హద్దు

ఎ. పుష్పాంజలి
పదిరోజులుగా ఎడతెరిపిలేని ముసురు పట్టింది. బడుగు బతుకులన్నీ ఆకలి మడుగుల పాలైనాయి.
ఎవరి సంగతెలా ఉన్నా రాజమ్మ పరిస్థితి మరీ అధ్వాన్నం! ముసురుకు తోడూ చీకట్లు ముసురుకుంటున్నవేళ, ఆ మారుమూల గ్రామంలో, ఆ చిన్న ఇంట్లో, మోకాళ్ల మీద తలానించి ముసురుకేసి చూస్తుండిపోయింది రాజమ్మ.
ఆమె చూస్తున్నది ముసురును కాదు, ముసురు వెనకాల తన బతుకు చీకటిని.
ఆమె వెనక మరో మూడు ప్రాణాలు మునగదీసుకొని పడుకొని ఉన్నాయ్‌. ఒకటి ఆమె అత్త ముసలి నరసమ్మ, మిగతా రెండు చిన్న ప్రాణాలూ రాజమ్మ కొడుకులు. ఎనిమిదీ, తొమ్మిది సంవత్సరాల వాళ్లు.
”పిల్లోల్లకి మద్దేల ఇస్కూల్లో పెట్టే బువ్వగ్గూడా ప్రాప్తం లేకుండా జేసినాదీ ముదనట్టపు ముసురు” అనుకుంది రాజమ్మ.
నరసమ్మ రెండు మోకాళ్లనూ పొట్టలోకి ముడుచుకుంది. అప్పు డప్పుడూ ఆకలికి మూలుగుతోంది. పిల్లలిద్దరూ ఆకలికి సొమ్మసిల్లి మగత నిద్రలోకి జారుకున్నారు.
ఎక్కణ్ణుంచో ఓ కుక్కపిల్ల వాకిట్లో కొచ్చి రాజమ్మను చూసి కుయ్‌ కుయ్‌మంది.
”దీనికీ ఆకిలైతాంది” అనుకొంది రాజమ్మ.
గంట క్రితం నెత్తిన బొంత వేసుకుని శెట్టి అంగడికి పోయి ”కాసిని సరుకులీన్నా, రేపు కూలికి బోయి దుడ్డు కట్టేత్తా” అని బతిమలాడింది రాజమ్మ.
”నీ మొగుడు తీస్కపోయిన దుడ్లకింతవరకూ గతిలేదు పోవమ్మా” అన్నాడు శెట్టి. చేసేది లేక ఉత్త చేతుల్తో వెనక్కొచ్చింది.
చీకటి చిక్కబడుతూ ఉంది.
ఎదురింటి చిట్టెమ్మ మొగుడు ఆదిగాడు కిటికీ దగ్గర నిలబడి వెకిలి చేష్టలు చేస్తున్నాడు. ”సిట్టి పుట్నింటికి బొయినకాన్నించీ ఈడికి కిండలెక్కవైనాయి’ అనుకుంది రాజమ్మ. ఆది సైకిలు మీద చీరలేసుకొని, కాసిని చీరలు మూటలో పెట్టుకొని, పల్లె పల్లెకు తిరిగి, చీరల వ్యాపారం చేస్తుంటాడు. మొన్నొక రోజు ఎవ్వరూ లేకుండా చూసి ”సీరలున్నాయ్‌, సూతువుగాని రాయే రాజీ” అన్నాడు వెకిలి నవ్వు నవ్వుతూ.
”సీరలూ వొద్దు… సింతకాయా వొద్దు” అని గబగబా వచ్చేసింది రాజమ్మ.
సాయంత్రం నుంచీ లైటు వెయ్యటం, ఆర్పడం. టేపు రికార్డర్లో గట్టిగా ”రాయే! నా రవ్వలరాణీ, ఈ రేతిరంతా నీది నాదేనే” అన్న పాట పెట్టడం చేస్తున్నాడు.
”ముదనట్టపు ముండాకొడుకు…” అని తిట్టుకుంది రాజమ్మ. ”అయినా ఒకర్నని ఏం లాభం? మొగుడనే వోడు పట్టిచ్చుకోనప్పుడు అందరికీ సులకనైక ఏమయితాం? పక్కూరి రత్నమ్మను మరిగినంక కడుపున బుట్టిన బిడ్డలేమైతాండరు? కట్టుకున్న పెళ్లాం ఏమైతది? ముసిలి తల్లి గతేంది? అనే మాటే మర్సిపోయిండు. పొగులు సూత్తే రేతిరి కల్లోకొచ్చే ఆ రత్తంటే ఈడికింత మోజెట్టా పుట్టిందో” అనుకుని నిట్టూర్చింది రాజమ్మ.
ఆదిగాడు సన్నగా ఈలవేస్తూ తన ఉనికినీ, అభిప్రాయాన్నీ వ్యక్తం చేస్తున్నాడు.
అత్తను చూస్తే రాజమ్మ డుపు తరుక్కుపోతూ ఉంది. ”పాపం అత్త. ఒంట్లో సత్తవున్నంత వరకీ తనని బైట పన్లకంపలా. ఆ ఇంట్లో, ఈ ఇంట్లో పాచిపనులు జేసి సంపాదించి పెట్టినాది. ఇంగ ఈ సంసారం ఈదడం ఆమె తరుంగాదు” అనుకుంది.
”ఇంతకు ముందు సింతపల్లె సిలకమ్మ సావాసం జేత్తా ఉండి, ఇదేమాదిరి ఇల్లు పట్టిచ్చుకోకుండా అందర్నీ గోడాడిచ్చిండు. అదెవుడితోను ఎల్లిపోయినంక రత్తమ్మ సావాసం బట్టిండు. ఈ సంసారం ఈదేదెట్టా? ఈల్లందర్నీ గట్టెక్కిచ్చేదెట్టా? బగమంతుడా? కల్లెప్పుడు తెరత్తావు సామీ” చింతపోతూ ఉందామె.
పిల్లల మూలుగులెక్కువైనాయి. పల్లెలో వాళ్లంతా పడుకున్నారు. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆదిగాడు మాత్రం ఈలలేస్తూ, టేపులో పాటలు పెడ్తూ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.
ఉన్నట్టుండి ఏదో నిశ్చయాని కొచ్చిం దాన్లా లేచింది రాజీ. తలుపు లాగి ముసుర్లో బైటికడుగు పెట్టి చీకట్లో కలిసిపోయింది.
కాసేపటి తర్వాత ఎదురింట్లో లైట్లారిపోయాయి.
జ జ జ
గంట తర్వాత సంచీ నిండా సరకుల్తో తిరిగొచ్చింది రాజమ్మ. గబగబా పొయ్యి రాజేసి ఎసరు పెట్టింది. ఎసట్లో కాసిని నూకలు పడేసింది. కారం నూరేలోగా అవి ఉడికినయ్‌. పొట్లం విప్పి రాగిపిండి తీసి ఎసట్లో పోసి, గెలికి, నాలుగు సంగటి ముద్దలు చేసింది.
అందర్నీ లేపి ముద్దలు పెట్టింది. ఆవురావుమని తినేసి వెంటనే నిద్రలోకి జారుకున్నారు. తన ముద్ద తినబోతూ వాకిట్లో కుక్కపిల్ల జ్ఞాపకం వచ్చి కాస్తంత దానికి కూడా వేసింది.
2
ఇప్పుడు రాజమ్మ కుటుంబానికే దిగులూ లేదు. ఆమె పనికి వెళ్లినా, వెళ్లకున్నా, వర్షం కురిసినా, కురవకున్నా ఆమె ఇంట్లోవాళ్లు కడుపునిండా భోంచేస్తున్నారు.
నాల్రోజుల తర్వాత ముసురాగింది. పిల్లల బడులు తెరిచారు. కాబట్టి మధ్యాహ్నం భోజనం సమస్య లేదు. రాజమ్మ కూడా పనులకి పోతూ ఉంది. ఐనా ఒక్కొక్కరోజు చీకట్లో బైటికి కూడా పోతూనే ఉంది.
ఎదురింటి చిట్టి పుట్టినింటి నుంచి వచ్చి కూడా నాలుగు రోజులైంది. ఇంతకు ముందులా ఆదిగాడు వెకిలి చేష్టలు చేయడం లేదు, బుద్ధిగా ఉన్నాడు. ఐనా రాజమ్మ బైటికి పోతూనే ఉంది.
రాజమ్మ పిల్లలు కొత్త బట్టలు వేసు కుంటున్నారు. నరసమ్మ ఇంతకు ముందులా కట్టు చీరతోనే గాకుండా రెండు కొత్తచీరలు కూడా కట్టుకొంటూ ఉంది.
జ జ జ
ఆ మధ్యాహ్నం వేళ రాజమ్మ ఇంట్లో లేనప్పుడు, చుట్టుపక్కల ఇళ్లల్లోని నలుగురాడవాళ్లు నరసమ్మను చూడవచ్చారు.
”ఎట్టుండావత్తో? సిత్తడికి ఏం బాదలు పడితిరో పాపం. రాజీ కూటికి గింజలు లేవని అవత్తలు బడతా ఉన్నింది. ఏందన్నా ఇత్తామంటే నాయంచున గూడా ఏందీ లేకపాయెనత్తా” అన్నది పక్కింటి ఉత్తక్క.
”సిత్తడికి మా యాయిన కూలికి బోక మా పరిస్తితీ అదే మాదిరిగానే ఉన్నింది” అన్నది వెనకింటి ఈశ్వరమ్మ.
”ఇయ్యాల ఇంట్లో వణ్ణం జేసిన్రా లేదా? రాజి కనపల్లేదే. యాడికి బొయినాది?” అన్నది ఇవతలింటి ఎంగటమ్మ అనుమానంగా.
”మొన్నొకనాడు రేతిరికాడ రాజీ సిట్టెమ్మింటో దూరతా ఉంటే సూసినా పెద్దమ్మా” అన్నది నాలుగో ఇంటి నాగలచ్చిమి.
”పెతి రేతిరీ ఎక్కడికో ఎలబారి పోతా వుండాది నీ కోడలు” ఎత్తిపొడుపుగా అన్నది అప్పటిదాకా ఊరుకున్న మాలచ్చిమి.
”మీ తెలివి తెల్లారిపోయింది గానీ, అదెక్కడికి బోతాది? గింజల కోసం బోయుంటది. ఒకనాడు నేనే దుడ్లిచ్చి పంపినా” అన్నది నరసమ్మ.
”నీయంచున దుడ్లుండాయా అత్తా? ఉంటే నాకూ ఇయ్యరాదా!” అన్నది ఉత్తక్క హేళనగా.
నరసమ్మ ఏమీ మాట్లాడలేదు.
రెండోనాడు మళ్లీ వచ్చిన వాళ్లని చూసి నరసమ్మ ఒళ్లు మండిపోయింది.
”ఏల వచ్చిన్రు?” అన్నది సూటిగా.
వాళ్లు బిత్తరపోయినా, సమలాయించు కొని మొదలుపెట్టినారు.
”పెద్దమ్మా! ఒక కులం వాల్లం. అయినోల్లం పొయినోల్లం. ఎవురి సంగతో అయితే మాకేల? మనోల్ల ఇసయం గదా అని ఇతర బాద పడతా వుండాం. రాజమ్మను కాత్త కనిపెట్టుండు” అన్నది నాగలచ్చిమి.
”అత్తా! నీ కోడలు పెతి రేతిరీ ఎక్కడెక్కడికో, పోగూడని తావులకి ఎలబారి పోతూ వుండాది. తిరగరాని తిరుగుల్లు దిరగతా ఉండాది” అన్నది ఉత్తక్క.
”మా సిన్నాయన సచ్చినంక నువ్వు కాయకట్టం సేసి, రగతం దారపోసి మద్దిగోన్ని సాకి సంతరిచ్చినావు. రాజమ్మలాగా ఒల్లమ్ము కోలేదు” అంది ఈశ్వరమ్మ నరసమ్మను చెట్టెక్కిస్తూ.
ఇట్లా అందరూ రాజమ్మ మీద నరసమ్మకు కోపం తెప్పించడానికీ, ద్వేషం పెంచడానికీ తమ శాయశక్తులా కృషి చేశారు.
అయినా నరసమ్మ తొణకలేదు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు. బాధ కూడా పడలేదు. పెద్ద గొంతుతో తను చెప్పదల్చుకున్నది మొదలుపెట్టింది.
”ఒసే, మేనకోడలా, ఒసే నా సెల్లి కూతురా? మీకు, సంసారాలు లేవా? వోటిల్లో కట్టసుకాలు లేవా? మీది మీరు సూసుకోకుండా ఏల ఇతరుల గొడవల్లో దూర్తా ఉండారు. ఎవరు బొట్టు పెట్టి ‘నా యమ్మల్లాలా సూద్దురుగాని రండి’ అని పిలిసినారు మిమ్మల? నా కోడలు సంగతి నాకు దెల్సు. నా సంగతి దానికి దెల్సు. అది రేతిర్లు ఆ ఇంట్లో దూరింది, ఈడికి బొయింది, ఆడికి బొయింది అని కూత్తా ఉండారు. నాకు దెలీకడగతా- ఆ జామున మీకందరికీ బైటేం పని? మీ మొగుల్ల నొదిలిపెట్టి బైట ఎవారాలు జేసే వాల్లు కాకపోతే మీకు ఇయ్యన్నీ ఎట్ట దెలుత్తయి? సెప్తా ఉండా ఇనండి. నా కోడలు పొగులల్లా పనికి బోతాది. ఇంగ దానికి సరుకూ, సంతా ఎవరు దెచ్చిత్తరు? మీరు తెత్తరా? అందుకే అది మబ్బులో ఎలబారిపోయి పనులు సక్కజేసుకొత్తా ఉంది. ఇదో, మల్లా సెప్తా ఉండా ఇనండి. ఇంగ నా సంసారం గొడవల్లో తలదూరిత్తే, నేనసలికే మంచిదాన్ని గాదు. పోండి! మీ పన్జూసుకోండి” అని తలలు వాచేటట్టు చీవాట్లు పెట్టి తరిమేసింది.
”ఏమోనే! నీ మేలూ, నీ సంసారం మేలూ కోరి సెప్తా ఉండాం. ఇనకపోతే నీ కర్మ” అంటూ మూతులు విరుచుకుంటూ, చేతులు తిప్పుకుంటూ వెళ్లిపోయారు వాళ్లంతా.
ఆ వెళ్లిన వాళ్లు ఊరుకోలేదు. వేరే విధంగా నరుక్కు రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
జ జ జ
ఆ వేళ రాత్రి బైటికెళ్లిన రాజమ్మ రాత్రి పదకొండింటికిగానీ రాలేదు. వస్తూ వస్తూ రెండు బిరియానీ పాకెట్లు పట్టుకొచ్చింది.
”అట్టా టౌనుకు పోయుంటి” – బిరియానీ పాకెట్లు అత్త చేతుల్లో పెడుతూ చెప్పింది.
నరసమ్మ గుండె గుబగుబలాడింది. ఎట్లాగో గొంతు పెగల్చుకుని ”అట్టా మబ్బులో అంతదూరం ఎలబారబాక. మంచిది గాదు” అంది.
”సరే” అన్నది రాజమ్మ.
అందరూ ఆ బిరియానీ తిన్నారు. ఎంతకీ నిద్రపట్టని రాజమ్మ తన ఆలోచనల్లో మునిగిపోయింది.
”సివరికి తను బొత్తిగా ఇట్టం లేనాటి నీచమైన పనికొడిగట్టినాది. ఇన్నాల్లూ పద్దతిగా బతికిన తను చివరికి ఈ నీచమైన, బగిసినమైన బతుకు బతకాల్సి వచ్చినాది. ఇట్టాంటి బతుకు బతికేదానికన్నా సచ్చేదెంత మేలు! పిల్లోల్లకీ, అత్తకీ, అంత ఎలకల మందేసి, తనూ అంత తాగి సత్తే పోలా? సూత్తా సూత్తా ఆ నేదర బిడ్డల్నీ, ముసిల్దాన్నీ సంపేదెట్టా? పోనీ, తనొక్కటే సత్తే ఈల్ల బతుకులేమైతాయ్‌? ఆ బైటి కుక్కంటి బతుకులే అయితాయి. పెల్లాన్ని సాకి సంతరిచ్చేవోడు మొగుడైతడుగానీ, మద్దిగానంటోడు మొగుడైతడా? కోస్తే మూడూర్లకయితడు. ఆ రత్తి రంబంట, తను కోతంట. సుక్కలాగుంటావే రాజమ్మా అని ఊల్లో అందరంటా ఉంటే, ఈడికి మటుకు ల్లు పోయినయ్‌. ముదనట్టపు ముండా కొడుకు” అని రకరకాలుగా చింతలు పోతూ నిద్రలోకి జారింది.
జ జ జ
”రాజక్కా! తొందరగా తెములు. మనూల్లోనే మోరీ కాడ పనంట. మేస్త్రీ చెప్పిండు” అని కేకేసి చెప్పాడు బాలిగాడు.
గబగబా తయారై బాక్సులో ఇంత సద్దికూడు కుక్కుకుని పనికి పోయింది రాజమ్మ.
అప్పుడొచ్చారు ఆ కాలనీలో ”ముత్తైదువులు”గా పేరుగాంచిన ముగ్గురు నరసమ్మ ఈడు ఆడవాళ్లు. అక్కడందరికీ వాళ్ల మాటంటే గురి. అక్కడ ఆడవాళ్ల మంచి చెడ్డలు చూస్తూ, పంచాయితీలు చేస్తూ, పురుళ్లు పోయడం, శుభకార్యాల్లో పెద్దరికం వహించడంలాంటి పనులు చేస్తుంటారు వాళ్లు. ఇంతకు ముందు నరసమ్మకు నీతులు చెప్పి భంగపడ్డ ఆడవాళ్లు ఈ ముగ్గురికీ బాగా నూరిపోసి, నరసమ్మ దగ్గరికి పంపించారు.
”ఏమే నర్సీ! బాగుండావే?” పంచలో నులకమంచం లాక్కుని కూచుంటూ అన్నది కోటమ్మ.
”బాగుండాక్కా. రాండి” అన్నది నరసమ్మ.
”మద్దిగోడు కనపరాలే?” అన్నది గౌరమ్మ.
”పిల్లోల్లు బడికి పోయిన్రా?” అన్నది దేవమ్మ.
కాసేపిలా యోగక్షేమాలు విచారించాక రంగంలోకి దిగారు ఆ ముగ్గురూ.
తామంతా కులస్త్రీలమనీ, ప్రస్తుతం రాజమ్మ చేస్తున్న పనుల వల్ల కులస్తులకి ‘బగిసీన’మవుతా వుందనీ, తమ ”మొగోల్లు” రాజమ్మతోగానీ, నరసమ్మతోగానీ మాట్లాడొద్దనీ, అసలు వాళ్లింటికే వెళ్లొద్దని ఆంక్షలు పెడుతున్నారనీ, కోడలి విషయం తెలిసి ఊరకుందో, తెలియకే ఊరకుందో గానీ, నరసమ్మ చాలా పెద్ద తప్పు చేస్తోందనీ, ఈ విషయం మద్దిగాడికి తెలిస్తే ”కూనీ”ల వుతాయనీ, అనేక విధాలుగా అదిరింపులతో, బెదిరింపులతో నరసమ్మకు బుర్ర వేడెక్కించ ప్రయత్నించారు.
అంతా సావధానంగా వింటూ ఊకొడు తున్న నరసమ్మ ”అట్లా ఆల్లు సెప్పిందీ, ఈల్లు సెప్పిందీ నమ్మబాకండక్కా. ఇంకబోయి రాండి. పొద్దెక్కతా ఉంది. బాయి కాడికి బోయి కాసిని మంచినీల్లు దెచ్చుకోవాల” అంటూ బిందె చంకనేసుకుని చక్కా పోయింది.
దారి పొడుగున వీధిలో వాళ్లని శపిస్తూనే వెళ్తున్న ఆమెను చూసి ”ముండలిద్దరికీ తగిన శాస్తి చెయ్యాల”ని వీధి వాళ్లంతా నిర్ణయించు కున్నారు.
పట్టుచీరకు చాలినంత డబ్బులివ్వలేదని రత్నమ్మతో కాలితన్నులు తిన్న మద్దిగాడు హతాశుడైయున్నాడు. గ్రామంలో మగాళ్ళు తనకు అందించిన సమాచారంలో పిచ్చి పట్టిన మృగంలా వచ్చాడు. ప్రపంచమంతా పనికిమాలిన వాడని తీర్మానించిన వాడు కూడా భార్య ముందుకొచ్చేసరికి వీరుడే!
రాగానే రాజమ్మ ఇంట్లో లేకపోవడంతో నరసమ్మ మీద తిట్లకు లంకించుకున్నాడు.
”ఓ ముసిల్దానా! రాయే బైటికి. నా పెళ్లాం బిడ్డలకి తోడుగా ఉంటావని నిన్ను నా యంచునే ఉంచుకుంటి. ఎవురేం సేస్తాండారో పట్టిచ్చుకోకుండా తిని కొవ్వెక్కి కొట్టుకుంటుం డావు. ఇయ్యాల నిన్ను నరికేసేది ఖాయం…” అంటూ చిందులు తొక్కుతుంటే ముసిల్దీ, పిల్లలూ భయంతో ఇంట్లో నుంచి బైటికి రాలేదు.
”యాడ సచ్చిందే ఆ లం….ఇట్ట రమ్మనే దాన్ని. దాని రగతం కల్ల సూడా ల్సిందే…” అంటూ రకరకాలుగా అమ్మలక్కలు ఆడుతూ దగ్గర్లో ఉన్న రోకలిబండ నొకదాన్ని చేతుల్లో పట్టుకుని వీరంగం చేయసాగాడు.
వాడి వీరంగం కన్నుల పండుగగా తిలకిస్తున్న ”ఆ వీధివాళ్ళు” అమందానంద భరితులైనారు. తమ ఎత్తు పారిందనీ, రాజమ్మ రాగానే ఆమెకూ, నరసమ్మకూ ఉతుకుడు తప్పదనీ ఉబ్బిపోయారు.
కూలిపని ముగించుకుని, పనిలో పనిగా పొయిలో పెట్టడానికి ఏరుకున్న చిల్లకంప మోపు నెత్తి మీద పెట్టుకుని నింపాదిగా వచ్చింది రాజమ్మ.
ఆమె దూరాన్నుంచే మొగుడ్నీ, అతడి వీరంగాన్నీ గమనించింది. అప్పుడు రాజమ్మను చూసి తన ఫోర్సు మరింతగా పెంచాడు మద్దిగాడు. నోటికొచ్చిన తిట్లన్నీ తిడుతూ రోకలిబండ పొజిషన్‌ సరి చూసుకుంటున్నాడు. జరగబోయే దృశ్యాన్ని చూడకనే ఒళ్లు మరచిన వీధివాళ్లు తన్మయత్వంతో తిలకిస్తున్నారు.
రాజమ్మ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి తలమీదున్న కట్టెల మోపును తడికవారగా పడేసింది. తొట్టె దగ్గరికెళ్లి కారియరు అక్కడపడేసి, చల్లటి నీళ్లు ముఖం మీద చిలకరించుకుంది.
”ఎంత గుండెలు దీసినాదమ్మా ఈ బాచేలి?” అనుకుంటూ ముక్కుల మీద వేళ్లేసుకున్నారు అక్కడ కాచుకున్న ప్రేక్షకులు.
అప్పుడు సరాసరి మద్దిగాడి ముందు కొచ్చి నిలబడ్డది రాజమ్మ. ఆమె ముఖం మీద నీళ్లు కారుతున్నయ్‌. ఆ నీళ్లలో నానిన ఎర్రని తిలకం ముఖం మీద రక్తంలా కారుతోంది. అలా నిల్చున్న ఆమె – ”ఏందిరా? తెగ పేల్తా వుండావు. సెప్పిప్పుడు” అంది.
మద్దిగాడు నిశ్చేష్టుడైనాడు. తనని చూసి గడగడా వణుకుతుందనుకున్న భార్య తెగువ చూసేసరికి వాడికి నోట మాట రాలేదు. చివరికెలాగో తన మగత్వాన్నీ, మృగత్వాన్నీ కూడగట్టుకుంటూ ”ఇయ్యాల్తో నీ కత సరి…” అంటూ రోకలి బండెత్తాడు.
”ఆన్నే నిల్చు” అంటూ ఆ రోకలి బండను రెండు చేతుల్తో గట్టిగా పట్టుకుంది రాజమ్మ. తనీ స్థితికి రావడానికి కారణమైన ఆ మనిషి మీద ఆమె కోపం కట్టలు తెంచుకుంటోంది.
”ఒరే, శానా సూసినా లేరా నీ మగతనం. ఇద్దరు పిల్లోల్లని కనిపారెయ్యడానికి పనికొచ్చింది నీ మగతనం! సంపాయించింది బజారు కొంపల్లో దారబోసే ముదనట్టపోడివి, నేనెట్టాబోతే నీకేంరా? ఒక్కడుగు ముందుకు పడిందంటే సూడు మల్లా. ఈ బండతోనే నీ తలకాయి ముక్కలు జేత్తా. ఆల్లంతా నీకడ్డమొత్తరేమో సూత్తా” అని గర్జించింది.
ఊహించని ఈ సంఘటన మద్దిగాడి అహంభావాన్నీ, పొగరునూ నీరుగార్చింది. వాడి చేతులు రెండూ, మనసులాగా బలహీనపడిపోయి పుల్లల్లాగా అనిపించ సాగాయి. అప్పుడా రోకలిబండ పూర్తిగా రాజమ్మ హస్తగతం అయింది.
రోషంతో, ఆవేశంతో, ప్రతీకారంతో, ప్రతిధ్వనిస్తున్న ఆమె గొంతు, లోపల నక్కిన నరసమ్మకు అంతులేని ధైర్యాన్నిచ్చింది. ఒక్క ఉదుటున బైటకొచ్చి వీధిలో చోద్యం చూస్తున్న అమ్మగార్లందరినీ తిట్టిపోసింది. దాంతో వాళ్లంతా ఇళ్లల్లోకి జారుకున్నారు.
ఇక ఇప్పుడు తన మగతనం ప్రదర్శించా లంటే మద్దిగాడికి ప్రేక్షకులే లేకపోయారు.
అప్పుడు నరసమ్మ రెచ్చిపోతూ ”ఏసెయ్యే రాజీ! వాన్నా రోకలిబండతో, నిముసంలో తల పగిలేతట్టు ఒకే ఏటెయ్యి. ముసిలి ముండని, నేనే పోతా జైలుకి. ఇయ్యాల వోడు సావాల. ఆన్ని పూడిసి పెట్టి మనిద్దరం ఇరగబడి నవ్వుకుంటా ఇంటికి రావాల. ఏసెయ్‌! వాన్నేసెయ్‌” అంటూ చిందులు తొక్కింది.
దాంతో వ్యవహారం ఎప్పుడో హద్దులు దాటిందనీ, ఇంక తన అదుపులో తల్లిగానీ, భార్యగాని లేరని గ్రహించిన మద్దిగాడు భరించలేని నీరసంతో, నీరుగారిపోతూ అక్కడే కూలబడిపోయాడు.
జ జ జ
ఏమైందో ఏమోగాని ఆ తర్వాత మద్దిగాడు బుద్ధిగా ఇంటిపట్టునే ఉండిపోయాడు. అంతేకాదు. రోజూ కూలికెళ్లి, తెచ్చిన డబ్బులు రాజీ చేతికిస్తున్నాడు.
రాజీ ఇప్పుడు రాత్రులు బైటికి పోవడం లేదు. నరసమ్మ పంచాయితీలు చెయ్యడానికి పల్లెల్లో తిరిగి వస్తూంటుంది. పిల్లలు యధాప్రకారం బడికెళ్లి చదువుకుంటున్నారు.
ఆ వేళ ముసుర్లో వచ్చి రాజమ్మ ఇంట్లో చేరిన కుక్కపిల్ల మరింక రాజమ్మ ఇల్లు వదలలేదు.
కథలోని చిత్తూరు మాండలీకాలకు అర్థాలు
మద్దేల = మధ్యాహ్నం/ ఆకిలి = ఆకలి/ గోడాడించడం = కష్టపెట్టడం/ సి(చి)త్తడి = వాన, బురద/దుడ్లు = డబ్బులు
నీ యంచున = నీ వద్ద (అంచున) / ఎలబారి = వెళ్లబారి/ఇంగ = ఇక/ బగిసీనం = అవమానం/ మోరీ = తూము (బ్రిడ్జ్‌)/ కనపరాలా = కనపడలేదు/ చిల్ల కంప = కర్రతుమ్మ కంప/ బాచేలి = భాగ్యశాలి

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

One Response to హద్దు

  1. lakshmi says:

    ఇంతకీ ఈ కథ ద్వారా మీరు చెప్పదలుచుకున్నదేమిటి ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో