేతుక ద్వేషాలు) తొలిగించుకుంటేగాని ప్రపంచాన్ని సరైన దృష్టితో చూడలేమనీ ఈ కథ చెప్తుంది.
”బ్రిడ్జి కింద” కథ సమాజంలో వేళ్ళు పాతుకుపోయిన అవినీతి, నిజాయితీపరులకు బ్రతుకు దుర్భరం చెయ్యడాన్ని ముగ్గురు వ్యక్తులు జీవన నేపధ్యంలో, చిత్రిస్తూ, అటువంటి జీవితాన్ని వాళ్లు ఎదురుకున్న పద్ధతుల్నీ దగాపడ్డ వాళ్ళ పక్షాన నిలబడవలసిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. చలపతి తండ్రి కాలేజీలో స్వీపర్‌గా పనిచేసి అణగిమణిగి ఉంటూ పావలా అర్ధా మామూళ్ళూ టిప్పులూ వసూలు చేసు కుంటూ పార్టీల్లో మిగిలిపోయిన స్వీట్లూ ఫలహారాలూ ఇంటికి తెస్తూ తినీ తినకా జీవనం గడుపుకొస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో స్కూల్‌ చదువు ముగించిన చలపతిని కూడా తండ్రి స్వీపర్‌ ఉద్యోగంలో ప్రవేశపెట్టగా, అక్కడ తండ్రి హైన్యాన్ని చూసి ఆ ఉద్యోగమూ ఇల్లూ వదిలి రిక్షా తొక్కుతున్నాడు చలపతి. తండ్రి అప్పుచేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే రిక్షా తొక్కి ఆ అప్పు తీర్చి మళ్ళీ వ్యవసాయంలో నిలదొక్కుకుందామని పట్నం వచ్చాడు పోతప్ప. అతను నిజాయితీగానే వున్నాడు. అతని భార్య కూడా బ్రిడ్జి దగ్గర తమలపాకులమ్మి ఒకటీ అరా సంపాది స్తున్నది. నీతి, నిజాయితీల మీద చలపతికీ, పోతప్పకీ వాదమవుతుంది. పోతప్ప చెల్లెలు కూడా బ్రతకడానికి పట్నం వచ్చింది. బ్రిడ్జి కింద బజ్జీల దుకాణం పెట్టింది. ఆమె భర్త తాగుబోతు, సోమరి. పోతప్ప రెండు పొటేలు పిల్లల్ని కొని మైదానంలో కట్టేస్తే ఒకదాన్ని రహస్యంగా అమ్మేసి తాగేశాడు. కోపం పట్టలేని పోతప్ప అతన్ని కొడుతుంటే పోలీసులు పట్టుకెళ్ళి లంచం ఇస్తే గానీ వదలకపోతే అందుకోసం రెండో పొటేలుని అమ్మాల్సి వచ్చింది. ఆ కోపంతో నిస్సహాయతతో బాగా తాగేసిన పోతప్ప ఆర్‌ టీ వో గారి కారు షెడ్డు పీకి పడేసి బీభత్సం సృష్టిస్తాడు. మళ్ళీ పోలీసులు పట్టుకెళ్లడానికి వస్తే బ్రిడ్జికింద వాళ్ళు అతన్ని దాచేస్తారు. డబ్బుతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పోయింది పోతప్పకి. అప్పుడతను చలపతి ఉంటే బావుండునను కుంటాడు. చలపతి అప్పటికే కొన్ని అప్పులు తీర్చకుండానే వూరు వదిలి వెళ్ళిపోయి వున్నాడు. సమాజం నిర్దేశించిన న్యాయా న్యాయాలకంటె మనుగడ ముఖ్యం అనేది చలపతి ఎంచుకున్న మధ్యేమార్గం. పాత ఊరినీ కొత్త ఊరినీ కలిపే ఆ రైలు బ్రిడ్జి కింద కానాలు ఎంతమందికో తాత్కాలిక నివాసాలు.” ఒక గుడ్డపీలికల మూటా ఒక సంచీ రెండు కుండలూ, ఒక లోటా, నీళ్ళు ముంచుకునే డబ్బా తెచ్చుకుంటారు. వాళ్ళు ఎంత అకస్మాత్తుగా వచ్చారో అంత అకస్మాత్తుగా నామరూపాలు లేకుండా మాయమైపోతారు. ఎందుకు వచ్చారో ఎలా బ్రతికారో ఎందుకు వెళ్ళిపోయారో ఎవరికీ తెలియదు.” అది బ్రిడ్జి కింద దయనీయ చిత్రం. భౌతిక పరిస్థులకు లొంగి ప్రవర్తించే ఏ పాత్ర పట్ల కూడా రచయిత్రికి విముఖతలేదు సానుభూతి తప్ప. వసుంధరాదేవి మరొక అద్భుతమైన కథ ”అమ్మా ఇక సెలవు”. ఈ కథలోని అమ్మ ఒక కధకురాలి అమ్మే కాదు ఆమె విశ్వమాత. ఈ కథలో రెండు అంశాలున్నాయి, ఒకటి ఆడపిల్ల జీవితాన్నంతో పెనవేసుకుపోయిన అమ్మ జీవితం, రెండు వ్యాపారసంబంధమే కానీ మానవ సంబంధాన్ని హృదయ సంబంధాన్ని కోల్పోయిన కార్పొరేట్‌ వైద్యపు నిర్లక్ష్యపూరితమైన యాంత్రికత. జీవన్మరణ స్థితిలోని వ్యక్తికి రవంత ఊరట సాంత్వన ఇవ్వక మృత్యువుకూ వేదనకు మరింత చేరువ చేసే యాత్రికత… ఈ కథలో రచయిత్రి అమ్మగురించి వ్రాసిన ప్రతి వాక్యమూ ప్రతి ఆడపిల్ల మనసులో నిలిచిన సత్యం. వసుంధరాదేవి కథలలో పాఠకులమనసులో నిలిచివుండే కథల్లో ఒకటైన ఈ కథ గురించి రెండు వాక్యాల్లో రాయలేము. అట్లాగే చిట్టిరాజు, సీతాకోక చిలుక, ఇంతేలే పేదల ఆశలు అడవిపువ్వు వాటికవి విశిష్టమైన కథలు, జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా నిరాశా నిస్పృహలావరించినా మళ్ళీ లేచి నిలబడి జీవితం కొనసాగించే రాగమ్మ, గౌరి, నాగరిత తెచ్చిన వేగానికి తట్టుకోలేక మరణించిన అమల ఇలా ఆయా ప్రాతల మానసిక పరిణామాలను తనదైన శైలిలో నిబ్బరంగా చెప్తారు రచయిత్రి.
1931లో జన్మించిన వసుంధరాదేవి బాల్యంలోనే వేటపాలెంలోని ప్రసిద్ధ గ్రంధాలయంతో అనుబంధం ఏర్పరుచు కుంటూ తెలుగు భాషపై మక్కువ పెంచు కున్నారు. అటుపై గుంటూరులో సెంట్‌ జోసెఫ్స్‌ కాన్వెంట్‌లోనూ అక్కడి విమెన్స్‌ కాలేజీలోనూ చదివి ఆంధ్రా యూనివర్సిటీ నించీ కెమిస్ట్రీలో మాస్టర్స్‌ చేసారు. తరువాత ప్రఖ్యాత విమర్శకులు ఆర్‌.ఎస్‌.సుదర్శనం గారిని వివాహం చేసుకుని గృహిణిగా వుంటూనే తన అధ్యయనాన్నీ అన్వేషణనూ రచననూ కొనసాగించారు. ఇప్పుడు తన తెలుగు కథల్ని ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు. మదనపల్లి నుంచీ న్యూయార్క్‌లో స్థిరపడే ప్రయత్నంలో వున్నారు. ఈ యాభై కథలే కాక ”రెడ్డమ్మ గుండు” అనే నవల వ్రాసారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డ్‌, నూతల పాటి గంగాధరం అవార్డ్‌లు అందుకున్నారు.
”తనకు తారసపడిన విశిష్టమైన అనుభవాన్ని చలం తన లేఖల్లో, మ్యూజింగ్సులో పొందుపరచినట్లుగా, వసుంధరాదేవిగారు తన కథల్లో పొందుపరిచారనిపిస్తుంది. భగ వంతునితో ప్రమేయం లేని తాత్విక విచారాన్ని ఈమె చాలా కథల్లో మనం గమనించగలం. ఈమె తాత్విక విచారణ ప్రపంచాన్ని వ్యతిరేకించేది కాదు.. అధిగమింపజూసేది… ప్రపంచానుభవాల్తో సంబంధంలేనిది… వాటిమీద ఆధార పడనిది.. వాటన్నిటినీ సంతోషంగా తేలిగ్గా తీసుకోనిచ్చేది.. దానికోసం ఈమె అన్వేషణ..” అంటారు బండి నారాయణ స్వామి. అవును కదా!!

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో