కవిత్వపు చెలమలో తేటనీరు – గౌరిలక్ష్మి కవిత్వం

శిలాలోలిత
‘జీవితాన్ని కవిత్వం ఆర్ద్రతతో నింపుతుంది’. ‘మనుషుల మధ్య భావవాహికై నిలుస్తుంది’ – ‘పారిజాత’.
ఇటువంటి ఆర్ద్రత నిండిన మనస్సుతోనే అల్లూరి గౌరీలక్ష్మి ‘నిలువుటద్దం’ అనే కవిత్వాన్ని మనముందుంచారు. తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిపాలెం ఆమె వూరు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజరుగా ఉద్యోగం చేస్తున్నారు. గతంలో ‘మనోచిత్రం’, ‘వసంతకోకిల’ అనే రెండు కథాసంపుటులు, ‘భావవల్లరి’ అనే పేరుతో రాసిన కాలమ్స్‌ ప్రచురించారు.
మంచి కథారచయిత్రిగా పేరు తెచ్చుకోవడంతో పాటు ‘కాలమ్స్‌’లో సమాజాన్ని ఆమె విశ్లేషించిన తీరు, స్త్రీల స్థితిగతుల పట్ల ఆవేదన, మానవ సంబంధాలు మృగ్యమై పోతున్న స్థితినీ, వేదాంత ధోరణినినీ, సున్నితమైన వ్యంగ్యం ద్వారా రచించిన పద్ధతి బాగుంది.
‘కాంతిరేఖ’ – కవితలో స్త్రీ లతలాగానో, తీగలాగానో, మరొకదాన్ని అల్లుకుపోయి మాత్రమే బ్రతకవలసిన అగత్యాన్ని వదిలించుకుందాం. చక్కని ముద్దమందారం చెట్టులా తనకు తానుగా, నిండుగా నిటారుగా నిలబడవలసిన సమయం వచ్చేసింది. కాబట్టి ఆ పంథాలో మన పిల్లల్ని తయారుచేద్దాం. ఒకే ప్రమాణాలతో పెంచుదాం అనే భావాల్ని స్పష్టంగా చెప్పారు. చిన్నప్పటినుంచి పోరాటం చేసి ఘర్షణపడీపడీ, సర్దుబాటుల అలసటతో వున్న మన తరం మన పెంపకం ద్వారా విజయానికి చేరువయ్యాం అంటారు.
‘ఊహాచిత్రం’ కూడా మంచి కవిత. కలలు కనే కళ్ళున్నందుకు ఊహల్లో వుండే మనం మధురంగా ఊహించుకుంటాం. ‘ఈ జీవితార్ధభాగంలో/చూడబోతే ఆ చిత్రం/ఒక్క నాజూకులైను లేదు/అన్నీ బండగీతలే, దిద్దుబాట్లే/ఏమిటో ఈ చిత్రం/మోడరన్‌ ఆర్డులా/నాకే అర్థం కాకుండా’. ఊహకూ వాస్తవానికీ ఉండే భేదాన్ని చెబ్తూ, స్త్రీల జీవితాల్లో అడుగడుగునా ఎదుర్కొనే ఎన్నో విషయాల్ని క్లుప్తంగా చెప్పారు.
ఈ కవిత్వంలో అనేక భావనల కలబోత వుంది. ప్రేమ కవితలు ఎక్కువగా వున్నాయి. విరహం, వియోగం, ప్రేమోన్మత్తత, నిర్మలమైన స్నేహం కోసం ప్రయత్నం, మృత్యుస్పర్శ గురించి ఆవేదన, స్త్రీల ఘర్షణల పట్ల సహానుభూతి, బాల్యం, ఊరి గురించిన జ్ఞాపకాల చెలమలు, భాష పట్ల, పతనమౌతున్న విలువల పట్ల ఆక్రోశం, రక్షణ వ్యవస్థను అర్థం చేసుకోవాల్సిన ఇంకొక కోణం యొక్క ఆవశ్యకత, రేపటి స్వప్నాలు తప్పక ఫలిస్తాయన్న ఆశావహ దృక్కోణం వున్నాయి.
‘మనిషి అంతరంగమే అద్దం’ – అనే విషయాన్ని మనం ఎప్పుడూ అనుకుంటున్న విషయమే. నీ గురించి నువ్వు తెల్సుకోవాలంటే, పక్కవాళ్ళను కాదు పోయి అద్దాన్నడుగు. నిజం నీకే తెలుస్తుంది అంటారు ఈ కవయిత్రి. తనను తాను అద్దంలో చూసుకోవడమే కాక, తన ప్రతిబింబంలో తన తోటి స్త్రీల జీవితాల ప్రతిఫలనాలను కూడా ఈ కవిత్వం ద్వారా చూపించడానికి ప్రయత్నించారు.
కృత్రిమమైన స్నేహాలే ఎక్కువగా వున్న కాలాన్ని గురించి –
అవసరార్థ్ధం, ఆపద్ధర్మ ఆచారాలు/హ్యూమన్‌ రిలేషన్స్‌/కుండీలకి పరిమితమైన/అందమైన క్రోటన్‌ మొక్కలు/స్నేహసుమాలనెన్నటికీ/సృజించలేని ఒట్టి క్రిప్టోగాములు (పుష్పించని మొక్కలు).
కవిత్వపు చెట్టు సేదతీరేతనాన్ని ఇస్తూ ఉంటుంది. మహావేగమైన జీవితాల్లో మనుషులకి కాస్తంత ఊరట, హాయిని కలిగించేది సాహిత్యమే. మనుషుల మధ్య స్నేహ వాతావరణాన్ని- సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిన తీరును సాహిత్యమే కలిగిస్తుంది. ఈ అభిప్రాయాలన్నింటి కలబోత గౌరీలక్ష్మి కవిత్వంలో కనిపిస్తాయి. ముందు ముందు మరింత చిక్కని కవిత్వాన్ని గౌరిలక్ష్మి కవిత్వంలో చూడాలని ఆకాంక్షిస్తున్నాము.

Share
This entry was posted in మనోభావం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.