విరబూయని జీవితాలు-విసిరేసిన మందారాలు

– డా. కె. పద్మ, ఎన్. అలివేలుమంగ

ఆడపిల్లే ఇంటికి వెలుగు-వీధిబాలికల జీవితాలలో వెన్నెల విరబూయిద్దాం

కాజీపేట్ రైల్వేజంక్షన్లో ఉదయం 8.30 ని||కు కృష్ణా ఎక్స్ప్రెస్ భాగ్యనగరం నుండి వచ్చి ఆగింది. అందులో నుంచి ప్రయాణీకులతోపాటు కొంతమంది బాలికలు చేతిలో వేరుశెనగకాయలు అమ్మే బుట్టలతో రైలు నుండి గుంపుగా క్రిందికి దిగి నడిచివస్తున్నారు.

వీరంతా ఎవరు? ఎటువైపు వెళ్తున్నారు? ఏమి చేస్తారు? గమనించాలి అనే ఆసక్తి మాకు పెరిగింది. మెల్లగా రైలుకూతవేస్తూ కదిలి వెళ్ళిపోయిన తరువాత వారిదగ్గరకు వెళ్ళి వారి పేర్లు అడిగి తెలుసుకొన్నాము. రమణి, రజిత, సరిత, అమ్మణ్ణి అనే పేర్లు గల నలుగురు బాలికల (వీధిపిల్లలు)ను అనుసరించి వారిని సంభాషణలోకి దింపి అనేక విషయాలను తెలుసుకొన్నాము. వీరిలో ఒకరైన సరితతో ముచ్చటించగా, ఆమె తల్లిదండ్రులు సరితను బలవంతంగా ధనార్జనకోసం ఇంటినుండి బయటకి పంపివేసినట్లు చెప్పింది. 7 సం||ల వయస్సుగల సరిత మనస్సులో ఏదో తెలియని భయంతో రైల్వే ప్లాట్ఫామ్పైన అడుగు పెట్టినట్లు, వచ్చే రైలు వెళ్ళేరైలు చూస్తూ తనలాంటి పిల్లలు కనిపించడంతో వారితో స్నేహం పెంచుకొని వేరే దారిలేక ఆపిల్లలను అనుకరిస్తూ ఆకలితీర్చుకోడంకోసం తనుకూడా వేరుశనగకాయలబుట్టను తీసుకొని అమ్మడం ప్రారంభించినట్లు చెప్పింది. ఆవిధంగా వచ్చిన ఆదాయాన్ని ఇంటికి తీసుకొనివెళ్ళి తల్లికి ఇచ్చేది. ఇంకా తీరిక లభిస్తే రైల్వేప్లాట్ఫాంపైన తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ తన జీవితాన్ని వెళ్ళతీస్తున్నది. ఈ పసిమొగ్గ అయిన సరిత.
వీధిపిల్లలు (బాలికలు) అనగా ఎవరు?

ఎన్.ఎస్. మణిహర ప్రకారం వీధిపిల్లలు అనగా కుటుంబంలో అతిగా విధించే ఆంక్షలు, కుటుంబకలహాలవలన కలిగే శారీరక, మానసిక హింసను భరించలేక చాలా మంది బాలికలు పగలంతా ఇల్లువిడిచిపెట్టి ఎక్కువకాలం రోడ్డుపైన గడుపుతూ రాత్రి నిద్రపోవడానికి మాత్రమే ఇంటికి చేరతారు. ఇటువంటి పిల్లలను వీధిబాలికలుగా గుర్తించడం జరిగింది.

వివిధ రైల్వేస్టేషన్లను, బస్స్టేషన్లను డాన్బాస్కో, న్యూహోప్ వంటి స్వచ్ఛంద సంస్థలను సందర్శించి దాదాపు 50 మంది వీధిబాలికలపైన సర్వే నిర్వహించి వారి ఆర్థిక, సాంఘిక, ఆరోగ్య పరిస్థితులపై పరిశీలన జరిపినప్పుడు అనేక విషయాలు వెల్లడి అయినాయి. వీధిబాలికలుకావడానికి కారణాలు అన్వేషిస్తే రెండు రకాలుగా విభజించవచ్చు.
1) ఆర్థిక కారణాలు.
2) సాంఘిక కారణాలు.

ఆర్థిక కారణాలు:
ఎ) తల్లిదండ్రుల పేదరికం.
బి) అనారోగ్యంతో బాధపడే తల్లిదండ్రులను పోషించేబాధ్యత పిల్లల పైనవుండటం.
ఇ) అతి చిన్న వయస్సులోనే వీధిబాలికలను డబ్బులకోసం వ్యభిచారిణు లుగా మార్చడం మూలంగా నానాటికి వీధిబాలికల సంఖ్య పెరిగి పోతున్నది.

వీరు ఆకలి తీర్చుకోవడానికి రోజువారి చిన్న చిన్న కూలిపనులు చేస్తూ ఉంటారు.
ఉదా:-
1) పూలు, వేరుశెనగ, బటాణీలు అమ్మడం.
2) బిక్షమెత్తుకోవడం.
3) చిత్తుకాగితాలను రోడ్లపైన ఏరుకోవడం లాంటి చిన్న చిన్న పనులతో రోజుకి 20/- నుండి 30/-రూ|| సంపాదిస్తూ ఉంటారు. ఆవచ్చిన ఆదాయాన్ని తల్లిదండ్రులకు ఇచ్చి వేస్తారు.
4) అతి సులభమైన ధనార్జనమార్గంగా ఆడపిల్లలను వ్యభిచారగృహాలకు ఎక్కువగా అమ్మివేస్తున్నారు. భారతదేశంలో ఐ.ఎల్.ఓ. రిపోర్టు ప్రకారం 2.3 మిలియన్ల వ్యభిచారిణు లుగా పిల్లలేవున్నట్లు వీరంతా11-15 సం||ల వయస్సు కలిగి ఉన్నట్లు వారిలో వీధిబాలికలు ఎక్కువగా వున్నట్లు తెలియచేస్తున్నాయి.

సాంఘిక కారణాలు:-
1) కుటుంబంలో పిల్లలపై జరిగే శారీరక, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఇల్లు విడిచిపెట్టి పారిపోయి వీధిబాలికలుగా మారిపోతున్నారు.
2) తల్లిదండ్రులకువున్న చెడు వ్యసనాలను పిల్లలు నేర్చుకొని వాటిని నెరవేర్చుకోవడం కోసం ఇల్లు వదిలిపెడుతున్నారు.
3) యుద్ధం వివిధ ప్రమాదాలవలన తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలను ఎవరూ చేరదీయకపోవడం వలన వీధులల్లో జీవిస్తున్నారు.
4) ఆడపిల్లలకు ఎక్కువ కట్నం ఇచ్చి వివాహం చేయవలసివస్తుందని బాలికలను ఇంటినుంచి పంపిచేస్తున్నారు.
5) కుటుంబంలో సవిత తల్లిపోరుభరించలేక బాలికలు పారిపోతున్నారు.
6) ప్రాణాంతకమైన రోగాలు ఉదా:- హెచ్.ఐ.వి/ఎయిడ్స్ లాంటి వ్యాధులు సంభవిస్తే దయతో చేరదీయవలసిన తల్లిదండ్రులు బాలికలను వీధులపైన వదిలివేస్తున్నారు.
7) చట్టపరంగా విడాకులు పొందిన తల్లిదండ్రుల పిల్లలు ప్రేమ, ఆప్యాయతలకు దూరమై వేరే దారిలేక ఇల్లు వదలిపెడుతున్నారు.

పరిణామాలు:-
కుటుంబంలోనే పిల్లలు అన్నివిలువలను నేర్చుకొంటారు. కాని కుటుంబానికి దూరమైన వీధులపైన జీవించేబాలికలు చదువు నేర్చుకోక, ఏ ఇతర నైపుణ్యాలను పొందక తెగిన గాలిపటంలాగా అస్థిరత్వంతో జీవిస్తున్నారు. తమలాంటి మరికొంతమంది బాలికలతో స్నేహంచేసి వ్యభిచారం, మత్తుపదార్థాలను స్వీకరించడం వంటి చెడు అలవాట్లకు బానిసలై, ఉన్మాదులుగా, నేరస్థులుగా, దొంగలుగా అసాంఘిక శక్తులపట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ బాలికలు మరికొంతమంది పిల్లలను తమలాగా తయారుచేస్తున్నారు. వీధిపిల్లలు కొంతమంది వివాహితులుగా, అవివాహితు లుగా అతిచిన్నవయస్సులో గర్భంధరించి బరువుతక్కువ ఉన్న పిల్లలకు జన్మనివ్వడం జరుగుతున్నది. తమకు పుట్టిన పిల్లలను పోషించడం తెలియక తిరిగితమలాగే రోడ్డుపైన వదిలివేస్తున్నారు. తరతరాలుగా పిల్లలు వీధిపిల్లలుగా జీవిస్తున్నారు కానీ ఆ విషవలయం నుండి బయటికి వచ్చి జీవించ డానికి వీరు శ్రద్ధ చూపించడంలేదు.

దీనికి నిదర్శనం పార్యతమ్మ జీవిత గాధ:-
ఈమె 6 సం||ల చిన్న వయస్సులో ఇల్లు వదిలిపెట్టిపారిపోయి వచ్చింది. పుట్టుకతో ఈమెకు చెవులు వినిపించవు. మూగస్త్రీ. ఆ స్థితిలో రైల్వేస్టేషన్లో అడుగుపెట్టి అక్కడే జీవిస్తూ 14సం||ల వయస్సులో ఒక వ్యక్తిచే మోసగించబడి గర్భం ధరించి మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ తరువాత ఆ వ్యక్తి పార్వతమ్మని, ఆమె కొడుకుని రైల్వే ప్లాట్ఫాంపైన వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి క్షీణించి, తనకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పుకోలేక 18 సం||ల యుక్తవయస్సుకే గర్భ సంచి ఆపరేషన్ చేయించుకొని, బిడ్డను వీధిపిల్లవాడిగా మార్చివేసింది. ఇలా ఎంతోమంది బాలికలు చిన్నతనంలో పిల్లలకు జన్మనిచ్చివారిని పెంచలేక వీధిపిల్లల సంఖ్య పెరగడానికి పరోక్షంగా కారకులవుతున్నారు. పార్వతమ్మ లాంటి నిర్భాగ్యస్త్రీలు సమాజంలో ఇంకా ఎంతమందో?

ఆరోగ్య పరిస్థితి:-
అనారోగ్యకరమైన వాతావరణంలో పెరగడంవలన వీధి బాలికల ఆరోగ్య పరిస్థితి తొందరగా క్షీణిస్తుంది. సరైన ఆహారం వీరికి లభ్యంకాకపోవడం వల్ల రక్తహీనతతో బాధపడుతూవుంటారు. రైలు ప్రయాణీకులు వదిలివేసిన, నిలువ ఉన్న ఆహారం తినడంవలన జీర్ణాశయ వ్యాధులు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మేము నిర్వహించిన సర్వేలో ఆడపిల్లలు 30సం||ల వయస్సుకే ముసలివారిగా మారిపోయి కాళ్ళు చేతులు, నడుమునొప్పులతో బాధపడుతూ తమ పనితాము చేసుకోలేక పిల్లల సంపాదనపై ఆధారపడుతున్నారు. అంతేగాక క్షయ, టైఫాయిడ్, కామెర్లు, మలేరియాలాంటి వ్యాధులు రావడమేకాక చిన్నతనంలోనే అక్రమలైంగిక సంబంధాలు కలిగి ఉండటం వలన హెచ్.ఐ.వి./ఎయిడ్స్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ప్రస్తుతం 3.2 మిలియన్ల బాలికలు మనదేశంలో వున్నట్లు సర్వేలు తెలియ చేస్తున్నాయి.

వీధి బాలికల సంఖ్య తగ్గించడంలో- ప్రభుత్వంపాత్ర:-
సమాజంలో వీధిబాలికల సంఖ్య పెరిగితే అనేక సామాజిక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. అందువలన ప్రభుత్వం ఈ సమస్యపట్ల శ్రద్ధ కనపరచ వలసిన ఆవశ్యకతవుంది.
1) స్వచ్ఛంద సంస్థలకు కేటాయించబడిన నిధులు వీధిపిల్లలకు చేరుతున్నాయోలేదో పరిశీలించాలి.
2) అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్య పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలి.
3) మహిళా-శిశు సంక్షేమశాఖవారు నిర్వహిస్తున్న సేవాసదనం, బాలసదనం వంటి వసతి గృహాలలో సదుపాయాలు పెంచి వీధిబాలికలు అందులో చేరేటట్లు చూడాలి.
4) బాలికలకు కేటాయించిన పథకాలు. ఉదా:- స్వాథార్, బాలికావికాసపథకాలు, ఎన్.పి.ఇ.జి.ఎల్. లాంటి ప్రాజెక్టులు వీధిబాలికలకు చేరేటట్లు ప్రయత్నించాలి.
5) వీధిబాలికలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలలోని తల్లిదండ్రులకు పిల్లలను ఏవిధంగా పెంచాలి అనే అంశం మీద కౌన్సిలింగ్ ఇచ్చే కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
6) వీధిబాలికలకు ప్రత్యేకమైన పాఠశాలలను నెలకొల్పి విద్యపట్ల శ్రద్దనువీరిలో పెంపొందే విధంగా పాఠ్యప్రణాళికలు రూపొందించి ఆటలతో, వృత్తి నైపుణ్యంతోకూడిన విద్యను బాలికలకు అందించాలి.

బాలికల చట్టాలు:-
ప్రేమ, ఆప్యాయతలతో పెరిగిన పిల్లల సామాజిక నడవడి సక్రమంగా వుంటుందని మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం. భారతీయ విడాకుల చట్టాలలో మార్పుతీసుకొనివచ్చి పిల్లలు తల్లిదండ్రులకు దూరం కాకుండా చూడటంవలన వీధిబాలికల సంఖ్యను తగ్గించవచ్చు. బాలికల హక్కులు సక్రమంగా అమలు అయ్యేటట్లు చూసి వీధిబాలికల సంఖ్యను తగ్గించవచ్చు. వీధిబాలికలలో జీవితంపట్ల భద్రతాభావాన్ని కల్పించాలి. ”జువైనల్ జస్టిస్ (సంరక్షణ శ్రద్ధ) ఏక్టు 2000 సెక్షను 23 ప్రకారం పిల్లలపట్ల దౌర్జన్యాన్ని ప్రదర్శించిన వారికి 6నెలలు జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు అన్న చట్టాన్ని కఠినంగా అమలుచేయాలి.

వీధిబాలికల సంఖ్య తగ్గించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు:-
1) తల్లిదండ్రులు పిల్లలను చెడు స్నేహాలకు దూరంగా వుంచాలి.
2) పిల్లలను హింసతో కూడిన సన్నివేశాలకు దూరంగా వుంచాలి.
3) తల్లిదండ్రులు తమతగాదాలను పిల్లలముందు ప్రదర్శించ కూడదు.
4) చిన్న చిన్న నేరాలకు పిల్లలను కఠినంగా శిక్షించకూడదు.
5) తల్లిప్రేమను అందివ్వడంవలన వీధిబాలికలలో మార్పు వస్తుందనడానికి నిదర్శనం ”ఎస్.ఒ.ఎస్” అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఆదర్శగ్రామం. ఇక్కడ 1 తల్లికి 10 మంది వీధిపిల్లలను దత్తతిస్తారు. ఆ తల్లి పిల్లల లాలన, పాలన చూస్తూ ప్రేమతో పెంచుతుంది. ఇందులో విద్యనేర్చుకొంటున్న వీధిపిల్లలు ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యనుకూడా అభ్యసిస్తున్నారు. ఈ గ్రామం విశాఖపట్నం వద్దగల భీముని పట్నంలో వుంది.
6) గ్రామాలనుండి పట్టణాలకు వలసలను నిరోధించడానికి గ్రామీణప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెంచాలి.

ముగింపు:-
వీధిపిల్లల సమస్యగురించి పట్టించుకోకపోతే రానున్న 2020 సం|| నాటికి ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ల పిల్లలు వీధిపిల్లలుగా మారిపోయే ప్రమాదం వుంది. ఇప్పటికే మెట్రోపాలిటన్ నగరాలైన ఢిల్లీలో 400,000, ముంబై 35,000ల మంది వీధిపిల్లలు వలసవస్తూనే ఉన్నారు. వీధి పిల్లలసంఖ్య పెరిగిపోతే సంఘవిద్రోహులు ఎక్కువ సంఖ్యలో సమాజంలో ఆవిర్భవిస్తారు. దేశసర్వతోముఖాభివృద్ధికి వీధిబాలికల సంఖ్య ను తగ్గించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.