అక్బరు చక్రవర్తి గొప్పవాడా…? అతని ముక్కు మీద వాలిన ఈగ గొప్పదా?

కొండేపూడి నిర్మల
అనసూయ అని, కాలేజీలో నాకో క్లాస్‌మేట్‌ వుండేది. పరిచయానికి ఎక్కువగానూ, స్నేహానికి తక్కువగానూ మసలుకునేవాళ్లమని చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్‌ రెండేళ్ళూ ఇద్దరం కలిసి ఎన్నో మైళ్ళు ప్రయాణం చేశాం.పొరబాట్న కూడా మా అభిప్రాయాలు కలిసేవి కాదు.
”ఎదురు తిరిగితే చెడ్డ పేరొస్తుంది. ఆడవాళ్ళు ఎదురుతిరక్కూడదు” లాంటి విలువలు చెబుతూ వుండేది.
సిలబస్‌ పూర్తి చెయ్యకుండా పరీక్షలు ప్రకటించినప్పుడు అందరం గొడవచేసి బైటికి వచ్చేసి, చివరికి సున్నాలు తెచ్చుకుంటే తను, బుద్దిగా గైడు బట్టీకొట్టేసి శభాష్‌ అనిపించుకుంది.
ఏమాట కామాటే చెప్పుకోవాలి. తన దస్తూరి అచ్చుప్రింటులా భలే బావుంటుంది. క్లాసులో లెక్చరర్‌ పాఠం చెబుతుంటే టైపు మిషన్‌ మాదిరి టకటక రన్నింగు నోట్స్‌ దింపేసి, ఏ ప్రశ్న వేసినా ఠక్కున జవాబు చెప్పేది.
అదిగో ఆ నోట్సుల కోసమే తనతో నేను మాట్లాడేదాన్ని.
తను కూడా నాతో మాట్లాడేది. ఎందుకంటే కాలేజీకి వాళ్ళింటికి మధ్య మా ఇల్లు వుండేది. ఆటోలో వెళ్ళే నేను తనకు రోజూ లిఫ్ట్‌ ఇచ్చేదాన్ని. స్కూటరు మీద సగందూరం వాళ్ల అన్నయ్య దింపెయ్యగానే, మిగతాదూరానికి బస్‌ కోసం నుంచోకుండా ఈ ఏర్పాటు తనకీ సదుపాయంగా వుండేది. ఇది కేవలం అవసరాల కోసం కుదుర్చుకున్న ఒడంబడిక. స్నేహం అనెయ్యడానికి లేదు. వివాదస్పద విషయాలు మాట్లాడుకుంటే ఇద్దరి ప్రయోజనాలు దెబ్బతింటాయి కనక, నిర్వివాద అంశాలు మాట్లాడుకునేవాళ్ళం. అవి ఎలా వుండేవంటే,
”ఇవాళ ఎండ ఎక్కువగా వుంది కదూ.”
”మన విజయవాడలో కృష్ణానది వుంది కదూ.”
”ఆదివారం తర్వాత సోమవారమే వస్తోంది ఏమిటీ”
”ఇవాళ కూడా ఆకాశం నీలంగానే వుంది సుమీ..”
”ఈ ఏడాది హాలిడేస్‌ అన్నీ ఆదివారాల్లో పడ్డాయి చూశావా” అని మాట్లాడుకునేవాళ్ళం.
ఇవి ఇద్దరం అంగీకరించే సార్వత్రిక సత్యాలే కాబట్టి మొహం తిప్పుకోవడానికి, మూతి విరుచుకోవడానికీ ఏమీ లేదు. ప్రయాణం పొడుగూతా వూరికే మరీ శిలావిగ్రహాల్లా కూచోలేక ఏదో అలా గాలి పోగుచేసుకునేవాళ్ళం. ఈ గంటా ఇలా గడిస్తే చాలు అనుకునేట్టు వుండేవాళ్ళం. తర్వాత ఎవరి స్నేహాలు వారికుండేవి.
ఇంతకూ అప్పటి అనసూయ ఇన్నేళ్లకి మళ్ళీ మొన్న నూటపదమూడో నెంబరు డీలక్స్‌ బస్‌లో కలిసింది.
హాయ్‌ అంటే, ఓయ్‌ అనుకుని ఇద్దరం ఎదురెదురుగా కూచున్నాం.
ఏం పనిచేస్తున్నావు, ఎక్కడ వున్నావు, ఎవర్ని కట్టుకున్నావు లాంటివి పరస్పరం తెలుసుకున్నాక, ”పిల్లలెంతమంది” ప్రశ్నించింది.
”ముగ్గురు” అన్నాను.
”ఆడా? మగా..?” అడిగింది. చెప్పాను.
”నాకిద్దరూ బోయిస్సే..” అంది అమెరికన్‌ ఇంగ్లీషు యాసలో. ఆ మాట ఎంత బాగా అందంటే, తను చదివిన కాలేజీల్లోనే వైస్‌ ప్రిన్సిపాల్‌ పోస్టు వచ్చిన దానికంటే గొప్పగా అన్నది.
ముగ్గురు అన్నలు వున్నందుకుగాను, నలుగురు అక్కలు వున్న నాకంటే గొప్పదైపోయినట్టు చిన్నప్పుడూ ఇలాగే ఫోజు కొట్టేది. అయితే ఇప్పటికీ మనిషి మారలేదన్న మాట. అనుకుని చిన్నగా నవ్వుతూ.
”సో…శ్యాడ్‌…” అన్నాను.
”ఎందుకు” అంది గంభీరంగా.
”ఆడపిల్లలు లేరంటున్నావు కదా అందుకు..” జవాబు చెప్పాను.
”ఔను ఇద్దరూ ప్లస్సులే” అంది. ఈసారీ విచారం లేదు. (దవడ పగలకొట్టాలనిపించింది.)
కాస్సేపటి తర్వాత పుంజుకుని, తన కొడుకులిద్దరు ఎంత హ్యాండ్సంగా వుంటారో, ఎంతో గొప్ప చదువులు చదివి ఇంకెంత గొప్ప పదవుల్లో వున్నారో చెప్పి పూరించే ప్రయత్నం చేసింది.
నేను వూరిపోదల్చుకోలేదు. పైగా ఇంకేవో గొప్పలు వెతుక్కుని చెప్పుకున్నాను.

”పెళ్ళిళ్ళయ్యాయా..?” అంది. నా పిల్లల్ని ఉద్దేశించి.
”లేదు చూడాలి.” అన్నాను.
”మా పిల్లలకి తెగ వస్తున్నాయబ్బా, జవాబులు చెప్పలేక చస్తున్నాననుకో” అంది. (ఇది మాత్రం అబద్దమే అయ్యిండాలి. ఇప్పటి పెళ్ళిళ్ళ మార్కెట్‌ గురించి తెల్సినవాళ్ళెవరూ ఈ మాట చెప్పలేరు.)
”నా పిల్లలకి అస్సలు రావడం లేదు. వాళ్ళే రానివ్వడం లేదు తిరగ్గొడుతున్నారు. ఇంటికెవరైనా వచ్చి అడిగినా కొెట్టేలా వున్నారు? చెప్పాను.
అనసూయ అర్థంకానట్టు చూసింది. నాకు మాత్రం అర్థం అయిందా ఏమిటీ..? ఎందుకో తిక్కగా మాట్లాడాలనిపించింది మాట్లాడాను. ఎక్కువ మంది చెల్లెళ్ళకి, ఆడపడుచులకి పెళ్ళిళ్ళు చేసినప్పటినుంచీ అంతర్లీనంగా దాక్కున్న తిక్క అయి వుండచ్చు. తన స్టేజి వచ్చినట్టు వుంది. బస్సు దిగడానికి లేచింది.
”ఆడపిల్లలు లేని లోటు నీకు ఎప్పుడూ అనిపించలేదా, అయితే…” నేను వదలదల్చుకోలేదు. ఇంకా ఏదో అనెయ్యాలని వుంది.
జీళ్ళపాకం మాదిరి ఆ విషయం దగ్గరే ఆగిపోయిందేమిటా అన్నట్టు నన్ను చూసి, తెల్లబోయి, ”లోటు ఏముంది, కోడళ్ళు వస్తారు కదుటోయ్‌” అంది. చాలా పెద్దరికంగా…ఆ మాటలో నేను వూహించినంత బంపర్‌ డ్రా, లాట్రీ టిక్కెట్టు ఏమీ లేదు. (అయితే పెళ్ళిళ్ళ మార్కెట్‌ తెలిసే వుంటుందన్నమాట.)
పెళ్ళికెదిగిన అబ్బాయిలు కిటకిటలాడుతున్నారు గాని అమ్మాయిలు దొరకడంలేదట, మా బంధువుల్లో చాలామంది చెబుతున్నారు. బహుశా ఈ అనసూయ కూడా స్కానింగులో అబ్బాయి అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మెల్లిగా కనివుంటుంది. దేశం సర్వ నాశనం అయిపోవడానికి తనవంతు పాత్ర తను నిర్వహించింది. ఆ మాటకొస్తే ఇప్పుడు కోడళ్ళ వేటలో మ్యారేజీ బ్యూరోల చుట్టూ తిరిగే ఎందరు తల్లిదండ్రులు ఆడశిశువుల్ని పుట్టకుండా ఆపెయ్యలేదు..? గుండెమీద చెయ్యి వేసుకుని ఆలోచించండి.
కోటిపైగా ఒక నగర జనాభాతో పోల్చదగినంతమంది ఆడపిల్లల్ని చేతులారా చంపుకున్న పరమ వికారమైన చేతులు మనవి. మన పాపానికి నిష్కృతి లేదు.
అయినా ఇంకా దృక్పథం మారలేదు చూశారా. మగపిల్లవాడు పుడితే గుండు కొట్టించుకుంటామని ఇంకా మొక్కుతూనే వున్నారు. అనసూయతో నాకు స్నేహం ఎందుకు కుదరలేదో ఇప్పుడు అర్థమయింది. స్నేహం కొన్ని విలువలకీ, అభిరుచులకీ సంబంధించిన విషయమని నేను నమ్ముతాను.
ఎన్ని ప్రయోజనాలున్నాగానీ, తల్లిని నడిరోడ్డు మీద వదిలిన కొడుకుతో గాని, కోడల్ని సతాయించే అత్తతో గాని, భార్యని అనుమానించే భర్తతో గాని మనం స్నేహంగా వుండగలమా..? పోనీ బంధువులుగా చెప్పుకోగలమా..? కుడిభుజంగానో, ఎడమ కాలుగానో వుండగలమా.అలా వుండి మళ్ళీ సిద్ధాంతం గురించి మాట్లాడగలమా..? సిద్ధాంత స్పృహ వుండి కూడా శివుడి విబూదిని యాంటీరింకిల్‌ క్రీం మాదిరిగా మొహానికేసి రుద్దుకోగలమా..? ఇది భావ దరిద్రం కాదా..?
అక్బరు చక్రవర్తి గొప్పవాడా..? అతని ముక్కుమీద దురద పెడుతున్న ఈగ గొప్పదా..? అని మా సోషలు మాస్టారు ఒక పజిల్‌ ఇచ్చాడు. బాల్యంలో. సహజంగా చక్రవర్తి గొప్పవాడని అందరం మూక ఉమ్మడిగా అరిచేవాళ్లం. అతను ఈ క్షణాన అరేబియా సముద్రంమీద, మరుక్షణాన పెంటదిబ్బ మీద వాలలేడు కదా మరి, అని ఈగ గొప్పదనాన్ని చెప్పి, మాలో సందేహాలు రేపి అప్పుడు చెప్పేవాడు. బలహీనులు చవకగా ఎటయినా చెదిరిపోతారు. బలవంతులు స్థిరంగా ఆలోచిస్తారు. చక్రవర్తికీ ఈగకీ వున్నంత తేడా ఇద్దరికీ వుంది.ఈగ అడుగుజాడల్లో చక్రవర్తి నడవడం అనేది ఎంతైనా హాస్యాస్పదం.. అని తేల్చేవాడు. ఆ పిచ్చి పంతులు ఎప్పుడో మట్టిలో కలిసిపోయాడు.
కానీ మీ శిష్యురాలికి ఆ పాఠం ఇంకా గుర్తు వుంది మాస్టారూ…భుజంమీద చొక్కా చిరుగు కనబడకుండా కప్పుకున్న మీ కండువా మీద వొట్టు.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

4 Responses to అక్బరు చక్రవర్తి గొప్పవాడా…? అతని ముక్కు మీద వాలిన ఈగ గొప్పదా?

 1. ravi says:

  చాలా బాగా చెప్పారు

 2. buchireddy says:

  నిజము చెప్పారు
  అన సూయ లు అమెరి కా లొ లెక పొలెధు

 3. srikanth says:

  మీ వ్యాసములోని main theme తో నేను ఏకీభవిస్తాను. బౄణహత్యలు సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం.

  కాకపోతే ఒక విషయం నాకర్థం కావట్లేదు. ఆడపిల్లలను లేకపోవడం లోపమా? ఒకరికి ఆడపిల్లలు లేకపోవడం సో శ్యాడ్ అని మీరెందుకు ఫీలయ్యారో అర్థం కావట్లేదు.

  పెళ్ళిల్లు జరగడం ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉందని పేపర్లో చదివుతున్నాను కొంతమంది తమకు పెల్లిల్లు జరగడానికి కొంత సమయం పడుతున్నదని చెబుతున్నారు కరక్టే. కానీ, అబ్బాయి మంచి హోదాలో ఉండి మంచి చదువు అందం ఉన్నవాడైతే (అంతం కొంచెం అటు ఇటూ అయినా పర్లేదు ఆబాయిలకి, హోదా చాలా ముఖ్యం) అతనికి చాలా సంబందాలు వస్తాయి అన్నది కూడా నిజమే. కాబట్టి బహుషా ఆవిడ చెప్పింది అబద్దమయ్యేలా అనిపించడం లేదు. నాకు తెలిసినవారిలో చాలా మందికి సంబంధాలు బాగానే వస్తున్నాయి. అవి కూడా లకారాలల్లో కట్నమిచ్చేవే.

 4. srikanth says:

  *అంతం కొంచెం ఆతుఇటు అయినా…

  అందం కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు అబ్బాయిలకి… అని చదువుకోగలరు.. 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో