ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 19

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి
ఆయన మనసులో స్త్రీల పట్ల గౌరవభావం ఉంది. స్త్రీలు పురుషులకన్నా గొప్పవాళ్లని ఆయన నమ్మకం. నేను ఎప్పుడైనా మా పల్లెలో ఆరుబైట కూర్చోవాలనిపించి, బైటికొచ్చి నిలబడేదాన్ని, ఆయన వెంటనే లేచి వెళ్లి గబగబా నాకోసం మరీ కుర్చీ తెచ్చి వేసేవారు. ఎండాకాలం సాయంకాలాలు ఆయన డాబా మీద కూర్చునేవారు. నేను కూడా పైకి వెళ్తే వెంటనే కిందికెళ్లి నా కోసం మరో కుర్చీ తెచ్చి పెట్టేవారు. భోజనానికి కూర్చునేప్పుడు మంచినీళ్లు తనే తెచ్చుకునేవారు. నా కంచం పక్కన కూడా నీళ్ల గ్లాసు ఉంచేవారు. నౌకరు లేనప్పుడు తన మంచం వాల్చుకునేప్పుడు నాకు కూడా పక్కవేసి పెట్టేవారు. ఒక్క దాన్ని కూర్చుని వంటచేస్తూండటం కనపడితే చాలు, పక్కనే పీట వేసుకుని వంటయే దాకా వంటింట్లోనే కూర్చునేవారు. వంట చెయ్యటం అయిపోగానే నన్ను తన గదిలోకి తీసుకెళ్లేవారు. చదువుకునేందుకు నాకేమైనా ఇచ్చాకనే తను రాసుకోటానికి కూర్చునేవారు. ఆయనకి ఒంటరిగా భోజనం చెయ్యటం నచ్చేది కాదు. నేను పక్కనే కూర్చుంటే గాని భోంచేసేవారు కాదు. అన్నం తింటూ బోలెడన్ని కబుర్లు చెప్పేవారు. ‘లీడర్‌’ వార్తాపత్రిక రోజూ నాకు చదివి వినిపించేవారు. నేను చుట్టుపక్కల ఎక్కడా కనిపించకపోతే, కేకేసి రమ్మనేవారు. పేపర్‌ చదివి, దాన్ని హిందీలోకి అనువదించి నాకు చెప్పేవారు. నాకు ఇంగ్లీషు భాష రాదని నేను నొచ్చుకోకూడదని ఆయన ఉద్దేశం. అందుకే ఉర్దూ, ఇంగ్లీషు చదవలేక పోతున్నా నన్న బాధ నాకెప్పుడూ కలిగేది కాదు. నేనెక్కడికన్నా వెళ్లాలంటే, అంత దూరం నా వెంట వచ్చి దింపి వెనక్కి వెళ్లేవారు.
నేను జైలుకెళ్లకముందు పరిస్థితి : లక్నో
మొదట్లో నేను కాంగ్రెస్‌లో పనిచేసే ప్పుడు, మౌనంగా నా పని నేను చేసుకు పోయేదాన్ని. నేనేం చేస్తున్నానో ఇంట్లో ఎప్పుడూ చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే, ఆయనకి తెలిస్తే నన్ను గడపదాటనివ్వరనీ, నా బదులు తనే జైలుకెళ్లటానికి ప్రయత్నిస్తారనీ భయం వేసేది. ఆయనెప్పట్నించో జైలు కెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మేమిద్దరం మాట్లాడుకునేప్పుడు ఎప్పుడూ, ‘ఈసారి తప్పకుండా నేను జైలుకెళ్లాలి,’ అని అంటూ ఉండేవారు. ‘మీకు ఇప్పుడు తిండికి కూడా లోటేమీ లేదు, ఇంకేమీ లేకపోయినా నా పుస్తకాల రాయల్టీ ఉంటుంది. నేను ప్రెస్‌ మేనేజర్‌కి రాస్తే ఆయన మీకు కనీసం వందరూపాయలైనా నెలకి ఇస్తాడు, అనేవారు.
వినీ వినీ ఒకసారి, ”ఇప్పటివరకూ మీ రాయల్టీ కింద వంద దమ్మిడీలు కూడా ఎవరూ ఇవ్వలేదు. వందరూపాయలు చాలా పెద్ద మొత్తం!” అన్నాను.
”పని గడిచిపోతూ ఉన్నంతకాలం రూపాయల గురించి ఆలోచన ఎవరికీ రాదు గదా?” అన్నారు.
నేను రోజుకి రెండు పేటల్లో జరిగే మీటింగులకి అటెండయేదాన్ని. ఒక్కోసారి ఉపన్యాసం కూడా ఇచ్చేదాన్ని. కానీ పేపర్లలో నా పేరెక్కడా రాయకూడదని చెప్పేశాను. ప్రభుత్వం నన్ను ఖైదులో పెడుతుందన్న భయం వల్ల నేనా పని చెయ్యలేదు. దానికి కారణం, ఒకరిద్దరు స్త్రీలకి నేనేదో లీడరులా ప్రవర్తిస్తున్నానని అపోహ కలిగింది. నేను చేసే పని వల్ల నాకు పేరొచ్చేస్తోందని వాళ్ల అనుమానం. నాకు మాత్రం పేరొచ్చి, రోజంతా నాతో పాటు కష్టపడి పని చేసే మిగతా వాళ్ల పేర్లు ఎక్కడా కనిపించకపోవడం అనేదాన్ని నా మనసు ఒప్పుకోలేదు. అది అప్పుడూ నాకు తప్పుగానే తోచేది, ఇప్పుడూ తప్పుగానే అనిపిస్తోంది. అంతేకాక దాని వల్ల పని వేగం తగ్గే ప్రమాదం కూడా ఉంది.
ఇంకో విషయం, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు నేను సాయం చేస్తున్నాననే సంగతి ఆయన దగ్గర దాచాలని ప్రయత్నించేదాన్ని. కానీ కాంగ్రెస్‌ ఆఫీసులో ఆయనకి అన్ని విషయాలూ తెలిసిపోయేవి. రాత్రిళ్లు ఇంట్లోకి చాలా భయం భయంగా అడుగు పెట్టేదాన్ని. వస్తూనే ఇంటి పనులు చెయ్యటం మొదలు పెట్టేదాన్ని. ఒకటి రెండు గంటలు ఆయనతో కబుర్లు కూడా చెప్పేదాన్ని. ఆ రోజుల్లోనే రాత్రిళ్లు నాకు కొద్దిగా జ్వరం తగలటం మొదలైంది. కానీ నేనా సంగతి దాచిపెట్టేదాన్ని. దీనికంతటికీ కారణం, ఆయన్ని జైలుకి వెళ్లనివ్వకుండా చేసి, నేనే జైలుకెళ్లాలన్న కోరిక. చివరికి జరిగింది కూడా అదే. నా ఎత్తులు గ్రహించినప్పుడల్లా ఆయన నా మీద విసుక్కునేవారు, అప్పుడప్పుడూ నాతో పోట్లాట కూడా పెట్టుకునేవారు. కానీ నేను చేసిన పనులన్నీ దేశసేవ కోసమే తప్ప నా స్వార్థం కోసం కాదు.
ఆయన ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఆయనకి పూల మాలలూ అవీ వేస్తే, ఇంటికి రాగానే వాటిని నా మెడలో వేసి, ”ఇంద, ఈ పూలమాల నీకే!” అనేవారు.
”ఇది ప్రజలు ఇచ్చిన పూలమాల, అందుకే చాలా విలువైనది. ప్రజలు దీన్ని మీకిచ్చారు. దాన్ని మీరు మరొకరికివ్వచ్చా? అదేం పని? అంటే మీకీ పూలమాల విలువ తెలిసినట్టు లేదు!” అన్నాను.
”లేదు, వాళ్లు నాకిచ్చారు. నాకు బహుమానంగా ఇచ్చిన ఈ వస్తువు ఇక నా సొంతమే కదా! నేను పూజించే వాళ్లకి దీన్ని సమర్పించుకున్నాను. దాంతో దీని విలువ మరింత పెరిగింది. నువ్వు నా కన్నా తక్కువని నేననుకోవటం లేదు.”
”అంటే అర్థం, ప్రజలు మీమీద మోపిన కర్తవ్య భారాన్ని మీరు నా నెత్తినేశారు. దీన్ని నా బలహీనమైన భుజాలు మొయ్యలేకపోతేనో?”
”నీ సాయం లేకుండా ఏ భారాన్నీ నేనొక్కడినీ మొయ్యగలనని నేననుకోను. పైగా నువ్వు, నేనూ వేరువేరని నేననుకుంటేగా? అంతదాకా ఎందుకు? స్త్రీ సాయం లేకుండా ఏ పురుషుడూ ఏమీ చెయ్యలేడనే నా ఉద్దేశం. స్త్రీల చెయ్యి పడనిదే ఏ పనీ పూర్తి కాదు. ఇంటింటా స్త్రీ పురుషులిద్దరూ పాటు పడితేకాని దేశం పురోగతి సాధించలేదు.”
”ఎవరైనా ఉబ్బెయ్యటం ఎలాగో మీ దగ్గరే నేర్చుకోవాలి. ఆడవాళ్లకి ఇలాటి మాటల వల్ల ఇంకా పొగరెక్కువవుతుంది, జాగ్రత్త!”
”ఇంకెవరికైనా అలా జరగచ్చు కానీ నీ విషయంలో అలా జరగదని నేను కచ్చితంగా చెప్పగలను.”
”నేనేమీ దేవతని కాను. నాకు కూడా పొగరెక్కచ్చు.”
”నాకు తెలుసులే. నీకు పొగరెక్కినా దాని వల్ల మంచే జరుగుతుంది. అసలు అలాంటి పొగరు ఉంటేనే మంచిది. దేశంలో అందరిలోనూ అలాటి గర్వం, పొగరూ ఉంటే మనమందరం బాగు పడతాం.”
ఉప్పు చట్టం
1930 లో లక్నోలో జరిగిన సంగతి ఇది. గాంధీ మహాత్ముడు ఉప్పు చట్టాన్ని ఖండించేందుకు దండీకి వెళ్లాడు. అన్ని ఊళ్లలోనూ మహాత్మా గాంధీకి జై! అనే నినాదాలు వినవచ్చాయి. లక్నోలో ఆ రోజుల్లో మా ఆయన ‘మాధురి’ సంపాదకుడిగా పని చేసేవారు. ఏప్రిల్‌ నెల. మా ఇంటి ఎదురుగా అమీనుద్దౌలా పార్కుండేది. అక్కడే వాలంటీర్లు రోజూ వచ్చి ఉప్పు తయారు చేసేవాళ్లు. లక్నో మొత్తం ఆ సమయంలో అక్కడ వచ్చి చేరినట్టుగా జనం వెల్లువలా వచ్చేవాళ్లు. వాళ్ల వెనకాలే ఆయుధాలు పట్టుకుని పోలీసులు కూడా వచ్చేవాళ్లు. మా ఆయన ఎంతో మంది యువకులకి తన చేత్తో కుర్తాలు తొడిగి, టోపీలు పెట్టి ఉప్పు చేసేందుకు పంపేవారు. నేను వాళ్ల మెడల్లో పూలమాలలు వేసేదాన్ని. ఆ కుర్రాళ్లు నా పాదాలకి నమస్కరిస్తూంటే నాకు తెలీకుండానే నా కళ్లు చెమ్మగిల్లేవి. నేను కూడా వాళ్లని కావలించుకుని ఆవేశంగా ‘బాబూ విజయం మిమ్మల్ని వరించుగాక!” అని ఆశీస్సులు అందజేసేదాన్ని.
ఇదే విధంగా మూడు నెలల పాటు ఆ పని కొనసాగింది. ఆ తరవాత నేనూ, ఆయనా ఎప్పుడూ ఆ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ”రాణీ, నేను జైలుకెళ్లే సమయం దగ్గర పడుతోంది,” అని ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఆయన ఆరోగ్యం బావుండకపోవటం వల్ల, ఆయన జైలుకెళ్లటం నాకిష్టం లేకపోయింది. ఈయన జైలుకెళ్తే ఆరోగ్యం ఏం కాను? అని ఆలోచిస్తేనే నేను నిలువెల్లా వణికిపోయేదాన్ని. కానీ ఆయనతో నేరుగా అలాగని చెప్పటం కూడా సాధ్యమయేది కాదు. ఎందుకంటే అది పిరికితనం అనిపించుకుంటుంది. అందరికీ భర్త, కొడుకు, అన్నదమ్ములూ ప్రియమైన వాళ్లే కదా! మరి అందరూ అలా పిరికిపందల్లా దాక్కోవాలనుకుంటే ఎలా కుదురుతుంది? నా విషయం తీసుకుంటే నా పిల్లలకి జైలుకెళ్లే వయసు లేదు, ఆయన్ని జైలుకి పంపిచటం నాకిష్టం లేదు. మరైతే జైలుకి ఎవరు వెళ్లాలి అనే ప్రశ్న ఎదురైనప్పుడు, నేనే ముందడుగు వెయ్యాలి.
జూలై 20 వ తేదీన స్వరూప్‌రాణీ నెహ్రూ లక్నోకి వచ్చింది. ఆవిడ ఉపన్యాసం వినేందుకు నేను వెళ్లాను. భారత దేశంలోని ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు నా ఉద్దేశంలో జైలుకెళ్లారు. జవహర్‌లాల్‌ గారు కూడా జైల్లో ఉన్నారు. ఆయన తల్లి స్వరూప్‌రాణీ ఉపన్యాసంలో ఆవేశం, బాధ, కోపం ఉన్నాయనిపించింది. అవి శవాల్లో కూడా జీవం నింపేట్టు ఉన్నాయి. జీవం లేనట్టున్న నా మనసులో కూడా ఆవిడ ఉపన్యాసం ఆవేశాన్ని రేపింది. నేను నా కర్తవ్యం ఏమిటో తెలుసుకున్నాను. ఆవిడ స్త్రీలందరికీ వాళ్ల కర్తవ్యం ఏమిటో చెప్పింది.
మా వంతు బాధ్యతని నెరవేరుస్తామని మాట ఇచ్చేందుకు ఆవిడ మా అందర్నీ సంతకాలు పెట్టమంది. నేను కూడా పెట్టాను. ఆరోజునుంచే నేను పని మొదలుపెట్టాను. మొదట్లో మహిళలకి ఆశ్రమం ఉండేది కాదు. పదకొండు మంది స్త్రీలు కలిసి ఆశ్రమాన్ని ప్రారంభించారు. పన్నెండు గంటలకల్లా అందరూ ఆశ్రమానికి చేరుకునేవాళ్లం. వాళ్లల్లో నేనూ, మా అమ్మాయీ కూడా ఉన్నాం. మొదట్లో ఆట్టే పనేమీ ఉండేది కాదు. అప్పుడే ప్రారంభించటం వల్ల అందరం కంగారు పడేవాళ్లం. నాకూ కంగారుగానే ఉండేది. ఒంటరిగా ఇంటికి వెళ్లేప్పుడు దారిలో భయం వేసేది. కానీ దారిలో ఏ బజార్లోనో ఆయన కనబడితే నా వెంట ఇంటికి వచ్చేవారు. ”నీకెందుకంత భయం వేస్తుంది?” అనేవారు. నాకు సిగ్గనిపించేది, ”ఏం చెయ్యను, ఒంటరిగా వీధిలో నడవాలంటే నాకు భయంగా ఉంటుంది,” అనేదాన్ని. ”ఇందులో భయపడటానికేముంది?” అనేవారాయన. ”దారిలో ఏ రౌడీ వెధవైనా ఎదురు పడితే ఏం చెయ్యాలి?” అనేదాన్ని. ”అలా ఎదురు పడ్డాడే అనుకో, వాడు నిన్నేం చేస్తాడు? నువ్వు మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపో!” అనేవారు, కానీ నన్ను ఇంటి గుమ్మం దాకా దిగబెట్టి మరీ వెళ్లేవారు. ఇలాగే రెండేళ్ల పైగా గడిచిపోయాయి.
జైల్లో
1931, నవంబర్‌ నెల ఒకటో తారీకు. మా ఆయన మూడు రోజుల క్రితం బెనారెస్‌కి వెళ్లారు. పొద్దున్న ఎనిమిది గంటలకి ఆశ్రమం నించి ఒక స్త్రీ వచ్చి, ”పదండి మిమ్మల్ని కాంగ్రెస్‌ ఆఫీసుకి రమ్మని పిలుస్తున్నారు,” అంది. పనేమిటో తనకి తెలీదంది. అక్కడికెళ్లాక, విదేశీ బట్టలమ్మే దుకాణాల్లో మా వాలంటీర్లు అరెస్టయారనీ, బట్టల వర్తకులు విదేశీ వస్త్రాలు మూటలమీద ముద్రలు వెయ్యటంలేదనీ తెలిసింది. ”మీరిప్పుడు అందరూ అక్కడికెళితే వాళ్లకి మరింత ఉత్సాహం వస్తుంది,” అన్నారు కాంగ్రెస్‌ ఆఫీసులో వాళ్లు.
నేను మరో పదకొండుమంది స్త్రీలతో కలిసి కారులో వెళ్లి, దాన్ని వెనక్కి పంపిస్తాననీ, మరింత మందిని రెండో ట్రిప్పులో అక్కడికి రమ్మనీ చెప్పాను. అక్కడికి చేరుకున్నాక మేం పికెటింగు ప్రారంభించాం. పదిహేను ఇరవై నిమిషాలయాక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అక్కడికొచ్చాడు. ”మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం,” అన్నాడు నాతో. ”ముందు వారంటు చూపించండి,” అన్నాను.
”వారంటు అవసరం లేదు, అలాగని కొత్త చట్టం వచ్చింది,” అన్నాడతను.
నా వెంట ఉన్న స్త్రీలతో, ”మహాత్మా గాంధీకి జై” అని నినాదాలు పలకండి. మనం అరెస్టయాం” అని, ఇన్‌స్పెక్టర్‌తో, ”పదండి,” అన్నాను.
మేమందరం ”మహాత్మా గాంధీకి జై”, ”భారత మాతకి జై”, అని అరుస్తూ లారీలోకి ఎక్కాం. స్త్రీలందరూ జాతీయగీతం పాడటం ప్రారంభించారు. కొంత దూరం వెళ్లాక ఇన్‌స్పెక్టర్‌ లారీ ఆపించి దిగిపోయాడు. అయినా మా పాట కొనసాగుతూనే ఉంది. నన్ను అరెస్టు చేసే ముందు యాభై అరవై మంది స్త్రీలని అరెస్టు చేసి పోలీసులు ఊరిబైట ఎక్కడో వదిలేసి వచ్చారన్న సంగతి నాకు గుర్తుకొచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ లారీ దిగాక మాతోపాటు లారీలో ఉన్న పోలీసులవైపు చూశాను. వాళ్ల కళ్లు నీళ్లతో నిండి ఉన్నాయి. నా ఉద్దేశం వాళ్లు మనసులో బాధ పడుతున్నారని. ”అమ్మా! మాకిక్కడ తలా ఇరవై రెండు రూపాయలూ దొరుకుతాయి. అదె బైటెక్కడైనా పనిచేస్తే పది రూపాయలైనా ఎవరైనా ఇచ్చేట్టుంటే, మేమీ పాపపు పని చెయ్యం!” అన్నారు వాళ్లు నాతో.
”బాబూ! ఏం పరవాలేదు. మీరు ఈ ఉద్యోగం చేసినన్నాళ్లూ మీ కర్తవ్యాన్ని నిజాయితీతో నెరవేర్చండి. ఎందుకంటే మా పట్ల సానుభూతి చూపించటం కూడా ఒక రకంగా ద్రోహమే అవుతుంది. మేం మా నాయకుడి మాట శిరసావహించి జైలుకెళ్లినట్టే, మీరు కూడా మీ ఉద్యోగ ధర్మం నిర్వర్తించాలి. కానీ మీరొక సాయం చెయ్యండి, మమ్మల్నెక్కడో ఊరిబైట దిక్కూమొక్కూ లేనిచోట వదలద్దు, జైలుకే తీసుకెళ్లండి,” అన్నాను.
ఒక పోలీసు కన్నీళ్లు పెట్టుకుంటూ, ”అమ్మా! మీకు ఇంత విశాల హృదయం లేకపోతే అసలు జైలుకి వెళ్లే వాళ్లే కాదు. మేం మిమ్మల్ని జైలుకే తీసుకెళ్లి వదుల్తాం. కానీ మేం పూజించవలసిన తల్లుల్నీ, అక్కచెల్లెళ్లనీ, ఈ దిక్కుమాలిన పొట్ట నింపుకోడం కోసం, జైలుకి తీసుకెళ్తున్నామే, అని మాకు చాలా బాధగా ఉంది,” అన్నాడు.
”బాబూ మీరు దేవుణ్ణి ప్రార్థించండి, మనందరికీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించే శక్తిని ప్రసాదించమని అడగండి. నువ్వు ఇప్పుడు కూడా నా కొడుకు లాంటివాడివే, నేను నీకు తల్లిలాంటి దాన్నే! కానీ మన దారులు మాత్రం వేరు వేరు, అంతే!” అన్నాను.
ఇలా మాట్లాడుకుంటూండగానే మేం జైలుగేటు దగ్గరకి చేరుకున్నాం. ఇన్‌స్పెక్టర్‌ మా కన్నా ముందే అక్కడికి చేరుకున్నాడు. పోలీసులు కూడా కళ్లు తుడుచుకుంటూ లారీ దిగారు. మేం ఏడుగురం స్త్రీలం కూడా కిందికి దిగాం. జైలు ఆఫీసుగదిలోకి వెళ్లాం. అక్కడ వాళ్లు మా అందరి పేర్లూ, ఊరి పేర్లూ అడిగి జైలర్‌ వాటిని రాసుకున్నాడు. నగలు వేసుకున్న స్త్రీల దగ్గర వాటిని తీసుకుని దాచారు. అక్కడ ఉన్న ఒక కాపలా మనిషితో మమ్మల్ని లోపలికి తీసుకెళ్లమని చెప్పారు. ”మేం జైల్లోకి వచ్చేశామని కాంగ్రెసు ఆఫీసుకి ఫోన్‌ చేసి చెప్పెయ్యండి,” అన్నాను జైలర్‌తో.
”అలాగే, నేను ఫోన్‌ చేస్తాను,” అన్నాడాయన.
”ధన్యవాదాలు.”
నేను జైల్లోకి వెళ్లేప్పటికి మధ్యాన్నం రెండయింది. మాకన్నా ముందే జైలుకి వచ్చిన స్త్రీలకి మేం వస్తున్నామన్న వార్త తెలిసి, పువ్వులూ, పూల దండలూ పట్టుకుని మాకు స్వాగతం పలికేందుకు నిలబడి ఉన్నారు. మేం వెళ్లగానే మా మెడలో దండలు వేసి, మా మీద పూలు జల్లి, ఎన్నో ఏళ్ల తరవాత మమ్మల్ని చూస్తున్నట్టు సంతోషపడిపోయారు. వాళ్లు మా చుట్టూ గుమిగూడి, దేశంలోని విశేషాలు ఏమిటని అడగసాగారు. వాళ్లతో మాట్లాడుతూ ఉండగానే ఐదయింది. ఆ తరవాత ఒక నాలుగైదు వందల మంది మగాళ్లూ, మా అమ్మాయీ, పిల్లలూ కూడా అక్కడికి వచ్చారు. నన్ను ఆఫీసుకి రమ్మని పిలిచారు. స్త్రీలందరం గేటు దగ్గరకొచ్చాం. మా అమ్మాయీ, అబ్బాయిలూ, నాకు అవసరమైన బట్టలూ అవీ ఇంటినించి తెచ్చారు. మా చిన్నబ్బాయికి అప్పుడు తొమ్మిదేళ్లు నిండి కొన్ని నెలలు గడిచాయి. రోజూ స్కూలుకెళ్లేప్పుడు, ”అమ్మా, నువ్వు కాంగ్రెస్‌ పనికోసం బైటికెళ్లొద్దు, నిన్ను అరెస్టు చేస్తారు,” అని చెప్పి వెళ్లేవాడు. ”నువ్వింట్లో లేకపోతే నాకు అసలు బావుండదు,” అని పేచీ పెట్టేవాడు. నేను రోజూ వాడికి లెక్చరిచ్చేదాన్ని. ”నన్ను అరెస్టు చేస్తే మరి నువ్వేం చేస్తావురా? నన్ను క్షమాపణ కోరమని అడుగుతావా?” అని అడిగేదాన్ని. వాడు తన చిట్టి చేతుల్ని నా మెడ చుట్టూ వేసి, ”లేదమ్మా, క్షమాపణ కోరమని అడగను,” అనే వాడు. ఇవాళ వాణ్ణి జైలు దగ్గర చూడగానే నేను భోరుమని ఏడ్చేశాను. కానీ పిల్లల ఎదురుగ్గా ఏడవడం ఇష్టం లేక, నా కన్నీళ్లు వాళ్లకి కనిపించకుండా కళ్లు దించుకుని ఉండి పోయాను. ఆ తరవాత ఒక వాలంటీరు స్త్రీని పిల్లల దగ్గరకి పంపాను. ”మా ఆయన వచ్చేదాకా మీరు వాళ్ల తోనే ఉండండి,” అని ఆమెని అడిగాను. నా పిల్లల్ని ఇంకొకరికి అప్పజెపుతున్నప్పుడు నా మనసు పడిన బాధని, అణుచుకోలేక పోయేదాన్ని. ఈ రోజు కూడా ఆ బాధని నేను మళ్లీ గుర్తుతెచ్చుకుంటూ ఉంటాను.
మా ఆయన చనిపోయి, నేను బతికి ఉండటం అనే బాధని మరిచిపోవటం సాధ్యం కాదు. మమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నందుకు ఆయన ఎంత బాధ పడ్డారో! కానీ కాలం అందర్నీ కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తుంది. మనిషి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసిందే తప్ప ఏమీ చెయ్యలేడు. తాత్కాలికంగా బాధని మర్చిపోయినా, ఎప్పుడో ఒకప్పుడు అది మళ్లీ మనిషిని పట్టి పీడించక మానదు. ఇది నాకు మాత్రమే సంబంధించినది కాదు, మనుషులందరికీ ఉండే బలహీనత. ఇప్పటికీ ఆ పాత విషయాలని గుర్తు తెచ్చుకుంటే నాకు కన్నీళ్లు వస్తాయి.
మర్నాడు మా ఆయన ఇంటికి వాపసు వచ్చారు. నేను అరెస్టు అయిన విషయం ఆయనకి ముందే తెలిసింది, నన్ను కలుసుకునేందుకు జైలుకొచ్చారు. నన్ను మళ్లీ ఆఫీసుకి రమ్మని పిలిచారు. ఆయన గేటు దగ్గర నిలబడ్డారు. నన్ను చూడగానే ఆయన కళ్లు చెమర్చాయి. ”అయితే నువ్వు జైలుకి రానే వచ్చావన్నమాట!” అన్నారు.
”అవును వచ్చేశాను. మీరెలా ఉన్నారు?” అన్నాను.
”నేను బాగానే ఉన్నానులే, నీ సంగతి చెప్పు, నువ్వెలా ఉన్నావు?” నేను మొహం మీదికి సంతోషాన్ని బలవంతంగా తెచ్చు కుంటూ, ”నేను బావున్నాను. ఇక్కడ జైలరు మంచాయన. నాకెటువంటి ఇబ్బందీ లేదు,” అన్నాను. ఆ తరవాత నేనాయనకి ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమనీ, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమనీ చెప్పాను.
అన్ని కబుర్లూ అయాక ఆయన ఎప్పటిలాగే నవ్వుతూ, ”ఇక్కడ నువ్వు అరెస్టయావు సరే, అక్కడ నన్ను కూడా ఖైదీని చేసేశావు,” అన్నారు.
బెనారెస్‌లో ప్రెస్‌ ప్రస్తావన వచ్చినప్పుడు ఒకసారెప్పుడో ఆయన అన్నమాట నాకప్పుడు గుర్తొచ్చింది, మనిద్దరం ఒకే నావలో ప్రయాణిస్తున్నాం. మనిద్దరి గమ్యమూ ఒక్కటే, ధ్యేయం కూడా ఒక్కటే,” అన్నారు. దాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయనకి గుర్తు చేశాను.
”ఓ, అయితే ఆ మాటనే నువ్వు ఇప్పుడు నిరూపిస్తున్నావా?” అన్నారాయన.
”లేదు, నిరూపించేందుకు ప్రయత్ని స్తున్నాను. కానీ మీ తోడు లేకుండా ఒక్కదాన్నీ ఏం చెయ్యగలుగుతాను? ఇంట్లో బోలెడంత పని పెట్టుకుని, ఇక్కడ ఏ పనీ లేకుండా విశ్రాంతి తీసుకుంటున్నాను!”
ఆయన నన్ను చూసేందుకు జైలుకి అరడజను సార్లు వచ్చారు, అయినా నేనక్కడుండటం ఆయనకి బాధగానే ఉందని గమనించాను. ఎప్పుడొచ్చినా నన్ను చూడగానే కంట తడి పెట్టుకునేవారు. నన్ను జైల్లోంచి విడుదల చేస్తామని చెప్పిన రోజున కాకుండా ఒకరోజు ముందే వదిలేశారు. నేను ఒక్కదాన్నే ఇంటికి బైలుదేరి వెళ్లాను. ఆ సమయంలో ఆయన ఆఫీసులో ఉన్నారు. సాయంత్రం ఇంటికి రాగానే నన్ను చూసి చిరునవ్వు నవ్వారు. నేను లేచి ఆయన పాదాలు తాకాను, కానీ సజల నయనాలతో ఆయన నన్ను లేవనెత్తి కావలించుకున్నారు. ”నీకు ఒంట్లో బాగా లేదా?” అని అడిగారు గద్గద స్వరంతో. నా గొంతుకూడా దుఃఖంతో పూడుకుపోయింది, ”నేను చక్కగా ఉన్నాను. మీకు జబ్బు చేసిందా?” అని అడిగాను. ”నాకేం రోగం? నేనింట్లో హాయిగా ఉంటేనూ, నాకు జబ్బు ఎందుకు చేస్తుంది?” అన్నారు.
అప్పుడు మా వదిన అక్కడే ఉంది. ”ఈయన హాయిగా ఉన్నానని అంటున్నాడు గాని, మీరు జైలుకెళ్లిన రోజునించీ ఎవరూ ఆయన మొహంలో నవ్వనేది చూడలేదు,” అంది.
”మీరు మరీనూ!” అన్నారాయన.
”నేను అబద్ధం చెప్పటం లేదు,” అని వదిన అనగానే పిల్లలు కూడా ఆవిడనే సమర్థించారు.
మా వదిన లేచి వెళ్లి పళ్లూ అవీ తీసుకొచ్చింది. అందరం వాటిని తింటూ నేనింట్లో లేనప్పుడు జరిగిన సంగతులన్నీ చెప్పుకుంటూ కూర్చున్నాం. ఇంట్లోకి కొత్త జీవం ఏదో వచ్చినట్టు అనిపించసాగింది. కానీ మేమిద్దరం ఒకరి ఆరోగ్యం గురించి మరొకరం ఆందోళన పడసాగాం. నా బరువు ఏడు పౌన్లు, ఆయనది పధ్నాలుగు పౌన్లు తగ్గిపోయింది. రాత్రి అందరూ ఎవరి దారిన వాళ్లు పడుకునేందుకు వెళ్లిపోయాక, ”ఏమిటి మీరిలా ఐపోయారు?” అని అడిగాను.
”ఏమీ లేదు, బాగానే ఉన్నాగా?” అన్నారు.
”బాగా ఏం లేరు. నేను వెళ్లినప్పుడు ఉన్నట్టు కూడా లేరు.”
”అలా ఎలా ఉంటాను? నువ్వక్కడ జైల్లో ఉంటే నేనే ఉన్నట్టనిపించింది.”
”ఇది నా పట్ల అన్యాయం కాదా?”
”న్యాయమో అన్యాయమో నాకు తెలీదు. కానీ మనిషి తన స్వభావాన్ని ఎలా మార్చుకోగలడు? నేను నిన్ను పూర్తిగా నమ్మాను, కానీ నాకు తెలీకుండా నువ్వు ఏవేవో పనులు చేశావు. అది పాపం కాదా? నీ ఆరోగ్యం మాత్రం ఏం గొప్పగా ఉంది? ఎప్పుడూ ముక్కుతూ మూలుగుతూ ఉండేదానివి! నువ్వు జైలు నించి ఈ మాత్రం ఆరోగ్యంగా వెనక్కి రావటంమే గొప్ప. ఇరవై నాలుగ్గంటలూ నీ గురించే ఆలోచించే వాణ్ణి. జైలు నించి నీ శవమే ఇంటికి వస్తుందని హడిలిపోతూ బతికాను ఇన్నాళ్లూ. నీ పేరు వర్కింగు కమిటీలో నమోదయి ఉండటం చూసినప్పుడే నువ్వు జైలుకి వెళ్లే సన్నాహాలలో ఉన్నావని నాకు అర్థమైంది. మోహన్‌లాల్‌ సక్సేనాని నీ పేరు ఎందుకు చేర్చారని కూడా అడిగాను. నువ్వు వద్దన్నా వినలేదని చెప్పాడాయన. పైగా ఆడవాళ్లందరూ నీపేరు చెప్పారని కూడా అన్నాడు. కానీ నువ్వా సంగతి నా దగ్గర దాచావు. పైగా నువ్వు జైలుకెళ్లే సమయంలో నేనింటి దగ్గర లేకుండా పోయాను.”
”ఏడువందల స్త్రీల మాట ఎలా కాదంటాను, చెప్పండి?”
”నీది దొంగబుద్ధికాదా? నాకు తెలిసిపోతుందని నీ పేరు కూడా వార్తాపత్రికల్లో రాకుండా జాగ్రత్త పడ్డావు. నన్ను మోసం చేశావు, కదూ?”
”నన్ను ఆపి మీరు వెళ్తారని భయపడ్డాను. ఇది మోసం, పాపం అని అంటే అనండి, ఒప్పుకుంటాను. కానీ మనింట్లోంచి జైలుకి ఎవరైనా వెళ్లాలన్న కోరిక నా మనసులో బలంగా ఉండేది. పిల్లలు ఎదిగినవాళ్లయితే, ముందు వాళ్లనే పంపేదాన్ని. మీ వంట్లో బాగాలేదు కదా, మీరేలా వెళ్తారు?”
ఆ రాత్రి రెండు గంటలు దాటే దాకా మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నాం.
– ఇంకా ఉంది

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

One Response to ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 19

  1. ప్రేం చంద్ మహిళల పట్ల చూపే గౌరవాభిమానాలకు ఒక చక్కని నిదర్శనం ‘గబన్’ నవల.శరత్ ‘శ్రీకాంత్’ నవలలో ఒక వేశ్యావృత్తిలో ఉన్న మహిళను కధానాయికగా,ఎంత ఉదాత్తంగా చిత్రించారో,గబన్ లో ప్రేం చంద్ ఒక ఉపపాత్రలో మరొక వేశ్యను అత్యంత మర్యాదగా చిత్రించారు.కాకుంటే నవల చివరలో ఆ స్త్రీపాత్రధారి ప్రమాదవశాత్తూ నదిలో పడి మరణించటం బాధాకరంగా ఉంటుంది.మంచి వ్యాసం,అనువాదకురాలికి నా అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.