చదువు

పింగళి భట్టిప్రోలు బాలాదేవి
నాకింకా జ్ఞాపకం ఉంది, పదేళ్ళ క్రితం సురేష్‌ మా ఇంటికి రావడం. ఆ రోజు మా పనిమనిషి గౌరి వాడిని తీసుకుని వచ్చింది. పదేళ్ల కుర్రవాడు. నల్లగా, పొట్టిగా, వంకులజుట్టుతో, చురుకైన కళ్లతో, పొడుగైన నిక్కరూ, సగం చేతుల చొక్కా వేసుకుని వచ్చాడు. పల్లెటూరి అమాయకత్వం, ఒక రకమైన ఆకర్షణ, ఆశ్చర్యం వాడి కళ్లల్లో ప్రతిఫలించాయి. మావారు తను చదువుతున్న న్యూస్‌పేపరు పక్కనపెట్టి అడిగారు గౌరిని. ”ఎవరీ అబ్బాయి?” అని.
”మా మేనల్లుడు. ఊళ్లో సరిగ్గా చదువు అవదని తీసుకొచ్చాను. ఇక్కడేమయినా పనేదయినా చూడవచ్చునని” అంది గౌరి.
”ఏం చదువుకున్నావు?” అడిగారు ఆయన, ఆ కుర్రాడిని చూసి.
”అయిదో క్లాసు.” అన్నాడు వాడు సిగ్గుసిగ్గుగా.
”తర్వాతెందుకు చదవడం లేదు?” అన్నారాయన.
”అక్కడంత బావుండదని” అంది గౌరి.
”ఇంకా చదువుకుంటావా? చదవాలని ఉందా?” అన్నారు మావారు.
”అయ్యా – తప్పకుండా చదవాలనే ఉంది” పల్లెటూరి భాష ఇంకా వాడి మాటల్లో ఉంది. ఇక్కడ ఒరిస్సాలో పెద్దవాళ్లు పిలిచినా, మాట్లాడించినా ప్రతీదానికి వాళ్లు ”ఆజ్ఞా” అంటారు, మనం ”అయ్యగారు” అన్నట్లు.
”ఇక్కడుంటావా మాతో? నాకేమీ పని చెయ్యక్కర్లేదు. ఇక్కడే భోజనం చేసి ఉండి చదువుకుందువు గాని.” అన్నారు ఆయన నావైపు చూడకుండానే. ఆయనకి తెలుసు – నేనెవర్నీ ఇంట్లో ఉంచడానికి అంత ఇష్టపడనని. పనికి ఎలాగో మేము ఎవరినీ పెట్టుకోలేదు, ఇంట్లోనే ఉంచుకుని చేయించుకోవడానికి. నాకెప్పుడూ అలవాటు లేదు.. ఎవరైనా మామూలు అంట్లు తోమడం వగైరా పనులు పూర్తిచేసి, ఏరోజుకారోజు వెళ్లిపోవలసిందే.
అక్కడికీ అన్నాను అయిష్టంగా. ”ఎందుకు ఇంట్లో ఉంచుకోవడం? మనం పనికి పెట్టుకున్నామని ఎవరయినా ఏ ఛైల్డ్‌ లేబరు కమిషనుకో చెప్పేయగలరు.”
”మనం పని చేయించుకోవడం లేదు” అని లేచి వెళ్లిపోతూ అన్నారు వాడితో. ”సాయంత్రం రా. వచ్చి ఉండు. రేపు స్కూలుకి తీసుకుని వెళ్లి నిన్ను చేర్పిస్తాను.
ఆ రోజు సాయంత్రం చిన్నసంచిలో ఒక చొక్కా లాగూ, ఒక ”గావంచా” (తువ్వాలుని ”గావంచా” అంటారు ఒరియాలో) కొన్ని వేపపుల్లలూ, ఆవనూనె సీసా, ఒళ్లు రుద్దుకునే పీచు పెట్టుకుని వచ్చాడు. నాకసలు ఎవరూ ఇంట్లో కొత్తవారు వచ్చి ఉండడం నచ్చదు. ఏమీ అనలేక, చేదు మాత్ర మింగినట్లు ఊరుకున్నాను. ముందు డ్రాయింగురూమ్‌లో ఒక చాప, దుప్పటి తలగడ ఇచ్చాను పడుక్కుందికి. రాత్రి మాతోపాటు అన్నం, కూర, రొట్టెలూ అన్ని ఇచ్చాను ఒక ప్లేట్లో. క్రింద ఫ్రిజ్‌ పక్కన బాసింపట్టేసుకుని కూర్చుని తిన్నాడు.
ఆ రోజునించి వాడు మా ఇంట్లో మనిషిలా అయిపోయాడు. నాకూ కొత్తదనం పోయింది. మా అమ్మాయిలిద్దరితో సమానంగా చూసుకునేదాన్ని. మర్నాడు ఆయన ఇంటి దగ్గరున్న ఒరియా స్కూలుకి వాడిని కూడా తీసుకుని వెళ్లి మాట్లాడి వచ్చారు. వాడు అయిదోక్లాసు పాసయినట్లు సర్టిఫికేటిస్తే చేర్చుకుంటామన్నారు. ఆ సర్టిఫికేటు ఎలా తేవాలో వాడికి తెలీదు. ఎక్కడో కొండల మధ్య, అడవుల్లో ”నయా గడ్‌” అని పల్లెటూరది. ట్రెయిను తెలీదు అక్కడి వాళ్లకి. వాడి తండ్రి తల్లి అక్కడ అప్ప డాల అమ్మకం చేసేవారు. ఈ రాజధానీ నగరం వచ్చేముందు వాడు సినిమాహాల్లో వేయించిన అప్పడాలు అమ్మేవాడు. అక్కడి హెడ్‌మాష్టరుకి ఉత్తరం రాసి, తన లెటర్‌ పాడ్‌ మీద, కర్నల్‌గా ఆయన ఆఫీసరు హోదా తో ఉన్న అడ్రస్‌కయినా వాళ్లు విలువ ఇస్తా రని నమ్మకంతో, ఉత్తరం చూపిస్తే సర్టిఫికేటు ఇస్తారని వాడికి చెప్పి, వాళ్లత్తతో మళ్లీ వాళ్ల ఊరికి పంపించాం వాడిని. మూడుసార్లు రానూపోనూ ఖర్చులు, సర్టిఫికేటుకి ముడుపులూ ఇచ్చి, ఆ గవర్నమెంటు స్కూలునించి సర్టిఫికేటు, ”రెడ్‌ టేపి”జమ్‌ నించి బయటపడి తెప్పించేసరికి మూడు నెలలు పట్టింది. అదీ నాంది వాడి చదువుకి.
పొద్దున్నే నా పని పెరిగిపోయింది. మా ఇద్దరమ్మాయిలతోపాటు వాడికీ టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫినూ, రాత్రి భోజనం ఇలా. అందులో ఎదిగే వయసు. పొద్దున్నే లేవగానే ముందు వాడు ”పొఖాళొ” (నీళ్లల్లో అన్నం) తినేవాడు వాళ్ల అలవాటు ప్రకారం. టిఫిన్లకంటే పొద్దుటే ఆ అన్నంతోపాటు ఏదో ఒక వేపుడు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, నిప్పులమీద కాల్చిన బంగాళదుంప, వంకాయ, ఆకుకూర ఏదో ఉండాలి తినడానికి. ఆ కాల్చిన దాంట్లో మినప్పప్పు ఒడియం, ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ కలుపుకుని ”ఆలూభొర్తా” ”బయిగొణొభొర్తా” అని తింటారు.
అలా వాడు ఎనిమిదోక్లాసు వరకూ బాగానే చదువుకున్నాడు. అయితే మంచి మార్కులు తెచ్చుకుని, అన్నీ బావున్న వాడు హఠాత్తుగా తొమ్మిదోక్లాసులో ఫెయిలయి పోవడం మాకు ఆశ్చర్యం కలిగించింది. అందులోనూ పెద్దక్లాసుకి వచ్చాడు, మళ్లీ సంవత్సరం పదవక్లాసుకి సాయంగా ఉంటుందని పొద్దున్నా, సాయంత్రం వాడికి ట్యూషను కూడా పెట్టారు మావారు ఆ స్కూలు టీచర్ల దగ్గరే. స్కూలూ, ట్యూషన్లు, సాయంత్రం ఫుట్‌బాల్‌, క్రికెట్‌ ఆటలు అన్నీ సవ్యంగా జరిగేయనే మేమనుకున్నాం, వాడి ఫైనలు ఫలితాలు వచ్చేవరకూ, పొద్దున్నే ట్యూషనుకి, స్కూలుకి అన్నిటికీ సరయిన సమయంలో వెళ్లిపోయేవాడు. అయితే ఎందుకు ఫెయిలయినట్లు? అప్పుడడిగారు వాడిని ”ఎందుకు ఫెయిలయిపోయావు” అని. అప్పటికీ వాడు మాట్లాడలేదు. రెండురోజులు ఆయన్ని తప్పించుకుని తిరిగాడు. నేనడిగినా చెప్పలేదు. మర్నాడు స్కూలుకి వెళ్లి కనుక్కుంటే తెలిసింది – వాడు ఆ సంవత్సరం స్కూలుకి, ట్యూషన్లకీ వెళ్లనే లేదని! ఇచ్చిన డబ్బులేం చేశాడో తెలియ లేదు. ఆ రోజు ఇంటికి వచ్చాక అడిగితే చెప్పాడు స్నేహితుల్తో బజార్లు తిరిగి అక్కడక్కడా గడిపేవాడని, ఆటలు ఆడే వాడనీ, చదువులో వాడికి ఇష్టం పోయిందనీ! ఎంత ప్రయత్నించినా ఇంక చదవనన్నాడు. మళ్లీ అదే క్లాసు చదవమంటే నాకంటె చిన్నపిల్లల్తో చదవను పొమ్మన్నాడు. మావారికి కోపం వచ్చి ఇంట్లోంచి పొమ్మన్నారు. అప్పటికే వాళ్లమ్మా నాన్నా రాజధానీ నగరానికి వచ్చి నిలదొక్కు కున్నారు. బావమరది, గౌరి మొగుడు శివ, సాయంతో, సురేష్‌ తండ్రి రమేష్‌ ట్రాలీ నడపడం మొదలుపెట్టి అక్కడొక బస్తీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నాడు. సురేష్‌ అక్కడికే వెళ్లిపోయాడు ఖిన్నవదనంతో. మా ఇద్దరికీ చాలా బాధనిపించింది. చిన్నవాడు, సురేష్‌ తమ్ముడు నరేష్‌కి కూడా చదువు కుందికి పుస్తకాలు, బట్టలు, ఫీజులు అన్ని ఇచ్చేవారాయన. నాకు చాలా కష్టమని పించింది – పిల్లలిద్దర్నీ పైకి తీసుకురావాలని ఆయన ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేసేరు. నరేష్‌ అప్పటికి ఆరోక్లాసుకి వచ్చాడు. ఆయనకి పెద్దవాడు సురేషంటే చాలా అభిమానం. వాడిని చదివించడం అవలేదే అని చాలా మథన పడ్డారు. రెండు మూడు రోజుల వరకూ ఆయనకి తిండికూడా తినబుద్ధి కాలేదు. వాడు చాలా తెలివైనవాడు పైకి వస్తాడని ఆయనకి నమ్మకం.
సురేష్‌ అక్షరాలు గుండ్రంగా బావుండేవి. చేసిన పని శుభ్రంగా చేసేవాడు – చదువులో. లెక్కల్లో ఎప్పుడూ నూటికి నూరు తెచ్చుకునేవాడు. ఆ వయసు పిల్లల కంటె ఎక్కువ ప్రశ్నలు వాడి మనసులో. ఆయన్నడిగి అన్నీ తెలుసుకునేవాడు. ఉత్సాహంగా, ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. రానురాను వాడిలో జిజ్ఞాస, అన్నీ తెలుసుకోవాలనే ఉత్సుకత ఉండేవి ముందు. ఇన్నీ బాగుపడి మరి చదువెందుకు బాగుపడలేదు? అదే మాకర్థంకాని విషయం. ఆయన మనసుండబట్టక వాడిని మళ్లీ పిలిపించి నయాన, భయాన చెప్పి ఒప్పించాలని చూసేరు చదువుకోమని, ప్రయివేటుగా మెట్రిక్‌ పాసవమని. వాడు చదవనని భీష్మించుకు కూర్చున్నాడు. ఎంత చెప్పినా వినకుండానే, చదువుతానని ఒప్పుకోలేదు. చదవనంటాడు. ఎంత తెలివితేటలుంటే ఏం లాభం? ఎంత ”మోటివేట్‌” చేస్తే ఏం లాభం? నాకు విసుగెత్తి నేను విసుక్కోవడం మొదలు పెట్టాను. ”వాళ్లకి చదువులు రావని నాకు తెలుసు. ఎందుకంత కష్టపడ్తారు? డబ్బు ఖర్చు ఒకటే కనిపిస్తోంది, మీ శ్రమ కాకుండా, ”ఏదో ఒకటి చూస్తాను. ఇప్పుడు వాడు, అటు తండ్రికీ సాయం చేయడు. ”వైట్‌కాలర్‌” ఉద్యోగానికే చూస్తాడు ఈ మిడిమిడి జ్ఞానంతో. నేను బాధ్యత తీసుకున్నాను చదివించాలని. అంచేత నా మనసొప్పుకోవడం లేదు వాడినలా వదిలేయడానికి.” అన్నారు ఆయన.
చిన్నవాడు ఈలోగా ఏడవక్లాసు పాసయి, ఎనిమిదికి వచ్చాడు. వాడయినా చదువుతాడని ఆశపడ్తే వాడూ ఎనిమిదో క్లాసులోనే మరి చదవనని తండ్రికి ట్రాలీ నడపడంలో సాయం చేయడం మొదలు పెట్టాడు. ఎవరితోనో కలిసి ఎలక్ట్రికల్‌ పని, ఫర్నిచరు పెయింటింగు, సిమెంటు పన్లు ఏదో ఒకటి చేసి ఇంట్లో పదో పరకో తల్లితండ్రికి ఇస్తుంటే అదే పరమావధిలా ఉంది వాళ్లకి. తల్లి వచ్చి అంది ఆయనతో ‘పెద్దవాడికి ఎక్కడయినా ఉద్యోగం చూడమని. అప్పుడే ఏదో ఒక సర్క్యులేషన్‌ స్కీమ్‌లో వాడిని చేర్చి మూడువేలదాకా ఖర్చుపెట్టి, సబ్బులు, నూనెలు, షాంపూలు, వగైరా ఏదో పెద్ద కంపెనీవి ఇంటింటికి వెళ్లి అమ్మడానికి వాడికి సాయం చేశారు. అయితే అందులో నెలనెల వాడి అమ్మకంలో సగం మా యింటికే అమ్మేవాడు. చివరికి అది కుదరక మానేశాడు వాడు. కాని ఇంట్లోనే ఉండేవాడు మాతోనే. ఇంటి పని ఎప్పుడూ చెయ్యలేదు. మేమూ చెప్పలేదు. అప్పుడప్పుడు బాంక్‌ పని చేసేవాడు. అప్పుడెక్కడో ఒక ”ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌” తయారుచేసే కంపెనీలో కొన్నాళ్లు పనిచేశాడు. ఆ పనిలో నిజాయితితో డబ్బు బాంక్‌లో వేయడం, బాంక్‌ నించి తేవడం, పనివాళ్లకి పేమెంట్లు అన్నీ నిజాయితీతో చేసేవాడు. ఒకసారి ఈయన ఫోన్‌ చేస్తే కుర్రవాడు మంచివాడని బాగా పనిచేస్తున్నాడని చెప్పేడు సురేష్‌ పనిచేస్తున్న కంపెనీ యజమాని. అది ఇంట్లో చిన్న చిన్న బాంక్‌ పనులు ఆయన చెప్పి నేర్పించిన ఫలమే అని నాకు తెలుసు.
ఒకరోజు హఠాత్తుగా అన్నారాయన ”వాడికి డ్రైవింగు నేర్పిస్తాను” అని. మాకు వచ్చే పెన్షనులో డ్రైవింగు నేర్పించడం అంటే ఆ నెలలో రెండుమూడువేలు మాకు ఖర్చుల్లో ఎక్కడో తగ్గించుకోవాలి. అందుకని నేనన్నాను ”ఎంతని ఖర్చుపెడ్తారు? ఎక్కడో ఒకచోట పని చేస్తున్నాడు. ట్రాలీ నడపకుండా బ్రతుకుతున్నాడు. వాడికి చదువు రాసి లేదు. అబ్బలేదు. మీ ప్రయత్నం మీరు చేశారు. అలాని జీవితం అంతా వాడిని స్థిరపర్చాలని మీరేం బాధపడడం అక్కరలేదు. మీ బాధ్యత ఎంతవరకో అంత చేశారు,” దాంతో మావారికి కోపం వచ్చింది నామీద. ”నేను మంచిపన్లు చేస్తుంటే అడ్డం రాకు” అన్నారు. మరి నేను ఇంక ఆగలేక అన్నాను. ”ఏం బాగుపడ్డాడు? శుభ్రం పేరుతో టైల్స్‌ బాత్రూమ్‌లో స్నానాలు, ప్రతీ పండక్కీ బట్టలు, మంచి సబ్బులూ, నూనెలూ, టూత్‌పేస్టూ బ్రష్‌, టీవీ చూడడం మనతో సమానంగా కుర్చీల్లో కూర్చోడం అలా తయారయ్యాడు. వాళ్లింట్లో ఇప్పుడువాడు బ్రతకలేడు. మనం మన జీవితంలో ఎంత కష్టపడ్డాం? ఇప్పుడు ఆ టైల్స్‌ బాత్రూమ్‌, ఖరీదయిన బట్టలకి వచ్చాం. ఇంకా ఎంత పాడుచేద్దాం వాడిని? చదువు పేరుతో ఆశ చూపించామా మనం అని అనిపిస్తోంది నా మనసులో. వాళ్ల తల్లిదండ్రుల్తోనే బ్రతగ్గలిగేవాడేమో.” కాని నా మనసులో బాధగానే ఉంది అవి అన్నప్పుడు. హఠాత్తుగా ఉద్యోగం ఉన్నది ఒదులుకుని, ఇంకేదో పనిచేస్తానని చెప్పి, ఇంట్లో కూర్చున్నాడు మళ్లీ. మావారు అప్పుడు అన్నారు, ”ఈసారి ఆఖరి ప్రయత్నం. వాడికి డ్రైవింగు నేర్పిస్తాను” అన్నారు నన్ను ఒప్పించడానికి అన్నట్లుగా. ఎండాకాలం, ఢిల్లీ వెళ్దామని కొంత డబ్బులు ఉంచినవి ఇచ్చి, వాడికి డ్రయివింగు నేర్పించాం. అది నేర్చుకున్నా ఎక్కడా ఉద్యోగం రాలేదు. తెలిసిన వాళ్లందరికీ చెప్పాము. హోటల్లో, ఇళ్లల్లో, ట్రావెల్‌ కంపెనీల్లో ఎక్కడా ఏమీ అవలేదు. ఆయనకి ఆర్మీ ఆఫీసర్లు, రిటైరయి వచ్చినవాళ్ల పరిచయం కూడా ఏమీ కుదర్చలేదు. ఆర్మీలో సైనికుడిగా చేర్పిద్దామని పంపిస్తే, పొడవులేదని, మెట్రిక్‌ పాసవలేదని ఉద్యోగం ఇవ్వలేదు వాడికి. ట్రక్కులో తిరుగుతానని తన స్నేహితుడికి తెలిసినవాళ్ల ట్రక్కులో ఒక వారం తిరిగి, ఎక్కడెక్కడో చలిలో, వానలో పడుక్కుని, ఒంటికి పడక, జలుబు దగ్గు జ్వరంతో ఇంటికి చేరాడు సురేష్‌. ఏం చెయ్యాలో మాకూ అర్థం కాలేదు. మా కంపెనీలో రిటైర్డ్‌ వాళ్లు ఎక్కడ ఉండేవాళ్లు-పిల్లలందరూ పెద్దపెద్ద నగరాల్లో, విదేశాల్లో ఉద్యోగాల్లో ఉండేవారు. మా అమ్మాయిలు కూడా అందుకని ఎవరికయినా డ్రయివరు కావాలంటే సురేష్‌ని పంపడం మొదలుపెట్టారాయన. గంటయితే ఏభై రూపాయలు, అరరోజు దాటితే వంద రూపాయలిచ్చేవాళ్లు వాళ్ల పని తిరగడం బట్టి. అలా రోజుకి కొంతయినా సంపాదించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే వాడంతట వాడే వెతుక్కుని, ఎక్కడో ఒకచోట ఊళ్లో ఒక ప్లైవుడ్‌ కంపెనిలో కారు డ్రయి వరుగా ఉద్యోగం సంపాదించేడు. నెలకి మూడువేలిస్తారని చెప్పారు ఆ కంపెనీ మేనేజరు. నెలవగానే రెండువందలు తక్కువ వచ్చాయని వాడు ఉద్యోగం వదిలేస్తానంటే ఇద్దరం కలసి నచ్చచెప్పాం – నెల పూర్తిగా చెయ్యలేదు వాడు, మధ్యలో చేరేడు – తర్వాత వస్తుందని! పాత మేనేజరు బదిలీ అయిపోతూ వెళ్లే ముందర మమ్మల్ని కలుస్తానన్నారని సురేష్‌ చెప్పగానే నా గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలుపెట్టాయి. వాడిని తీసేస్తాడో ఏమో అని! కాని అతను చెప్పినవి విన్నాక మా మనసు కుదుట పడింది. ”కుర్రవాడు చాలా మంచివాడు. సంస్కారం, సత్ప్రవర్తన, దైవభీతి, క్రమశిక్షణ, సమయపాలన వున్నాయి.అందుకే మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను” అన్నాడాయన మావారితో. కొత్త మేనేజరు కూడా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మా ఇంటికి వచ్చాడు. ఆయన కూడా అన్నాడు. ”మీ కుర్రవాడి గురించి నా ముందు మేనేజరుగారు చాలా చెప్పారు, అందుకనే రెండుమూడునెలల్లో వాడిని పర్మినెంటు ఉద్యోగంలోకి మారుస్తాను. నిజంగా చాలా మంచివాడు. వాడి జీతం కూడా ఎక్కువవుతుంది.”
అప్పుడు మా ఆనందానికి అంతం లేదు. మా కళ్లు చెమర్చాయి. ఆ కొంచెం చదువుకే వాడు మంచిమనిషిగా అయ్యాడు, మంచి ఉద్యోగం రాకపోయినా, అదే చాలు, చదువువల్ల రానిదేముంది? ”విద్యా…దదాతి వినయం” అని ఊరికే అన్నారా మన పెద్దవాళ్లు! అమ్మాయిల్ని ”దీదీ” అని, మమ్మల్ని ”మా”, ”నాన్నా” అని పిలిచినప్పుడే వాడి సంస్కారం బయట పడింది. ఇంక అంతకంటే ఏం కావాలి కనుక! అయినా ఒకోసారని పిస్తుంది, మేం నిజంగానే మంచిపని చేశామా అని! అందరం అలా తలా ఒకరిని ఏదో విధంగా స్థిరపడడంలో సాయపడ్తే మంచిదే కదా అని ఒక భావన. అందరూ ఆఫీసర్లే అవాలని లేదు. పెద్ద పెద్ద ఎమ్‌.బి.ఏ.లు పెద్ద పెద్ద ఇన్‌స్ట్యూట్స్‌లో చేసినవారికీ ఉద్యోగం రావడం కష్టంగా ఉంది. బి.ఏ., ఎమ్‌.ఏ.లు చదివినా పరిస్థితి అలానే ఉంది. గవర్నమెంటు ఉద్యోగాల్ని చిన్నచూపు చూసిన ఆ పెద్ద పెద్ద చదువులవాళ్లూ ఇప్పుడు ఆ ఉద్యోగాలకి ప్రయత్నిస్తున్నారు. వృత్తి విద్యలకి కొంతయినా అవకాశం ఉంటుం దేమో అనిపిస్తోంది.
ఇప్పుడు సురేష్‌ తమ్ముడు నరేష్‌ కూడా డ్రైవింగు నేర్చుకున్నాడు. వాళ్లూ వీళ్లూ పిలిస్తే రోజుకి పనిచేసి, ఆ రోజు డబ్బులు తెస్తాడింటికి. అందులో ఇప్పుడు కొంచెం ఎక్కువే దొరుకుతుంది కారు నడపడానికి. వాడికీ ఎక్కడయినా కంపెనీలోనో, ఆఫీసు లోనో దొరుకుతుందని మా ఆశ!

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

One Response to చదువు

  1. Ramnarsimha says:

    రచయిత్రి గారికి,
    మీ మానవత్వానికి ధన్యవాదాలు..
    అందరూ తప్పక చదవాల్సిన వ్యాసమిది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో