సుమతీ కవితావనంలో ‘మొలకెత్తిన అక్షరం’

డా. వి. త్రివేణ

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగంలో ఆచార్యులు సుమతీనరేంద్ర గారు
అక్టోబర్‌, 2010లో పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసంప్రాచీనాంధ్ర సాహితీ క్షేత్రంలో వ్యవసాయం చేసిన విదుషీమణి. అనంతమైన సువిశాల సాహితీలోకంలో తనవంతు భాగాన్ని చదును చేసిన సారమతి. సాంద్రత గల తెలుగు నేలపై కవితా బీజాలు విత్తిన కవితాధుని. నాటి బీజాలే నేటి తొలకరికి పులకరించి అక్షరాలుగా మొలకెత్తాయి. మొలకెత్తిన అక్షరాలకు భావకవితా సుమాలు విరబూసి సువాసనలు వెదజల్లుతున్నాయి. ఇంతటి కృషీవలుర స్థానాన్ని పొందినవారు ఆచార్య పి. సుమతీ నరేంద్ర గారు. గొప్ప విమర్శకులుగా, వక్తగా పేరు ప్రఖ్యాతులు సాధించిన సుమతి గారు తన ”మొలకెత్తిన అక్షరం” అనే కవితా సంపుటితో కవిత్వపు లోతులను అధిగమించి ఆధునిక కవయిత్రిగా ఆమోద ముద్ర పొందారు.
”మొలకెత్తిన అక్షరం” అనే కవితా సంపుటి నిండా సుమతి గారి అనుభూతి గీతికలే విహరిస్తాయి. ఇవి నిత్య చైతన్య జ్వలితమైన వీరి స్వభావానికి ప్రతీకలుగా నిలుస్తాయి. వస్తుధ్వనికి, భావోద్వేగానికి నిదర్శనాలుగా ప్రతిబింబిస్తాయి. ఈ కవితల్లో విభిన్న వస్తువైవిధ్యంతో పాటు సంఘటనా కౌశలం, సంవేదనం, అనుభవం అన్నింటికీ మించి మహోన్నత జీవన వ్యక్తిత్వం దర్శింపబడింది. అస్మిత, అస్తిత్వాలకు పథ నిర్దేశం చేయబడింది.
జీవన తాత్త్వికనంతా ”మొలకెత్తిన అక్షరం”లో నిక్షిప్తం చేసిన కవయిత్రి ఈ కవితా సంపుటిని విభిన్న సంఘటనల వైవిధ్య సుమహారంగా అల్లారు. తన మనస్సులో కలిగిన సంస్పందనలకు వచన కవిత్వంలోనే వివరణాత్మకమైన విశ్లేషణ చేశారు. మొలకెత్తిన భావాలకు కవిత్వంలోనే ఊపిరి సెగలను అందించారు. సమాజంలో అణువణువున ఎదురవుతున్న సమస్యలెన్నింటినో తానొక చక్కని పరిష్కారదిశగా పయనించారు.
”మొలకెత్తిన అక్షరం”లోని విభిన్నాంశాలపై నా స్పందన.
1. స్త్రీ అస్తిత్వం : కవయిత్రి తనకు తాను అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని వెతుక్కొని నిలుపుకొనే ప్రయత్నం చేశారు. ఎండమావిలాంటి జీవితంలో, సమాజపు వింత పోకడలకు ఎటు పయనిస్తున్నామో తెలియక సందిగ్థావస్థలో ఉన్నారు. జీవితసత్యాన్ని చాలా స్థూలంగానే తెలుసుకొన్న సుమతి గారు తన కవితలో ఇలా అంటున్నారు.
”నన్ను నేను మర్చిపోతున్నాను/నాది కాని జీవితాన్ని జీవిస్తూ/అందర్నీ మెప్పించాలని/అహర్నిశలూ శ్రమిస్తూ/అసలు నేనెవరినో” (అస్తిత్వగీతి)
తనను తాను తెలుసుకోవడం (స్వస్వరూపం) ఆధ్యాత్మిక మార్గంలో ‘తారకం’ అంటారు. తమకంటూ ప్రత్యేక అస్మిత అస్తిత్వాలు ఉన్నా, స్త్రీలు జీవించే జీవితానికి అనేక రకాలైన ఆటంకాలు ఎదురవుతాయి. సమాజంలో నాటికి, నేటికి స్త్రీకి ఇవ్వబడిన స్థానమేమిటో పై కవితలో వర్ణింపబడింది. ”కాస్త మెత్తగా” అనే కవితలో ”సీత, ద్రౌపది, దమయంతి, సతీసావిత్రి, సతీ అనసూయ” వంటి పతివ్రతలు కూడా విపరీత బాధలు అనుభవించారని పేర్కొనబడింది. నాటి పురుషాధిక్య సమాజపు కట్టుబాట్లకు ధర్మపత్నులు బలిపశువులు కావలసి వచ్చింది.
తరతరాలుగా స్త్రీ జాతిపై జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలను, అవమానాలను నిశ్శబ్దంగా భరిస్తూనే, దానికి గల కారకులకు ఎదురు నిలిచి నిలదీసే శక్తి లేక కవయిత్రి తన కన్నీళ్లను గంతలుగా కట్టుకున్నావంటున్నారు.
”అమ్మ” సృష్టిలో అత్యంత మధుర భావన. ”అమ్మ”కు సర్వలోకాలు, సర్వకాలాలు, సర్వభూతలాలు తలలు వంచి నమస్కరిస్తాయి. శిల్పి చెక్కలేనిది అమ్మ విగ్రహం, కవి వర్ణించలేనిది అమ్మ నిగ్రహం. ఆచార్య సుమతి గారు ”అమ్మ”కు గల ప్రతిబింబ ప్రతిమను ప్రతిష్టించడానికి ప్రయత్నించారు. అమ్మకు గల ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ప్రకటిస్తూనే  ఆ ”అమ్మ”కు గల నేటి బిడ్డల్ని, వారి ఆలోచల్ని, అలవాట్లను, సంఘ విద్రోహ చర్యల్ని ”అమ్మా!” అనే కవితలో ఎత్తిచూపారు. కన్నప్రేగును పక్కకు పెట్టి కరుణాభావాన్ని వదిలి ప్రళయమాతగా విజృంభించమని, సమాజపు స్థితిగతులను మార్చమని కోరుతున్నారు. చెడును తరిమివేసే దిశగా పయనించమంటున్నారు.
ఆచార్య సుమతి గారి ”శూన్యగీతి” కవిత నేటి స్త్రీ జీవితానికి ప్రతీకగా నిలుస్తుంది. ఉద్యోగ బాధ్యతలు అదనమైన ఇంటి పనులతో అనుక్షణం తీరిక లేని పరిస్థితి ఆమెది. ఒక కుటుంబంలో భార్యాభర్తలు సమానహక్కుదారులైతే, బాధ్యత విషయానికి వచ్చేసరికి అవన్నీ కేవలం స్త్రీకి మాత్రమే పరిమిత మౌతున్నాయి. నవమాసాలు మోసి పిల్లల్ని కనడం ఒక యెత్తు అయితే, వారిని పెంచడం మరొక యెత్తు. ”పాప పాలకోసం ఏడ్చినా, పక్కబట్ట తడిపినా, బాబు నిద్రలో ఉలిక్కిపడిన, లేచి నీళ్లడిగినా, అది నా సమస్యే, నీకేమీ పట్టదు / విసుక్కుంటావు, అటు తిరిగి పడుకుంటావు” (శూన్యగీతి) నేటి స్త్రీవాద కవయిత్రులు ఈ సమస్యను చాలా గట్టిగానే నిలదీస్తున్నారు. పురుషుల అలసత్వాన్ని, చిన్నచిన్నవే ఇంటి పనులైన వాటి పూర్తి బాధ్యతను స్త్రీ మీదికి నెట్టివేయటం లాంటివి ప్రతిఘటిస్తున్నారు. వాటికి తోడు భర్తలు ప్రతి ఒక్క పనికి భార్యలను బాధ్యుల్ని చేయడం, ఆ పని చెడిపోతే కోపగించుకోవడం వంటివి షరామామూలే. స్త్రీలపై చెలాయిస్తున్న ఆధిపత్య పోరును కవయిత్రి చాలా సున్నితంగానే ఖండించారు. అందుకే స్త్రీని ”భూమి” అని, పురుషుని ”ఆకాశం” అని అంటారు. అందులో భూమి ”భరణం”, ఆకాశం ”శూన్యం”. శూన్యానికి విలువ లేదేమో?!
తరాలు మారిన స్త్రీల తల మారని స్థితిని మరొక కవిత ”అప్పటినేను”లో కళ్లకు కట్టినట్లు తెలుపబడింది. సత్యకాలం (పాతకాలం) నుంచి నేటి వరకు ”ఊర్మిళ, యశోధర, చంద్రమతి, దమయంతి, శకుంతల, సావిత్రి” మొదలగు స్త్రీలు పడిన బాధలు, ఆవేదనలు లెక్కలేనివి. కేవలం వారి వారి భర్తల అదృష్టావమానాలకు లోనై కాలంతోనే పోరాడవలసి వచ్చింది. పైవారిలో కొందరు పరిస్థితులతో తలపడితే మరికొందరు యముడితో ఎదురీదారు. ఈ కవితలో కవయిత్రి కొంతవరకు పురుషుల మనసును మార్చడానికి ప్రయత్నించారు. స్త్రీ ప్రేమ ఎంత నిష్కల్మషమైందో వివరించారు. కాలాన్ని సైతం శాసించిన ఘటనలను వర్ణించారు. ఇలాంటి ధైర్యసాహసాలతో కూడిన మంచిని ఆచార్య సుమతి గారి కవితాపాదాల్లో దర్శించవచ్చు. ”నీవు సత్యవంతుడివే అయితే నేను సావిత్రినే! నీవు మనిషివే అయితే నీ మనసును నేనే!” భార్యాభర్తల మధ్య అన్యోన్య జీవనాన్ని ఆకాంక్షించారు.
స్త్రీ ఓర్పు, స్త్రీ సహనంతో పాటుగా స్త్రీ చైతన్యాన్ని, స్త్రీ శక్తిని ఉద్ఘాటించే కవిత ”స్త్రీ”. ఇందులో ప్రకృతిలోని ప్రతి వస్తువు స్త్రీకి ఆయువుపట్టుగా నిలిచాయి. మాటల ఈటెలను గుండెల్లో దింపుకొన్న పృథ్విగా, అగ్నిగోళాలను మింగేసిన జలధిగా, అనంత తరంగాలై లేచిన అంబరంగా, చెయ్యేస్తే కనెర్ర జేసి బూడిద చేసే అగ్నిగా, మంచిగంధాన్ని మోసే మారుతంగా స్త్రీని ప్రతిరూపింపజేశారు.  ”పాదరసం” అనే కవితలో ”పాదరసం నా బుద్ధి” అని, దాని అణచి ఉంచాలని చూస్తే ప్రజ్వలనం చూడవలసి వస్తుందని హెచ్చరించారు. పాదరసాన్ని అమృతంగా ఆస్వాదించమని హితవు పలికారు. ఈ కవితలో ఒక దృష్టాంతం కనిపిస్తుంది. స్త్రీని భూమిగా, పురుషుడిని సూర్యుడిగా చిత్రించడం. సూర్యుని చుట్టూ భూమి తిరగడం పరిపాటే అయినా, భూమికి గల గురుత్వాకర్షణ శక్తి ఎంత బలమైందో మనకు తెలుసు. స్త్రీకీ అంత శక్తి ఉంది. అందుకే ”కుటుంబానికి కేంద్రం స్త్రీయే” అని కవయిత్రి తన స్త్రీ అస్తిత్వాన్ని తెలిపే కవితల ద్వారా దృఢమైన ముద్ర వేశారు.
2. జీవిత ఛట్రం : అనంత ఆశల విషవలయం మానవ జీవిత ఛట్రం. చావుపుట్టుకలు గల జీవన సంద్రంలో, సాలెగూడు లాంటి ఆశల వలయంలో చిక్కుకొన్న మానవుడు ఒక జీవచ్ఛవంగా బతుకుతున్నాడు. అనాదిగా మానవుడు అశాంతితోమృత్యువు విలాసగృహంలో అవిశ్రాంతంగా జీవనం సాగిస్తున్నాడు. ఇటువంటి జీవితానుభవం కలిగిన కవితలు అనేకం ఇందులో ఉన్నాయి. చచ్చి బతికే మానవుని ”చిరంజీవి”గా ప్రకటిస్తూ కవయిత్రి ఆశల స్వరూపాన్ని క్రింది విధంగా వర్ణించారు.
”భూమి కంపించినా/ఆకాశం హుంకరించినా/అగ్ని అణువణువూ కాల్చినా/గాలి కబళింప చూసినా/ఆశనే అమృతంగా తాగి/చచ్చి బతుకుతున్నాడు/చిరంజీవి మానవుడు!”  (చిరంజీవి)
తల్లిదండ్రుల బాధ్యతను గాలికి వదిలేసి, కేవలం తమ స్వార్థం కోసం జీవనం సాగించే పిల్లల వైఖరిని ”గువ్వలు రెండు” అనే కవితలో దుయ్యబట్టారు. నేటి సమాజానికి పూర్తిగా అద్దం పట్టే జీవనశైలి ఇందులో ద్యోతకమౌతుంది. జడివానలకు, భూకంపాలకు, తుఫానులకు, వరదలకు గూడు చెదరకుండా, తమ రెక్కలనే అడ్డుగపెట్టి ఇంకా కళ్ళు తెరవని పసిగుడ్లని కాపాడిన గువ్వల జంటను కళ్లు తెరచి, రెక్కలొచ్చిన తర్వాత గూడును దాటి ముసలి గువ్వలను వదిలి పచ్చని లోకాలకు ఎగిరిపోయిన గువ్వపిల్లలను అత్యంత దయనీయంగా హృదయవిదారకంగా చిత్రించబడింది. నేటి మానవులకు గువ్వపిట్లను ఉపమానాలుగా స్వీకరించిన కవయిత్రి విదేశీ వ్యామోహంతో పడిపోతున్న యువతకు తమ బాధ్యతను గుర్తుచేశారు. మానవవిలువలు పూర్తిగా మంట కలిసిపోతున్న నేటి సమాజానికి ఈ కవిత కనువిప్పును కలిగిస్తుందేమో?!
జీవితంలో ఒంటరితనం భయంకరమైంది. భరించలేనిది. అయితే ఆ ఒంటరితనం నుంచి బయటపడితే మానవుడు మళ్లీ ఆశల వలయంలో చిక్కుకొంటాడు. మంచి శిల్పనైపుణ్యానికి తార్కాణంగా నిలిచే ”జీవన సాగరం” అనే కవితలో ఆశల అలలు చెలియలి కట్టను దాటలేక తటపటాయిస్తున్న వైనాన్ని తిలకించవచ్చు. బాల్యపు గుండెను నలిపేసి అతికర్కశంగా జీవితానికి కొత్త అర్థాన్ని చెప్పుకొంటున్నాం. అశాంతి ఛాయలో కళ్ళు మూసుకొన్నా పట్టని నిద్రకు బానిసై, పట్టు దొరకని శాంతికై పరుగులు తీస్తున్నాం. మనిషి జీవితం ఆశల కలలకు ఒక సుదూర బంధువనే భావన ఈ కవితను పరిశీలిస్తే తెలుస్తుంది.
జీవితం కాలంతో ముడిపడి ఉంటుంది. కాలానికి మానవుని ఆలోచనలకు సమభావనను వ్యక్తం చేస్తూ ”కాలానికి కళ్లెమా?!” అనే కవితను రచించారు. ”కాలం ఆగిపోవాలని కోరుకొంటే/అది దురాశ/కాలం పరుగెత్తుతుందని ఏడిస్తే/అది ఆశ” అంటూ కవయిత్రి కాలాన్ని బంధించడం, ధిక్కరించడం, జయించడం వంటివి సాధ్యం కాదని తేటతెల్లచేశారు. అందుకే కాలాన్ని ఎదురించడం, కాలానికి ఎదురీదడం వ్యర్థమని ఉపదేశించారు. యదార్థమైన జీవన సత్యం ఈ కవితలో బహిర్గతంగానే ప్రదర్శింపబడింది.
జీవితాన్ని పునర్నిర్మించుకొనే ఒక ఆలోచనలో వెలసిన కవిత ”కాబట్టి”. స్థిరత్వం లేని ఆలోచనల మధ్య, కష్టసుఖాల కడకండ్ల మధ్య, ఆశనిరాశల అలల ఒడుదొడుకుల మధ్య అణగారిపోతున్న జీవనశైలికి సూచనప్రాయమైన సలహాలను అందివ్వడం ఈ కవితలో గమనించవచ్చు. ”జీవించడమే జీవిత పరమార్థం” అని నిర్ధారిస్తూ, జీవితానికి ”సముద్రం, ప్రభంజనం, ప్రవాహం, ప్రహేళిక, అరణ్యం, క్రీడ, స్వప్నం” వంటి అబేధక రూపకాలను ఉత్ప్రేక్షించారు. బింబ ప్రతిబింబ సాదృశ్యాన్ని దృష్టాంతరీకరించి, జీవితానికి ప్రవేశపెట్టిన రూపక వస్తువుల పట్టు తప్పినట్లైతే జరిగే అనర్థాలు ఎటువంటివో కూలంకషంగా అంత్యప్రాసక్రియలను ఉపయోగించి వర్ణించారు. అర్థ శబ్దాలంకారాలను ఒకే కవితలో వినసొంపైన శైలిలో జీవిత పరమార్థాన్ని ఉద్ఘాటించారు.
”జీవితం ఒక సముద్రం/ఈదడం చేతకాకపోతే మునిగిపోతావ్‌/జీవితం ఒక ప్రభంజనం/నిలదొక్కుకోకపోతే తేలిపోతావ్‌”  (కాబట్టి)
3. కన్నీటి జలం : కన్నీటికి యుగయుగాల చరిత్ర  ఉంది. అది స్త్రీ విషయంలో ఇంకా భూమ్యాకాశాలను ఒకటిగా నిరంతర ధారగా నిలిచి ఉంటుంది. కన్నీళ్లు ఒక్కోసారి మధురరసాన్ని నింపుకొంటాయి. విషాదాన్ని తుడిచేస్తాయి. హృదయభాషను ఆవిష్కరిస్తాయి. కన్నీళ్ల ప్రతిభాషయే కవిత్వం. కన్నీటినే కవితా ఊపిరిగా స్వీకరించిన కవయిత్రి ఈ ధోరణిలో అనేక కవితలు రచించారు. కన్నీటి జలంగా కాక ”హృదయ జలం”గా చిత్రించిన కవితలోని భావమిది. కన్నీటి నీళ్ళు ఉప్పగా ఉన్నా, కన్నీటి చెలిమి చాలా వెచ్చగా ఉంటుందంటారు సుమతిగారు. ఈ భూమి మీద ఎంత అరాచకం జరుగుతున్నా కన్నీళ్లు రాల్చని కర్కశత్వం నేటి తరంలో కనిపిస్తుంది. ఇలాంటి వారిలో ”స్వార్థం, నిర్లిప్తత, విభ్రాంతి” అనేవి పూర్తిగా ముద్రపడిపోయాయి. అందుకే వారి ”కళ్లలోనే కాదు, గుండెలోనూ తడిలేదు” అని  ”ఒక ఎడారి మేటలు వేసింది” అని నిర్మొహమాటంగా విశ్లేషించారు.        4. మానవీయ స్పర్శ : నేటి నాగరిక సమాజంలో మానవీయ స్పర్శ ఏ స్థితిలో ఉందో సుమతి గారి కవితలో దర్శనమౌతుంది. మానవ విలువల మధ్య వస్తున్న వైరుధ్యం ”నాగరికత” అనే కవితలో తెలుపబడింది. నాగరికత ధర్మాన్ని కవయిత్రి క్రింది విధంగా చిత్రించారు. మానవ సంబంధాలు కుంటుబడిపోతున్న స్థితిని వర్ణించారు.
”నాలుగు చక్రాల మీద పరుగులు పెడుతోంది/మూడు కాళ్ల మీద ముందుకెళ్తుంది/రెండు కాళ్ల మీద రెక్క విప్పుతుంది”  (నాగరికత)
ఇలాంటి జీవన విధానంలో ఆర్థికసూత్రాల మధ్య ఆర్ద్రత కరువైపోతున్న వైఖరిని కవయిత్రి తన కవిత్వంలో దుయ్యబట్టారు. అందుకే ”ఆర్థిక ప్రాతిపదిక మీద హార్దిక తేజస్సులు మాడిపోయే తరుణం”లో కవయిత్రి కేవలం కవిత్వంతోనే మాట్లాడుతానని ”నాభాష” అనే కవితలో పేర్కొన్నారు. తల్లిప్రేమను తండ్రి లాలనను కిలోల లెక్కల తూచే నేటి రోజులను చాలా ఘాటుగానే ఖండించారు.
మనిషిని మనిషిగా చూడటం కవయిత్రి లక్షణం. మనిషికి గల మానవత్వాన్ని పెంపొందింపజేయడం ఆమె కవితా లక్షణం. తద్వారా మనస్సమాజాన్ని స్థాపించడం ఆమె జీవిత లక్ష్యం. అందుకే సుమతిగారు ఇలా అంటారు. ”నేను మనిషిని నమ్ముతాను. మనిషితనాన్ని ప్రేమిస్తాను.” (మళ్లీ మళ్లీ) మానవత్వం అపురూపమైంది. అది అందని చందమామగా, ఒదగని వెన్నెలగా అలంకరింపబడింది. అటువంటి మానవత్వాన్ని సమాధి చేయవద్దని తన కవిత ద్వారా కవయిత్రి విజ్ఞప్తి చేశారు.
5. ప్రకృతి పరవశం : ప్రకృతికి మానవునికి విడదీయరాని బంధం ఉంది. మనోహరమైన ప్రకృతి దృశ్యాలు ”మొలకెత్తిన అక్షరం”లో ప్రదర్శితమౌతాయి. నింగికి నేలకు మధ్య జరిగిన ఒక అవినాభావ దృశ్యం ”సంగమం” కవితలో కన్పిస్తుంది. నింగి నేలను చేరుకోవాలని  నేల నింగిని అందుకోవాలని పడే ఘర్షణలో ఒకరి కోసం మరొకరి యాతన అద్భుతంగా చూపబడింది. ప్రకృతి అందచందాలను మనోహరంగా వర్ణిస్తూనే వాటి సంగమాన్ని మన కళ్ళ ముందుంచింది. ఆకాశం తన చేతులతో వంతెన కట్టి, ముంగురులతో నల్లమబ్బులను వేలాడదీసి భూమిని చేరుకోవడానికి ప్రయత్నిస్తే, భూమి తన గుండెల్లోనుంచి కొండలను కక్కి, తన కొమ్మలను ఆకాశంవైపు సాచి అందుకోవాలని ఆరాటపడినట్లుగా ఈ కవితలో ఆచార్య సుమతి గారు తెలిపారు. నేటి ప్రేయసీప్రియుల సంగమాన్ని అభిలషించే విధానం ఇందులో కన్పిస్తుంది.
‘ప్రకృతి తన పని తాను చేసుకొనిపోతుంది’ అనడానికి చక్కని ఉదాహరణ ”అదంతేనా?” అనే కవిత. నిరంతర గమనంలో, నిత్య సంఘర్షణంలో చెలియలికట్ట దాటలేని కెరటాల లాగా, సమాజాన్ని కాదనలేని మనుషులు అందులోనే అల్లల్లాడుతారు. ఈ ప్రకృతి బంధం ఎన్నటికీ మారదు. ”అధికారాంతమునందు” అనే కవితలో చెట్టు, దానిపై పక్షులను గూర్చి ఉంది. నేటి రాజకీయ పరిస్థితులను అద్దం పట్టినట్లు వర్ణిస్తుంది. పక్షులు ఆశ్రయించిన చెట్టు అధికారప్షంలాగా రాజకీయ నాయకుడికి ప్రతిబింబంగా ఉంది. కాని ప్రకృతి ప్రళయానికి పెనుగాలి వీచి కూకటివేళ్లతో కిందపడిపోతే ఆశ్రితమైన పక్షిసైన్యం తమ దారి తాము చూసుకొంది. పట్టుచెడిన చెట్టు కూలినట్లు అధికార దర్పం కూడా తునాతునకలు అయిన వైఖరి ఇందులో తెలుస్తుంది.
తొలకరి వర్షానికి గుబాళించే మట్టి వాసన ఎంత మధురంగా ఉంటుందో ఆస్వాదిస్తే గానీ తెలియదు. ”మట్టిలోనే” కవితలో మట్టిలో పుట్టిన మొక్కలను, మట్టినుంచి రేగే దుమ్ము, మట్టితో కలిసిన బురద ఇవన్నీ శాంతినిస్తాయని కవయిత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య సుమతిగారు ఒక జీవితసత్యాన్ని ప్రకృతితో ముడివేశారు. మట్టి అంటే నాకిష్టం అంటూనే –
”మట్టిలోనే పుట్టాను/మట్టిగానే మారిపోతాను”  (మట్టిలోనే)
అందుకే ఈ మట్టిని దూరం చేయకండి అని ప్రాధేయ పడుతున్నారు.
ప్రకృతి చిత్రణలో ”నయాగరా” జలపాతం కూడా చోటు చేసుకుంది. నయాగరాను అభ్ర గంగావతరణంగా కీర్తించడం కేవలం సుమతి గారికి దక్కింది. మైమరిపించే జలవిద్యుత్కాంతులతో అంబరాన్ని చుంబిస్తుంది. నయాగరా తుంపర్లు అక్షరాలుగా రాలి కవిత నిర్మాణానికి అనువైంది. అందానికే ఆనందాన్ని సూచించే సౌందర్యం ఇది.
ప్రతి కవి తన కవితలో సూర్యచంద్రులకు స్థానమిస్తారు. కవికి రవికి అన్యోన్య సంబంధం ఉంది. కవికి చంద్రునికి ఆప్యాయత అనుబంధం ఉంది. తూరుపుకొండల నుంచి మెల్లమెల్లగా పైకి వచ్చే సూర్యబింబం ప్రచండమైన ఉజ్జ్వలాన్ని వెలిగిస్తుంది. కవయిత్రి తన అక్షర అందాల్లో ప్రకృతిని పలకరించి పులకరింపజేసే సూర్యబింబాన్ని అత్యద్భుతంగా చిత్రించారు.
విషాదానందాలు జీవన నాణేనికి ఇరు పార్శ్వాలు. వెలుగునీడల జీవన చిత్రంలో విషాదాలు ఆనందాలు సమభాగాలు. మానవ జీవితం సుఖదుఃఖాల సమాహారం. సుఖం వెనుక దుఃఖం, నవ్వు వెనుక బాధ ఎల్లప్పుడూ నిలిచే ఉంటాయి. కారుమబ్బులు, ఉరుములు, పిడుగులు లాంటి జీవితంలో అప్పుడప్పుడు మెరుపులు కాంతిపుంజాన్ని వెలిగింపజేస్తాయి. అందుకే ప్రకృతికి పూర్తిగా బద్ధమైన జీవితాన్ని కవయిత్రి  వర్ణిస్తుంది.
ప్రకృతిని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది. ప్రకృతిని ఆరాధించే కవయిత్రి ”వికృతి” కవిత రచించారు. ప్రకృతికి విఘాతం కలిగించే మానవునికి ఈ కవిత ఒక చక్కని గుణపాఠం. పచ్చని ప్రకృతిని కనుమరుగు చేసి గాలికి, నీటికి, నీడకు, తిండికి కొరత కలిగించే పరిస్థితులను తీవ్రంగా ఖండించారు.
గాలి సవ్వడి హృదయాంతరాలను ఉత్తేజపరుస్తుంది. ఊపిరి ప్రాణాధారమై శక్తిని అందిస్తుంది. పరిమళించే గుబాళింపును మోసుకొచ్చే సుగంధ వాహకం గాలి. రూపంలేని, పరిమితిలేని గాలి ప్రభావాన్ని బంధించే శక్తి ఎవరికీ లేదు. మనుషుల్లో అనేక రకాల వాళ్లు ఉండవచ్చు. కాని వాళ్లందరిని ఏకం చేసి, తారతమ్యతను పాటించని గాలికి కులమత అంతరాలు లేవు. గాలికి గల స్వచ్ఛమైన సామర్థ్యాన్ని వర్ణిస్తూ కవయిత్రి ”గాలికబుర్లు” చెప్పారు.
ప్రకృతి రమణీయతలో ”ఋతువర్ణన”కు అధిక ప్రాధాన్యత ఉంది. ఆచార్య సుమతి గారు ఋతువులన్నింటిని ఒకే చోట సమావేశపరిచారు. దీనిని అలీన దేశాల సమావేశంగా వర్ణిస్తూ నేటి ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు, అగ్రరాజ్య ఆంక్షలకు, ప్రజాస్వామ్య సూత్రాలకు సమన్వయం చేస్తూ ఋతువుల ఆగమనాన్ని కాంక్షించారు. తాపంతో చిందులేసిన గ్రీష్మం, గ్రీష్మతాపానికి తలొగ్గిన వసంతం, అతివృష్టి అనావృష్టులతో ముంచెత్తిన వర్షఋతువు బడుగుదేశపు ప్రతినిధిగా ఒదిగిన శరదృతువు, ప్రజాస్వామ్యాన్ని వణికిస్తూ విచ్చేసిన శిశిరహేమంతాలు ఈ కవితలో అందంగా రూపుదిద్దుకొన్నాయి.
6. కాలం పరిణామ క్రమం : కాలంతోపాటు మానవుని ఆలోచనలో మార్పులు సంభవిస్తున్నాయి. కాలం గడిచినా కొద్ది వయసులోనే కాదు తరంలో కూడా మార్పు వస్తుంది. పాత తరానికి నేటి తరానికి గల తేడా ఎలాంటిదో ”తాజాదనం” అనే కవితలో తెలుస్తుంది.
కాలం కరిగిపోయిన బాల్యపు స్మృతులు అనుక్షణం గుర్తొస్తూనే ఉంటాయి. అనేక సంవత్సరాలు జీవితంలో సుదూర ప్రయాణం చేసిన తర్వాత మళ్లీ బాల్యపు ఛాయల్లోకి ఒక్కసారి వెళ్లాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఇలాంటి మధురానుభూతిని కవయిత్రి కూడా కలిగి ఉండటం సహజం. ”కోయి లౌటాదె” అనే కవితలో సుమతిగారి అభిలాష ద్యోతకమౌతుంది. బాల్యం ఒక అనుభూతి ప్రపంచం. ”అమ్మ ఒడిలోకి, వీధి బడిలోకి/బండెడు పుస్తకాలను భుజాన మోస్తూ/ఆ బారెడు దూరం నడవాలని ఉంది” అని బాల్యాన్ని వెతుక్కొంటూ వెళ్లే ప్రయత్నం కవయిత్రి చేశారు. పాఠశాలకు వెళ్లాలని, పాఠాలు వినాలని, ట్రాన్సిస్టర్‌లో బినాకాగీత్‌మాల వినాలని, చిల్లర డబ్బులు జమ చేయాలని ఉందంటూ చెప్పిన కవిత్వంలో కవయిత్రి చిన్ననాటి అలవాట్లను, ఆమెకు వివిధ విషయాల మీద అభిలాషను తెలుసుకోవచ్చు.
కాలానికి కళ్లెం వేయటం ఎవరివల్ల కాదు. విధిని తప్పించు కోవడం అసాధ్యం. కాలపు పరుగుపందెంలో మనుషుల దురాశ, నిరాశలు విజృంభిస్తున్నాయి. ”కాలానికి కళ్లెమా?” అనే కవితలో ”కాలాన్ని బంధించడం, ధిక్కరించడం, త్వరపెట్టడం సాధ్యమా?” అంటూ అగాధ సందేహాన్ని వెలిబుచ్చారు. కాలాన్ని ఎదిరించాలని అనుకోవడం, ఎదురీదాలని కోరుకోవడం కేవలం వ్యర్థప్రయత్నమే అవుతుందని కవయిత్రి ఈ కవితలో కాలప్రభావాన్ని వర్ణించారు.
7. సమాజోద్ధరణ : ఒక్కో యుగంలో చెడుమార్గం పట్టిన సమాజాన్ని సంస్కరించడానికి యుగపురుషులు పుట్టుకొస్తుంటారు. న్యాయం ధర్మం తప్పిన సమాజాన్ని సత్యవంతం చేస్తారు. కవయిత్రి సుమతిగారు కూడా నేటి సమాజపు నడవడికను చూడలేక అవినీతిని తుడిచివేసే నాథుడొకడు రావాలని ”ఎదురుచూపు” అనే కవితలో ఆశించారు.
సమాజపు కట్టుబాట్లలో నడిచేవారికి శ్రమ విలువ తప్పక తెలుస్తుంది. అక్రమంగా వాటిని అతిక్రమించిన వారికి భోగసుఖాలు తప్ప మరేమీ అనుభవంలోకి రావు. కవయిత్రి ”అజ్ఞానం” అనే కవితలో కష్టాలకు ఎదురీది పోరాడుతేనే జీవితం విలువ తెలుస్తుందంటారు. నిజాయితీ శక్తిని, మౌనం విలువను, అనాథల దుస్థితిని తన కవిత్వం ద్వారా చాటిచెప్పారు. వాటి వాటి సామర్ధ్యాలను, విలువలను తెలుసుకోవాలని సూచించారు.
సమాజంలోని ప్రతి ఒకరు ఏదో ఒక ఆశయంతో, ఆదర్శంతో నిలిచి ఉంటారు. సహనం, సహకారం, మంచితనం, మమకారం, ప్రణయం, పరోపకారం, సౌశీల్యం, శాంతి వంటి మేలుజాతి గుణాలు సమాజంలోని ప్రతి ఒక్కరి హృదయక్షేత్రంలో నిక్షిప్తం కావాలని ”ఆదర్శం” అనే కవితలో సుమతిగారు కోరుకొన్నారు. కష్టాల అనుభవసారం తెలుసుకొన్నప్పుడే జీవన ఫలితాల్ని పొందుతాం. నిర్విరామంగా కృషి చేస్తుంటే విజయశిఖరాలు అధిరోహిస్తాం.
ప్రతి ఒక్కరికి కలలు కనే అవకాశం ఉంది. కలలు కంటూ ఉంటారు. కలల సామ్రాజ్యపు వినిర్మాణం జరగాలని కోరుకొనే కవిత ”కలలే”. ఇందులో కలలు కంటూ సాకారం చేసుకోవాలని ఉద్బోధ చేశారు.
”మంటల్లో మానవుడు” అనే కవితలో మనిషి మార్పుకు అనుగుణమైన సమాజాన్ని ఆకాంక్షించారు. ‘కులమతాల విద్వేషం ఒద్దు. సమసమాజ నిర్మాణం ముద్దు’ అనే నినాదం ఆమె కవితల్లో అంతర్లీనంగా ప్రతిధ్వనిస్తుంది. ఈర్షాద్వేషాలు వదిలి ఒకరినొకరు స్నేహభావాన్ని పెంపొందించుకోవాలని ఆశించారు.
పల్లెలన్నీ నగరాలై పోతున్న సమయంలో పల్లెల్లో కనిపించే అందచందాలు అదృశ్యమౌతున్నాయి. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే పల్లెలను పిప్పిచేసి వాటి సారాన్ని ఆస్వాదం అనుభవించే నగరాల వైభోగం ”నగరం” అనే కవితలో తెలుస్తుంది. నగరాలనే అభివృద్ధి చేస్తూ పల్లె గోడును పట్టించుకోని అధికార యంత్రాంగం పల్లెల కుంటుబాటుతనానికి ముందంజలో ఉంది. కులవృత్తులను కాలరాసి, రైతుల వెన్నెముక విరిచి, ప్రకృతిని విధ్వంసం చేసి నగరాలు రాజవైభోగాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాయి. అసమాన సమాజ పరిస్థితులను కవయిత్రి తన కవితల్లో చాలా తీవ్రంగానే ఖండించారు.
పై సమాజ పరిస్థితులకు మూగసాక్షిగా నిలిచింది ”కుర్చీ”. కుటిల రాజకీయాలను మోయలేక విరిగిపడుతున్న కుర్చీ దుస్థితిని ఈ కవిత ప్రతిబింబింపజేస్తుంది. ఎన్నో రహస్యాలకు, ఎన్నో అకృత్యాలకు, ఎంతో నిరంకుశత్వానికి బలి అయిపోయింది. ఒకనాడు రాజసాన్ని ఒలకబోసిన కుర్చీ నేడు మూగసాక్షిగా నిలిచిపోయింది. మరో కవిత ”ఆనాడు”లో స్వార్థభావన సమాజాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తుందో తెలుపబడింది. మరి మానవ సమాజం మమతానురాగంలో వృద్ధి పొందాలంటే స్వార్ధభావనను, నిరాశ నిస్పృహల్ని పూర్తిగా తుడిచేయాలి. సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న రాజకీయ నాయకుల అసలు రంగును ఆవిష్కరించారు సుమతిగారు. వాటి మోసపూరిత పరత్వాన్ని, దశకంఠాల్ని వికృతంగా వర్ణించారు. వారి పులి పంజాలాంటి చేతుల్లో ఇరుక్కోకూడదని అమాయక ప్రజలకు తగు సూచనలిస్తున్నారు.
8. స్నేహశీలం : స్నేహానికి ఆహ్వానం పలికే కవిత ”మొలకెత్తిన అక్షరం”లో దర్శనమౌతుంది. స్నేహమనెడిది సింధువులాంటిది. అందులోని బిందువులన్నీ ప్రేమానురాగాల్ని చిందిస్తాయి. సింధువుకు బిందువుకు మధ్యగల స్నేహబంధాన్ని ”ఆహ్వానం” కవితలో తెలుస్తుంది. అలల వంటి స్వచ్ఛమైన మైత్రీబంధాన్ని పెంపొందింపజేసే కవిత ‘అలలు’. అలలు పాతనేస్తాల వంటివారితో నవ్వుతూ తుళ్లుతూ ఉంటాయని కవయిత్రి మంచి భావనను ప్రవేశపెట్టారు.
9. స్మృతిభావన : ఆచార్య సుమతిగారు తన గ్రంథంలో స్మృతి చిహ్నమైన కొన్ని కవితలను రచించారు. అందులో జిక్కి, తిలక్‌ వంటి విభిన్న రంగాల్లోని మహోన్నత వ్యక్తుల్ని గూర్చి స్మృతి కవితలను రచించారు. ఆమె విదేశీ పర్యటనలో తారసపడ్డ అత్యద్భుత ప్రకృతిదృశ్యాలకు తాదాత్మ్యం చెంది నయాగరా, న్యూయార్క్‌ వంటి వాటిని వర్ణించారు.
జిక్కి స్వరాలాపనలో పరవశించిన మనం, ఆమె మరణానంతరం స్మృత్యర్థ నామాంతరాలలో జిక్కిని స్మరించడం కవయిత్రి గారి ”జిక్కికోసం” అనే కవితలో కనిపిస్తుంది. ఆమె పాడిన మధురమైన పాటలను ఆమె జీవితానికి అనుబంధంగా చేర్చడం క్రింది పాదాల్లో తెలుస్తుంది. ”జీవితమే సఫలమనిపించావు/  రాగసుధాభరిత మనిపించావు”  (జిక్కికోసం…)
”మరోసారి తిలక్‌” ఈ లోకానికి రావాలని, సమాజ మార్పుకు తానొక సైనికుడు కావాలని ఆశించే కవిత ఇది. దేశాన్ని రక్షించే బాధ్యతను స్వీకరించాలని కవయిత్రి కోరారు. రాజకీయ నాయకుల అబద్ధపు వాగ్దానాల నుంచి, కల్తీ సరుకులమ్మే కుబేరుల నుంచి, నడిబజారులో వేలంవేసే న్యాయవాదుల నుంచి, కూలే వంతెనలు కట్టే కాంట్రాక్టర్ల నుంచి ఈ సమాజాన్ని సంస్కరించాలని తన ప్రాధేయవినతిగా పేర్కొన్నారు.
10. విరహగీతిక : కవయిత్రి విరహగీతికలను తన కవిత్వంలో ప్రవేశపెట్టారు. విరహం ప్రేమ భావనను అధికం చేస్తుంది. అమలిన ప్రేమతత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించిన కవితల్లో ”ఇలా నేను, ద్వైదీభావం, నీ ప్రేమ, సాత్విక పోరాటం, నిరీక్షణ, నేసం!” అనేవి అత్యంత ప్రాధాన్యత వహిస్తాయి.
”నీ విరహం నన్ను అగ్నిపునీతను చేసింది/నీ వియోగం నా కళ్లను కొలనులుగా మార్చింది/నిన్ను విడిచి ఉండలేని మొండిశిలనైనాను నేను/నీ ప్రేమ శిలను ద్రవంలా కరిగించి వేసింది”  (నీ ప్రేమ) ఇది ప్రేమికురాలి విరహగీతిక. స్త్రీయే ప్రేమమూర్తిగా మారి స్వచ్ఛమైన ప్రేమకు ఆలంబనగా నిలవడం గొప్ప అనుభూతి. ప్రేమికుల మధ్య నిశ్శబ్దాన్ని ఎవరూ అంగీకరించరు. అందుకే ప్రేమ కోసమే బతికే ప్రేయసికి కలిగిన ఎడబాటును ”సాత్విక పోరాటం”లో దర్శింపవచ్చు. తాను చేసే ప్రతి చర్య తన ప్రియుని కోసమేనని పరితపించే ఆరాటం కనిపిస్తుంది.
11. నైరాశ్య జీవనం : నైరాశ్య భావనలోని కవితలు ”రెండూకాదు, ఇదే మేలు”. ఈ జీవితమే ఒక వైకుంఠపాళిగా ”రెండూకాదు” అనే కవితలో చిత్రించారు. జీవితంలోని వెలుగునీడలు, సుఖదుఃఖాలు, చావుబ్రతుకులు కేళీవిలాసాలు.
అసంతృప్తి…, అసంతృప్తి నుంచి నిర్వేదం…, నిర్వేదం నుంచి నైరాశ్యం…! ఇవి అంత్యజీవన ప్రతిఫలనాలు. ప్రతి ఒక్కరు జీవితపు చివరి క్షణాల్లో ఈ భావనకు లోనుకావడం తప్పదు. అనిర్వచనీయమైన నైరాశ్యానికి ”ఒక మర్రిచెట్టు”ను ధ్వన్యర్థానికి ప్రతీకగా నిలిపారు. అసంతృప్తి నుంచి చిన్నదైన ఫలితాన్ని కూడా గొప్పగా ఆస్వాదించాలని కవయిత్రి సూచించారు. తద్వారా నైరాశ్యం నుంచి కొంత వైదొలగే అవకాశం ఉంటుందని భావించవచ్చు.
పూర్వకాలంనుంచి కావ్యాన్ని కన్యకగా భావించిన కవులున్నారు. కాని కవయిత్రి ఆచార్య సుమతిగారు కవిత్వాన్ని ప్రియునిగా పలకరించి ఒద్దికగా తన వద్ద చేర్చుకొన్నారు. ఆర్తీ, ఆవేదన, ఆత్మ సంవేదన, జీవన తాత్వికత, భావుకత, శబ్ద పటష్టత, స్త్రీ సామర్ధ్యతతో పాటు దేశీయ స్ఫూర్తిని ప్రదర్శించారు.
”ఈ మట్టిని దూరం చేయకండి/దీన్ని మరిచిపోతే
నా తల్లి, నా ఇల్లు, నా దేశం అంటూ….
మట్టి వాసన/మల్లెల కన్నా, మొల్లల కన్నా బాగుంది”  (మట్టిలోనే)
మాతృభూమిపై మమకారం కలిగిన కవయిత్రి ఆచార్య సుమతిగారు తన ”మొలకెత్తిన అక్షరం”లో దేశీయతకు ప్రతిబింబంగా నిలిచారనడంలో అతిశయోక్తి లేదు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో