జైలును జూసి జ్వరాన బడి…

జూపాక సుభద్ర
యిప్పటిదాకా రకరకాల కారణాలతో మగవాల్ల జైల్లే చూసినంగానీ మహిళా జైల్లు చూడనీకి వీలేకాలే. ఈ మధ్య సత్యతో వెళ్లే అవకాశమొస్తే వెళ్లిన చంచల్‌గూడ మహిళా జైలుకి, చర్లపల్లి జైలుకు చెల్లెలాగనే వున్నది ఏం తేడా లేదు. ఆ నిలువెత్తు గోడలు, గొళ్లాలు, తాళాలు, ములాఖత్‌ నమూనాలన్నీ ఒక్క తీరే. యివన్నీ చూస్తెనే మనసంత బుగులు బడి జెరం రాజుకున్నదినాకు. జైలు ఆర్కిటెక్చర్‌ ఎక్కడైనా ఒక్క తీరుగనే వుంటదట. రెండు తాళం చెవులు అటొక్కటీ యిటొక్కటీ ఒరిగి నిల్చుకున్న పోలీసుల్లాగ వున్న జైలు సింబల్‌ జూసి ‘ఆ సింబల్‌ అర్తమేందో’ అని అనుకుంటుంటే అక్కడ వున్న మగ పోలీసు ‘ బందబస్తు’ ‘మేడమ్‌’ అబ్బా ఏమీ పోలీసర్తం’ అని నవ్వుకున్నం.
మాములుగా ప్రతి జిల్లాకు ఒక మహిళా జైలు అనుసంధా నించబడి వుంటది. కాని దాదాపు 2 వేల ఖైదీలుండే చర్లపల్లి సెంట్రల్‌ జైలుకు మహిళా జైలు అనుసంధానంగా లేదు. మొత్తం రాష్ట్రంలో మహిళా ఖైదీలకు ప్రత్యేకంగా వున్న జైల్లు రెండే రెండు. ఒకటి చంచల్‌గూడ (హైద్రాబాద్‌) యింకోటి రాజమండి. వార్డెన్‌, హోం గార్డ్స్‌, యితర ఉద్యోగస్థులు అంతా మహిళలే వుండాలి. కాని యీ జైలు గార్డుగా ఒక మగ పోలీసు దర్శన మిచ్చాడు. ప్రతి జైల్లో ఎబిసీ క్యాటగిరీలుంటాయట. ఎబి క్యాటగిరీల వాల్లకు వాల్ల సామాజిక నేపధ్యం, బాగా పలుకుబడి గలిగిన సామాజిక వర్గాలకనుగుణంగా కోర్టు ఆర్డర్‌తో వాల్లకు సౌకర్యాలు కల్పిస్తారట. కాని యివేవీ మహిళా జైల్లో కనబల్లే.
సత్య ముందే పర్మిషన్‌ తీస్కున్నా రెండు గంటలు బైటనే కాపలా కాయాల్సొచ్చింది మగ పోలీసుతో. లోపల ఆడ పోలీసులు, సూపర్నెంటు చాలా స్ట్రిక్టుగా బ్రిటీష్‌కాలంనాటి విధులే తు.చ తప్పకుండా పాటిస్తుండ్రు. మా పెన్ను కాయితాలు కూడా నిందులే అయినయి వారి దృష్టిలో. సెల్లుల్ని కూడా రిమాండ్‌లో వుంచిండ్రు. బాదేందంటే ఖైదీల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నర్సు టీచర్‌ డాక్టరు ( మహిళలే) లాంటి స్టాప్‌ కూడా పోలీసుల్లాగనే వ్యవహరించడం, పోలీసు భాషలోనే మాట్లాడడం. పురుషాధిపత్య నేర సమాజంలో కుల అసమానతల నేర సమాజంలో మగ అణచివేతల నేర సమాజంలో శ్రమ దోపిడీ నేర సమాజంలో అసమ న్యాయాలున్న నేర సమాజంలో నేరాలు చేసి కొందరు, నిందారోపణలతో కొందరు మహిళలు జైల్లకొస్తరు. వీల్లు అనేక దుక్కాల్తో, ఆందోళనల్తో, భయాల్తో వూరిడిసి, బంధువుల్నిడిసి స్నేహితులనిడిసి వస్తరు. వాల్లను కనీసం మనిషిగా పలకరించే చల్లని నీళ్ళలాంటి పలుకు, మాటలుండవు. రాయి బెట్టి కొట్టినట్టే, కట్టెతోని బాదినట్టే వుంటయి వాల్ల దబాయింపులు. కౌన్సిలింగు అందరికి పెడితే బాగుంటది. జైలు సంగతులు ఒక్కటిగాదు అడుగడుక్కు జెరమొచ్చే సంగతులే.
కాని బోర్డు మాత్రం చాలా ఉన్నతంగా పెట్టుకుంటరు. ‘న్యాయస్థానం నుంచి పంపబడిన ముద్దాయిలను తమ రక్షణలో వుంచి జైళ్లశాఖ సమాజ సేవ చేస్తుంది. జైలు కొచ్చిన ముద్దాయిలను మానవతా దృష్టితో వారికి చట్టంపట్ల గౌరవాన్ని కలిగించి పంపిస్తాం.’ అని రాసుకున్న రాతలు కూడా బందీలుగానే వుంచబడినయి.
మహిళా ఖైదీలు మొత్తం యీ జైల్లో వుంది దాదాపు రెండొందలుంటరేమో (శిక్ష పడిన వాల్లు, రిమాండ్‌లున్న వాల్లు వాల్ల పిల్లలంతా కలిపి) వీల్లంతా తొంబయితొమ్మిది పాయింట్‌ తొమ్మిది పర్సెంట్‌ ఎస్సి, ఎస్టీ, బీసీ మహిళలే. దీంట్లో మెజారిటీ బీసీ మహిళలే. మిగతా ఎస్సీలు, తర్వాత ఎస్టీలున్నరు. వాల్లు జైలు కొచ్చిన కారణాల్లో 70% భర్తని చంపిన నేరం మోపబడినోల్లు. మొగుల్లు తాగి తాగి సచ్చిపోయినా, కుటుంబంలో, బంధువుల్లో మొగున్ని ఎవరు చంపినా భార్యల మీదే నేరం వేసి జైలుకు తోలిండ్రట. 30% మహిళలు చోరి కేసుల్లో, వరకట్నం కేసుల్లో చీటింగు కేసుల్లో వచ్చినోల్లున్నరు.
మహిళా ముద్దాయిలు చాలామంది భర్తల్ని చంపిన కేసుల్నే ఎదుర్కోవడం ఆశ్చర్యమైంది. నిజానికి యిది వాస్తవం అయితే మహిళల మీద యిన్ని అత్యాచారాలు, హత్యాచారాలుండవేమో. ఈ నిందితులంతా ఎవర్ని ఎవరు నేరస్థులుగా చూసుకోక పోగా స్నేహాల్తో కలివిడిగా మొకాలు చాలా స్వేచ్ఛగా ఆనందంగా వున్నరు. ఎవ్వరు దైన్యంగా దుక్కంగా లేరు. అట్లాని ఆరోగ్యంగా కూడ లేరు. మేం చూసింది రిమాండ్‌లో వున్న మహిళలే. రాజకీయ, శిక్ష పడిన వాల్లను కలవడం వీలు కాలే. రిమాండ్‌లో వున్నవి చాలా చిన్న చిన్న కేసులు. కొంచెం చేయందించినా బైటపడ్తారు వాల్లంతా. ఓ టీనేజీ అమ్మాయి పిలిచి ” మా అమ్మ రైల్వే కూలీ. చీటింగు కేసుల వచ్చిన. నేను ప్రెగ్నెంట్‌ని. నేను జైల్లున్న సంగతి ఎట్లయినా మా అమ్మకు చెప్పుండ్రి.”
”మా మొగాయిన తాగి తాగి సచ్చిపోతే మా అత్తగారోల్లు నన్ను జైల్లకు తోలిండ్రు . నేనెన్నడు బైటకొస్తనో ”యింకొకామె.
”మా బూముల్ల పంటలు బండక బతుకు దెరువు కోసం రొండు మూడు కుటుంబాలు కల్సి దొంగతనాలకు పర్సులు కొట్టేసేదానికి పట్నమొచ్చినం. నేను నాలుగు సార్లు పట్టు వడకుంట పర్సులు కొట్టేసిన. అయిదోసారి దొరికిపోయిన. పోలీసులు ‘నాలుగు బంగారి షాపులు సూయించి గిండ్ల దొంగతనం జేసినని వొప్పుకుంటే చోరి కేసు మాఫి జేత్తమంటే ఒప్పుకున్న” అని ఓ 50 ఏండ్ల ఆమె అనంగానే అందరు ఒక్కసారే నవ్విండ్రు.
ఇంతలో జైలు స్టాఫ్‌ రాగానే అందరి మొకాలు చీకటైనయి. వాల్లని బంధ విముక్తి చేయలేకపోయినా మా బ్యాగుల్ని, సెల్లుల్ని బంధవిముక్తి చేసి బైటకొచ్చిన సత్యతో. వాల్ల సమస్యలన్ని జ్వరమై చుట్టు ముట్టినయి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో