నిడదవోలు మాలతి

పి.సత్యవతి
పంధొమ్మిదివందల యాభైల్లో కథలు రాయడం మొదలు పెట్టి ఇప్పుడు తన స్వంత వెబ్‌ పత్రికలు తెలుగు, ఇంగ్లీషు తూలికలు నిర్వహిస్తూ, దాదాపు వంద తెలుగు కథల్ని ఇంగ్లీష్‌లోకి అనువదించి, ఇంగ్లీష్‌లో రెండు అనువాద కథా సంకలనాలే కాక 60,70లలో విస్తృతంగా రచన చేసిన రచయిత్రుల నవలల మీద ఒక విశ్లేషణను కూడా (Quiet and Quaint) ప్రచురించారు. ఒక ఆంగ్ల కథా సంకలనం The Spectrum of My People జైకో బుక్స్‌ ప్రచురించగా From My front porch  సాహిత్య ఆకాడెమీ ప్రచురించింది. రచయిత్రులపై విశ్లేషణను  పొట్టి శ్రీరాములు  విశ్వవిద్యాలయం ప్రచురించింది.  All Wanted to read అనే పుస్తకం కూడా ప్రచురించారు. తెలుగులో ”నిజానికి ఫెమినిజానికీ  మధ్య ” అనే కథా సంకలనం 44 కథలతో 2005 లో వచ్చింది. మరో సంకలనం 22 కథలతో ”కథల అత్తయ్య గారు” త్వరలో రాబోతోంది. ‘చాతక పక్షులు’ అనే నవల కూడా రాబోతోంది. ఆంధ్రా యూనివర్సిటీనించీ ఇంగ్లీష్‌ ఆనర్స్‌, లైబ్రరీ సైన్స్‌ చదివి ఢిల్లీలో లైబ్రరీ సైన్స్‌లో పిజి చేశారు. తొమ్మిది సంవత్సరాలు తిరుపతి యూనివర్సిటీలో అసిస్టెంట్‌  లైబ్రేరియన్‌గా పని చేశారు. 1973 నించి అమెరికాలో వుంటున్నారు. ఆమె కథలో ఎక్కువ కనిపించే విశాఖపట్నం ఆమెది. చిన్నప్పుడు అమ్మ వెనుక తిరుగుతూ కమ్మని తెలుగుని సామెతలతో సహా నేర్చుకున్నారు. అందుకే ఆమె కథలన్నిటికీ చక్కటి తెలుగు శీర్షిక లుంటాయి. నిడదవోలు మాలతిగార్ని గురించిన స్థూల పరిచయం ఇది.
కథలు రాయడం చిన్న వయస్సులోనే మొదలుపెట్టినా ఎదుగుతున్న కొద్దీ కొంత పునాది వేసుకుని రచనలకు మెరుగులు దిద్దుకున్న తరం అది. కొంత తెలుగు సాహిత్యాధ్యయనం భాషా జ్ఞానం సామాజిక పరిశీలన ఆ పునాది. రచనను ఒక కెరియర్‌గా తీసుకోడం కోసం అవన్నీ చెయ్యరు ఎవరూ. ఒక ఉత్సాహంతో చేస్తారు. ఆ మాట కొస్తే చాలామంది తెలుగు రచయితలకు రచన కెరియర్‌ కాదు. కాకపోబట్టే మంచి రచనలు చెయ్యగలిగారు. సాహిత్యాభిరుచి కల కుటుంబంలో జన్మించి, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని బాగా చదువుకుని సంస్కృతం కూడా నేర్చుకుని, ఇంగ్లీష్‌లో మాస్ట్గర్స్‌ చేసి మానవ స్వభావాన్ని నిష్పాక్షికంగా పరిశీలించి సహానుభూతితో వారిని గురించి రాయడం 1950 దశకానికి ముందే మొదలుపెట్టిన రచయిత్రి నిడదవోలు మాలతి.  అప్పటినించి ఆమె రచన ప్రవాహశీలంగా సాగుతూనే వుంది.

కొంతమంది రచయితలవలె ఏదో ఒక మలుపు దగ్గర నిలిచి అదే స్ధిరభావంతో కాక సమకాలీనంగా ప్రవహిస్తోందనడానికి ఆమె నిర్వహిస్తున్న బ్లాగు లే దర్పణాలు. ఒక వ్యక్తి స్వభావం గురించి చెప్పినా ఒక సంఘటన ప్రభావం గురించి చెప్పినా రచయిత గా ఒక పాత్ర తరఫున వకాల్తా పుచ్చుకుని ఓవర్‌ టోన్స్‌లోకి వెళ్ళకుండా తన పాత్రలన్నిటిపైనా సానుభూతితో రాస్తారు. ఆమె రచనల్లో స్త్రీ పాత్రలు ఎక్కువగా వుంటాయి. అయితే వాళ్ళ బాధల్ని , వాళ్ళపై హింసని మాత్రమే పట్టించుకుని వారి జీవితాల్లోని ఇతర పార్శ్వాలను వదిలిపెట్టరు. జీవితాన్ని అన్ని రంగుల్లోనూ అన్ని కోణాల్లోనూ ఒకింత సమతూకంతో పరిశీలిస్తారు.” హింస మగవాళ్ళు, ఆడవాళ్ళుని హింసించడంతో ఆగిపోలేదు. నా అభిప్రాయంలో హింసకి బలం, అర్ధబలం కావచ్చు. అంగబలం కావచ్చు. మనిషికి ఆ బలం నిరూపించు కోవాలన్న కోరిక కలిగించేదే అహంకారం. ప్రతి ఒక్కరూ ఎదుటివారి మీద తమ ఆధిక్యం చూపించుకోడానికి బలం ప్రదర్శిస్తారు. అందుకని ముందు రావల్సింది వైయక్తిక విలువలలో సామాజిక విలువలలో మార్పు. ఎదుటివారిని గౌరవించడం నేర్చుకున్న వారు ఏ జెండర్‌ వారినైౖనా గౌరవింస్తారు. అందుకే నా కథల్లో బాధల్ని అనుభవించిన స్త్రీలున్నారు కానీ, కేవలం అదే అన్ని కథలకీ ప్రాతిపదిక కాదు. అనేక  వస్తువులలో అదొక వస్తువు” అంటారు  (పొద్దు.నెట్‌లో ఇంటర్వ్యూ నించి)
మాలతి గారు 1973లోనే అమెరికా వెళ్ళి పోవడంవల్ల ఆమెకు ఆ దేశంలో భారతీయుల జీవితాన్ని గురించి విశేషమైన అనుభవంతో కూడిన అవగాహన వుంది. ఇప్పుడు మనకి లభ్యమౌతున్న  ఆమె రాసిన 66 కథలన్నీ రెండు వర్గాలుగా విడగొట్టితే  కొన్ని భారతదేశపు కథలు, కొన్ని డయాస్పోరా కథలు.డయస్పోరా కథలలో ఈ ముఫ్ఫె సంవత్సరాలుగా ప్రవాస భారతీయుల జీవితంలో వచ్చిన మార్పులు స్పష్టమైనట్లు భారతదేశపు కథల్లో భారతదేశంలో వచ్చిన మార్పులు అంతగా ద్యోతకమవ్వవు.  కారణం మార్పు వేగం అధికమైన ఈ రెండు  మూడు దశాబ్దాలలో ఆమె ఇక్కడ లేకపోవడం కావచ్చు. ఒక్కొక్కప్పుడు, మనిషి స్వభావం, ఆయా సంఘటనలవల్ల వాళ్ళు స్పందించే తీరు, దేశ కాలాతీతంగా వుంటాయి. మానవ సంవేదనలు, ఆవేదనలు,ఆరాటాలు వాళ్ళు చేసే పోరాటాలు ఒక కాలానికి ఒక దేశానికే పరిమితమైనవి కావు. ఆయా సంస్కృతులలో మనకి కనిపించే వైరుధ్యాలు ఉపరితలానివే కాని హృదంతరాలలో మానవులంతా ప్రేమించేది మానవత్వాన్ని, సౌహార్ద్రతనే. దీనికి కొంతమంది మినహాయింపుగా ఎప్పుడూ వుంటారనుకోండి. ఈ ఎరుక మాలతి గారి కథల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
మాలతి కథలు రాయడం ప్రారంభించిన రోజుల్లో (1950దశకం)లో జన జీవితంలో ఇంత వేగం లేదు. ఇంత స్వకేంద్రీయత కూడా లేదు. సమయ నిర్వహణ పాఠాల ప్రభావమూ లేదు. పొరుగువారికి మన సమయాన్ని ఆనందంగా పంచడం, వాళ్ళ ఆనందాన్ని పంచుకోడం వుండేది. ఇందుకు ‘కథల అత్తయ్యగారు” అనే కథే ఒక ఉదాహరణ. ఇప్పటి ఆంటీల కన్న అప్పటి అత్తయ్యగార్ల అమాయక ప్రేమలు ఎంతో ఉదాత్తమైనవి. ఆమె ఒక కథల ఖజానా. ఆ కథలు  అభూత కల్పనలే అయినా అవి చమత్కారంతో కలిసిన అచ్చ తెలుగు నుడికారంతో వుండేవి. ఒక తల్లి చేసిన మోసాన్ని కూతురు తెలుసుకుంది. ఆ విషయం తల్లికి అర్థం చేయించడానికి తన బొమ్మకి బువ్వ పెడుతుంది. బొమ్మ తినదు కదా! అప్పుడాతల్లి, ”చిలకల కొలికి చినదానా బొమ్మలు బువ్వలు తిందురటే’ అంటుంది. ఆ పిల్ల తల్లితో ఇలా అంటుంది.” మాయలదానా! మహిమల దానా మనుషులు కప్పలు కందురటే!” తల్లి తను చేసిన మోసానికి సిగ్గుపడి దాన్ని సరిదిద్దుకుంటుంది. ఇలా కథల అత్తయ్యగారి కథల  ప్రభావం మాలతిగారి మీద వుంది.

మాలతిగారు 66 కథల్నీ మనం ఇక్కడ స్థల పరిమితి వలన చెప్పుకోలేం కనుక ఈ దేశపు కథలు కొన్నిటినీ ఆ దేశపు కథలు కొన్నిటినీ స్పృశిద్దాం. రచయిత్రి చెప్పినట్లు ఆమె సృష్టించిన స్త్రీల పాత్రలు కొన్నిటిలో ”మంచుదెబ్బ” కథలో వకుళ ”నవ్వరాదు” కథలో కమలిని, ”జీవాతువు” కథలో అరుంధతి, ”అవేద్యాలు’ కథలో శారద…నవ్వరాదు కథలో కమలిని తన కష్టాలను నవ్వుల మాటున హాస్యం మాటున దాస్తుంది. వకుళ మహామౌనం దాలుస్తుంది. అరుంధతి జీవితంలో పోరాడి ఓడిపోతూ వుంటుంది. శారద తను అవమానానికి గురైనా చివరికి ఆత్మాభి మానానికి ఔన్నత్యానికి సజ్జనత్వానికి ప్రతి రూపంలా నిలుస్తుంది. నడుస్తున్న చరిత్రలో కల్యాణికి సంగీతం నృత్యం అంటే ప్రాణం కానీ పెళ్ళి కోసం అవి ఆమెకు దూర మయ్యాయి. సంగీత కచేరీలకు వెళ్ళడం మానుకుంటుంది. ఆమె మనసుని అర్ధం చేసుకోలేని భర్త ఆ విషయం పట్టించుకోడు. చివరికి తన మనుమరాలు తను సాధించలేనివన్నీ సాధిస్తుందన్న ఆశతో తన నిరాశకు తెరదించుతుంది. మంచుదెబ్బ కథలో వకుళ భర్త నపుంసకుడు. ఆ విషయం మనకి చివరిదాకా తెలియదు. దాన్ని గరళంలా కంఠంలో దాచుకుని  మౌనమే తన తిరస్కారంగా నిరసనగా చేసుకుంటుంది. ఆమె మౌనానికి కారణం భర్తకు తెలిసినా అతను హిపొక్రైట్‌ కదా! ఆమెకు మానసిక వైద్యం చేయిస్తాడు. చివరికి ఆమె తల్లి ఆమెను తీసుకుపోతానంటే తనే కలకత్తా తీసుకువెళ్ళి నయం చేయిస్తానంటాడు. ఆమె చనిపోతుంది. భర్త నపుంసకుడన్న నిజాన్ని ఒక్క స్నేహితురాలకి మాత్రమే చెప్పి… ఈ కథ స్నేహితురాలి కథనంగా సాగి చివరి వరకూ వకుళ మౌనానికి కారణం ఒక ప్రశ్నగానే వుంటుంది.  అట్లా స్నేహితురాలిని నెరేటర్‌గా ఎంచుకోడం కథకి బిగువు నిచ్చింది. మాలతిగారి కధల్లో చాలా వాటికి ఇటువంటి శిల్పాన్నే ఎన్నుకున్నారు. ” ఫలరసాదులు కురియవే పాదపముల” అనే కథలో  ఒక మహా శ్వేత గురించి చెప్పినా, ”మాములు మనిషి” అనే కథలో రాజేశ్వరి గురించైనా, ”జీవాతువు” కథలో అరుంధతి గురించైనా  ఉత్తమ పురుష అనుభవాలనించే ముఖ్యపాత్ర జీవితం మనకి తెలుస్తుంది. నవ్వరాదు కథలో కమలిని కూడా అంతే. ”తృష్ణ” కథలో బాలయ్య గురించి కూడా సాధారణంగా ”నేను పాత్ర కథ చెబుతుంటే ”నేను”కి చాలామంది రచయితలు కొన్ని ఉత్కృష్టమైన గుణాలని అంటగడతారు. కానీ మాలతిగారు ఈ ”నేను”ని కూడా ఒక సామాన్య వ్యక్తిగానే వుంచుతారు. అదే ఆమె ప్రత్యేకత. తృష్ణ కథ ఒక లైబ్రరియన్‌ చెప్పడంగా వుంటుంది. లైబ్రరీలో అటెండర్‌ బాలయ్య అతన్ని గురించి లైబ్రేరియన్‌ గారికి చాలామంది ప్రతికూల వ్యాఖ్యలు హెచ్చరికలు చేస్తారు. ఆమె తన విధి తను చేసుకుపోతూ వుంటుంది. కానీ అతిగా స్పందించదు. బాలయ్య మీద పుస్తకాల దొంగతనం అభియోగింపబడి అతని ఇంటిని సోదా చేసేవరకూ వెడుతుంది. ఆ సోదాలో అతనికి పుస్తకాలు చదవాలనే అభిలాష, అభిరుచి, ఊర్కే చదవడమేకాక వాటిలోని కొన్ని పంక్తుల్ని రాసిపెట్టుకోడం కూడా లైబ్రేరియన్‌ని చకితురాలిని చేస్తుంది. బాలయ్య నిజానికి పుస్తకాలు ఏవీ ఎత్తుకు పోలేదు. పోయిన పుస్తకాల్లో ఒకటే అతని ఇంట్లో వుంది.అది కూడా చదివి ఇచ్చేసే ఉద్దేశం తోనే తెచ్చాడు. ఉద్యోగం పోయాక బాలయ్య కనిపించలేదు. చివరికి మూర్‌ మార్కెట్‌లో సెకండ్‌ హాండ్‌ పుస్తకాల షాపు నిర్వహిస్తూ కనపడ్డాడు. అనేక పుస్తకాల మధ్య ఉన్న  బాలయ్యకిప్పుడు పుస్తకం ఒక అమ్మకపు సరుకులా మారిపోవడం ఒక ఐరనీ. ఈ కథని మాలతిగారు రాసిన తీరు చాలా సహజంగా వుంటుంది. అట్లాగే విషప్పురుగు అనే కథలో స్కూల్‌ అటెండర్‌ రోశయ్య. అతనికి పాములు పట్టడంలో నేర్పుంది. అతను ఎక్కడ పాము కనిపించిందన్నా వెంటనే వెళ్ళిపోయి వాళ్ళకి సాయపడతాడు.. ఆ విధంగా అతను స్కూల్‌కి ఆలస్యంగా రావడం, విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా మెమోలు అందుకోడమే కాక అతనిపై స్కూల్లో అంతా నేరాలు చెబుతూ వుంటారు. స్కూల్‌కి వచ్చిన ఒక రిజిస్టార్‌ పార్సెల్‌ పారేశాడనే అభియోగంతో అతనికి  బదిలీ వేటు పడినా ఆనందంగానే వెళ్ళిపోతాడు.

కానీ అతనిపై నేరం మోపడానికి మరొకరెవరో ఆపార్సెల్‌ని సైన్స్‌ లాబ్‌లో పారేస్తారు. రోశయ్య వ్యక్తిత్వాన్ని ప్రధానోపాధ్యాయురాలైన ”నేను”ద్వారా చెప్పిస్తారు…మాలతి గారికి బహుమతి వచ్చిన కథ ”చిరుచక్రం” సర్వసాక్షి దృక్కోణంలో వచ్చింది. ఇందులో కూడా స్కూల్‌ ప్యూన్‌ వెంకన్న వ్యక్తిత్వ చిత్రణే ప్రధానం. అతనికి తను చేసే పని మీద ప్రేమ. ఒక రకమైన భక్తి కూడా. అల్ప సంతోషి. తనదికాని తోటమాలి పని కూడా నెత్తిన వేసుకుని తను పండించిన పూయించిన ఫలపుష్పాలను ఎవరైనా మెచ్చుకుంటే పరవశించిపోతాడు. స్కూల్‌ ఇన్‌స్పెక్షన్‌ రోజున ఉరుకులు పరుగులుగా వొళ్ళు విరుచుకుని పనిచేసి అందుకు ప్రతిగా అతనికి అయిదు రూపాయిల ఫై¦న్‌ పడినా ఆ రోజు తన పువ్వుల్నీ కూరగాయల్నీ ఎవరెంత మెచ్చుకున్నదీ భార్యతో చెప్పి పొంగిపోతాడు. ఫైన్‌ మాట చెప్పడు. ఈ కథని ”ఎక్స్‌ప్లాయిటేషన్‌” కోణంలోనించీ ఓవర్‌ టోన్స్‌లో రాయొచ్చు. కానీ రచయిత ఆ విషయం ఎక్కడా ఎత్తకుండా చివరికీ ఆ మాట పాఠకులకు తట్టేలా చేస్తారు. ఒక అమాయకుని స్వభావాన్ని మాత్రమే చెబుతారు. అది ఆమె శిల్ప నైపుణ్యం. మాలతి గారి కథల్లో ఎక్కువ స్వభావ చిత్రణ వుంటుంది. ”మామే స్త్రీత్వం” అనేది  ప్రతీకాత్మక కథ స్త్రీ, చైతన్యానికీ, రాగద్వేషాలకూ ప్రతీక. చైతన్యమూ, రాగమూ ఎక్కుడుంటాయో ద్వేషమూ అసూయా కూడా అక్కడికీ వచ్చి చేరతాయని అంచేత నాకీ స్త్రీత్వం (రాగద్వేషాలు) వద్దు అని. ఈ కథలో రాగద్వేషాతీతమైన ఒక వూరికి ఒక స్త్రీ వస్తుంది. ఒక పిల్లవాణ్ని చేరదీస్తుంది. ఆమె మనుమడు వస్తాడు. అతన్ని ఆమె ప్రేమగా చూడ్డం చేరదీసిన పిల్లవాడికి ఈర్ష్య కలిగించి అతన్ని కొట్టించి చివరికి క్షమాపణ అడుగుతాడు.
మాలతి గారి రాబోయేసంకలనంలో (కథల అత్తయ్యగారు) ఉన్న ఇరవై రెండు కథల్లో చాలావరకూ డయస్పోరా కథలు కాగా మొదటి సంకలనంలో కూడా దాదాపు 14 కథలున్నాయి. ఆమె కథా సంకలనానికి శీర్షికైన ”నిజానికి ఫెమినిజానికి మధ్య” అనే కథలో కూడా.
ఈ కథలన్నింటిలో అమెరికా వెళ్ళిన ఆంధ్రుల అనుభవాలు అప్పటివీ ఇటీవలివీ కూడా వున్నాయి. అమెరికాలో ఎలా మెసులుకోవాలో పదిమంది  పది సలహాలూ హితవులూ చెబుతారే కానీ ఏ వొక్కరూ మంచులో జారిపడతావు జాగ్రత్త అని పనికొచ్చే ఆ ఒక్క ముక్కా చెప్పరెందుకో అనే కథలో చమత్కారం బావుంటుంది. అక్కడికి వెళ్ళాక కొంతమంది ప్రతిదాన్నీ డబ్బుతో కొలవడం తమకెలా లాభం అనిచూడ్డం ”కొనే మనుషులు” ”డాలరుకో గుప్పెడు రూకలు” ”గుడ్డి గవ్వ” కథల్లోనూ.. తమకెవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు వెంటనే ఆ రుణం తీర్చే అమెరికనుల పద్ధతి ”జమాఖర్చుల పట్టిక”లోనూ చెబుతూ మన సంస్కృతిలో ఏదైనా ఎవరికైనా ఒక బహుమతి ఇవ్వడం పుచ్చుకోడమూ కూడా ఇటువంటి బేరీజులకతీతంగా ఒక ఆత్మీయ స్పర్శతో వుంటాయటారు. అమెరికా వెళ్ళినా మన Sense of rumour ” (sense of Humour) అట్లాగే వుంటుందనీ ఆత్మీయంగా ఎవరితోనైనా అంతరంగంలో మాట చెబితే అది ఇండియాలో నీలాటి రేవులో పాకిపోయినంత త్వరగా ఫసిఫిక్‌ అట్లాంటిక్‌ రేవుల్లో కూడా పాకుతుందనీ ఆ కందిరీగల్ని ఎలా తప్పించుకోవాలో చెప్పే కథ ”అడవి దారంట”. అట్లా పెళ్ళికో పేరంటానికో పార్టీకో ఒంటరిగా వచ్చిన స్త్రీని అక్కడకూడా ”ఎవరి తాలుకా?” అని ఆరాలు తీయడం, అమెరికాలో డ్రైవింగు రాకపోతే వుండే కష్టాలు అక్కడుండే వాళ్ళకే కాదు, చుట్టం చూపుగా వెళ్ళొచ్చే వాళ్ళకి కూడా తెలుస్తాయి. అలాంటప్పుడు కారుండి డ్రైవ్‌ చేసేవాళ్ళు అది లేని వాళ్ళకి లిఫ్ట్‌ ఇవ్వడం సాయం చెయ్యడం మామూలే. కానీ అది కూడా ఓర్వలేని వాళ్ళు చేసే వ్యాఖ్యానాలు ఇద్దరు స్నేహితురాళ్ళనూ బాధపడతాయి.

కానీ ఆపత్సమయంలో మళ్ళీ ఒకరికొకరు దగ్గరైపోతారు.”అత్యంతసన్నిహితులు” కథలో..అమెరికాలో పై చదువులకి రావడానికి ఇండియాలోనే రిహార్సల్‌ వేసుకునొచ్చి, అత్యుత్సాహంతో యాక్సిడెంట్‌ పాలైన ఒక ధనిక తండ్రి గారాల కొడుకు, ఒక కొడుకుని సరిగా తీర్చిదిద్దలేక దేశాల పాల్చేసి, రెండో కొడుక్కి అతి గారాం పెట్టి  ఆకాశమార్గాన నడిపించిన తండ్రి ”పై చదువులు” కథలోనూ అంత గొప్ప ప్రజాస్వామిక దేశంలోనూ ఇంకా కొనసాగుతున్న వర్ణ వివక్ష ”రంగుతోలు” కథలోనూ అక్కడి ”లే ఆఫ్‌” ల ప్రభావంపై ”హాలికులైన నేమి” ”నీ కోసం” ”కథల్లోను మన సంస్కృతిలోని భక్తి భావన ఒక చిన్న పాప మనసుని  స్పర్శించడం ”చివురు కొమ్మైన చేవ” కథలోనూ కొత్తగా వచ్చిన ప్రవాసులపై స్థానికులు కొంత జులుం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే ఎలా తిప్పి కొట్టాలో నేర్చుకున్న అమ్మాయి కథ ”పలుకు వజ్రపు తునక” కథలోనూ చూస్తాము.

”నీ కోసం” కథలో ఉద్యోగం పోయి మరొకటి వెతుక్కోకపోవడం కూడా భార్య కోసమే ననే భర్తకి ఒక హెచ్చరిక చేసిన భార్య…ఇంక నిజానికీ ఫెమినిజానికీ అనే కథకు కొంత నేపథ్యం ”దేవీ పూజ” అనే  కథలో వుంది. వివాహపు పదహారో వార్షికోత్సవం ఒక మొక్కుబడి తంతుగా సాగుతుంది. సీతకీ ఆమె భర్త సీతాపతికీ. అతనికెంతసేపూ ఆర్త స్త్రీ రక్షణ పరాయణత. అది ఎక్కడికి దారి తీస్తుందోనన్న కలత సీతది. నిజానికీ ఫెమినిజానికీ మధ్య కథ దీనికి కొనసాగింపులా అనిపిస్తుంది. పదిహేడేళ్ళుగా ఇంటికోసం చాకిరీ చేసి, ఉద్యోగం చేసి అతన్ని తప్ప వేరొకర్ని మదిని తలవక ఉన్న భార్యతో అబద్దాలాడి ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని సీతాపతి ఆమెకు షాక్‌ ఇచ్చాడు. కళ్ళెదుట కనిపిస్తున్న నిజాలను అబద్దాలుగా నమ్మింపజూశాడు. అతని విలువల పతనాన్ని ఆమె ఆమోదించలేక పోయింది. అతని స్త్రీలలో ఒక స్త్రీగా వుండలేక వేరే అపార్టెమెంట్‌ మారడానికి ఆయత్తమైంది. ఈ కథని మాలతిగారు ఒక్కొక్క మెట్టుగా చాలా సహజంగా మలుచుకుంటూ వచ్చారు. అతని ఉత్తరాలు చూసేదాకా అతని మీద తనెంతగా అంకితమైందీ, ఇవ్వన్నీ ఆమె ఆత్మాభిమానాన్ని కాపాడుకునేలా ఒక నిర్ణయానికి వచ్చేలా చేసిన తీరు చాలా సమతూకంతో రాశారు. అట్లాగే ”ఆనందో బ్రహ్మ”…అనే కథలో బ్రహ్మ కూడా ఆర్త స్త్రీ పరాయణుడే. మాలతిగారి కథలు కొంత సీరియస్‌గా వున్నా ఆమెలో హాస్యమూ వ్యంగ్యమూ కూడా మిక్కిలిగా వున్నాయి.  ఆమె బ్లాగు” తెలుగు తూలిక (WWW.tethulika.worpress.com)లో ”ఊసుపోక”లో ముఖ్యంగా ఈ హాస్య వ్యంగ్య ధోరణి చూడవచ్చు. మాలతిగారు ఆనాటి రచయిత్రి కారు. ఆవిడ ఇప్పటి రచయిత్రి . ప్రస్తుతం  విస్కాన్సిన్‌లో వుంటున్న మాలతిగారు సాహిత్యమే స్వదేశాన్ని మరిపించే స్నేహసాధనం అంటారు. ”నాకు జీవితంలోనూ, సాహిత్యంలోనూ ఒకటే విలువలు. చిత్తశుద్ధీ ఆత్మవిమోచనా, ఉన్న దానితోనే తృప్తి పడటం నాకు చిన్నప్పటీ నుంచీ ముఖ్యమైన విలువలుగా వుంటూ వచ్చాయి.” అనే మాలతి గారు ఎంత గొప్ప రచయితనయినా తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా చెప్తారు. గురజాడ దిద్దుబాటు కథ పై నయినా..కుటుంబ రావు గారి కథలపై నయినా…

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

4 Responses to నిడదవోలు మాలతి

 1. Pingback: పి. సత్యవతిగారి సమగ్రవ్యాసం నాకథలమీద « తెలుగు తూలిక

 2. buchireddy says:

  ఉన్నదాని కన్న కొంచము యెక్కువ రాషారని అని నా అభిప్రాయము

 3. సత్యవతీ నీ కాలాలు బావుంటున్నాయి.
  అభినందనలు
  కొండేపూడి నిర్మల

 4. kusuma says:

  సత్యవతి గారూ!
  స్త్రీల సమస్యల గురించి నిబద్ధతతో ప్రచురిస్తూన్న మీ పత్రికకు జోహార్లు.
  నిడదవోలు మాలతి గారి బ్లాగులను తరచూ చదువుతూంటాను.
  ఆమె గురించిన వ్యాసంలోని విశ్లేషణ – మీ పరిశీలనాత్మక దృష్టికి నిదర్శనము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో