కంటితుడుపు ఖరీదు ఎంత?

కొండేపూడి నిర్మల
ప్రతి స్త్రీ తన జీవితకాలంలో రెండువేల నూటరెండు గంటలు రుతుస్రావంతో బాధపడుతుంది. అయితే దీని చుట్టూతా ఎన్ని భయభ్రాంతులున్నాయో, అపవిత్రతా భావనలున్నాయో మనకి తెలుసు. ఎటువంటి నాగరికతా తెలీని ఆదిమానవుల కాలంలో స్త్రీ పట్ల, ఆమె పునరుత్పత్తి శక్తి పట్ల వున్న భయమే, ప్రకృతి మీద ఆధిపత్యం సాధించాలనే తాపత్రయానికి కారణమయింది. ప్రకృతి అంటే స్త్రీ అనే అర్థం వుంది. రక్తస్రావము అంటేనే అండం విడుదల / విచ్ఛిత్తి కాబట్టి అది పాపమనే భావన అలా మొదలయి వుండచ్చు. ఆ ధోరణి ఎన్నో వెర్రితలలు వేసి ఒక జాతినే అస్పృశ్యతకు గురిచేసి అవమానిస్తోంది. సాంకేతికంగా మనం ఎంత ప్రగతిని సాధించినా గాని స్త్రీల విషయంలో ఒక్క అంగుళమైనా ముందుకు కదల్లేదని ఇలాంటప్పుడే అర్థమవుతుంది. ఎక్కడ అస్పృశ్యత వుంటుందో అక్కడ హింస వుంటుంది. ఒకరు చేసే హింస, పదిమంది చేస్తే అలవాటుగా, వందమంది చేస్తే ఆచారంగా బలపడుతుంది.
ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో వున్న తెగలు, ఆదివాసీలు ఆ అయిదు రోజులు ఏంచేస్తారో తెలుసుకుంటే గుండె నీరవుతుంది. షియోపూర్‌ గ్రామంలోని సహారియా తెగవారు రుతుస్రావం మొదలయిన ఆడవారిని ఇంటి నుంచి బహిష్కరించి పశువుల పాకలో వుంచుతారు. మూడు నుంచి అయిదు రోజులపాటు తిండీ, నిద్రా, కాలకృత్యాలు అన్నీ ఆ పశువుల పక్కనే జరుపుకోవాలి. అన్నిటికంటే రుతుస్రావాన్ని తట్టుకోవడమే వారికెక్కువ సమస్య. పశువుల పాకలో ఏం దొరుకుతాయి? గోనెసంచులు, బూడిద, పేడ, గడ్డి, గాదం అంతేకదా… అభాగ్యులైన ఆ ఆడవాళ్ళు వాటితోనే రుతుస్రావాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తారు. చాలాసార్లు అవి కూడా కావలసినన్ని దొరకవు. అప్పుడు ఒకరు వాడిన వాటిని మళ్ళి మళ్ళి గాలికి, ఎండకి ఆరబెట్టి మరొకరు వాడతారు. ఈ పన్లన్నీ రహస్యంగా ఎవరికీ కనబడకుండా జరిగిపోవాలి. దీన్ని గురించి వూళ్ళో ఎవరికయినా సానుభూతి వున్నాగాని, మిగిలినవాళ్లు వెలేస్తారనే భయంతో మౌనంగా వుండిపోతారు. రుతుస్రావమే ఒక అపవిత్ర పరిణామం కాబట్టీ స్త్రీలు ఆ సమయంలో వాడిన గోనెసంచీ ముక్కల్ని బయటికి కనబడకుండా గడ్డిలోనో, చూరులోనో దాచిపెడతారు. అందులోకి సూక్ష్మక్రిములే కాదు పెద్ద పురుగులు కూడా చేరతాయి. అవి శరీరంలోనికి ప్రవేశిస్తాయి కూడా. వూరికి దూరంగా వుండటం వల్ల పురుగు కుట్టిన వార్త ఇంట్లో వారికి, అక్కడ్నించి వైద్యునికి ఆలస్యంగా చేరుతుంది. ఒకవేళ దొరికిన వైద్యుల చైతన్యస్థాయి కూడా అలానే వుంటే ఆ స్త్రీలను ముట్టుకుని ఏం జరిగిందో చూసేవారు వుండరు. మధ్యప్రదేశ్‌లోని డింగరీ జిల్లాకి చెందిన ఒక పదహారేళ్ళ బాలిక వాడటానికి తీసుకున్న గోనెసంచీలో వున్న పురుగు కుట్టి, ఆ వార్త ఇంటికి చేరేలోపే నురగలు కక్కి చనిపోయింది. శరీరంలోకి చొచ్చుకుపోయిన ఆ పురుగు ఏమిటో ఎలాంటిదో పోస్టుమార్టంలో తప్ప మామూలుగా తెలీదు. గిరిజన, ఆదివాసీ సంస్కృతి పోస్టుమార్టం విధానాన్ని కూడా అనుమతించదు. అందువల్ల అక్కడ పుట్టి పెరిగి నడివయసుకి చేరుకున్న స్త్రీలలో ఎక్కువ మంది మూత్రకోశ కాన్సరుతోనో, గర్భసంచీ తొలగింపుతోనో చనిపోవడం రివాజు.
కాస్మాపాలిటన్‌ నగరాలను మినహాయిస్తే మిగిలిన అన్ని గ్రామాల్లోనూ వున్న సగటు మహిళల్లో మూడూ శాతం మందికి కూడా ఆ సమయంలో పాటించాల్సిన వ్యక్తిగత శుభ్రత గురించి దాదాపు తెలీదు. శానిటరీ నాప్‌కీన్స్‌ గురించి ఒక్కసారి కూడా విననివారు, చూడనివారూ చాలా శాతం వున్నారు. తెలిసిన కొద్దిమందికీ కొనే స్థోమత లేదు.
శానిటరీ నాప్‌కీన్స్‌ కొనుగోలు అనేది మన ఆర్థిక స్థోమత మీద ఆధారపడి వుంటుంది. మంచి జీతం, ఆస్తిపాస్తులు బాగా వుంటే శానిటరీ నాప్‌కీన్స్‌ కొనుక్కోవచ్చు. ఆశ్చర్యంగా వుందా…?
తమిళనాడుకు చెందిన కోయంబత్తూరులో కూచున్న మురుగానందం కూడా మీలాగే ఆశ్చర్యపోయాడు. కొన్నేళ్ల క్రిందట అతడూ అందరిలాగే ఒకరోజు తన భార్యతో…
”….ఎందుకంత చెత్తగుడ్డలు వాడతావు. మళ్ళీ ఓవర్‌ డిశ్చార్జ్‌ అంటావు, బజార్లో దొరికే నాప్‌కీన్స్‌ కొనుక్కోలేవా…?” అని విసుక్కున్నాడట.
”అలాగే కొంటాను, కానీ దానికోసం మన పిల్లల పాల బడ్జెట్‌ గానీ, మీరోజువారి ప్రయాణ ఛార్జీలు గాని తగ్గించమంటారా మరి…?” అని ప్రశ్నించింది.
ఆ ప్రశ్నలోని తీవ్రత అతన్ని బజారుకి తరిమికొట్టింది… దగ్గరలోవున్న దుకాణానికి వెళ్ళాడు. శానిటరీ నాప్‌కీన్స్‌ కావాలని అడిగాడు. కౌంటరు దగ్గర కూచున్నవాడెవరో తల పక్కకి తిప్పి హేళనగా దగ్గాడు. మగవాడు ఆడవాళ్ల అవసరాల్ని గుర్తించడం ఎంత నవ్వులాటగా మారుతుందో అప్పుడు అతనికి తెల్సింది. ఈలోగా ఒక యువతి షాపులోకి వచ్చింది. ఏం కావాలో చెప్పలేదు. అటూ ఇటూ తచ్చాడింది. కళ్లతోనే దేనికోసమో వెతికింది. షాపువాడు అది కనిపెట్టి ఒక ప్యాకెట్‌ లాంటిదాన్ని హడావిడిగా నల్ల ప్లాస్టిక్‌ కవరులో చుట్టి ఆవిడ చేతికిచ్చాడు. ఆవిడ తలవంచుకుని తక్షణమే బయటికి వెళ్ళిపోయింది. తను కూడా అదే వస్తువు కోసం రాకపోయివుంటే తప్పకుండా అక్కడ ఏ బ్రౌన్‌ షుగర్‌ ముఠాలాంటిదో పనిచేస్తోందని అనుకునేవాడట. అంతేకాదు ఆ యువతి బైట ఏ దేవాలయంలోనో, చర్చిలోనో, మసీదులోనో కనబడినా సరే అనుమానంగానే చూసేవాడేమో… పదినిమిషాల్లో ఇంటికొచ్చిన అతన్ని, అతని చేతిలోని ప్యాకెట్‌నీ, దాని మీదున్న ధరని చూసి తిక్క కుదిరిందా అన్నట్టు నవ్వుకుని వుంటుంది మురుగానందం గారి భార్య.
ఆ రోజు ఆమె ఇచ్చిన ఝలక్‌తో మురుగానందం విమెన్‌ ఫ్రెండ్లీ కార్యకర్తగా మారిపోయాడు. అట్టడుగు మహిళకి సైతం లభ్యం కాగల ధరలో నాప్‌కీన్స్‌ ఉత్పత్తి చేయడం ఒక్కటే అతని వృత్తి ప్లస్‌ వ్యావృత్తిగా మారిపోయింది. గంటకి రెండువేలు ప్యాడ్స్‌ ఉత్పత్తి చేసే యంత్రం అతని దగ్గరుంది. అతను తయారుచేసిన నాప్‌కీన్‌ ధర ఎంతో తెలుసా…? మొత్తం ప్యాకెట్‌ రెండు రూపాయలు. అంత తక్కువ ధరకి ఇప్పుడు బండిమీద ఒక జామకాయ రావడం లేదు… ఆ కోవలోనే ఇప్పుడు ఢిల్లీ నుంచి గూంజ్‌ అనే సంస్థ పనిచేస్తోంది. ధర తక్కువ కాబట్టి నాణ్యతలో రాజీ పడతారనుకుంటున్నారేమో, అదేమీ లేదు. కావాల్సిన బట్టను, ఉతికించి, ఇస్త్రీచేసి, అవసరమైన కొలతకు కత్తిరించి ఒరిస్సా, బీహార్‌, మధ్యప్రదేశ్‌లాంటి పద్దెనిమిది రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. పొదుపు బృందాలకు ఇది ఉపాధిగా కూడా పనికొస్తుంది. అక్కడున్న విద్యాసంస్థలకు, కార్యాలయాలకు వీరు అమ్ముతారు. కాశ్మీర్‌ ప్రాంతాల్లో వున్న గ్రామీణ స్త్రీలు కూడా ఈ పని చేపట్టారు. ఛత్తీస్‌ఘర్‌లోని మహాలక్ష్మి పొదుపు గ్రూపువారు వాటర్‌ ఎయిడ్‌ సహకారంతో తయారుచేస్తున్న శానిటరీ ప్యాడ్స్‌ నవపూర్‌ లాంటి కుగ్రామంలో వున్న స్త్రీలని, ఆ చుట్టుప్రక్కల వున్న మరో అరవై గ్రామాల వాసుల్ని ఆకర్షించింది. ప్రాథమిక హెల్త్‌ సెంటర్లు కూడా లేని చోట్ల సురక్షితమైన న్యాప్‌కీన్స్‌ వాడ్డం వల్ల మహిళల ఆరోగ్యం బాగా మెరుగుపడిందని వారు చెబుతున్నారు. అట్టడుగు మహిళకు అందుబాటులో వుండేట్టుగా ఇవి అత్యంత చవకగా వుండటమే కాకుండా, వాడకం తర్వాత వాటిని సక్రమంగా డిస్పోజ్‌ చెయ్యడంలోనూ శిక్షణ దొరికింది. ”నాట్‌ జస్ట్‌ ఎ పీస్‌ ఆఫ్‌ క్లాత్‌” కాంపెయిన్‌ ద్వారా మొదలయిన ఈ ఉద్యమం బీహార్‌లో గ్రామీణ మహిళలకు బాగా చేరువయింది. చీర లోపల లంగా కట్టడం కూడా అలవాటులేని గ్రామీణ ఆదివాసీ స్త్రీలకు రక్తస్రావాన్ని పీల్చుకునే పరిశుభ్రమైన బట్టను పరిచయం చెయ్యడం, వాడిన వెంటనే దాన్ని కంపోస్టు చేయడమెలాగో చెప్పడం సామాన్యమైన విషయం కాదు. మైండ్‌సెట్‌ మార్చితేనే అది సాధ్యమవుతుంది.
అసలు స్త్రీల ఆరోగ్యం చుట్టూ అనేక సామాజిక కోణాలుంటాయి. తనకి తను తక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ కుటుంబానికి, అతిథి, అభ్యాగతులకి ఎక్కువ సమయాన్ని, శక్తిని, ధనాన్ని ఖర్చుపెట్టడం ఎంత ఉదాత్తత గల విషయమో మన సంస్కృతి చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతుంది… అటువంటప్పుడు నెలనెలా వచ్చి పడే అవస్థని పట్టించుకోవాలని, ఆహారమూ, విశ్రాంతీ, తీసుకోవాలని, తన శరీరాన్ని తనే గౌరవించుకోకపోతే ఇంకెవరూ గౌరవించరని ఎవరు చెబుతారు…? మురుగానందం ఈ విషయాలన్నీ స్త్రీలతో మాట్లాడాలని చూసేవాడు. కానీ ఎవరూ స్పందించేవారు కాదు. రక్తస్రావ స్వభావానికి సంబంధించి సమగ్ర సమాచారం సేకరించడానికి నానాయాతనలూ పడ్డాడు. ఒక సాధారణ బట్ట ఎన్ని ఔన్సుల రక్తాన్ని పీల్చుకుంటుందో తెలుసుకోవడానికి మాంసం దుకాణానికి వెళ్ళి మేక రక్తంతో ప్రయోగం చేశాడు. క్లాత్‌ మీద నీరు ఎండటానికి, రక్తం ఎండటానికి ఎంత తేడా వుందో తెలియాలనుకునేవాడు. అతని ఆర్తీ, అవస్థా ఎవరూ అర్థం చేసుకోకపోగా, ఎక్కడ కనబడితే ఏమి అడుగుతాడో అనుకుని చుట్టుపక్కల ఆడవాళ్ళు తప్పించుకుని తిరిగేవారట. అతను చెప్పిన ప్రయోగాలు ఫలితాలు సాధించాక ఇప్పుడు అందరికీ ఆప్తమిత్రుడయ్యాడు. ఈ నాప్‌కీన్స్‌ అందుతున్న గ్రామ పంచాయితీ బళ్లలో బాలికల హాజరు శాతం బాగా పెరిగింది.
కాస్మాపాలిటన్‌ సిటీల్లో కూడా అన్ని తరగతుల మహిళలూ వుంటారు. ఈ ఉత్పత్తులు వారిదాకా వస్తే ఇంకా బావుంటుంది. లేదా ఇక్కడ చాలామంది వాటిని ఉత్పత్తి అయినా చెయ్యాలి. మార్కెట్‌ని మనకు అనుకూలంగా మలచుకోవడమే నిజమైన సాధికారత. ఇప్పటి వరకూ మనం ఏం చేస్తున్నాం…? హై బ్రాండు పేరుతో విదేశీ కంపెనీలు మన మీద మోపుతున్న వస్తు ఇంద్రజాలంలో కూరుకుపోయి వున్నాం. ఇక్కడ అత్యధికంగా అమ్ముడుపోయే ఒక సరుకు మన రక్తస్రావాన్ని పీల్చుకునే బట్ట అఫ్‌కోర్స్‌ దానిపేరు నాప్‌కీన్‌. దాని ఖరీదు వందకి పైమాటే. కావాలంటే ఎక్‌స్ట్రా లార్జ్‌, స్కిన్‌ ఫ్రెండ్లీలు కూడా దొరుకుతాయి. కాకపోతే మీ పర్సుబరువు కూడా ఎక్‌స్ట్రా లార్జిగా వుండి తీరాలి. ధర ఒక్కటే సమస్య కాదు. చైతన్యాన్ని కూడా ఒకసారి అంచనా వేసుకుందాం. శానిటరీ ప్యాకెట్‌ ఎక్కడయితే కొన్నామో అక్కడే నుంచుని పొట్లం విప్పదీసి అందులో నిజంగా పదిహేను క్లాతులు వున్నాయో లేదో, బెల్ట్‌ జత చేసి వుందో లేదో, బట్ట నాణ్యత బావుందో లేదో, భీమారులో దొరికే దానికన్నా ఇది ఎందుకు ఇంత ఎక్కువ ధర వుందో, ఈ దోపిడీకి కారణమేమిటో ప్రశ్నించగలమా? చాలామంది అలా చెయ్యలేరు… అదే కూరగాయల బజారులోనో, చీరల షాపులోనో ఎంత తెలివైన వినియోగదారిణిగా వుంటామో ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి. ఏమిటి తేడా…? మన అనారోగ్యాలు, కాన్పులు, రక్తస్రావాలు మనకే చూపించి దడిపించి ఎవడో మార్కెట్‌ చేసుకుని బాగుపడతాడు. స్రావాన్ని అరికట్టే సమాచారం లేక మనం బాధపడుతూ వుంటాం. ఇప్పుడిక్కడ నాప్‌కీన్‌ కాదు రక్తస్రావమే గొప్ప మార్కెట్‌ ఎంత విషాదమో చూశారా…? ఇంక లాభంలేదు. మార్కెట్‌ కొమ్ములు వంచడానికయినా మనం స్వతంత్ర ఉత్పత్తులు చేపట్టాలి. బీహార్‌లో మొదలుపెట్టిన ఉద్యమం పేరేమిటి? నాట్‌ జస్ట్‌ ఫర్‌ ఎ పీస్‌ ఆఫ్‌ క్లాత్‌ అని కదా…? ఔను ఈ ఉద్యమం బట్ట కోసమె కాదు ఉనికి కోసం కూడా.  (ఈ ఏడాది లాడ్లీ మీడియా బహుమతి అందుకున్న కన్నడభాషావిలేకరి ఆర్తీ మోహన్‌ వెబ్‌ ఆర్టికల్‌ ”ది రియల్‌ ఐ ప్యాడ్‌” చదివిన స్ఫూర్తితో….)

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో